అక్కినేనిని మొట్ట‌మొద‌ట సినిమాల్లోకి తీసుకువెళ్లిందెవ‌రో తెలుసా?

  నాట‌క‌రంగం నుంచి సినిమా రంగంలోకి వ‌చ్చి ద‌శాబ్దాల పాటు అగ్ర‌న‌టులుగా రాణించిన వారు అరుదు. ఆ అరుదైన న‌టుడు న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. జాన‌ప‌ద చిత్రాల‌తో చ‌ల‌న‌చిత్ర రంగంలోకి వ‌చ్చిన అక్కినేని ఆ త‌ర్వాత సాంఘిక చిత్రాల‌లో.. ముఖ్యంగా ప్రేమ‌క‌థా చిత్రాల‌లో, విషాద పాత్ర‌ల్లో త‌న‌ను మించిన వారు లేర‌నిపించుకున్నారు. ఏఎన్నార్ 1924 సెప్టెంబ‌ర్ 20న కృష్ణా జిల్లాల్లోని వెంక‌ట‌రాఘ‌వాపురం (ఇప్పుడు రామాపురం)లో జ‌న్మించారు. ఆయ‌న స్వ‌గ్రామంలో ఎలిమెంట‌రీ స్కూలు పైన చ‌దువు లేదు. అందువ‌ల్ల రోజూ రెండు మైళ్లు న‌డిచి, పెద‌విరివాడ‌కు వెళ్లి అక్క‌డ చ‌దువుకుంటూ ఉండేవారు.  ఆ రోజుల్లోనే ఆయ‌న వాళ్ల ఊర్లో కొంద‌రు కుర్రాళ్ల‌తో క‌లిసి పిల్ల‌ల నాట‌కాలాడి స్థానికంగా పేరు సంపాదించారు. అలా ఆయ‌న మొట్ట‌మొద‌ట పాల్గొన్న నాట‌కం 'సావిత్రి'. అందులో నాగేశ్వ‌ర‌రావు ధ‌రించిన పాత్ర నార‌దుడు. నాగేశ్వ‌ర‌రావు పెద్ద‌న్న రామ‌బ్ర‌హ్మంగారికి నాట‌కాల స‌ర‌దా ఎక్కువ‌. ఆయ‌న‌కు నాగేశ్వ‌ర‌రావు మంచి న‌టుడ‌వుతాడ‌న్న న‌మ్మ‌కం ఉండేది. అప్ప‌టికి నాగేశ్వ‌ర‌రావు మూడో ఫారం చ‌దువుతున్నారు. ఈ చ‌దువులు త‌మ‌వ‌ల్ల కాద‌నీ, చ‌దివించి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌ద‌నీ, న‌టుడిగా పైకి వ‌స్తే లాభిస్తుంద‌నీ రామ‌బ్ర‌హ్మంగారి ఆలోచ‌న‌. ఆ ఆలోచ‌న‌తో నెల‌కు రెండు రూపాయ‌లిచ్చి నాగేశ్వ‌ర‌రావును కుద‌ర‌వ‌ల్లిలోని ఓ నాట‌క స‌మాజంలో స‌భ్యునిగా చేర్చారు.  ప‌రిస్థితులు బాగాలేక చ‌దువు ఆపేసిన త‌మ్ముడ్ని ఎలాగైనా సినిమాల్లో చేర్పించాల‌నే ఆలోచ‌న‌తో రామ‌బ్ర‌హ్మంగారు త‌న‌కు ప‌రిచ‌య‌మున్న కాజ వెంక‌ట్రామ‌య్య‌ ద్వారా ద‌ర్శ‌కుడు పి. పుల్ల‌య్య‌కు ప‌రిచ‌యం చేయించి, 'ధ‌ర్మ‌ప‌త్ని'(1941)లో న‌టించేట్లు చేశారు. శాంత‌కుమారి, ఉప్పులూరి హ‌నుమంత‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారులైన అందులో అక్కినేని ఓ చిన్న వేషం వేశారు. ఆ సినిమా నాగేశ్వ‌ర‌రావుకు క‌లిసిరాలేదు. రామ‌బ్ర‌హ్మంగారికి కూడా స్టేజిమీద‌నే గురి కుదిరిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆయ‌న నాగేశ్వ‌ర‌రావును గుడివాడ తీసుకుపోయి అప్ప‌టికి కుచేల‌, హ‌రిశ్చంద్ర నాట‌కాలాడుతున్న వై. భ‌ద్రాచారికి అప్ప‌గించారు. గుడివాడ చేరేదాకా అక్కినేని ఒక ప్ర‌సిద్ధ న‌టుడ్ని కానీ, నాట‌కాన్నీ కానీ ఎరుగ‌రు. అలాంటిది భ‌ద్రాచారి వెంట ఉండ‌గా ఆయ‌న‌కు పులిపాటి వెంక‌టేశ్వ‌ర్లు, కె. ర‌ఘురామ‌య్య లాంటి ఇద్ద‌రు హేమాహేమీల ప‌క్క‌న న‌టించే అవ‌కాశం క‌లిగింది. 

15 రోజుల క్వారంటైన్ త‌ర్వాత.. పిల్ల‌ల్ని చూసి ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ!

  కొవిడ్‌-19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధార‌ణ అయ్యాక స్వీయ ఐసోలేష‌న్‌లో ఉండిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. భార్య స్నేహారెడ్డితో ట‌చ్‌లో ఉంటున్నా పిల్ల‌ల‌ను ఆయ‌న బాగా మిస్స‌వుతూ వ‌చ్చారు. వీడియో కాల్స్‌లోనే వారిని చూసుకుంటూ తృప్తి ప‌డ్డారు. 15 రోజులు క్వారంటైన్‌లో ఉన్న త‌ర్వాత టెస్ట్‌లో నెగ‌టివ్ రావ‌డంతో, క్వారంటైన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు బ‌న్నీ.  త‌న ఇంట్లోకి వ‌చ్చి ఫ్యామిలీని.. ప్ర‌ధానంగా పిల్ల‌ల్ని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. మొద‌ట కొడుకు అయాన్ ఎదురుప‌డ‌గానే ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌ని పిలిచి గ‌ట్టిగా హ‌త్తుకుని, ఫ్లోర్‌పై కింద‌ప‌డి దొర్లాడారు. ఆ త‌ర్వాత గారాల‌ ప‌ట్టి అర్హ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దుల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. వారికి మ‌రోసారి అయాన్ తోడ‌య్యాడు. ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన బ‌న్నీ, "Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much." అంటూ క్యాప్ష‌న్ జోడించాడు. ఇద్ద‌రు పిల్ల‌ల్నీ బ‌న్నీ బిగియార కౌగ‌లించుకుంటున్న‌ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.  అంత‌కు కొద్ది సేప‌టి ముందు త‌న‌కు లేటెస్ట్‌గా టెస్ట్‌లో నెగ‌టివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని త‌న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్ర‌క‌టించారు. త‌న‌కు ప్రేమ‌ను పంచిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. "హ‌లో ఎవిరివ‌న్‌! 15 రోజుల క్వారంటైన్ అనంత‌రం నేను టెస్ట్‌లో నెగ‌టివ్‌గా తేలింది. నాకు విషెస్ చెప్పిన‌, నా కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులంద‌రికీ థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నా. కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. మీ ప్రేమ‌కు కృత‌జ్ఞ‌డ్ని." అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు అల్లు అర్జున్‌. 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు క‌రోనా!

  కొవిడ్ బాధితుల్లోకి లేటెస్ట్‌గా యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ చేరారు. ఆయ‌న‌కు టెస్ట్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తార‌క్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.  "నేను కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాను. ద‌య‌చేసి వ‌ర్రీ కాకండి, నేను చాలా బాగా ఉన్నాను. నా ఫ్యామిలీ, నేను స్వీయ ఐసోలేష‌న్‌లో ఉన్నాం. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అన్ని జాగ్ర‌త్త‌లూ ఫాలో అవుతున్నాం. గ‌త కొద్ది రోజులుగా నాకు ద‌గ్గ‌ర‌గా మెల‌గిన వాళ్లంద‌రూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్షేమంగా ఉండండి." అని ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ఆగిపోవ‌డంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. తార‌క్‌కు క‌రోనా పాజిటివ్ అనే విష‌యం తెలియ‌గానే ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతున్న సెల‌బ్రిటీల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటోంది. ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, త‌మ‌న్నా, హ‌రితేజ‌, బండ్ల గ‌ణేశ్‌, ప్ర‌దీప్ మాచిరాజు లాంటివాళ్లు కొవిడ్ 19కు గుర‌య్యారు. ప‌వ‌న్ దీని నుంచి కోలుకోవ‌డానికి 20 రోజులు ప‌ట్టిందంటే దాని ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉంటోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏమాత్రం ల‌క్ష‌ణాలు క‌నిపించినా, ఆల‌స్యం చేయ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ, డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌ద‌ర్స్ డే స్పెష‌ల్ స్టోరీ.. మ‌న వెండితెర 'అమ్మ‌'!

  సంతోషం వ‌చ్చినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా, దెబ్బ‌త‌గిలినా అప్ర‌య‌త్నంగా గుర్తొచ్చే ప‌దం అమ్మ‌.  ఎన్ని యుగాలు మారినా, ఎన్ని త‌రాలు దాటినా మార‌ని మాధుర్యం అమ్మ‌. అమ్మ గురించి ఎవ‌రెన్ని చెప్పినా అది త‌క్కువే. భాష‌కు అంద‌ని భావం అమ్మ‌. ఆ భావాన్ని మ‌న సినిమాల్లో త‌మ‌కు తోచిన రీతిలో ఆవిష్క‌రించారు మ‌న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు. త‌మ అభిన‌యంతో అమ్మ పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన తార‌లెంద‌రో. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా వెండితెర‌పై అమ్మ‌ను క‌ళ్ల‌ముందు నిలిపిన వారిపై తెలుగువ‌న్ స్పెష‌ల్ స్టోరీ... క‌న్నాంబ‌ తెలుగు సినిమా తొలి రోజుల్లో అమ్మ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటీమణి కన్నాంబ. ఆమె రూపు చూడ‌గానే అమ్మ అనాల‌నిపిస్తుంది. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడంలో ఆమె చాతుర్యం, హావభావాలు.. వీటన్నింటి సాయంతో ఆమె మాతృమూర్తిగా ఒదిగిపోయారు.  శాంత‌కుమారి తెలుగులో తల్లి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ శాంతకుమారి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహమహులకు అమ్మగా నటించారు శాంతకుమారి. శ్రీవెంకటేశ్వర మహాత్యం సినిమాలో శ్రీనివాసుని తల్లి వకుళమ్మగానూ.. ప్రేమనగర్‌లో ఏఎన్నార్ తల్లిగా ఆమె న‌ట‌న అంద‌రి హృదయాల‌కు హత్తుకుపోయింది. పండ‌రీబాయి అప్పట్లో తెలుగులో అంద‌రు అగ్ర హీరోల‌కు అమ్మగా నటించి మోస్ట్ వాంటెడ్ స్క్రీన్ మ‌ద‌ర్‌గా పేరు పొందారు పండరీబాయి. కృష్ణ నటించిన నేరము-శిక్ష సినిమాలో కొడుకుని నేరం నుంచి రక్షించుకునేందుకు తాపత్రాయపడే తల్లిగా పండరీబాయి నటన అపూర్వం.  సూర్య‌కాంతం అదేంటి సూర్యకాంతం గారు గయ్యాళి అత్త పాత్రలకు పెట్టింది పేరు కదా! మరి అమ్మ పాత్ర సమయంలో ఆమెను చెప్పడం ఏంటనేగా మీ డౌట్.. అత్తగారిగా కోడల్ని ఎంత హింసపెట్టినా.. తల్లిగా తన పిల్లల్ని ప్రేమించే పాత్రల్లోనూ సూర్యకాంతం గారు ఒదిగిపోయారు. అందుకే ఆమె గయ్యాళి అత్తగారే కాదు ద బెస్ట్ మదర్ కూడా. అంజ‌లీదేవి తెలుగువారి సీతమ్మగా కీర్తి ప్రతిష్ఠ‌లు సంపాదించిన అంజలీదేవి కెరిర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారాక‌ తల్లి పాత్రల్లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు. భక్త ప్రహ్లాద , లక్ష్మీనివాసం, బడిపంతులు, తాతామనవడు, జీవన తరంగాలు ఇలా ఎన్నో సినిమాల్లో మదర్ క్యారెక్టర్ వేసి వెండితెర అమ్మ‌గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. నిర్మ‌ల‌మ్మ‌ ఇర‌వైల‌లో ఉన్న‌ప్పుడే త‌న కంటే వ‌య‌సులో ఎంతో పెద్ద‌వారైన హీరోల‌కు అమ్మ‌గా న‌టించి నిర్మల కాస్త నిర్మలమ్మ అయ్యారు. తెలుగు సినిమాల్లో నిర్మ‌ల‌మ్మ వేసిన‌న్ని అమ్మ పాత్ర‌లు మ‌రొక‌రు వేయ‌లేదు. తెర మీద‌నే కాకుండా బ‌య‌ట‌కూడా ఇండస్ట్రీలోని అందరూ అమ్మా అంటూ పిలిచిన‌  ఏకైక అమ్మ నిర్మలమ్మ. అన్న‌పూర్ణ‌ నిర్మ‌ల‌మ్మ త‌ర‌హాలోనే తెలుగులో అమ్మపాత్రలకు కేరాఫ్ అడ్రస్ అన్నపూర్ణ. తన సహజ నటనతో అమ్మగా జీవించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, అర్జున్, భానుచందర్, సుమన్ తదితర హీరోలందరికీ అమ్మ అంటే అన్నపూర్ణే. మ‌నోర‌మ‌ తన నటనతో ప్రేక్షకుల చేత ఆచి అని ముద్దుగా పిలుచుకేనేంతటి పేరు సంపాదించుకున్నారు మనోరమ. ఆచి అంటే తమిళ్‌లో అమ్మ అని అర్థం. అలాంటి గొప్ప పదాన్ని మనోరమకు బిరుదుగా లభించిందంటే అమ్మపాత్ర ద్వారా ఆమె ప్రేక్షకుల్లో ఎంత ముద్ర వేశారో అర్థమవుతుంది. త‌మిళంలోనే కాకుండా తెలుగులోనూ ప‌లువురు హీరోల‌కు అమ్మ అయ్యారు మ‌నోర‌మ‌. సుజాత‌ అమ్మ పాత్రలకు గౌరవాన్ని తీసుకువచ్చిన నటి సుజాత. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. చంటి, కొండపల్లి రాజా త‌దిత‌ర‌ సినిమాల్లో అమ్మగా జీవించి అవార్డులను సైతం గెలుచుకున్నారు.  జ‌య‌సుధ‌ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఒక వెలుగు వెలిగిన జ‌య‌సుధ‌, వ‌య‌సు మ‌ళ్లాక అమ్మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి ద‌గ్గ‌ర్నుంచి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు దాకా అమ్మ పాత్ర‌ల‌కు వ‌న్నెతెచ్చారు స‌హ‌జ‌న‌టి. సుధ‌ సహజ సిద్ధమైన నటన, చూడగానే మన పక్కింటి ఆమెలానో, తెలిసిన వ్యక్తిలా కనిపించే రూపంతో ప‌లువురు హీరో హీరోయిన్లకు మదర్‌గా న‌టిస్తూ వ‌స్తున్నారు సుధ. న‌దియా ఒక‌ప్పుడు ప్రేక్ష‌కుల క‌ల‌ల‌రాణిగా పేరు తెచ్చుకున్న న‌దియా మిర్చి సినిమాలో ప్ర‌భాస్ త‌ల్లిగా రీ-ఎంట్రీ ఇచ్చి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. బ్యూటిఫుల్ మ‌ద‌ర్‌గా ఆ సినిమాలో ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం ఆమెకు మ‌రిన్ని అమ్మ పాత్ర‌ల అవ‌కాశాలు తీసుకొచ్చింది.

ఆత్రేయ 'మ‌న‌సు' క‌వి మాత్ర‌మే కాదు.. 'మ‌నోవైజ్ఞానిక' క‌వి!

   ఆచార్య ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి! జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల్లో, సందేశాల్లో, ఉపన్యాసాల్లో తెలుగునాట వేమన పద్యాలకున్న వ్యాప్తి సినిమా పాటలంటూ ఇష్టపడే జనం వాడుకలో ఆత్రేయ పాట‌ల‌కూ ఉంది. నేడు ఆయ‌న శ‌త జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆ అసాధార‌ణ క‌విని స్మ‌రించుకుంటూ ఈ చిరు వ్యాసం... 1. "మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే" (ప్రేమనగర్‌) 2. ‘"మనసు లేని బ్ర‌తుకొక నరకం మరపులేని మనసొక నరకం" (సెక్రటరీ) 3. "మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!" (ప్రేమలు-పెళ్లిల్లు) 4. "కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!" (గుప్పెడు మనసు ) 5. "మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలిసిపోతది " (మూగ మనసులు) ఇలాంటి పాట‌ల‌ను ఆత్రేయ మాత్ర‌మే రాయ‌గ‌ల‌రు. ఆయ‌న‌లో గొప్ప మ‌నోవైజ్ఞానికుడు ఉన్నాడ‌ని చెప్ప‌డానికి ఈ పాట‌లే నిద‌ర్శ‌నం. మ‌నిషి మ‌న‌సును ఆయ‌న‌లా అర్థం చేసుకున్న సినీ క‌వి మ‌రొక‌రు తెలుగులోనే కాదు, మ‌రే భాష‌లోనూ క‌నిపించ‌రు. ఆత్రేయ అసలు పేరు ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులు. ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు. ఆయన చినమామ జగన్నాథాచార్యులు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్‌మెంట్ ఆఫీసులో ఆత్రేయ‌కు గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారు! దాంతో ఆ ప‌త్రిక‌ వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం! జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో త‌మ ఇంట్లోనే ఆత్రేయ ఘనంగా జరిపించారు. ఆ సందర్భంగా ఆయ‌న కొన్ని పాట‌లు కూడా రాశారు. అవి ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకోవ‌డం విశేషం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి "కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా" అని రాశారు. అలాగే, "పెళ్లంటే పందిళ్లు సందళ్లు..." అనే 'త్రిశూలం' చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే! ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారు. దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు. అదే.. "కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన.." పాట‌. ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్రేయ‌కు సంబంధించిన విశేషాలెన్నో ఉంటాయి. తెలుగు సినీ సాహిత్యానికి ఆత్రేయ ఒక దిక్సూచి, ఒక మ‌ణిదీపం. ఆత్రేయ‌కు సాటి రాగ‌ల క‌వి అంత‌కుముందూ లేరు, ఆ త‌ర్వాతా రాలేదు.

నేటి త‌రం నంద‌మూరి-అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మ‌య్యేనా?

  తెలుగు సినీ వినీలాకాశంలో నాలుగు ద‌శాబ్దాల పాటు తిరుగులేని క‌థానాయ‌కులుగా రాణించారు నంద‌మూరి తార‌క‌రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యి, త‌మిళ‌నాడు సంప్ర‌దాయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ప్ర‌వేశ‌పెట్టారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్ గురించిన అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఉత్త‌రాన అంత‌వ‌ర‌కూ 'మ‌ద్రాసీయులు'గా వ్య‌వ‌హ‌రింప‌బ‌డుతున్న తెలుగువారికి, 'తెలుగువారు' అన్న గుర్తింపుని తీసుకువ‌చ్చారు. అక్కినేని రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా చివ‌రి శ్వాస దాకా న‌టిస్తూ వ‌చ్చారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచే చిత్రాలు కొన్నిటిలో ఈ మ‌హాన‌టులిద్ద‌రూ క‌లిసి న‌టించారు.  వీరికి వార‌సులుగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చారు నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున‌. మూడు ద‌శాబ్దాలుగా అనేక హిట్ సినిమాల‌లో న‌టించి, ఇప్ప‌టికీ సీనియ‌ర్ స్టార్ హీరోలుగా రాణిస్తూనే ఉన్నారు. త‌మ తండ్రుల త‌ర‌హాలోనే ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆశిస్తూ వ‌చ్చినా ఇంత‌దాకా అది నిజం కాలేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ క‌లిసి న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'గుండ‌మ్మ క‌థ‌'ను ఈ ఇద్ద‌రితో రీమేక్ చేయాల‌ని కొంద‌రు నిర్మాత‌లు ఆశించినా, అది వాస్త‌వ రూపం ధ‌రించ‌లేదు. సూర్య‌కాంతం చేసిన పాత్ర‌ను ఎవ‌రు చేయ‌గ‌ల‌రంటూ అప్ప‌ట్లో వినిపించింది. అది కాక‌పోయినా మ‌రో స‌బ్జెక్ట్‌తోనైనా ఆ ఇద్ద‌రూ ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌వ‌చ్చు. కానీ వారు దాని జోలికి వెళ్ల‌లేదు. ఇప్పుడు మూడో ఆ వంశాల్లో మూడో త‌రం కూడా వ‌చ్చి, ద‌శాబ్ద కాలంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. నంద‌మూరి వంశం నుంచి హ‌రికృష్ణ కుమారునిగా వ‌చ్చిన మూడో త‌రం హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ నేటి టాప్ స్టార్స్‌లో ఒక‌డిగా రాణిస్తున్నాడు. 'ఆది', 'సింహాద్రి' చిత్రాల‌తో నంబ‌ర్ వ‌న్ రేంజ్‌కు వెళ్ల‌గ‌ల స‌త్తా ఉంద‌ని నిరూపించుకున్న తార‌క్‌.. ఆ త‌ర్వాత ఆ క్రేజ్‌ను కొన‌సాగించ‌లేక‌పోయినా, మాస్‌లో అద్వితీయ‌మైన ఇమేజ్‌ను సాధించాడు. ఇక అక్కినేని వంశం నుంచి మూడో త‌రం వార‌సునిగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య టాప్ స్టార్ రేంజికి ఎద‌గ‌క‌పోయినా, స్టార్ స్టేట‌స్‌ను అందుకున్నాడు. మంచి క‌థాబ‌లం ఉన్న చిత్రాలు చేస్తూ, చ‌క్క‌ని న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌స్తున్నాడు.  నాగార్జున చిన్న‌కొడుకు అఖిల్ కూడా ఐదేళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అత‌నింకా హిట్ సినిమా బాకీ ఉన్నాడు. 'గుండ‌మ్మ క‌థ‌'ను తార‌క్‌, నాగ‌చైత‌న్యతో రీమేక్ చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం కొన్నాళ్లుగా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. కానీ దానివైపు అడుగులైతే ప‌డ‌టం లేదు. త‌మ తాత‌ల్లాగా ఈ యంగ్ హీరోలైనా క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతున్నారు. నంద‌మూరి-అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ ఒక త‌రానికే ప‌రిమిత‌మ‌వుతుందో, నేటి త‌రం కూడా దాన్ని కొన‌సాగిస్తుందో చూడాలి.

మోస్ట్ వ్యూస్ సాధించిన‌ టాప్ 10 వీడియో సాంగ్స్ ఇవే...

  ఒత్తిడి నుంచి మ‌నిషిని బ‌య‌ట‌ప‌డేసే బెస్ట్ మెడిసిన్ ఏదంటే.. ఎవ‌రైనా చెప్పే ఆన్స‌ర్‌.. మ్యూజిక్‌! య‌స్‌. మంచి పాట మ‌న‌లో శ‌క్తిని నింపి, ఉత్తేజాన్నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. చాలామందికి మెలోడీస్ న‌చ్చుతాయి. యంగ్ జ‌న‌రేష‌న్‌కు అయితే ఫాస్ట్ బీట్స్ ఇష్టం. కొన్ని పాట‌ల్లో సాహిత్యం మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంటుంది. సాహిత్యం, సంగీతం పోటీప‌డుతూ సాగే పాట‌లెన్నో. అలాంటి పాట‌ల‌కు శాశ్వ‌త‌త్వం ఉంటుంది. యూట్యూబ్‌లోనూ అలాంటి పాట‌లనే ఎక్కువ‌గా వ్యూయ‌ర్స్ లైక్ చేస్తున్నారు. తెలుగులో అలా అత్య‌ధిక వ్యూస్ సాధించిన టాప్ 10 సాంగ్స్ వైపు ఓ లుక్కేద్దామా... 1. బుట్ట‌బొమ్మ (అల‌.. వైకుంఠ‌పుర‌ములో) వ్యూస్‌: 602 మిలియ‌న్ వ్యూస్‌ త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌గా రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను అర్మాన్ మాలిక్ ఆల‌పించాడు. మూవీలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జోడీపై చిత్రీక‌రించారు. వ‌రల్డ్ వైడ్‌గా ఈ సాంగ్ పాపుల‌ర్ అయ్యింది. 2. రాములో రాములా (అల‌.. వైకుంఠ‌పుర‌ములో) వ్యూస్‌: 349 మిలియ‌న్ త‌మ‌న్ స్వ‌రాలు కూర్చ‌గా కాక‌ర్ల శ్యామ్ రాసిన ఈ ఫోక్ సాంగ్‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ పాడారు. సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, ట‌బు, జ‌య‌రామ్, సునీల్‌, న‌వ‌దీప్‌ త‌దిత‌ర ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌రించారు. 3. వ‌చ్చిండే పిల్లా (ఫిదా) వ్యూస్‌: 299 మిలియ‌న్ శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించ‌గా సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ ఫోక్ సాంగ్‌ను మ‌ధుప్రియ, రాంకీ ఆల‌పించారు. మూవీలో సాయిప‌ల్ల‌వి, వ‌రుణ్‌తేజ్ బృందంపై తీశారు. 4. రంగ‌మ్మా మంగ‌మ్మా (రంగ‌స్థ‌లం) వ్యూస్‌: 278 మిలియ‌న్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ ఫోక్ సాంగ్‌ను చంద్ర‌బోస్ సూప‌ర్బ్‌గా రాశారు. ఎం.ఎం. మాన‌సి ఆల‌పించిన ఈ పాట‌ను రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత జంట‌పై చిత్రీక‌రించారు. 5. నీలి నీలి ఆకాశం (30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా) వ్యూస్‌: 250 మిలియ‌న్‌ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మెలోడీకి చంద్ర‌బోస్ రాసిన సాహిత్యం ప్రాణం. చిత్రంలో ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్ జంట‌పై తీసిన ఈ పాట‌ను సిద్ శ్రీ‌రామ్‌, సునీత రాగ‌యుక్తంగా ఆల‌పించారు. 6. పిల్లా రా (ఆర్ఎక్స్ 100) వ్యూస్‌: 197 మిలియ‌న్‌ చైత‌న్ భ‌ర‌ద్వాజ్ బాణీలు స‌మ‌కూర్చిన ఈ ల‌వ్ సాంగ్‌కు చైత‌న్య ప్ర‌సాద్ సాహిత్యం అందించారు. మూవీలో కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌పై చిత్రీక‌రించిన ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి సూప‌ర్బ్‌గా పాడాడు. 7. ఇంకేం ఇంకేం కావాలే (గీత గోవిందం) వ్యూస్‌: 188 మిలియ‌న్‌ గోపి సుంద‌ర్ స్వ‌రాలు కూర్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీని అనంత శ్రీ‌రామ్ రాశారు. సిద్ శ్రీ‌రామ్ సూప‌ర్బ్‌గా ఆల‌పించిన ఈ పాట‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నపై చిత్రీక‌రించారు. 8. దిమాక్ ఖ‌రాబ్ (ఇస్మార్ట్ శంక‌ర్‌) వ్యూస్‌: 183 మిలియ‌న్‌ మ‌ణిశ‌ర్మ సంగీత స్వ‌రాలు అందించిన ఈ బీట్ సాంగ్‌ను కాస‌ర్ల శ్యామ్ ర‌చించాడు. సినిమాలో రామ్‌, న‌భా న‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్‌పై తీసిన ఈ పాట‌ను సాకేత్‌, కీర్త‌న శ‌ర్మ పాడారు. 9. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (అల‌.. వైకుంఠ‌పుర‌ములో) వ్యూస్‌: 179 మిలియ‌న్‌ త‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీకి సీతారామ‌శాస్త్రి సాహిత్యం అందించారు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జోడీపై పారిస్‌లో పిక్చ‌రైజ్ చేసిన ఈ గీతాన్ని సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించాడు. 10. జిగేలు రాణి (రంగ‌స్థ‌లం) వ్యూస్‌: 150 మిలియ‌న్‌ దేవి శ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు అందించిన ఈ ఐట‌మ్ నంబ‌ర్‌కు చంద్ర‌బోస్ రాసిన సాహిత్యం సో ఇంట్రెస్టింగ్‌. రీలా కుమార్‌, గంటా వెంక‌ట‌ల‌క్ష్మి పాడిన ఈ స్పెష‌ల్ సాంగ్‌ను పూజా హెగ్డే, రామ్‌చ‌ర‌ణ్ బృందంపై చిత్రీక‌రించారు.

ఫొటో ఫీచ‌ర్‌.. నేడు తార‌క్‌-ల‌క్ష్మీప్ర‌ణ‌తి ప‌దో వివాహ వార్షికోత్స‌వం!

  టాలీవుడ్‌లోని అగ్ర హీరోల్లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1991లోనే ఏడేళ్ల వ‌య‌సులో 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌'లో న‌టించ‌డం ద్వారా తెరంగేట్రం చేశాడు తార‌క్‌. 2001లో 18 ఏళ్ల వ‌య‌సులో 'నిన్ను చూడాల‌ని' సినిమాతో హీరో అయ్యాడు. 'స్టూడెంట్ నెం.1', 'ఆది', 'సింహాద్రి' సినిమాల‌తో పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. 2011 మే 5 అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలో మ‌ర‌పురాని రోజు. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం ఇదే రోజు ల‌క్ష్మీప్ర‌ణ‌తి మెడ‌లో మూడుముళ్లు వేశాడు తార‌క్‌. ఆ ఇద్ద‌రిదీ అరేంజ్డ్ మ్యారేజ్‌. ల‌క్ష్మీప్ర‌ణ‌తి త‌ల్లి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స‌మీప బంధువు. పెళ్లి జ‌రిగే నాటికి ల‌క్ష్మీప్ర‌ణ‌తి వ‌య‌సు స‌రిగ్గా 18 సంవ‌త్స‌రాలు కాగా, తార‌క్ వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు. వారి వివాహం బంధుజ‌న స‌మేతంగా వైభ‌వంగా జ‌రిగింది. ఆ వేడుక‌కు 10 వేల మందికి మించి అతిథులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక నిమిత్తం తార‌క్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ రూ. 18 కోట్ల‌ను వ్య‌యం చేశార‌ని స‌మాచారం. అన్ని తెలుగు న్యూస్‌ చాన‌ళ్ల‌లో ఈ వివాహాన్నిప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. పెళ్ల‌యిక కొన్ని నెల‌ల దాకా త‌న‌తో స‌ర్దుకుపోవ‌డానికి ల‌క్ష్మీప్ర‌ణ‌తి చాలా క‌ష్ట‌ప‌డిందని ఓ ఇంట‌ర్వ్యూలో జూనియ‌ర్ ఎన్టీఆర్ వెల్ల‌డించాడు. పెళ్ల‌య్యాక త‌న జీవితంలో ఆమె ప్రభావం చాలా ఉంద‌ని ఆయ‌న తెలిపాడు. 2014లో ఆ దంప‌తుల‌కు పెద్ద‌కొడుకు అభ‌య్ రామ్ జ‌న్మించాడు. మ‌రో నాలుగేళ్ల‌కు 2018లో చిన్న‌బ్బాయి భార్గ‌వ్ రామ్ పుట్టాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో తారక్‌-ల‌క్ష్మీప్ర‌ణ‌తి వైవాహిక జీవితం ఆనంద‌క‌రంగా సాగిపోతోంది. నేడు 10వ వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ల‌క్ష్మీప్ర‌ణ‌తి దంప‌తుల‌కు హార్దిక శుభాభినంద‌న‌లు.

క‌మ‌ల్ హాస‌న్‌ను వాళ్లు గుర్తుప‌ట్ట‌లేదు!

  సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక్కొక్క మెట్టే అధిగ‌మిస్తూ, హీరో స్థాయికి చేరుకున్న త‌ర్వాత మొద‌టిసారిగా త‌మ‌వూరు త‌మిళ‌నాడులోని ప‌ర‌మ‌కుడి వెళ్లారు క‌మ‌ల్ హాస‌న్‌. అంటే 1976లో అన్న‌మాట‌. వాళ్ల సొంతూరు ప‌ర‌మ‌కుడి అయినా, క‌మ‌ల్ పుట్టింది రామ‌నాథ‌పురంలోని రామ్‌బాగ్ ప్యాలెస్‌లో. ఆయ‌న న‌టుడిగా స్థిర‌ప‌డిన త‌ర్వాత మ‌ద్రాసులో రామ్‌బాగ్ అనే ఇల్లు కొన్నారనుకోండి.. అది వేరే విష‌యం. సొంతూరు ప‌ర‌మ‌కుడిలో రైలు దిగాల‌ని క‌మ‌ల్ ప్ర‌య‌త్నిస్తుంటే.. అభిమానులు దిగ‌నిస్తే క‌దా.. సొతూరిలో త‌న‌కు జ‌ర‌గ‌నున్న స‌త్కార స‌భ‌కు క‌మ‌ల్ వ‌స్తున్న‌ట్లు ముందుగానే అభిమానుల‌కు తెలిసిపోవ‌డం వ‌ల్ల‌, రైల్వే స్టేష‌న్‌కు వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చేశారు. వాళ్ల‌ల్లో విద్యార్థులే ఎక్కువ‌మంది. క‌మ‌ల్ వాళ్ల నాన్న‌గారు కూడా స్టేష‌న్‌కు వ‌చ్చారు, కొడుకును రిసీవ్ చేసుకోవ‌డానికి. కానీ ఆయ‌న కొడుకు ద‌గ్గ‌ర‌కు చేరుకోలేక‌పోయారు. అయితే అంత‌మంది జ‌నం.. ఆ కోలాహ‌లం చూశాక ఆయ‌న క‌ళ్లు చెమ‌ర్చాయి. "నువ్వు పుట్టి పెరిగిన ఊళ్లో నీకింత ఘ‌న స్వాగ‌తం, అభిమానుల ఆద‌రాభిమానాలు ల‌భించ‌డం నాకు చాలా ఆనందంగా ఉందిరా." అని ఆ త‌ర్వాత ఆయ‌న అన్నారు. క‌మ‌ల్‌కు స‌న్మానం జ‌రిగింది. రామ‌నాథ‌పురం రాజుగారే "క‌ళాతిల‌కం" అనే బిరుదు ప్ర‌దానం చేశారు. ఆ త‌ర్వాత రోజు ప‌ర‌మ‌కుడిలో త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిరిగారు క‌మ‌ల్‌. బాల్య‌మిత్రుల‌ను క‌ల‌సుకున్నారు. పాత రోజుల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ల‌తో సైకిల్ మీద తిరిగారు. వాళ్ల మేస్టారు ఇంటికి వెళ్లి త‌లుపుత‌ట్టి వాళ్లంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. తాను చిన్న‌ప్పుడు త‌ర‌చుగా ఈత‌కొట్టే చెరువుకు వెళ్లి అక్క‌డ కాసేపు గ‌డిపారు. తాను పుట్టిన ఇల్లు చూడ్డానికి రామ‌నాథ‌పురం కూడా వెళ్లారు.  "దారిలో నాకో గ‌మ్మ‌త్తు చేయాల‌నిపించింది. అంద‌రూ నా గురించి తెలుసుకున్న కార‌ణంగా ఈ హ‌డావిడి చేశారు. కానీ నిజంగా నేను అంత పాపుల‌ర్ అయ్యానా? అని తెలుసుకోవాలనిపించింది. ఓ ప‌ల్లెటూరు మీదుగా కారు వెళ్తోంది. అక్క‌డ ఓ మిల్లు ముందు కొంత‌మంది ప‌నివాళ్లు లంచ్ టైమ్ కాబోలు కూర్చొని క‌బుర్లు చెప్పుకుంటున్నారు. ఆ గుంపుల్లో కొంద‌రు స్త్రీలు కూడా ఉన్నారు. నేను అల్లంత దూరంలో కారు ఆప‌మ‌ని చెప్పి, దిగి వాళ్ల ద‌గ్గ‌ర‌కు ఒంట‌రిగా వెళ్లాను. "నేనెవ‌ర్నో మీకు తెలుసా?" అన‌డిగాను. వాళ్లెవ‌రూ న‌న్ను గుర్తు ప‌ట్ట‌లేదు. క‌నీసం ఆశ్చ‌ర్యంగా కూడా చూడ‌లేదు. "నేను మీ ప్రాంతంవాణ్నే. నా పేరు క‌మ‌ల్ హాస‌న్" అని చెప్పి నా ప్ర‌యాణం కొన‌సాగించాను." అంటూ త‌న పాపులారిటీ క‌థ చెప్పుకొచ్చారు క‌మ‌ల్ హాస‌న్‌.

యంగ్ హీరోల‌కు కృష్ణ లాగా ఎద‌గ‌మ‌ని దాస‌రి ఎందుకు చెప్పేవారంటే...

  దివంగ‌త ద‌ర్శ‌కర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతి నేడు. 150 సినిమాల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో ఆయ‌న‌ చ‌రిత్ర సృష్టించారు. వాటిలో ఎన్ని మైలురాళ్లలాంటి సినిమాలున్నాయో! ఎంతోమంది యంగ్ హీరోల‌ను ఆయ‌న ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. విశేష‌మేమంటే ఆ యంగ్ హీరోల‌ను ఆయ‌న ఎన్టీఆర్ లానో, ఏఎన్నార్ లానో, చిరంజీవి లానో ఎద‌గ‌మ‌ని చెప్పేవారు కాదు, కృష్ణ లాగా ఎద‌గ‌మ‌ని చెప్పేవారు. దీనికి రీజ‌న్ ఏంట‌నే ప్ర‌శ్న ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న‌కు ఎదుర‌య్యింది.  "కృష్ణ‌గారు, నేను ఒకేసారి ఇండ‌స్ట్రీకి 1964లో వ‌చ్చాం. ఆయ‌న 'తేనె మ‌న‌సులు' సినిమాకి వ‌ర్క్ చేస్తే, నేను రైట‌ర్ పాల‌గుమ్మి ప‌ద్మ‌రాజుగారి ద‌గ్గ‌ర 'రంగుల రాట్నం' సినిమాకు ప‌నిచేశాను. కృష్ణ‌గారు త‌న మూడో సినిమా 'గూఢ‌చారి 116' త‌ర్వాత చాలా పాపుల‌ర్ అయ్యారు. ప్రొడ్యూస‌ర్స్ ఆయ‌న వెంట‌ప‌డ్డారు. ఎవ‌రినీ ఆయ‌న డిజ‌ప్పాయింట్ చేయ‌లేదు. వ‌చ్చిన ప్ర‌తి ప్రొడ్యూస‌ర్‌కూ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. రోజూ మూడు షిఫ్టుల చొప్పున ప‌నిచేసేవారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట దాకా ఒక‌టి, మ‌ధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 దాకా ఒక‌టి, రాత్రి 10 గంట‌ల నుంచి 2 గంట‌ల దాకా ఒక‌టి! అలా ఆయ‌న ప‌ని గంట‌లు పెంచుకున్నారు. దాని వ‌ల్ల ఎంత ఔట్‌పుట్ వ‌చ్చిందో తెలిసిందేగా. నెల‌కో సినిమా పూర్తిచేసేవారు. అందుకే ఆయ‌న‌లా క‌ష్ట‌ప‌డి ఎద‌గ‌మ‌నీ, ఇండ‌స్ట్రీకి మేలు చేయ‌మ‌నీ కొత్త హీరోల‌కు చెప్తుంటాను." అని దాస‌రి నారాయ‌ణ‌రావు చెప్పుకొచ్చారు. సంద‌ర్భ‌వ‌శాత్తూ డైరెక్ట‌ర్‌గా త‌న తొలి సినిమా 'తాత మ‌న‌వ‌డు' హిట్ట‌య్యాక దాస‌రి వెంట కూడా ప్రొడ్యూస‌ర్లు ప‌డ్డారు. ఆయ‌న కూడా వారినెవ‌రినీ డిజ‌ప్పాయింట్ చేయ‌కుండా అంద‌రికీ సినిమాలు చేసిపెట్టారు. తాను కూడా మూడు షిఫ్టులు ప‌నిచేశారు. అందువ‌ల్లే తొలి 50 సినిమాలు పూర్తి చేయ‌డానికి ఆయ‌న‌కు ప‌ట్టిన కాలం తొమ్మిదేళ్లే. ఇవాళ్టి ద‌ర్శ‌కులు అంత స‌మ‌యంలో తొమ్మిది సినిమాలు కూడా చేయ‌ట్లేద‌నే విష‌యం తెలిసిందే. ప‌ని విష‌యంలో హీరోల్లో సూప‌ర్‌స్టార్‌ కృష్ణ‌, ద‌ర్శ‌కుల్లో దాస‌రి నారాయ‌ణ‌రావు రోల్‌మోడ‌ల్స్‌గా టాలీవుడ్‌లో నిలిచిపోయారు.

11 ఏళ్ల విరామానంత‌రం క‌లుస్తున్న‌ సూప‌ర్‌స్టార్‌-సూప‌ర్ డైరెక్ట‌ర్!

  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మాట‌ల మాంత్రికుడు సూప‌ర్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'అత‌డు' 16 ఏళ్లుగా, 'ఖ‌లేజా' 11 ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసి ప‌నిచేస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక‌ను తీరుస్తూ ఆ ఇద్ద‌రూ ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఈ సూప‌ర్ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రానున్న‌ద‌నే వార్త అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.  అఫిషియ‌ల్‌గా ఆ క్రేజీ కాంబినేష‌న్ ఫిల్మ్‌ను ప్ర‌క‌టించారు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌. ఆ బ్యాన‌ర్‌లో మ‌హేశ్ ప‌నిచేయ‌నున్న తొలి చిత్రం ఇదే. మే 31 సీనియ‌ర్ సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ  #SSMB28 సినిమా ప్రారంభం కానున్న‌ది. 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ప్ర‌స్తుతం చేస్తున్న 'స‌ర్కారు వారి పాట' త‌ర్వాత మ‌హేశ్‌, 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ప‌నిచేసే సినిమా ఇదే.

ఫాల్కే జ‌యంతి.. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఫిల్మ్ విశేషాలివే!

  భార‌త‌దేశ‌పు వెండితెర క‌ల‌ను సాకారం చేసి, బార‌త చ‌ల‌న‌చిత్ర పితామ‌హునిగా పేరుగాంచిన‌ దాదాసాహెబ్ ఫాల్కే జ‌యంతి నేడు. ఆయ‌న రూపొందించిన తొలి చిత్రం 'రాజా హ‌రిశ్చంద్ర' (1913) భార‌త‌దేశ‌పు తొలి చిత్రంగానే కాకుండా, తొలి ఫుల్‌-లెంగ్త్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా కీర్తికెక్కింది. కేవ‌లం 19 సంవ‌త్స‌రాల కెరీర్‌లో ఫాల్కే 95 సినిమాల‌ను, 27 షార్ట్ ఫిలిమ్స్‌ను తీశారు. వాటిలో మోహినీ భ‌స్మాసుర‌, సత్య‌వాన్ సావిత్రి (స‌తీ సావిత్రి), లంకా ద‌హ‌న్‌, శ్రీ‌కృష్ణ జ‌న్మ్‌, కాళీయ మ‌ర్ద‌న్ సినిమాలు ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చాయి. 'రాజా హ‌రిశ్చంద్ర' సినిమాను ముంబైలో తొలిసారి 1913 మే 3న‌ ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు ప్రేక్ష‌కులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యారు. ఒక‌సారి చూసిన‌వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చి చూశారు. ఆ త‌ర్వాత జ‌రిగింది చ‌రిత్ర‌. మ‌రాఠీ, హిందీ, ఇంగ్లీష్ టైటిల్స్‌తో సైలెంట్ ఫిల్మ్‌గా దీన్ని ఫాల్కే రూపొందించారు. విశ్వామిత్ర మ‌హ‌ర్షికి ఇచ్చిన వాగ్దానం మేర‌కు త‌న రాజ్యాన్నీ, కుటుంబాన్నీ త్యాగం చేసిన హ‌రిశ్చంద్రుడ‌నే రాజు క‌థ ఈ చిత్రం. తెలుగువారికి స‌త్య‌హ‌రిశ్చంద్ర‌గా సుప‌రిచిత‌మైన నాట‌క గాథే ఈ చిత్రం. ఈ సినిమాకు ఫాల్కే నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మాత్రమే కాదు.. స్క్రీన్‌ప్లే రైట‌ర్‌, సెట్ డిజైన‌ర్ కూడా. కెమెరా ముందు ఆడ‌వాళ్లు న‌టించ‌డం త‌ప్ప‌నే అభిప్రాయం నెల‌కొని ఉన్న సామాజిక ప‌రిస్థితుల కార‌ణంగా ఈ మూవీలో స్త్రీ పాత్ర‌ల‌ను కూడా మ‌గ‌వాళ్లే పోషించారు. 50 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని తీయ‌డానికి 7 నెల‌ల 21 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. హ‌రిశ్చందున్ని భార్య తారామ‌తి (మ‌న‌కు చంద్ర‌మ‌తి)గా అన్నా స‌లూంకే అనే వ్య‌క్తి న‌టించాడు. ఆయ‌న ఓ హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌నిచేస్తుండేవాడు. త‌ర‌చుగా ఆ హోట‌ల్‌కు వెళ్తుండే ఫాల్కేకు సున్నితంగా క‌నిపించిన అన్నాను చూసి చంద్ర‌మ‌తి పాత్ర‌కు ఆయ‌న‌ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. నాలుగు రీళ్ల‌తో తీసిన ఈ సినిమాకు సంబంధించి పూణేలోని నేష‌న‌ల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో రెండు రీళ్లే భ‌ద్ర‌ప‌ర‌చ‌బ‌డి ఉన్నాయి.

రేప్ చేస్తామ‌నీ, చంపుతామ‌నీ బెదిరిస్తున్నారు.. సిద్ధార్థ్ కంప్ల‌యింట్‌!

  బ‌హుభాషా న‌టుడు, హీరో సిద్ధార్థ్‌ను రేప్ చేస్తామంటూ, చంపుతామంటూ కొంత‌మంది బెదిరిస్తున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా సిద్ధార్థ్ ఆరోపించారు. త‌న ఫోన్ నంబ‌ర్ లీక‌య్యిందనీ, బీజేపీ త‌మిళ‌నాడు ఐటీ సెల్ దీన్ని లీక్ చేసింద‌నీ ఆయన ఆరోపించారు. దీని వ‌ల్ల త‌న‌కు, త‌న ఫ్యామిలీకి రేప్‌, చావు బెదిరింపులు వ‌స్తున్నాయ‌నీ ఆయ‌న తెలిపారు. త‌న‌కు వ‌చ్చిన అన్ని బెదిరింపు కాల్స్‌ను రికార్డ్ చేసి, పోలీసుల‌కు అంద‌జేశాన‌ని త‌న పోస్ట్‌లో సిద్ధార్థ్ వెల్ల‌డించారు. "త‌మిళ‌నాడు బీజేపీ, బీజేపీ త‌మిళ‌నాడు ఐటీ సెల్ స‌భ్యులు నా ఫోన్ నంబ‌ర్‌ను లీక్ చేశారు. గ‌త 24 గంట‌ల్లో వేధిస్తూ, రేప్‌, చావు బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ నాకూ, నా ఫ్యామిలీకీ 500కు పైగా కాల్స్ వ‌చ్చాయి. అన్ని నంబ‌ర్ల‌నూ (with BJP links and DPs) రికార్డ్ చేసి, వాట‌న్నింటినీ పోలీసుల‌కు అంద‌జేశాను. నేను నోర్మూసుకొని ఉండ‌లేను. Keep trying @narendramodi @AmitShah (sic)." అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  సోష‌ల్ మీడియాలో త‌న‌ను బ‌హిరంగంగా బెదిరించిన ట్రోల్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను కూడా సిద్ధార్థ్ షేర్ చేశారు. "బీజేపీ త‌మిళ‌నాడు సభ్యులు నిన్న నా నంబ‌ర్‌ను లీక్ చేసి, న‌న్ను ఎటాక్ చేయ‌మ‌నీ, హెరాస్ చేయ‌మ‌నీ ప్ర‌జ‌ల‌కు చెబుతూ చేసిన అనేక సోష‌ల్ మీడియా పోస్టుల్లో ఇదొక‌టి.. "ఇత‌ను ఎప్ప‌టికీ నోరు తెర‌వ‌కూడ‌దు.".. కొవిడ్ నుంచి మ‌నం బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ మ‌నుషులతో మ‌నం బ‌తగ్గ‌ల‌మా?" అని ఆయ‌న రాసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌న అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు సిద్ధార్థ్‌. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న కొవిడ్‌ను అడ్డుకొనే విష‌యంలో అధికార పార్టీ అనుస‌రిస్తోన్న ధోర‌ణిని ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో #IStandWithSiddharth అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

'ఆచార్య'ను భ‌య‌పెడుతున్న క‌రోనా!.. ఇప్ప‌ట్లో విడుద‌ల లేన‌ట్లే!!

  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ లెక్క ప్ర‌కారం రంజాన్ సంద‌ర్భంగా మే 13న విడుద‌ల కావాలి. కానీ ఆ రోజున సినిమా విడుద‌ల కావట్లేద‌నీ, క‌రోనా సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నామ‌నీ నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అది నిజ‌మే కానీ, ఈ వాయిదాకు ఇంకో కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే.. షూటింగ్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డం! అవును. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే ఓ జంట‌గా న‌టిస్తున్నారు. త‌మ పోర్ష‌న్లు పూర్తి చేయ‌డానికి వారిద్ద‌రూ ఈ నెల ఫ‌స్ట్ వీక్‌లో షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కానీ సినిమాలో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తోన్న సోను సూద్ కొవిడ్‌-19 బారిన ప‌డ‌టంతో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. షూటింగ్ ఆపేసి, యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే సైతం త‌న‌కు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింద‌నీ, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాన‌నీ ప్ర‌క‌టించ‌డంతో ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఈ నేప‌థ్యంలో 'ఆచార్య' విడుద‌ల‌ను వాయిదా వేయ‌డం వినా మ‌రో దారి లేక‌పోయింది. జూన్‌లో సినిమాని విడుద‌ల చేస్తారేమోన‌ని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా వినిపిస్తున్న దాని ప్ర‌కారం ఇప్ప‌ట్లో విడుద‌ల తేదీని నిర్మాత‌లు ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టి, థియేట‌ర్లు తిరిగి పూర్తి స్థాయిలో తెరుచుకున్న త‌ర్వాత‌నే రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించాల‌ని నిర్మాత‌లు రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి డిసైడ్ చేసుకున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు నిజంగా నిరాశ‌ను క‌లిగించే న్యూసే. చాలా కాలం త‌ర్వాత మెగాస్టార్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్‌ల‌ను క‌లిసి తెర‌పై చూసే అవ‌కాశం వ‌స్తోంద‌ని సంబ‌రప‌డుతుంటే క‌రోనా మ‌రోసారి అడ్డుప‌డుతోంద‌ని వారు బాధ‌ప‌డుతున్నారు. ఒక పీరియ‌డ్ స్టోరీతో త‌యార‌వుతున్న 'ఆచార్య‌'లో చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

'పుష్ప' టీజ‌ర్‌.. ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్ వ్యూస్!

  అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' టీజ‌ర్ యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 50 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసిన టీజ‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. టాలీవుడ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్ మార్కును చేరుకున్న రెండో టీజ‌ర్ 'పుష్ప‌'. ఇదివ‌ర‌కు ఈ ఫీట్‌ను సాధించింది 'ఆర్ఆర్ఆర్' మూవీకి చెందిన 'రామ‌రాజు ఫ‌ర్ భీమ్' టీజ‌ర్‌. దానికి ఇప్ప‌టివ‌ర‌కూ 50.45 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆ రికార్డును కూడా 'పుష్ప' టీజ‌ర్ దాటేయ‌డం ఖాయం. దాంతో పాటు 'పుష్ప' టీజ‌ర్‌కు 1.2 మిలియ‌న్ లైక్స్‌తో పాటు ల‌క్ష‌కు పైగా కామెంట్స్ వ‌చ్చాయి.  అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 7న 'పుష్ప' టీజ‌ర్‌ను నిర్మాత‌లు రిలీజ్ చేశారు. అప్ప‌ట్నుంచీ ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అటు ఆడియెన్స్ నుంచీ, ఇటు క్రిటిక్స్ నుంచీ దానికి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. ఇప్పుడు అతి త‌క్కువ టైమ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్‌ను అది క్రాస్ చేసేసింది. ట్విట్ట‌ర్‌లో ఫ్యాన్స్‌ #IntroducingPushpaRaj #Fastest50MForPushpaRajIntro అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' 2021లో ప్రేక్ష‌కులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒక‌టి. యూనిట్స్ మెంబ‌ర్స్ కొంత‌మంది కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మూవీలో రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేసే ప‌లు యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. టీజ‌ర్‌లో కొన్నింటిని శాంపిల్‌గా చూపించారు.  మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో బ‌న్నీ జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, సునీల్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, వెన్నెల కిశోర్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ లాంటి పేరుపొందిన న‌టులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, మిరొస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పుష్ప' విడుద‌ల కానున్న‌ది.

ఆస్కార్ విన్న‌ర్స్ ఫుల్ లిస్ట్‌.. బెస్ట్ పిక్చ‌ర్ 'నోమాడ్‌ల్యాండ్‌'

  లేడీ డైరెక్ట‌ర్ క్లో జావో రూపొందించిన 'నోమాడ్‌ల్యాండ్' బెస్ట్ పిక్చ‌ర్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకోగా, 'ద ఫాద‌ర్‌'లో టైటిల్ రోల్ పోషించిన ఆంథోనీ హాప్‌కిన్స్ బెస్ట్ యాక్ట‌ర్‌గా, 'నోమాడ్‌ల్యాండ్‌'లో ప్ర‌ధాన పాత్ర‌ధారి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకున్నారు. అమెరికా కాల‌మానం ప్ర‌కారం ఆదివారం రాత్రి (భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం) జ‌రిగిన ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ప‌లు విధాలుగా చారిత్ర‌క ఈవెంట్‌గా నిలిచింది. 441 రోజులుగా ప్ర‌పంచ సినీ ప్రేమికుల ఎదురుచూపుల‌కు ముగింపు ప‌లుకుతూ 93వ అకాడ‌మీ అవార్డుల ప్ర‌దానం సింపుల్‌గా, సంద‌డిగా జ‌రిగింది. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డుతో ఆస్కార్ చ‌రిత్ర‌లోనే అత్యంత పెద్ద వ‌య‌సులో ఆ అవార్డును పొందిన న‌టునిగా ఆంథోనీ హాప్‌కిన్స్ నిలిచారు. ఆయ‌నకు అవార్డు రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 'జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా'లో న‌టించిన డేనియ‌ల్ క‌లూయా బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా నిల‌వ‌గా, 'మిన‌రి'లో న‌టించిన యు-జుంగ్ యూన్ బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్న తొలి కొరియ‌న్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంది.  'నోమాడ్‌ల్యాండ్‌'ను రూపొందించిన క్లో జావో బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డుతో చ‌రిత్ర సృష్టించారు. ఆస్కార్ చ‌రిత్ర‌లో బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డు పొందిన రెండో మ‌హిళ‌గా, తొలి క‌ల‌ర్ వుమ‌న్‌గా ఆమె నిలిచారు. 'మా రైనీస్ బ్లాక్ బాట‌మ్' సినిమాకు ప‌నిచేసిన మియా నీల్‌, జ‌మికా విల్స‌న్ మేక‌ప్ అండ్ హెయిర్ స్టైల్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న తొలి బ్లాక్ వుమెన్‌గా చ‌రిత్ర సృష్టించారు. 36 నామినేష‌న్లతో బ‌రిలో నిలిచిన ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఏడు అవార్డులు అందుకొని, అన్ని స్టూడియోల‌కెల్లా టాప్ పొజిష‌న్‌లో నిలుచుంది. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిని దృష్టిలో ఉంచుకొని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్ నుంచి టెలివిజ‌న్ లైవ్ ద్వారా ఏబీసీ ఈ అతిపెద్ద సినిమా వేడుక‌ను ప్ర‌సారం చేసింది. ఈ ఈవెంట్‌కు హాజ‌రైన నామినీస్ అంతా క‌నీసం రెండు కొవిడ్‌-19 పీసీఆర్ టెస్టులు చేయించుకొని వ‌చ్చిన‌వారే. 2021 ఆస్కార్ విజేత‌ల పూర్తి లిస్ట్ ఇదే... బెస్ట్ పిక్చ‌ర్‌:  నోమాడ్‌ల్యాండ్  బెస్ట్ యాక్ట‌ర్‌:  ఆంథోనీ హాప్‌కిన్స్ (ద ఫాద‌ర్‌) బెస్ట్ యాక్ట్రెస్‌:  ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ (నోమాడ్‌ల్యాండ్‌) బెస్ట్ డైరెక్ట‌ర్‌:  క్లో జావో (నోమాడ్‌ల్యాండ్‌) బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌:  డేనియ‌ల్ క‌లూయా (జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా) బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌:  యు జంగ్ యూన్ (మిన‌రి) బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌:  ఫైట్ ఫ‌ర్ యూ (జుడాస్ అండ్ బ్లాక్ మెస్స‌య్యా) బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌:  సోల్ (ట్రెండ్ రెజ్నెర్‌, ఆటిక‌ల్ రాస్‌, జాన్ బ‌టిస్టే) బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే:  ద ఫాద‌ర్ (క్రిస్ట‌ఫ‌ర్ హాంప్ట‌న్‌, ఫ్లోరియ‌న్ జెల్ల‌ర్‌) బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే:  ప్రామిసింగ్ యంగ్ వుమ‌న్ (ఎమ‌రాల్డ్ ఫెన్నెల్‌) బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌:  సౌండ్ ఆఫ్ మెట‌ల్‌ బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ:  మాంక్ (ఎరిక్ మెస్స‌ర్‌షిమిట్‌) బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  మాంక్ (డోనాల్డ్ గ్రాహ‌మ్ బ‌ర్ట్‌, జాన్ పాస్క‌లే) బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌:  టెనెట్ (ఆండ్రూ జాక్స‌న్‌, డేవిడ్ లీ, ఆండ్రూ లాక్‌లీ, స్కాట్ ఫిష‌ర్‌) బెస్ట్ సౌండ్‌:  సౌండ్ ఆఫ్ మెట‌ల్ (నికొల‌స్ బెక‌ర్‌, జైమే బ‌క్ష‌త్‌, మిషెల్లే కౌట్టోలెంక్‌, కార్లోస్ కోర్టెస్‌, ఫిలిప్ బ్లాఢ్‌) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌:  మా రైనీస్ బ్లాక్ బాట‌మ్ (ఆన్ రోత్‌) బెస్ట్ మేక‌ప్ అండ్ హెయిర్‌స్టైలింగ్‌:  మా రైనీస్ బ్లాక్ బాట‌మ్ (సెర్గియో లోపెజ్‌-రివేరా, మియా నీల్‌, జ‌మికా విల్స‌న్‌) బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్‌:  మై ఆక్టోప‌స్ టీచ‌ర్‌ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ స‌బ్జెక్ట్‌:  కొలెట్‌ బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్‌:  సోల్‌ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌:  ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ ల‌వ్ యూ బెస్ట్ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్‌:  టు డిస్టాంట్ స్ట్రేంజ‌ర్స్‌ బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిచ‌ర్ ఫిల్మ్:  అన‌ద‌ర్ రౌండ్ (డెన్మార్క్‌)

ఇంకా బ్రేకీవెన్ కాని 'వ‌కీల్ సాబ్‌'.. 14 రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే...

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వ‌కీల్ సాబ్' సినిమా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 ల‌క్ష‌ల‌ షేర్ రాబ‌ట్టింది. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేయ‌గా దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అంచ‌నాల‌కు దూరంగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతుండ‌టానికి కార‌ణం, ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా నెల‌కొన్న ప‌రిస్థితే. కొవిడ్‌-19 కేసులు ఊహాతీతంగా పెరుగుతూ భ‌యాందోళ‌న‌లు రేకెత్తుతుండ‌టంతో థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌నే ధ్యాస ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్లుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వ‌కీల్ సాబ్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 80.35 కోట్లు. 14 రోజుల‌కు వ‌చ్చింది రూ. 78.26 కోట్లు. అంటే దాదాపు 97.4 శాతం రిక‌వ‌ర్ అయిన‌ట్లే. మామూలు ప‌రిస్థితులు ఉన్న‌ట్ల‌యితే ఈస‌రికి బ్రేకీవెన్ అయివుండేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. 14 రోజుల‌కు 'వ‌కీల్ సాబ్' ఆంధ్ర‌లో రూ. 40.49 కోట్లు, తెలంగాణ‌లో రూ. 24.92 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 12.85 కోట్లు వ‌సూలు చేసింది. తెలంగాణలో ప్రి బిజినెస్ విలువ రూ. 25.2 కోట్లకు గాను ఇప్ప‌టికే రూ. 24.92 కోట్లు రిక‌వ‌ర్ అయ్యింది. అంటే 98.8 శాతం రిక‌వ‌ర్ అయ్యింది. శుక్ర‌వారం ఇక్క‌డ రూ. 5 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింది. ఈ వారంతో తెలంగాణ‌లో ఈ సినిమా బ్రేకీవెన్ కావ‌చ్చ‌ని ఆశిస్తున్నారు.  ఆంధ్ర‌లో ప్రి బిజినెస్ వాల్యూ రూ. 41.75 కోట్లకు గాను 14 రోజుల‌కు వ‌చ్చింది రూ. 40.49 కోట్లు. రిక‌వ‌రీ శాతం సుమారు 96.9. ఈ ఏరియాలో కొంత‌మంది ఎంతో కొంత న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. రాయ‌ల‌సీమ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 13.4 కోట్ల‌కు గాను తొమ్మిది రోజుల‌కు వ‌చ్చింది రూ. 12.85 కోట్లు. రిక‌వ‌రీ అయ్యింది సుమారు 95.9 శాతం. ఈ ఏరియాలోనూ కొద్దిమంది బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోనున్నారు. మొత్తానికి భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన 'వ‌కీల్ సాబ్‌' మూడో వారంలో కొవిడ్‌-19 దెబ్బ‌కు నిరాశాజ‌న‌క ఫ‌లితాల‌ను అందిస్తున్నాడు. మొద‌ట బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డం ఖాయ‌మ‌నుకున్న స్టేజ్ నుంచి బ్రేకీవెన్ అయితే చాల‌నుకొనే స్టేజ్‌కు వ‌చ్చాడు.

గుత్తా జ్వాల‌, విష్ణు విశాల్ పెళ్ల‌యింది!

  హైద‌రాబాద్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాల‌, త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ జీవిత భాగ‌స్వాములుగా మారారు. చెన్నైలో క‌న్నుల పండువ‌గా అతికొద్ది మంది స‌న్నిహితుల మ‌ధ్య గురువారం జ‌రిగిన వేడుక‌లో ఆ ఇద్ద‌రూ వివాహం చేసుకున్నారు. జ్వాల సంప్ర‌దాయ ప‌ట్టుచీర ధ‌రించ‌గా, విష్ణు విశాల్ ధోతి, ష‌ర్టు వేసుకున్నాడు. జ్వాల ఒంటి నిండా ఆభర‌ణాల‌తో మెరిసిపోయింది. జ్వాల తండ్రి తెలుగు వ్య‌క్తి కాగా, త‌ల్లి చైనీస్‌. రెడ్ బోర్డ‌ర్ ఉన్న లైట్ బ్లూ సిల్క్ శారీ, మెడ‌లో హెవీ నెక్లెస్‌, త‌ల‌కు ప‌ట్టి, ముక్కుకు పెద్ద రింగు, చెవుల‌కు దుద్దులు పెట్టుకొని బ్యూటిఫుల్‌గా క‌నిపించింది.  ఆ ఇద్ద‌రూ దండ‌లు మార్చుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. పెళ్లి వేడుక‌లో వ‌ధూవ‌రులిద్ద‌రూ చాలా స‌ర‌దాగా, ఆనందంగా క‌నిపించారు. జ్వాల అయితే అల్ల‌రి కూడా చేసింద‌ని వీడియో తెలియ‌జేస్తోంది. ఆ ఇద్ద‌రూ త‌మ పెళ్లిని రిజిస్ట‌ర్ చేసుకుంటున్న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ ఇద్ద‌రి చుట్టూ ఓ ఇర‌వై మంది దాకా అతిథులు ఉన్నారు. ఫంక్ష‌న్‌కు వ‌చ్చే ముందు వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకొని రిజ‌ల్ట్ నెగ‌టివ్ అని తేలాకే వెళ్లారు. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న జ్వాల‌, విష్ణు విశాల్ రెండేళ్ల క్రితం త‌మ అనుబంధం గురించి సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేశారు. ఇప్పుడు తాము ఈ నెల 22న మ్యారేజ్ చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో వెడ్డింగ్ కార్డ్ పిక్చ‌ర్‌ను పోస్ట్ చేసిన విష్ణు విశాల్‌, దానికి #JwalaVished అనే హ్యాష్‌ట్యాగ్ జోడించాడు. "జీవితం ఒక ప్రయాణం ... దాన్ని ఆలింగనం చేసుకోవాలి ... విశ్వాసం కలిగి అందులో దూకాలి ... ఎప్ప‌ట్లాగే మీ ప్రేమ, మద్దతు కావాలి." అని రాసుకొచ్చాడు.  ఈ వెడ్డింగ్ కార్డును జ్వాల కూడా షేర్ చేసింది. అందులో, "మా కుటుంబాల ఆశీర్వాదంతో, స‌న్నిహితుల‌-ప్రియ‌మైన వారి స‌మ‌క్షంలో ఓ ప్రైవేట్ వ్య‌వ‌హారంగా మా మ్యారేజ్ జ‌ర‌గ‌బోతున్న‌ద‌నే న్యూస్ పంచుకోవ‌డం మాకు చాలా ఆనందాన్నిస్తోంది. మేం పెళ్లి చేసుకుంటున్నాం. ఇన్నేళ్లుగా మాపై మీరు కురిపిస్తున్న ప్రేమాభిమానాల‌కు థాంక్స్‌. ప్రేమ‌, విధేయ‌త‌, స్నేహం, క‌ల‌యిక అనే జ‌ర్నీని ప్రారంభిస్తున్న మాకు మీ ఆశీర్వాదాలు కావాలి." అని ఉంది. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ ఇద్ద‌రికీ ఇది సెకండ్ మ్యారేజ్. జ్వాల ఇదివ‌ర‌కు స‌హ ఆట‌గాడు చేత‌న్ ఆనంద్‌ను పెళ్లి చేసుకొని, 2011లో విడిపోగా, విష్ణు విశాల్ సైతం ర‌జిని న‌ట‌రాజ్‌తో వైవాహిక బంధాన్ని 2018లో తెంచేసుకున్నాడు. విష్ణుకు ర‌జిని ద్వారా ఆర్య‌న్ అనే కుమారుడు ఉన్నాడు.

బ్యాచిల‌ర్ క‌ష్టాలు కంటిన్యూస్‌!

  2020 వేస‌వి నుంచి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి నానా తంటాలు ప‌డుతూనే ఉన్నాడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' అఖిల్‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొద‌ట ఈ మూవీని గ‌త ఏడాది వేస‌విలో శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న‌ రిలీజ్ చేయాల‌నుకున్నారు.  క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. దీంతో ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ లాక్‌డౌన్ అనంత‌రం కూడా షూటింగ్‌ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో విడుద‌ల‌ను 2021 జ‌న‌వ‌రికి వాయిదా వేశారు. సెప్టెంబ‌ర్ చివ‌ర‌లో షూటింగ్ పునఃప్రారంభించారు. జ‌న‌వ‌రికి సినిమాని తీసుకు రావ‌డం క‌ష్ట‌మ‌ని అర్థ‌మ‌వ‌డంతో ఏప్రిల్‌లో తెద్దామ‌నుకున్నారు. కానీ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తూ జూన్ 19న సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్లు ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క‌టించారు. అంటే 2020 ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌నుకున్న సినిమాని 14 నెల‌ల త‌ర్వాత రిలీజ్ చేయాల‌ని సంక‌ల్పించారు.  కానీ ఇప్పుడు జూన్ 19న కూడా సినిమా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సంగా ఉండ‌టంతో ఈ నెల‌లో, వ‌చ్చే నెల‌లో రిలీజ్ కావాల్సిన సినిమాల‌ను పోస్ట్‌పోన్ చేస్తున్న సంద‌ర్భం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే జూన్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా పోస్ట్‌పోన్ అవ్వ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. దీంతో మ‌రోసారి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' రిలీజ్ డేట్ మారుతుంద‌నేది ఖాయ‌మంటున్నారు.  ఇంత‌దాకా మూడు సినిమాలు రిలీజైన గెలుపు రుచి ఎలా ఉంటుందో చూడ‌ని, అఖిల్‌కు నాలుగో సినిమా అయినా ఆ రుచి అందిస్తుంద‌ని అనుకుంటూ ఉంటే.. ప‌లుసార్లు విడుద‌ల వాయిదా ప‌డుతూ నిరాశ ప‌రుస్తోంది. నిజానికి డిసెంబ‌ర్ నాటికి షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని పూర్తి చేసి, మార్చిలోగా ఎందుకు రిలీజ్ చేసి ఉండ‌కూడ‌ద‌ని నిర్మాత‌ల‌పై గుస్సా అవుతున్నారు ఫ్యాన్స్. నాలుగు నెల‌ల కాలంలో ఎన్నో సినిమాలు రిలీజై, వాటిలో కొన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా అయిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఏదేమైనా అఖిల్‌కు కాలం క‌లిసి రావ‌ట్లేద‌న్న మాటే!