27 ఏళ్ల కెరీర్‌లో వై.వి.యస్‌.చౌదరి 9 సినిమాలే చేశారు. కారణం తెలుసా?

(మే 23 వై.వి.యస్.చౌదరి పుట్టినరోజు సందర్భంగా..) 1990వ దశకం నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన దర్శకులు ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. వారిలో వై.వి.యస్‌.చౌదరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను చేసే సినిమా కోసం ఎంపిక చేసుకునే కథ, నటీనటులు మిగతా దర్శకులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేవరకు ఎన్నిరోజులైనా షూట్‌ చేస్తారు. 1998లో చౌదరి డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ విడుదలైంది. 27 సంవత్సరాల తన కెరీర్‌లో కేవలం 9 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అతని డైరెక్షన్‌లో వచ్చిన చివరి సినిమా ‘రేయ్‌’ 2015లో విడుదలైంది. తాజాగా నందమూరి జానకిరామ్‌ కుమారుడు ఎన్‌.టి.ఆర్‌.ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను లాంచ్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. దర్శకుడిగా సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్నప్పటికీ ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏమిటి, చౌదరి చేసిన సినిమాల్లో విజయాల శాతం ఎంత, దర్శకుడుగా ఎందుకు గ్యాప్‌ తీసుకున్నారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం.  1965 మే 23న యలమంచిలి నారాయణరావు, రత్నకుమారి దంపతులకు గుడివాడలో జన్మించారు యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. చదువులో ఎప్పుడూ ముందుండే చౌదరి 6, 7, 8 తరగతుల్లో పట్టణ స్థాయిలో ప్రథమస్థానం సంపాదించారు. గుడివాడలో ఇంటర్‌ వరకు చదువుకున్న తర్వాత మద్రాస్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరారు. ఎన్‌.టి.రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి 9వ తరగతి చదువుతున్నప్పుడే ఎన్టీఆర్‌ అభిమాన సంఘం స్థాపించి దానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. సినిమాల పట్ల చౌదరికి ఉన్న ఆసక్తిని గమనించిన స్నేహితులు సినిమా డైరెక్టర్‌గా రాణిస్తావని చెప్పడంతో చిన్నతనంలోనే డైరెక్టర్‌ అవ్వాలనుకున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే కాలేజీ మానేసి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని డబ్బింగ్‌ సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన పట్టాభిషేకం చిత్రానికి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకుల దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు చౌదరి. సినిమాల గురించి చౌదరి విశ్లేషించే తీరు నచ్చడంతో తన సొంత బేనర్‌ గ్రేట్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు నాగార్జున. ఈ సినిమా డైరెక్టర్‌గా చౌదరికి చాలా మంచి పేరు తెచ్చింది.  చౌదరికి రెండో అవకాశం కూడా నాగార్జునే ఇచ్చారు. కామాక్షి మూవీస్‌తో కలిసి ‘సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించారు నాగార్జున. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘యువరాజు’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత తనే నిర్మాతగా మారి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి హరికృష్ణకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత వరసగా వచ్చిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దేవదాసు తర్వాత చౌదరికి హిట్‌ అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత చేసిన ఒక్క మగాడు, సలీమ్‌, నిప్పు, రేయ్‌ చిత్రాలు నిరాశపరిచాయి. ఇందులో నిప్పు చిత్రాన్ని గుణశేఖర్‌ డైరెక్ట్‌ చేయగా, చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. 2015 వరకే చౌదరి డైరెక్టర్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. అంటే 17 సంవత్సరా కెరీర్‌లో అతను చేసిన సినిమాలు తొమ్మిదే. దానికి కారణం ప్రతి సినిమా హై బడ్జెట్‌తో ఉండడం, షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల తక్కువ సినిమాలు చేశారు. తెలుగు ఇండస్ట్రీకి రామ్‌ పోతినేని, ఇలియానా, ఆదిత్య ఓం, అంకిత వంటి నటీనటుల్ని పరిచయం చేసిన ఘనత వై.వి.యస్‌.చౌదరికి దక్కుతుంది.  చౌదరి వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రానికి కో డైరెక్టర్‌గా పనిచేశారు చౌదరి. ఆ సమయంలోనే ఆ చిత్రంలో నటించిన గీతను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సిందూరం చిత్రంలో రవితేజ సరసన, భరత్‌ దర్శకత్వంలో వచ్చిన అయ్యిందా లేదా చిత్రంలో అలీకి జోడీగా నటించారు గీత. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యుక్తా చౌదరి, ఏక్తా చౌదరి.

ఆ విషయంలో ఎన్టీఆర్‌తో విభేదించిన చంద్రమోహన్‌.. అదే దారిలో శోభన్‌బాబు!

(మే 23 చంద్రమోహన్‌ జయంతి సందర్భంగా..) ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఒక దశలో తెలుగు సినిమాను శాసించారు. ఒకర్ని మించి ఒకరు అద్భుతమైన సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమ కళకళలాడేలా చేశారు. ఆ తర్వాతి తరంలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్‌ వంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రమోహన్‌ విషయానికి వస్తే.. తన 50 సంవత్సరాల కెరీర్‌లో 900కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వాటిలో హీరోగా చేసిన సినిమాలు 200 వరకు ఉంటాయి. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంతో కెరీర్‌ ప్రారంభించిన చంద్రమోహన్‌.. హీరోగా అయితేనే సినిమా చేస్తాను అనే సిద్ధాంతం పెట్టుకోలేదు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా ఓకే చెప్పేవారు. అలా అందరు హీరోల సినిమాల్లో నటించడం ద్వారా వారికి బాగా దగ్గరయ్యారు. అయితే హీరోల్లో శోభన్‌బాబు.. చంద్రమోహన్‌కు అత్యంత ఆప్తుడు. ఇద్దరి మధ్య ‘ఒరేయ్‌..’ అని పిలుచుకునేంత స్నేహం ఉంది. శోభన్‌బాబు ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు చంద్రమోహన్‌ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొని కొనేవారు. అలా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే తనకు కలిసి వస్తుందని శోభన్‌బాబు నమ్మేవారు. ఇదిలా ఉంటే.. ఇద్దరూ ఒక విషయంలో ఎన్టీఆర్‌తో విభేదించారు. అందరూ ఎంతో గౌరవించే ఎన్టీఆర్‌ మాటను కాదనడానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కి తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తనతో సినిమాలు చెయ్యాలంటే హైదరాబాద్‌లోనే చెయ్యాలి అని నిర్మాతలకు కండీషన్‌ పెట్టారు. అలా మొదట హైదరాబాద్‌ వచ్చినవారు అక్కినేని. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ ఇద్దరూ మంచి స్నేహితులే కాకుండా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఎఎన్నార్‌ తర్వాత ఎన్టీఆర్‌ కూడా హైదరాబాద్‌ షిఫ్ట్‌ అవ్వాలని డిసైడ్‌ అయ్యారు. తను మాత్రమే కాదు, మిగతా హీరోలు, నటీనటుల్ని కూడా తనతో పాటు వచ్చెయ్యమని చెప్పారు. అప్పటికి ఉన్న హీరోలంతా ఎన్టీఆర్‌ మాటను గౌరవించి హైదరాబాద్‌ వచ్చేశారు. కానీ, చంద్రమోహన్‌ మాత్రం తాను రానని చెప్పారు. మీలాంటి సీనియర్‌ నటులు హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయితే మిగతా వారు కూడా వస్తారని నచ్చజెప్పారు. కానీ, చంద్రమోహన్‌ వినలేదు. హైదరాబాద్‌లో షూటింగ్స్‌ జరుగుతుంటే.. మీరు మద్రాస్‌లోనే ఉండిపోతే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పారు ఎన్టీఆర్‌. అవకాశాలు తగ్గినా ఫర్వాలేదు తాను మద్రాస్‌లోనే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నారు చంద్రమోహన్‌. ఇదే విషయాన్ని శోభన్‌బాబుతో చెప్పి అతన్ని కూడా హైదరాబాద్‌ వెళ్లొద్దని సలహా ఇచ్చారు. ఒకరి వెంట ఒకరు హైదరాబాద్‌ వచ్చేసినా చంద్రమోహన్‌, శోభన్‌బాబు మాత్రం మద్రాస్‌లోనే ఉండిపోయారు.  ఎన్టీఆర్‌ చెప్పినట్టుగానే చంద్రమోహన్‌కు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. హైదరాబాద్‌లో షూటింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్టును మద్రాస్‌ నుంచి రప్పించాలంటే ఫ్లైట్‌ టికెట్స్‌, వసతి వంటివి నిర్మాతకు భారమవుతాయి. అందుకే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు చంద్రమోహన్‌. ఆ సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి ఒక ప్యాకేజ్‌లా సినిమా చెయ్యాలనుకున్నారు. ఫ్లైట్‌, వసతి వంటివి కూడా తన పారితోషికంలోనే కలిపి నిర్మాతకు చెప్పేవారు. హైదరాబాద్‌లో ఉన్న తన స్థలంలో ఒక గెస్ట్‌ హౌస్‌ నిర్మించుకొని షూటింగ్‌కి వచ్చినపుడల్లా అందులోనే ఉండేవారు. ఫ్లైట్‌ టికెట్స్‌ కూడా తనే తీసుకొని హైదరాబాద్‌ వచ్చేవారు. అలా నటుడిగా మళ్లీ బిజీ అయ్యారు చంద్రమోహన్‌. ఎవరూ చేయని కొన్ని విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రమోహన్‌కి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాల్లో ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం. దీని గురించి ఎప్పుడు ప్రస్తావించినా నవ్వి ఊరుకునేవారు తప్ప తన బాధను వ్యక్తం చేసేవారు కాదు.

వరసగా వచ్చిన నందులు ఆయన కడుపు నింపలేదు.. ఆ ఒక్క పాట సిరివెన్నెల జీవితాన్నే మార్చేసింది!

  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని.. అంటూ నేటి వ్యవస్థని ప్రశ్నించినా, జామురాతిరి జాబిలమ్మా, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.. అంటూ ప్రేమ భావాలు పలికించినా, బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది, భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ.. అంటూ యువతను మేల్కొలిపినా అది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలానికే చెల్లింది. తన పాటలోని భావాల ద్వారా శ్రోతలను ఆలోచింప జేయడం లేదా ఆస్వాదించేలా చేయడం అనేది సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాలో ఆయన రాసిన పాట ఉందీ అంటే అది ఎంతో కొంత విజ్ఞానాన్ని పంచేది, సామాజిక స్పృహను కలిగించేది, ఆహ్లాదాన్ని పంచేది అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. 1986లో సినీ గేయరచయితగా కెరీర్‌ను ప్రారంభించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనలా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ వంటి రచయితల శైలి వేరు, సిరివెన్నెల దారి వేరు అన్నట్టుగా ఉండే ఆయన పాటలంటే ఇష్టపడని వారుండరు.    కాకినాడలో ఎం.ఎ. చేస్తున్న చేంబోలు సీతారామశాస్త్రికి ఒకరోజు దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘సిరివెన్నెల’ చిత్రంలోని అన్ని పాటలూ రాసే అవకాశం ఇచ్చారు. అయితే అంతకు రెండేళ్ళ ముందే నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘జననీ జన్మభూమి’ చిత్రంలో సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు విశ్వనాథ్‌. అది ఆయనకు బాగా నచ్చడంతో ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలు రాయగల ప్రతిభ సీతారామశాస్త్రిలో ఉందని గుర్తించి అన్ని పాటలూ ఆయనకే ఇచ్చారు. చిత్రంలో 9 పాటలు ఉండగా, ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా మలిచారు సీతారామశాస్త్రి. పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. మొదటి మూడు సంవత్సరాలు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమాలు ఆయనకు ఉపయోగపడలేదు. తనపై ఆధారపడిన తమ్ముళ్లు, చెల్లెళ్లతో సహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు సిరివెన్నెల.    ఉత్తమ పాటల రచయితగా 1986 నుంచి మూడేళ్లపాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది. అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్ర పడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారు. వరసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్‌ రైటర్‌గా ముద్రపడిపోయింది. ఆ రోజుల్లో ద్వంద్వార్థాల పాటలకు క్రేజ్‌ ఉండడం, అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోవడంతో ఆయనకు కమర్షియల్‌ చిత్రాలలో పాటలు రాసే అవకాశాలు రాలేదు. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఓ పాట. ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది. డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టింది.    తను డైరెక్ట్‌ చేస్తున్న సినిమాకి ఒక పాట రాయమని బి.గోపాల్‌ అడిగారు. మొదట కొంచెం సంకోచించారు సిరివెన్నెల. ఎక్కడ డబుల్‌ మీనింగ్‌ పాట రాయమంటారోనని టెన్షన్‌ పడ్డారు. కానీ, దానికి భిన్నంగా బి.గోపాల్‌ ఆ పాట ఎలా ఉండాలో చెప్పారు. సాధారణ ప్రేక్షకులకు సైతం ఎంతో సులువుగా అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో ఒక మంచి పాట రాయమని ఆయన చెప్పడం, దానికి ఇళయారాజా అద్భుతమైన ట్యూన్‌ ఇవ్వడంతో మొదటిసారి ఒక కమర్షియల్‌ సినిమాకు పాట రాశారు. అందరూ ఎంతో ఈజీగా పాడుకునే పాట ఆయన కలం నుంచి జాలువారింది. అదే.. ‘బలపం పట్టి భామ బళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా..’ పాట. 1990 సెప్టెంబర్‌ 24న విడుదలైన ‘బొబ్బిలిరాజా’ సూపర్‌హిట్‌ కావడం, సిరివెన్నెల రాసిన ఆ పాటకు జనం బ్రహ్మరథం పట్టడంతో సిరివెన్నెల సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడి నుంచి సిరివెన్నెల పాటల ప్రభంజనం మొదలైంది. దాదాపు 35 సంవత్సరాలపాటు ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది. ఈ మూడు దశాబ్దాలలో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. ఇదీ అదీ అని కాకుండా అన్ని తరహా పాటలు రాసి అందర్నీ మెప్పించారు. నమ్మకు నమ్మకు ఈ రేయినీ.., లలిత ప్రియ కమలం విరిసినదీ.., ఆకాశంలో ఆశల హరివిల్లూ.., తెలవారదేమో స్వామి.., చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ.., చిలకా ఏ తోడు లేక ఎటేప్పమ్మ ఒంటరి నడక.., కన్నుల్లో నీ రూపమే.., కళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు.., ఆకాశం దిగి వచ్చి వెయ్యాలి మన పందిరి.., సీతమ్మ అందాలూ గోత్రాలు.. ఇలా తన కెరీర్‌లో కొన్ని వేల పాటలు రాసి ప్రేక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రతి పాటలోనూ ప్రత్యేకతను చూపిస్తూనే తన కెరీర్‌లో ఏనాడూ వెకిలి పాటలు, డబుల్‌ మీనింగ్‌ పాటలు రాయకుండా నిబద్ధతతో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు ఆదర్శంగా నిలిచారు.   (మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా..)  

తాతకు తగ్గ మనవడు.. కొన్ని తరాలు గుర్తుంచుకునే నటుడు!

  ప్రేక్షకులు జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటారు. అభిమానులు యంగ్‌ టైగర్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. సన్నిహితులు తారక్‌ అంటారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి తరంలో నందమూరి వంశం నుంచి ఎందరో హీరోలు వచ్చినప్పటికీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్కరే మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వల్ల డాన్సుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు ఎన్టీఆర్‌. ఎన్‌.టి.రామారావు స్వయంగా తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు. ఆయన పేరును నిలబెడుతూ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు ఎన్టీఆర్‌. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్‌ టైగర్‌గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 8 ఏళ్ల వయసులోనే తాతగారి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో బాల భరతుడిగా నటించారు. ఆ తర్వాత ‘రామాయణం’లో రాముడిగా అందర్నీ అలరించారు. పురాణ పాత్రలు పోషించాలంటే అది నందమూరి వంశానికే సాధ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని యంగ్‌ టైగర్‌ మరోసారి ప్రూవ్‌ చేశారు. 1991లో తన కెరీర్‌ ప్రారంభించిన ఎన్టీఆర్‌.. నటుడిగా దాదాపు 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, బాల నటుడి నుంచి స్టార్‌ హీరోగా ఎలా ఎదిగారు వంటి విశేషాలు తెలుసుకుందాం.   1983 మే 20న హైదరాబాద్‌లో నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు తారక్‌. ఎనిమిదేళ్ళ వయసులో తారక్‌ని ఎన్‌.టి.రామారావు దగ్గరికి తీసుకెళ్లారు హరికృష్ణ. తన పోలికలతోనే ఉన్న తారక్‌ని చూసి అతనికి నందమూరి తారకరామారావుగా నామకరణం చేశారు. అదే సమయంలో తను డైరెక్ట్‌ చేస్తున్న ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో తెరంగేట్రం చేయించారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం చిత్రాల తర్వాత నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోని ‘కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా.. క్యాట్‌ వాక్‌కైనా.. దేనికైనా రెడీ..’ పాటతో భవిష్యత్తులో తను ఎలాంటి హీరో అవ్వబోతున్నాడు అనేది స్పష్టం చేశారు ఎన్టీఆర్‌. 2002లో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకొని మాస్‌ యాక్షన్‌ హీరోగా స్థిరపడిపోయారు.      ‘ఆది’ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘అల్లరి రాముడు’, ‘నాగ’ చిత్రాలు నిరాశపరిచినా రాజమౌళి కాంబినేషన్‌లో చేసిన రెండో సినిమా ‘సింహాద్రి’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొని కలెక్షన్లలో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తర్వాత రిలీజ్‌ అయిన 5 సినిమాలు హిట్‌, ఏవరేజ్‌, బిలో ఏవరేజ్‌ అనిపించుకున్నప్పటికీ ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన ‘రాఖి’ ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమాలోని తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. ఈ సినిమా వరకు బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో చేయబోయే ‘యమదొంగ’ చిత్రం కోసం తన ఫిజిక్‌ని పూర్తిగా మార్చుకొని కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో యాక్షన్‌, డాన్స్‌, కామెడీ, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాల్లోనూ మంచి మార్కులు సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో హిట్‌ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘కంత్రి’ నిరాశపరిచినప్పటికీ ఆ వెంటనే వినాయక్‌ కాంబినేషన్‌లో చేసిన ‘అదుర్స్‌’తో మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో అతను చేసిన పంతులు వేషం అందర్నీ ఆకట్టుకొని నవ్వులు పూయించింది. ఆ తర్వాత చేసిన ‘బృందావనం’ కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు నిరాశపరిచినా ‘బాద్‌షా’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్‌. ఒక హిట్‌ తర్వాత రెండు మూడు నిరాశపరిచే సినిమాలు రావడం అనేది హీరోల కెరీర్‌లో సర్వసాధారణమే. అలాగే బాద్‌షా తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేసిన ‘టెంపర్‌’ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌కి అందరూ ముగ్ధులైపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని కోర్టు సీన్‌లో చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ మెస్మరైజ్‌ అయిపోయి క్లాప్స్‌, విజిల్స్‌తో ఎన్టీఆర్‌ను అభినందించారు.      ‘టెంపర్‌’ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ చిత్రాలు కథ, కథనాల విషయంలో దేనికదే ప్రత్యేకం అనే విధంగా ఉంటాయి. ఈ సినిమాలతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు ఎన్టీఆర్‌. ఇక రాజమౌళి కాంబినేషన్‌లో చేసిన నాలుగో సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ప్రతిష్ఠాత్మక సినిమాగా చెప్పొచ్చు. మల్టీస్టారర్స్‌ ఎక్కువగా రాని ఈరోజుల్లో టాలీవుడ్‌లోని ఇద్దరు టాప్‌ స్టార్స్‌ కలిసి నటిస్తున్న సినిమా అంటే సహజంగానే మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఈ సినిమా కూడా అలాంటి క్రేజ్‌నే సొంతం చేసుకుంది. అందులోనూ బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌ చేసిన రాజమౌళి సినిమా అంటే ఆ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ డాన్స్‌కి, పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు, రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం మరో విశేషం.    రెండు సంవత్సరాల తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో చేసిన పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు ఎన్టీఆర్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవర2’ కూడా రాబోతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఎన్టీఆర్‌ ‘వార్‌2’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హృతిక్‌రోషన్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాతో డెఫినెట్‌గా బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్‌ క్రేజ్‌ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరో పక్క ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో చేస్తున్న ‘డ్రాగన్‌’ చిత్రం రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఇవి కాక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌గా రూపొందనున్న ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి సమర్పణలో వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటించే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.   (మే 20 యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా..)  

సుద్దాలకు వచ్చిన జాతీయ అవార్డును క్యాన్సిల్‌ చెయ్యాలంటూ కమిటీకి లేఖ.. అసలేం జరిగింది?

(మే 16 సుద్దాల అశోక్‌తేజ పుట్టినరోజు సందర్భంగా..) తెలంగాణ సాయుధ పోరాటంలో తన పాటతో పాలకులను ఉలిక్కిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. ‘నీ బాంచెన్‌ కాల్మొక్కుతా..’ అనే బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించడంలో తన పాటను ఈటెగా మార్చుకున్నారు హనుమంతు. ఆ బాటలోనే తన పాటతో ముందుకు సాగుతున్నారు ఆయన తనయుడు సుద్దాల అశోక్‌తేజ. ఏ తరహా పాటైనా రాయగలను అని అనేకసార్లు రుజువు చేసుకున్నారు సుద్దాల. తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న మూడో గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజ ఘనత సాధించారు. ‘నమస్తే అన్న’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 2,200 సినిమా పాటలు, 2,500 ప్రైవేట్‌ సాంగ్స్‌ రాశారు. అలాగే వివిధ అంశాలతో కూడిన 16 పుస్తకాలు రాశారు. గేయ రచయితగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన సుద్దాల అశోక్‌తేజ గేయరచయితగా సినీ ప్రవేశం ఎలా చేశారు? ఆయన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.  1960 మే 16న భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో గుర్రం హనుమంతు, జానకమ్మ దంపతులకు జన్మించారు అశోక్‌తేజ. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు ప్రభాకర్‌ తేజ, సుధాకర్‌ తేజ, చెల్లెలు రచ్చ భారతి ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్య్ర సమరయోధులే. హనుమంతు ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించారు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పే తర్వాత తరాలకు కూడా సుద్దాలగా మార్చుకున్నారు.  హనుమంతు 75 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ వ్యాధితో మరణించారు. సాహిత్యం అనేది అశోక్‌తేజకు చిన్నతనంలోనే అబ్బింది. పాఠశాల చదువు కంటే సాహిత్యంపైనే ఎక్కువ ఆసక్తి చూపించడంతో 8వ తరగతి, పదో తరగతి ఫెయిల్‌ అయ్యారు. ఎంతో కష్టపడి ఇంటర్‌, ఎం.ఎ. పూర్తి చేశారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.  అశోక్‌తేజ సోదరి కుమారుడు ఉత్తేజ్‌ టాలీవుడ్‌లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అతని సహకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదటి పాట ‘నమస్తే అన్న’లో రాశారు. ఆ తర్వాత కృష్ణవంశీని పరిచయం చేశారు ఉత్తేజ్‌. అశోక్‌తేజలో ఉన్న విప్లవ భావాలు కృష్ణవంశీకి బాగా నచ్చాయి. అందుకే తన సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. తండ్రి నేపథ్యం కారణంగా మొదట ఎక్కువగా విప్లవ గీతాలే రాయాల్సి వచ్చింది. దాసరి నారాయణరావు తన సినిమాల్లో అశోక్‌తేజకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఆవేశపూరితమైన పాటలే కాదు, ప్రేమ గీతాలతో కూడా ఆకట్టుకోగలను అని ఎన్నోసార్లు ప్రూవ్‌ చేసుకున్నారు అశోక్‌తేజ.  ఇదిలా ఉంటే.. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఎందరో మహా మహా రచయితలు తమ పాటలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఏ కళాకారుడికైనా జాతీయ పురస్కారం అనేది ఒక కలగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవాలని ఎంతో కృషి చేస్తుంటారు. కానీ, అది కొందరినే వరిస్తుంది. 90 ఏళ్ళకు పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికి మూడు పాటలకి జాతీయ అవార్డు లభించింది. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా..’ పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా శ్రీశ్రీ మొదటిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో వచ్చిన ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా వేటూరి సుందరామ్మూర్తి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మూడో పురస్కారాన్ని అందుకున్న ఘనత దక్కించుకున్నారు సుద్దాల అశోక్‌తేజ. 2003లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రంలోని ‘నేను సైతం..’ పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల జాతీయ అవార్డు అందుకున్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉద్దండులైన రచయితలు ఉన్నప్పటికీ జాతీయ అవార్డు అందుక్ను మూడో వ్యక్తిగా ఘనత వహించారు సుద్దాల. కానీ, దీన్ని పరిశ్రమలోని కొందరు జీర్ణించుకోలేకపోయారు. శ్రీశ్రీ రాసిన నేను సైతం పల్లవిని తీసుకొని రాసిన పాటకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? దాన్ని క్యాన్సిల్‌ చెయ్యాలంటూ పరిశ్రమకు చెందిన కొందరు.. జాతీయ అవార్డుల కమిటీకి లేఖ రాశారు. కానీ, దాన్ని కమిటీ పట్టించుకోలేదు. శ్రీశ్రీ రాసిన పల్లవిని తీసుకొని ఎంతో అద్భుతంగా ఆ పాటను పూర్తి చేశారు కాబట్టే సుద్దాల రాసిన పాటను అవార్డుకు ఎంపిక చేశామని కమిటీ చెప్పింది. ఇదే విషయాన్ని మెన్షన్‌ చేస్తూ అవార్డు ఇచ్చామని కమిటీ స్పష్టం చేసింది. తనకు జరిగిన ఈ అవమానానికి ఇండస్ట్రీ నుంచి దాసరి, చిరంజీవి తప్ప ఎవరూ స్పందించకపోవడం తనకు బాధ కలిగించిందని సుద్దాల ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు. డా. సి.నారాయణరెడ్డి ఈ విషయంలో సుద్దాలకు ధైర్యం చెప్పారు. ‘శ్రీశ్రీగారి పల్లవి తీసుకోవడం అనేది ఒక గండం.. ఆ గండం నుంచి అత్యద్భుతంగా బయట పడ్డ ఉక్కు పిండం..’ అంటూ సుద్దాలను రవీంద్రభారతి వేదికగా అభినందించారు.

తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న తర్వాతే అనసూయ, భరద్వాజ్‌ పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

(మే 15 అనసూయ భరద్వాజ్‌ పుట్టినరోజు సందర్భంగా..) అందం, అభినయం ఉంటే చాలు సినిమా తారలుగా గుర్తింపు సంపాదించుకోవచ్చు, అదృష్టం బాగుంటే స్టార్‌ హీరోయిన్లుగా ఛలామణి అవ్వొచ్చు. హీరోయిన్లను ఆరాధించేవారు చాలా మంది ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసి హీరోయిన్లకు గుడి కట్టించినవారు కూడా ఉన్నారు. అయితే స్టార్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవాలంటే సినిమాల్లోనే నటించక్కర్లేదు, బుల్లితెరపై కూడా అద్భుతాలు చెయ్యొచ్చు అని ఎంతో మంది నటీమణులు నిరూపించారు. అయితే అందరిలా కాకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకొని టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ద్వారా అభిమాన గణాన్ని పెంచుకున్న నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. నటిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న అనసూయ.. టీవీ, సినీ కెరీర్‌ ఎలా సాగింది? ఆమె నేపథ్యం ఏమిటి? ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు అనసూయ. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు వైష్ణవి, అంబిక. వీరిది బ్రాహ్మణ కుటుంబం. 10వ తరగతి పూర్తి చేసేసరికి మూడు స్కూల్స్‌ మారింది అనసూయ. ఆ తర్వాత భద్రుకా కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఒకరోజు ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లింది. అప్పుడు అనుకోకుండా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాగ’ చిత్రంలో ఒకే ఒక్క సీన్‌లో నటించింది. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ళ నాన్న. అయితే ఆమెకు ఎన్‌సిసిలో చేరడం ఇష్టం లేదు. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలన్నది ఆమె కల. కానీ, ఆ విషయం తండ్రితో చెప్పలేక అయిష్టంగానే ఎన్‌సిసిలో చేరింది. ఆ సమయంలోనే బీహార్‌కు చెందిన శశాంక్‌ భరద్వాజ్‌ పరిచయమయ్యాడు. అనసూయను ప్రపోజ్‌ చేశాడు. ఏడాదిన్నర ఏ విషయమూ చెప్పకుండా అతన్ని తనచుట్టూ తిప్పుకొని ఆ తర్వాత ఒప్పుకుంది. ఈ విషయం తండ్రితో చెబితే ఆయన ఒప్పుకోలేదు. శశాంక్‌తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ, అది కరెక్ట్‌ కాదని, పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆమెకు సర్ది చెప్పాడు శశాంక్‌.  ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఎంబిఎ పూర్తి చేసింది అనసూయ. కొన్నాళ్లు ఐడిబిఐ బ్యాంక్‌లో పనిచేసింది. ఆ తర్వాత పిక్స్‌లాయిడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా వర్క్‌ చేసింది. అదే సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్‌ రీడర్లు కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి దానికి అప్లయ్‌ చేసింది. అందులో సెలెక్ట్‌ అయింది. అయితే ఆమె చదివే న్యూస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ మిక్స్‌ అయి ఉండడం అందరికీ ఫన్నీగా అనిపించేది. కొందరు విమర్శించేవారు కూడా. సాక్షి టీవీలోనే రామ్‌గోపాల్‌వర్మతో ఒక షో చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్‌లో వర్క్‌ చేసింది. అలాగే ఆరోజుల్లో సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఆ ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహించేవారు. అనసూయ, శశాంక్‌ తొమ్మిదేళ్ళపాటు ప్రేమలోనే ఉన్నారు. పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 2010లో అనసూయ, శశాంక్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.  కొన్ని టీవీ షోలు, సినిమా కార్యక్రమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న అనసూయ జీవితాన్ని 2013 సంవత్సరం మార్చేసింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈటీవీలో ప్రారంభించిన కామెడీ షో ‘జబర్దస్త్‌’కి అనసూయను ప్రజెంటర్‌గా ఎంపిక చేశారు. ఈ షోతో ఎంతో పాపులర్‌ అయింది అనసూయ. కొన్ని సంవత్సరాల పాటు ఈ షోలో కొనసాగారు. అదే సమయంలో ఎన్నో ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు, మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌లకు ప్రజెంటర్‌గా చేశారు. 2003లో మొదటి సారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జునతో కలిసి నటించింది. ఈ సినిమా అందాల నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. అదే సంవత్సరం అనసూయ చేసిన ‘క్షణం’ చిత్రంలోని నటన అందర్నీ ఆకట్టుకుంది. నటిగా ఆమెను తారాస్థాయిలో నిలిపిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లోని అనసూయ నటనకు ఫిలింఫేర్‌, సైమా, జీ సినీ అవార్డులు లభించాయి. ప్రస్తుతం టీవీ షోలతోపాటు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనసూయ భరద్వాజ్‌.

లవర్‌బోయ్‌ నుంచి యాక్షన్‌ హీరో వరకు రామ్‌ పోతినేని జర్నీ ఇదే!

(మే 15 రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా..) చిన్న వయసులోనే హీరోగా పరిచయమై సక్సెస్‌ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ తరం హీరోల్లో అలా విజయం సాధించిన హీరోగా మొదట ఎన్టీఆర్‌ పేరు చెప్పుకోవాలి. తన 18 ఏటనే ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయయ్యారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా ఆ తర్వాత చేసిన సినిమాలతో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత 18 సంవత్సరాలకే హీరోగా నటించిన ఘనత రామ్‌ పోతినేనికి దక్కుతుంది. ఎనర్జిటిక్‌ లవర్‌ బోయ్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా ‘దేవదాసు’తో ఎనర్జిటిక్‌ స్టార్‌ అయిపోయారు. ఆ సినిమా నుంచి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వరకు రకరకాల జోనర్స్‌లో సినిమా చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు రామ్‌. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉండడం వల్ల అతను హీరో అవ్వాలనుకున్నాడా.. లేక చిన్నతనం నుంచే ఆ కోరిక ఉందా? అసలు రామ్‌ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? అనే విషయాలు తెలుసుకుందాం. 1988 మే 15న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు రామ్‌ పోతినేని. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్‌ అతనికి పెదనాన్న అవుతారు. రామ్‌ హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ అతని విద్యాభ్యాసం అంతా చెన్నయ్‌లోనే జరిగింది. రామ్‌కి చిన్నతనం నుంచీ సినిమాల్లో కనిపించాలని ఉండేది. తన ఆరో ఏటనే పెద్దయ్యాక హీరో అవుతానని తన క్లాస్‌ టీచర్‌తో చెప్పాడట. రామ్‌కి చదువు కంటే సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఉండేది. 2002లో తమిళంలో రూపొందిన అడయాళం అనే షార్ట్‌ ఫిలింలో డ్రగ్‌ ఎడిక్ట్‌గా మొదటిసారి నటించారు. అందులో రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసి తను నిర్మించే సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్‌ చెయ్యాలనుకున్నారు ఎం.ఎస్‌.రాజు. అయితే అప్పటికి రామ్‌ వయసు 13 సంవత్సరాలు. అది హీరో వయసు కాకపోవడంతో సిద్ధార్థ్‌ను తీసుకున్నారు. అదే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఆ తర్వాత ఎన్‌.జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న రామ్‌.. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రామ్‌ మొదటి సినిమా తనే నిర్మించాలి అనుకున్నారు స్రవంతి రవికిశోర్‌. కానీ, ఆ అవకాశం వై.వి.యస్‌.చౌదరికి దక్కింది. రామ్‌, ఇలియానాలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవదాసు’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తన పెర్‌ఫార్మెన్స్‌తో, స్టెప్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకోవడమే కాదు, ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు.  ‘ఆర్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన సుకుమార్‌ తన రెండో సినిమా ‘జగడం’ కోసం రామ్‌ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా తన ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు రామ్‌. అతను హీరోగా నటించిన రెండు సినిమాలూ నిర్మించే అవకాశం స్రవంతి రవికిశోర్‌కి రాలేదు. మూడో సినిమాను తన బేనర్‌లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘రెడీ’ పేరుతో నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరో అయ్యారు. దీంతో రామ్‌కి ఆఫర్స్‌ క్యూ కట్టాయి. ఆ క్రమంలో వచ్చిన ‘మస్కా’, ‘గణేశ్‌’, ‘రామరామ కృష్ణకృష్ణ’ వంటి సినిమాలు రామ్‌కి ఆశించిన విజయాల్ని అందించలేకపోయాయి. ఆ సమయంలో చేసిన ‘కందిరీగ’ అతని కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. ఆ సమయంలో కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో చేసిన ‘నేను శైలజ’ మళ్లీ రామ్‌కి ఎనర్జీనిచ్చింది. ఆ తర్వాత చేసిన ‘హైపర్‌’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంతో మరో సూపర్‌హిట్‌ అందుకున్నారు.  2019లో పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేసిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రామ్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటివరకు లవర్‌బోయ్‌ ఇమేజ్‌ ఉంటూనే ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఓ కొత్త అవతారం ఎత్తారు. తన లుక్‌, డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ ఛేంజ్‌ ఓవర్‌ అవడంతో ఓ కొత్త రామ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటివరకు అతన్ని లవర్‌బోయ్‌గా ఆదరించిన ప్రేక్షకులు మాస్‌ హీరోగా కూడా యాక్సెప్ట్‌ చేసి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి ఘనవిజయాన్ని అందించారు. రామ్‌ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ ఇదే. ఈ సినిమా తర్వాత లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ని పక్కన పెట్టి మాస్‌ అండ్‌ యాక్షన్‌ సినిమాలపైనే దృష్టిపెట్టారు రామ్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో చేసిన మూడో సినిమా ‘రెడ్‌’ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాలో రామ్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా తర్వాత చేసిన ‘స్కంద’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలు ఆశించిన స్థాయి విజయాల్ని అందుకోలేకపోయాయి. మళ్ళీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు మంచి కాంబినేషన్‌ సెట్‌ చేసుకుంటున్నారు రామ్‌. ప్రస్తుతం మహేష్‌బాబు దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఈ సినిమాతో మరోసారి తన ఎనర్జీని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రామ్‌.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌.. ఆ టైటిల్‌తో హిట్‌ కొట్టారు.. చిరంజీవి సినిమా మాత్రం ఫ్లాప్‌ అయింది!

ఒకే టైటిల్‌తో పలు మార్లు సినిమాలు నిర్మించిన సందర్భాలు చిత్ర పరిశ్రమలో అనేకం ఉన్నాయి. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇలా టైటిల్స్‌ రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. ఆ టైటిల్‌తో వచ్చిన సినిమా సూపర్‌హిట్‌ అవ్వడం వల్ల  కావచ్చు, తాము అనుకున్న కథకి ఆ టైటిల్‌ సూట్‌ అవుతుందని కావచ్చు.. టైటిల్స్‌ మాత్రం రిపీట్‌ చేస్తుండేవారు. అలా మూడు సార్లు రిపీట్‌ అయిన టైటిల్‌ ‘ఆరాధన’. ఒకే టైటిల్‌ మూడు సార్లు, మూడు సినిమాలకు పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇది ముగ్గురు టాప్‌ హీరోల సినిమాలకు పెట్టడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌.టి.రామారావు, చిరంజీవి ఈ టైటిల్‌తో సినిమాలు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ముగ్గురు హీరోలూ తమ ఇమేజ్‌ని కూడా పక్కన పెట్టి విభిన్నమైన కథలతో ఈ సినిమాలు చేశారు.  అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌.. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, అవకాశాలు దొరకలేదు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహాతో నటుడిగా కాకుండా నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తన మిత్రుడు రంగారావుతో కలిసి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగపతి పిక్చర్స్‌ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘అన్నపూర్ణ’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇందులో జగ్గయ్యను హీరోగా ఎంపిక చేశారు. మొదట ఎఎన్నార్‌తోనే ఈ సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, అప్పటికి ఆయన చాలా బిజీగా ఉండడంతో జగ్గయ్యతో చేశారు. రెండో సినిమా కోసం బెంగాలీలో వచ్చిన ‘సాగరిక’ అనే నవల రైట్స్‌ తీసుకున్నారు. ఆ నవలను సినిమాకు అనుగుణంగా మార్చి ‘ఆరాధన’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అప్పటికే ఎఎన్నార్‌ స్టార్‌ హీరో. పౌరాణిక, జానపద, సాంఘిక, భక్తిరస చిత్రాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ‘ఆరాధన’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో హీరో అంధుడు. అప్పటివరకు రొమాంటిక్‌ హీరోగా చేసిన ఎఎన్నార్‌ని ఆ పాత్రలో ప్రేక్షకులు చూస్తారా అనే సందేహం అందరికీ కలిగింది. తను చేసే సినిమాలో బలమైన కథ ఉండాలని నమ్మే అక్కినేని.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్‌గా నటించారు. జగ్గయ్య ఓ కీలక పాత్ర పోషించారు. 1962 ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది.  ఇక ఎన్టీఆర్‌ ‘ఆరాధన’ విషయానికి వస్తే.. హిందీలో రాజేంద్రకుమార్‌, మాలా సిన్హా జంటగా రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీత్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1970లో విడుదలైన ‘గీత్‌’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. బి.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఎ.పుండరీకాక్షయ్య ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. అయితే మొదట ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్‌ అంగీకరించలేదు. ఎందుకంటే సెకండాఫ్‌లో హీరో మూగవాడిగా మారతాడు. అతనికి డైలాగులు ఉండవు. డైలాగులు చెప్పకపోతే ఆడియన్స్‌ ఒప్పుకోరన్నది ఆయన అభిప్రాయం. డైలాగులు లేకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగితే చాలా మంచి పేరు వస్తుందని పుండరీకాక్షయ్య చెప్పడంతో ఎన్టీఆర్‌ కన్విన్స్‌ అయి చేస్తానని చెప్పారు. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. ఇందులో కూడా జగ్గయ్య ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ‘గీత్‌’ పాటలనే తెలుగులో రిపీట్‌ చేశారు. ఈ చిత్రంలోని పాటలన్నీ మహ్మద్‌ రఫీ పాడటం విశేషం. 1976 మార్చి 12న విడుదలైన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. 1986లో కొండవీటి రాజా, రాక్షసుడు వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న చిరంజీవి 1987 సంక్రాంతికి దొంగమొగుడుతో మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకొని హీరోగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. మాస్‌, యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్న సమయంలోనే తన ఇమేజ్‌కి భిన్నమైన సినిమా చెయ్యాలనుకున్నారు. అలా ‘ఆరాధన’ చిత్రాన్ని ప్రారంభించారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై భారతీరాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు అల్లు అరవింద్‌. తమిళ్‌లో సత్యరాజ్‌ హీరోగా ‘కడలోర కవితైగళ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఆరాధన’గా రీమేక్‌ చేశారు. ఈ సినిమాలో డా.రాజశేఖర్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. భారతీరాజా, రాజశేఖర్‌లతో చిరంజీవి చేసిన ఏకైక చిత్రమిది. ఈ సినిమాలో రాధిక, సుహాసిని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కోసం ఎన్నుకున్న కథ, బ్యాక్‌డ్రాప్‌, పాత్రల రూపకల్పనలో తెలుగుదనం తగ్గింది. సినిమాలో తమిళ పోకడలు ఎక్కువగా ఉండడంతో అది ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వలేదు. 1987 మార్చి 27న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.  ఎఎన్నార్‌, ఎన్టీఆర్‌, చిరంజీవి చేసిన ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే.. ఒకే టైటిల్‌తో రూపొందినప్పటికీ ఒక సినిమా బెంగాలీ నవల ఆధారంగా, ఒక సినిమా హిందీ సినిమా రీమేక్‌గా, ఒక సినిమా తమిళ సినిమా రీమేక్‌గా చేశారు. అయితే ఈ ముగ్గురు హీరోలు తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి అప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌ చేయడం విశేషం. ఈ ప్రయత్నంలో ఎఎన్నార్‌, ఎన్టీఆర్‌ విజయాలు అందుకోగా, చిరంజీవి మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే చిరంజీవి ‘ఆరాధన’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన పాటలు మాత్రం పెద్ద హిట్‌ అయ్యాయి. 

ఆస్కార్‌ అవార్డు సాధించడం వెనుక చంద్రబోస్‌ కృషి ఇదే!

(మే 10 చంద్రబోస్‌ పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత తరం నుంచి ఇప్పటివరకు ఎందరో గేయ రచయితలు తమ పాటలతో వీనుల విందు చేశారు. అలా 1995లో ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచు కొండల్లోని చంద్రమా..’ పాటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గేయ రచయిత చంద్రబోస్‌. ఏ తరహా పాటనైనా అవలీలగా రాయడం ఆయన ప్రత్యేకత. ఇప్పటివరకు 3,300కి పైగా పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా, తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ అవార్డు సాధించిన గేయ రచయితగా ఘన కీర్తి సాధించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన చంద్రబోస్‌.. సినీ రంగానికి ఎలా వచ్చారు, గేయ రచయితగా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందాం. 1970 మే 10న వరంగల్‌ జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామంలో నర్సయ్య, మదనమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు చంద్రబోస్‌. ఆయన పూర్తి పేరు సుభాష్‌ చంద్రబోస్‌. తండ్రి ఉపాధ్యాయుడు. చాలీచాలని సంపాదనతో జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితి వల్ల తల్లి పొలం పనులకు వెళ్లేవారు. చిన్నతనంలోనే సంగీతం, సాహిత్యం పట్ల చంద్రబోస్‌కి ఆసక్తి పెరిగింది. దానికి కారణం.. ఇంటి పక్కనే దేవాలయం, గ్రంథాలయం ఉండేవి. గుడిలో తెల్లవారు జాము నుంచే వినిపించే పాటలు చంద్రబోస్‌కి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేవి. అలాగే లైబ్రరీలోని పుస్తకాలు చదవడం వల్ల సాహిత్యం మీద అభిలాష కలిగింది. అప్పుడప్పుడు ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలలో పాల్గొనేవారు చంద్రబోస్‌. గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడుతూ ఆ దేవాలయానికి ప్రధాన గాయకుడయ్యారు. ఆ తర్వాత ఊరిలో ఒక సినిమా హాలు కూడా కట్టడంతో అందులో సినిమాలు చూస్తూ పెరిగారు. తన 12వ ఏటనే తొలి పాట రాశారు చంద్రబోస్‌.  హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ వచ్చిన తొలి రోజుల నుంచే సింగర్‌గా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఎవరూ ఛాన్స్‌ ఇవ్వకపోవడంతో పాటల రచయితగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. శ్రీనాథ్‌ అనే స్నేహితుడి సాయంతో దర్శకుడు ముప్పలనేని శివను కలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు చంద్రబోస్‌లో మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన శివ.. ‘తాజ్‌మహల్‌’ చిత్రంలో తొలిసారి పాట రాసే అవకాశం ఇచ్చారు. ‘మంచు కొండల్లోన చంద్రమా..’ అనే పాటతో సినీ గేయ రచయితగా కెరీర్‌ను ప్రారంభించారు చంద్రబోస్‌. ఈ పాటను ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం పూర్తి అయ్యాక రాశారు. ఇంజనీరింగ్‌ పట్టా వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పాటల వైపే మొగ్గు చూపారు. సినిమా రంగంలోకి వెళ్లడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పాటల రచయితగానే పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అందుకే సంవత్సరం పాటు ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయి ప్రయత్నాలు ప్రారంభించారు.  తాజ్‌ మహల్‌ చిత్రంలోని పాట పెద్ద హిట్‌ అవ్వడంతో ఆ చిత్రాన్ని నిర్మించిన రామానాయుడు తన తర్వాతి చిత్రం ధర్మచక్రంలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఆ తర్వాత పెళ్లిసందడి చిత్రంలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు. అదే సంవత్సరం తన దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు చిత్రంలో చంద్రబోస్‌తో 5 పాటలు రాయించుకున్నారు. ఈ సినిమా అతనికి చాలా మంచి పేరు తేవడమే కాకుండా వరస అవకాశాలు రావడానికి కారణమైంది. ఆ సమయంలోనే ఒక మ్యాగజైన్‌లో చంద్రబోస్‌ ఫుల్‌ పేజీ ఇంటర్వ్యూ వచ్చింది. అది చూసిన చంద్రబోస్‌ తండ్రి తన కొడుకు సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్నాడని గ్రహించారు. వెంటనే ఇంటికి రమ్మని పిలిచారు. అలా సంవత్సరం తర్వాత తన కుటుంబాన్ని కలిశారు చంద్రబోస్‌. ఒక తరహా సినిమా పాటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలు రాయగల గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు చంద్రబోస్‌. సామాజిక స్పృహ ఉన్న పాటలు, స్నేహబంధాన్ని తెలియజెప్పే పాటలు, యువతలో స్ఫూర్తిని నింపే పాటలు, భక్తి పాటలు, ప్రేమ గీతాలు, మానవ సంబంధాలను తెలియజేసే పాటలు, ఫాస్ట్‌ బీట్‌తో సాగే పాటలు.. ఇలా ఏ పాటతోనైనా ఆకట్టుకుంటారు చంద్రబోస్‌. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..’, ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..’, ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..’, ‘ట్రెండు మారినా ఫ్రెండ్‌ మారడు..’, ‘పెదవే పలికిన మాటల్లోనే..’, ‘కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’, ‘చీరలోని గోప్పదనం తెలుసుకో..’, ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి..’, ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’, ‘జైజై గణేషా..’, ‘గుర్తుకొస్తున్నాయి..’.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన పాటలు రాశారు చంద్రబోస్‌. అలా 800 సినిమాల్లో 3,300పైగా పాటలు రాశారు.  చంద్రబోస్‌ రాసిన పాటలకు ఎన్నో అవార్డులు లభించాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించింది. అలా తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ను సాధించి పెట్టిన ఘనత చంద్రబోస్‌కి దక్కుతుంది. అలాగే ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డులు, భరతముని అవార్డు.. ఇలా అనేక సంస్థల ద్వారా 40 అవార్డులు అందుకున్నారు చంద్రబోస్‌. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. ‘పెళ్లిపీటలు’ చిత్రానికి పనిచేస్తున్న సందర్భంలో నృత్యదర్శకురాలు సుచిత్రతో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సినీ రంగంలో గేయ రచయితగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రబోస్‌.. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకుల్ని అలరించే పాటలు అందిస్తూ టాలీవుడ్‌లో ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్నారు చంద్రబోస్‌.

9 నెలల్లోనే అధికారంలోకి రావడం వెనుక ఎన్టీఆర్‌ చేసిన నిస్వార్థ సేవ ఇదే!

వెండితెరపై తన అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటరత్న ఎన్‌.టి.రామారావు ఆ తర్వాత జనం మెచ్చిన నాయకుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఒక నటుడిగా కాకుండా, దైవంగా భావించి తమ ప్రేమాభిమానాలను ఎన్టీఆర్‌పై చూపించేవారు ప్రజలు. తెలుగు చిత్ర సీమలో తిరుగునేని కథానాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న ఆయన.. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే అంతటి ప్రజాదరణ కేవలం సినిమాల ద్వారానే రాలేదు. అధికారంలోకి రావడానికి ఎన్నో ఏళ్ళ క్రితమే తన సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. తన తోటి కళాకారులలో స్ఫూర్తిని నింపి ప్రత్యక్షంగా ప్రజలను కలిసి విరాళాలు సేకరించారు.  1965లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తొలి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా రెండు దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట నటరత్న ఎన్‌.టి.రామారావు స్పందించారు. జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని పత్రికాముఖంగా ప్రకటించారు. తన సహ నటీనటుల్లో స్ఫూర్తిని నింపారు. తను ముందు ఉండి అందర్నీ సేవా కార్యక్రమాల వైపు నడిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజాక్షణ కమిటీ సహాయంతో 1965 మే 16, 17, 18 తేదీల్లో విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు పట్టణాల్లో వినోద కార్యక్రమాలు నిర్వహించి భారీగా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ సారధ్యం వహించారు. తమ అభిమాన తారలను ప్రత్యక్షంగా చూసి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దేశం కోసం సినిమా తారలు చేస్తున్న విరాళాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేస్తూ.. ఉదారంగా విరాళాలు అందించారు.  ఎంతో ఉత్సాహభరితంగా సాగిన వినోద కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌తోపాటు ఎన్టీఆర్‌తో పాటు ఆరోజుల్లో వెండితెరపై నటీనటులుగా వెలిగిపోతున్న ఎస్‌.వి.రంగారావు, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, రాజనాల, రేలంగి, సత్యనారాయణ, పద్మనాభం, సావిత్రి, జమున, రాజసులోచన, కన్నాంబ, లక్ష్మీరాజ్యం, గిరిజ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. మూడు పట్టణాల్లో ప్రదర్శించిన వినోద కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతో అలరించాయి. తన తోటి నటీనటుల్లోనే కాదు, ప్రజల్లో కూడా స్ఫూర్తిని నింపి వారిని చైతన్యవంతుల్ని చేశారు ఎన్టీఆర్‌. దాంతో ప్రజలు విరివిగా తమ విరాళాలను ఎన్టీఆర్‌ బృందానికి అందించారు. తమ కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.8 లక్షలు సేకరించి నాటి ప్రధాన మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రికి అందజేశారు ఎన్టీఆర్‌.  ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా అన్న ఎన్టీఆర్‌ ముందుకొస్తారు, ఆదుకుంటారు అనే నమ్మకాన్ని ఆరోజుల్లోనే ప్రజల్లో కలిగించారు. దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించిన స్ఫూర్తితోనే 1969లో తుపాను బాధితుల కోసం వారం రోజులపాటు తోటీ నటీనటులతో కలిసి భిక్షా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో నటీనటులు, ఇతరులు కలికి మొత్తం 180 మంది పాల్గొన్నారు. వారందర్నీ ముందు ఉండి నడిపించిన ఎన్టీఆర్‌లో గొప్ప నాయకుడు ఉన్నాడనే విషయాన్ని ఆరోజుల్లోనే ప్రజలు గుర్తించారు. ఆ తర్వాత మరోసారి 1977లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. దివిసీమ ఉప్పెనవల్ల రాష్ట్రంలో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఉప్పెన వల్ల అన్నీ కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు మరోసారి నడుం కట్టారు ఎన్టీఆర్‌. చిత్ర పరిశ్రమలో సోదరులుగా మెలిగే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి జనంలోకి నడిచారు. పలు నగరాల్లో వినోద ప్రదర్శనలు ఇచ్చి రూ.15 లక్షలు సేకరించారు. ఆ మొత్తాన్ని అప్పటి ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్‌. ప్రజలకు రాష్ట్రంలో ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా నేనున్నానంటూ ముందుకు వచ్చి తన తోటి నటీనటులను కూడా సేవా మార్గంలో నడిపిన ఎన్‌.టి.రామారావు తమ భవిష్యత్‌ నాయకుడు అని ఆరోజుల్లోనే ప్రజల మనసుల్లో స్థిరపడిపోయిందని చెప్పడానికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలే నిదర్శనం.

స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ.. సాయిపల్లవి లక్ష్యం మాత్రం అదే!

(మే 9 సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా..) ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల..’... ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి పదే పదే చెప్పే డైలాగ్‌. ఇది ఆ సినిమాలోని క్యారెక్టర్‌కే కాదు, నిజ జీవితంలో కూడా ఒక్కటే పీస్‌ అనే పదం ఆమెకు వర్తిస్తుందనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్‌ పరంగాగానీ, వ్యక్తిత్వపరంగా గానీ సినిమా ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్‌ మరొకరు కనిపించరు. నిజంగానే ‘ఒక్కటే పీస్‌’. హీరోయిన్‌ అంటే స్కిన్‌ షో చెయ్యాలి, గ్లామరస్‌గా కనిపించాలి, కుర్రకారుకి పిచ్చెక్కించాలి.. ఇలాంటి ఆలోచనలు ఆమె దరిదాపుల్లోకి కూడా రావు. ఇవేవీ లేకుండా కేవలం తన పెర్‌ఫార్మెన్స్‌తోనే లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. తనతో సినిమా చెయ్యాలంటే.. కొన్ని కండిషన్స్‌ పెడుతుంది. వాటికి ఒప్పుకుంటేనే సినిమా చేస్తుంది. ఎంత రెమ్యునరేషన్‌ ఇచ్చినా తనకు నచ్చని సినిమా చెయ్యనే చెయ్యదు. అంతేకాదు, షూటింగ్‌లో, సినిమా ఫంక్షన్స్‌లో హీరోలకు, దర్శకనిర్మాతలకు భజన చేయడం అనేదానికి ఆమె పూర్తి వ్యతిరేకం. అది శుద్ధ టైమ్‌ వేస్ట్‌ అని ఆమె భావన. అందుకే షూటింగ్‌లో కూడా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. దీంతో సాయిపల్లవికి పొగరు అనీ, ఎవరినీ లెక్క చేయదని ప్రచారం జరిగింది. ‘నా గురించి ఎవరేం అనుకున్నా.. నాకు ఫర్వాలేదు. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. కావాలంటే నన్ను తిట్టుకోండి’ అంటూ డైరెక్ట్‌గా చెప్పే సాయిపల్లవికి సౌత్‌లో హీరోయిన్‌గా ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. జార్జియాలో మెడిసన్‌ పూర్తి చేసిన సాయిపల్లవి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? హీరోయిన్‌గా అవకాశాలు ఎలా అందిపుచ్చుకుంది? చాలా తక్కువ టైమ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎలా ఎదిగింది అనే ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. 1992 మే 9న తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలో సెంతామరై కన్నన్‌, రాధ కన్నన్‌ దంపతులకు జన్మించారు పల్లవి. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజ. తండ్రి సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. తల్లి రాధ.. సత్యసాయిబాబా భక్తురాలు. దీంతో పల్లవి పేరుకు సాయి అనేది చేర్చారు. కోయంబత్తూరులోని అవిలా కాన్వెంట్‌ స్కూల్‌లో సాయిపల్లవి, పూజ ప్రాథమిక విద్యతోపాటు ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. సాయిపల్లవి ఎవరి దగ్గరా డాన్స్‌ నేర్చుకోలేదు. చిన్నతనం నుంచి టీవీలో వచ్చే పాటలు చూస్తూ స్టెప్స్‌ వేసేది. తల్లి రాధకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. దాంతో కూతుర్ని ఈ విషయంలో ఎంతో ప్రోత్సహించేవారు. అలా ఐదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ ఫంక్షన్‌లో ఒక పాటకు డాన్స్‌ చేసింది. అది చూసిన ఓ తమిళ దర్శకుడు తను చేస్తున్న ‘కస్తూరిమాన్‌’ చిత్రంలో మీరా జాస్మిన్‌ స్నేహితురాలి క్యారెక్టర్‌ ఇచ్చారు. అయితే అది చాలా చిన్న క్యారెక్టర్‌. ఆ తర్వాత 13 ఏళ్ళ వయసులో జీవా దర్శకత్వంలో వచ్చిన ‘ధాం ధూం’ అనే చిత్రంలో కంగనా రనౌత్‌ స్నేహితురాలిగా నటించింది.  ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డాన్స్‌ షోకి సాయిపల్లవిని తీసుకెళ్లారు ఆమె తల్లి. దానిలో సాయిపల్లవి సెలెక్ట్‌ అయింది. అయితే ఇవన్నీ చేయడం తండ్రికి నచ్చేది కాదు. అయినా ఆమె ఇష్టాన్ని మాత్రం కాదనేవారు కాదు. సినిమాలు, డాన్స్‌ షోల వల్ల చదువు డిస్ట్రబ్‌ అవుతుందని భావించిన కన్నన్‌... ఆమెను మెడిసన్‌ చేసేందుకు జార్జియా పంపించారు. నాలుగు సంవత్సరాలు చదివి ఎంబిబిఎస్‌ పట్టా పుచ్చుకున్నారు సాయిపల్లవి. ఇండియా వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ పెడదామని అనుకున్నారు. గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలు అందించాలన్నది ఆమె కోరిక. జార్జియాలో మెడిసన్‌ చేస్తున్న సమయంలోనే సెలవుల్లో ఇండియాకి వచ్చింది. ఆ సమయంలో మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’లో ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ కోసం సాయిపల్లవిని అప్రోచ్‌ అయ్యారు దర్శకనిర్మాతలు. సాయిపల్లవి తల్లికి కూడా ఆ ఆఫర్‌ నచ్చింది. అయితే సెలవుల్లో మాత్రమే సినిమా చేయగలనని ఆ సినిమా దర్శకనిర్మాతలకు చెప్పారు. దానికి తగ్గట్టుగానే సెలవులు పూర్తయ్యేలోపు సాయిపల్లవికి సంబంధించిన సీన్స్‌ అన్నీ షూట్‌ చేసుకున్నారు డైరెక్టర్‌. ‘ప్రేమమ్‌’ చిత్రం 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘కలి’ చిత్రంలో నటించారు సాయిపల్లవి. 2016 విడుదలైన ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అయింది.  అదే సమయంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. 2017లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు సాయిపల్లవి. ముఖ్యంగా ఈ చిత్రంలో సాయిపల్లవి డాన్స్‌కి విపరీతమైన పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ఎంసిఎ, పడిపడి లేచె మనసు, లవ్‌స్టోరీ, విరాటపర్వం, తండేల్‌ వంటి సినిమాల్లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌కు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. అలాగే తమిళ్‌లో చేసిన మారి2 సాయిపల్లవికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ..’ పాటకు ఆమె వేసిన స్టెప్స్‌ నెక్స్‌ట్‌ లెవల్‌ అన్నట్టుగా ఉంటాయి. ఈ పాటకు కోట్లలో వ్యూస్‌ రావడం విశేషం. అలాగే తెలుగులో అనువాదమైన కణం, గార్గి, అమరన్‌ వంటి సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం హిందీలో పురాణ ఇతిహాస చిత్రం ‘రామాయణ’లో సీతగా నటిస్తున్నారు సాయిపల్లవి.  సాయిపల్లవి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె సోదరి పూజ కన్నన్‌ కూడా ‘కారా’ అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత స్టంట్‌ సిల్వ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చితిరై సెవ్వానం’ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆమె నటించిన ఏకైక సినిమా ఇది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాయిపల్లవి విషయానికి వస్తే.. తనకు నచ్చిన కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తానంటోంది. సౌత్‌లో ఇప్పటివరకు నటిగా తనపై ఉన్న ఇంప్రెషన్‌ని కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది. తనకు నచ్చిన కథ వచ్చినపుడే సినిమా చేస్తానని చెబుతోంది. ప్రస్తుతం తనకు వచ్చిన స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని, అవకాశం ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తానంటోంది. ఆ తర్వాత డాక్టర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించి గైనకాలజిస్ట్‌గా స్థిరపడాలని తన కోరిక అని చెబుతోంది సాయిపల్లవి.

రౌడీ స్టార్ మాస్టర్ ప్లాన్.. ఇక థియేటర్లలో మోత మోగాల్సిందేనా?

(మే 9 విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా..) చిత్ర పరిశ్రమలో ఎవరి అండా లేకుండా నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఈరోజుల్లో మరీ కష్టం. అలా స్వయంకృషితో తనను తాను ప్రూవ్‌ చేసుకొని స్టార్‌ హీరోగా నిలబడిన వారిలో మొదటిగా చిరంజీవి పేరే చెబుతారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తరహాలో ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరో హోదా తెచ్చుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. మొదట చిన్నా చితకా పాత్రలు చేసి ఆ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారారు. అర్జున్‌రెడ్డి చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరో అయిపోయారు. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరోగా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న విజయ్‌.. ఇటీవల చేసిన కొన్ని సినిమాలతో నిరాశ పరిచినప్పటికీ అతనికి యూత్‌లో క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఏ హీరోకీ సాధ్యం కాని విధంగా చాలా తక్కువ సమయంలో అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. తన సినిమాలతో ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి, సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు అనే విషయాలు తెలుసుకుందాం. 1989 మే 9న గోవర్థనరావు, మాధవి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు దేవరకొండ విజయ్‌ సాయి. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్‌, బి.కాం చేశారు. విజయ్‌ తండ్రి గోవర్థనరావు మొదట నటుడిగా స్థిరపడాలని అనుకున్నారు. కానీ, అవకాశాలు రాకపోవడంతో టీవీ సీరియల్స్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. విజయ్‌ కూడా తండ్రిలాగే నటుడు కావాలనుకుని డిగ్రీ పూర్తయిన తర్వాత అదే విషయాన్ని తండ్రికి చెప్పారు. ఆయన కూడా ఒప్పుకోవడంతో సూత్రధార్‌ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు విజయ్‌. హైదరాబాద్‌ థియేటర్‌ సర్క్యూట్‌ లో ఎన్నో నాటకాల్లో నటించారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దర్శకుడు రవిబాబు ‘నువ్విలా’ చిత్రం కోసం ఆడిషన్స్‌ తీసుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు విజయ్‌. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ ఇచ్చారు. అది అతనికి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేశారు. ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ్‌ అశ్విన్‌తో విజయ్‌కి పరిచయం ఏర్పడిరది. ఆ స్నేహం కొద్దీ తను రూపొందిస్తున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చారు నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా విజయ్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాను అశ్వినీదత్‌ కుమార్తెలు నిర్మించారు. అప్పటి నుంచి దత్‌ ఫ్యామిలీతో విజయ్‌కి మంచి అనుబంధం ఏర్పడిరది. ఆ తర్వాత నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రంలో ఒక జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేశారు.  ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో విజయ్‌ నటన చూసి.. తరుణ్‌ భాస్కర్‌ తను రూపొందిస్తున్న ‘పెళ్లిచూపులు’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. అప్పటికే సందీప్‌రెడ్డితో విజయ్‌కి మంచి స్నేహం ఉంది. అతను ‘అర్జున్‌రెడ్డి’ కథ రెడీ చేసుకొని మొదట అల్లు అర్జున్‌కి వినిపించాడు. కానీ, అతనికి కథ నచ్చలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు హీరోలను కూడా సందీప్‌ కలిశారు. వారు కూడా రిజెక్ట్‌ చెయ్యడంతో విజయ్‌ దేవరకొండతోనే ఆ సినిమా చెయ్యాలని ఫిక్స్‌ అయ్యాడు. పెళ్లిచూపులు షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ‘అర్జున్‌రెడ్డి’ షూటింగ్‌ కూడా జరిగింది. ఆ సినిమా విడుదలయ్యే నాటికి  40 శాతం షూటింగ్‌ పూర్తి చేశారు సందీప్‌. అదే సమయంలో మహానటి, ద్వారక, ఏం మంత్రం వేశావే సినిమాలు కూడా షూటింగ్‌ జరుగుతున్నాయి. మొదట ద్వారక చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సమయంలోనే అర్జున్‌రెడ్డి షూటింగ్‌ పూర్తి చేసుకొని సెన్సార్‌కి వెళ్లింది. సెన్సార్‌లో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రిలీజ్‌ ఆలస్యమైంది. ఈలోగా తమిళ్‌లో ‘నోటా’ చిత్రం చేశారు విజయ్‌. అలాగే రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ ప్రారంభమైంది.  సెన్సార్‌ సమస్యల నుంచి బయటపడి ‘ఎ’ సర్టిఫికెట్‌తో ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయారు విజయ్‌ దేవరకొండ. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కంటే కొనుక్కున్న బయ్యర్లకే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత 2018లో విజయ్‌ నటించిన ఐదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో గీత గోవిందం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే టాక్సీవాలా సూపర్‌హిట్‌ అయింది. నోటా, ఏం మంత్రం వేశావే చిత్రాలు నిరాశపరిచాయి. 2019 నుంచి విజయ్‌ దేవరకొండ చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయాయి. డియర్‌ కామ్రేడ్‌, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్‌.. వంటి సినిమాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో విజయ్‌ చేసిన అర్జునుడి క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. విజయ్‌  దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.  అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. తన కుటుంబానికి నచ్చని పనిచేసినపుడు విజయ్‌ని రౌడీ అనేవారు. దాంతో తన అభిమానుల్ని కూడా విజయ్‌ అలాగే పిలుస్తారు. 2018లో రౌడీ వేర్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అంతేకాదు, మహబూబ్‌నగర్‌లో తన మొదటి మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను నిర్మించారు విజయ్‌. సినిమాలు, వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు విజయ్‌. 2019లో ది దేవరకొండ ఫౌండేషన్‌ అనే పేరుతో లాభాపేక్ష లేని ఒక సంస్థను స్థాపించారు. కరోనా సమయంలో 17 వేల కుటుంబాలకు నిత్యావసరాలు అందించింది ఈ సంస్థ. అలాగే ‘ఖుషి’ సక్సెస్‌ మీట్‌లో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.   ఒక్క సినిమాతోనే స్టార్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్న విజయ్‌కి ఈమధ్యకాలంలో సరైన విజయాలు దక్కడం లేదు. దానికి కారణం ఎంపిక చేసుకుంటున్న కథలు, దర్శకులు అనే విమర్శ విజయ్‌పై ఉంది. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వరస పరాజయాల నుంచి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్‌’ మే 30న విడుదల కాబోతోంది. ఇది కాక తనకు ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన రాహుల్‌ సంకృత్యాన్‌తో ఒక సినిమా, ‘రాజావారు రాణీగారు’ చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. అంతేకాదు, ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా తొలి అవకాశం ఇచ్చిన తరుణ్‌ భాస్కర్‌తో కూడా ఒక సినిమా కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. 

తన ఓవర్‌ యాక్షన్‌తో నవ్వులు పంచే సంపూ జీవితంలోని చీకటి కోణాలు మీకు తెలుసా?

(మే 9 సంపూర్ణేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా..) ‘ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది’, ‘నేను కత్తి పట్టి నరకడం మొదలుపెడితే.. ముక్కలేరుకోడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి’.. సాధారణంగా యాక్షన్‌ హీరోలు కూడా ఇలాంటి డైలాగులు చెప్పరు. కానీ, బర్నింగ్‌ స్టార్‌ చెబుతాడు.. అతనే సంపూ అలియాస్‌ సంపూర్ణేశ్‌బాబు. అతను చేసే సినిమాలన్నీ వెరైటీయే. టైటిల్‌ నుంచి సినిమాలోని సీన్స్‌గానీ, డైలాగ్స్‌గానీ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఒకే ఒక్క సినిమాతో బర్నింగ్‌ స్టార్‌గా ఎదిగిన సంపూర్ణేశ్‌బాబు సినీ జీవితం ఎలా మొదలైంది, అతని వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనే విషయాలు తెలుసుకుందాం. 1972 మే 9న సిద్ధిపేట జిల్లా మెట్టపల్లిలో పేద విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సంపూర్ణేశ్‌బాబు. ఆయన అసలు పేరు నరసింహాచారి. బంగారు, వెండి నగల తయారీ వీరి వృత్తి. అయితే చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఈ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. ఆ సమయంలోనే సంపు అన్నయ్య బంగారం పని నేర్చుకొని సిద్ధిపేటలో షాప్‌ పెట్టాడు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత సంపుకి కూడా పని నేర్పించి అతనితో కూడా ఒక షాప్‌ పెట్టించాడు. ఇది ఒక సైడ్‌ అయితే.. మరో సైడ్‌ అతనిలో ఒక కళాకారుడు ఉన్నాడు. చిన్నతనం నుంచి నాటకాలు వేయడం, సినిమాలు చూసి అందులోని నటుల్ని అనుకరించడం, డైలాగులు చెప్పడం వంటివి చేసేవాడు. సినిమాల్లో నటించాలన్నది అతని కోరిక. దాని కోసం సిల్వర్‌ సురేష్‌ అనే వ్యక్తి దగ్గర నటన నేర్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు సంపాదించాలంటే హైదరాబాద్‌ వెళ్లాలి అని తెలుసుకున్న సంపు అక్కడికి వెళ్ళి అన్ని సినిమా ఆఫీసుల్లో తన ఫోటోలు ఇచ్చాడు.  అతనికి తొలి అవకాశం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘మహాత్మ’ చిత్రంలో వచ్చింది. అది  కూడా చిన్న వేషం. అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తున్న సంపుకి సాయిరాజేష్‌ పరిచయమయ్యాడు. తను చేస్తున్న ‘హృదయ కాలేయం’ చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని చెప్పాడు. అలా హీరోగా మొదటి సినిమా చేశాడు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ చూసి చాలా బాగుంది అంటూ రాజమౌళి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.  డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి చాలా పెద్ద హిట్‌ చేశారు. ఈ సినిమాలోని సంపూ డైలాగులు, ఓవర్‌ యాక్షన్‌ చూసి అందరూ బాగా నవ్వుకున్నారు. అలా ఒక్క సినిమాతోనే స్టార్ట్‌ స్టేటస్‌ సంపాదించుకొని బర్నింగ్‌ స్టార్‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘కరెంట్‌ తీగ’ చిత్రంలో సన్నీ లియోన్‌కి భర్తగా నటించి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెసరట్టు, బందిపోటు, జ్యోతిలక్ష్మి, రాజా ది గ్రేట్‌, దేవదాస్‌, కథనం వంటి సినిమాల్లోనూ అతిథి పాత్రలు పోషించాడు. అలాగే వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌, లచ్చిందేవికి ఓ లెక్కుంది, భద్రం బీ కేర్‌ ఫుల్‌ బ్రదరూ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. హీరో సూర్య చేసిన సింగం సిరీస్‌కి సెటైర్‌గా మంచు విష్ణు నిర్మించిన ‘సింగం 123’ చిత్రంలో మరోసారి రెచ్చిపోయాడు సంపూ. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అయి కాసుల వర్షం కురిపించింది. విశేషం ఏమిటంటే.. మంచు విష్ణు చేసిన ఏ సినిమాకీ అంతటి కలెక్షన్స్‌ రాలేదట. ఆ తర్వాత ‘కొబ్బరిమట్ట’లో త్రిపాత్రాభినయం చేసి అందర్నీ మెప్పించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.   సినిమా రంగంలో నటుడిగా మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయిలో ఉన్నప్పటికీ తన ఊరుని, తన గత జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోడు సంపూ. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం అన్నది అతనికి చిన్నతనం నుంచి ఉన్న అలవాటు. ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడిపేందుకే సంపూ ఇష్టపడతాడు. అంతకుముందు ఊరిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తాడు. షూటింగ్‌లకు కూడా బస్సులో హైదరాబాద్‌ వస్తుంటాడు. 2009లో ప్రారంభమైన సంపూ సినీ కెరీర్‌లో కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తే, మరికొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు, కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ‘సోదరా’ చిత్రంతో సంపూ మరోసారి సందడి చేశాడు.

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. రికార్డులు సాధించాలన్నా మేమే..’

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. రికార్డులు సాధించాలన్నా మేమే..’ అంటూ ఎంతో ఆవేశపూరితంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడడం మనం చూశాం. అయితే ఆయన మాటలు అక్షరాలా నిజం అనేది నటరత్న ఎన్‌.టి.రామారావు కెరీర్‌ చూసినా, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్‌ చూసినా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించడంలో నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ చేసిన వైవిధ్యమైన పాత్రలు ఇప్పటికీ తెలుగు వారి కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు మనకు ఎన్టీఆర్‌లోనే కనిపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతో మంది ఇళ్ళల్లో రాముడుగా, కృష్ణుడిగా ఎన్టీఆర్‌ ఫోటోలే కనిపిస్తాయి. తెలుగు ప్రజలపై అంతటి ముద్ర వేసిన ఎన్టీఆర్‌ తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆయన నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ కూడా మరో హీరోకి సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈతరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించగల సత్తా తనకే ఉందని నందమూరి బాలకృష్ణ నిరూపించుకున్నారు. సాధారణంగా పాతతరం హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేయకూడదు అనే నిబంధన పెట్టుకునేవారు. కానీ, ఎన్టీఆర్‌ ఈ విషయంలో పూర్తి భిన్నంగా ఆలోచించేవారు. మనం ఏ సినిమా అయినా చెయ్యాలి, ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోవాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇదే ఆలోచనతో తన దగ్గరకు వచ్చిన నిర్మాతల్ని నిరాశపరచకుండా అన్ని సినిమాలూ చేసేవారు. అలా సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేశారు.  1964లో ఏకంగా 16 సినిమాల్లో హీరోగా నటించి రికార్డు సృష్టించారు ఎన్టీఆర్‌. అంతేకాదు, 1965లో ఎన్టీఆర్‌ నటించిన 8 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. అలాగే 64 సంవత్సరాల క్రితం మరో రికార్డును కూడా క్రియేట్‌ చేశారు నటరత్న ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయి శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. 1961 మే 5న ఎన్టీఆర్‌, అంజలీదేవి జంటగా ఎస్‌.రజినీకాంత్‌ దర్శకత్వంలో శ్రీకాంత్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ‘సతీ సులోచన(ఇంద్రజిత్‌)’, ఎన్టీఆర్‌, దేవిక జంటగా ఎ.వి.శేషగిరిరావు రూపొందించిన ‘పెండ్లి పిలుపు’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘సతీ సులోచన’ ఆరు కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించగా, ‘పెండ్లి పిలుపు’ చిత్రం రెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ రెండు సినిమాలూ విజయవాడ, రాజమండ్రి కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలాంటి అరుదైన రికార్డును భారతీయ సినిమాల్లో సాధించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. నటరత్న ఎన్‌.టి.రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణకు కూడా ఇలాంటి అరుదైన రికార్డు ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు. బాలకృష్ణ హీరోగా, రమ్యకృష్ణ, రవీనా టాండన్‌ హీరోయిన్లుగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన ‘బంగారు బుల్లోడు’, బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.శ్రీనివాసప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘నిప్పురవ్వ’ చిత్రాలు 1993 సెప్టెంబర్‌ 3న విడుదలై ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్‌ తర్వాత వచ్చిన హీరోల్లో ఇలా ఒకేరోజు వారు నటించిన రెండు సినిమాలు రిలీజ్‌ అవ్వడం అనేది జరగలేదు. ఆ ఘనత బాలకృష్ణకు దక్కింది. తండ్రి తరహాలోనే బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలై శతదినోత్సవ చిత్రాలు నిలవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ‘సతీ సులోచన’, ‘పెండ్లి పిలుపు’ చిత్రాల మాదిరిగానే.. ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ చిత్రాలు కూడా విజయవాడ, రాజమండ్రిలలో శతదినోత్సవం జరుపుకోవడం కూడా ఎన్టీఆర్‌ నుంచి వారసత్వంగా రావడం నందమూరి బాలకృష్ణకు లభించిన గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రికార్డును సృష్టించిన ఘనత నందమూరి వంశానికి మాత్రమే దక్కడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ నటించిన రెండు సినిమాలు విడుదలైన మే 5కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. నటరత్న ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహం 2011 మే 5న జరిగింది. ఇలా మే 5 అనే తేదీ తాతమనవళ్లకు ప్రత్యేకమైన రోజు కావడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం.

ఒక్క ఫ్లాప్‌తో 13 మంది నిర్మాతలు వెనక్కి తగ్గారు.. అప్పుడు దాసరి ఏం చేశారో తెలుసా?

(మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా..)  1950 నుంచి 1970 వరకు కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డ్డి, హెచ్‌.ఎం.రెడ్డి, ఎల్‌.వి.ప్రసాద్‌, కె.ఎస్‌.ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శకులు తెలుగు సినిమాకి వన్నె తెచ్చారు. ఆ తర్వాతి తరంలో దర్శకుడిగా పరిచయమైన దాసరి నారాయణరావు పాతతరం దర్శకుల లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకొని ఎన్నో వైవిధ్యమైన సినిమాలను రూపొందించి దర్శకరత్నగా అవతరించారు. దాసరి స్పృశించని కథాంశం లేదు అంటే అతిశయోక్తి కాదు. స్టార్‌ హీరోతో చేసినా, అంతా కొత్తవారితో చేసినా తన సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయాలి అనే లక్ష్యంతోనే సినిమాలు చేసేవారు. ఒక దశలో తెలుగు సినిమాని శాసించారు. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా దర్శకుడికి స్టార్‌ హోదాను తీసుకొచ్చిన ఘనత దర్శకరత్న దాసరికే దక్కుతుంది.  1942 మే 4న పాలకొల్లులో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు దాసరి. తనకు చదువు చెప్పించే స్తోమత తండ్రికి లేకపోవడంతో ఒక మాస్టారి సహాయంతో చదువుకున్నారు. చిన్నతనం నుంచే నటన పట్ల, రచన పట్ల ఆయనకు అభిరుచి ఉండేది. ఎన్నో నాటకాలు రచించడమే కాకుండా నటించారు కూడా. ఆ తర్వాత నటుడిగా స్థిరపడాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ రైలెక్కారు. కానీ, ఆయనకు మొదట రచయితగానే అవకాశం వచ్చింది. దాదాపు పాతిక సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేసిన తర్వాత 1970లో ‘జగత్‌ జెట్టీలు’ చిత్రంలో మాటల రచయితగా తొలిసారి తెరపై దాసరి పేరు కనిపించింది. అలాగే ఈ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కె.రాఘవ ఆ తర్వాత 1973లో ‘తాత మనవడు’ చిత్రంతో దాసరిని దర్శకుడిగా పరిచయం చేశారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు దాసరి. ఆ తర్వాత సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయారు. నాలుగు సంవత్సరాల్లో దాదాపు 20 సినిమాలు చేసిన దాసరితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేవారు. 2014లో వచ్చిన ‘ఎర్రబస్సు’ దర్శకుడిగా ఆయన చివరి సినిమా. 1970వ దశకం నుంచి దాదాపు అందరు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు దాసరి. తన 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటుడిగా కూడా తన ప్రతిభ కనబరిచి ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నారు.  సినిమా రంగంలో ఎంత టాలెంట్‌ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్‌లో లేకపోతే అప్పటివరకు సినిమాలు చెయ్యమని వెంట తిరిగిన వారు కూడా మొహం చాటేస్తుంటారు. దర్శకుడిగా అద్భుతమైన సినిమాలు చేసిన దాసరికి కెరీర్‌ ప్రారంభంలో అలాంటి ఓ చేదు అనుభవం ఎదురైంది. తాత మనవడు తర్వాత దర్శకుడిగా బిజీ అయిపోయిన దాసరి.. చాలా సినిమాలు కమిట్‌ అయి ఉన్నారు. ఆ క్రమంలోనే 1977లో చేసిన జీవితమే ఒక నాటకం సినిమా పెద్ద ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. అప్పటికి 13 మంది నిర్మాతలు దాసరితో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో తాము ఇచ్చిన అడ్వాన్స్‌ వెనక్కి ఇవ్వమని అడిగారు. వారికి తిరిగి ఇవ్వడానికి సమయానికి డబ్బు లేకపోవడంతో తన భార్య నగలు తాకట్టుపెట్టి ఆ నిర్మాతలకు సెటిల్‌ చేశారు దాసరి.  తనతో సినిమా చెయ్యాలని ఎదురుచూసిన నిర్మాతలంతా వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నారు దాసరి. ఆ సమయంలోనే నిర్మాత వడ్డే రమేష్‌ ఆయన దగ్గరకి వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో అంతకుముందు పాడవోయి భారతీయుడా అనే సినిమా చేశారు. ఆ సినిమా డిజాస్టర్‌ అయినప్పటికీ మరో సినిమా చెయ్యమని దాసరిని అడిగారు రమేష్‌. ఆ మాట విని దాసరి ఆశ్చర్యపోయారు. ‘అందరూ అడ్వాన్స్‌లు వెనక్కి తీసుకుంటే నువ్వేంటి సినిమా చెయ్యమంటున్నావు’ అని అడిగారు. దానికి రమేష్‌ ‘వాళ్లంతా నిజమైన నిర్మాతలు కాదు. ఒక సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన ఏ దర్శకుడ్నీ తక్కువ చేయలేం. ఇకపై మా బేనర్‌లో చేసే ప్రతి సినిమాకీ మీరే డైరెక్టర్‌’ అన్నారు.  అప్పుడు తను ఉన్న పరిస్థితిలో తప్పకుండా ఒక భారీ హిట్‌ కొట్టి తీరాలని డిసైడ్‌ అయ్యారు దాసరి. అప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఓ కథతో స్క్రిప్ట్‌ రెడీ చేశారు. ఆ కథను మొదట కృష్ణకు వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ప్రారంభించాలనుకుంటున్న సమయంలో కృష్ణ మరొకరికి అత్యవసరంగా సినిమా చెయ్యాల్సి వచ్చింది. అయితే తను ఇచ్చిన డేట్స్‌లోనే రోజుకి రెండు షిఫ్టుల్లో రెండు సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారు కృష్ణ. అయితే దానికి వడ్డే రమేష్‌ ఒప్పుకోలేదు. తమకి ఇచ్చిన డేట్స్‌ని ఆ నిర్మాతకే ఇవ్వమని కృష్ణకు చెప్పారు రమేష్‌. అప్పుడు తన మిత్రుడైన కృష్ణంరాజును కలిసి సినిమా చెయ్యమని అడిగారు. ఆయన ఒప్పుకోవడంతో దాసరితో కథ చెప్పించారు. కృష్ణంరాజుకు కూడా కథ బాగా నచ్చింది. అదే ‘కటకటాల రుద్రయ్య’. భారతంలోని కర్ణుడి పాత్రను తీసుకొని సోషలైజ్‌ చేసి అద్భుతమైన కథను రాశారు దాసరి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ అలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయని కృష్ణంరాజుకు అది వెరైటీ అయింది. రుద్రయ్య పాత్రను పూర్తిగా అవగతం చేసుకున్న ఆయన ఆ పాత్రలో జీవించారు.  హీరో అంటే క్లీన్‌గా, నీట్‌గా ఉండడమే అప్పటి ప్రేక్షకులకు తెలుసు. కానీ, కటకటాల రుద్రయ్య చిత్రంలో కృష్ణంరాజు ఎంతో రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తారు. పెర్‌ఫార్మెన్స్‌గానీ, డైలాగులుగానీ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అవి ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఈ సినిమాతో తన సత్తా ఏమిటో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు దాసరి. ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన జయసుధ, జయచిత్ర, జమున నటించారు. జె.వి.రాఘవులు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. దాసరి నారాయణరావుపై ఉన్న నమ్మకంతో సినిమా చేసేందుకు ముందుకొచ్చిన వడ్డే రమేష్‌కి కటకటాల రుద్రయ్య చాలా పెద్ద హిట్‌ సినిమా అయింది. రూ.18 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపు కోటి రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటివరకు అలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయకపోవడం వల్ల ఈ సినిమాతో కృష్ణంరాజు ఇమేజ్‌ మరింత పెరిగి రెబల్‌స్టార్‌ అయ్యారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి తెలుసుకున్న నటరత్న ఎన్‌.టి.రామారావు దర్శకనిర్మాతలను పిలిచి అభినందించారు. అలా దాసరి, వడ్డే రమేష్‌ ఇద్దరూ కలిసి రంగూన్‌ రౌడీ, బొబ్బిలిపులి, విశ్వనాథనాయకుడు, లంకేశ్వరుడు వంటి సినిమాలను నిర్మించారు.

50 ఏళ్ళ దర్శకేంద్రుడు.. తెలుగు సినిమా దశ, దిశ మార్చిన దర్శకుడు!

(మే 2 కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..) దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు. కమర్షియల్‌ హిట్‌ అంటే ఏమిటో ఇండస్ట్రీకి తెలియజేసిన దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే సినిమాలో ఏయే అంశాలు ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను చూడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాల్లో రాఘవేంద్రరావుకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. కథ, కథనాల విషయంలో ఎంత శ్రద్ధ పెడతారో.. పాటల చిత్రీకరణలో కూడా అంతే శ్రద్ధ పెడతారు. పాటల కోసమైనా రిపీట్‌ ఆడియన్స్‌ని థియేటర్స్‌ రప్పిస్తారు. 1975 మే 2న విడుదలైన ‘బాబు’ రాఘవేంద్రరావు తొలి సినిమా. దర్శకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దర్శకేంద్రుడు.. ప్రేక్షకుల్ని ఎలా మెస్మరైజ్‌ చేస్తారు, తన సినిమాలతో బాక్సాఫీస్‌ను ఎలా కొల్లగొడతారు, కమర్షియల్‌ సినిమాలతోనే కాదు, భక్తి రస చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక దిశగా ఎలా నడిపిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1942 మే 23న కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కేసరపల్లి గ్రామంలో కె.ఎస్‌.ప్రకాశరావు, కోటేశ్వరమ్మ దంపతులకు జన్మించారు కోవెలమూడి రాఘవేంద్రరావు. 1940 నుంచి 1950 వరకు ఓ అరడజను సినిమాల్లో హీరోగా నటించిన కె.ఎస్‌.ప్రకాశరావు ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించారు. రాఘవేంద్రరావు విద్యాభ్యాసం అంతా మద్రాస్‌లోనే జరిగింది. ఆయన ఇంటర్‌ చదువుతున్నప్పుడే డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరమని తండ్రి అడిగారు. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే ఏదైనా చేస్తానని చెప్పారు రాఘవేంద్రరావు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన్ని డైరెక్టర్‌ కమలాకర కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా చేర్పించారు ప్రకాశరావు. 1965లో ‘పాండవ వనవాసం’ చిత్రంలో నటరత్న ఎన్‌.టి.రామారావుపై క్లాప్‌ కొట్టడం ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు రాఘవేంద్రరావు. దాదాపు 9 సంవత్సరాలపాటు కొందరు దర్శకుల వద్ద పనిచేయడమే కాకుండా తండ్రి దగ్గర కూడా అసిస్టెంట్‌గా వర్క్‌ చేశారు.  1975లో అడుసుమిల్లి లక్ష్మీకుమార్‌ అనే నిర్మాత రాఘవేంద్రరావుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. శోభన్‌బాబు, వాణిశ్రీ, లక్ష్మీ, అరుణా ఇరాని ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాబు’ చిత్రంతో రాఘవేంద్రరావు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆరోజుల్లోనే 25 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.ప్రకాశరావు కథ అందించగా, ఆత్రేయ పాటలు, మాటలు రాశారు. 1975 మే 2న విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి. దాన్నిబట్టి సినిమా ఘనవిజయం సాధిస్తుందని ట్రేడ్‌వర్గాలు భావించాయి. కానీ, అలా జరగలేదు. సరిగ్గా రెండు వారాలకు కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జీవనజ్యోతి’ విడుదలైంది. ఈ చిత్రంలో కూడా శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో ఒక్కసారిగా ‘బాబు’ చిత్రం కలెక్షన్స్‌ పడిపోయాయి. మ్యూజికల్‌గా పెద్ద విజయం సాధించిన ఈ సినిమా కొన్ని సెంటర్స్‌లో 50 రోజులు ప్రదర్శించారు తప్ప ఒక్క సెంటర్‌లో కూడా శతదినోత్సవం జరుపుకోలేదు.  సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది మాత్రమేనని రాఘవేంద్రరావు నమ్మేవారు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అదే సూత్రాన్ని నమ్మిన ఆయన తన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు నచ్చే అంశాలనే చూపిస్తూ వచ్చారు. తమ కష్టాల్ని, శ్రమని మర్చిపోవడానికి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాలన్న ధ్యేయంతోనే సినిమాలు రూపొందించేవారు. ముఖ్యంగా పాటల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు దర్శకుడు అవ్వకముందే ఆయన తండ్రి గుర్తించారు. అందుకే తను దర్శకత్వం వహించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చిత్రంలోని పాటల చిత్రీకరణ బాధ్యతను రాఘవేంద్రరావుకే అప్పగించారు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావు చూపించే వైవిధ్యాన్ని ఇప్పటివరకు ఏ దర్శకుడూ అందిపుచ్చుకోలేదన్నది వాస్తవం. ఈ విషయాన్ని ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో చూపించిన సినిమా ‘అడవి రాముడు’. ఈ చిత్రంలోని పాటలన్నీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ సినిమాలోని పాటలు చూసేందుకే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..’ అనే పాట ఇప్పటికీ కనువిందు చేసేలా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏ దర్శకుడూ ఆ కాన్సెప్ట్‌లో పాట తియ్యలేదు. ఈ పాటలో ఎన్టీఆర్‌, జయప్రదలతోపాటు పక్షులు, జంతువులు మాత్రమే కనిపిస్తాయి. ‘ఈ పాట ఆ కాన్సెప్ట్‌లో తియ్యాలని ఎలా అనిపించింది.. నిజంగా అద్భుతం’ అంటూ ఓ బాలీవుడ్‌ దర్శకుడు రాఘవేంద్రరావును స్వయంగా అభినందించడం విశేషం. ఆ సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాలోనూ పాటల్లో ఏదో ఒక ప్రత్యేకత చూపించే ప్రయత్నం చేశారు రాఘవేంద్రరావు. 1980 దశకం నుంచి తన పాటల్లో పూలు, పండ్లు వాడుతూ అందులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.  తెలుగు సినిమాను కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు నిస్సందేహంగా కె.రాఘవేంద్రరావు అనే చెప్పాలి. 1977లో వచ్చిన ‘అడవి రాముడు’తో తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ ఏమిటి అనేది తెలియజెప్పారు. ఈ సినిమా 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 4 కేంద్రాల్లో 365 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజుల్లో కోటి రూపాయలు, 100 రోజుల్లో 3 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో 3 కోట్లు వసూలు చేసిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత టాలీవుడ్‌లోని కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి టాప్‌ హీరోలందరికీ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్స్‌ అందించారు. కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించిన సినిమాలను రూపొందించారు. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన ఘనత దక్కించుకున్నారు రాఘవేంద్రరావు. ‘పాండవవనవాసం’ చిత్రంలో ఎన్టీఆర్‌పై క్లాప్‌ కొట్టడం ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవేంద్రరావు ఆయన చివరి సినిమా ‘మేజర్‌ చంద్రకాంత్‌’కి దర్శకత్వం వహించడం చాలా అరుదైన విషయం.  1997లో అక్కినేని నాగార్జునతో రాఘవేంద్రరావు చేసిన ‘అన్నమయ్య’ ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. అప్పటివరకు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వస్తున్న రాఘవేంద్రరావు, నాగార్జున.. ఒక్కసారిగా భక్తిమార్గంలోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అన్నమయ్య’ చిత్రానికి పరాజయం తప్పదని, నిర్మాత దొరస్వామిరాజు భారీగా నష్టపోతాడని సినీ పండితులు జోస్యం చెప్పారు. కానీ, అవేవీ ఫలించలేదు. ఎవరూ ఊహించని విధంగా రాఘవేంద్రరావు నుంచి ఒక అద్భుత దృశ్యకావ్యం వచ్చి థియేటర్స్‌ను దేవాలయాలుగా మార్చేసింది. నాగార్జున జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ సినిమా అయింది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవితో ‘శ్రీమంజునాథ’ చిత్రాన్ని రూపొందించి మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. నాగార్జునతో చేసిన  ‘శ్రీరామదాసు’ మరో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘శిరిడీసాయి’, ‘పాండురంగడు’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి సినిమాలతో భక్తి చిత్రాలు కూడా అద్భుతంగా తియ్యగలనని నిరూపించుకున్నారు కె.రాఘవేంద్రరావు.

సమంత కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ అన్ని మలుపులు తిరగడం వెనుక రీజన్‌ ఇదే!

(ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు సందర్భంగా..) సమంత.. ఓ మెరుపులా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన తార. హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో మంచి సినిమాలు చేసిన సమంత.. నటిగానే కాదు, తను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తను తొలిసారి నటించిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు. యంగ్‌ హీరోల పాలిట వరంగా మారిన సమంత ఒక దశలో అందరు యంగ్‌ హీరోల సినిమాలతో బిజీ అయిపోయారు. చిత్ర పరిశ్రమకు వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంత.. తెలుగు, తమిళ్‌ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వీటిలో తెలుగు సినిమాలే అధికంగా ఉండడం విశేషం. యూత్‌ ఐకాన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది? ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం. 1987 ఏప్రిల్‌ 28న జోసెఫ్‌ ప్రభు, నినెట్టే దంపతులకు మూడో సంతానంగా చెన్నయ్‌లో జన్మించారు సమంత రూత్‌ ప్రభు. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.  తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్‌ కాగా, తల్లి మలయాళీ. సమంత స్కూల్‌, కాలేజీ విద్య అంతా చెన్నయ్‌లోనే కొనసాగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌పై దృష్టి పెట్టారు సమంత. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ రవివర్మన్‌.. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించారు. అలా సమంత గురించి దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌కి తెలిసింది. తను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ద్వారా తొలిసారి సమంతకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. తెలుగులో ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో ఒక్కసారిగా సమంత పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. దాంతో తెలుగులోనే కాదు, తమిళ్‌లోనూ బిజీ హీరోయిన్‌ అయిపోయారు. ముఖ్యంగా తెలుగులో నాగచైతన్య, మహేష్‌, పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, నితిన్‌, నాని, విజయ్‌ దేవరకొండ వంటి హీరోలతో నటించి ఘనవిజయాలు అందుకున్నారు సమంత. తమిళ్‌లో విజయ్‌, విక్రమ్‌, సూర్య వంటి హీరోలతో కలిసి నటించారు.  ‘ఏమాయ చేసావె’ తర్వాత తెలుగులో సమంత చేసిన సినిమా ‘బృందావనం’. ఈ సినిమా ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు సమంతను స్టార్‌ హీరోయిన్‌ని చేశాయి. అయితే ఆమె తెలుగు, తమిళ్‌ చిత్రాల్లో మాత్రమే నటించారు. ‘ఏమాయ చేసావె’ చిత్రాన్ని హిందీలో ‘ఏక్‌ దివానా తా’ రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈగ’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించగా, హిందీలోకి ‘మఖ్కీ’ పేరుతో డబ్‌ చేశారు. 2019 వరకు సమంత కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా సాగింది. ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’, ‘సిటాడెల్‌(హనీ బన్నీ)’ వంటి వెబ్‌ సిరీస్‌లలో నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘శుభం’, ‘మా ఇంటి బంగారం’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు సమంత.  సమంత మొదటి సినిమా ‘ఏమాయ చేసావె’ 2010లో రిలీజ్‌ అయినప్పటికీ ఆ సినిమాలోని జెస్సీ పాత్ర కుర్రకారు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేంతగా తన నటనను ప్రదర్శించారు సమంత. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే హీరో నాగచైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. చాలా సంవత్సరాలపాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2017 అక్టోబర్‌ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయ రీతిలో గోవాలో నాగచైతన్య, సమంత వివాహం జరిగింది. దీంతో సమంత రూత్‌ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. 4 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితానికి 2021లో స్వస్తి పలికింది ఈ జంట. మొదట జూలై 31న సోషల్‌ మీడియాలో తన పేరు నుంచి అక్కినేని పేరును తొలగించడం ద్వారా తాము విడిపోతున్నట్టు సూచన ప్రాయంగా తెలియజేశారు సమంత. ఆ తర్వాత అక్టోబర్‌ 2న తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు నాగచైతన్య, సమంత.  నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. మయోసైటిస్‌ అనేది వ్యాధి బారిన పడడంతో మానసికంగా ఆమె ఎంతో కుంగిపోయారు. తిరిగి మామూలు స్థితికి రావడం కోసం ఎంతో కృషి చేశారు. అమెరికాలో కొన్ని నెలలపాటు చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైంది. అయినప్పటికీ కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోజుల్లోనే ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో నటించారు సమంత. ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడంలో సమంత చూపించిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. సినిమాల్లో నటించడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ సమంత ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎన్నో విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు సమంత. 

తెలుగు వారికి పెళ్లి పాటలు అందించిన ఘనత ఎన్టీఆర్‌, బాలకృష్ణలకే దక్కుతుంది!

నటరత్న ఎన్‌.టి.రామారావు కెరీర్‌లో ‘సీతారామకళ్యాణం’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పురాణ గాథల్లోని పాత్రల పట్ల ఎన్టీఆర్‌కు ఒక భిన్నాభిప్రాయం ఉండేది. ఆయా పాత్రల తీరు తెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని మంచి చెడ్డలను బేరీజు వేసుకునేవారు. అలా రావణ పాత్ర మీద ఆయనకు అమితమైన మక్కువ కలిగింది. రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషుల పాత్రలకు జీవం పోసి దేవుళ్లకు ప్రతిరూపంగా నిలిచారు ఎన్టీఆర్‌. ఆరోజుల్లో ఆ దేవుళ్ల రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలను ఇంట్లో పెట్టుకునేవారు. అలాంటి ఎన్టీఆర్‌ రావణాసురుడిగా కూడా మెప్పించి ఆ రెండు పాత్రలు పోషించడంలో తనకు తనే సాటి అనిపించుకున్నారు. భూకైలాస్‌ చిత్రంలో రావణబ్రహ్మగా నటించిన ఆయన ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో రాముడిగానూ, రావణాసురుడిగానూ నటించి మెప్పించడం అనేది ఆయనకే చెల్లింది. ‘సీతారామకళ్యాణం’ చిత్రం విషయానికి వస్తే.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో రావణుడిగా తను నటించి, రాముడి పాత్రను అప్పటి యువ హీరో హరనాథ్‌తో చేయించడం సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాకి మొదట కె.వి.రెడ్డిని దర్శకుడుగా అనుకున్నారు ఎన్టీఆర్‌. అయితే అంతకుముందు ఎన్టీఆర్‌ను కృష్ణుడిగా చూపించిన ఆయన ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. రావణుడిగా ఎన్టీఆర్‌ను చూపించలేను అన్నారు. అప్పుడు ఆ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను ఎన్టీఆరే తీసుకొని పూర్తి చేశారు. అయితే టైటిల్స్‌లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు.  1961లో ఎన్టీఆర్‌ ‘సీతారామకళ్యాణం’ చిత్రం విడుదలైంది. పాతిక సంవత్సరాల తర్వాత 1986లో నందమూరి బాలకృష్ణ ఇదే టైటిల్‌తో సినిమా చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పౌరాణిక సినిమా కాదు, పూర్తి సాంఘిక చిత్రం. ఈ సినిమా నిర్మాణం వెనుక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరమే బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో రూపొందిన ‘బాబాయ్‌ అబ్బాయ్‌’, బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన ‘పట్టాభిషేకం’ రెండూ ఫ్లాప్‌ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ జంధ్యాల కాంబినేషన్‌లో సినిమా ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో మొదటి సినిమా తనే నిర్మించాలని యువచిత్ర అధినేత కె.మురారి అనుకున్నారు. కానీ, అప్పటికే ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ మొదలైపోయింది. అయినా రెండో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట ఈ సినిమాలో భానుప్రియను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్‌ దొరక్కపోవడంతో విజయశాంతిని తీసుకోవాలనుకున్నారు. అయితే బాలకృష్ణతో చేసిన పట్టాభిషేకం ఫ్లాప్‌ అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని కూడా మానుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌తో చెయ్యాలనుకున్నారు. అది కూడా కుదరకపోవడంతో చివరికి రజనీని ఎంపిక చేశారు.  మాస్‌ ఇమేజ్‌ ఉన్న బాలకృష్ణతో ప్రేమకథా చిత్రం ఏమిటి అని మురారితో చాలా మంది అన్నారు. అతనిది మాస్‌ ఇమేజ్‌ అనీ, అతనికి లవ్‌ డైలాగ్స్‌ పెడితే ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చెయ్యరని చెప్పారు. అందుకే అతని ప్రేమ పూర్వకంగా ఉండే డైలాగులు చెప్పించవద్దని రాఘవేంద్రరావు సలహా కూడా ఇచ్చారు. ఆ సలహాను పాటించి బాలకృష్ణతో సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేయించారు జంధ్యాల. చక్కని కథ, కథనం, మధురమైన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. యువ చిత్ర బేనర్‌కి పర్మినెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.వి.మహదేవన్‌. ఈ బేనర్‌లో వచ్చిన సినిమాలన్నింటికీ ఆయన సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. ఈ సినిమా పాటల విషయానికి వస్తే.. ఆరు పాటలు ఉన్న ఆడియో క్యాసెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసి శ్రోతలను ఆ పాటలకు మార్కులు వెయ్యమని అడిగారు. అలా సినిమాలో ఏ పాటలు ఉండాలి అనేది డిసైడ్‌ చేశారు. ఆత్రేయ రాసిన ‘కళ్యాణ వైభోగమే..’, ‘రాళ్ళలో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..’, ‘ఎంత నేర్చినా..’, వేటూరి రాసిన ‘ఏమని పాడను..’ పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. 1986 ఏప్రిల్‌ 15న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో చక్కని ప్రేమకథా చిత్రంగా నిలిచింది.  నటరత్న ఎన్‌.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఒకే టైటిల్‌తో చేసిన ఈ సినిమాకి సంబంధించి మరో విశేషం ఉంది. ఎన్టీఆర్‌ సీతారామకళ్యాణం చిత్రానికి మొదట ఎస్‌.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఇందులోని ఒక పాట, పద్యాన్ని ఆయన కంపోజ్‌ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడు గాలిపెంచల నరసింహారావును సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు. సినిమాలోని మిగతా పాటలు, పద్యాలు ఆయనే స్వరపరిచారు. ఈ సినిమాలోని ‘శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి..’ పాట అత్యంత జనాదరణ పొందింది. సముద్రాల రాసిన ఈ పాటను పి.సుశీల ఎంతో మధురంగా ఆలపించారు. దాదాపు 30 సంవత్సరాలపాటు ఈ పాట లేకుండా పెళ్లి పందిళ్లు ఉండేవి కావు. అంతగా ఈ పాట జనాదరణ పొందింది. పాతిక సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ చేసిన ‘సీతారామకళ్యాణం’ చిత్రంలోని ‘కళ్యాణ వైభోగమే..’ పాటకు కూడా అంతటి ఆదరణ లభించింది. ఆ తర్వాతి కాలంలో ప్రతి పెళ్లిలోనూ ఈ పాట వినిపించేది. అలాగే పెళ్లికి సంబంధించిన వీడియోలో కూడా ఈ పాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలా ఎన్టీఆర్‌, బాలకృష్ణ తాము చేసిన చిత్రాల ద్వారా తెలుగు వారికి పెళ్లి పాటలు అందించారు.

జమున బ్యాన్‌ విషయంలో ఎన్టీఆర్‌ అమాయకుడు.. సూత్రధారి ఎఎన్నారే!

ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు అని చెప్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. ఎఎన్నార్‌ కంటే ఎన్టీఆర్‌ నాలుగు నెలలు పెద్దవారు. ఆ విధంగా ఎఎన్నార్‌ని తమ్ముడిలా భావించేవారు ఎన్టీఆర్‌. ఎలాంటి భేషజాలకు పోకుండా సినిమాలో తన పాత్ర ప్రాధాన్యం ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. ఒకరి మాట ఒకరు వినేవారు, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేవారు. వీరిద్దరి స్నేహం దాదాపు పాతిక సంవత్సరాలపాటు నిరాటంకంగా కొనసాగింది. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జునయుద్ధం తర్వాత కొన్ని కారణాల వల్ల 14 సంవత్సరాలపాటు ఇద్దరూ కలిసి నటించలేదు. 1977లో ఎన్టీఆర్‌ దర్శకత్వంలోనే వచ్చిన చాణక్య చంద్రగుప్త చిత్రంతో ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరూ స్నేహంగా ఉండే రోజుల్లో అక్కినేని చెప్పిన ఒక మాట విని ముందు వెనకా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్‌. ఇకపై జమునతో కలిసి నటించకూడదన్న అక్కినేని నిర్ణయాన్ని సమర్థించిన ఎన్టీఆర్‌ తను కూడా ఆమెను దూరం పెట్టారు. అసలు అక్కినేని, జమునల మధ్య వివాదం ఎందుకొచ్చింది? విషయం తెలుసుకోకుండా ఎఎన్నార్‌ని సపోర్ట్‌ చెయ్యడం వల్ల ఎన్టీఆర్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.  అక్కినేని నాగేశ్వరరావు, జమున జంటగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో  ‘ఇల్లరికం’ చిత్రాన్ని నిర్మించారు ఎ.వి.సుబ్బారావు. 1959 మే 1న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మ్యూజికల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో జమునతో అక్కినేని.. కాస్త ఎక్కువ చనువు తీసుకొని ప్రవర్తించారట. దానికి హర్ట్‌ అయిన జమున ఆ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పారు. ఆ విషయాన్ని పెద్దది చేయడం ఎందుకని.. ఆమెకు వారు ఏదో సర్ది చెప్పి పంపించారు. తనపై అలా ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకున్న ఎఎన్నార్‌ జమున గురించి దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సీనియర్‌ ఆర్టిస్టులను గౌరవించదనీ, అమర్యాదగా మాట్లాడుతుందనీ నలుగురికీ చెప్పారు. అంతే కాదు, పెద్ద వారి ముందు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుందని ప్రచారం చేశారు.  విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా సోదరుడైన ఎన్‌.టి.ఆర్‌. చెవిలో కూడా ఊదారు. జమునను హీరోయిన్‌గా తీసుకోవద్దని తన నిర్మాతలకు చెప్పాననీ, మీరు కూడా ఆమెతో కలిసి చెయ్యొద్దని చెప్పారు అక్కినేని. దానికి ఎన్టీఆర్‌ ‘మీరు చేయకపోతే నేను మాత్రం ఎందుకు చేస్తాను’ అన్నారు. తను చేసే సినిమాల నిర్మాతలకు తాము జమునను బ్యాన్‌ చేసిన విషయాన్ని చెప్పారు ఎన్టీఆర్‌. ఇండస్ట్రీలో టాప్‌ హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తమ సినిమాల్లో జమున ఉండకుండా చూసుకున్నారు. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. కన్నడలో బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘మానె తుంబిద హెన్ను’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తీసుకొని తెలుగులో రీమేక్‌ చెయ్యడానికి విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ కన్నడ సినిమా అక్కడ ఫ్లాప్‌. దానిలోని మెయిన్‌ థీమ్‌ని తీసుకొని డి.వి.నరసరాజు సహకారంతో ఒక కొత్త కథని సిద్ధం చేసుకున్నారు చక్రపాణి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన సావిత్రిని ఓకే చేశారు. ఎఎన్నార్‌ సరసన జమునను తీసుకోవాలనుకున్నారు. దానికి ఎఎన్నార్‌ అభ్యంతరం చెప్పారు. తాను, ఎన్టీఆర్‌.. జమునతో సినిమాలు చేయడం లేదని చెప్పారు. అప్పటివరకు ఈ విషయం తెలియని చక్రపాణి షాక్‌ అయ్యారు. సరోజ పాత్రకు జమున అయితేనే బాగుంటుందని భావించిన చక్రపాణి విషయాన్ని దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడాయన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, జమునలను పిలిపించారు. ‘మూడు సంవత్సరాలుగా జమునను మీరు బ్యాన్‌ చేశారని తెలిసింది. అంటే.. ఇండస్ట్రీని శాసించాలనుకుంటున్నారా’ అని సీరియస్‌ అయ్యారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. ఇకపై జమునతో సినిమాలు చెయ్యాలని ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లకు నచ్చజెప్పారు. అలా వారి మధ్య వివాదం సమసిపోయింది. జమున జీవించి ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనను బ్యాన్‌ చేసిన విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తనను బ్యాన్‌ చెయ్యడం వల్ల మూడు సంవత్సరాలు వారితో కలిసి సినిమాలు చేయని మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే ఈ వివాదానికి సూత్రధారి ఎఎన్నారేనని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ అందర్నీ గౌరవించేవారని చెప్పారు. ఒక విధంగా ఆయన అమాయకుడని, ఎఎన్నార్‌ చెప్పిన మాటలు విని ఆయన అలా ప్రవర్తించారు తప్ప నిజానికి ఆయన దేవుడులాంటి మనిషి అన్నారు. ఆ సందర్భంలోనే మరో విషయాన్ని కూడా జమున ప్రస్తావించారు. తన జీవితంలో తన భర్తకి, ఎన్‌.టి.రామారావుకు తప్ప ఎంత గొప్పవారైనా మరొకరికి పాదాభివందనం చేయలేదని స్పష్టం చేశారు.