అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా హీరో కృష్ణ‌!

  తెలుగు సినీ రంగంలో ప్ర‌యోగాలు, సాహ‌సాలకు కేరాఫ్ అడ్ర‌స్ సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. అనేక జాన‌ర్ సినిమాల‌కు, అనేక ఫార్మ‌ట్ల‌కు ఆయ‌న సినిమాలే పునాది రాళ్లు వేశాయి. అదే త‌ర‌హాలో తొలిసారిగా అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న సినిమా కూడా కృష్ణ న‌టించిందే. ఆ సినిమా 'హ‌రేకృష్ణ హ‌లోరాధ' (1980). ఒక పాట‌, అతి కొద్ది సీన్లు మిన‌హా 90 శాతం షూటింగ్‌ను అమెరికాలోనే జ‌రుపుకున్న సినిమా ఇది. శ్రీ‌ప్రియ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్‌. భ‌ర‌ణీరెడ్డి నిర్మించ‌గా ప్ర‌భాక‌ర్‌రెడ్డి, స‌త్య‌నారాయ‌ణ విల‌న్లుగా న‌టించారు. ర‌తి, ప్ర‌కాశ్ మ‌రో జోడీగా న‌టించారు. అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌పాల‌నే ఉద్దేశంతో క‌థ‌ను అక్క‌డి బ్యాక్‌డ్రాప్‌తో డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ స్వ‌యంగా రాశాడు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఒకేసారి ఈ సినిమాని నిర్మించారు. త‌మిళ వెర్ష‌న్‌లో హీరోగా శివ‌చంద్ర‌న్ న‌టించాడు. లాస్ ఏంజెల్స్‌లోని శాంతామోనికా బీచ్‌, శాండియాగో బీచ్‌, లాస్ వేగాస్‌, ఫీనిక్స్ లాంటి లొకేష‌న్ల‌లో సీన్లు, పాట‌లు తీశారు. క్లైమాక్స్ సీన్ల‌ను గ్రాండ్ కాన్య‌న్‌లో చిత్రీక‌రించారు. 'మెక‌న్నాస్ గోల్డ్' షూటింగ్ జ‌రుపుకున్న ప్ర‌దేశంగా గ్రాండ్ కాన్య‌న్ ఆ రోజుల్లో బాగా ఫేమ‌స్‌.  ఫీనిక్స్ సిటీ 'రోడియో' అనే గుర్రాల ఆట‌కు ఫేమ‌స్‌. పొగ‌రుబోతు గుర్రాల‌ను లొంగ‌దీసుకోవ‌డానికి హార్స్ రైడ‌ర్స్ ప‌డే పాట్లే ఆ రోడియో ఆట‌. ఆ ఆట‌ను చిత్రీకించ‌డం కోస‌మే ఫీనిక్స్‌లో షూటింగ్ చేశారు. ఆ ఆట‌ను చూస్తూ, ఎవ‌రూ లొంగ‌దీయ‌లేని గుర్రాన్ని హీరో కృష్ణ లొంగ‌దీసే సీన్ల‌ను అక్క‌డ తీశారు. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఓ కొత్త అనుభ‌వాన్నిచ్చింది.  డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌కు సంబంధించిన ఓ విష‌యం ప్ర‌స్తావించ‌ద‌గ్గ‌ది. అదేమంటే.. ఆదుర్తి సుబ్బారావు 'తేనెమ‌న‌సులు' (1965)తో కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేశార‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలుసు. కానీ దానికంటే ముందు ఓ త‌మిళ చిత్రంతో కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు శ్రీ‌ధ‌ర్‌. అది మిస్స‌య్యింది. ఆ త‌ర్వాత 15 సంవ‌త్స‌రాల‌కు కానీ, 'హ‌రేకృష్ణ హ‌లోరాధ' సినిమాతో కృష్ణ‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం శ్రీ‌ధ‌ర్‌కు రాలేదు.

డాన్స్ రాని కృష్ణ చేసిన క్లాసిక‌ల్ డాన్స్.. "మ్రోగింది ఢ‌మ‌రుకం.."!

  కృష్ణ కెరీర్‌లోని ప్ర‌త్యేక‌మైన చిత్రాల్లో 'ఏక‌ల‌వ్య' (1982) ఒక‌టి. ఎన్టీఆర్ 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిన కొండ‌వీటి వెంక‌ట‌క‌వితో ఈ సినిమా స్క్రిప్టు రాయించారు నిర్మాత ఎం.ఎస్‌. రెడ్డి. గురువుగా భావించిన ద్రోణాచార్యుడు అడిగిన వెంట‌నే ఎలాంటి సంకోచం లేకుండా త‌న‌ కుడిచేతి బొట‌న‌వేలును గురుద‌క్షిణ‌గా స‌మ‌ర్పించిన మ‌హాగొప్ప శిష్యుడు ఏక‌ల‌వ్యుని క‌థ‌తో అంత‌దాకా తెలుగులోనే కాదు, ఏ భాష‌లోనూ సినిమా రాలేదు.  నిజానికి అదివ‌ర‌కు బాల‌కృష్ణ‌తో ఒక‌సారి, శోభ‌న్‌బాబుతో ఒక‌సారి ఏక‌ల‌వ్య సినిమా చేయాల‌నుకున్న వేరే నిర్మాత‌ల ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అందుకే ఏ విష‌యంలోనైనా సాహ‌సాలు, ప్ర‌యోగాలు చేయ‌డానికి ముందుండే కృష్ణ‌.. ఆ సినిమా అవ‌కాశం రావ‌డాన్ని త‌న అదృష్టంగా భావించారు. 'అల్లూరి సీతారామ‌రాజు' త‌ర్వాత ఆయ‌న ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డి, ఇష్టంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా 'ఏక‌ల‌వ్య‌'. జ‌య‌ప్ర‌ద నాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి విజ‌యారెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ఓ స‌న్నివేశం ఉంది. బండ‌రాళ్ల‌లోనూ చైత‌న్యం తీసుకురావాల‌ని ఏక‌ల‌వ్యుడు త‌న దిన‌చ‌ర్య‌లో భాగంగా సూర్యోద‌యానికి ముందు శివ‌తాండ‌వం చేస్తుంటాడు. సినిమాలో తొలి స‌న్నివేశం అదే. ఆ సంద‌ర్భంలోనే "మ్రోగింది ఢ‌మ‌రుకం.. మేల్కొంది హిమ‌న‌గం.. సాగింది శివ‌తాండ‌వం.. శంభో శివం శంక‌రం" అంటూ పాట వస్తుంది. దీనికి సెమీ క్లాసిక‌ల్ డాన్స్ చేయాలి. కృష్ణ‌కు క్లాసిక‌ల్ డాన్స్ రాదు. అయినా త‌న‌కు రాద‌ని చెప్పి దేన్నీ వ‌దిలేసే ర‌కం కాదు కృష్ణ‌. ఆయ‌న మొండిఘ‌టం. ఆయ‌న‌ది.. త‌ను చేసింది చూసి ఎవ‌రేమ‌నుకున్నా ల‌క్ష్య‌పెట్ట‌ని స్వ‌భావం.  కొరియోగ్రాఫ‌ర్ శ్రీ‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆ పాట‌కు అవ‌స‌ర‌మైన డాన్స్‌ను ప్రాక్టీస్ చేశారు కృష్ణ‌. ఆ త‌ర్వాత మూడు రోజుల్లోనే ఆ పాట షూటింగ్‌ను ఆయ‌న పూర్తి చేశారు. కృష్ణ అభిమానుల‌కు బాగా న‌చ్చిన పాట‌ల్లో, కృష్ణ చేసిన డాన్సుల్లో బాగా న‌చ్చిన డాన్సుల్లో ఇది ఒక‌టి. మ‌ల్లెమాల (ఎం.ఎస్‌. రెడ్డి) స్వ‌యంగా రాసిన ఈ పాట‌ను ఎస్పీ బాలు అద్భుతంగా గానం చేశారు. కె.వి. మ‌హ‌దేవ‌న్ సంగీతం ఈ పాట‌ను మ‌రో స్థాయికి చేర్చింది.

కృష్ణ‌ను ఇండియ‌న్ కౌబాయ్‌గా నిలిపిన 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' చూసి.. ఎన్టీఆర్ చేసిన కామెంట్‌!?

  సాహ‌స‌మే ఊపిరిగా తెలుగుచిత్ర‌సీమ‌ను ఏలిన హీరో.. కృష్ణ‌. ఏవి తీయ‌వ‌ద్దంటే అవి తీసి చూపించిన‌వాడు హీరో కృష్ణ‌. "నువ్వు జేమ్స్‌బాండ్ ఏంటి?" అన్న‌వాళ్ల‌కు స్పై ఫిలిమ్స్ తీసి, 'ఆంధ్రా జేమ్స్‌బాండ్' అనే పేరు సంపాదించుకున్న‌వాడు హీరో కృష్ణ‌. "కౌబాయ్ సినిమా తియ్య‌కు.. ఆరిపోతావ్" అన్న‌వాళ్ల‌కు తీసి, ఇండియన్ కౌబాయ్‌గా పేరు పొందిన‌వాడు.. హీరో కృష్ణ‌! అవును. దేశంలోనే కౌబాయ్ సినిమాల‌కు కేరాఫ్‌గా సూప‌ర్‌స్టార్ కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఇప్ప‌టికీ ఇండియాలో కౌబాయ్ మూవీ అంటే ఎవ‌రికైనా గుర్తుకు వ‌చ్చేది 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' సినిమాయే. దాని త‌ర్వాత ఎంత‌మంది ఆ త‌ర‌హా సినిమాలు చేసినా, దాని ద‌రిదాపుల్లోకి వెళ్ల‌లేక‌పోయారు. వెస్ట‌ర‌న్ కంట్రీస్‌కు చెందిన ఇతివృత్తాన్ని ఇండియ‌నైజ్ చేసి, మెప్పించిన హీరోగా చ‌రిత్ర‌లో నిలిచారు కృష్ణ‌. ఇవాళ ఆ హీరో.. ఆ సూప‌ర్‌స్టార్ 78వ పుట్టిన‌రోజు. 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' కృష్ణ చేసిన తొలి కౌబాయ్ ఫిల్మ్‌. శ్రీ ప‌ద్మాల‌యా మూవీస్‌ బ్యాన‌ర్ మొద‌లుపెట్టి తీసిన 'అగ్నిప‌రీక్ష' ఆశించిన రీతిలో ఆడ‌క‌పోవ‌డంతో, రెండో సినిమాకి కొత్త ప్ర‌యోగం చేయాల‌నుకున్నారు సాహ‌సి కృష్ణ‌. ఆ టైమ్‌లో రిలీజైన హాలీవుడ్ సినిమాలు 'మెక‌న్నాస్ గోల్డ్‌', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు చూసి, ఆ త‌ర‌హా కౌబాయ్ సినిమా చెయ్యాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో క‌లిగింది. వాటి ఆధారంగా తెలుగు వాతావార‌ణంతో క‌థ కావాల‌ని అడిగితే, రాసిచ్చారు అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులైన ఆరుద్ర‌. ఆ క‌థ బాగా న‌చ్చింది కృష్ణ‌కు.  అప్పుడు ఆయ‌న సినిమాల బ‌డ్జెట్ మూడు, నాలుగు ల‌క్ష‌ల‌కు మించేది కాదు. కానీ ఈ సినిమాకు ఏడు నుంచి ఎనిమిది ల‌క్ష‌లు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. అంటే డ‌బుల్ బ‌డ్జెట్ అన్న‌మాట‌. అదెంత రిస్కో ఆ కాలం వాళ్ల‌కే తెలుసు. పైగా ఫ‌స్ట్ టైమ్ రాజ‌స్థాన్‌లోని థార్ ఎడారిలో, బ్యూటిఫుల్ లొకేష‌న్స్ ఉండే సిమ్లాలో ఈ సినిమాని షూట్ చేశారు. ఇవాళ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' సినిమాని తియ్య‌మంటే మ‌న డైరెక్ట‌ర్లు వంద నుంచి 150 రోజులు.. అంత‌కంటే ఎక్కువ టైమ్ కూడా తీసుకుంటారు. కానీ కృష్ణ త‌మ్ముళ్లు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావు ప్లానింగ్‌, కె.ఎస్‌.ఆర్‌. దాస్ స్పీడ్ డైరెక్ష‌న్ క‌లిసి.. ఈ సినిమాని 28 రోజుల్లో పూర్త‌య్యేట్లు చేశాయంటే ఎంత ఆశ్చ‌ర్యం! దాని వ‌ల్ల అనుకున్న ఏడు కోట్ల బ‌డ్జెట్‌లోపే ఈ సినిమాని తియ్య‌గ‌లిగారు.  కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా విజ‌య‌నిర్మ‌ల న‌టించిన ఈ మూవీలో నాగ‌భూష‌ణం, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, త్యాగ‌రాజు, జ్యోతిల‌క్ష్మి, శాంత‌కుమారి, రావు గోపాల‌రావు, ధూళిపాళ‌, గోకిన రామారావు, కాక‌రాల‌, సాక్షి రంగారావు, జ‌గ్గారావు, ఎస్‌. వ‌ర‌ల‌క్ష్మి లాంటి మహామ‌హులు కీల‌క పాత్ర‌లు పోషించారు. చిన్న‌ప్ప‌టి కృష్ణ‌గా ఆయ‌న పెద్ద కొడుకు ర‌మేశ్‌బాబు న‌టించాడు. గుమ్మ‌డి ఓ అతిథి పాత్ర చేశారు. క‌థ‌, మాట‌లు ఆరుద్ర రాసిన ఈ సినిమాకు ఆదినారాయ‌ణ‌రావు సంగీతం, వి.ఎస్‌.ఆర్‌. స్వామి  సినిమాటోగ్ర‌ఫీ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'కు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. నిజానికి ఈ సినిమాకు మొద‌ట అనుకున్న పేరు 'అదృష్ట‌రేఖ‌'. కానీ కౌబాయ్ సినిమాకు త‌గ్గ క‌మ‌ర్షియ‌ల్ టైటిల్ కావాల‌నునుకొని 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' అనే టైటిల్ నిర్ణ‌యించారు. 1971 ఆగస్ట్ 27న విడుద‌ల చేయ‌డానికి ముందుగా త‌న అభిమాన న‌టుడు ఎన్టీఆర్‌కు చూపించారు కృష్ణ‌. ఆయ‌న చూసి, "సినిమా చాలా బాగుంది. కానీ దీనితో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని మిస్స‌వుతున్నారు. నెక్ట్స్ టైమ్‌ మిస్ కాకుండా చూసుకోండి." అని చెప్పారు ఎన్టీఆర్‌. అనేక‌మంది సందేహాల‌తో ఎదురుచూస్తుండ‌గా విడుద‌లైన 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' తొలిరోజే సూప‌ర్ హిట్ట‌నే టాక్‌ను సొంతం చేసుకుంది. బ్ర‌హ్మాండ‌మైన క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత కూడా ఎన్నిసార్లు ఈ సినిమా రిలీజైనా మంచి వ‌సూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. హాలీవుడ్ సినిమాల ప్రేర‌ణ‌తో తీసిన ఈ సినిమాని 'ద ట్రెజ‌ర్ హంట్' పేరుతో ఇంగ్లిష్‌లోకి డ‌బ్ చేసి, ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేయ‌డాన్ని అప్ప‌ట్లో ఎంతో గొప్ప‌గా చెప్పుకున్నారు. ఏకంగా 150 దేశాల్లో ఈ సినిమా విడుద‌ల‌వ‌డం ఏ ర‌కంగా చూసినా ఒక తెలుగు సినిమాకు సంబంధించిన చాలా అరుదైన విష‌యం. 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' త‌ర్వాత కృష్ణ‌.. మొన‌గాడొస్తున్నాడు జాగ్ర‌త్త‌, మావూరి మొన‌గాళ్లు, నిజం నిరూపిస్తా, మంచివాళ్ల‌కు మంచివాడు, దొంగ‌ల దోపిడి.. లాంటి కౌబాయ్ సినిమాలు చేసి, ఇండియ‌న్ కౌబాయ్‌గా త‌న పేరు చిర‌స్థాయిగా నిల‌బ‌డేట్లు చేసుకున్నారు.

వేషం అడిగిన కృష్ణ‌.. మూడేళ్ల త‌ర్వాత క‌నిపించ‌మ‌న్న ఎన్టీఆర్‌!

  మాస్‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న హీరోగా దివంగ‌త ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు, తానే ఒక చరిత్ర‌గా నిలిచారు. ఆయ‌న ఫ్యాన్ అసోసియేష‌న్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్ అనేది అప్ప‌టివాళ్లంద‌రికీ తెలుసు. ఆయ‌న త‌ర్వాత ఫ‌వ‌ర్‌ఫుల్ ఫ్యాన్ బేస్ క‌లిగిన మాస్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. రాజ‌కీయంగా ఎన్టీఆర్‌ను కృష్ణ ఎంత వ్య‌తిరేకించినా, ఆయ‌న అభిమాన న‌టుడు మాత్రం ఎన్టీఆరే. ఆయ‌న స్ఫూర్తితోనే సినిమా న‌టుడు కావాల‌ని ఆశ‌ప‌డి, ఆ ఆశ‌ను నిజం చేసుకున్నారు కృష్ణ‌. స్కూలు రోజుల నుంచే నంద‌మూరి తార‌క‌రామారావు అభిమానిగా, ఆయ‌న న‌టించే ప్ర‌తి సినిమానూ చూస్తూ వ‌చ్చారు కృష్ణ‌.  18 సంవ‌త్స‌రాల వ‌య‌సులో త‌న అభిమాన న‌టుడ్ని తొలిసారి వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకున్నారు కృష్ణ‌. అప్పుడు ఎన్టీఆర్ 'సీతారామ క‌ల్యాణం' (1961)ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. అందులో రాముని వేషం త‌న‌కు ఇవ్వాల్సిందిగా అడిగారు. ఇంకా చిన్న‌వాడిలా క‌నిపిస్తున్న ఆయ‌న‌ను చూసి, "రాముని వేషానికి అప్పుడే నువ్వు స‌రిపోవు, ల‌క్ష్మ‌ణుని వేషం ఇద్దామంటే, ఇప్ప‌టికే దానికి శోభ‌న్‌బాబును ఎంపిక చేశాను. మూడేళ్ల త‌ర్వాత క‌నిపించు." అని చెప్పి పంపించారు ఎన్టీఆర్‌. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే బుర్రిపాలెం వెళ్లిపోయి, మ‌ళ్లీ మూడేళ్ల త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు కృష్ణ‌. అయితే ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా, ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో ప‌డి, 'తేనె మ‌న‌సులు' (1965)తో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌ను క‌లిసి ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు కృష్ణ‌. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు త‌న అభిమాన న‌టుడితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కృష్ణ‌కు. ఆ సినిమా 'స్త్రీజ‌న్మ' (1967). డి. రామానాయుడు నిర్మించ‌గా, కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావు (కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి) డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో అన్న‌ద‌మ్ములుగా న‌టించారు ఎన్టీఆర్‌, కృష్ణ‌. గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే, క‌లిసి న‌టించిన ప్ర‌తి సినిమాలోనూ ఆ ఇద్ద‌రూ అన్నాత‌మ్ముళ్లుగా న‌టించ‌డం. నిలువు దోపిడి (1968), విచిత్ర కుటుంబం (1969), దేవుడు చేసిన మ‌నుషులు (1973), వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు (1982) చిత్రాల్లో వారు బ్ర‌ద‌ర్స్‌గానే న‌టించారు.

టాలీవుడ్‌లో 'ఫ్రీమేక్' అయిన కొరియ‌న్ ఫిలిమ్స్ ఏవో తెలుసా?

  సౌత్ కొరియ‌న్ సినిమాల‌కు గ‌త ద‌శాబ్ద కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ఒక‌ప్పుడు ఆ దేశానికే ప‌రిమిత‌మై ఉండే ఆ సినిమాలు ఇవాళ అంత‌ర్జాతీయంగా మార్కెట్ సంపాదించుకొని, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లాభాల పంట పండిస్తున్నాయి. ఆ భాష‌లో సూప‌ర్ హిట్ట‌యిన ప‌లు సినిమాలు ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అవుతున్నాయి. మ‌న తెలుగువాళ్లు కూడా కొరియ‌న్ సినిమాల‌పై చాలా కాలంగా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే వారెక్కువ‌గా రీమేక్‌లు కాకుండా కాపీ చేయ‌డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వ‌చ్చారు. కొరియ‌న్ సినిమాల్లోని యాక్ష‌న్ సీన్ల‌నో, డ్రామా సీన్ల‌నో మ‌క్కీకి మ‌క్కీ దింపేసిన సంద‌ర్భాలున్నాయి. అల్ల‌రి న‌రేశ్ సినిమా 'జేమ్స్‌బాండ్‌.. నేను కాదు నా పెళ్లాం' అందుకు నిద‌ర్శ‌నం. ఫేమ‌స్ కొరియ‌న్ ఫిల్మ్ 'మై వైఫ్ ఈజ్ ఎ గ్యాంగ్‌స్ట‌ర్‌'ను చాలావ‌ర‌కు ఆ మూవీలో దించేశారు. కానీ అది అఫిషియ‌ల్ రీమేక్ కాదు.  ఇదివ‌ర‌కు కూడా తెలుగులో కొన్ని కొరియ‌న్ ఫిలిమ్స్‌ను రీమేక్ చేశారు. తార‌క‌ర‌త్న ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ర‌విబాబు రూపొందించిన 'అమ‌రావ‌తి' (2009) మూవీ కొరియ‌న్ ఫిల్మ్ 'హెచ్' (2002)కు రీమేక్‌. కెరీర్‌లో ఆరంభంలో నానికి బాగా ప్ల‌స్స‌యిన చిత్రాల్లో ఒక‌టైన 'పిల్ల జ‌మీందార్' (2011) కూడా 'ఎ మిలియ‌నీర్స్ ఫ‌స్ట్ ల‌వ్' (2006) అనే కొరియ‌న్ ఫిల్మ్ ఆధారంగా తీసిందే. ఆది సాయికుమార్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, వైభ‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన 'నెక్స్ట్ నువ్వే' (2017) పేరుకు త‌మిళ ఫిల్మ్ 'యామిరుక్క బ‌య‌మే'కు రీమేక్ కానీ, దాని ఒరిజిన‌ల్ 'ద క్వ‌య‌ట్ ఫ్యామిలీ' (1998) అనే కొరియ‌న్ ఫిల్మ్‌. అయితే కొరియ‌న్ హిట్ 'మిస్ గ్రానీ'ని ల‌క్ష్మి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నందినీరెడ్డి 'ఓ బేబీ' పేరుతో రీమేక్ చేశాక‌, అఫిషియ‌ల్ రీమేక్స్ వైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు కూడా దృష్టి సారిస్తున్నారు. అట్లా ప్ర‌స్తుతం 'మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్' తెలుగులో రీమేక్ అవుతోంది. ఆ మూవీతో పాటు 'డాన్సింగ్ క్వీన్' (2012) రీమేక్ రైట్స్‌ను కూడా నిర్మాత డి. సురేశ్‌బాబు తీసుకున్నారు. ఆయ‌నే మ‌రో రెండు నిర్మాణ సంస్థ‌లు గురు ఫిలిమ్స్‌, ఎస్‌.కె. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి మ‌రో కొరియ‌న్ ఫిల్మ్ 'ల‌క్కీ కీ' రీమేక్ హ‌క్కులు పొంది, తెలుగు స‌హా ప‌లు భార‌తీయ భాష‌ల్లో దాన్ని రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మొద‌ట న‌వ్వుల‌పాలై 'మాయాబ‌జార్‌'తో మాయ‌చేసిన‌ తార‌క‌రాముని శ్రీ‌కృష్ణావ‌తారం!

  జ‌గ‌ద్విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు త‌న కెరీర్‌లో 40 పౌరాణిక చిత్రాలు చేస్తే, వాటిలో శ్రీ‌కృష్ణుని పాత్ర పోషించిన చిత్రాలు 18. సాంఘిక చిత్రాల్లో వ‌చ్చే అంత‌ర్నాట‌కాల‌తో క‌లిపి 33 సార్లు కృష్ణునిగా క‌నిపించారు. ప్ర‌పంచంలోని మ‌రే నటుడూ ఒకే పాత్ర‌ను వెండితెర‌పై ఇన్నిసార్లు పోషించిన దాఖ‌లా లేదు. శ్రీ‌కృష్ణుడంటే మ‌న‌కు ఆ వేషంలోని ఎన్టీఆరే క‌ళ్ల‌ముందు మెదులుతారు. నిజానికి ఆయ‌న కృష్ణ పాత్ర‌ను మొద‌టిసారి 'సొంత‌వూరు' అనే సాంఘిక చిత్రంలో చేసి న‌వ్వుల పాల‌య్యారు. ఆ విష‌యాన్ని ఆయ‌నే ఓ సంద‌ర్భంగా చెప్పారు. "నా మొట్ట‌మొద‌టి కృష్ణుని వేషం చూసి నాకే న‌వ్వు వ‌చ్చింది. కొన్ని నాట‌కాల్లో లాగా డ‌బ్బా కృష్ణుడి వేషం అనిపించింది. ఆ కిరీటం, దుస్తులు నాక‌స‌లు న‌చ్చ‌లేదు. నా ముఖ‌మే నాకు భ‌యంక‌రంగా అనిపించింది. ఇలా మాత్రం ఇంకెప్పుడూ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను." అని తెలిపారు ఎన్టీఆర్‌. అయితే ఏ పాత్ర‌కు త‌ను స‌రిపోన‌ని అనుకున్నారో ఆ పాత్ర‌తోనే చ‌ల‌న‌చిత్ర జ‌గ‌త్తులో ఒక కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. సాక్షాత్తూ ఆయ‌న శ్రీ‌కృష్ణుడ‌నే న‌మ్మ‌కంతో ఆ వేషంలోని ఆయ‌న ఫొటోల‌ను ప‌ల్లెప‌ట్టుల్లోని తెలుగువారు త‌మ ఇళ్ల‌ల్లో పెట్టుకొని పూజ‌లు చేశారు. 1957లో విడుద‌లైన 'మాయాబ‌జార్' డైరెక్ట‌ర్ కె.వి. రెడ్డి.. ఆ చిత్రంలోని శ్రీ‌కృష్ణుని పాత్ర‌కు ఎన్టీఆర్ పేరును ప్ర‌తిపాదించిన‌ప్పుడు నిర్మాత‌లు స‌హా అంద‌రూ వ్య‌తిరేకించారు. ఆ పాత్ర‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఆయ‌న‌కు లేవ‌ని వారు వాదించారు.  ఆ రోజుల్లో కృష్ణుని పాత్ర‌కు ఈల‌పాట రఘురామ‌య్య పెట్టింది పేరు. ఇటు రంగ‌స్థ‌లం మీద కానీ, అటు వెండితెర మీద కానీ అప్ప‌టిదాకా కృష్ణుడంటే ఆయ‌నే. అందుక‌ని మాయాబ‌జార్‌లోనూ ఆ పాత్ర‌కు ర‌ఘురామ‌య్య‌ను తీసుకొమ్మ‌ని కె.వి. రెడ్డిని ఒత్తిడి చేశారు. కానీ ఆ వాద‌న‌ను కె.వి. రెడ్డి తోసిపుచ్చారు. శ్రీ‌కృష్ణ పాత్ర‌కు రామారావు బాగా న‌ప్పుతార‌ని గ‌ట్టిగా చెప్పి అంద‌ర్నీ ఒప్పించారు.  'మాయాబ‌జార్‌' విడుద‌ల‌య్యాక ఆయ‌న న‌మ్మ‌కం వంద శాతం నిజ‌మైంది. ఎంతో అంద‌మైన శ్రీ‌కృష్ణుడిని మొద‌టిసారిగా ప్రేక్ష‌కులు సినిమాతెర‌పై చూశారు. హాస్య‌న‌టులు ప‌ద్మ‌నాభం ఓ ఇంట‌ర్వ్యూలో.. "రామారావుగారు 'మాయాబ‌జార్' చిత్రంలో శ్రీ‌కృష్ణ‌డిగా వేశారు. ఆ చిత్రానికే కాదు, వారిక్కూడా బ్ర‌హ్మాండ‌మైన పేరు వ‌చ్చింది. శ్రీ‌కృష్ణుడంటే ర‌వివ‌ర్మ చిత్రాల్లో ఊహించుకుంటాం. కాని అన్న‌గారు ఆ వేషంలో ముఖ్యంగా ద్వాప‌ర‌యుగంలోని శ్రీ‌కృష్ణుడిలాగానే ఉన్నారు." అని చెప్పారు. ఆ త‌ర్వాత వినాయ‌క చ‌వితి, స‌తీ అన‌సూయ‌, దీపావ‌ళి, శ్రీ కృష్ణార్జున యుద్ధం, వీరాభిమ‌న్యు, శ్రీ‌కృష్ణ పాండ‌వీయం, శ్రీ‌కృష్ణ తులాభారం, శ్రీ‌కృష్ణావ‌తారం, శ్రీ‌కృష్ణ విజ‌యం, శ్రీ‌కృష్ణ స‌త్య‌, శ్రీ కృష్ణాంజ‌నేయ యుద్ధం, దాన‌వీర‌శూర క‌ర్ణ‌, శ్రీ మ‌ద్విరాట ప‌ర్వం త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న శ్రీ‌కృష్ణునిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

రాఘ‌వేంద్ర‌రావు రిజెక్ట్ చేస్తే.. ఎన్టీఆర్ స్వ‌యంగా డైరెక్ట్ చేసిన చిత్రం 'చండ‌శాస‌నుడు'!

  న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావుకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ తొలిసారి ర‌చ‌న చేసిన సినిమా 'అనురాగ దేవ‌త' (1982). దాని త‌ర్వాత వారు 'చండ‌శాస‌నుడు' సినిమాకు క‌థ‌, మాట‌లు స‌మ‌కూర్చారు. నిజానికి ఆ సినిమాను కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేయాల్సింది. కానీ ఆయ‌న‌కు ఆ స్క్రిప్టు న‌చ్చ‌లేదు. దాంతో ఎన్టీఆరే స్వ‌యంగా ఆ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ మూవీని ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రించారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌లో మొద‌ట ఎన్టీఆర్‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది పెద్ద‌వాడైన వెంక‌టేశ్వ‌ర‌రావు. ఆయ‌నే మాట‌ల సంద‌ర్భంలో ఎన్టీఆర్‌తో "మా త‌మ్ముడు గోపాల‌కృష్ణ ఉయ్యూరులో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వాడికి మీరంటే ప్రాణం. మీరు తెర‌మీద క‌నిపించ‌గానే ఊగిపోతాడు. మావాడి ద‌గ్గ‌ర చండ‌శాస‌నుడు అనే క‌థ ఉంది. మీరు వింటానంటే పిలిపిస్తాను." అని చెప్పారు. రామారావు గారు పిలిపించ‌మ‌ని చెప్ప‌డంతో, వ‌చ్చి క‌థ చెప్పారు గోపాల‌కృష్ణ‌. న‌చ్చితే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చెయ్యాల‌ని రామారావు గారు అనుకున్నారు. కానీ ఆయ‌న త‌న‌కు ఆ క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్పారు. ఎన్టీఆర్‌కు మాత్రం న‌చ్చింది. ఒక‌రోజు గోపాల‌కృష్ణ ప‌నిచేస్తున్న కాలేజీకి ట్రంక్ కాల్ చేశారు ఎన్టీఆర్‌. మ‌ద్రాసుకు వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని చెప్పారు. అలాగే అని మ‌ద్రాస్ వెళ్లారు గోపాల‌కృష్ణ‌. "మ‌నం 'చండ‌శాస‌నుడు'పై కూర్చుందాం. అందుకే పిలిపించాం" అన్నారు ఎన్టీఆర్‌. డైరెక్ట‌ర్ ఎవ‌ర‌ని అడిగారు గోపాల‌కృష్ణ‌. "మేమే చేస్తాం" అనేది ఎన్టీఆర్ స‌మాధానం. మూడు రోజుల్లో స్క్రిప్టుకు డైలాగ్స్ రాసేశారు గోపాల‌కృష్ణ‌. అలా 'అనురాగ‌దేవ‌త'కు ప‌నిచేశాక‌, ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలోనే, వారే నిర్మాత‌గా రూపొందిన 'చండ‌శాస‌నుడు' చిత్రానికి ప‌రుచూరి సోద‌రులు క‌థ‌, మాట‌లు స‌మ‌కూర్చారు. ఆ సినిమాకు సంబంధించిన మ‌రో విశేషం ఏమిటంటే అందులో శార‌ద చేసిన పాత్ర‌కు మొద‌ట జ‌యంతిని అనుకున్నారు రామారావుగారు. అయితే ఆ పాత్ర‌కు శార‌ద అయితే బాగుంటార‌ని గోపాల‌కృష్ణ సూచించారు. "ఆమె ఆ పాత్ర‌ను చేయ‌గ‌ల‌రా?" అని ప్ర‌శ్నించారు ఎన్టీఆర్‌. 'న్యాయం కావాలి' చిత్రంలో శార‌ద న‌ట‌న‌ను ప్ర‌స్తావించి, ఆమె డైలాగ్స్ బాగా చెప్తార‌ని తెలిపారు గోపాల‌కృష్ణ‌. ఆయ‌న చెప్పిన‌ట్లే ఆ పాత్ర‌కు శార‌ద‌ను తీసుకున్నారు ఎన్టీఆర్‌. 'చండ‌శాస‌నుడు' సినిమాలో శార‌ద న‌ట‌న ప్రేక్ష‌కుల్ని గొప్ప‌గా ఆక‌ట్టుకుంది. ఆ ఒక్క పాత్ర ఆమెకు ఇర‌వై పైగా చిత్రాల‌ను తెచ్చిపెట్టింది.  కాగా ఆ సినిమా నిర్మాణ స‌మ‌యంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఓవైపు నిర్విరామంగా పార్టీ ప్ర‌చారం చేస్తూ, మ‌రోవైపు 'చండ‌శాస‌నుడు' నిర్మాణ ప‌నుల‌ను, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. 1983లో ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 28న‌ సినిమా విడుద‌లైంది. ఘ‌న‌ విజ‌యం సాధించింది. 

మోహ‌న్‌బాబు 'రావ‌ణ‌బ్ర‌హ్మ‌', విష్ణు 'క‌న్న‌ప్ప' సినిమాలు వ‌స్తాయా?

  మోహ‌న్‌బాబు క‌ల‌ల ప్రాజెక్ట్ 'రావ‌ణ‌బ్ర‌హ్మ‌', మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించాల‌నుకున్న 'క‌న్న‌ప్ప' సినిమాలు తెర‌కెక్కుతాయా? ఈ ప్ర‌శ్న వారి అభిమానుల‌ను వేధిస్తోంది. ఒక ద‌శాబ్దం పై నుంచే రామాయ‌ణం క‌థ‌లో ప్ర‌తినాయ‌కుడైన రావ‌ణాసురునిగా న‌టించాల‌ని మోహ‌న్‌బాబు ఆశిస్తూ వ‌స్తున్నారు. 'రావ‌ణ‌బ్ర‌హ్మ' అనే టైటిల్‌తో రూపొందే ఆ సినిమాకు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కూడా ఆయ‌న గ‌తంలో చెప్పారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'అల్లుడుగారు', 'అల్ల‌రి మొగుడు', 'మేజ‌ర్ చంద్రకాంత్' లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. దివంగ‌త మ‌హాన‌టుడు ఎన్టీ రామారావు త‌ర్వాత అంత గంభీరంగా డైలాగ్‌ను చెప్ప‌గ‌ల న‌టునిగా మోహ‌న్‌బాబు పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్ర‌ల‌కు డిక్ష‌న్ అనేది చాలా ఇంపార్టెంట్‌. రాజ‌మౌళి సినిమా 'య‌మ‌దొంగ‌'లో య‌మ‌ధ‌ర్మ‌రాజు పాత్ర‌లో మోహ‌న్‌బాబు చెప్పిన డైలాగ్స్ అంద‌రినీ అల‌రించాయి. 'భూకైలాస్‌'లోనూ, త‌ర్వాత 'సీతారామ క‌ల్యాణం'లోనూ రావ‌ణాసురునిగా ఎన్టీఆర్ అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించారు. అలాగే తాను కూడా ఆ పాత్ర‌ను పోషించాల‌ని మోహ‌న్‌బాబు క‌ల‌లు కంటూ వ‌స్తున్నారు. అయితే ఇంత‌దాకా ఆ ప్రాజెక్టు వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. ఇక నాలుగైదేళ్లుగా భ‌క్త 'క‌న్న‌ప్ప' సినిమాని మంచు విష్ణు చేయ‌నున్న‌ట్లుగా వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ఇదివ‌ర‌కు సునీల్‌తో తాను 'క‌న్న‌ప్ప‌'ను తీయ‌నున్న‌ట్లు త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పారు. 'క‌న్న‌ప్ప' స్క్రిప్టును ఆయ‌న ఎంతో ప్రేమ‌గా రాసుకున్నారు. కానీ త‌ర్వాత ఆ స్క్రిప్టును విష్ణుకు అమ్మేశారు భ‌ర‌ణి. గ‌త ఏడాది మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా కాళ‌హ‌స్తికి వెళ్లిన మోహ‌న్‌బాబు, అక్క‌డ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ రూ. 60 కోట్ల బ‌డ్జెట్‌తో విష్ణుతో ఆ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. కానీ ఇంత‌దాకా ఆ సినిమా ఊసు క‌నిపించ‌లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు సినీ ప‌రిశ్ర‌మే తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విల‌విల్లాడుతోంది.  ఇటీవ‌ల రూ. 50 కోట్ల‌తో విష్ణు స్వ‌యంగా నిర్మించిన 'మోస‌గాళ్లు' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా దెబ్బ‌తిని, పెట్టిన పెట్టుబ‌డినంతా దెబ్బ‌తీసేసింది. ఈ నేప‌థ్యంలో రూ. 60 కోట్ల బడ్జెట్‌తో 'క‌న్న‌ప్ప' సినిమా నిర్మాణానికి ఆయ‌న న‌డుంబిగిస్తారా?  సందేహ‌మే.

"ఆక్సిజ‌న్‌ అంద‌క ఇంకెవ్వ‌రూ చ‌నిపోకూడ‌దు".. ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభించిన చిరంజీవి!

  కొవిడ్‌-19 పేషెంట్ల‌కు సాయ‌ప‌డే నిమిత్తం ప్ర‌తి జిల్లా కేంద్రంలోను ఆక్సిజ‌న్ బ్యాంకులు నెల‌కొల్పుతున్న‌ట్లు కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించారు. రేప‌టి నుంచి, అంటే మే 27 నుంచి 7 జిల్లాల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో పాటు, పేషెంట్ల కోసం ప‌లు వైద్య స‌దుపాయాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌ను కూడా చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ అందించ‌నున్న‌ది. ఈ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను రామ్‌చ‌ర‌ణ్ చేప‌డుతున్నారు. గ‌త ఏడాది క‌రోనా ఫ‌స్ట్ వేవ్ సంద‌ర్భంగా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి క‌రోనా క్రైసిస్ చారిటీని నెల‌కొల్పిన చిరంజీవి, దాని ద్వారా నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు.  ఇప్పుడు సెకండ్ వేవ్ మ‌రింత బీభ‌త్సంగా మారి, ఆక్సిజ‌న్ స‌దుపాయాలు లేక కొవిడ్ పేషెంట్లు నానా అవ‌స్థ‌లు ప‌డుతుండ‌టం, స‌రైన స‌మ‌యానికి ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో కొంత‌మంది రోగులు చ‌నిపోతుండ‌టంతో చ‌లించిన చిరంజీవి ఇప్పుడు ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను ఏర్పాటుచేశారు. నేడు (మే 26), అనంత‌పురం, గుంటూరులోని వైద్య కేంద్రాల‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్ పంపిణీ అయ్యాయి. రేపు ఖ‌మ్మం, క‌రీంన‌ర్‌, మ‌రో ఐదు జిల్లాల్లోని ప్ర‌జ‌ల‌కు అవి అందుబాటులోకి రానున్నాయి. బుధ‌వారం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఓ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. "మిష‌న్ మొద‌లైంది. ఇక నుంచీ ప్రాణాల్ని కాపాడే ఆక్సిజ‌న్ లోటు కార‌ణంగా ఎలాంటి చావులు లేకుండా చూడండి. #Covid19IndiaHelp #ChiranjeeviOxygenBanks @AlwaysRamCharan (sic)." అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఫ‌స్ట్ ఫిల్మ్‌కి.. ఇప్పుడు.. ఆరుగురు టాప్ స్టార్స్ ఎంత‌లా మారిపోయారో..!

  టాలీవుడ్‌లో మాస్‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ ఎవ‌రంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు, ప్ర‌భాస్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ఆరుగురు స్టార్ల సినిమా విడుద‌ల‌వుతుందంటే ఉండే హంగామా అసాధార‌ణం. ఫ్యాన్స్ అయితే రికార్డుల వేట‌లో ప‌డ‌తారు. త‌మ హీరో ఫ‌స్ట్ డే ఇంత వ‌సూలు చేసింది, అంత వ‌సూలు చేసింది.. అని లెక్క‌లు చెబుతూ ఏ సెంట‌ర్‌లో, ఏ థియేట‌ర్‌లో రికార్డులు క్రియేట్ చేసిందో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాంటి ఆ ఆరుగురు స్టార్లు త‌మ తొలి సినిమాల్లో ఎలా క‌నిపించారో, వాళ్ల రూపం ఎలా ఉందో చూస్తే.. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఇంత‌లా వారు మారిపోయారా!.. అని ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు. కావాలంటే మీరే చూడండి... ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ డైరెక్ట్ చేయ‌గా 1996లో వ‌చ్చిన అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అప్ప‌టికీ, ఇప్పుడు వ‌కీల్ సాబ్‌లో క‌నిపించిన ప‌వ‌న్‌కూ ముఖంలో ఎంత మార్పు వ‌చ్చిందో చూడండి. మ‌హేశ్‌బాబు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు రూపొందించ‌గా 1999లో వ‌చ్చిన రాజ‌కుమారుడు మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మైన మ‌హేశ్‌లోని చార్మింగ్ ఇప్ప‌టి స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీలోనూ అలాగే ఉంది. కానీ ఫేస్ మాత్రం బాగా మారిపోయింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ వి.ఆర్. ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నిన్ను చూడాల‌ని (2001) చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై లుక్స్ ప‌రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఇప్పుడు ఎంత గ్లామ‌ర‌స్‌గా మారిపోయాడో చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ప్ర‌భాస్‌ జ‌యంత్ సి. ప‌రాన్జీ డైరెక్ట్ చేసిన ఈశ్వ‌ర్ (2002) మూవీతో హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు ప్ర‌భాస్‌. అప్పుడు బ‌క్క‌ప‌ల‌చ‌టి కుర్రాడిగా ఉన్న అత‌ను ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు వ‌చ్చేస‌రికి బాగా మారిపోయాడు. పైగా దృఢ‌కాయుడిలా త‌యార‌య్యాడు. అల్లు అర్జున్‌ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు తీర్చిదిద్దిన 'గంగోత్రి' (2003) సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై, ఏమాత్రం గ్లామ‌ర్‌గా లేడ‌నిపించుకున్న అల్లు అర్జున్‌.. క్ర‌మ‌క్ర‌మంగా లుక్స్ మార్చుకుంటూ అల‌.. వైకుంఠ‌పుర‌ములో సినిమాకు వ‌చ్చేసరికి ఎంత అందంగా మారాడో! రామ్‌చ‌ర‌ణ్‌ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌గా 2007లో వ‌చ్చిన 'చిరుత' చిత్రంతో హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ప‌ద్నాలుగేళ్ల‌లోనే అత‌ను లుక్స్ ప‌రంగా చాలా మారిపోయాడ‌ని ఇప్ప‌టి రూపాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

రిలీజ్‌కు ముందే 'ఆర్ఆర్ఆర్' ఆల్‌టైమ్ ఇండియ‌న్ సినిమా రికార్డ్‌!

  య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి సినిమా అంటే ఏమిటో మ‌రోసారి దేశం మొత్తానికి తెలిసింది. 'బాహుబ‌లి' సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌మౌళి.. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం'తో మ‌రోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. విడుద‌ల‌కు ముందే 'ఆర్ఆర్ఆర్‌' బిజినెస్ ప‌రంగా ఆల్‌టైమ్ ఇండియ‌న్ సినిమా రికార్డ్ సృష్టించింది.  డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అన్ని భాష‌ల్లో క‌లిపి శాటిలైట్ అండ్ డిజిట‌ల్ రైట్స్ ఏకంగా రూ. 330 కోట్ల‌కు అమ్ముడ‌వ‌డం ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణం. ఈ హ‌క్కుల‌ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది.  అలాగే ద‌క్షిణాది రాష్ట్రాల్లో హిందీ కాకుండా మిగ‌తా భాష‌ల్లో థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 327 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని స‌మాచారం. హిందీ వెర్ష‌న్ థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 140 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ఒక సౌత్ ఫిల్మ్ హిందీ వెర్ష‌న్ రైట్స్ ఈ రేంజ్‌కు అమ్ముడ‌వ‌డం మ‌రో రికార్డ్‌. అలాగే ఓవ‌ర్సీస్ థియేట‌ర్ హ‌క్కులు రూ. 80 కోట్లు ప‌లికాయి. ఆడియో, బ్రాండింగ్ ఇత‌ర హ‌క్కులు కూడా క‌లుపుకుంటే టోట‌ల్‌గా 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 900 కోట్ల పైమాటే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. ప్రొడ్యూస‌ర్ దాన‌య్య పంట పండింద‌న్న మాటే! వాస్త‌వానికి 'ఆర్ఆర్ఆర్‌'ను ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కు అనౌన్స్ చేశారు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్‌కు ప‌దే ప‌దే విఘాతం క‌ల‌గ‌డం వ‌ల్ల అనుకున్న స‌మ‌యానికి సినిమా పూర్త‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ సినిమా ఈ ఏడాది కాకుండా 2022 ఆరంభంలో కానీ, స‌మ్మ‌ర్‌లో కానీ విడుద‌ల కావ‌చ్చ‌ని చెబుతున్నారు.

ర‌ష్మిక నెల సంపాద‌న ఎంతో తెలిస్తే స్ట‌న్న‌వుతారు!

  సౌత్ ఇండియాలోని మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్న ఒక‌రు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ బెంగ‌ళూరు అమ్మాయి త‌న కెరీర్‌లో క‌న్న‌డ మూవీ 'కిరిక్ పార్టీ'తో స్టార్ట్ చేసి, ఇన్‌స్టంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకుంది. ఆ సినిమా నుంచే ఆమె స్టార్‌గా మారిపోయింది. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ జోడీగా న‌టించిన 'గీత గోవిందం' ఆమె కెరీర్‌కు మ‌రింత బూస్ట్ నిచ్చింది. దాని త‌ర్వాత ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. మ‌హేశ్‌తో చేసిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకుంది ర‌ష్మిక‌. త‌మిళంలో కార్తీ జోడీగా చేసిన 'సుల్తాన్‌'తో కోలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా ఆమెకు క‌లిగిన న‌ష్ట‌మేమీ లేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో అల్లు అర్జున్ 'పుష్ప‌', శ‌ర్వానంద్ 'ఆడ‌వాళ్లూ మీకు జోహార్లు', బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సినిమా 'మిష‌న్ మంగ‌ళ్‌', అమితాబ్ బ‌చ్చ‌న్ మూవీ 'గుడ్‌బై' ఉన్నాయి. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌, టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ ద్వారా ఇప్ప‌టిదాకా ఆమె రూ. 35 కోట్ల దాకా సంపాదించిందని ఒక అంచ‌నా. ప్ర‌స్తుతం ఆమె నెల‌స‌రి సంపాద‌న యావ‌రేజ్‌న 35 ల‌క్ష‌ల నుంచి 40 ల‌క్ష‌ల దాకా ఉంటుంద‌ని రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే ఒక సినిమాకు కాల్షీట్ల‌ను బ‌ట్టి 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా అందుకుంటోంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్‌లో త‌న మూడో సినిమాకు ఆమె సంత‌కం చేసింద‌ని స‌మాచారం.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. దేశంలో ప‌ద్దెనిమిదేళ్ల‌కే మాస్ స్టార్ అయిన ఏకైక యాక్ట‌ర్‌!

  ఏ న‌టుడికైనా వార‌స‌త్వం అనేది ఒక ప్ల‌స్ పాయింట్ మాత్ర‌మే. అంతే త‌ప్ప వార‌స‌త్వంగా న‌ట‌న రాదు. ఈ విష‌యం చాలా సార్లు చాలా మంది విష‌యంలో రుజువైంది. అయితే ఆ వార‌స‌త్వాన్ని పునాదిగా చేసుకొని న‌ట‌న‌ను సాధ‌న ద్వారా అంచెలంచెలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ తారాప‌థంలోకి దూసుకెళ్ల‌డ‌మ‌నేది అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. నిజం చెప్పాలంటే తెలుగు సినీ చ‌రిత్ర‌లో కేవ‌లం ఇర‌వ‌య్యేళ్ల వ‌య‌సుకే టాప్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న‌ది ఒక్క తార‌క్ మాత్ర‌మే. హీరోగా తొలి చిత్రం 'నిన్ను చూడాల‌ని' (2001) విడుద‌ల‌య్యాక తార‌క్‌కు ప్రోత్సాహాల కంటే విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా ల‌భించాయి. అత‌ని శ‌రీరాకృతిని దృష్టిలో పెట్టుకొని అత‌డికి బండోడు అనే స‌ర్టిఫికెట్లు కూడా వ‌చ్చాయి. అత‌డి న‌ట‌న‌ను చూసి విమ‌ర్శ‌కుల పెద‌వి విరిచారు. ఆ సినిమా ఏమాత్రం తార‌క్‌కు తీపి జ్ఞాప‌కాల్ని ఇవ్వ‌లేదు. అప్పుడ‌త‌ని వ‌య‌సు ఎంత‌నీ! జ‌స్ట్‌.. 17 యియ‌ర్స్‌!! అదే అత‌డిలోని ప‌ట్టుద‌ల‌ను త‌ట్టి లేపింది. త‌న న‌ట‌న‌లోని చిన్న చిన్న లోపాల్ని స‌రిచేసుకుంటూ 'స్టూడెంట్ నెం.1'గా వ‌స్తే యువ‌త ఆద‌రించారు. రాఘ‌వేంద్ర‌రావు, అశ్వినీద‌త్ లాంటివారు నిర్మాత‌లుగా, రాజ‌మౌళి లాంటి త‌ప‌న ఉన్న కొత్త ద‌ర్శ‌కుడి చేతిలో రూపుదిద్దుకున్న ఆ సినిమా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌కు ఎంతో మేలు చేసింది. డాన్స్‌, ఫైట్స్ ఈజీగా చేయ‌డంతో పాటు, స‌న్నివేశాల్లో అనాయాసంగా న‌టించేయ‌డం, హాస్యం, రౌద్రం క‌ల‌గ‌లిసిన క్యారెక్ట‌ర్ అవ‌టాన అతడిలోని న‌టుడు ఎలివేట్ అవ‌డం.. ఆ చిత్రం ద్వారా రావాల్సిన గుర్తింపు వ‌చ్చింది. ఫ్యాక్ష‌నిజం హిట్ సినిమాల ముడిస‌రుకుగా మారివున్న వాతావ‌ర‌ణం.. అప్ప‌టికే బాబాయ్ బాల‌కృష్ణ 'స‌మ‌ర‌సింహారెడ్డి', 'న‌ర‌సింహ‌నాయుడు' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చివున్నాడు. ఇప్పుడు ఆ త‌ర‌హా నేప‌థ్యంలోనే వి.వి. వినాయ‌క్ అనే యువ‌కుడు ఒక క‌థ‌ను తార‌క్‌కు వినిపించాడు. మ‌రోమాట చెప్పాల్సిన ప‌నిలేక‌పోయింది అత‌డికి. అట్లా వ‌చ్చింది.. 'ఆది'. ఆ సినిమా రిలీజ‌య్యాక ఏ విమ‌ర్శ‌కులైతే అత‌డ్ని తేలిగ్గా తీసేశారో, వారే జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న గొప్ప‌గా ఉంది అని ప్ర‌శంసించారు. ఆ వ‌య‌సు కుర్రాళ్ల‌కు సాధ్య‌ప‌డ‌ని రౌద్ర‌ర‌సాన్ని త‌న హావ‌భావాల ద్వారా సులువుగా ప‌లికించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు తార‌క్‌. అత‌డి పాత్ర‌లోని విభిన్న ఛాయ‌లు, ఆయా స‌న్నివేశాల్లో అత‌డి ప‌రిప‌క్వ న‌ట‌న ముందు హీరోయిన్ కీర్తి చావ్లా డ‌మ్మీ అయిపోయినా న‌ష్టం క‌ల‌గ‌లేదు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెలుగు ప్రేక్ష‌కులు 'ఆది'కి నీరాజ‌నం ప‌ట్టారు. ప‌ద్దెనిమిదేళ్ల కుర్రాడు అంతా తానే అయ్యి న‌డిపించిన ఆ చిత్రం 98 థియేట‌ర్ల‌లో వంద రోజుల పండ‌గ చేసుకుందంటే మామూలు విష‌యం ఎంత మాత్రం కాదు. అంత‌కు ముందు బ‌హుశా దేశంలోని ఏ ఇత‌ర భాష‌ల్లోనూ ఏ హీరో కూడా ఇంత చిన్న వ‌య‌సులో ఇంత పెద్ద విజ‌యం సాధించి ఉండ‌లేదు.  'ఆది' మూవీతో తార‌క్ మాస్ ఇమేజ్ అమాంతంగా ఎన్నో రెట్టు పెరిగి పెద్ద స్టార్‌ని చేసింది. ఆ సినిమా త‌ర్వాత కొన్ని పేరుమోసిన ప‌త్రిక‌లు సైతం నంబ‌ర్ వ‌న్ హీరో చిరంజీవికి జూనియ‌ర్ ఎన్టీఆర్ పోటీ అవ‌నున్నాడ‌ని రాశాయంటేనే అత‌డి ఇమేజ్ ఏ రేంజ్‌కు పెరిగిందీ అర్థ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమా తార‌క్ స్టార్‌డ‌మ్‌ను మ‌రో లెవ‌ల్‌కు చేర్చింది. చిన్న‌వ‌య‌సులోనే ఊహాతీత‌మైన స్థాయికి చేర‌డంతో ఆ మూవీ త‌ర్వాత ఏం చేసినా ప్రేక్ష‌కుల‌కు త‌క్కువ‌గానే క‌నిపిస్తూ వ‌చ్చింది. ఆ ర‌కంగా చూస్తే కెరీర్ ప‌రంగా తార‌క్‌కు ఆ సినిమా మేలు కంటే న‌ష్ట‌మే ఎక్కువ క‌ల‌గించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'సింహాద్రి' ఇమేజ్ బ‌రువును 'జ‌న‌తా గ్యారేజ్' దాకా మోస్తూ వ‌చ్చాడు తార‌క్‌.  కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన 'జ‌న‌తా గ్యారేజ్' మూవీతో అత‌ను రిలీఫ్ ఫీల‌య్యాడు. ఆ సినిమా తార‌క్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా, బ‌య్య‌ర్లంద‌రికీ మంచి లాభాలు తెచ్చింది. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 'అర‌వింద స‌మేత' కూడా తార‌క్‌కు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మ‌రోసారి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ర‌జాకార్ల‌ను త‌రిమికొట్టిన గోండు బెబ్బులి కొమ‌రం భీమ్ పాత్ర‌ను అత‌ను పోషిస్తున్నాడు. అయితే ఇది మ‌నం చ‌దువుకున్న చ‌రిత్ర క‌థ కాదు. ర‌జాకార్ల‌పై పోరాటానికి ఆయ‌త్తం కాక‌ముందు ఇంటి నుంచి వెళ్లిపోయిన భీమ్ ఏం చేశాడ‌నే క‌ల్పిత క‌థ‌తో తీస్తున్న సినిమా. ఈ సినిమాతో తార‌క్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని ఫ్యాన్స్ గ‌ట్టి నమ్మ‌కంతో ఉన్నారు.

టాక్ ఆఫ్ ద టౌన్‌.. ఎంత పెద్ద బ్యాన‌రైనా నో చెప్పేస్తోంది!

  బుచ్చిబాబా సానా డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై, తొలి సినిమాతోటే సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌గా, యూత్ క‌ల‌ల రాకుమారిగా మారిపోయింది కృతి శెట్టి. ఆమె బ్యూటీకి మెస్మ‌రైజ్ అయిన జ‌నం, ఆమె న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. దీంతో ఇవాళ టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న తార‌ల్లో ఒక‌రిగా ఆమె మారింది. ఇప్ప‌టికే కొన్ని ప్రాజెక్టులు అంగీక‌రించిన ఆమె కోసం హీరోలు, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు క్యూలో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. విడుద‌లైన ఒకే ఒక్క సినిమాతో కృతి త‌న రెమ్యూన‌రేష‌న్‌ను రూ. 50 ల‌క్ష‌ల‌కు పెంచేసింద‌ని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ఏమాత్రం వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు. చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమంటే అంత అమౌంట్ ఇస్తామ‌న్నా కూడా కృతి కొన్ని సినిమాల‌ను ఒప్పుకోవ‌డం లేదు. రెండు పెద్ద ఫ్యామిలీల‌కు చెందిన సినిమాల‌ను ఆమె రిజెక్ట్ చేయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.  వాటిలో ఒక‌టి డైరెక్ట‌ర్ తేజ సినిమా. ఇందులో హీరో డి. సురేశ్‌బాబు చిన్న‌కొడుకు అభిరామ్ ద‌గ్గుబాటి. అభి లాంచ్ ప్రాజెక్టును తేజ చేతిలో పెట్టాడు సురేశ్‌బాబు. ఇందులో హీరోయిన్‌గా కృతిని అడిగారు. కానీ ఆమె తిర‌స్క‌రించింది. అలాగే అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రించే జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ సినిమాని కూడా ఆమె చేయ‌న‌ని చెప్పేసింది. అందులో నిఖిల్ హీరో కాగా, ఆ సినిమా పేరు '18 పేజెస్‌'.  ఒక కొత్త హీరోయిన్ రెండు బిగ్ ఫ్యామిలీస్‌కు చెందిన సినిమాల‌ను చేయ‌న‌ని చెప్ప‌డం ఇప్పుడు టాలీవుడ్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎంత గ‌ట్స్ ఉంటే ఆమె ఆ ఆఫ‌ర్స్‌ను రిజెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు. అయితే త‌నకు ఆఫ‌ర్ చేసిన రోల్‌తో పాటు స్క్రిప్ట్ న‌చ్చితేనే కృతి ఏ ప్రాజెక్టుకైనా సంత‌కం చేస్తోంది. వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్‌ను.. అది ఎంత పెద్ద బ్యాన‌ర్ అయినా.. నిర్భ‌యంగా తిర‌స్క‌రించేస్తోంది. రానున్న రోజుల్లో కృతి ఏం చేస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఆమె నానితో 'శ్యామ్ సింగ రాయ్‌', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు చేస్తోంది.

నా పేరిట ఎవ‌రికీ విరాళాలు ఇవ్వ‌కండి.. నేరుగా నాకే ఇవ్వండి!

  సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌నీ, ఇంటి అద్దె కూడా బ‌కాయి ప‌డ్డార‌నీ వార్త‌లు వ‌చ్చిన విష‌య‌మే. అయితే త‌న‌పేరు చెప్పి కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేస్తుండ‌టం త‌న‌కు బాధ క‌లిగిస్తోంద‌నీ, అవార్డులు అమ్మి జీవిస్తున్నానంటూ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌నీ ఆమె చెప్పారు. తాను ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న మాట నిజ‌మేన‌నీ, త‌న పేరిట డ‌బ్బులు వ‌సూలు చేసేవారికి వాటిని ఇవ్వ‌వ‌ద్ద‌నీ, వాటిని నేరుగా త‌న‌కే ఇవ్వాల‌నీ ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.  కొంత‌మంది నా పేరుతో డ‌బ్బులు వ‌సూలుచేసి ల‌క్ష రూపాయ‌లు క‌ట్టి మాలో స‌భ్య‌త్వం ఇప్పిస్తామ‌ని చెబుతున్నార‌నీ, మా వారు ఇచ్చే ఆరు వేల రూపాయ‌ల పెన్ష‌న్ కోసం ల‌క్ష రూపాయ‌ల‌ను ఈ వ‌యసులో మా వారికి క‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉందా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఆ డ‌బ్బులేవో త‌న‌కే ఇస్తే, మూడు నెల‌ల అద్దె బ‌కాయి చెల్లించుకుంటాన‌ని శ్యామ‌ల చెప్పారు. త‌న‌కు కుక్క‌ర్లు, కూల‌ర్లు ఇవ్వాల్సిన ప‌ని లేద‌నీ, కూతురికీ, త‌న‌కూ క‌లిపి మందుల‌కే నెల‌కు ప‌ది వేల రూపాల‌య‌కు పైనే అవుతున్నాయ‌ని శ్యామ‌ల వెల్ల‌డించారు.  త‌న‌కు సాయం చేయాల‌నుకున్న దాత‌లు త‌న పేరిట‌ ఎవ‌రికీ విరాళాలు ఇవ్వ‌వ‌ద్ద‌నీ, నేరుగా త‌న‌కే ఇవ్వాల‌నీ కోరారు. ఆత్మ‌గౌర‌వంతో, ఉత్త‌మ న‌ట‌నా ప్ర‌తిభ‌తో, అవార్డుల‌తో గౌర‌వంగా బ‌తుకుతూ వ‌స్తున్నాన‌నీ, కొంత‌మంది త‌న ప‌రువును బ‌జారున పెట్టి, ఏదో ఆదుకుంటున్న‌ట్లుగా టీవీల‌లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం త‌న‌కు బాధ క‌లిగిస్తోంద‌నీ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవరైనా సాయం చేయాలనిపిస్తే నేరుగా తన ఫోన్ నెంబర్ 9849175713 లో సంప్రదించాలని  ఆమె విజ్ఞప్తి చేశారు. అకౌంట్ లో వేసినా బ్యాంకు కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదని, గూగుల్ పే, పేటిఎం లాంటివి తనకు లేవ‌నీ ఆమె స్పష్టం చేశారు. ఫోన్ లో సంప్రదించి నేరుగా తనకు డబ్బులు అందించాలని, త‌న‌కు మధ్యవర్తులు ఎవ్వరూ లేరని శ్యామల వివరించారు.

వాణిశ్రీ‌ని జూనియ‌ర్ ఆర్టిస్ట్ అంటూ చుల‌క‌న చేసిన‌ చంద్ర‌మోహ‌న్‌!

  మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత ఇండ‌స్ట్రీని ఏలిన తార వాణిశ్రీ‌. ఒంటి రంగు న‌లుపు అయినా త‌న స్టైల్‌తో, త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకొని, తెలుగువారి ఆరాధ్య తార‌గా మారారామె. ఒక ద‌శాబ్దం పాటు ఆమె నంబ‌ర్‌వ‌న్ నాయిక‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ టైమ్‌లో టాప్ హీరోలు సైతం ఆమె కోసం వెయిట్ చేసేవారంటే అతిశ‌యోక్తి కాదు. చంద్ర‌మోహ‌న్ తొలి హీరోయిన్ ఆమెనే. 'రంగుల రాట్నం' (1967) సినిమా ద్వారా చంద్ర‌మోహ‌న్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశారు ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు బి.ఎన్‌. రెడ్డి. ఆ సినిమాలో నాయిక‌గా వాణిశ్రీ‌ని ఆయ‌న ఎంచుకున్నారు. కానీ ఆయ‌న నిర్ణ‌యం చంద్ర‌మోహ‌న్‌కు న‌చ్చ‌లేదు. ఆయ‌న కంటికి వాణిశ్రీ ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ లాగా క‌నిపించింది. ఆమె వ‌ద్ద‌నీ, మ‌రొక‌ర్ని తీసుకొమ్మ‌నీ బి.ఎన్‌. రెడ్డికి ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు చంద్ర‌మోహ‌న్‌. "హీరోగా నా ఫ‌స్ట్ పిక్చ‌ర్ 'రంగుల రాట్నం'లో హీరోయిన్‌గా వాణిశ్రీ‌ని బుక్ చేశారు బి.ఎన్. రెడ్డి గారు అప్ప‌టిదాకా ఆమె సైడ్ రోల్స్ చేస్తూ వ‌స్తోంది. చెలిక‌త్తె వేషాలు, బాల‌కృష్ణ ప‌క్క‌న‌, ప‌ద్మ‌నాభం ప‌క్క‌న కామెడీ వేషాలు వేస్తోంది. నేను బి.ఎన్‌. రెడ్డి గారితో అన్నాను.. 'హీరోగా ఇది నా ఫ‌స్ట్ పిక్చ‌ర్‌. నా ప‌క్క‌న ఈమె హీరోయిన్ అంటున్నారు. జూనియ‌ర్ ఆర్టిస్ట్ లాగుంది. వ‌ద్దండీ.' అని చెప్పాను. 'ఒన్ ఫైన్ మార్నింగ్ షి రూల్ ది ఇండ‌స్ట్రీ. ఆవిడ వెంట హీరోలు ప‌డ‌తారు.' అన్నారు బి.ఎన్‌. రెడ్డి గారు. ఏం సార్‌.. ఆమె వేస్తున్న వేషాలేంటి? ఆమె ఎప్ప‌టికీ ఆ రేంజ్‌కి రాద‌న్నాను. 'కాద‌య్యా. అది బార్న్ ఆర్టిస్ట్‌.' అని బ‌ల్ల‌చ‌రిచి చెప్పారాయ‌న‌. ఆయ‌న చెప్పిన‌ట్లే ప‌దేళ్లు ఇండ‌స్ట్రీని ఏలింది వాణిశ్రీ‌. సోకాల్డ్ హీరోలు ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చొనేవారు." అని చెప్పారు చంద్ర‌మోహ‌న్‌. ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు లాంటి అగ్ర హీరో కూడా సెట్‌లో ఆమె కోసం వెయిట్ చేసిన సంద‌ర్భాన్ని ఆయ‌న పంచుకున్నారు. "నాగేశ్వ‌ర‌రావుగారి 'సెక్ర‌ట‌రీ' (1976)సినిమా చేస్తున్నాం. అది య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి న‌వ‌ల‌తో తీస్తున్న సినిమా. అప్పుడు అన్న‌పూర్ణ స్టూడియో ఫ‌స్ట్ ఫ్లోర్ మాత్ర‌మే ఓపెన్ అయ్యింది. దాన్ని రామారావు గారి చేత ఓపెన్ చేయించారు నాగేశ్వ‌ర‌రావుగారు. 'సెక్ర‌ట‌రీ' షూటింగ్‌ని ఆ ఫ్లోర్‌లో మొద‌లుపెట్టారు. దానికి రాఘ‌వేంద్ర‌రావు గారి ఫాద‌ర్ కె.ఎస్‌. ప్రకాశ‌రావుగారు డైరెక్ట‌ర్‌. అందులో నాది మంచి వేషం. అప్ప‌టికే వాణిశ్రీ స్వింగ్‌లో ఉంది. అప్పుడు 9 గంట‌ల కాల్‌షీట్‌కు 11 గంట‌ల‌కు సెట్‌కు వ‌చ్చేది. నాగేశ్వ‌ర‌రావు గారితో స‌హా అంద‌రం బ‌య‌ట కూర్చొని ఆమె కోసం వెయిట్ చేసేవాళ్లం. రాగానే 'రెడీ అవ‌డానికి కొంచెం లేట‌య్యిందండీ' అనేది. 'ప‌ర్లేద‌మ్మా.. ప‌ర్లేద‌మ్మా' అనేవారు నాగేశ్వ‌ర‌రావుగారు. అట్లా ఆనాటి హీరోల‌ను వెయిట్ చేయించింది వాణిశ్రీ‌." అని చెప్పుకొచ్చారు చంద్ర‌మోహ‌న్‌.

ఈవారం (మే 17-23) ఓటీటీలో విడుద‌ల‌వుతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్‌-షోస్‌!

  మ‌హ‌మ్మారి కార‌ణంగా థియేట‌ర్లు దేశంలోని థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ‌టంతో జ‌న‌మంతా ఇప్పుడు ఇళ్ల‌ల్లోనే బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారిలోని భ‌యాందోళ‌న‌ల‌ను పోగొట్టి వినోదాన్ని అందించ‌డానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మించింది ఇప్పుడు వేరొక‌టి క‌నిపించ‌డం లేదు. ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు, వాటిలో ఎన్నో భాష‌ల‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వాటికి ఆద‌ర‌ణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవ‌లే స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్ 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్' డైరెక్ట్‌గా జీ5 ప్లాట్‌ఫామ్‌పై రిలీజై, ఫ‌స్ట్ డే 4.2 మిలియ‌న్ వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.  అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుద‌లైన 'సినిమా బండి' అనే చిన్న తెలుగు సినిమా అంద‌ర్నీ అల‌రిస్తూ నేష‌న‌ల్ లెవ‌ల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారం కూడా వివిధ భాష‌ల‌కు చెందిన ఆస‌క్తిక‌ర సినిమాలు, సిరీస్ ఓటీటీలో విడుద‌ల‌వుత‌న్నాయి. వాటిలో ఇటీవ‌లే కొవిడ్‌తో మృతి చెందిన జ‌ర్న‌లిస్ట్‌-న‌టుడు టీఎన్ఆర్ న‌టించిన 'ప్లేబ్యాక్' మూవీ, త‌రుణ్ భాస్క‌ర్ ప్రెజెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'రూమ్ నం. 54' సిరీస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఫిల్మ్ 'స‌ర్దార్ కా గ్రాండ్‌స‌న్' లాంటివి ఉన్నాయి. మే 17 నుంచి మే 23 మ‌ధ్య ఓటీటీలో వ‌స్తున్న ఆస‌క్తిక‌ర కొత్త కంటెంట్ ఏమిటో చూద్దామా... స‌ర్దార్ కా గ్రాండ్‌స‌న్ (హిందీ) తారాగ‌ణం: అర్జున్ క‌పూర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నీనా గుప్తా, జాన్ అబ్ర‌హాం డైరెక్ట‌ర్‌:  కాష్వీ నాయ‌ర్‌ విడుద‌ల తేదీ:  మే 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  నెట్‌ఫ్లిక్స్‌ ర‌న్అవే లుగాయ్ (హిందీ సిరీస్‌) తారాగ‌ణం: న‌వీన్ క‌స్తూరియా, రుహీ సింగ్‌, సంజ‌య్ మిశ్రా, ర‌వి కిష‌న్‌, ఆర్య బ‌బ్బ‌ర్‌ డైరెక్ట‌ర్‌: అవినాష్ దాస్‌ విడుద‌ల తేదీ:  మే 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఎంఎక్స్ ప్లేయ‌ర్‌ అన‌ద‌ర్ రౌండ్ (ఆస్కార్ విన్నింగ్ డేనిష్ మూవీ) తారాగ‌ణం:  మాడ్స్ మికెల్‌స‌న్‌, మ‌రియా బొన్నేవీ, మాగ్న‌స్ మిలాంగ్‌, థామ‌స్ బో లార్స‌న్‌ డైరెక్ట‌ర్‌:  థామ‌స్ వింట‌ర్‌బెర్గ్‌ విడుద‌ల తేదీ:  మే 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో న‌వంబ‌ర్ స్టోరీ (త‌మిళ్ సిరీస్‌) తారాగ‌ణం: త‌మ‌న్నా భాటియా, జి.ఎం. కుమార్‌ డైరెక్ట‌ర్‌:  రామ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌ విడుద‌ల తేదీ:  మే 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌ అవేక‌న్ సీజ‌న్ 1 (కొరియ‌న్ సిరీస్‌) తారాగ‌ణం: న‌మ్‌గూంగ్ మిన్‌, సియోల్‌హ్యున్‌, లీ చుంగ్‌ డైరెక్ట‌ర్‌:  కిమ్ జుంగ్‌-హ్యున్‌ విడుద‌ల తేదీ:  మే 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  నెట్‌ఫ్లిక్స్‌ ఆర్మీ ఆఫ్ ద డెడ్ (అమెరిక‌న్ హార‌ర్ ఫిల్మ్‌) తారాగ‌ణం:  డేవ్ బ‌టిస్టా, హిరోయుకి స‌న‌ద‌, హుమా ఖురేషి డైరెక్ట‌ర్‌:  జాక్ స్నైడ‌ర్‌ విడుద‌ల తేదీ:  మే 21 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  నెట్‌ఫ్లిక్స్‌ సోలోస్ (అమెరిక‌న్ సిరీస్‌) తారాగ‌ణం: అన్నే హ‌థావే, మోర్గాన్ ఫ్రీమ‌న్‌, హెలెన్ మిర్రెన్‌, ఉజో అడుబా డైరెక్ట‌ర్‌:  డేవిడ్ వీల్‌ విడుద‌ల తేదీ:  మే 21 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే బ్యాక్‌ (తెలుగు మూవీ) తారాగ‌ణం:  దినేశ్ తేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల‌ డైరెక్ట‌ర్‌: జ‌క్కా హ‌రిప్ర‌సాద్‌ విడుద‌ల తేదీ:  మే 21 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా క‌మ‌లి ఫ్ర‌మ్ న‌డుక్కావేరి (త‌మిళ ఫిల్మ్‌) తారాగ‌ణం: ఆనంది, రోహిత్ సురేశ్ స‌రాఫ్‌ డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ దురైస్వామి విడుద‌ల తేదీ:  మే 21 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  జీ5 రూమ్ నంబ‌ర్ 54 (తెలుగు సిరీస్‌) తారాగ‌ణం:  కృష్ణ‌తేజ‌, మొయిన్‌, ప‌వ‌న్‌, కె. ప్ర‌సాద్‌ డైరెక్ట‌ర్‌:  డి.ఎస్‌. గౌత‌మ్‌ ప్రెజెంట‌ర్‌: త‌రుణ్ భాస్క‌ర్‌ విడుద‌ల తేదీ:  మే 21 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  జీ5 మాస్ట‌ర్ ఆఫ్ న‌న్ సీజ‌న్ 3 (అమెరిక‌న్ కామెడీ సిరీస్‌) తారాగ‌ణం: అజీజ్ అన్సారి, నోయ‌ల్ వెల్స్‌, ఎరిక్ వేర్‌హీమ్‌ డైరెక్ట‌ర్‌: అజీజ్ అన్సారి, అల‌న్ యంగ్‌ విడుద‌ల తేదీ:  మే 23 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌:  నెట్‌ఫ్లిక్స్‌

10 మంది తార‌లు.. ఏళ్లు గ‌డుస్తున్నా త‌ర‌గ‌ని గ్లామ‌ర్‌!

  మ‌న‌సులో పుట్టిన ఆలోచ‌న తాలూకు ఎగ్జ‌యింట్‌మెంట్ పోక‌ముందే ఆ ప‌నిని పూర్తి చేసేయాల‌నుకునే త‌ర‌మిది. వారం తిరిగేలోపు కొత్త యాప్‌లు ప‌ల‌క‌రించేస్తున్నాయ్‌. క్ష‌ణానికో కొత్త స‌దుపాయం జీహుజూర్ అంటూ ముంగిట నిలుస్తోంది. ఇలాంటి త‌రుణంలోనూ ఏళ్ల త‌ర‌బ‌డి వినోదాన్ని పంచే హీరోయిన్లు టాలీవుడ్‌లో మ‌న‌గ‌లుగుతున్నారు. ఎవ‌రికీ బోరు కొట్ట‌కుండా కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూ అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తూ ఉనికిని కాపాడుకుంటున్నారు. సినిమా అంటే గ్లామ‌ర్‌. ఈ రంగంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ఉవ్విళ్లూరుతున్న వారు కోకొల్ల‌లు. ఇలాంటివారి పోటీని త‌ట్టుకుంటూ, అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగ‌డం నిజంగా క్లిష్ట సాధ్యం. అతివ త‌లుచుకుంటే అసాధ్యం కానిదేదీ లేదంటూ కొంత‌మంది హీరోయిన్లు నిరూపిస్తున్నారు. కొంత‌మంది ద‌శాబ్దానికి పైగా, ఇంకొంత‌మంది ఒక‌టిన్న‌ర ద‌శాబ్దానికి పైగా సినిమా రంగంలో త‌మ‌దైన టాలెంట్‌తో ముందుకు సాగుతున్న క‌థానాయిక‌లెవ‌రో చూద్దామా... 1. అనుష్క శెట్టి 2005లో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాలో నాగార్జున స‌ర‌స‌న మెరిసిన అనుష్క ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం నుంచీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తోంది. 'అరుంధ‌తి' మూవీతో సూప‌ర్ హీరోయిన్‌గా అవ‌త‌రించిన ఈమె 'బాహుబ‌లి' సిరీస్‌లో దేవ‌సేన పాత్ర‌తో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. చివ‌ర‌గా 'నిశ్శ‌బ్దం'లో క‌నిపించిన అనుష్క‌, ప్ర‌స్తుతం న‌వీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. 2. హ‌న్సికా మొత్వాని ప‌దిహేనేళ్ల వ‌య‌సులో 2007లో అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించిన 'దేశ‌ముదురు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది హ‌న్సిక‌. కంద‌రీగ‌, దేనికైనా రెడీ, ప‌వ‌ర్ లాంటి హిట్ సినిమాలు చేసిన హ‌న్సిక‌కు టాలీవుడ్ కంటే కోలీవుడ్ మ‌రింత క‌లిసొచ్చింది. ఆమె గ్లామ‌ర్‌కు దాసోహ‌మైన త‌మిళ అభిమానులు ఆమెకు గుడిక‌ట్టి పూజ‌లు చేస్తున్నారు. త‌మిళంలో న‌టించిన త‌న 50వ చిత్రం 'మ‌హా' విడుద‌ల కోసం ఆమె ఎదురుచూస్తోంది. 3. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ 2004లో 'క్యూం హోగ‌యా' నా సినిమాతో హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఎంట‌రైన కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన తొలి తెలుగు సినిమా 'ల‌క్ష్మీ క‌ల్యాణం' (2007). టాలీవుడ్ 'చంద‌మామ‌'గా పేరుతెచ్చుకున్న ఆమె మ‌గ‌ధీర‌, డార్లింగ్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, బిజినెస్‌మ్యాన్‌, బాద్‌షా, ఖైదీ నంబ‌ర్ 150 లాంటి సినిమాల‌తో గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా ఆడియెన్స్‌ను అల‌రిస్తూ వస్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న 'ఆచార్య' మూవీ చేస్తోంది. 4. న‌య‌న‌తార‌ 2003లో 'మ‌న‌సిన‌క్క‌రె' అనే మ‌ల‌యాళం సినిమాతో తెరంగేట్రం చేసిన న‌య‌న‌తార 2005లో వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ సినిమా 'చంద్ర‌ముఖి'తో తెలుగువారికి కూడా సుప‌రిచితురాలైంది. వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌టించిన 'ల‌క్ష్మీ' ఆమె తొలి స్ట్ర‌యిట్ తెలుగు సినిమా. 'శ్రీ‌రామ‌రాజ్యం'తో న‌యా సీత‌మ్మ‌గా ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందింది. తెలుగులో చివ‌ర‌గా చిరంజీవి సినిమా 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో కనిపించింది. 5. స‌మంత అక్కినేని 2010లో వ‌చ్చిన‌ 'ఏమాయ చేశావే' సినిమాతో నాయిక‌గా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోటే తెలుగు ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా అవ‌త‌రించింది స‌మంత‌. ఆ త‌ర్వాత కాలంలో ఆ సినిమాలో త‌న‌తో న‌టించిన నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డి, పెళ్లి చేసుకున్న ఈ కేర‌ళ అమ్మాయి కెరీర్‌లో దూకుడు, ఈగ‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మ‌నం, అ ఆ, జ‌న‌తా గ్యారేజ్‌, రంగ‌స్థ‌లం, మ‌జిలీ, ఓ బేబీ లాంటి సూప‌ర్‌హిట్ సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో 'శాకుంత‌లం' సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. 6. శ్రియ స‌ర‌న్‌ ప్ర‌స్తుతం ఉన్న తార‌ల్లో మోస్ట్ సీనియ‌ర్ గ్లామ‌ర‌స్ హీరోయిన్ శ్రియ‌. 2001లో 'ఇష్టం' సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఆమెకు సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్‌, నేనున్నాను, డాన్ శీను, మ‌నం, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఐట‌మ్ నంబ‌ర్స్‌తోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌స్తోన్న ఆమె ప్ర‌స్తుతం 'గ‌మ‌నం', 'ఆర్ఆర్ఆర్' సినిమాల్లో న‌టిస్తోంది. 7. శ్రుతి హాస‌న్‌ 2009లో హిందీ మూవీ 'ల‌క్‌'తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన శ్రుతి హాస‌న్‌, 2011లో సిద్ధార్థ్ జోడీగా న‌టించిన 'అన‌గ‌న‌గా ఓ ధీరుడు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గ‌బ్బ‌ర్ సింగ్‌, బ‌లుపు, ఎవుడు, రేసుగుర్రం, శ్రీ‌మంతుడు, ప్రేమ‌మ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా మారింది. ఇటీవ‌ల ర‌వితేజ‌తో న‌టించిన 'క్రాక్' సినిమాతో రి-ఎంట్రీ ఇచ్చి అల‌రించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సినిమా 'స‌లార్‌'లో నాయిక‌గా న‌టిస్తోంది. 8. తాప్సీ ప‌న్ను కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 2010లో వ‌చ్చిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెరంగేట్రం చేసిన తాప్సీ, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, ద‌రువు, గుండెల్లో గోదారి, సాహ‌సం, ఆనందో బ్ర‌హ్మ లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. తెలుగులో కంటే హిందీలో అర్థ‌వంత‌మైన అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో ప్ర‌స్తుతం అక్క‌డే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. 9. త‌మ‌న్నా భాటియా 2005లో హిందీలో 'చాంద్ సా రోష‌న్ చెహ్‌రా', తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన త‌మ‌న్నాకు ఆ వెంట‌నే 'హ్యాపీ డేస్' వ‌చ్చేశాయి. 100% ల‌వ్‌, ర‌చ్చ‌, త‌డాఖా, బాహుబ‌లి, ఊపిరి లాంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. టాప్ స్టార్స్ స‌ర‌స‌న చేసిన కొన్ని సినిమాలు ఆడ‌క‌పోయినా 'ఎఫ్ 2' హిట్ట‌వ‌డం ఆమె కెరీర్‌కు బూస్ట్‌నిచ్చింది. ప్ర‌స్తుతం సీటీమార్‌, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, మేస్ట్రో లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోందీ మిల్కీ బ్యూటీ. 10. త్రిష కృష్ణ‌న్ 2003లో త‌రుణ్‌తో న‌టించిన 'నీ మ‌న‌సు నాకు తెలుసు' సినిమాతో ప‌రిచ‌య‌మైన త్రిష‌కు 2004లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన 'వ‌ర్షం' చిత్రం అభిమాన వ‌ర్షాన్ని కురిపించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అత‌డు, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, కృష్ణ‌, బాడీగార్డ్ లాంటి సినిమాలు ఆమెను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత స‌న్నిహితం చేశాయి. 'ఆచార్య‌'లో చిరంజీవితో న‌టించే అవ‌కాశాన్ని వ‌ద్ద‌నుకున్న త్రిష త‌మిళంలో య‌మ‌బిజీగా ఉంది. - య‌జ్ఞ‌మూర్తి

మొద‌టి ఔట్‌డోర్ షూటింగ్‌లోనే భ‌యాన‌క అనుభ‌వం ఎదుర్కొన్నా!

  తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళం భాష‌లు మూడింటిలోనూ రాణించి, అగ్ర‌తార‌గా పేరు తెచ్చుకున్నారు రాధ‌. త‌న కాలంలో సౌత్ ఇండియాలోని మోస్ట్ గ్లామ‌ర‌స్ హీరోయిన్‌ల‌లో ఆమె ఒక‌రు. 1981లో ఆమె న‌టిగా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించారు. ఈ సినిమాల కోసం ఔట్‌డోర్ షూటింగ్‌ల‌క‌ని ఎన్నో ప్ర‌దేశాలు ఆమె చూశారు. అయితే త‌న‌ జీవితంలో మ‌ర‌పురాని ఔట్‌డోర్ షూటింగ్ అనుభ‌వం త‌న తొలి చిత్రం 'అలైగ‌ళ్ ఓయివ‌దిల్లై' (తెలుగులో 'సీతాకోక‌చిలుక‌')కి ఎదుర‌య్యింద‌ని చెప్పారు. దీనికి కార‌ణం ఆ సినిమా పూర్తిగా ఔట్‌డోర్‌లో నిర్మించింది కాబ‌ట్టి. చిత్ర‌క‌థ‌కు అనుగుణంగా ఉండే ప్ర‌దేశం నాగ‌ర్‌కోయిల్‌ను ఎంచుకున్నారు చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కులు. అప్పుడు రాధ ప‌దో క్లాస్ చ‌దువుతున్నారు. అంటే ఆ షూటింగ్ 1981 మొద‌ట్లో జ‌రిగింది. "అప్ప‌ట్లో నాకు ఓ స‌ర‌దా ఉండేది.. ఇంట్లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రితో క‌లిసి రైలులో ప్ర‌యాణంచేసి అంద‌మైన ప్ర‌దేశాల‌ను చూడాల‌ని, అక్క‌డే కొన్ని రోజుల పాటు ఉండి, అంద‌రితోనూ స‌ర‌దాగా కాలం గ‌డ‌పాల‌ని. ఆ కోరిక నా తొలి చిత్రం ఔట్‌డోర్ షూటింగ్‌తో తీరింది. ఒక సినిమా షూటింగ్ కోసం మ‌రో ప్ర‌దేశం వెళ్లి రెండు మూడు నెల‌ల పాటు అక్క‌డే ఉండ‌టం అనేది ఆ సినిమాకే జ‌రిగింది. ఆ త‌ర్వాత ఏ సినిమా షూటింగ్‌కీ ఔట్‌డోర్‌లో అన్ని రోజులు ఉండ‌టం జ‌ర‌గ‌లేదు." అని రాధ చెప్పారు. క‌న్యాకుమారికి 19 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న నాగ‌ర్‌కోయిల్ ప‌రిస‌ర ప్రాంతాల అంద‌చందాలు ఆమెను ఎంతో ఆక‌ర్షించాయి. "అతి చ‌క్క‌ని స‌ముద్ర‌తీరం, ఎక్క‌డ చూసినా ర‌బ్బ‌రు తోట‌ల‌తో ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉండే వాతావ‌ర‌ణం ఎవ‌రినైనా మంత్ర‌ముగ్ధుల్ని చేస్తుందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. స‌హ‌జ ప్ర‌కృతి సౌంద‌ర్యం అనేది మ‌నం అక్క‌డే చూస్తామేమోన‌ని కూడా అనిపించింది నాకు. అక్క‌డ ముట్టామ్ అనే బీచ్ రిసార్ట్‌లో నేనూ, హీరోగా న‌టిస్తోన్న కార్తీక్ క‌లిసి పాట పాడుతూ స‌ముద్ర‌పు కెర‌టాల‌లో మునిగి తేలుతూ ఉండే స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఆ స‌ముద్రపుటొడ్డున అల‌ల మ‌ధ్య‌న ప‌డుకొని ఉంటే, కార్తీక్ నా మీద వాలి న‌న్ను కౌగ‌లించుకొనే స‌న్నివేశంలో ఉధృత‌మైన కెర‌టాల ధాటికి నేను స‌ముద్రంలోకి కొట్టుకొని పోయాను. ఆ సంద‌ర్భంలో కార్తీక్ న‌న్ను ప‌ట్టుకొని కాపాడ్డానికి ప్ర‌య‌త్నించాడు. అంత‌లోనే మా యూనిట్ మెంబ‌ర్స్ కొంత‌మంది వ‌చ్చి న‌న్ను ఆ భ‌యంక‌ర స్థితి నుంచి కాపాడి, ఒడ్డుకు చేర్చారు. ఆ ఘ‌ట‌న త‌ల‌చుకున్న‌ప్పుడ‌ల్లా నాకు ఒక విధ‌మైన భ‌యం, ఆశ్చ‌ర్యం క‌లుగుతుంటాయి." అని తొలి సినిమా సంద‌ర్భంలోనే త‌న‌కు ఎదురైన భ‌యాన‌క అనుభ‌వం గురించి రాధ చెప్పుకొచ్చారు.  అక్క‌డ గ‌డిపిన రెండు మూడు నెల‌ల్లో ఈ ఒక్క దుస్సంఘ‌ట‌న త‌ప్ప మిగిలిన రోజుల‌న్నీ ఎంతో ఆనందంగా ఆమెకు గ‌డిచాయి. "ఉద‌యాన్నే ఆరు గంట‌ల నుంచి సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కూ షూటింగ్‌లో పాల్గొన‌డం, ఆ త‌ర్వాత ఆ ఊళ్లోని వింత‌లు, విశేషాలు చూడ్డానికి బ‌య‌ల్దేర‌డం నా కార్య‌క్ర‌మం అన్న‌మాట‌. నాగ‌ర్ కోయిల్‌లోని అన్ని ముఖ్య ప్ర‌దేశాలూ చూశాను. ముట్టామ్ బీచ్ రిసార్ట్ స‌మీపంలో ఉన్న సెయింట్ జేవియ‌ర్ చ‌ర్చ్ న‌న్నెంతో ఆక‌ట్టుకుంది. దేవాల‌యాల‌కీ, శిల్ప‌క‌ళ‌కీ పేరుప్ర‌ఖ్యాతులు పొందిన ప‌ట్నం నాగ‌ర్‌కోయిల్‌. క‌న్యాకుమారి జిల్లాలో ఉన్న ముఖ్య‌మైన ప‌ట్ట‌ణం నాగ‌ర్‌కోయిల్ ఒక్క‌టే. అక్క ఉన్న స‌రస్సులు విర‌బూసిన ఎర్ర‌తామ‌ర‌ల‌తో ఎర్ర‌తామ‌ర‌పూల ప‌రుపులా చూప‌రుల‌కు గోచ‌రిస్తాయే త‌ప్ప అక్క‌డ స‌ర‌స్సులో నీరున్న‌ద‌న్న మాట మాత్రం త‌ల‌పుకు రాదు. అంత విరివిగా ఉంటాయి తామ‌ర‌పూలు." అని ఆమె తెలిపారు. అక్క‌డ‌కు స‌మీపంలోనే ఉన్న క‌న్యాకుమారి వెళ్లి వివేకానంద రాక్ మెమోరియ‌ల్ చూసిందామె. "అక్క‌డ బీచ్.. మ‌ద్రాసులోని మెరీనా బీచ్‌లా కాకుండా ఉద‌యం నుండీ సాయంత్ర వ‌ర‌కూ ఎప్పుడూ దేశ‌విదేశీ టూరిస్టుల‌తో ర‌ద్దీగా, సంద‌డిగా ఉంటుంది. క‌న్యాకుమారిలోని మ‌రో విశేషం ఉద‌యాస్త‌మ‌యాలు. క‌న్యాకుమారి స‌ముద్ర‌తీర ప్రాంతంలో ఉద‌యాస్త‌మయాల అందాలు చూసి అనుభ‌వించాలే త‌ప్ప మాట‌ల్లో చెప్ప‌డానికి వీలుప‌డ‌దు అని నా అభిప్రాయం. అంత అందంగా, ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది." అని చెప్పుకొచ్చారు రాధ‌.