మెగాస్టార్‌ చిరంజీవితో అత్యధిక సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్‌!

(ఆగస్ట్‌ 21 నటి రాధిక పుట్టినరోజు సందర్భంగా..) హీరోయిన్‌ అంటే మంచి కలర్‌ ఉండాలి, అందంగా ఉండాలి. అన్నింటినీ మించి అభినయం బాగుండాలి. అయితే కొందరు నటీమణులు కలర్‌ కాకపోయినా తమ ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటి వారిలో రాధిక కూడా ఒకరు. చలాకీతనంతోపాటు చిలిపితనం కూడా కనబరిచే రాధిక తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి 1980వ దశకంలో వచ్చిన హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో చిరంజీవితో 20కి పైగా సినిమాల్లో నటించారు, ఆడి పాడారు. చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత దక్కించుకున్నారు రాధిక. 1978లో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధిక.. ఇప్పటికీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రంగస్థలంపైన, సినిమాల్లోనూ హాస్యనటుడిగా, విలన్‌గా తనదైన ముద్ర వేసిన నటుడు ఎం.ఆర్‌.రాధ కుమార్తె రాధిక. ఈమెకు చెల్లెలు నిరోషా, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిళక్కే పోగుమ్‌ రైల్‌’ చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమయ్యారు రాధిక. ఆమె మొదటి హీరో తెలుగు నటుడు సుధాకర్‌. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సుధాకర్‌తో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. చిరంజీ హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాధిక. ఆ సమయంలో టాలీవుడ్‌లో ఉన్న అందరు హీరోల సరసన నటించారు. చిరంజీవితో కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్‌ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క.. ఇలా 20కి పైగా సినిమాల్లో నటించారు రాధిక. రెగ్యులర్‌ యాక్షన్‌ మూవీసే కాకుండా అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం వంటి సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 2000లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వంశోద్ధారకుడు.. రాధిక తెలుగులో నటించిన చివరి సినిమా. తమిళ్‌, మలయాళంలో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందించిన రాజా ది గ్రేట్‌ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు రాధిక. నటిగానే కాకుండా కొన్ని సినిమాలు నిర్మించారు రాధిక. సినిమాలకే పరిమితం కాకుండా టీవీ రంగంలోకి కూడా ప్రవేశించి రాడాన్‌ మీడియా వర్క్స్‌లో తమిళ్‌, తెలుగు భాషల్లో అనేక టీవీ సీరియల్స్‌ నిర్మిస్తున్నారు. చాలా రకాల షోలు నిర్వహిస్తున్నారు

ఎన్టీఆర్‌తో నేను అలా బిహేవ్‌ చెయ్యకుండా ఉండాల్సింది : డిస్కో శాంతి

నటరత్న ఎన్‌.టి.రామారావు క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సెట్‌లో ఉన్నప్పుడు తోటి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంతో గౌరవిస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా దానికి సరైన పరిష్కారాన్ని తక్షణమే ఆలోచిస్తారు. అలాంటి ఓ అనుభవం నటి డిస్కో శాంతికి జరిగింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1991లో ఆయన నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో డిస్కోశాంతి కూడా నటించారు. అప్పటికే ఆమె 100 సినిమాల్లో నటించినప్పటికీ ఎన్టీఆర్‌ను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఆరోజు ఉదయం 6 గంటలకు సెట్‌కి వచ్చారు డిస్కో శాంతి. అప్పటికే ఒక సీన్‌ చేసి కూర్చున్నారు ఎన్టీఆర్‌. సినిమాల్లో రాముడుగా, కృష్ణుడుగా ఎన్నో దైవిక పాత్రలు పోషించిన ఆయన్ని చూడగానే ఆమెకు ఒక దైవాన్ని చూస్తున్న భావన కలిగింది. వెంటనే కాళ్ళకు నమస్కారం చేశారు. వెళ్లి మేకప్‌ చేసుకొని రమ్మన్ని చెప్పారు ఎన్టీఆర్‌.  మేకప్‌ రూమ్‌కి వెళ్ళిన శాంతి కోసం ఒక పాత చీరని డ్రెస్‌గా మోడిఫై చేసి తెచ్చాడు కాస్ట్యూమర్‌. దాన్ని చూడగానే ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. తను ఒక మహానటుడి సినిమాలో నటిస్తున్నానని, పైగా ఆ సినిమాకి ఆయనే నిర్మాత అనే విషయం కూడా మర్చిపోయి ఆ డ్రెస్‌ను కాస్ట్యూమర్‌ మీదకు విసిరేశారు. ఆ తర్వాత అరగంటకు శాంతి టిఫిన్‌ చేస్తున్న సమయంలో కాస్ట్యూమర్‌ చాలా చీరలు తీసుకొని వచ్చాడు. ‘వీటిలో మీకు నచ్చినవి సెలెక్ట్‌ చేసుకోమని అయ్యగారు చెప్పారు’ అని చూపించాడు. వాటిని చూసిన శాంతి షాక్‌ అయ్యారు. ఇంత వేగంగా స్పందించేవారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సెట్‌లోకి భయం భయంగా వెళ్లారు. కానీ, జరిగిన దాని గురించి ఆయన తనను ఒక్క మాట కూడా అడగకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత గొప్ప మనిషిని బాధ పెట్టానని తనని తాను తిట్టుకున్నారు శాంతి. తాను అలా బిహేవ్ చెయ్యకుండా ఉండాల్సిందని, ఆ సమయంలో తను చేసిన పనికి చాలా సిగ్గుపడ్డానని చెబుతారు శాంతి. 

ఆ హీరో రిజెక్ట్‌ చేసిన నాలుగు సినిమాలూ బ్లాక్‌బసర్స్‌ అయ్యాయి!

సినిమా ఇండస్ట్రీలో హీరోలైనా, దర్శకనిర్మాతలైనా తాము చేసే సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే కృషి చేస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అంచనాలు తారుమారు అవుతాయి. ఎన్నో హోప్స్‌ పెట్టుకొని చేసిన సినిమా నిరాశను మిగులుస్తుంది. కొన్నిసార్లు ఆ కథలు తమకు వర్కవుట్‌ అవ్వవు అనే ఉద్దేశంతో హీరోలు రిజెక్ట్‌ చేస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని సూపర్‌హిట్‌ అవుతాయి, మరికొన్ని వారి జడ్జిమెంట్‌నే నిజం చేస్తూ ఫ్లాప్‌ అవుతాయి. కానీ, ఒక టాలీవుడ్‌ హీరో రిజెక్ట్‌ చేసిన నాలుగు సినిమాలను ఆ తర్వాత ఇతర హీరోలు చేసి బ్లాక్‌బస్టర్స్‌ సాధించిన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ హీరోకైనా ఒక టేస్ట్‌ ఉంటుంది. తన మనసుకు దగ్గరగా ఉన్న కథలతో సినిమాలు చేసేందుకే ఇష్టపడతారు. కొన్నిసార్లు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, తన ఇమేజ్‌కి తగిన కథలను ఎంపిక చేసుకుంటారు. కానీ, హీరో రాజశేఖర్‌ మాత్రం అవేవీ ఆలోచించకుండా కొన్ని కథలను రిజెక్ట్‌ చేశారు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ‘చంటి’ గురించి. పి.వాసు దర్శకత్వంలో ప్రభు హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘చిన్నతంబి’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో మొదట రాజశేఖర్‌తో చెయ్యాలనుకున్నారు నిర్మాత కె.ఎస్‌.రామారావు. ఆ సినిమాపై రాజశేఖర్‌ ఆసక్తి చూపించలేదు. దానికి తగ్గట్టుగానే ‘ఆ క్యారెక్టర్‌ నీకు సెట్‌ అవ్వదు అనుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ వాసు కూడా అనడంతో ఆ సినిమాను వదులుకున్నారు. ‘చంటి’ పేరుతో వెంకటేష్‌ చేసిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్‌ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక కథ పట్టుకొని కొందరు హీరోల చుట్టూ తిరిగారు డైరెక్టర్‌ శంకర్‌. ఆ సమయంలోనే హీరో రాజశేఖర్‌కి కూడా కథ చెప్పారు. కానీ, అతనికి నచ్చకపోవడం వల్ల రిజెక్ట్‌ చేశారు. అప్పుడు అర్జున్‌ ఆ కథను ఓకే చేశారు. అదే ‘జెంటిల్‌మేన్‌’ సినిమా. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఠాగూర్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేసిందో మనం చూశాం. ఈ సినిమా కూడా మొదట రాజశేఖర్‌ దగ్గరికే వెళ్లింది. మరి ఆ టైమ్‌లో డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వక రిజెక్ట్‌ చేశారో లేక తెలుగులో ఈ సినిమా వర్కవుట్‌ అవ్వదు అనే జడ్జిమెంట్‌తో వద్దనుకున్నారో తెలీదుగానీ ‘ఠాగూర్‌’ చిత్రాన్ని కూడా చేజార్చుకున్నారు రాజశేఖర్‌. విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ‘సామి’ తమిళ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన మూడు నెలలకు సూర్య హీరోగా నటించిన ‘కాకా కాక’ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండూ పోలీస్‌ నేపథ్యంలో సాగే కథలే. ‘సామి’ చిత్రాన్ని తెలుగులో చేసే అవకాశం రాజశేఖర్‌కి వచ్చింది. అంతకుముందు ‘అంకుశం’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా ఓ లెవల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చి ఒక కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన రాజశేఖర్‌ అయితే ‘సామి’ చిత్రానికి న్యాయం జరుగుతుందని భావించిన దర్శకుడు జయంత్‌, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఈ రీమేక్‌ గురించి రాజశేఖర్‌కి చెప్పారు. కానీ, ఈ సినిమాని కూడా అతను రిజెక్ట్‌ చేశారు. అప్పుడు నందమూరి బాలకృష్ణకు ఈ కథ చెప్పారు. ఆయన ఓకే చెప్పడం, వెంటనే సినిమా ప్రారంభం కావడం జరిగిపోయాయి. అదే ‘లక్ష్మీనరసింహా’. తెలుగులో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తను ఈ సినిమాల విషయంలో తప్పుగా ఆలోచించానని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రాజశేఖర్‌. 

బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌గా.. రజినీకాంత్‌ 50 ఏళ్ళ సినీ ప్రస్థానం ఎలా సాగిందంటే..!

ఒక సాధారణ బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి ఇండియాలోనే చెప్పుకోదగ్గ నటుడిగా ఎదిగారు రజినీకాంత్‌. తలైవా అనీ, సూపర్‌స్టార్‌ అనీ రజినీని అభిమానులు పిలుచుకుంటారు. రజినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరోయిజానికి, స్టైల్‌కి కొత్త నిర్వచనం చెప్పారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకొని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. నటన కంటే తన లుక్‌తో, రకరకాల మేనరిజమ్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడెయ్యడం రజినీకి వెన్నతో పెట్టిన విద్య. 1975 ఆగస్ట్‌ 15న విడుదలైన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్‌ జూబ్లీని జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలాంటి విజయాలు ఆయన సొంతం చేసుకున్నారు వంటి విషయాలు తెలుసుకుందాం. 1950 డిసెంబర్‌ 12న అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు రజినీకాంత్‌. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. రజినీకాంత్‌ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. వీరు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్‌ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజినీకాంత్‌ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్‌ బాలూభాయి. 1956లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌లో స్థిరపడిరది. 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు రజినీకాంత్‌.  రజినీకాంత్‌ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవారు. క్రికెట్‌, ఫుట్‌ బాల్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవారు. ఇదే సమయంలో రజినీకాంత్‌ సోదరుడు ఆయన్ని రామకృష్ణ మఠంలో చేర్పించారు. అక్కడ ఆయనకు వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నతనంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు నాటకాలలో కూడా పాల్గొనేవారు. అలా నటన పట్ల క్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత రజనీకాంత్‌ ఎన్నో పనులు చేశారు. కూలీగా కూడా పనిచేశారు. తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌లో బస్‌ కండక్టర్‌గా ఉద్యోగం లభించింది. నటనపై తనకున్న ఆసక్తితో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ, అతని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌తోపాటు మరికొందరు స్నేహితులు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే దర్శకుడు కె.బాలచందర్‌ అతని ప్రతిభను గుర్తించారు. అప్పటికే తమిళ్‌లో శివాజీ గణేశన్‌ హీరోగా ఉండడంతో శివాజీ పేరును రజినీకాంత్‌గా మార్చారు. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలోని ఓ పాత్ర పేరును రజినీకి పెట్టారు. ఆ తర్వాత బాలచందర్‌ సలహాతో తమిళ్‌ నేర్చుకున్నారు రజినీ.  కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్‌ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు రజినీకాంత్‌. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజినీకాంత్‌ చిన్నపాత్ర చేశారు. ఈ సినిమాలోని రజినీకాంత్‌ నటనను అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత 1976లో పుటన్న కణగల్‌ దర్శకత్వంలో వచ్చిన కథాసంగమ చిత్రంలో రౌడీగా నటించారు. అదే సంవత్సరం బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా అంతులేని కథ రజినీకి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. అలా వరసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. సిగరెట్‌ని గాలిలోకి ఎగరేసి కాల్చే స్టైల్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 1977లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన అవర్‌గళ్‌, భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయదినిలే చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషించారు. తెలుగులో రజినీకాంత్‌ హీరోగా నటించిన మొదటి సినిమా చిలకమ్మ చెప్పింది.  రజినీకాంత్‌ ఎక్కువగా తమిళ్‌ సినిమాలే చేసినప్పటికీ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా తెలుగులో రజినీకి వీరాభిమానులున్నారు. సూపర్‌స్టార్‌గా ఒక రేంజ్‌ సంపాదించుకున్న తర్వాత తమిళ్‌లో అయినా, తెలుగులో అయినా రజినీకాంత్‌ సినిమా రిలీజ్‌ అవుతోందంటే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇండియాలోనే కాకుండా తన సినిమాలతో జపాన్‌ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు రజినీ. జపాన్‌లో ఆయనకు లెక్కకు మించిన అభిమానులున్నారు. తన ఇమేజ్‌కి తగిన కథలు ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. ముత్తు, బాషా, నరసింహ, చంద్రముఖి, రోబో వంటి సినిమాలు రజినీ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌గా నిలిచాయి. 74 ఏళ్ళ వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు రజినీకాంత్‌. 50 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళకుండా మంచి మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు రజినీ. అతనిలో అభిమానులకు నచ్చేది అతని సింప్లిసిటీ. సాటి మనిషిని గౌరవించడంలో రజినీ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఇండియాలోనే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న వారిలో మొదటివారిగా నిలిచారు రజనీకాంత్‌. యంగ్‌ డైరెక్టర్లు రజినీకాంత్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కలలు కంటూ ఉంటారు. ఈమధ్యకాలంలో రజినీ చేసిన సినిమాలన్నీ యంగ్‌ డైరెక్టర్స్‌ రూపొందించినవే కావడం విశేషం. రజినీకాంత్‌ గోల్డెన్‌ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ‘కూలీ’ చిత్రం విడుదలై మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న రాజసులోచన జీవిత విశేషాలివే!

(నటి రాజసులోచన జయంతి సందర్భంగా..) అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన హీరోయిన్లు పాతతరంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో రాజసులోచనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె నటనలోనే కాదు, సంగీతం, నృత్యం, కార్‌ డ్రైవింగ్‌, బోట్‌ రైడింగ్‌.. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాజసులోచన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1935 ఆగస్ట్‌ 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు జన్మించారు రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన. స్కూల్‌లో చేర్పించే సమయంలో పొరపాటున రాజసులోచన అని రిజిస్టర్‌లో రాశారు. ఇక ఆమెకు ఆ పేరే ఖరారైంది. భక్తవత్సలంనాయుడు మద్రాస్‌లో రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రాజసులోచనకు నృత్యం మీద, సంగీతం మీద ఆసక్తి కలగడానికి కారణం.. ఆమె మేనమామ. ఆయన కళాభిమాని కావడంతో ఒక సంగీత మండలిని స్థాపించి సంగీత కచ్చేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. ఆ కార్యక్రమాలు చూసి ఇంటికి వచ్చిన తర్వాత వారిలాగే పాటలు పాడేవారు, డాన్స్‌ చేసేవారు రాజసులోచన. డాన్స్‌పై ఆమెకు ఉన్న ఇష్టాన్ని గమనించి ఏడేళ్ళ వయసులో నృత్యం నేర్పించారు భక్తవత్సలం. 13వ ఏట రాజసులోచన తొలిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు.  అప్పుడప్పుడు ప్రదర్శనలు ఇస్తూ.. ఇంటి దగ్గర తన తోటి ఆడపిల్లలకు డాన్స్‌ నేర్పేవారు. అలా డాన్స్‌ నేర్పేందుకు ఒక యువతి ఇంటికి వెళ్లేవారు రాజసులోచన. ఆ సమయంలోనే పరమశివం అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. అతను చెప్పే తియ్యని మాటలకు పరవశించిపోయిన రాజసులోచన అతని ప్రేమలో పడిపోయింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ, కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూతురి ఇష్ట ప్రకారమే 1951 సెప్టెంబర్‌ 11న పరమశివంతో వివాహం జరిపించారు. అదే సంవత్సరం గుణసాగరి అనే చిత్రంలో ఒక నాట్య సన్నివేశంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కన్నతల్లి చిత్రంలోనూ నృత్యతారగానే కనిపించారు. పెళ్ళయిన సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు.  నటిగా నిలదొక్కుకోవడానికి కొన్ని సినిమాల్లో వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ చేశారు రాజసులోచన. ఎన్టీఆర్‌ హీరో ఘంటసాల నిర్మించిన సొంతవూరు చిత్రంలో తొలిసారి హీరోయిన్‌ నటించారు. ఆ తర్వాత పలు భాషల్లో అమెకు అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయారు. కెరీర్‌ పరంగా ఆనందంగానే ఉన్నప్పటికీ వైవాహిక జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. భర్త పరమశివం వేధింపులు రోజురోజుకీ పెరిగిపోయాయి. అవి భరించలేక భర్తకు విడాకులు ఇచ్చేశారు. భర్త నుంచి విడిపోవడం, కెరీర్‌ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఎంతో వేదనకు గురయ్యారు రాజసులోచన. ఆ సమయంలోనే దర్శకుడు సి.ఎస్‌.రావు ఆమెకు ఓదార్పుగా నిలిచారు. అలా ఆయనకు దగ్గరయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో నటించారు. పరిశ్రమలో వీరిద్దరి గురించి రకరకాల పుకార్లు మొదలయ్యాయి. దానికి సమాధానంగా రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సి.ఎస్‌.రావు. ఆయనకు ఇది వరకే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు రాజసులోచన. 1963లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 1966 జూలై 27న వీరికి కవల పిల్లలు పుట్టారు. ఆరోజుల్లో కవల పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదు. అందుకే ఈ వార్త అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శోభన్‌బాబు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె చిన్నప్పటి పాత్రలను రాజసులోచన కూతుళ్ళు పోషించారు.  రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పెళ్ళయిన తొలి రోజుల్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న సి.ఎస్‌.రావు, రాజసులోచన దంపతులు పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వారిలో సఖ్యత లోపించింది. అభిప్రాయ భేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆమె జీవితంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు ఆమెకు కలిసి రాలేదు. రాజసులోచన పెద్ద కుమార్తె గురుమూర్తి దేవి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె చెన్నయ్‌లో ఉంటున్నారు. కుమారుడు శ్యామ్‌ కూడా విదేశాల్లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు భీమ్‌సింగ్‌ కుమార్తెను వివాహం చేసుకున్నారు శ్యామ్‌. 2004 తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించిన రాజసులోచన చాలా కాలం ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. చివరికి 2013 మార్చి 5 తెల్లవారుజామున తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు రాజసులోచన. 

ఏ హీరోయిన్‌ క్రాస్‌ చెయ్యలేని రికార్డు.. అతిలోక సుందరి శ్రీదేవి సొంతం!

(ఆగస్ట్‌ 13 శ్రీదేవి జయంతి సందర్భంగా..) పాతతరంలో ఎంతోమంది కథానాయికలు తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. 1970వ దశకం నుంచి దాదాపు 30 సంవత్సరాలపాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులకు ఆరాధ్యదేవత అనిపించుకున్న హీరోయిన్‌ శ్రీదేవి. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఈ రికార్డును ఇప్పటివరకు మరొకరు క్రాస్‌ చెయ్యలేకపోయారు. స్టార్‌ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి జీవితం గురించి, సినీ జీవితంలో ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.  1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీఅమ్మయ్యంగర్‌ అయ్యప్పన్‌. అయితే స్క్రీన్‌ నేమ్‌గా శ్రీదేవి అని మార్చుకున్నారు. నాలుగేళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో మొదటిసారి నటించారు. బాల నటిగా తొలి హిందీ చిత్రం జూలీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మా బంగారక్క చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు రూపొందించిన పదహారేళ్ళ వయసు చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి అందరు స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ అంచెలంచెలుగా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. అప్పటి స్టార్‌ హీరోలకు మనవరాలిగా, కూతురిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత వారి సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ ఘనత శ్రీదేవికి మాత్రమే సొంతం.  పలు భాషల్లో అందరు స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు శ్రీదేవి. రజనీకాంత్‌, ఎన్టీఆర్‌, ఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి దక్షిణాది స్టార్‌లతో పాటు బాలీవుడ్‌లో అమితాబ్‌, అనిల్‌ కపూర్‌, జితేంద్ర, మిథున్‌ చక్రవర్తి, రిషికపూర్‌, ధర్మేంద్ర వంటి హీరోలకు జోడీగా నటించి సంచలన విజయాలు సాధించారు.  శ్రీదేవి తన సినీ జీవితంలో 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్‌తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో  ఏఎన్నార్‌ తో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణతో కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్‌హాసన్‌ తరువాత, శ్రీదేవి కృష్ణతో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ కూడా  సద్మా, నగీనా, మిస్టర్‌ ఇండియా, చాందినీ, చాల్‌బాజ్‌, లమ్హే, జుదాయి, ఇంగ్లీష్‌-వింగ్లీష్‌, మామ్‌, నిగహైన్‌, ఫరిష్తే, లాడ్లా, రూప్‌ కీ రాణి చోరోన్‌ కా రాజా వంటి అనేక సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక శ్రీదేవి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తన పర్సనల్‌ లైఫ్‌ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవడానికే శ్రీదేవి ప్రయత్నించేవారు. 1996లో బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. వివాహం తర్వాత సినిమాలకు తాత్కాలికంగా దూరంగా ఉన్నారు. వీరికి జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌ సంతానం. 2011లో గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ చిత్రంలో నటించారు. మామ్‌ చిత్రంలోని తన నటనకు ప్రశంసలు అందుకున్నారు శ్రీదేవి. 2018లో దుబాయ్‌లో జరిగిన ఒక వేడుకలో పాల్గొనేందుకు కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు శ్రీదేవి. ఫిబ్రవరి 24న తను బస చేసిన హోటల్‌లో ప్రమాదవశాత్తూ మరణించారు. ఆమె మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిబ్రవరి 28న ముంబైలో జరిగిన శ్రీదేవి అంతిమయాత్రకు దేశం నలుమూలల నుంచి అభిమానులు హాజరయ్యారు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి జయంతి ఆగస్ట్‌ 13ని అభిమానులంతా గుర్తు చేసుకుంటారు, ఆ అతిలోక సుందరికి నివాళులు అర్పిస్తారు. 

ఆ సినిమా చూసి చరణ్‌రాజ్‌ను గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చిన మహిళ!

సినిమా రంగంలో ఎవరి కెరీర్‌ ఎప్పుడు ఎలా టర్న్‌ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కన్నడ చిత్రరంగంలో హీరోగా పలు సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌రాజ్‌.. తెలుగులో ‘ప్రతిఘటన’ చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూసిన విలన్లకు భిన్నంగా చరణ్‌రాజ్‌ కనిపించారు. చరణ్‌రాజ్‌ అసలు పేరు బ్రహ్మానంద. కాలేజీలో చదివే రోజుల్లోనే అతనికి హీరో అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే అతని ఫ్రెండ్స్‌ మాత్రం ఎగతాళి చేసేవారు. ఎప్పటికైనా తాను సినిమా హీరో అవుతానని వారితో ఛాలెంజ్‌ చేసి 1982లో ‘పరాజిత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా తర్వాత దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు 1985లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి పిలుపొచ్చింది. టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ‘ప్రతిఘటన’ చిత్రంలో విలన్‌గా నటించమని అడిగారు. కన్నడలో హీరోగా కొనసాగుతున్న తనకి విలన్‌గా చేయడం ఇష్టం లేక రెండు నెలలపాటు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కొందరు మిత్రుల సలహాతో ఒప్పుకున్నారు. అప్పటివరకు కన్నడలో మీసాలు లేని హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన చరణ్‌రాజ్‌.. ‘ప్రతిఘటన’ కోసం గడ్డం, మీసాలు పెంచాల్సి వచ్చింది. ఈ విషయంలో టి.కృష్ణ ఎంతో కేర్‌ తీసుకొని కాళిదాసు గెటప్‌ని అద్భుతంగా క్రియేట్‌ చేశారు. 1985 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సినిమాలో విజయశాంతికి ఎంత పేరు వచ్చిందో.. విలన్‌గా నటించిన చరణ్‌రాజ్‌కి కూడా అంతే పేరొచ్చింది. అతని నటనకుగాను ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం లభించింది. ‘ప్రతిఘటన’లాంటి సినిమా తన కెరీర్‌లో మరొకటి రాలేదని చెప్తారు చరణ్‌రాజ్‌. ఈ సినిమా చేస్తున్న సమయంలో, రిలీజ్‌ తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి 1991లో ఒక పత్రిక ద్వారా తెలిపారు.  ‘ప్రతిఘటన’ను ఒక సాధారణ చిత్రంగానే భావించాను. సినిమాలో నా క్యారెక్టర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుంది, కొన్ని క్లిష్టమైన సీన్స్‌లో ఎలా నటించాలి అనేవి టి.కృష్ణగారు నాకు చేసి చూపించేవారు. ఆయన చెప్పింది చేసేవాడ్ని తప్ప ఆ క్యారెక్టర్‌ని అంతగా అడాప్ట్‌ చేసుకోలేకపోయాను. విజయశాంతిని రేప్‌ సీన్‌, ‘ఈ దుర్యోధన.. దుశ్శాసన..’ పాట, రాజశేఖర్‌తో ఫైట్‌ చేసి చంపటం.. ఇలా కృష్ణగారు ఆ సీన్స్‌ గురించి చెప్పినప్పుడు అవన్నీ జోక్స్‌లా అనిపించాయి. డైరెక్టర్‌ మనసులోని భావాలు నాకు అర్థం కాలేదు. కానీ, తెరమీద ఆ సీన్స్‌ చూసినపుడు, ప్రేక్షకులు వాటికి రెస్పాండ్‌ అయిన తీరు చూసి నేను షాక్‌ అయ్యాను. అవి చేసింది నేనేనా అని ఆశ్చర్యపోయాను.  ఇక విజయశాంతిగారి గురించి చెప్పాలంటే.. ఆమె నవ్వులో పసితనం, కళ్లల్లో అమాయకత్వం కనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని రేప్‌ చేసే సీన్‌ పర్‌ఫెక్ట్‌గా చెయ్యగలనా అనుకున్నాను. అయితే ఆ సీన్‌ ఓకే అయింది. క్లైమాక్స్‌లో నాకు సన్మానం జరిగే సమయంలో నన్ను అభినందించడానికి వచ్చి నా ఎదురుగా నిలబడితే షాక్‌ అయ్యాను. నేను చూస్తున్నది విజయశాంతినా, రaాన్సీరాణినా లేక భద్రకాళినా అనే ఫీలింగ్‌ కలిగింది. ఆ షాక్‌ నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైమ్‌ పట్టింది. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆమె.. ఆ సీన్‌లో అలా ఎలా మారిపోయింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.  ‘ప్రతిఘటన’ నా కెరీర్‌నే మార్చేసింది. ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కాళి లాంటి క్యారెక్టర్‌ మళ్లీ నాకు రాలేదు. ఒకవేళ వచ్చినా అంత బాగా నాతో చేయించగలరా, నేను అంత ఎఫెక్టివ్‌గా చెయ్యగలనా అనిపిస్తుంది. ఆ సినిమా చేసిన తర్వాత నన్ను అభినందిస్తూ ఎంతో మంది ఉత్తరాలు రాశారు. కాళి తరహా పాత్ర మళ్లీ చెయ్యాలని కోరారు. ఈ అభినందనలు అన్నీ ఒక ఎత్తయితే.. అదే సమయంలో నాకు మరో ఉత్తరం వచ్చింది. అయితే అది నాకు రాలేదు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ఆఫీస్‌కి వచ్చింది. ఆ ఉత్తరాన్ని అట్లూరి రామారావుగారు నాకు చూపించారు. ఆ ఉత్తరాన్ని ఒక మహిళ రాసింది. అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ‘చరణ్‌రాజ్‌ ఒక అమ్మాయిని రేప్‌ చేశాడు. అసలు అంత దారుణానికి ఎలా పాల్పడతాడు? వాడు మనిషేనా? అతన్ని మా దగ్గరికి పంపించండి. మా లేడీస్‌ అందరం కలిసి అతన్నే భయంకరంగా రేప్‌ చేస్తాం’ అని ఆ ఉత్తరంలో ఉంది. అది చదివిన తర్వాత నిజంగానే నా మీద దండయాత్రకు వస్తారేమో అని భయం వేసింది. ఎందుకంటే నాకు స్వతహాగా లేడీస్‌ అంటే కాస్త జంకు, ఒక విధమైన భయం. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రలు సినిమాల్లో చాలా చేశాను. ‘ఇంత సాఫ్ట్‌గా ఉండే మీరు అంతటి క్రూరమైన విలన్‌గా ఎలా చెయ్యగలుగుతున్నారు’ అని నా భార్య కూడా చాలా సార్లు అడిగింది’ అంటూ తన కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలిపారు చరణ్‌రాజ్‌. 

తను సినిమా నటినని కోర్టులో ప్రూవ్‌ చేసుకున్న వాణిశ్రీ.. ఎందుకో తెలుసా? 

(ఆగస్ట్‌ 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రిది ఒక శకం అని చెప్పొచ్చు. సావిత్రిలాంటి నటి మరొకరు లేరు, రారు అనుకుంటున్న సమయంలో ఓ వెలుగులా చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు వాణిశ్రీ. సావిత్రి పోలికలతోనే వాణిశ్రీ ఉందని అందరూ అనుకున్నారు. సావిత్రి మాదిరిగానే మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కథానాయికగా ఎదిగారు. పొగరు గల ధనవంతురాలిగా, ఆత్మాభిమానం కలిగిన మధ్య తరగతి యువతిగా, అమాయకురాలిగా, అణకువ కలిగిన భార్యగా, చిలిపి పనులు చేస్తూ నవ్వించే అమ్మాయిగా.. ఇలా ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో మెప్పించగల ప్రతిభాశాలి వాణిశ్రీ.  1948 ఆగస్ట్‌ 3న నెల్లూరులో రాఘవయ్య, వెంకమ్మ దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. చిన్నతనంలోనే టి.బి.తో తండ్రి చనిపోయారు. ఒక్క నెలలోనే వారి కుటుంబంలోని ముగ్గురు అదే వ్యాధితో మరణించారు. వెంకమ్మ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగించారు. వాణిశ్రీ చదువుకుంటూనే నాట్యం నేర్చుకున్నారు. స్కూల్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో వాణిశ్రీ డాన్స్‌ చూసిన కన్నడ డైరెక్టర్‌ హునుసూరు కృష్ణమూర్తి.. తను చేస్తున్న వీరసంకల్ప చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని నటనకు, చేసిన డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు వాణిశ్రీ. ముఖ్యంగా చిల్లకొట్టు చిట్టెమ్మ, రక్తకన్నీరు, రాగరాగిణి, దొంగ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. వీరసంకల్ప రషెస్‌ చూసిన బి.విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు.  ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నానుమ్‌ ఒరుపెణ్‌ చిత్రాన్ని తన సొంత బేనర్‌ శ్రీవాణి ఫిలింస్‌ పతాకంపై నాదీ ఆడజన్మే పేరుతో నిర్మించాలనుకున్నారు ఎస్‌.వి.రంగారావు. అందులోని ప్రధాన పాత్ర కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే తమ బేనర్‌ పేరు కూడా కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు ఎస్వీఆర్‌. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జమునకు దక్కింది. బాలీవుడ్‌ నటి వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకున్నారు. నటనలోని మెళకువలు, డైలాగులు ఎలా చెప్పాలి వంటి విషయాలు ఎస్వీఆర్‌ నేర్పించారు. 1967లో వచ్చిన మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పటివరకు జానపద చిత్రాలు రాజ్యమేలాయి. వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జానపదాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ.  ఇలా ఉండగా, 1969లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మీయులు చిత్రంలో తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించారు వాణిశ్రీ. ఈ సినిమాలో మొదట అక్కినేనికి చెల్లెలుగా నటించమని అడిగారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. కానీ, తను హీరోయిన్‌గా అయితేనే చేస్తానని పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లోనే వచ్చిన భలే రంగడు కూడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్‌తో నటించిన తొలి సినిమా నిండు హృదయాలు. హాస్యనటుడు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రంలో మొల్ల పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు వాణిశ్రీ. ఈ సినిమాకి నంది అవార్డు లభించింది.  సాధారణంగా హీరోలకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ, వాణిశ్రీకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చీరకట్టుకునే విధానం, హెయిర్‌ స్టైల్‌, జ్యూయలరీ.. మహిళలను విపరీతంగా ఆకర్షించేవి. ఈ విషయాల్లో వాణిశ్రీ ఎన్నో ప్రయోగాలు చేశారు. తన గెటప్‌ విషయంలో ఆమెకు పూర్తి అవగాహన ఉండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమె ఏది చేస్తే అదే బెస్ట్‌ అనేవారు. ఒక శిల్పంలా అందంగా కనిపించేందుకు వాణిశ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సరైన డైట్‌ పాటిస్తూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆరోజుల్లో నవలా పఠనం ఎక్కువగా ఉండేది. ఆయా నవలల్లో కథానాయిక ఎలా ఉందని వర్ణిస్తారో దానికి నిజమైన రూపంగా వాణిశ్రీ కనిపించేవారు. అందుకే లెక్కకు మించిన నవలా చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాణిశ్రీ తర్వాత నవలా నాయిక అని పేరు తెచ్చుకున్న నటి మరొకరు లేరు.  1970 దశకం వచ్చేసరికి వాణిశ్రీ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌,  శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. అలా వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు కోడలు, ప్రేమనగర్‌, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, ఎదురీత, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్తకన్నప్ప, జీవనతరంగాలు, కృష్ణవేణి, వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో 80 సినిమాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే కన్నడలో రాజకుమార్‌ వంటి హీరోల సరసన 30 సినిమాల్లో నటించారు. అయితే మలయాళంలో మాత్రం కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 1981లో వచ్చిన దేవుడు మావయ్య హీరోయిన్‌గా ఆమె చివరి సినిమా. ఆమె కెరీర్‌లో మేకప్‌ లేకుండా నటించిన సినిమాలు రెండు. బాపు దర్శకత్వంలో వచ్చిన గోరంతదీపం, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో రూపొందిన అనుగ్రహం. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తను చేసిన సినిమాల్లో కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తనకు నచ్చిన సినిమాలని చెబుతారు వాణిశ్రీ.  హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వాణిశ్రీ సినిమాలు విరమించడానికి కారణమైంది. అప్పటివరకు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌.. కమర్షియల్‌ హీరోగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను కె.బాపయ్య డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని కసిగా ఉంది.. కసికసిగా ఉంది.., కృష్ణా ముకుందా మురారి.. అనే పాటల చిత్రీకరణ వాణిశ్రీని ఎంతో బాధపెట్టాయి. అప్పటివరకు ఏ సినిమాలోనూ అలాంటి పాటలు వాణిశ్రీ చేయలేదు. ఇలాంటి డాన్సులు చేయడం వల్ల ప్రేక్షకుల్లో తనపై ఉన్న గౌరవం పోతుందని భావించిన వాణిశ్రీ.. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి ఉండడం వల్ల అవి పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా దేవుడు మావయ్య చిత్రంతో హీరోయిన్‌గానే రిటైర్‌ అయ్యారు వాణిశ్రీ.  సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న మరుసటి సంవత్సరం 1978లో చెంగల్పట్టుకు చెందిన డాక్టర్‌ కరుణాకరన్‌ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వాణిశ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ తన అక్క భర్త చూసుకునేవారు. అలా చాలా ఆస్తులు ఆమె బావ పేరు మీదే ఉన్నాయి. పెళ్ళి తర్వాత తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని వాణిశ్రీ కోరారు. దానికి ఆమె అక్క, బావ ఇద్దరూ ఒప్పుకోకవడంతో వాణిశ్రీ భర్త కోర్టుకెక్కారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ కేసు కోర్టులోనే ఉంది. ఒక దశలో తన పేరు వాణిశ్రీ అనీ, ఆ ఆస్తులన్నీ సినిమాల్లో నటించడం ద్వారానే సంపాదించానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో నటించడం ద్వారా నిర్మాతలు డబ్బు ఇచ్చినట్టు అగ్రిమెంట్లు ఉంటే కేసు గెలుస్తామని వాణిశ్రీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ ప్రూఫ్‌ కోసం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అలా నటించిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడమే కాకుండా వాణిశ్రీ పోషించిన అత్త క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బొబ్బిలిరాజా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, పెద్దింటల్లుడు, స్వాతిచినుకులు, రాజేశ్వరీ కళ్యాణం వంటి వైవిధ్యమైన సినిమాల్లో వాణిశ్రీ నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ 60 సినిమాలు చేయడం విశేషం.  సినిమాలు వద్దనుకొని 1981లోనే రిటైర్‌ అయిన వాణిశ్రీ.. తాను సినిమాల్లో నటించడం ద్వారా ఆస్తులు సంపాదించానని నిరూపించుకోవడం కోసమే తన సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్‌లో, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయికి తగిన సినిమాలే చేశారు తప్ప విమర్శలకు తావిచ్చే క్యారెక్టర్స్‌ వాణిశ్రీ ఎప్పుడూ చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడం ద్వారా కోర్టు కోరిన అగ్రిమెంట్లు సమర్పించి కేసు గెలిచారు. దీంతో ఆస్తులు తిరిగి అప్పగించారు వాణిశ్రీ అక్క, బావ. అయితే ఆ తర్వాత వారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యం పాలు కావడంతో వారిని ఆదుకున్నారు వాణిశ్రీ. ఇదిలా ఉంటే.. 2020లో వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్‌గా పనిచేస్తున్న కుమారుడు అభినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వాణిశ్రీ చివరిగా నటించిన సినిమా భద్రాద్రి రాముడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  

నటుడిగా సక్సెస్‌ అయిన శరత్‌బాబు.. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్‌ అవ్వడానికి కారణాలు ఇవే!

(జూలై 31 నటుడు శరత్‌బాబు జయంతి సందర్భంగా..) అందం, అభినయం, మంచి ఎత్తు.. హీరోగా రాణించడానికి ఉండాల్సిన లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన హీరోగా సక్సెస్‌ అవుతారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత అది సాధ్యం కాకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లినవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కొందరు మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా స్థిరపడిపోయారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు శరత్‌బాబు గురించి చెప్పుకోవచ్చు. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనికి ఉన్నప్పటికీ సక్సెస్‌ఫుల్‌ హీరో అవ్వలేక చివరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు.  1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించారు శరత్‌బాబు. అతని అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. అయితే అతన్ని సత్యంబాబు అని పిలిచేవారు. ఆరడుగుల ఎత్తు ఉండే శరత్‌బాబుకి పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనే కోరిక ఉండేది. ఒకసారి పోలీస్‌ సెలెక్షన్స్‌కి కూడా వెళ్లారు. అయితే అతనికి కంటి సమస్య ఉన్న కారణంగా సెలెక్ట్‌ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. మంచి అందగాడైన శరత్‌బాబును అందరూ హీరోలా ఉన్నావు అనేవారు. సినిమాల్లో అయితే రాణిస్తావు అని కూడా చెప్పేవారు. శరత్‌బాబు తల్లికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది. అలా శరత్‌కి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. అదే సమయంలో ‘రామరాజ్యం’ చిత్రంలో కొత్తవారిని తీసుకుంటున్నారని తెలిసి.. ఆ సినిమా ఆఫీస్‌కి వెళ్లి డైరెక్టర్‌ బాబూరావును కలిశారు శరత్‌. హీరోలా ఉన్న అతన్ని చూసి సినిమాలో ఒక పాత్ర కోసం సెలెక్ట్‌ చేశారు.  శరత్‌బాబు చేసిన రెండో సినిమా ‘కన్నెవయసు’. రెండు సినిమాలు చేసినప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. 1970వ దశకం వచ్చేసరికి రమాప్రభ టాప్‌ కమెడియన్‌గా లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నారు. అవకాశాల కోసం పరిశ్రమకు కొత్తగా వచ్చినవారికి తన ఇంటిలో వసతి కల్పించేవారు రమాప్రభ. అలా శరత్‌బాబు కూడా రమాప్రభ ఇంటిలో చేరారు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. శరత్‌బాబు కంటే రమాప్రభ నాలుగేళ్ళు పెద్ద వారు. ఎన్నో సినిమాల్లో శరత్‌బాబుకి వేషాలు ఇప్పించారు రమాప్రభ. అతని ఎదుగుదలకు రమాప్రభే ప్రధాన కారణం అయ్యారు.  కె.బాలచందర్‌, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుల సినిమాల్లో నటించడం ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శరత్‌బాబు. మరోచరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, తొలికోడి కూసింది వంటి సినిమాలో శరత్‌బాబుకి మంచి పాత్రలు ఇచ్చి బాలచందర్‌ ప్రోత్సహించారు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి సినిమాల్లో అతనికి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చారు సింగీతం శ్రీనివాసరావు. ఈ సినిమాలు శరత్‌బాబు కెరీర్‌కి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ సాగరసంగమం, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చారు. శరత్‌బాబు నటించిన సినిమాల్లో సీతాకోక చిలక, సితార, స్వాతి, అన్వేషణ, సంసారం ఒక చదరంగం, స్రవంతి, సంసారం ఓ సంగీతం వంటి సినిమాల్లో తను చేసిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించారు శరత్‌బాబు.  సీతాకోక చిలక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లోని తన నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు శరత్‌బాబు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1973లో ప్రారంభమైన శరత్‌బాబు, రమాప్రభల సహజీవనం 1987తో ముగిసింది. తమది పెళ్లి కాదని, అవకాశవాద వివాహం అని రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన ఆస్తి కోసమే శరత్‌బాబు తన పంచన చేరాడని, తన ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్నాడని ఆమె ఆరోపించారు. అయితే రమాప్రభ ఆరోపణలను శరత్‌బాబు ఖండిరచారు. బలవంతంగా ఆస్తులు లాక్కోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. రమాప్రభ నుంచి విడిపోయిన తర్వాత 1990లో తమిళ నటుడు నంబియార్‌ కుమార్తె స్నేహ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. 26 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరారు శరత్‌బాబు. నెలరోజుల పాటు ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించారు. చివరికి మే 22న 71 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు శరత్‌బాబు. 

‘అల్లు అంటే హాస్యపు జల్లు’.. 50 ఏళ్లు ఆ జల్లులో సేద తీరిన తెలుగు ప్రేక్షకులు!

(జూలై 31 అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా..) ఎంతో మంది హాస్యనటులు ఉన్నా.. అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు. తన కెరీర్‌లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు అల్లు. ఆయన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్నీ ఆయన ప్రత్యేకతలే. అందుకే ‘అల్లు అంటే హాస్యపు జల్లు’.. అంటూ తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానంగా ప్రశంసించేవారు. నిజ జీవితంలో ఆయన్ని పరిశీలిస్తే.. సినిమాల్లో హాస్యాన్ని అంత బాగా పండిస్తున్న అల్లు రామలింగయ్య ఇతనేనా అనుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఆయన నిజజీవితంలో ఎంతో హుందాగా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1950లో ‘పుట్టిల్లు’ చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన ‘కళ్యాణరాముడు’. 53 ఏళ్ళ కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య సినీ, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.   1922 అక్టోబర్‌ 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. వీరి తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో చాలా ఆస్తులు ఉండేవి. అతని దానగుణం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. తర్వాత ఆయన కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో అల్లు రామలింగయ్యకు చదువుకంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ. వ్యవసాయమైనా చెయ్యమని తండ్రి చెబితే.. అది కూడా చేసేవారు కాదు. ఎప్పుడూ ఆకతాయిగా తిరుగుతూ, అందర్నీ అనుకరిస్తూ నవ్విస్తుండేవారు. అలా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో బృహస్పతి వేషం లభించింది. మూడు రూపాయలు ఆ నాటక కాంట్రాక్టరుకు ఎదురిచ్చేలా మాట్లాడుకొని ఆ పాత్రను దక్కించుకున్నారు.  ఆ తర్వాత తన ఇంట్లోనే బియ్యాన్ని దొంగిలించి, వాటిని అమ్మి ఆ కాంట్రాక్టరు అప్పు తీర్చారు. ఆ నాటకం తర్వాత ప్రజా నాట్యమండలిలో చేరి ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. ఆరోజుల్లోనే హోమియో వైద్యం నేర్చుకొని వీలు చిక్కినప్పుడల్లా ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవారు.  1952లో గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ అల్లు రామలింగయ్య తొలిచిత్రం. ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా.. అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా.. అప్పటి అగ్ర తారలు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు అల్లు. ‘పరివర్తన’, ‘చక్రపాణి’, ‘వద్దంటే డబ్బు’, ‘దొంగ రాముడు’, ‘సంతానం’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, ‘భాగ్యరేఖ’, ‘తోడికోడళ్ళు’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘ఆడపెత్తనం’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘ఇల్లరికం’.. ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. కేవలం హాస్య పాత్రలతోనే సరిపెట్టుకోకుండా సెంటిమెంట్‌ క్యారెక్టర్లు, విలన్‌ పాత్రలు, కామెడీ విలన్‌ పాత్రలతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించారు అల్లు రామలింగయ్య. ముఖ్యంగా రావుగోపాలరావు కాంబినేషన్‌లో చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అవ్వడమే కాకుండా కమెడియన్‌గా అల్లుకి మంచి పేరు తెచ్చాయి.  నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి ఏమిటో చాటి చెప్పారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి కుమారుడు అల్లు అరవింద్‌ను నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్‌లో వచ్చే ప్రతి సినిమాకీ సమర్పకుడిగా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అల్లు రామలింగయ్య. ఆ తర్వాత కుమారుడు అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం, మనవడు అల్లు అర్జున్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం తనకు సంతృప్తినిచ్చిన అంశాలని అల్లు రామలింగయ్య చెప్పేవారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అనిపించుకున్న అల్లు అర్జున్‌ ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  50 ఏళ్ళ సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1998లో ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు, 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2013లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 తపాలా బిళ్ళల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదల చేశారు. కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులపై హాస్యపు జల్లు కురిపించి వారి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్యకు 1,116 సినిమాలు చెయ్యాలనే కోరిక ఉండేది. కానీ, 1030 సినిమాలు మాత్రమే చెయ్యగలిగారు. 2004లో వచ్చిన జై చిత్రం ఆయన చివరి సినిమా. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో 2004 జూలై 31న తుదిశ్వాస విడిచారు తెలుగు వారి హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య.  

‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాత్ర పోషించి జన్మ ధన్యం చేసుకున్న జె.వి.సోమయాజులు!

(జూలై 30 జె.వి.సోమయాజులు జయంతి సందర్భంగా..) జె.వి.సోమయాజులు.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘శంకరాభరణం’ చిత్రంలోని శంకరశాస్త్రి. ఆ పాత్రకు జీవం పోసి శంకరశాస్త్రిగానే ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్‌ సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ‘శంకరాభరణం’ వంటి సంగీత, నృత్య ప్రధాన చిత్రాన్ని రూపొందించి తెలుగు సినిమా దశ, దిశ మార్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. శంకరశాస్త్రి పాత్రతో ప్రేక్షకుల మనసులపై గాఢమైన ముద్ర వేశారు. కె.విశ్వనాథ్‌ ఊహల్లో ఉన్న పాత్రకు జీవం పోసి శంకరశాస్త్రి అనే సంగీత విద్వాంసుడు నిజంగా ఉంటే ఇలాగే ఉంటాడా అనేంతగా ఆ పాత్రను పోషించి అన్నివర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు జె.వి.సోమయాజులు. 25 సంవత్సరాల కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150 సినిమాల్లో నటించినప్పటికీ ఆయన్ని అందరూ శంకరశాస్త్రిగానే చూశారు, గౌరవించారు.  1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకలాం గ్రామంలో వెంకటశివరావు, శారదాంబ దంపతులకు జన్మించారు జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. ఈయన సోదరుడు జె.వి.రమణమూర్తి ప్రముఖ సినీ నటుడు. వీరి విద్యాభ్యాసం విజయనగరంలో జరిగింది. చదువుకునే రోజుల నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1946 నుంచే నాటకాలు ప్రదర్శించడం ప్రారంభించారు. సోదరుడితో కలిసి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని విరివిగా ప్రదర్శించేవారు. ఈ నాటకం తొలి ప్రదర్శన 1953 ఏప్రిల్‌ 20న జరిగింది. 45 సంవత్సరాల్లో సోమయాజులు, రమణమూర్తి కలిసి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని 500 సార్లు ప్రదర్శించారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్రకు సోమయాజులు ఎంతో ప్రసిద్ధి. 1957లో జె.వి.రమణమూర్తికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే సోమయాజులు మాత్రం నాటకాలు ప్రదర్శించడంలోనే ఎక్కువ సంతృప్తి చెందేవారు. అందుకే సినిమాల జోలికి వెళ్ళలేదు.  ఓ పక్క నాటకాలు వేస్తూనే చదువులోనూ రాణించారు సోమయాజులు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రెవిన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాటకాల ప్రదర్శనను మాత్రం విడిచిపెట్టలేదు. 1979లో మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. తను రూపొందిస్తున్న ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి పాత్ర కోసం సోమయాజులుకి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, గెటప్‌ వేసి చూశారు. విశ్వనాథ్‌ పూర్తి సంతృప్తి చెందారు. అలా ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంపికయ్యారు సోమయాజులు. నిజానికి అంతకుముందే ‘రారా కృష్ణయ్య’ అనే సినిమాలో ఒక ప్రధాన పాత్రలో ఆయన నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.  1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించడంతో శంకరశాస్త్రి పాత్ర పోషించిన జె.వి.సోమయాజులు పేరు మారుమోగిపోయింది. ఎన్నో సంవత్సరాలు లెక్కకు మించిన నాటకాల్లో నటించినా రాని పేరు ఒక్క సినిమాతో సోమయాజులుకి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు వరస అవకాశాలు వచ్చాయి. ఆయన కెరీర్‌లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. అందులో త్యాగయ్య, సప్తపది, వంశవృక్షం వంటి సినిమాల్లో నటించినప్పటికీ శంకరాభరణం స్థాయిలో ఆ సినిమాలు విజయవంతం కాలేదు. ఆ తర్వాతి కాలంలో బుల్లితెరపై కూడా నటుడిగా కనిపించారు సోమయాజులు. ఎన్ని సినిమాలు చేసినా తనకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా శంకరాభరణం అని చెప్పేవారు.  డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి సోమయాజులుపై కొందరు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన చెన్నారెడ్డి.. సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి దానికి తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు. 1984లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితిని 55కి తగ్గించడంతో సోమయాజులు రిటైర్‌ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సోమయాజులుని ఆదరించి తమ కళాశాలలోని రంగస్థల కళల శాఖకు అధిపతిగా నియమించింది. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో, నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించారు. నటనకు పదవీ విరమణ లేదనీ, చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని చెప్పేవారు సోమయాజులు. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా నటిస్తూనే ఉన్నారు. 2004 ఏప్రిల్‌ 24న 76 ఏళ్ళ వయసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు జె.వి.సోమయాజులు. 

తెలుగు సినిమా పాటకు కొత్త సొబగులు అద్దిన డా. సి.నారాయణరెడ్డి!

(జూలై 29 సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా..) ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..’, ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’, ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు..’ అంటూ జాతిని మేల్కొలిపే పాటలు, ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’, ‘వగలరాణివి నీవే..’, ‘అంతగా నను చూడకు..’ అంటూ ప్రేమను పలికించే పాటలు, ‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి..’, ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్న..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ అంటూ సెంటిమెంట్‌తో నిండిన పాటలు.. ఇలా సందర్భం ఏదైనా, సన్నివేశం ఏదైనా.. తన కలం నుంచి అలవోకగా అక్షరాలు జాలువారతాయి. ఆ పాటలు విన్న శ్రోతల మనసులు ఆనందంతో వెల్లివిరుస్తాయి. విభిన్నమైన శైలి, మనసును తాకే భావజాలం ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు.. డా. సి.నారాయణరెడ్డి. సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులుగా పేరు పొంది, ఆ తర్వాత సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన మహా రచయిత సి.నారాయణరెడ్డి. అందరూ ఎంతో అభిమానంతో సినారే అని పిలుచుకునే ఆయన రచనా రంగంలో,  సినీ రంగంలో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. 1931 జూలై 29న కరీంనగర్‌ జిల్లాలోని హనుమాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన ప్రాథమిక విద్య అంతా ఒక వీధిబడిలోనే జరిగింది. చిన్నతనంలో హరికథలు, జానపదాలు, జంగం కథలపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రాథమికోన్నత విద్య నుంచి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు సినారె. తెలుగు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఉర్దూ మీడియంలో చదువును కొనసాగిస్తూనే తెలుగు భాషపై సాధన చేస్తూ పట్టు సంపాదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి డాక్టరేట్‌ కూడా పొందారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో లెక్కకు మించిన గ్రంథాలు చదివారు. జలపాతం, విశ్వగీతి, నాగార్జున సాగరం, అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు వంటి రచనలు చేసి, తెలుగు సాహితీప్రియులను ఆనందసాగరంలో మునకలు వేయించారు. సినారె రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్నారు సినారె. గేయ కావ్యాలు, గేయ నాటికలు, కవితలు, సినిమా పాటలు.. ఇలా ఎన్నో రచనలు చేసి సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారు సినారె. ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి, అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవుల్లో కొనసాగారు. సి.నారాయణరెడ్డి కవితా వైభవం గురించి తెలుసుకున్న ఎన్‌.టి.రామారావు ఆయన్ని సినిమా రంగానికి ఆహ్వానించారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న గులేబకావళి కథ చిత్రంలో పాటలు రాయమని కోరారు. దానికి సినారె ఒక షరతు పెట్టారు. తన తొలి సినిమా కాబట్టి అన్ని పాటలూ రాసే అవకాశం ఇస్తే రాస్తానని చెప్పారు. దానికి ఎన్టీఆర్‌ కూడా అంగీకరించి ఆ సినిమాలోని 11 పాటలు సినారెతో రాయించారు. ఆయన రాసిన తొలి సినిమా పాట ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని..’. ఆయన రాసిన ఈ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  సినారె రాసిన తొలి సినిమాలోని పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దాంతో బి.యన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.ప్రత్యగాత్మ వంటి ప్రముఖ దర్శకులు తమ సినిమాలకు కూడా పాటలు రాయించుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తన తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’ మొదలుకొని ‘జీవనజ్యోతి’ వరకు ప్రతి చిత్రంలోనూ సినారెతో పాటలు రాయించుకున్నారు. తర్వాతి రోజుల్లో విశ్వనాథ్‌ తన సినిమాల్లోని పాటలను వేటూరి, సిరివెన్నెలతో రాయించుకున్నప్పటికీ అవసరమైన సమయంలో స్వాతిముత్యం, స్వాతికిరణం వంటి చిత్రాలకు మళ్ళీ సినారెతోనే గీతరచన చేయించడం విశేషం. ఇలా ఎందరో సినారె పాటకు పట్టాభిషేకం చేశారు. దాసరి, కోడి రామకృష్ణ వంటి దర్శకులు సైతం తమ చిత్రాలలో సినారె పాటకు ప్రత్యేక స్థానం కల్పించారు. కొందరు నిర్మాతలు సినారె పాట లేకుంటే సినిమానే తీయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.  పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో సినారెకు మంచి అవకాశాలు ఇచ్చారు ఎన్‌.టి.రామారావు. శ్రీకృష్ణపాండవీయంలో ఆయన రాసిన స్వాగతం.. సుస్వాగతం.. పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఇదేనా మన సంప్రదాయమిదేనా.., జయీభవా విజయీభవా.. వంటి ఎన్నో పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం సామ్రాట్‌ అశోక లోనే కాదు, ఆయన నటించగా విడుదలైన ఆఖరి సినిమా శ్రీనాథ కవిసార్వభౌముడులోనూ సినారె పాటలు రాశారు. ఇలా తను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళ నుంచి చివరి వరకు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగించారు సినారె.  సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను ఎన్నో పురస్కారాలు సి.నారాయణరెడ్డిని వరించాయి. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్‌ అవార్డు, కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు సినారెకు లభించాయి. సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమ గడ్డ.., ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మ అని అంటే ఎలా.. పాటలకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 1997లో అప్పటి రాష్ట్రపతి.. సినారెను రాజ్యసభ్యుడిగా నామినేట్‌ చేశారు. చివరి వరకూ ఏదో ఒక సినిమాలో తను మాత్రమే రాయగల ఎన్నో పాటలు రచించారు సినారె. 2017లో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్‌ 12న తుదిశ్వాస విడిచారు డా.సి.నారాయణరెడ్డి.

కృష్ణవంశీ తన 30 ఏళ్ళ కెరీర్‌లో 20 సినిమాలే చేయడం వెనుక రీజన్‌ ఇదే!

  డైరెక్టర్‌గా 30 సంవత్సరాల కెరీర్‌.. చేసిన సినిమాలు 20 మాత్రమే. ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్‌ అనే ముద్ర పడకుండా ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకునే డైరెక్టర్‌. సినిమా అంటే ప్రజలను ఎంతో కొంత చైతన్య పరిచేదిగా ఉండాలని నమ్మే డైరెక్టర్‌. అతనే కృష్ణవంశీ. తన కెరీర్‌లో చేసిన సినిమాలు ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు.  స్టార్స్‌తో సినిమాలు చెయ్యాలని, కమర్షియల్‌ హిట్స్‌ సాధించాలని కృష్ణవంశీ ఏరోజూ అనుకోలేదు. అంతేకాదు, లెక్కకు మించిన సినిమాలు చెయ్యాలన్న ఆలోచన కూడా అతనికి లేదు. ఇంతటి వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న కృష్ణవంశీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, డైరెక్టర్‌గా మారేందుకు ఎలాంటి కృషి చేశారు అనేది తెలుసుకుందాం.   1962 జూలై 28న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు కృష్ణవంశీ. అతని అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. చిన్నతనం నుంచి సినిమాలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. ఇంటర్మీడియట్‌కి వచ్చిన తర్వాత తను సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పారు. కానీ, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చూద్దాం అని తండ్రి చెప్పడంతో కష్టపడి చదివారు. ఆ తర్వాత తండ్రి బలవంతం మీదే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా చేశారు. అయినా సినిమాల్లోకి వెళ్లడానికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఒకరోజు ఇంటిలో చెప్పకుండా మద్రాస్‌ రైలెక్కేశారు వంశీ. ఆ తర్వాత అతని ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేశారు తండ్రి. సినిమా ఫీల్డ్‌కే వెళతానని వంశీ పట్టు పట్టడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు.    తనకు తెలిసిన వారి ద్వారా వంశీని పి.ఎస్‌.ప్రకాష్‌ దగ్గరికి పంపారు తండ్రి. ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచనే తప్ప అక్కడ ఏం చెయ్యాలి అనే విషయంలో వంశీకి క్లారిటీ లేదు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చేస్తానని చెప్పడంతో అతన్ని లైట్‌బోయ్‌గా తీసుకున్నారు. అలా రెండు సంవత్సరాలు పనిచేశారు. అక్కడే బ్రహ్మాజీ పరిచయమయ్యారు. ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌వర్మ శివ సినిమా చేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు వంశీ. చాలా తక్కువ సమయంలోనే వర్మకు బాగా దగ్గరయ్యారు. శివ తర్వాత వర్మ చేసిన చాలా సినిమాలకు కృష్ణవంశీ అసోసియేట్‌గా పనిచేశారు. అంతకుముందు వంశీకృష్ణ అని వున్న అతని పేరును కృష్ణవంశీగా మార్చారు వర్మ. అతనిలోని టాలెంట్‌ గుర్తించిన వర్మ.. అనగనగా ఒకరోజు సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చారు. రెండు షెడ్యూల్స్‌ పూర్తయిన తర్వాత బడ్జెట్‌ బాగా పెరిగిపోతోందని గ్రహించిన వర్మ.. అతన్ని తప్పించి తనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయినా బాధపడని వంశీ ఆ సినిమాకే అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.      అనగనగా ఒకరోజు విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత గులాబి కథ రెడీ చేసుకొని చాలా మంది నిర్మాతలకు వినిపించారు వంశీ. ఈ విషయం తెలుసుకున్న వర్మ.. అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి వర్మ క్రియేషన్స్‌ బేనర్‌లో సినిమా చెయ్యమని ఆఫర్‌ ఇచ్చారు. అలా గులాబి చిత్రంతో కృష్ణవంశీ డైరెక్టర్‌ అయ్యారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. వంశీ టేకింగ్‌ చూసిన నాగార్జున.. కథ రెడీచేస్తే సినిమా చేద్దాం అన్నారు. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ వినిపించారు వంశీ. నాగార్జున కూడా ఒకే చెప్పారు. గులాబీ చిత్రానికి డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చినప్పటికీ.. అందరూ వర్మలా అద్భుతంగా తీశావు అని అప్రిషియేట్‌ చెయ్యడంతో తన పంథా మార్చుకోవాలని డిసైడ్‌ అయి నాగార్జునకు నిన్నే పెళ్లాడతా సబ్జెక్ట్‌ చెప్పారు. అలా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో నిన్నే పెళ్లాడతా ప్రారంభమైంది. అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలకు భిన్నంగా ఉండడంతో నిన్నే పెళ్లాడతా సినిమాకి ఘనవిజయాన్ని అందించారు ప్రేక్షకులు.    మొదటి రెండు సినిమాలు సూపర్‌హిట్‌ కావడంతో కృష్ణవంశీకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు వచ్చింది. తను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసిన బ్రహ్మాజీతో ఒక సినిమా చెయ్యాలనుకున్నారు వంశీ. పేపర్‌లో వచ్చిన ఒక వార్తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సిందూరం కథను సిద్ధం చేశారు. బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా ఆంధ్రా టాకీస్‌ అనే బేనర్‌ను స్థాపించి సొంతంగా ఆ సినిమా చేశారు. మంచి సినిమా అనే ప్రశంసలు, అవార్డులు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాగార్జునతోనే చంద్రలేఖ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన అంత:పురం కృష్ణవంశీకి చాలా గొప్ప పేరు తెచ్చింది. ఆ తర్వాత చేసిన సముద్రం కూడా విజయం సాధించింది.      ఆ సమయంలోనే మహేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పటివరకు రాజకుమారుడు, యువరాజు, వంశీ చిత్రాలు చేసిన మహేష్‌కు మురారి చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు కృష్ణవంశీ. 2002లో అంత:పురం చిత్రాన్ని శక్తి.. ది పవర్‌ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. కానీ, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. కృష్ణవంశీ హిందీలో చేసిన సినిమా ఇదొక్కటే. అదే సంవత్సరం శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో వంశీ తెరకెక్కించిన ఖడ్గం సంచలన విజయం సాధించింది. దేశభక్తిని ప్రబోధించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆగస్ట్‌ 15, జనవరి 26కి ఈ సినిమాను టీవీలో ప్రసారం చేస్తుంటారు. ఈ సినిమా తర్వాత డేంజర్‌, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం వంటి సినిమాలు చేశారు. అందులో రాఖీ, చందమామ మాత్రమే విజయం సాధించాయి.    2017లో చేసిన నక్షత్రం చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూడడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు కృష్ణవంశీ. ఆరేళ్ళ గ్యాప్‌ తర్వాత 2023లో మరాఠీలో విష్ణు వామన్‌ రచించిన నటసామ్రాట్‌ అనే నాటకం ఆధారంగా రంగమార్తాండ చిత్రాన్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.    ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. గులాబి చిత్రంతో కృష్ణవంశీకి అభిమానిగా మారిపోయారు రమ్యకృష్ణ. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడు సంవత్సరాలపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తర్వాత కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు రమ్యకృష్ణ. వాటిలో బాహుబలిలో పోషించిన శివగామి పాత్ర ఆమెకు గొప్ప పేరు తీసుకొచ్చింది. కృష్ణవంశీకి రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఎంతో అభిమానం. అతను డైరెక్ట్‌ చేసిన చాలా సినిమాలకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఆయన్ని తన తండ్రిగా భావించేవారు వంశీ. ఆయన కూడా వంశీని కొడుకులాగే చూసేవారు. అంతేకాదు, చట్టపరంగా కాకుండా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కృష్ణవంశీని దత్తత చేసుకున్నారు సీతారామశాస్త్రి.   (జూలై 28 దర్శకుడు కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా..)  

డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ ఏం చదువుకున్నారో తెలిస్తే షాక్‌ అవుతారు!

(జూలై 27 సాయికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా..) సాయికుమార్‌.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది.. ఆవేశపూరితంగా డైలాగులు చెప్పే ఓ కంచుకంఠం. తన గాత్రంతో తెలుగు వారినే కాదు, కన్నడ ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్‌  చేశారు సాయికుమార్‌. అచ్చమైన తెలుగు, స్పష్టమైన ఉచ్ఛారణ సాయికుమార్‌ ప్రత్యేకత. సుమన్‌, రాజశేఖర్‌ వంటి హీరోలు సాయికుమార్‌ గాత్రంతోనే స్టార్స్‌గా ఎదిగారు. డైలాగ్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న సాయి.. మొదట డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణించారు. ఆ తర్వాత నటుడిగా కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు, పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఇండస్ట్రీలోని అందరు హీరోలూ అతన్ని ‘సాయి..’ అని ప్రేమగా పిలుస్తారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సాయికుమార్‌.. అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు.  1960 జూలై 27న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో పూడిపెద్ది జోగేశ్వరశర్మ, కృష్ణజ్యోతి దంపతులకు జన్మించారు సాయికుమార్‌. ఈయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర వీరికి బంధువులు. సినిమా ఇండస్ట్రీలో పి.జె.శర్మగా పాపులర్‌ అయిన పూడిపెద్ది జోగేశ్వరశర్మ.. 500కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఎన్నో సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. తల్లి కృష్ణజ్యోతి కూడా చాలా కన్నడ సినిమాల్లో రాజ్‌కుమార్‌ వంటి హీరోల సరసన నటించారు. అయితే పి.జె.శర్మను వివాహం చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి చెప్పారు. తల్లి ప్రోత్సాహంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన తన కంఠాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సాయికుమార్‌ పూర్తిగా సక్సెస్‌ అయ్యారు.  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ అవ్వాలని కాకుండా తను ఐఎఎస్‌ అవ్వాలని చిన్నతనం నుంచీ అనుకునేవారు సాయికుమార్‌. పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. అలాగే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఫిల్‌ చేశారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఆరు నెలలపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే ఎన్‌.సి.సి. చేరి ఢల్లీిలో, విదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక ఎరువుల కంపెనీకి వాయిస్‌ ఓవర్‌ కావాలని చెప్పడం, తల్లి ప్రోత్సాహంతో ఆ యాడ్‌కి వాయిస్‌ ఇవ్వడం ద్వారా తన డబ్బింగ్‌ కెరీర్‌ని ప్రారంభించారు సాయికుమార్‌. ఆ తర్వాత సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. దాదాపు 1000కి పైగా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు సాయికుమార్‌. రజినీకాంత్‌, సుమన్‌, రాజశేఖర్‌, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌కాంత్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌, అర్జున్‌.. వంటి హీరోలకు డబ్బింగ్‌ చెప్పి వారు నటించిన సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  నటన విషయానికి వస్తే పదహారేళ్ళ వయసులోనే బాపు దర్శకత్వంలో వచ్చిన ‘స్నేహం’ చిత్రంలో రాజాకృష్ణతో కలిసి నటించారు సాయికుమార్‌. ఆ తర్వాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. అయితే నటుడిగా తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో 1990 ప్రాంతంలో తమిళ, కన్నడ రంగాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. కన్నడతోపాటు తమిళ్‌లోనూ సాయికుమార్‌కి మంచి అవకాశాలు వచ్చాయి. కన్నడలో హీరోగా, సెకండ్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 15 సినిమాల్లో నటించిన తర్వాత థ్రిల్లర్‌ మంజు దర్శకత్వంలో రూపొందిన ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సాయికుమార్‌ పోషించిన అగ్ని క్యారెక్టర్‌కి విపరీతమైన పేరు వచ్చింది. కన్నడలోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయం సాధించి ఒక్కసారిగా సాయికుమార్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటిచారు. తెలుగులో స్వర్ణముఖి, కొడుకులు, అతను, ఏ.కె.47 సినిమాల్లో హీరోగా నటించారు. తల్లి కృష్ణజ్యోతి పేరుమీద బ్యానర్‌ నెలకొల్పి, సొంతగా ‘ఈశ్వర్‌ అల్లా’ చిత్రం నిర్మించారు. అయితే ఇవేవీ సాయికుమార్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది భాషల్లో ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బుల్లితెరపై కూడా తనదైన శైలిలో కొన్ని షోలు నిర్వహిస్తున్నారు.  ఇక సాయికుమార్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే.. అతని సోదరుడు రవిశంకర్‌ కూడా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. మరో సోదరుడు అయ్యప్ప శర్మ నటుడిగా రాణిస్తున్నారు. సాయికుమార్‌ వివాహం సురేఖతో జరిగింది. వీరి కుమారుడు ఆది 2011లో వచ్చిన ‘ప్రేమ కావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో ఆది హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో తనకు వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండుసార్లు బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు సాయికుమార్‌. తెలుగులో సామాన్యుడు, ప్రస్థానం చిత్రాల్లో కనబరిచిన నటనకుగాను ఉత్తమ విలన్‌గా, సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే ఫిలింఫేర్‌, ఐఫా, సినీమా అవార్డులు, సైమా అవార్డులు కూడా సాయికుమార్‌ను వరించాయి.

బి.విఠలాచార్య ఇచ్చిన సలహాతో నవరస నటనాసార్వభౌమగా ఎదిగిన కైకాల!

(జూలై 25 కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా..) నవరసాలు పోషించగల సమర్థత ఉన్న నటులు చిత్ర పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. వారిలో ఎస్‌.వి.రంగారావు తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు కైకాల. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గానే కాకుండా కరుణరసాన్ని అద్భుతంగా పండిరచి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కైకాల సత్యనారాయణకు మాత్రమే లభించింది. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు అన్నివిధాలా కృషి చేసే కైకాల చిత్రరంగానికి ఎలా వచ్చారు, ఆయనను నటుడిగా నిలబెట్టి సినిమాలేంటి, ఆయన కెరీర్‌ ఎలా కొనసాగింది అనే విషయాలు తెలుసుకుందాం. 1935 జూలై 25న కృష్ణాజిల్లాలోని కౌతరం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించారు కైకాల సత్యనారాయణ. ఆయన పాఠశాల విద్య గుడ్లవల్లేరులో, ఇంటర్మీడియట్‌ విజయవాడలో, డిగ్రీ గుడివాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి నటన పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకున్న కైకాల.. చదువుకుంటూనే నాటకాల్లో నటించేవారు. ఆయన డిగ్రీ చదువుతుండగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా రంగానికి వస్తానని ఆ నిర్మాతకు చెప్పారు. డిగ్రీ పూర్తయిన తర్వాత మద్రాస్‌ వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, ఎవరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలా సంవత్సరంపాటు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. చివరికి సిపాయి కూతురు చిత్రంలో ప్రధాన పాత్ర ఇచ్చారు నిర్మాత డి.ఎల్‌.నారాయణ. ఈ సినిమా తర్వాత కైకాలకు మరో సినిమా రాలేదు.  చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా మంది ఉన్నారు. విలన్లు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి విలన్‌గా నటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కైకాలకు సలహా ఇచ్చారు దర్శకుడు బి.విఠలాచార్య. 1960లో తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కనకదుర్గ పూజా మహిమ చిత్రంలో కైకాలకు తొలిసారి విలన్‌ పాత్ర ఇచ్చారు బి.విఠలాచార్య. అది ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం కోటేశ్వరమ్మతో కైకాల సత్యనారాయణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కనకదుర్గ పూజా మహిమ చిత్రం తర్వాత కైకాల విలన్‌గా స్థిరపడిపోయారు. హీరో ఎవరైనా విలన్‌గా కైకాలనే తీసుకునేవారు. అలా విలన్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. ఆయన కెరీర్‌లో మొత్తం 13 సినిమాల్లో హీరోగా కనిపించారు.  1964లో వచ్చిన రాముడు భీముడు చిత్రంలో ఎన్‌.టి.రామారావు తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు డూప్‌గా కైకాల నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ డూయల్‌ రోల్‌ చేసిన సినిమాలన్నింటిలోనూ కైకాల డూప్‌గా నటించేవారు. తన కెరీర్‌ ప్రారంభంలోనే ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు అనే పేరు కైకాలకు వచ్చింది. అంతకుముందు ఎస్‌.వి.రంగారావు పోషించిన భీమ, రావణ, దుర్యోధన, ఘటోత్కచ పాత్రల్ని ఎంతో గొప్పగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. యమగోల, యమలీల వంటి సినిమాల్లో యముడిగా నటించి ఆ పాత్ర పోషించడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు కైకాల. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు..ఇలా అందరు హీరోల సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించారు కైకాల. ఆ తర్వాతి తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు సినిమాల్లో కూడా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. ఆ తర్వాతి తరం హీరోల సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేసేవారు కైకాల.  నటుడిగానే కాకుండా తన సోదరుడు కైకాల నాగేశ్వరరావుతో కలిసి రమా ఫిలింస్‌ పతాకంపై ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలు నిర్మించారు. బంగారు కుటుంబం.. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. 55 ఏళ్ళ సినీ కెరీర్‌లో దాదాపు 800 సినిమాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు కైకాల సత్యనారాయణ. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. అలాగే ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఇవి కాక వివిధ సంస్థలు కైకాలకు పలు పురస్కారాలు అందించాయి. ఆరోగ్య కారణాల రీత్యా 2013 తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత 2019లో వచ్చిన ఎన్‌.టి.ఆర్‌.కథానాయకుడు చిత్రంలో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం అదే సంవత్సరం వచ్చిన మహర్షి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 డిసెంబర్‌ 23న తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ.

3 ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చిన బి.గోపాల్‌.. సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తెలుసా?

(జూలై 24 దర్శకుడు బి.గోపాల్‌ పుట్టినరోజు సందర్భంగా..) 1980వ దశకం తెలుగు సినిమాకి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన సంవత్సరం. ఎందుకంటే 1982లో నటరత్న ఎన్‌.టి.రామారావు రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. అప్పటివరకు ఎన్టీఆర్‌కి పోటీగా ఉన్న సూపర్‌స్టార్‌ కృష్ణ.. నెంబర్‌ వన్‌ హీరో అనిపించుకున్నారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండానే చిరంజీవి రంగంలోకి దిగి స్టార్‌ హీరో అయిపోయారు. ఇదిలా ఉంటే.. అదే దశకంలో కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతూ ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. వీరంతా ఎవరి పద్ధతిలో వారు సినిమాలు చేస్తూ డైరెక్టర్లుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో బి.గోపాల్‌ అనే కొత్త దర్శకుడు పరిశ్రమకు వచ్చారు. 1986లో ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమానే ఇన్‌సాఫ్‌ కి ఆవాజ్‌ పేరుతో బి.గోపాల్‌ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్‌ చేశారు. థియేటర్లలో సినిమాలు చూడడం తప్ప సినిమా డైరెక్టర్‌ అవ్వాలన్న ఆలోచనే లేని గోపాల్‌ 20 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.  జూలై 24న ప్రకాశం జిల్లా ఎం.నిడమనూరు గ్రామంలో వెంకటేశ్వర్లు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించారు బెజవాడ గోపాల్‌. కారుమంచిలో పాఠశాల విద్య, ఒంగోలులో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి సినిమాలు చూడడం, ఆటలు ఆడడం తప్ప చదువు మీద శ్రద్ధ పెట్టేవారు కాదు. చాలా కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగారు. కాలేజీలో చేరే వరకు గోపాల్‌కు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కాబట్టి మద్రాస్‌ వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాలనుకున్నారు. ప్రతి నెలా జీతం తెచ్చిపెట్టే ఉద్యోగంగానే దాన్ని చూశారు తప్ప డైరెక్టర్‌ అవ్వాలి, సినిమాలు తియ్యాలి అనే ఆలోచన ఆయనకు లేదు. అప్పటివరకు సినిమాలు చూడడం తప్ప సినిమాలపై అవగాహన అనేది లేదు. సినిమాల్లోకి వెళ్ళాలన్న తన నిర్ణయాన్ని తండ్రితో చెప్పారు. ఆయన కూడా కాదనకుండా తనకు తెలిసిన వారి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ చేశారు.  పి.సి.రెడ్డి దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత కె.రాఘవేంద్రరావు దగ్గర అడవి రాముడు చిత్రానికి అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆయన దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలోనే బి.గోపాల్‌ పనితీరును గమనించిన డి.రామానాయుడు.. తను నిర్మిస్తున్న ప్రతిధ్వని ద్వారా దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అవ్వడమే కాదు, దాన్ని హిందీలో ఇన్‌సాఫ్‌ కి ఆవాజ్‌ పేరుతో గోపాల్‌ దర్శకత్వంలోనే రీమేక్‌ చేశారు. అలా తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు గోపాల్‌. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించిన గోపాల్‌.. భారీ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు, రాజశేఖర్‌ వంటి హీరోలతో సూపర్‌హిట్‌ చిత్రాలు రూపొందించారు.  బి.గోపాల్‌ అంటే యాక్షన్‌ సినిమాలు, ఫ్యాక్షన్‌ సినిమాలు గుర్తొస్తాయి. ఒకవిధంగా ఆయనకి డైరెక్టర్‌గా గొప్ప పేరు తెచ్చినవి ఆ తరహా సినిమాలే. నందమూరి బాలకృష్ణతో చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిపోయాయి. అంతకుముందు బాలకృష్ణతో చేసిన లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ భారీ విజయాల్ని అందుకున్నాయి. అలాగే చిరంజీవితో చేసిన ఇంద్ర ఇండస్ట్రీ హిట్‌గా చరిత్ర సృష్టించింది. అంతకుముందు స్టేట్‌రౌడీ చిరంజీవి కెరీర్‌లో మరో విజయవంతమైన సినిమాగా నిలిచింది. వెంకటేష్‌తో చేసిన బొబ్బిలిరాజా 1990వ దశకంలో ఓ కొత్త తరహా చిత్రంగా ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించింది. మోహన్‌బాబు కాంబినేషన్‌లో బి.గోపాల్‌ చేసిన అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ చిత్రాలు ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించాయి.  12 సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేసిన తర్వాత ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడుగా మారారు బి.గోపాల్‌. దాదాపు రెండు దశాబ్దాలు దర్శకుడిగా తన జైత్రయాత్ర కొనసాగించారు. 30 సంవత్సరాల తన కెరీర్‌లో కేవలం 31 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు గోపాల్‌. అందులో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. తను చేసిన ప్రతి సినిమాకీ కేవలం డైరెక్టర్‌గానే వ్యవహరించిన గోపాల్‌ ఏ చిత్రానికీ సొంతంగా కథ అందించే ప్రయత్నం చెయ్యలేదు. టాలీవుడ్‌లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాలతో మూడు ఇండస్ట్రీ హిట్స్‌ అందించిన ఘనత బి.గోపాల్‌కి దక్కింది. బాహుబలి వచ్చే వరకు కలెక్షన్ల పరంగా ఆ మూడు సినిమాల దరిదాపుల్లోకి మరో సినిమా వెళ్ళలేదు. 2005 వరకు వరసగా సినిమాలు చేస్తూ వచ్చిన గోపాల్‌.. నాలుగు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రామ్‌ పోతినేనితో మస్కా చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ అయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో హరహర మహాదేవ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభోత్సవంతోనే ఆగిపోయింది. 2012లో గోపీచంద్‌తో ఆరడుగుల బుల్లెట్‌ చిత్రం చేశారు. అయితే ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చాలా ఆలస్యంగా 2021లో ఈ సినిమా విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చిన బి.గోపాల్‌ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

టాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన ఏకైక దర్శకుడు కోడి రామకృష్ణ!

(జూలై 23 దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా..) సినిమా పరిశ్రమలో ఏ డైరెక్టర్‌కి అయినా వారు చేసే సినిమాలను బట్టి ఒక ముద్ర పడిపోతుంది. యాక్షన్‌ సినిమాలు, సెంటిమెంట్‌ సినిమాలు, కామెడీ, పొలిటికల్‌.. ఇలా రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటారు. కానీ, ఇవన్నీ ఒకే డైరెక్టర్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఏ జోనర్‌ సినిమా అయినా అందులో తన మార్క్‌ ఉండేలా చూసుకునే డైరెక్టర్లలో ప్రథమంగా చెప్పుకోదగినవారు కోడి రామకృష్ణ. తన కెరీర్‌లో వందకుపైగా సినిమాలను రూపొందించిన ఆయన ఒక జోనర్‌కి పరిమితం కాలేదు. అన్నిరకాల సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. దాసరి స్కూల్‌ నుంచి వచ్చిన కోడి రామకృష్ణ.. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు.  1949 జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. చాలా కాలం దాసరి వద్ద అనేక సినిమాలకు పనిచేసి విశేషానుభవం సంపాదించారు. 1982లో చిరంజీవి హీరోగా ప్రతాప్‌ ఆర్ట్స్‌ కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు కోడి రామకృష్ణ. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. ఇదే బేనర్‌లో చేసిన ‘తరంగిణి’ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆలయశిఖరం, ముక్కుపుడక, సింహపురి సింహం, గూఢచారి నెం.1 వంటి సినిమాలు చేశాక 1984లో నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ రూపొందించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం సంచలన విజయం సాధించింది. కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు సృష్టించి గోల్డెన్‌ జూబ్లీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.  దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఒక రికార్డు ఉంది. అదేమిటంటే.. మద్రాస్‌లో అడుగుపెట్టిన తొలిరోజే మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. అంతకుముందు ఏ కళాకారుడికీ అలా జరగలేదు. ఆ తర్వాత ఆయన శిష్యుడు కోడి రామకృష్ణకు కూడా అలాగే జరగడం విశేషం. కోడి రామకృష్ణ మద్రాస్‌ వచ్చిన రోజే మేకప్‌ వేసుకొని కె.రాఘవ నిర్మిస్తున్న చదువు సంస్కారం చిత్రంలో స్టూడెంట్‌ రౌడీ పాత్రలో నటించారు. దాసరి నారాయణరావుకు ‘తాత మనవడు’ చిత్రంతో  దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నిర్మాత కె.రాఘవ.. ఆ తర్వాత కోడి రామకృష్ణను ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు.  దాదాపు 35 సంవత్సరాలు దర్శకుడిగా తన కెరీర్‌ను కొనసాగించిన కోడి రామకృష్ణ.. ఏ దర్శకుడికీ సాధ్యం కాని ఘనతను సాధించారు. తను చేసిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో జోనర్స్‌ కనిపిస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చెయ్యడం కాకుండా.. 2 సంవత్సరాలకు ఒకసారి తన పంథా మార్చుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా తెలిపారు కోడి. ఆయన చేసిన సినిమాలను పరిశీలిస్తే.. కొన్నాళ్లు టిపికల్‌ సబ్జెక్ట్స్‌తో కూడిన సినిమాలు, మరికొన్నాళ్లు పోలీస్‌ ప్రధాన పాత్రలతో ఉన్న సినిమాలు, కొన్ని పొలిటికల్‌ మూవీస్‌, ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలు.. ఇలా ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మార్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన దర్శకులు ఆ సినిమాలనే ఫాలో అయ్యేవారు.  తెలుగు సినిమాకి గ్రాఫిక్స్‌ని పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది. అయితే ఇందులో నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి భాగస్వామ్యం కూడా కొంత ఉంది. 1992లో సౌందర్య ప్రధాన పాత్రలో ‘అమ్మోరు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో తొలిసారి గ్రాఫిక్స్‌ని వాడారు. ఆ కారణంగానే ఈ సినిమా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఆరోజుల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘దేవి’ చిత్రానికి కూడా పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్‌ని వినియోగించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. విజువల్‌గా ప్రేక్షకులకు మరింత అనుభూతిని కలిగించే ఉద్దేశంతో ఆ తర్వాత చేసిన దేవీపుత్రుడు, అంజి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కోడి రామకృష్ణతో తొలి గ్రాఫిక్స్‌ చిత్రాన్ని నిర్మించిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మరోసారి ఆ తరహా సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అనుష్క ప్రధాన పాత్రలో ‘అరుంధతి’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా కోడి రామకృష్ణ కెరీర్‌లో మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచిపోయింది. అలాగే అనుష్కను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత అదే తరహాలో అవతారం, నాగాభరణం చిత్రాలను రూపొందించారు కోడి రామకృష్ణ.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు విలక్షణమైన విలన్లను పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణకు దక్కుతుంది. ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో రచయితగా పనిచేసిన గొల్లపూడి మారుతీరావును బలవంతంగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో ఒక టిపికల్‌ విలన్‌గా పరిచయం చేశారు. అలాగే ‘అంకుశం’ చిత్రంతో నీలకంఠం అనే క్రూరమైన పాత్రతో రామిరెడ్డిని పరిచయం చేశారు. ఆ తర్వాత ‘భారత్‌ బంద్‌’ చిత్రంతో కాస్ట్యూమ్‌ కృష్ణను మరో విభిన్నమైన విలన్‌ను తీసుకొచ్చారు. కోడి రామకృష్ణ కెరీర్‌లో గొప్ప సినిమాగా చెప్పుకునే ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూసూద్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేసిన సోనుకి ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతి పాత్ర పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ నలుగురూ ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. రంగులపులి చిత్రం చేస్తున్న సమయంలో ఆ సినిమాలో నటించిన పుష్పాంజలి తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని ఆ విషయాన్ని ఆమెతో చెప్పడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలోని పెద్దలంతా కలిసి వారిద్దరికీ పెళ్లి చేశారు. వీరి పెద్ద కుమార్తె కోడి దివ్యదీప్తి నిర్మాణ రంగంలోకి ప్రవేశించి 2022లో నేను ‘మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే చిత్రాన్ని నిర్మించారు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ వంటి దర్శకుల తర్వాతి స్థానాన్ని కోడి రామకృష్ణ దక్కించుకున్నారు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన్ని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక దర్శకుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులతోపాటు పలు సంస్థల అవార్డులు కోడి రామకృష్ణను వరించాయి. ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ కమెడియన్‌ స్టేటస్‌ తెచ్చుకున్న ఏకైక నటి శ్రీలక్ష్మీ!

(జూలై 20 నటి శ్రీలక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా..) సాధారణంగా కమెడియన్స్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్స్‌ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. కానీ, అలా ఎంతో మంది లేడీ కమెడియన్స్‌ కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే నటి శ్రీలక్ష్మీ మాత్రం ప్రత్యేకం. ఇప్పటివరకు ఏ లేడీ కమెడియన్‌కి దక్కని విశేషమైన పేరు ఆమె సొంతం. ఆమె అమాయకత్వం, డైలాగులు చెప్పే విధానం, మేనరిజమ్స్‌, బాడీ లాంగ్వేజ్‌... ఇవన్నీ ఆమెను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. దాదాపు రెండు దశాబ్దాలపాటు కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ను చూశారు శ్రీలక్ష్మీ.  శ్రీలక్ష్మీ అసలు పేరు ఐశ్వర్యలక్ష్మీ ప్రియ. ఈమె మద్రాస్‌లోనే పుట్టి పెరిగారు. తండ్రి అమరనాథ్‌ కూడా నటుడే. ఆయనకు ఎనిమిది మంది సంతానం వారిలో శ్రీలక్ష్మీ, తమ్ముడు రాజేష్‌ సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తొలి సినిమా అమర సందేశంలో అమరనాథ్‌ హీరోగా నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత అతనికి చిన్న వేషాలు వచ్చినా హీరోగా మాత్రమే చేస్తానని చెప్పడంతో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తనే హీరోగా ఒక సినిమా నిర్మించారు. అది విజయం సాధించకపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆ పరిస్థితుల్లో కూడా మరో సినిమా ప్రారంభించారు. కానీ, డబ్బు లేకపోవడం వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఎనిమిది మంది సంతానంలో శ్రీలక్ష్మీ అందంగా ఉండడంతో ఆమెను సినీ నటిని చెయ్యాలని తల్లి అనుకుంది. అలా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు శ్రీలక్ష్మీ.  ఒకప్పటి నటుడు అమరనాథ్‌ కుమార్తె కావడంతో కె.విశ్వనాథ్‌, బాపు వంటి డైరెక్టర్లు ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు సక్సెస్‌ అవ్వలేదు. కెరీర్‌ ప్రారంభంలో కొండవీటి సింహం, గోపాలకృష్ణుడు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే దర్శకుడు కె.బాపయ్య.. ‘హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయితే నువ్వు సక్సెస్‌ అవుతావు’ అని చెప్పి నివురుగప్పిన నిప్పు అనే సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌ శ్రీలక్ష్మీకి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు జెళ్ళ సీత చిత్రంలో సుత్తివేలు కాంబినేషన్‌లో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత తను కామెడీ చెయ్యగలనన్న కాన్ఫిడెన్స్‌ శ్రీలక్ష్మీకి వచ్చింది. ఆ తర్వాత జంధ్యాల చేసిన ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మీ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసేవారు. అలా వరసగా నాలుగు స్తంభాలాట, అమరజీవి, పుత్తడిబొమ్మ వంటి సినిమాల్లోనూ మంచి పాత్రలు లభించాయి. ఆమె నటన చూసి చిత్ర పరిశ్రమకు మరో కొత్త హాస్యనటి వచ్చిందని అంతా సంతోషించారు. ఆ తర్వాత జంధ్యాల చేసే ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మీకి ప్రత్యేకమైన మేనరిజం ఉండే క్యారెక్టర్లు ఇస్తూ వచ్చారు. వేరే డైరెక్టర్ల సినిమాలు చేస్తూనే జంధ్యాల మార్కు కామెడీ క్యారెక్టర్లు పోషించి ఎంతో పాపులర్‌ అయిపోయారు. కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకున్నారు. శ్రీలక్ష్మీ తరహాలో కామెడీ చేసిన నటి ఆమె తర్వాత మరొకరు ఇండస్ట్రీకి రాలేదు.  రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా, స్వర్ణకమలం, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చెవిలోపువ్వు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, జంబలకిడి పంబ, శుభలగ్నం.. ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిన నటి శ్రీలక్ష్మీ. 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసిన ఘనత శ్రీలక్ష్మీకి దక్కుతుంది. ఈమె సోదరుడు రాజేష్‌ కూడా నటుడే. కొన్ని సినిమాల్లో హీరోగానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 40 సినిమాల్లో నటించిన రాజేష్‌ 38 ఏళ్ళ అతి చిన్న వయసులో మరణించారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఐశ్వర్యారాజేష్‌ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది.  అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న శ్రీలక్ష్మీ టీవీ సీరియల్స్‌ మాత్రం బిజీగానే వున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 సీరియల్స్‌లో వివిధ పాత్రలు పోషించారు. సినిమాల్లో ఆమె పోషించిన కామెడీ పాత్రలకు నాలుగు సార్లు ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డులు అందుకున్నారు.

తండ్రి చెప్పినట్టే సౌందర్య కెరీర్‌ సాగింది.. ఆమె జీవితం కూడా అలాగే ముగిసింది!

(జూలై 18 నటి సౌందర్య జయంతి సందర్భంగా..) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాతి తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య. 1990వ దశకంలో టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌పైనే ఆధారపడేవారు. ఆ విధంగానే సినిమాలు చేస్తుండేవారు. కానీ, దానికి భిన్నంగా తాను ఎక్స్‌పోజింగ్‌ చేయబోనని తన దర్శకనిర్మాతలకు చెప్పి ఆ మాట మీదే నిలబడ్డారు సౌందర్య. మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య. 1992లో ప్రారంభమైన సౌందర్య కెరీర్‌ 2004తో ముగిసింది. 31 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబళించింది. ఎంతో వైవిధ్యంగా సాగి, విషాదంగా ముగిసిన సౌందర్య సినీ, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగళ్‌లో కె.ఎస్‌.సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ. అయినప్పటికీ తెలుగు, తమిళ్‌ అనర్గళంగా మాట్లాడేవారు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్‌కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారు. అప్పుడు ఎంబిబిఎస్‌ చదువుతున్న సౌందర్య ఆ సినిమా చేయడానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత వరస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో హరీష్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా 1993లో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఆమె నటించిన 11 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 9 తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు చిత్రం 1992లోనే ప్రారంభమైంది. అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాక సౌందర్యకు నటిగా మంచి పేరు తెచ్చింది. దాంతో సంవత్సరానికి 10కి తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయారు సౌందర్య. తన 12 సంవత్సరాల సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్‌ అయిన చివరి సినిమా శ్వేతనాగు. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. తమిళ్‌, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్‌ అయింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన సౌందర్య నటించారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌,  జగపతిబాబు, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ వంటి స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ చేశారు. అలాగే తమిళ్‌లో రజినీకాంత్‌తో పడయప్పా, అరుణాచలం వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించారు. అలాగే హరీష్‌, వినీత్‌ వంటి యంగ్‌ హీరోలతో కూడా సౌందర్య మంచి సినిమాలు చేశారు. తన కెరీర్‌లో 100కిపైగా సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలోనూ అశ్లీలమైన పాత్రలు పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్లామర్‌ పాత్రలు చేయకపోయినా ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. ఒకప్పుడు సావిత్రి తరహాలో ఆమెను అందరూ ఆదరించేవారు. తెలుగులో సౌందర్యకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, అమ్మోరు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాముడొచ్చాడు, పెదరాయుడు, ప్రియరాగాలు, రాజా, తారకరాముడు, అంత:పురం, చూడాలని వుంది. 1995లో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ మరణించడంతో సౌందర్య మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. ఎన్నో కథలు విని చివరికి గిరీష్‌ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే చిత్రాన్ని కన్నడలో నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి. వాటితోపాటు కర్ణాటక స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు కూడా ద్వీప చిత్రం గెలుచుకుంది.  సౌందర్య వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును 2003 ఏప్రిల్‌ 27న వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. సౌందర్యకు చిన్నతనం నుంచి ప్రజాసేవ చెయ్యాలని, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక బలంగా ఉండేది. అంతేకాదు, ఆమెకు హిందూత్వ భావాలు కూడా ఎక్కువ. అందుకే తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కళ్లాపి చల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనే వారంతా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు. దాన్ని బట్టి హిందూ సాంప్రదాయంపై ఆమెకు ఎంత గౌరవం ఉండేదో అర్థమవుతుంది. ఆ తర్వాత అమర సౌందర్య సోషల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలోని ముళబాగల్‌ తాలూకాలోని తమ గ్రామం గంగికుంటను అభివృద్ధి చేసారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమరనాథ్‌, అతని భార్య ఎంతో సహకరించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు. సౌందర్య కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ఆర్థిక సహాయం చేస్తూనే ఉంది. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరి అని భావించిన సౌందర్య.. 2004 జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అందులో భాగంగానే కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగరరావు తరఫున ప్రచారం చేసేందుకు 2004 ఏప్రిల్‌ 17 ఉదయం 11 గంటలకు బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి చార్టెర్డ్‌ విమానంలో బయల్దేరారు సౌందర్య. ఆమెతోపాటు సోదరుడు అమరనాథ్‌ కూడా ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో ఉన్నవారంతా సజీవ దహనమైపోయారు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో సౌందర్య ఐదు నెలల గర్భవతి. ఒక అద్భుతమైన నటి జీవితం 31 సంవత్సరాల అతి చిన్న వయసులో విషాదాంతం కావడం అందర్నీ కలచివేసింది. సౌందర్య నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారట. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళపాటు అగ్రనటిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు, ఆమె కెరీర్‌ 2004లో ఎండ్‌ అవుతుందని కూడా ఆయన చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన చెప్పినట్టుగానే సౌందర్య కెరీర్‌ ముగిసింది. అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరం.