మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన

Publish Date:Dec 24, 2025

మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.  విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు.  బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్  క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.  నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు. 

మోడీ మౌనం దేనికి సంకేతం?

Publish Date:Dec 24, 2025

బంగ్లాదేశ్ లో  హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.  ఇప్ప‌టికీ మ‌ణిపూర్ మ‌ర‌క అలాగే  ఉంది. ఆ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించిన‌పుడు కూడా ఎలాంటి స్పంద‌నా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్ల‌మెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ  పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్య‌వ‌హారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే..    ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి   కీల‌కాంశాలు సభలో అస‌లు చ‌ర్చ‌కే  రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం.  ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ  భ‌క్తి  హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే..  బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?   ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా  ఇందిరాగాంధీ ఉండి ఉంటే  ప‌రిస్థితి ఇలా  ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.  బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని  తాత్కాలిక యూన‌స్ ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఆయ‌న  ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన పాల‌కుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్ప‌టికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్ర‌భుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూన‌స్ సర్కార్  ప్ర‌జా  ప్ర‌భుత్వం  కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.   అదలా ఉంటే..  యూన‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన భార‌త  వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల‌ను ఆక్ర‌మించే య‌త్నం చేస్తున్నారు.  చైనాతో క‌ల‌సి బార‌త  వ్య‌తిరేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును స‌జీవ ద‌హ‌నం చేసిన  ఘ‌ట‌న‌లో కేంద్రం క‌నీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్క‌డేగానీ ఆయ‌న  పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అత‌డిని సజీవదహనం చేశారు.  అలాంటి బంగ్లా ప్ర‌భుత్వంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.  డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?

Publish Date:Dec 24, 2025

  ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి.  వారి వారి సాంప్రదాయాల పరంగా మార్పులు ఉంటాయి.  అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో కూడా  క్రిస్మస్ లో కూడా ఒక ప్రత్యేకత, వింత ఉంది.  అదే శాంతా క్లాజ్.. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ వేడుక వచ్చిందంటే పిల్లలు అందరూ శాంతా క్లాజ్ కోసం ఎదురు చూస్తారు.  శాంతా క్లాజ్ పిల్లలకు బోలెడు బహుమతులు తెస్తాడని నమ్ముతారు.  అయితే ఐస్లాండ్ లో మాత్రం శాంతా క్లాజ్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలలో శాంతా క్లాజ్ ఒక్కడే.. కానీ ఐస్లాండ్ లో మాత్రం 13మంది శాంతా క్లాజ్ లు ఉంటారట. జానపద కథ ఏం చెప్తుందంటే.. ప్రతి దేశంలో జానపద కథలు ఉన్నట్టే ఐస్లాండ్ లోనూ జానపద కథలు ఉన్నాయి. అక్కడి జానపద కథల ప్రకారం అక్కడి శాంతా క్లాజ్ లను యూల్ లాడ్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. ఈ 13మంది గురించి మొదటగా 1862లో ప్రస్తావించబడిందట. రచయిత జాన్ అర్నాసన్ ప్రసిద్ధ గ్రిమ్స్ నుండి ప్రేరణ పొంది జానపద కథలను సేకరించడం మొదలు  పెట్టాడు. 1932లో ఐస్లాండిక్ కవి జోహన్నెస్ ఉర్ కోట్లమ్  యూల్ లాడ్స్ అనే కవితను క్రిస్మస్ ఈజ్ కమింగ్ అనే పుస్తకంలో ప్రచురించాడు.  ఇది వారి పేర్లు, వ్యక్తిత్వాలతో పాటు వారి గురించి ఒక నమ్మకాన్ని సెట్ చేసింది. యూల్ లాడ్స్ ప్రకారం 13మంది అన్నదమ్ములు గ్రైలా అనే ట్రోల్ కు జన్మించారట. కానీ కాలక్రమేణా వారి పిల్లలు, వారసులు అందరూ ఉదారంగా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్లారచ.  దీని వల్ల వారికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. చివరకు వారికి ఏమీ మిగలకుండా పోయిందట.  క్రిస్మస్ కు ముందు ప్రతి రాత్రి ఈ 13మంది యూల్ లాడ్స్ పిల్లలను అందరినీ సందర్శిస్తారట. ఐస్లాండ్ జానపద కథల ప్రకారం,  ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన ప్రతి చిన్న పిల్లవాడు యూల్ లాడ్స్ నుండి  ఒక చిన్న బహుమతి పొందుతాడట.  అంతేకాదు.. అల్లరి పిల్లలకు పచ్చిగా ఉన్న  లేదా కుళ్లిన బంగాళాదుంపను ఇస్తారట.  అక్కడి పిల్లలు క్రిస్మస్ బహుమతి స్వీకరించడానికి కిటికి గుమ్మం మీద ఒక  షూ ను ఉంచుతారట.  ఇదీ ఐస్లాండ్ లో క్రిస్మస్ విశేషం.                                         *రూపశ్రీ.
[

Health

]

ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు  చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!

Publish Date:Dec 24, 2025

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు.  అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం.. నిమ్మకాయ నీరు  క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ  ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు  తాగడం వల్ల  శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద  నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు? చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.   ఎలక్ట్రోలైట్ అంటే..  పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్,  బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు.  ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను  వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి  గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి. ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత.. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.  మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల  తలనొప్పి, గుండె లయ  గందరగోళంగా ఉండటం,  కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.  అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.