ఆ 'రామాయ‌ణ్' సీత ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?

  దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన 'రామాయ‌ణ్ సీరియ‌ల్ అన‌గానే 1987 కాల‌పు మ‌న‌దేశ‌పు మ‌నుషులంతా ఆ రోజుల్ని త‌ల‌చుకుని ఉద్వేగానికి గురైపోతారు. దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారాలు మొద‌ల‌య్యాక దేశం మొత్తాన్ని ఊపేసిన మొట్ట‌మొద‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ సీరియ‌ల్ అదే. అది హిందీలో ప్ర‌సార‌మైనా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లోని హిందీ రాని జ‌నం కూడా అది ప్ర‌సార‌మ‌య్యే స‌మ‌యానికి టీవీల‌కు అతుక్కుపోవ‌డం అదే మొద‌టిసారి. అలాంటి ఇతిహాసంలో సీత పాత్ర‌తో ప్ర‌తి ఇంటి ఆరాధ్య‌తార‌గా మారారు దీపికా చిఖ్‌లియా. తెలుగువాళ్ల‌కు అప్ప‌టిదాకా తెర సీత అంటే అంజ‌లీదేవే! 'ల‌వ‌కుశ' సినిమాలో మ‌హాసాధ్వి సీత పాత్ర‌లో అంజ‌లి అస‌మాన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు పాదాక్రాంత‌మ‌య్యారు. ఆ త‌ర్వాత సీత‌గా అంత‌గా ఆక‌ట్టుకుంది దీపికే. విశాల‌మైన క‌ళ్లు, ముగ్ధ‌త్వం మూర్తీభ‌వించిన మోముతో దీపిక ఆక‌ట్టుకున్నారు. 'రామాయ‌ణ్‌'లో ఆమె పాత్ర మొద‌లైన త‌ర్వాత నుంచీ క్ర‌మ‌క్ర‌మంగా త‌న న‌ట‌న‌తో వీక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేశారు. క‌రుణ‌ర‌సాత్మ‌క స‌న్నివేశాల్లో సీత బాధ‌ప‌డుతుంటే జ‌నం చూడ‌లేక‌పోయారు. అంత‌లా ఆమె త‌న అభిన‌యంతో వీక్ష‌కుల మ‌న‌సుల్ని క‌దిలించేశారు. నిజానికి 'రామాయ‌ణ్' సీరియ‌ల్ కంటే ముందు 'విక్ర‌మ్ ఔర్ బేతాళ్' హిందీ సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దీపిక‌. అందులో ఆమె న‌ట‌న‌కు ముచ్చ‌ట‌ప‌డిన డైరెక్ట‌ర్ రామానంద సాగ‌ర్ 'రామాయ‌ణ్‌'లో సీత పాత్ర‌కు ఆమెను కాకుండా మ‌రొక‌ర్ని ఊహించ‌లేక‌పోయారు. శ్రీ‌రామునిగా అరుణ్ గోవిల్‌కు ఎంత పేరు వ‌చ్చిందో, సీత‌గా దీపిక‌కు అంత పేరు వ‌చ్చింది. టీవీ సీరియ‌ల్స్‌లోనే కాకుండా సినిమాల్లోనూ దీపిక న‌టించారు. 1983లో 'సున్ మేరీ లైలా'తో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బి గ్రేడ్ సినిమాలు, హార‌ర్ సినిమాల్లోనే ఆమె ఎక్కువ‌గా క‌నిపించారు. 'రామాయ‌ణ్' సీరియ‌ల్‌తో ఆమె కెరీర్ యు-ట‌ర్న్ తీసుకుంది. 'ల‌వ్ కుశ్‌', 'ద స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్' లాంటి టెలివిజ‌న్ సిరీస్‌లో ఆమె న‌టించారు. రాజేశ్ ఖ‌న్నా హీరోగా న‌టించిన 'ఘ‌ర్ కా చిరాగ్'‌, 'రూప‌యే ద‌స్ క‌రోడ్' మూవీస్‌లో ఆమె స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో న‌టించారు. న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌'లో ఆమె హ‌రిశ్చంద్రుని భార్య‌ చంద్ర‌మ‌తి పాత్ర పోషించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. హ‌రిశ్చంద్రునిగా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించారు. దానికంటే ముందు రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న 'య‌మ‌పాశం'లో హీరోయిన్‌గా న‌టించారు. అలాగే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, భోజ్‌పురి సినిమాల్లోనూ ఆమె న‌టించారు. ఆమె పాపులారిటీని సొమ్ము చేసుకోవ‌డానికి బీజేపీ ఆమెను త‌మ పార్టీలోకి ఆహ్వానించి 1991 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బ‌రోడా నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన దీపిక ఆరేళ్ల పాటు ఎంపీగా కొన‌సాగారు. హేమంత్ టోపీవాలా అనే బిజినెస్‌మ్యాన్‌ను ఆమె పెళ్లాడారు. ఆయ‌న‌కు శింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ బ్రాండ్లు ఉన్నాయి. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు.. జుహీ, నిధి. ఇప్పుడు ఆ సీత పాత్ర‌ధారి దీపికా చిఖ్‌లియా ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? దీపిక మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఒక గుజ‌రాతీలో ఓ సీరియ‌ల్‌, 'న‌ట్‌సామ్రాట్' అనే సినిమా చేశాక‌, 2019లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వ‌చ్చిన బాలీవుడ్ మూవీ 'బాలా'లో హీరోయిన్ యామీ గౌత‌మ్ త‌ల్లిగా న‌టించారు. రాజ‌కీయ‌నాయ‌కురాలు, క‌వ‌యిత్రి స‌రోజినీ నాయుడు బ‌యోపిక్‌లో ఆమె పాత్ర‌ను చేయ‌నున్న‌ట్లు గ‌త ఏడాది ఆమె ప్ర‌క‌టించారు. ఆ సినిమాకు ఆకాశ్ నాయ‌క్‌, ధీర‌జ్ మిశ్రా సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పుడు దీపికా చిఖ్‌లియా వ‌య‌సు 55 సంవ‌త్స‌రాలు.

సంజ‌న‌తో బుమ్రా పెళ్ల‌యిపోయింది!

  ఇండియ‌న్ టాప్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా సోమ‌వారం రాత్రి స్పోర్ట్స్ ప్రెజెంట‌ర్ సంజ‌నా గ‌ణేశ‌న్‌ను పెళ్లి చేసుకున్నాడు. గోవాలో జ‌రిగిన ఈ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో కొద్దిమంది స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కొంత‌కాలంగా, బుమ్రా పెళ్లి వ్య‌వ‌హారం వార్త‌ల్లో న‌లుగుతూ వ‌స్తోంది. ఇదివ‌ర‌కు టాలీవుడ్ హీరోయిన్‌, కేర‌ళ కుట్టి అయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో అత‌ను డేటింగ్ చేస్తున్నాడ‌నీ, త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రూ పెళ్లాడ‌నున్నార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ ప్ర‌చారాన్ని అనుప‌మ త‌ల్లి ఖండించారు.  ఆ త‌ర్వాత బుమ్రా పెళ్లాడ‌బోతోంది సంజ‌నా గ‌ణేశ‌న్‌ను అనే విష‌యం వెల్ల‌డైంది. అయితే ఇరువురి కుటుంబాలూ ఈ పెళ్లి గురించి ఏమీ మాట్లాడ‌లేదు. ఎట్ట‌కేల‌కు మార్చి 15న కేవ‌లం 20 మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య బుమ్రా, సంజ‌న పెళ్లి జ‌రి‌గింది. అతిథులు త‌మ సెల్‌ఫోన్ల‌ను బ‌య‌ట‌నే పెట్టి వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు. పూర్తిగా ప్రైవేట్ వేడుక‌గా ఈ వివాహం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. మార్చి 15న త‌న వెడ్డింగ్ ఫొటోల‌ను షేర్ చేయ‌డం ద్వారా అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు బుమ్రా. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రెండు పెళ్లి ఫొటోల‌ను అత‌ను షేర్ చేశాడు. ఆ పిక్చ‌ర్స్‌లో పెళ్లి వేదిక అంతా పింక్‌మ‌యంగా క‌నిపిస్తోంది. వ‌ధూవ‌రులిద్ద‌రూ కూడా మ్యాచింగ్‌ పింక్ డ్ర‌స్‌లు ధ‌రించారు. బుమ్రా పింక్ షేర్వాణీ, దానికి మ్యాచ్ అయ్యే ట‌ర్బ‌న్ ధ‌రించ‌గా, సంజ‌నా పింక్ క‌ల‌ర్ లెహంగా, పూల ఎంబ్రాయిడ‌రీ చేసిన బ్లౌజ్‌తో మెరిసిపోతోంది. మెడ‌లో నెక్లెస్ నుంచి ఆమె ధ‌రించిన ఆభ‌ర‌ణాల‌న్నీ కూడా మ్యాచింగ్ క‌ల‌ర్‌లోనే ఉండ‌టం విశేషం.  బుమ్రా, సంజ‌నా ఇద్ద‌రూ ఒకే ఫొటోల‌ను షేర్ చేసి “Love, if it finds you worthy, directs your course. ప్రేమ‌తో న‌డిచే ఓ కొత్త ప్ర‌యాణాన్ని మేం క‌లిసి ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లోని అత్యంత సంతోష‌క‌ర‌మైన రోజుల్లో ఒక‌టి. మా పెళ్లి వార్త‌ను, మా ఆనందాన్ని మీతో పంచుకోగ‌లగ‌డం ఆశీర్వాదంగా మేం ఫీల‌వుతున్నాం. జ‌స్‌ప్రీత్ అండ్ సంజ‌నా." అంటూ రాసుకొచ్చారు. స్టార్ స్పోర్ట్స్‌లో ప‌నిచేస్తోన్న సంజ‌నా గ‌ణేశ‌న్‌.. ఐపీఎల్‌, బ్యాడ్మింట‌న్ టోర్నీలు స‌హా ప‌లు ఈవెంట్ల‌కు టీవీ ప్రెజెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. 

"‌ఇదిగో నా సీత‌!".. రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన అలియా లుక్‌!

  య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందిస్తోన్న, 2021 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియ‌న్ మూవీస్‌లో ఒక‌టైన 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం'లో అలియా భ‌ట్ పోషిస్తోన్న సీత క్యారెక్ట‌ర్ లుక్ వ‌చ్చేసింది. రెండు రోజులుగా ఈ లుక్ కోసం ఫ్యాన్స్ అత్యంత ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 15 అంటే నేడు అలియా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం సీత‌గా అలియా రూపాన్ని విడుద‌ల చేసింది. అల్లూరి సీతారామ‌రాజు అస‌లు పేరు అల్లూరి రామ‌రాజు. ఆయ‌న వ‌ల‌చి పెళ్లిచేసుకోవాల‌నుకున్న యువ‌తి సీత‌. అందుకే త‌న పేరును అలా మార్చేసుకున్నారు. ఆ సీత పాత్ర‌లో అలియా మ‌న‌కు క‌నిపించ‌నున్న‌ది. సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా అలియా భ‌ట్ ఫ‌స్ట్ లుక్‌ను రాజ‌మౌళి షేర్ చేశారు. దాంతో పాటు, "Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary! Presenting @aliaa08 as #Sita to you all :)" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో అలియా ఆకుప‌చ్చ చీర‌, బుట్ట చేతుల ప‌ట్టు ర‌విక‌, మెడ‌లో బంగారు గొలుసు, ముక్కుపుడ‌క‌, త‌ల‌కు పాపిట బిళ్ల ధ‌రించి, త‌న రామ‌రాజు కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా కూర్చొని ఉంది. ఆమె ముందు ఓ పూల బుట్ట‌, ఆమెకు అటు ఇటు వెలుగుతున్న దీపాలు క‌నిపిస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో అలియా లుక్ బ‌య‌ట‌కు రావ‌డం ఆల‌స్యం, నెట్టింట వైర‌ల్ అయిపోయింది. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇక త‌న సీత కోసం రామ‌రాజు కూడా స్పందించాడు. రామ‌రాజుగా న‌టిస్తోన్న రామ్‌చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో అలియా లుక్‌ను షేర్ చేసి, "She adds meaning to Ramaraju's mission! Meet my #Sita, a woman of strong will and resolve. Wishing you a glorious year ahead Alia @aliaa08 !" అంటూ రాసుకొచ్చాడు.  అలాగే కొమ‌రం భీమ్ పాత్ర‌ధారి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అలియా లుక్‌ను షేర్ చేసి, "Her wait will be legendary! Here's @aliaa08 as #Sita, the epitome of strong will and resolve. Happy birthday Dear Alia, have a great one!" అని ట్వీట్ చేశాడు. ఆగ‌స్ట్ 13న 'ఆర్ఆర్ఆర్'ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

ఫొటో స్టోరీ: పెళ్లాడ‌కుండానే ఓ పాప‌ను క‌ని వార్త‌ల్లోకెక్కిన ఫేమ‌స్ ఫిగ‌ర్స్‌!

  వెట‌ర‌న్ యాక్ట్రెస్ నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి, ఆ విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇంత‌కీ ఆమె బిడ్డ‌ను క‌న్న‌ది అల‌నాటి అర‌వీర భ‌యంక‌ర వెస్టిండీస్ బ్యాట్స్‌మ‌న్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ ద్వారా. అప్ప‌ట్లో రిచ‌ర్డ్స్‌కు క్రికెట్ ఆడే దేశాల్లో ఉన్న ఇమేజ్ కానీ, క్రేజ్ కానీ మ‌రెవ‌రికీ లేదు. నీనాకు కూడా ఆయ‌నంటే పిచ్చి. ఆయ‌న వివాహితుడు అని తెలిసి కూడా ప్రేమ‌లోప‌డి, శారీర‌కంగా ఒక్క‌టై కూతుర్ని కన్నారు. ఆ పాప‌కు తండ్రి రిచ‌ర్డ్స్ అని ప్ర‌క‌టించారు. పాప‌కు మ‌సాబా అని పేరు పెట్టుకున్నారు. ఒక్క చేత్తో కూతుర్ని పెంచి పెద్ద‌చేశారు. పెళ్లి కాకుండా త‌ల్ల‌యినందుకు కానీ, రిచ‌ర్డ్స్ త‌న‌ను పెళ్లి చేసుకోనందుకు కానీ నీనా ఏనాడూ బాధ‌ప‌డ‌లేదు. మ‌సాబా సైతం త‌ల్లిచాటు బిడ్డ‌గా కాకుండా, చిన్న‌త‌నం నుంచే స్వ‌తంత్ర వ్య‌క్తిత్వాన్ని అల‌వ‌ర్చుకుంది. ఈరోజున దేశంలోని ఫైనెస్ట్ ఫ్యాష‌న్ డిజైన‌ర్స్‌లో మ‌సాబా గుప్తా ఒక‌రు. ప్ర‌ఖ్యాత స్టైల్ మ్యాగ‌జైన్ క‌ల్చ‌ర్ ట్రిప్ ఎంపిక చేసిన టెన్ బెస్ట్ ఇండియ‌న్ ఫ్యాష‌న్ డిజైన‌ర్స్‌లో ఒక‌రిగా నిలిచింది మసాబా. 2020లో న‌టిగా కూడా మారిన మ‌సాబా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మ‌సాబా మ‌సాబా'లో టైటిల్ రోల్ పోషించ‌డ‌మే కాకుండా, త‌న త‌ల్లితో స్క్రీన్ పంచుకుంది. మార్చి 12న త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని పాత ఫొటోల‌ను షేర్ చేసింది మ‌సాబా. మొద‌టి ఫొటో ఆమె చిన్న‌ప్ప‌టిది. అందులో త‌ల్లి నీనా గుప్తా ఒడిలో ప‌డుకొని ఉంది చిన్నారి మ‌సాబా. ప‌క్క‌నే ఆమె తండ్రి రిచ‌ర్డ్స్ కూర్చొని ఉన్నాడు. ఆ ఫొటోలో నీనా రెడ్ బోర్డ‌ర్ ఉన్న వైట్ శారీ, రెడ్ బ్లౌజ్, ఎర్ర‌బొట్టు, వ‌దిలేసిన జుట్టుతో స్ట‌న్నింగ్ లుక్‌గా క‌నిపిస్తుండ‌గా, రిచ‌ర్డ్స్ టీ ష‌ర్టు, షార్ట్స్ వేసుకొని ఉన్నారు. మ‌రొక‌టి బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్‌. అందులో ఒక దంప‌తుల జంట క‌నిపిస్తున్నారు. వాళ్లెవ‌రో ఆమె చెప్ప‌లేదు కానీ, వారు మ‌సాబా అమ్మ‌మ్మ తాత‌య్య‌లుగా ఊహించ‌వ‌చ్చు. ఆ పిక్చ‌ర్స్‌కు, “My world. My blood.” అనే క్యాప్ష‌న్ పెట్టింది మ‌సాబా. అప్ప‌డ‌ప్పుడు క‌రీబియ‌న్ దీవుల‌కు వెళ్లి తండ్రిని క‌లిసి వ‌స్తూ ఉంటుంది మ‌సాబా. రిచ‌ర్డ్స్ భార‌త్‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నీనా, మ‌సాబాల‌తో గ‌డిపి వెళ్తుంటారు.

నాగార్జున 'వైల్డ్ డాగ్' ట్రైల‌ర్ రివ్యూ

  అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని రాసిన క‌థ‌తో అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ అనే ఒక వైవిధ్య‌మైన పాత్ర‌లో నాగార్జున క‌నిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా వైల్డ్ డాగ్ ట్రైల‌ర్‌ను షేర్ చేసిన ఆయ‌న‌, "Presenting #WildDogTrailer .. FEROCIOUS, PATRIOTIC TALE OF A DAREDEVIL TEAM.. My brother Nag is Cool & Energetic as ever.. He is a fearless actor attempting all genres.. Wish Team #WildDog & my Producer Niranjan Reddy GoodLuck!" అని ట్వీట్ చేశారు.  2 నిమిషాల 24 సెక‌న్ల నిడివి ఉన్న 'వైల్డ్ డాగ్' ట్రైల‌ర్ చూస్తున్నంత సేపూ ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించేలా ఉంది. పాకిస్తానీ టెర్ర‌రిస్టులు మ‌న దేశంలో సాగించిన మార‌ణ‌కాండ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందిన‌ట్లు ట్రైల‌ర్ స్ప‌ష్టం చేస్తోంది. బాంబ్ బ్లాస్టుల‌తో వంద‌లాది మంది అమాయ‌కుల‌ను పొట్ట‌న పెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ఏసీపీ విజ‌య్ వ‌ర్మ నేతృత్వంలో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టీమ్‌ను ఒక‌దాన్ని ప్ర‌భుత్వం నియ‌మిస్తుంద‌నీ, అక్క‌డ్నుంచీ విజ‌య్ వ‌ర్మ త‌న బృందంతో టెర్ర‌రిస్టుల‌ను వెంటాడుతాడ‌నీ ట్రైల‌ర్ మ‌న‌కు చూపిస్తుంది.  విజ‌య్ వ‌ర్మ క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్ తెలియ‌జేసింది. త‌మ‌ను ప‌ట్టుకోవ‌డానికి విజ‌య్ వ‌ర్మ టీమ్ వ‌చ్చిన‌ప్పుడు ఒక క్రిమిన‌ల్‌, "అరెస్ట్ చేసుకోండి సార్" అని సింపుల్‌గా చేతులు పైకెత్తితే, క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అత‌డిని విజ‌య్ వ‌ర్మ కాల్చి ప‌డేశాడు. అదీ విజ‌య్ వ‌ర్మ క్యారెక్ట‌ర్‌! అందుకే అత‌డిని అంద‌రూ 'వైల్డ్ డాగ్' అనేది!  ట్రైల‌ర్ చివ‌ర‌లో ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ నాయ‌కుడు, "ఏం చేస్తార్రా ఇండియాకి తీసుకెళ్లి? వారానికి రెండు సార్లు బిర్యానీ, జ‌డ్ క్యాట‌గిరి సెక్యూరిటీ, కుక్క‌ల్లా కాపలాగా ఉంటారు." అని హేళ‌న‌గా న‌వ్వుతుంటే, వైల్డ్ డాగ్ చేతిలోని గ‌న్ పేలడం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. క్రిమిన‌ల్స్‌కు, టెర్ర‌రిస్టుల‌కు ప‌క్క‌లో బ‌ల్లెం లాంటి ఏసీపీ విజ‌య్ వ‌ర్మ క్యారెక్ట‌ర్‌లో నాగార్జున ఫెరోషియ‌స్‌గా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా క‌నిపిస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌నకు ఫుల్ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ రోల్ ల‌భించింది. ఆ రోల్‌లో ఆయ‌న‌ విజృంభించి న‌టించారు.  ట్రైల‌ర్‌లో నిర్మాణ విలువ‌లు ఎంత క్వాలిటీగా ఉన్నాయో తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మించారు. షానీల్ డియో స‌మ‌కూర్చిన సినిమాటోగ్ర‌ఫీ, డేవిడ్ ఇస్మ‌లోన్‌, జాషువా రూప‌క‌ల్ప‌న చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని ట్రైల‌ర్ స్ప‌ష్టం చేస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర వ‌హించ‌నున్నది.  మెగాస్టార్ చేతుల మీదుగా విడుద‌లైన ట్రైల‌ర్ 'వైల్డ్ డాగ్'‌పై అంచ‌నాల‌ను అమితంగా పెంచేసింది. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు.

'ఆదిపురుష్' ద‌గ్గ‌ర‌కు సీత వ‌చ్చేసింది!

  ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌ధారిగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' మూవీని రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. రామాయ‌ణ గాథ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఇంత‌దాకా ఈ సినిమాలో సీత పాత్ర‌ధారిపై స‌స్పెన్స్ కొన‌సాగుతూ రాగా, ఎట్ట‌కేల‌కు అది వీడింది. సీత పాత్ర‌ను చేయ‌డానికి బాలీవుడ్ తార కృతి స‌న‌న్ వ‌చ్చేసింది. అలాగే, ల‌క్ష్మ‌ణునిగా న‌టించేందుకు స‌న్నీ సింగ్ ఎంపిక‌య్యాడు. ఈరోజు ఉద‌య‌మే ఈ ఇద్ద‌రి ఎంపిక గురించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కృతి స‌న‌న్ స్వ‌యంగా త‌ను 'ఆదిపురుష్‌'లో న‌టిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్‌, ఓమ్ రౌత్‌, స‌న్నీ సింగ్‌తో క‌లిసి దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. "ఒక కొత్త జ‌ర్నీ మొద‌లవుతోంది. ఆదిపురుష్‌.. ఇది చాలా చాలా స్పెష‌ల్‌. ఈ ఇంద్ర‌జాల ప్ర‌పంచంలో ఓ భాగం కావ‌డాన్ని గ‌ర్వంగా, గౌర‌వంగా, అమితోద్వేగంగా ఉంది." అని ఆమె రాసుకొచ్చింది. కృతి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. మ‌హేశ్ జోడీగా '1.. నేనొక్క‌డినే' మూవీలో న‌టించ‌డం ద్వారా ఆమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత 'దోచెయ్' సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది. ఇప్ప‌టికే 'ఆదిపురుష్‌'లో రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తోన్న విష‌యం మ‌న‌కు తెలుసు. 2022 ఆగ‌స్ట్ 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో మొద‌లైంది. 'తానాజీ' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఆదిపురుష్‌పై అంచ‌నాలు అసాధార‌ణ స్థాయిలో ఉన్నాయి. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల‌య్యే ఈ మూవీని భూష‌ణ్ కుమార్‌, ఓమ్ రౌత్‌, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్ క‌లిసి నిర్మిస్తున్నారు.

మీరు నాపై విసిరిన రాళ్ల‌తోటే నేనొక‌ కోట‌ను నిర్మించాను.. సునీత పోస్ట్ వైర‌ల్‌!

  గాయ‌ని సునీత మ‌రోసారి త‌నేమిటో చాటి చెప్పారు. త‌న‌మీద రాళ్లు విసిరిన‌వాళ్ల‌ను, త‌న‌లో అభ‌ద్ర‌తా భావాన్ని రేకెత్తించాల‌నుకున్న వాళ్ల‌ను, త‌న‌ను నిందించిన వాళ్ల‌ను క్ష‌మించేశారు. అదే స‌మ‌యంలో వారికి సున్నితంగా వాత‌లు కూడా పెట్టారు. సోమ‌వారం విమెన్స్ డే సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సునీత పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధ‌రించి, త‌ల‌కు హ్యాట్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేసిన సునీత‌, "మీరు జ‌డ్జ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, న‌న్ను కింద‌కు లాగ‌డానికి ఎప్పుడూ ట్రై చేస్తుంటారు. ఒక విష‌యాన్ని ప్రూవ్ చేయాల‌నుకుంటారు, నాలో అభ‌ద్ర‌తా భావాన్ని క‌లిగిస్తుంటారు. మీరు న‌న్ను న‌మ్మ‌రు, స‌పోర్ట్‌గా నిల‌వ‌రు, నేను చెప్పేది ఎప్పుడూ విన‌రు. నేను ఫెయిలైన‌ప్పుడు మీరు న‌వ్వుతారు, నాకు ఊపిరాడ‌నీయ‌కుండా చేస్తారు. అకార‌ణంగా న‌న్ను నిందిస్తారు. హ్యాపీ విమెన్స్ డే అంటూ నాకు శుభాకాంక్ష‌లు తెలుపుతారా?" అని ప్ర‌శ్నించారు. ఆ వెంట‌నే, "య‌స్‌, దాన్ని నేను స్వీక‌రిస్తాను. ఎందుకంటే నేను సొంతంగా నా బ‌లాన్ని పుంజుకొని, మీరు నాపై విసిరిన రాళ్ల‌తోటే ఒక కోట‌ను నిర్మించాను. అన్ని విధాలా ముందుకు సాగాను!!" అని చెప్పారు. చివ‌ర‌గా, "నేను న‌వ్వుతాను, క్ష‌మిస్తాను, శ్ర‌ద్ధ చూపుతాను, ప్రేమిస్తాను, ఎప్పుడూ వ‌ద‌ల‌ను. నేను స్త్రీని.. ద‌యామ‌యిని!! మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు!!" అంటూ రాసుకొచ్చారు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్' ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్‌.. యావ‌రేజ్‌!

  సందీప్ కిష‌న్, లావ‌ణ్యా త్రిపాఠి జంట‌గా డెన్నిస్ జీవ‌న్ కానుకొల‌ను డైరెక్ట్ చేసిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మూడు రోజుల ఫ‌స్ట్ వీకెండ్ యావ‌రేజ్‌గా వ‌సూళ్ల‌ను సాధించింది. మార్చి 5న విడుద‌లైన ఈ సినిమా ఎక్స్‌ప్రెస్ రేంజ్‌లో కాకుండా ప్యాసింజ‌ర్ స్టైల్‌లో 2.14 కోట్ల రూపాయ‌ల షేర్ (అంచ‌నా) సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి.  హిప్ హాప్ త‌మిళ హీరోగా న‌టించ‌గా హిట్ట‌యిన త‌మిళ ఫిల్మ్ 'న‌ట్‌పే తునై'కి రీమేక్‌గా త‌యారైన ఈ హాకీ బేస్డ్ ఫిల్మ్‌లో కొన్ని మంచి స‌న్నివేశాలు ఉన్న‌ప్ప‌టికీ, ఓవ‌రాల్‌గా ప్రేక్ష‌కుల‌కు స‌హానుభూతి క‌లిగించ‌డంలో పాక్షికంగానే స‌క్సెస్ అయ్యింద‌ని విమ‌ర్శ‌కులు భావిస్తున్నారు. మార్చి 5న విడుద‌లైన మిగ‌తా సినిమాల కంటే 'ఏ1 ఎక్స్‌ప్రెస్'‌కే  ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు దానికి అనుకూలంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. ఇంత చేసినా, మూడు రోజుల‌కు క‌లిపి రూ. 2.14 కోట్ల‌నే 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సాధించ‌గ‌లిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 76 ల‌క్ష‌లు, రెండో రోజు రూ. 68 ల‌క్ష‌లు, మూడో రోజు ఆదివారం రూ. 70 ల‌క్ష‌లు (అంచ‌నా) ఈ సినిమా వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో 50 శాతం రిక‌వ‌రీని అది సాధించింది. మార్చి 11న 'శ్రీ‌కారం', 'జాతిర‌త్నాలు', 'గాలి సంప‌త్' సినిమాలు విడుద‌ల‌వుతున్నందున 10వ తేదీలోగా 'ఏ1 ఎక్స్‌ప్రెస్' బ్రేకీవెన్ సాధిస్తుందా? అనే సందేహాన్ని ట్రేడ్ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా పెళ్లాడుతున్నారా? నిజ‌మేంటి?

  హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. త‌న పెళ్లి గురించి ఆమె ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా, ఇండియ‌న్ నంబ‌ర్ వ‌న్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను ఆమె పెళ్లాడ‌నున్న‌ద‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తున్నాయి. ఇటీవ‌ల తాను ద్వార‌క‌కు వెళ్తున్న‌ట్లు త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌కు స‌మాచారం ఇచ్చింది అనుప‌మ‌. అది బుమ్రా సొంత ప‌ట్నం అహ్మ‌దాబాద్‌కు స‌మీపంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ క‌ల్పించింది బీసీసీఐ. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌వ‌ల్ల త‌న‌ను ఆ టెస్ట్ నుంచి త‌ప్పించాల్సిందిగా బుమ్రాయే బీసీసీఐను కోరాడు. దాంతో సోష‌ల్ మీడియాలో అనుప‌మ‌, బుమ్రా పెళ్లి గురించి స్పెక్యులేష‌న్స్ ఊపందుకున్నాయి. మ‌ల‌యాళీ అయిన అనుప‌మ టాలీవుడ్‌లో త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన 'అ ఆ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 'శ‌త‌మానం భ‌వ‌తి' సినిమా ఆమెకు క్రేజ్ తెచ్చింది. ఈమ‌ధ్య 'రాక్ష‌సుడు' లాంటి హిట్ మూవీలోనూ ఆమె నాయిక‌గా న‌టించింది. ప్ర‌స్తుతం ఆమె నిఖిల్‌తో '18 పేజెస్' అనే మూవీ చేస్తోంది. ఇదివ‌ర‌కే బుమ్రాతో ఆమె డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌చ్చాయి. వాటిని ఆమె ఖండించింది. లేటెస్ట్‌గా బుమ్రా పెళ్లి గోవాలో జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అత‌నికి కాబోయే భార్య గురించి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన బ‌జ్ న‌డుస్తోంది. అత‌ను అనుప‌మ‌ను పెళ్లాడ‌నున్న‌ట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా బుమ్రాతో త‌మ కుమార్తె పెళ్లి అనేది కేవ‌లం ఒక వదంతి మాత్ర‌మేన‌ని అనుప‌మ త‌ల్లి సునీత స్ప‌ష్టం చేశారు. అనుప‌మ గుజ‌రాత్‌లోని ద్వార‌క‌కు వెళ్లింది త‌ను న‌టిస్తోన్న తెలుగు సినిమా షూటింగ్ కోస‌మ‌ని ఆమె తేల్చేశారు.

ఫ‌స్ట్ వీక్ నితిన్ 'చెక్' క‌లెక్ష‌న్లు చాలా వీక్‌!

  నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' సినిమా ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌లై, తొలిరోజే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశాజ‌న‌క వ‌సూళ్ల‌ను సాధించిన విష‌యం తెలిసిందే. వారం పూర్త‌య్యేస‌రికి ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు క‌లిగించ‌డం దాదాపు ఖాయ‌మైంది. రూ. 14.50 కోట్లు వ‌స్తే బ్రేకీవ‌న్ అవుతుంద‌నంగా, తొలివారం ఈ సినిమాకు వ‌చ్చిన షేర్ రూ. 8 కోట్లు మాత్ర‌మే! అంటే 55 శాత‌మే రిక‌వ‌ర్ అయ్యింది.  నైజాంలో రూ. 3.18 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.9 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 1 కోటి షేర్‌ను 'చెక్' రాబ‌ట్ట‌గ‌లిగింది. అదే నితిన్ మునుప‌టి సినిమా 'భీష్మ' తొలివారంలోనే బ్రేకీవెన్ సాధించి డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆనందంలో ముంచెత్త‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమాకు తొలివార‌మే దాదాపు రూ. 23 కోట్ల షేర్ రావ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి 'చెక్' మూవీ వ‌సూళ్లు ఎంత తీసిక‌ట్టుగా ఉన్నాయో ఊహించుకోవ‌చ్చు. క్లైమాక్స్‌లో చేసిన త‌ప్పిదంతో అప్ప‌టిదాకా చెప్పిన క‌థ అంతా బూమ‌రాంగ్ అవ‌డంతో ప్రేక్ష‌కులు 'చెక్‌'ను మెచ్చ‌లేదు. యేలేటి డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే ఇది అత్యంత బ‌ల‌హీన స్క్రిప్ట్‌గా విశ్లేష‌కులు తేల్చారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ సినిమాకు క‌ల్యాణీ మాలిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

'వ‌కీల్ సాబ్‌'లో "స‌త్య‌మేవ జ‌య‌తే" సాంగ్ ఎలా ఉందంటే...

  ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ చేస్తున్న 'వ‌కీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న విడుద‌ల‌కు రెడీ అవుతోంది. లైంగిక హింస‌ను ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిల త‌ర‌పున వాదించి వారిని కాపాడే ఓ లాయ‌ర్ క‌థ‌తో హిందీలో వ‌చ్చి విజ‌యం సాధించిన 'పింక్' మూవీకి ఇది రీమేక్‌. ఈ సినిమాలోని "స‌త్య‌మేవ జ‌య‌తే" అనే పాట‌ను ఈరోజు విడుద‌ల చేశారు. త‌మ‌న్ స్వ‌రాలు కూర్చ‌గా, రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, పృథ్వీచంద్ర‌, త‌మ‌న్ క‌ల‌సి ఆల‌పించారు. సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిట‌నే విష‌యాన్ని ఈ పాట ద్వారా తెలియ‌జేశారు. 'వ‌కీల్ సాబ్' కేవ‌లం కేసులు వాదించే వ‌కీలు మాత్ర‌మే కాద‌నీ జ‌నంతో క‌ల‌గ‌ల‌సిన జ‌నం మ‌నిష‌ని చెప్తూ, "జ‌న‌జ‌నజ‌న జ‌న‌గ‌ణ‌మున క‌ల‌గ‌ల‌సిన జ‌నం మ‌నిషిరా..  మ‌న‌మ‌న‌మ‌న మ‌న‌త‌ర‌పున నిల‌బ‌డ‌గ‌ల నిజం మ‌నిషిరా" అంటూ పాట‌ను ప్రారంభించారు. చీక‌టి ముసురుకొని ఉండే పేద‌వాళ్ల క‌ల‌ల‌ను ఆయ‌న‌ త‌న వెలుగుతో గెలిపిస్తాడు. న‌లిగిపోయిన బ‌తుకుల‌కు ఆస‌రాగా నిలుస్తాడు. అందుకే, "నిశి ముసిరిన క‌ల‌ల‌ను త‌న వెలుగుతొ గెలిపించు ఘ‌నుడురా.. ప‌డి న‌లిగిన బ‌తుకుల‌కొక బ‌ల‌మ‌గు భుజ‌మివ్వ‌గ‌ల‌డురా" అని ప‌ల్ల‌విని ముగించారు. వ‌కీల్ సాబ్ ఎట్లాంటి వాడంటే.. త‌న ముందు త‌ప్పు జ‌రిగితే, ఆ త‌ప్పు చేసిన వాళ్ల‌ను అస్స‌లు వ‌ద‌ల‌డు. అన్యాయానికి గురైన వాళ్ల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తాడు. ఆ విష‌యాన్ని, "వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌డు ఎదురుగ త‌ప్పు జ‌రిగితే.. ఇత‌నిలా ఓ గ‌ళం మ‌న వెన్నుద‌న్నై పోరాడితే.. స‌త్య‌మేవ జ‌య‌తే" అని చెప్పారు. ఎంత గుండెధైర్యం క‌లిగిన‌వాడో, అంత‌టి ద‌యార్ద్ర హృద‌యుడు ఈ వ‌కీల్ సాబ్‌. అంతేనా.. బాధ‌ల్లో ఉన్న‌వాళ్ల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని గొంతెత్తే పోరాట‌ధీరుడు. ఆ సంగ‌తిని, "గుండెతో స్పందిస్తాడు అండ‌గా చెయ్యందిస్తాడు.. ఇల చెంప‌జారెడి ఆఖ‌రి అశ్రువు నాపెడివ‌ర‌కూ.. అనునిత్యం బ‌ల‌హీనులంద‌రి ఉమ్మ‌డి గొంతుగ పోరాట‌మె త‌న క‌ర్త‌వ్యం" అనే లైన్ల ద్వారా తెలిపారు. ఇక్క‌డి దాకా శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ గ‌ళంలో గంభీరంగా వ‌కీల్ సాబ్ గుణ‌గ‌ణాల్నీ, ఆయ‌న ధీరోదాత్త‌త‌నూ తెలియ‌జేసిన పాట పృథ్వీచంద్ర గొంతులో ర్యాప్‌లోకి ట‌ర్న్ తీసుకుంది. "వ‌కాల్తాపుచ్చుకుని వాదించే ఈ వ‌కీలు.. పేదోళ్ల ప‌క్క‌నుండి క‌ట్టిస్తాడు బాకీలు.. బెత్తంలా చుర్రుమ‌ని క‌క్కిస్తాడు నిజాలు.. మొత్తంగ న్యాయానికి పెట్టిస్తాడు దండాలు" అంటూ ఆయ‌న ఎట్లాంటి లాయ‌రో చెప్పారు. ఇలాంటివాడు ఒక్క‌డుంటే బాధితుల‌కు నిశ్చింత‌గా ఉంటుంద‌నీ, ఎలాంటి అన్యాయాలు త‌లెత్త‌వ‌నీ తెలియ‌జేస్తూ, "ఇట్టాంటి ఒక్క‌డుంటే అంతే చాలంతే.. గొంతెత్తి ప్ర‌శ్నించాడో అంతా నిశ్చింతే.. ఇట్టాంటి అన్యాయాలు త‌లెత్త‌వంతే.. మోరెత్తే మోస‌గాళ్ల ప‌త్తా గ‌ల్లంతే.. స‌త్య‌మేవ జ‌య‌తే" అని పాట‌ను ముగించారు. చివ‌రి చ‌ర‌ణాన్ని ర్యాప్‌లో చేయ‌కుండా మొద‌టి చ‌ర‌ణం త‌ర‌హాలోనే కొన‌సాగించిన‌ట్ల‌యితే పాట‌కు మ‌రింత డెప్త్ వ‌చ్చి ఉండేద‌నిపించింది. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని పాట‌ను ఇలా ట్యూన్ చేసి ఉంటార‌నుకోవాలంతే. ఏదేమైనా ఒరిజిన‌ల్‌లో మ‌నం చూడ‌ని త‌ర‌హా వ‌కీల్ సాబ్‌ను మ‌నం ఈ సినిమాలో చూడ‌బోతున్నాం. అమితాబ్ బ‌చ్చ‌న్ చేయ‌ని ఫైట్ల‌ను ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయ‌డాన్ని చూడ‌బోతున్నాం. ఎన‌ర్జిటిక్‌, యాక్టివ్‌, మోర్ క‌రేజియ‌స్ 'వ‌కీల్ సాబ్‌'ను ఏప్రిల్‌ 9న మ‌నం ద‌ర్శించ‌బోతున్నాం. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీని బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా శ్రుతి హాస‌న్ క‌నిపించే ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల లైంగిక వేధింపుల‌కు గుర‌య్యే అమ్మాయిలుగా న‌టించారు.

ఇట‌లీ నుంచి స్పోర్ట్స్‌ కారు తెప్పిస్తున్న‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

  టాలీవుడ్ స్టార్ల‌లో చాలామంది ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. మామూలు కార్ల‌లో లేని సౌక‌ర్యాలు ఉన్న కార్లు వాళ్ల గ్యారేజీల‌లో క‌నిపిస్తుంటాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం అందుకు మిన‌హాయింపు కాదు. కొత్త‌గా మార్కెట్‌లోకి వ‌చ్చిన ల‌గ్జ‌రీ కార్ల‌ను ఓ చూపు చూస్తుంటాడు తార‌క్‌. లేటెస్ట్‌గా ఆయ‌న దృష్టి 'లంబోర్గిని ఉరుస్' మోడ‌ల్‌పై ప‌డింది. అది అత్యంత వేగంగా వెళ్లే స్పోర్ట్స్ కారు. దానిని ఆయ‌న ఇట‌లీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడ‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగ‌తోంది. ఎందుకంటే ఆ మోడ‌ల్ కారు ప్ర‌స్తుతం ఇండియా మార్కెట్‌లో లేదు. అందుక‌నే ఇట‌లీ నుంచి దాన్ని తెప్పించుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందిన రిపోర్ట‌ల ప్ర‌కారం లంబోర్గిని ఉరుస్ కారు ధ‌ర భార‌తీయ క‌రెన్సీలో రూ. 5 కోట్ల దాకా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేష‌న్‌కూ, టాక్స్‌ల‌కూ మ‌రింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నేడు ప్ర‌పంచంలో అందుబాటులో ఉన్న అత్యంత విలాస‌వంత‌మైన కార్ల‌లో లంబోర్గిని ఉరుస్ ఒక‌టని చెప్తున్నారు. ప్ర‌పంచంలోనే ఇది తొలి సూప‌ర్ స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్ అని వినిపిస్తోంది. కేవ‌లం 3.6 సెక‌న్ల వ్య‌వ‌ధిలో జీరో నుంచి గంట‌ల‌కు 62 మైళ్ల వేగాన్ని అందుకొనే సామ‌ర్థ్యం ఈ కారు సొంతం. దీని టాప్ స్పీడ్ గంట‌కు 190 మైళ్లు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర బీఎండ‌బ్య్లూ కార్లు ఉన్నాయి. ఆయ‌న కార్ల‌న్నింటికీ 9999 అనే ఫ్యాన్సీ నంబ‌ర్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

'ఆచార్య'లో రామ్‌చ‌ర‌ణ్ కామ్రేడ్ లుక్‌!

  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'‌. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోన్న ఈ మూవీని మే14న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య‌'ను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్‌లో చిరంజీవి క‌నిపించిన తీరుకు ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. కాగా ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాడు. అత‌ను ఎలా క‌నిపిస్తాడో చూడాల‌ని ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారి కోసం లేటెస్ట్‌గా చ‌ర‌ణ్ త‌న ప్రి లుక్‌ను షేర్ చేశాడు. ఈ మూవీలో అత‌ను న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడ‌నే విష‌యం అత‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చ‌ర్‌తో క‌న్ఫామ్ అయ్యింది. అటువైపు తిరిగి ఉన్న చ‌ర‌ణ్ భుజంపై ఓ వ్య‌క్తి చేయిపెట్టిన ఫొటోను చ‌ర‌ణ్ షేర్ చేశాడు. చేయిపెట్టిన వ్య‌క్తి ఆచార్య అని అత‌ని చేతికున్న రెడ్ క్లాత్ తెలియ‌జేస్తోంది. చ‌ర‌ణ్ చెవికి రింగ్ పెట్టుకొని ఉన్నాడు. అత‌ని ముందు ఓ చెట్టుకు గ‌న్ ఆనించి ఉండ‌టం చూడ‌వ‌చ్చు. ఆ ఫొటోకు, "A Comrade moment! Enjoying every moment with Dad @KChiruTweets & @sivakoratala Garu on #Acharya sets." అని క్యాప్ష‌న్ జోడించాడు. అత‌ను ఈ పిక్చ‌ర్ షేర్‌ చేయ‌డం ఆల‌స్యం, సోష‌ల్ మీడియాలో అది వైర‌ల్‌గా మారిపోయింది. 

'సలార్'‌తో 2022 స‌మ్మ‌ర్ సీజ‌న్‌పై క‌ర్చీఫ్ వేసిన ప్ర‌భాస్‌!

  ప్ర‌భాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తోన్న 'స‌లార్' మూవీ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమా విడుద‌ల‌వ‌నుంది. అంటే 2022 స‌మ్మ‌ర్‌ను చాలా ముందుగానే స‌లార్ బుక్ చేసేసుకుంద‌న్న మాట‌! శ్రుతి హాస‌న్ తొలిసారి ప్ర‌భాస్ జోడీగా న‌టిస్తోన్న ఈ మూవీని హోంబ‌ళే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3:25 గంట‌ల‌కు 'స‌లార్‌' రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్‌తో పాటు ప్ర‌భాస్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టించాడు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేసిన ప్ర‌భాస్‌, "స‌లార్ రిలీజ్ డేట్‌ను షేర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 2022 ఏప్రిల్ 14న సినిమా హాళ్ల‌లో మిమ్మ‌ల్ని చూస్తాను." అని క్యాప్ష‌న్ పెట్టాడు. #Salaar14Apr22 అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. పోస్ట‌ర్‌లో బ్లాక్ క‌ల‌ర్‌ నెక్ టీ ష‌ర్ట్‌, బ్లాక్ జీన్స్‌తో క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్‌తో రెబ‌ల్‌గా న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు ప్ర‌భాస్‌. పోస్ట‌ర్‌పై "రెబ‌లింగ్ వ‌ర‌ల్డ్‌వైడ్ ఫ్ర‌మ్ ఏప్రిల్ 14, 2022" అని రాశారు. ఆరోజు డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ జ‌యంతి కావ‌డం గ‌మ‌నార్హం. 'స‌లార్‌'లో ప్ర‌భాస్ ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. అవి పూర్త‌వ‌గానే 'స‌లార్' షూటింగ్‌ను కొన‌సాగించ‌నున్నాడు. మ‌రోవైపు ప్ర‌భాస్ కూడా 'రాధేశ్యామ్' సినిమా విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జూలై 30న ఆ సినిమా రిలీజ‌వుతోంది.

'చెక్' ప్ర‌మోష‌న్స్‌లో ర‌కుల్ ఎందుకు లేదు?

  నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ శుక్ర‌వారం విడుద‌లై ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ పొందుతోంది. యేలేటి మార్క్ సినిమా లాగా లేద‌ని విమ‌ర్శ‌కులు తేల్చేసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ సైతం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేవు. కాగా ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్ లాయ‌ర్ మాన‌స క్యారెక్ట‌ర్ చేసింది. టెర్ర‌రిస్ట్‌గా ముద్ర‌ప‌డి ఉరిశిక్ష‌కు గురై జైల్లో మ‌గ్గుతున్న ఆదిత్య త‌ర‌పున వాదించే క్యారెక్ట‌ర్‌లో ర‌కుల్ క‌నిపించింది.  అయితే 'చెక్' మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ర‌కుల్ క‌నిపించ‌క‌పోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు పెట్టిన ప్రెస్‌మీట్‌లో కానీ, ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కానీ ర‌కుల్ క‌నిపించ‌లేదు. ఆమెకు బ‌దులు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌నిపించింది. ప్రియ ఈ మూవీలో చేసింది చిన్న క్యారెక్ట‌రే. నితిన్ ల‌వ‌ర్‌గా కొద్దిసేపు క‌నిపిస్తుందంతే. ఆమె చేసింది.. ఓ డ్యూయెట్‌, నాలుగైదు సీన్లు! అయినా సినిమాలో ప్రేక్ష‌కుల‌పై ముద్ర వేసింది ఆమె చేసిన యాత్ర క్యారెక్ట‌రే. సినిమా అయ్యాక మాన‌స పేరు కంటే యాత్ర పేరే మ‌న‌కు ఠ‌క్కున స్ఫురిస్తుంది. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే.. ర‌కుల్ ఎందుకు చెక్ ప్ర‌మోష‌న్స్‌లో ఏ ఒక్క‌దానికీ రాలేద‌నే టాక్ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. మీడియాకు ఇచ్చిన గ్రూప్ ఇంట‌ర్వ్యూల్లోనూ నితిన్‌తో క‌లిసి ప్రియా ప్ర‌కాశ్ పాల్గొంది కానీ, ర‌కుల్ పాల్గొన‌లేదు. కాక‌పోతే.. 'చెక్‌'కు సంబంధించి కొన్ని ట్వీట్స్‌, రిట్వీట్స్ మాత్రం చేసి స‌రిపెట్టింది ర‌కుల్‌. దీంతో ఏదో విష‌యంలో ర‌కుల్ హ‌ర్ట‌య్యింద‌నీ, అందుకే ప్ర‌మోష‌న్స్‌కు ఆబ్సెంట్ అయ్యింద‌నీ సినీ జ‌నాలు చెప్పుకుంటున్నారు. నిజ‌మేంటో ఆమెకూ, యూనిట్‌కే తెలియాలి.

ఆల్ ఈజ్ వెల్‌.. సుకుమార్ కుమార్తె వోణీ వేడుక‌లో సూప‌ర్‌స్టార్‌!

  డైరెక్ట‌ర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీ వేడుక బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు స్టార్లు హాజ‌రై, సుకృతిని ఆశీర్వ‌దించారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌- న‌మ్ర‌త దంప‌తులు, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌-ల‌క్ష్మీప్ర‌ణ‌తి దంప‌తులు, నాగ‌చైత‌న్య‌-స‌మంత దంప‌తులు ఈ ఫంక్ష‌న్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.  రెండేళ్ల క్రితం మ‌హేశ్‌, సుకుమార్ మ‌ధ్య తీవ్ర విభేదాలు త‌లెత్తాయ‌నీ, అందుకే సుకుమార్‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించి కూడా మ‌హేశ్ దాన్ని వ‌దిలేసుకున్నాడ‌నీ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగానే తాను ఆ సినిమా చేయ‌ట్లేద‌ని మ‌హేశ్ స్వ‌యంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, ఆ ఇద్ద‌రి మ‌ధ్య బంధం తెగిపోయింద‌ని టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు సుకృతివేణి వోణీ వేడుక‌కు స‌తీ స‌మేతంగా వ‌చ్చి, సుక్కుతో పాటు అత‌ని ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం ద్వారా ఆ ప్ర‌చారానికి ముగింపు ప‌లికాడు మ‌హేశ్‌. కాగా ఈ వేడుక‌లో అల్లు అర‌వింద్ ఫ్యామిలీ, రాజ‌మౌళి ఫ్యామిలీ, జ‌గ‌ప‌తిబాబు, దిల్ రాజు, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, రామ్ పోతినేని, సాయితేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, డైరెక్ట‌ర్ బాబీ, న‌వ‌దీప్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కృతి శెట్టి, సునీత‌-రామ్ వీర‌ప‌నేని, సుమ‌-రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్‌, పూరి జ‌గ‌న్నాథ్ భార్య లావ‌ణ్య‌, పిల్ల‌లు ఆకాశ్‌, ప‌విత్ర త‌దిత‌రులు అనేక‌మంది పాల్గొన్నారు.

"మా ఫ్యామిలీ డిస్ట‌ర్బ్ అయ్యింది".. ర‌‌వికృష్ణ‌తో పెళ్లి రూమ‌ర్స్‌పై న‌వ్య స్వామి!

  తెలుగు టీవీ తెర‌పై ర‌వికృష్ణ‌, న‌వ్య‌స్వామి హాట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. 'ఆమెక‌థ' సీరియ‌ల్‌లో జంట‌గా న‌టిస్తోన్న వారిని టీవీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానిస్తున్నారు. వారిద్ద‌రి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌నీ, పెళ్లి కూడా చేసుకున్నార‌నీ కొంత‌కాలంగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.  ఆ మ‌ధ్య సుమ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే 'క్యాష్' షోలో జంట‌గా పాల్గొన్నారు ర‌వి, న‌వ్య‌. సుమ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ర‌విని న‌వ్య ప్ర‌పోజ్ చేయ‌గా, ఆమెను కౌగ‌లించుకొని ముద్దు పెట్టుకున్నాడు ర‌వి. ఈ సీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంత‌టితో వారి రొమాంటిక్ స్టోరీకి స్టాప్ ప‌డ‌లేదు. ఇటీవ‌ల ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' షోలో జంట‌గా వ‌చ్చి, ఓ పాట‌కు ప‌ర్ఫామ్ చేసిన ర‌వి, న‌వ్య మ‌రోసారి అంద‌రి దృష్టిలో ప‌డ్డారు. బ్యూటిఫుల్ క‌పుల్‌గా అల‌రించారు. పైగా "ఐ ల‌వ్ యూ" అంటూ న‌వ్య నుదిటిపై ర‌వి ముద్దు పెట్టుకొన్నాడు. న‌వ్య కూడా ఊరుకోలేదు. త‌నూ తిరిగి అత‌డికి ముద్దిచ్చింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ముసిముసి న‌వ్వులు న‌వ్వారు. వాళ్ల మ‌ధ్య ఉన్న బంధానికి ఈ స‌న్నివేశం అద్దం ప‌డుతోంద‌ని అంద‌రూ అనుకున్నారు.  షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు కార‌వాన్‌లో నుంచి వ‌స్తున్న న‌వ్య‌ను చూసి నా గుండెగుడిలో పెట్టుకోవాల‌ని అప్పుడే ఫిక్స‌యిపోయాన‌ని ర‌వి చెప్పేశాడు. "అబ్బాయిలెంతమందైనా ఉండోచ్చు.. ఆణిముత్యం మాత్రం ఒక్క‌డే" అని ర‌వికృష్ణ‌ను ఉద్దేశించి చెప్పింది న‌వ్య‌. అలా ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉన్న‌ట్లు ఆ స్టేజిపై ఓపెన్ అయ్యారు. షోలో భాగంగా ఆ ఇద్ద‌రికీ నిర్వాహ‌కులు పెళ్లి కూడా చేసేశారు. అయితే ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌వ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ర‌వితో త‌న‌కు ల‌వ్ ఎఫైర్ లేద‌ని స్ప‌ష్టం చేసింది. తాము నిజంగానే పెళ్లి చేసుకున్నామ‌ని చాలా మంది అనుకుంటున్నార‌ని చెప్పింది. కానీ నిజ‌మేమంటే తాము కేవ‌లం ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని న‌వ్య తెలిపింది. ఇలాంటి వ‌దంతుల్ని తాను సాధార‌ణంగా ప‌ట్టించుకోన‌నీ, కానీ ఈ సారి త‌న ఫ్యామిలీ ఆందోళ‌న చెందింద‌ని చెప్పింది న‌వ్య‌. "మా అమ్మానాన్న‌లు ఎంతో స‌పోర్టివ్‌గా ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ ప్ర‌చారం చూపి, మా అమ్మ‌, 'ఏంటిది? ఏం జ‌రుగుతోంది?  మేం నీకు సంబంధాలు చూస్తున్నాం' అని చెప్పింది. 'అదంతా ప‌ట్టించుకోకు' అని మా అమ్మ‌కు చెప్పాను. అన్నింటికంటే, ఈ నిరాధార వ‌దంతుల వ‌ల్ల మా ఫ్యామిలీస్ చాలా డిస్ట‌ర్బ్ అవుతున్నాయి." అని ఆవేద‌న చెందింది న‌వ్య‌. అదీ విష‌యం.. 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'లో వాళ్లు చేసిందంతా షోలో భాగ‌మేన‌ని అనుకోవాల‌న్న మాట‌!!

సుకుమార్‌తో షూటింగ్ ఎలా ఉంటుందో ర‌ష్మిక‌కు తెలిసొచ్చింది!

  సుకుమార్ ఎంత‌టి క్రియేటివ్ డైరెక్ట‌రో, అంతటి వ‌ర్కోహాలిక్ కూడా. ఆయ‌న ప్ర‌తి సినిమా ప్రేక్ష‌కుల‌కు ఒక స‌రికొత్త అనుభ‌వాన్నీ, అనుభూతినీ ఇస్తుంద‌నేది నిజం. అయితే ఆయ‌న సినిమా సెట్స్‌పై యూనిట్ ప‌డే క‌ష్టాలు మాత్రం మామూలువి కావు. ఒక షాట్ ఓకే చెయ్య‌డానికి సుకుమార్ ఎన్ని టేకులు తీస్తాడో, ఆయ‌న‌తో ప‌నిచేసిన వాళ్లంద‌రికీ అనుభ‌వ‌మే. చాలాసార్లు షాట్ ఓకే చేసినా కూడా ఆయ‌న ముఖంలో శాటిస్‌ఫ్యాక్ష‌న్ క‌నిపించ‌ద‌ని అంటుంటారు. ఒకే సీన్ ప‌దిసార్లు చేయాల్సి వ‌చ్చేస‌రికి యాక్ట‌ర్ల‌తో పాటు టెక్నీషియ‌న్లు కూడా విసుగెత్తిపోతుంటారు. అందుకే సుకుమార్ సినిమా షూటింగ్ అంటే వారంతా హ‌డ‌లిపోతుంటారు. అలా అని ఆయ‌న‌తో ప‌నిచేయ‌కుండా ఉండ‌రు. అది వేరే సంగతి. లేటెస్ట్‌గా ఆయ‌న షూటింగ్ చేస్తున్న సినిమా 'పుష్ప‌'. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌ష్మికా మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ‌న్నీ అయితే సుకుమార్‌తో అల‌వాటు ప‌డిపోయాడు కానీ, ర‌ష్మిక‌కు ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం ఇదే మొద‌టిసారి. దాంతో సెట్స్‌పై ర‌ష్మిక ప‌డుతున్న తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావంటున్నారు. రోజంతా 'పుష్ప' షూటింగ్‌లో గ‌డిపిన ఆమె, ఇంకా 90 నిమిషాల షూటింగ్ మిగిలే ఉందని చెప్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ర‌ష్మిక క‌ళ్లు మూసుకొని ఉంది. ముఖంలో న‌వ్వు వెనుక బాగా అల‌స‌ట కూడా క‌నిపిస్తోంది. కొద్దిసేప‌టి త‌ర్వాత మ‌రో ఫొటో షేర్ చేసి, అమ్మ‌య్య‌.. ఈ రోజుకు షూటింగ్ అయిపోయింద‌ని చెప్తూ ఊపిరి పీల్చుకుంది. ఇప్ప‌టికి 'పుష్ప‌'కు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్త‌యి, మూడో షెడ్యూల్ జ‌రుగుతోంది. అయినా ఇంకా 50 శాతం సీన్లు తీయాల్సి ఉంది. సెట్స్‌పై ర‌ష్మిక అవ‌స్థ‌లు చూసిన‌వాళ్లు ఆమెకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. ఆగ‌స్ట్ 13న 'పుష్ప' విడుద‌ల కానున్న‌ది.

బాల‌య్య 'భీష్మ' అవ‌తారం

  నేడు భీష్మ ఏకాద‌శి. ఈ సంద‌ర్భంగా 'య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు' చిత్రంలో తాను చేసిన భీష్మ పాత్ర‌కు సంబంధించిన స్టిల్స్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేశారు. సినిమాలో ఆ పాత్ర మ‌న‌కు క‌నిపించ‌ని విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ భీష్మ పాత్రంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. "నాన్న‌గారు ఆయ‌న వ‌య‌సుకు మించిన భీష్మ పాత్ర‌ను అద్వితీయంగా పోషించి ప్రేక్ష‌కుల విశేష ఆద‌రాభిమానాల‌ను అందుకున్నారు." అని తెలిపారు. 'భీష్మ' చిత్ర‌మ‌న్నా, అందులో త‌న తండ్రి ఎన్టీఆర్ న‌టించిన భీష్ముని పాత్ర అన్నా త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని బాల‌య్య అన్నారు. "అందుక‌నే 'య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు' చిత్రంలో భీష్మ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాలు తీశాం. అందులో నేను భీష్మునిగా న‌టించాను. అయితే నిడివి ఎక్కువ అవ‌డం వ‌ల్ల ఆ చిత్రంలో ఆ స‌న్నివేశాలు పెట్టేందుకు కుద‌ర‌లేదు. ఇవాళ భీష్మ ఏకాద‌శి ప‌ర్వ‌దినం. ఈ సంద‌ర్భంగా ఆ పాత్ర‌కు సంబంధించిన ఫొటోల‌ను ప్రేక్ష‌కుల‌తో, అభిమానుల‌తో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను." అని చెప్పారు బాల‌య్య‌.