'భాగ్ సాలే' అంటున్న శ్రీ‌సింహా కోడూరి

  'మ‌త్తు వ‌ద‌ల‌రా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై, తొలియ‌త్నంతోటే ఇటు విజ‌యాన్నీ, అటు త‌న ప‌ర్ఫార్మెన్స్‌కు ప్ర‌శంస‌లూ పొందిన శ్రీ‌సింహా కోడూరి త్వ‌ర‌లో తెల్ల‌వారితే గురువారం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. లేటెస్ట్‌గా మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీలో అత‌ను న‌టించ‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రి 23 అత‌ని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఆ సినిమా పేరు 'భాగ్ సాలే'. నిహారిక‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన 'సూర్య‌కాంతం' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి 'భాగ్ సాలే'ను రూపొందించ‌నున్నాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేశ్‌బాబు స‌మ‌ర్పించే ఈ మూవీని మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, య‌శ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.  కాల‌భైర‌వ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ మూవీకి సుంద‌ర్‌రామ్ కృష్ణ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు.‌ 

గోపీచంద్ 'సీటీమార్' టీజ‌ర్ రివ్యూ

  "క‌బ‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట" అంటూ త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో చెప్పేశాడు గోపీచంద్‌. ఆయ‌న హీరోగా సంప‌త్ నంది డైరెక్ట్ చేస్తున్న యాక్ష‌న్ డ్రామా 'సీటీమార్' టీజ‌ర్ వ‌చ్చేసింది. సోమ‌వారం ఉద‌యం ఒక నిమిషం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఆస‌క్తి పెరిగింద‌నేది నిజం.  సాధార‌ణంగా టీజ‌ర్‌లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లేదా సినిమా థీమ్‌ను మాత్ర‌మే చెప్తుంటారు. కానీ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది సినిమా ఎలా ఉంటుందో ఈ చిన్న టీజ‌ర్‌లోనూ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌నంద‌ర్నీ ప‌రిచ‌యం చేసేశాడు. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హీరోకూ, విల‌న్‌కూ మ‌ధ్య దేనికోస‌మో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతుంద‌ని ఈ టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. దానికీ, క‌బ‌డ్డీ ఆట‌కూ సంబంధం ఉంద‌ని ఊహించ‌వ‌చ్చు.  ఈ మూవీలో గోపీచంద్ పేరు కార్తీ. అయితే రావు ర‌మేశ్, "రేయ్ కార్తీ" అని పెద్ద‌గా కేక‌వేశాక‌, "న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే.. ఒక‌టి నా ఇంట్లోవాళ్లు పిల‌వాలి, లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి. ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే.. వాడి కూత ఆగిపోద్ది." అంటూ ఆయ‌న పంపిన రౌడీల‌ను చిత‌క్కొట్టాడు గోపీచంద్‌. ఇందులో అత‌ను క‌బ‌డ్డీ కోచ్‌గా న‌టిస్తున్నాడు. లేడీస్ టీమ్ క‌బ‌డ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ను త‌మ‌న్నా పోషిస్తుండ‌గా, బ్యూటిఫుల్ దిగంగ‌నా సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర‌మైన సెకండ్ హీరోయిన్ రోల్ ప్లే చేస్తోంది.  భూమికా చావ్లా, రెహ‌మాన్ (ర‌ఘు) కూడా ఈ టీజ‌ర్‌లో క‌నిపించారు. వారివి కీల‌క‌మైన పాత్ర‌లుగా తెలుస్తోంది. త‌రుణ్ అరోరా, రోహిత్ పాఠ‌క్ విల‌న్లుగా గోపీని ఢీకొడుతున్నారు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో టీజ‌ర్ రిచ్ లుక్‌తో క‌నిపిస్తోంది. ఏప్రిల్ 2న సీటీమార్‌ను రిలీజ్ చేయ‌డానికి శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ అధినేత‌ శ్రీ‌నివాస చిట్టూరి స‌న్నాహాలు చేస్తున్నారు.

అప్పుడు నేను ఎత్తుకొనేదాన్ని.. ఇప్పుడు న‌రేష్ న‌న్నెత్తుకున్నాడు!

  ఈ టీవీలో గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ షోకి జ‌డ్జ్‌లుగా న‌టి, ఎమ్మెల్యే రోజా, గాయ‌కుడు మ‌నో వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, యాంక‌ర్‌గా ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షోలో తాజాగా అవాక్క‌య్యే సీన్ సాక్షాత్క‌రించింది. సీనియ‌ర్ న‌టి రోజా.. యంగ్ హీరో అ్ల‌రి న‌రేష్‌తో క‌లిసి స్టేజ్‌పై చిందులేయ‌డం.. ఆ త‌రువాత ఆమెని న‌రేష్ అమాంతం పైకెత్తి గాల్లో తిప్పి ఆడుకోవ‌డం అందరినీ అవాక్క‌య్యేలా చేస్తోంది. గ‌త ఎనిమిదేళ్ల విరామం త‌రువాత అల్ల‌రి న‌రేష్ 'నాంది' చిత్రంతో సూప‌ర్ హిట్ మూవీని సొంతం చేసుకున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా హీరో అల్ల‌రి న‌రేష్ 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'లో పాల్గొన్నారు. చాలా రోజుల త‌రువాత రోజాని చూడ‌టంతో ఆనందం ప‌ట్ట‌లేక‌పోయిన న‌రేష్ ఆమెతో క‌లిసి రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేశాడు. అంత‌టితో ఆగ‌లేదండోయ్.. రోజాని అమాంతం పైకెత్తుకుని ల‌వ‌ర్ త‌న గార్ల్ ఫ్రెండ్‌ని ఎత్తుకుని ఆడించిన‌ట్టుగా ఓ ఆట ఆడేసుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రోజా చెప్పిన మాట‌లు ఆస‌క్తిక‌రంగా వున్నాయి. "సీతార‌త్నంగారి అబ్బాయి సినిమా చేస్తున్న‌ప్పుడు న‌రేష్ స్కూల్‌కి వెళుతున్నాడు. అప్పుడు న‌రేష్‌ని ఎత్తుకుని ఆడుకునేదాన్ని. ఇప్పుడు త‌ను న‌న్ను ఎత్తుకుని ఆడుకున్నాడు" అంది రోజా. ఎనిమిదేళ్ల త‌రువాత మ‌ళ్లీ రోజాగారితో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా వుంద‌ని అల్ల‌రి న‌రేష్ సిగ్గుల మొగ్గయ్యాడు. ఈ నెల 26న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

మోహ‌న్‌బాబు పాట‌.. ట్యూన్ క‌ష్ట‌మ‌న్న ఇళ‌య‌రాజా!

  దేశంలోని గొప్ప విల‌క్ష‌ణ న‌టుల్లో ఒక‌రిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందిన డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'స‌న్ ఆఫ్ ఇండియా'. ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేస్తుండ‌ట‌మే కాకుండా ఈ చిత్రానికి ఆయ‌న స్క్రీన్‌ప్లే సైతం స‌మ‌కూరుస్తున్నారు. టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 11వ శ‌తాబ్దంలో శ్రీ‌రామ‌చంద్రుని ఘ‌న‌త‌ను చాటి చెబుతూ వేదాంత దేశిక అనే మ‌హ‌నీయుడు 'ర‌ఘువీర గ‌ద్య‌ము' రాశారు. 'స‌న్ ఆఫ్ ఇండియా' బృందం గ‌ణ‌నీయ‌మైన కృషి చేసి ఆ గ‌ద్యాన్ని అద్భుతం అనిపించే శ్రావ్య‌మైన పాట‌గా ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఆ పాట‌కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగాయి. 'స‌న్ ఆఫ్ ఇండియా'కు సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న మ్యాస్ట్రో ఇళ‌యారాజాతో మోహ‌న్‌బాబు, ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న విల‌క్ష‌ణ గాత్రంతో "జ‌య‌జ‌య మ‌హావీర మ‌హాధీర ధోళీయ.." అంటూ సాగే ర‌ఘువీర గ‌ద్యాన్ని అల‌వోక‌గా త‌న గంభీర స్వ‌రంతో ఆల‌పించారు మోహ‌న్‌బాబు. అది విని ఆశ్చ‌ర్య‌పోతూ, "ఏంటీ ఇంత క‌ఠినంగా ఉందే.. ఏం చేసేది? ఎలా చేసేది?  ట్యూన్‌కి ఎలా వ‌స్తుంది?" అని న‌వ్వుతూనే అడిగారు ఇళ‌య‌రాజా. "దీనికి మీరే స‌మ‌ర్థులు" అన్నారు మోహ‌న్‌బాబు. "ఈ పాట‌ను మీరు పాడ‌తారా?" అని అడిగారు మేస్ట్రో. తాను పాడ‌లేన‌నీ, డైలాగ్ చెప్ప‌గ‌ల‌న‌నీ మోహ‌న్‌బాబు అన్నారు. మీ ప‌ద‌నిస‌ల‌కు త‌గ్గ‌ట్లుగా డైలాగ్ చెప్ప‌మంటే చెప్తాను కానీ, పాట త‌న వ‌ల్ల కాద‌ని చెప్పేశారు. "ఇది గ‌ద్యం లాగా ఉంది. దీనికి ట్యూన్ చెయ్య‌డం ఎలా కుదురుతుంది. చాలా క‌ష్ట‌మండీ" అన్నారు మేస్ట్రో. "మీకే కుదురుతుంది సార్. మీరు చేయంది లేదు." అని చెప్పి, 'ర‌ఘువీర గ‌ద్యం' రాత ప్ర‌తిని ఆయ‌న‌కు అంద‌జేశారు మోహ‌న్‌బాబు. సుదీర్ఘ‌మైన కెరీర్‌లో త‌నకే సాధ్య‌మ‌నిపించే అపూర్వ‌మైన సంగీత బాణీల‌తో లెక్క‌లేన‌న్ని అద్భుత‌మైన పాట‌ల‌కు జీవం పోసిన ఇళ‌య‌రాజా ఇప్పుడు మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' కోసం "ర‌ఘువీర గ‌ద్యం"ను పాట రూపంగా మ‌లచి అందిస్తున్నారు. ఈ పాట ఈ చిత్రానికే కాకుండా తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచే పాట అవుతుందన‌డంలో సందేహం లేదు. కాగా ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ ఫిల్మ్‌  ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. మెడ‌లో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో క‌నిపించిన మోహ‌న్‌బాబు రూపానికి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్‌బాబుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ  ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచ‌నాలను మరో లెవ‌ల్‌కి పెంచింది. విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడ‌లు విరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపిస్తున్నారు. డైరెక్ట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబుతో పాటు తోట‌ప‌ల్లి సాయినాథ్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ లిరిక్స్ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

'నాంది' మూవీ రివ్యూ

  సిన్మా పేరు: నాంది తారాగ‌ణం: అల్ల‌రి న‌రేశ్‌, వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, విన‌య్ వ‌ర్మ‌, న‌వ‌మి, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, కృష్ణేశ్వ‌ర‌రావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు క‌థ‌: తూమ్ వెంక‌ట్‌ మాట‌లు: అబ్బూరి ర‌వి సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి, కిట్టు విస్సాప్ర‌గ‌డ‌ మ్యూజిక్‌: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌ ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌ ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి ఫైట్స్‌: వెంక‌ట్‌ నిర్మాత‌: స‌తీశ్ వేగేశ్న‌ స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌ బ్యాన‌ర్‌: ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ విడుద‌ల తేది:  19 ఫిబ్ర‌వ‌రి, 2021 కామెడీ హీరోగా రాణించిన అల్ల‌రి న‌రేశ్ కొంత‌కాలంగా స‌రైన హిట్టు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి మ‌న‌కి ఎరికేగా! టీవీ చాన‌ళ్లలో కామెడీ షోలు జనాన్ని మ‌స్తుగా న‌వ్విస్తుండేస‌రికి కామెడీ సినిమాల‌కు రోజులు కాకుండా పోయినై. అందుక‌నే "సుడిగాడు" లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సిన్మా త‌ర్వాత న‌రేశ్‌కు చెప్పుకోడానికి మంచి కామెడీ సినిమానే లేదు. అందుక‌ని రూటు మార్చి ఒక మాంచి సీరియ‌స్ స‌బ్జెక్టుతోని జ‌నం ముందుకు వ‌చ్చిండు. ఆ సిన్మా పేరు "నాంది". విజ‌య్ క‌న‌క‌మేడ‌ల అనే కొత్త డైరెక్ట‌ర్ ఈ సిన్మాని తీసిండు. అల్ల‌రి న‌రేశ్‌తోని ఈ డైరెక్ట‌ర్ ఏం చేసిండో జ‌ర చూద్దాం.. ప‌దుండ్రి... క‌థ‌ పౌర‌హ‌క్కుల సంఘం నాయ‌కుడు, లాయ‌ర్ అయిన రాజ‌గోపాల్ అనే చానా మంచి మ‌నిషిని ఎవ‌రో చంపేస్త‌రు. ఆ మ‌ర్డ‌ర్ కేసుల మ‌న హీరో బండి సూర్య‌ప్ర‌కాశ్‌ను ఇరికిస్త‌డు ఏసీపీ కిశోర్‌. అట్లా అండ‌ర్ ట్ర‌యల్ ఖైదీగా ఐదేళ్లు జైల్లో మ‌గ్గిపోత‌డు సూర్య‌ప్ర‌కాశ్‌. ఇట్లాంటి టైమ్‌ల ఆద్య అనే ఒక జూనియ‌ర్ లాయ‌ర‌మ్మ ఊడిప‌డి, సూర్య‌ని మ‌ర్డ‌ర్ కేసు నుండి నిర్దోషిగా నిరూపిచ్చి, జైలు నుంచి బ‌య‌ట‌కు తెస్త‌ది. మ‌ర్డ‌ర్ కేసుల ఇరికించిన ఏసీపీ కిశోర్ మింద‌ ఐపీసీ 211 సెక్ష‌న్ కింద కోర్టులో ఆద్య సాయంతో కేసు వేస్త‌డు సూర్య‌. ఆ కేసులో ఆళ్లు గెలుస్త‌రా, మార్పుకు "నాంది" ప‌లుకుత‌రా, లేరా.. అనేది మిగ‌తా క‌త‌.  విశ్లేష‌ణ‌ ఏక్‌ద‌మ్మున కామెడీ సినిమాల నుంచి ఇంత సీరియ‌స్ సినిమాల, ఇంత సీరియ‌స్ క్యారెక్ట‌ర్‌ల అల్ల‌రి న‌రేశ్‌ని చూడనీకి కొంచెం ఇబ్బందైత‌ది కానీ, నిజానికి గిది మంచి స‌బ్జెక్టే. కొంత‌మంది పోలీసాఫీస‌ర్లు ఎట్లా అమాయ‌కుల్ని త‌ప్పుడు కేసుల ఇరికిస్త‌రో, ఆ అమాయ‌క‌లు అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలుగా జైళ్ల‌లో ఎట్లా మ‌గ్గిపోతుండ‌ట‌రో చూపించ‌నీకి ఈ సినిమాని తీసిండు. అది మంచిగ‌నే ఉంది కానీ, మొత్తం సిన్మాని సీరియ‌స్ టోన్‌లోనే న‌డప‌డంతోని ఆడియెన్స్ రిలీఫ్‌గా ఊపిరి తీయ‌నీకి చాన్స్ లేకుండా పోయింది.  ఒగ మంచి పాయింట్‌ని, జ‌నం ఆలోచించాల్సిన పాయింట్‌ని ఎట్లా చెప్పాల‌!. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండాల‌. కాసిన్ని స‌ర‌దా సీన్లు ఉండాల‌. సీన్ల‌న్నీ చ‌క‌చ‌కా ఉర‌కాల‌. గ‌‌ప్పుడే సీరియ‌స్ క‌త కూడా చూడ‌బుద్ద‌యిత‌ది. డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యిండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే మాదిరిగా, సీరియ‌స్‌గా సీన్లు రాసుకొని పోయిండు. ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి లాంటి యాక్ట‌ర్ల‌ని పెట్టి కూడా ఆళ్లకి రిలీఫ్ సీన్లు రాయ‌లేదు డైరెక్ట‌ర్‌.  పోనీ క‌త‌న‌మ‌న్నా స్పీడ్‌గా ఉందా?  లేదుమ‌ల్ల‌. గీమ‌ధ్య‌న మ‌నం కార్తీ యాక్ట్ జేసిన "ఖైదీ" సిన్మా చూసినం. అందులో కామెడీ ఏమీ లేదు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నెక్ట్స్ ఏం జ‌రుగుత‌ద‌నే టెంపోని డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌క‌రాజ్ మెయిన్‌టైన్ జేసిండు. ఆ టెంపో "నాంది" సిన్మాల మిస్స‌యింది. అందుక‌నే కొన్ని సంద‌ర్భాల బోర్‌కొడ‌త‌ది. క‌త‌లో అల్ల‌రి న‌రేశ్ ప‌డే పెయిన్ మ‌న పెయిన్ అవ్వాలంటే ఈ టెంపోనే మెయిన్ ఎలిమెంట్‌. టెంపో మెయిన్‌టైన్ అయితే ఎమోష‌న్ క్యారీ అవుత‌ది. ఆ ఎమోష‌న్ గీ సిన్మాల మిస్స‌యింది. టెక్నిక‌ల్‌గా జూస్తే.. సిద్ సినిమాటోగ్ర‌ఫీ, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. క‌త‌నంలో టెంపో మిస్స‌యిన విష‌యాన్ని ఎడిట‌ర్ చోటా కె. ప్ర‌సాద్ ప‌ట్టుకోలేక‌పోయిండు. తూమ్ వెంక‌ట్ క‌త మంచిగ‌నే రాసిండు కానీ, సీన్లు ఇంట్రెస్టింగ్‌గ రాసుకోడంలో డైరెక్ట‌ర్ విజ‌య్ మ‌రింత నేర్పు చూపిచ్చి ఉండాల‌. అబ్బూరి ర‌వి డైలాగ్స్ సీన్ల‌కు త‌గ్గ‌ట్లు ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ యావ‌రేజ్‌గ ఉన్నయి.  న‌టీన‌టుల అభిన‌యం యాక్ట‌ర్ల విష‌యానికొస్తే, బండి సూర్య‌ప్ర‌కాశ్ క్యారెక్ట‌ర్‌ల అల్ల‌రి న‌రేశ్ బాగా చేసిండనేది నిజం. కామెడీ చేసే న‌రేశ్‌ని ఇంత సీరియ‌స్ సినిమాల చూడ్డం కొత్త ఎక్స్‌పీరియెన్స్. క్యారెక్ట‌ర్‌లోని పెయిన్‌ని బాగా చూపిచ్చాడు న‌రేశ్‌. యాక్ట‌ర్‌గా అత‌డికి మంచి మార్కులైతే ప‌డ‌త‌య్‌ కానీ, ఆడియెన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంట‌ర‌నేదే డౌట్‌. మ‌ర్డ‌ర్ కేసు నుంచి అత‌డిని విడిపిచ్చి, అత‌డి కోసం ఫైట్ జేసే లాయ‌ర్ ఆద్య పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ మంచిగ యాక్ట్ జేసి, ఆ పాత్ర‌కి న్యాయం జేసింది.  సూర్య‌ని మ‌ర్డ‌ర్ కేసుల ఇరికించే బ‌క్వాస్‌గాళ్లు మాజీ హోమ్ మినిస్ట‌ర్ నాగేంద్ర‌, ఏసీపీ కిశోర్ క్యారెక్ట‌ర్ల‌కు విన‌య్ వ‌ర్మ‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లే దుర్మార్గంగా ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిన్రు. సూర్య‌ను ల‌వ్ చేసే అమ్మాయిగా న‌వ‌మి అనే కొత్త‌పోరి అందంగా ఉంది. సూర్య ఫాద‌ర్‌గా దేవీప్ర‌సాద్ ప‌ర్ఫార్మెన్స్ చ‌క్క‌గుంది. జోవియ‌ల్ క్యారెక్ట‌ర్లో అల‌రించే ప్ర‌వీణ్ ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్ల నటునిగా కొత్త యాంగిల్‌ని మ‌న‌కు ప‌రిచ‌యం చేసిండు. ప్రియ‌ద‌ర్శి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, కృష్ణేశ్వ‌ర‌రావు లాంటివాళ్లు పాత్ర‌ల ప‌రిధికి త‌గ్గ‌ట్లు న‌టించిన్రు. తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌ సినిమాలో మంచి ప‌ర్ఫార్మెన్స్‌లు ఉన్నయి. మంచి విష‌యం ఉంది. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చెప్పాల్నంటే క‌త‌నంలో టెంపో మిస్స‌యిన మంచి క‌త "నాంది" అని చెప్పాల‌. రేటింగ్‌: 2.5/5 - బుద్ధి య‌జ్హ‌మూర్తి

య‌శ్ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్‌ 'జాత‌స్య‌'

  'కేజీఎఫ్ '2 త‌ర్వాత య‌శ్ చేసే సినిమా ఏమిటో వెల్ల‌డైంది. దాని టైటిల్ 'జాత‌స్య'‌. ప్ర‌శాంత్ నీల్ శిష్యుడు, 'మఫ్టీ' (2017)తో డైరెక్ట‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ అయిన న‌ర్త‌న్ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని అత‌ను స్వ‌యంగా వెల్ల‌డించాడు. "Happy to announce my next project #Jatasya @TheNameIsYash #Yash @hombalefilms" అని అత‌ను ట్వీట్ చేశాడు. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించ‌నున్న‌ది. 'జాత‌స్య' అనే సంస్కృత ప‌దాన్ని మ‌నం భ‌గ‌వ‌ద్గీత‌లో విన్నాం. "జాతస్య హి ధ్రువో మృత్యుః" అనే శ్లోకాన్ని ఘంట‌సాల గాత్రంలో ఇప్ప‌టికీ వింటూనే ఉన్నాం. దాని అర్థం "పుట్టిన‌వాడికి మ‌ర‌ణం త‌ప్ప‌దు" అని. 'జాత‌స్య' అంటే 'పుట్టిన‌వాడికి' అనేది అర్థం. టైటిల్‌తోటే ఆస‌క్తిని క్రియేట్ చేశాడు న‌ర్త‌న్‌. క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో గేయ‌ర‌చ‌యిత‌గా పేరున్న న‌ర్త‌న్ త‌ర్వాత‌, ప్ర‌శాంత్ నీల్ ఫ‌స్ట్ ఫిల్మ్ 'ఉగ్ర‌మ్'‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. డైరెక్ట‌ర్‌గా త‌న తొలి సినిమా 'మ‌ఫ్టీ'లో శివ రాజ్‌కుమార్‌ను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత త‌న రెండో సినిమాను ప్యాన్ ఇండియా స్టార్ య‌శ్‌తోటే తీసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. మ‌రోవైపు య‌శ్ 'కేజీఎఫ్ 2' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జూలై 16న ఆ సినిమా రిలీజ్ కానున్న‌ది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, నిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ధారులు.

భారీ ధ‌ర ప‌లికిన‌ 'ఆర్ఆర్ఆర్' త‌మిళ‌నాడు హ‌క్కులు

  య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి పీరియాడిక‌ల్ ఫిక్ష‌న్ మూవీ 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం' త‌మిళ‌నాడు థియేట్రిక‌ల్ రైట్స్‌ను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ చేజిక్కించుకుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ మూవీ హ‌క్కుల‌ను తాము సొంతం చేసుకున్న విష‌యాన్ని ఆ సంస్థ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టించింది.  "బిగ్గెస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' త‌మిళ‌నాడు థియేట్రిక‌ల్ రైట్స్‌ను మేం సొంతం చేసుకున్నామ‌ని అనౌన్స్ చేయ‌డానికి ఆనందిస్తున్నాం, గ‌ర్విస్తున్నాం" అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య ఆ హ‌క్కుల్ని రూ. 42 కోట్ల‌కు అమ్మార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఒక తెలుగు మూవీ త‌మిళ వెర్ష‌న్ రూ. 40 కోట్ల‌కు పైగా అమ్ముడ‌వ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. ఇదివ‌ర‌కు రాజ‌మౌళి మునుప‌టి సినిమా 'బాహుబ‌లి 2' త‌మిళ వెర్ష‌న్ థియేట్రికల్ రైట్స్‌ రూ. 47 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. 'ఆర్ఆర్ఆర్' మూవీని దాదాపు రూ. 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో నాయిక‌లుగా అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌క‌ని కీల‌క పాత్ర‌ధారులు. రే స్టీవెన్‌స‌న్, అలీస‌న్ డూడీ విల‌న్లుగా క‌నిపించ‌నున్నారు.

కంగ‌నా.. నువ్వొక న్యూక్లియ‌ర్ బాంబ్‌వి!

  ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్‌గా పేరుపొందిన కంగ‌నా ర‌నౌత్‌కు మ‌రో ఫైర్ బ్రాండ్ ఫిల్మ్ మేక‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ఇంకో బిరుదు ఇచ్చారు. ఆమెను న్యూక్లియ‌ర్ బాంబ్‌గా అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం రాత్రి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో కంగ‌న షేర్ చేసిన పోస్ట్‌కు ఆయ‌న రియాక్ష‌న్ అది. షూటింగ్ సెట్స్‌పై ఉన్న ఓ సెల్ఫీ పిక్చ‌ర్‌ను కంగ‌న షేర్ చేశారు. ఆ పిక్చ‌ర్‌లో ఆమె నుదుటిపైన నెత్తుటి గాయం క‌నిపిస్తోంది. అడ్డంగా గీసుకుపోయిన చోట నుంచి నెత్తుటి చుక్క నిలువుగా కింద‌కు జార‌డం క‌నిపిస్తోంది. ముఖ‌మంతా దుమ్ముధూళి నిండి న‌ల్ల‌గా అగుపిస్తోంది. ఆ ఫొటోకు, "సంఘ‌ర్ష‌ణ‌లో ఓదార్పుని పొంద‌డం మీకు వింత‌గా అనిపించ‌వ‌చ్చు, క‌త్తుల కొట్లాట శ‌బ్దంతో ప్రేమ‌లో ప‌డ‌డం సాధ్యంకాద‌ని అనుకోవ‌చ్చు, ర‌ణ‌రంగం మీకు అగ్లీ రియాలిటీ కావ‌చ్చు. కానీ పోరాటం కోసం పుట్టిన అమ్మాయికి త‌న‌కు చెందిన వేరో ప్ర‌దేశం ఈ ప్ర‌పంచంలో మ‌రొక‌టి ఉండ‌దు." అని రాసుకొచ్చారు కంగ‌న‌. దీన్ని రిట్వీట్ చేసిన ఆర్జీవీ, "ఇది ఒక ప్రొఫెష‌న‌ల్ ఫిల్మ్ మేక‌ర్‌గా నా కెరీర్‌లో నేను చూసిన ఒక న‌టి అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన క్లోజ‌ప్ గురించి మాత్ర‌మే.. ఇలాంటి ఇంటెన్సిటీతో, ఒరిజినాలిటీతో ఏ యాక్ట‌ర్ సింగిల్ ఇమేజ్‌ని ఇప్ప‌టిదాకా చూసిన‌ట్లు గుర్తుకు తెచ్చుకోలేక‌పోతున్నాను. హే కంగ‌నా.. నువ్వు ఫ‌** న్యూక్లియ‌ర్ బాంబ్‌వి." అని పోస్ట్ చేశారు. ఇది ఆమెని పొగిడిన‌ట్లా, తిట్టిన‌ట్లా అని నెటిజ‌న్లు అనుకుంటున్నారు. ఆర్జీవీ నుంచి వ‌చ్చిన సెటైరిక‌ల్ పోస్టుల్లో ఇదొక‌టి అనేది కాగ‌న‌గ‌ల‌మా! కాగా ఆర్జీవీ చేసిన పోస్ట్‌ను ట్విట్ట‌ర్ తొల‌గించింది. కార‌ణం.. త‌న పోస్ట్‌లో ఆర్జీవీ ఉప‌యోగించిన "ఫ‌**" అనే ప‌దం.

పెళ్లిలో రెడ్ శారీలో మెరిసిన‌ దియా.. పిక్స్ వైర‌ల్‌!

  అందాల తార‌, నాగార్జున స‌ర‌స‌న 'వైల్డ్ డాగ్‌'లో న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన దియా మీర్జా త‌న పెళ్లి ఫొటోల‌ను తొలిసారిగా షేర్ చేశారు. సోమ‌వారం రాత్రి ముంబైలో బిజినెస్‌మ్యాన్ వైభ‌వ్ రేఖితో ఆమె వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు సంబంధించి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 4 పిక్చ‌ర్స్‌ను దియా షేర్ చేశారు. ఆ ఫొటోల‌తో పాటు, "మ‌నం ఇల్లు అని పిలుచుకొనే ప్రేమ అనేది ఓ పూర్తి వృత్తం. దానికి క‌నుగొన‌డం ఎంత అద్భుతం! నా కుటుంబం పెరిగిన క్ష‌ణాల‌ను, ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నా. అన్ని ప‌జిల్స్ త‌మ మిస్స‌యిన ముక్క‌ల్ని క‌నుగొనవ‌చ్చు, అన్ని హృద‌యాలు న‌యం కావచ్చు, ప్రేమ తాలుకు అద్భుతం మ‌న చుట్టూ కొన‌సాగుతుండ‌వ‌చ్చు." అని రాసుకొచ్చారు. ఆమె షేర్ చేసిన రెండు ఫొటోల్లో ఆ ఇద్ద‌రూ చేయీ చేయీ క‌లిపి ఏడ‌డుగులు న‌డుస్తూ క‌నిపిస్తున్నారు. ఒక పిక్చ‌ర్‌లో పూల‌దండ‌లు మార్చుకుంటున్నారు. మ‌రో పిక్చ‌ర్‌లో మండ‌పంలో కూర్చొని పెళ్లి తంతులో పాల్గొంటున్నారు. దియా రెడ్ క‌ల‌ర్ శారీలో మెరిసిపోతోంది. ఈ వేడుక‌లో 50 మంది లోప‌లే అతిథులు హాజ‌ర‌య్యారు. వారిలో న‌టి అదితి రావ్ హైద‌రి కూడా ఉంది. నిన్న‌టి దాకా ఇటు దియా కానీ, అటు వైభ‌వ్ కానీ త‌మ రిలేష‌న్‌షిప్ గురించి కానీ, త‌మ పెళ్లి గురించి కానీ మాట్లాడ‌లేదు. నిన్న ఉద‌యమే త‌న పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు దియా. ఆ త‌ర్వాత దియా ఇంటి ద‌గ్గ‌ర పెళ్లి అలంక‌ర‌ణ‌ల‌ను ఫొటోగ్రాఫ‌ర్లు త‌మ కెమెరాలతో బంధించి ఆన్‌లైన్‌లో వైర‌ల్ చేశారు. ఇది దియాకు రెండో పెళ్లి. ఇదివ‌ర‌కు ఆమె నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లాడారు. 2019లో వారు విడిపోయారు.

'భ‌ళా తంద‌నాన' అంటున్న శ్రీ‌విష్ణు

  ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన శ్రీ‌విష్ణు‌ మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. 'బాణం' చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న చైత‌న్య దంతులూరి ఇప్పుడు మ‌రో సూప‌ర్బ్ స్క్రిప్ట్‌తో, ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణును ప్రెజెంట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. నిర్మించిన ప్ర‌తి చిత్రంతో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చే ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం నిర్మించే ఈ చిత్రానికి 'భ‌ళా తంద‌నాన' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ ఖ‌రారు చేశారు. త‌న చిత్రాల‌కు స్వ‌చ్ఛ‌మైన తెలుగు పేర్ల‌ను పెట్టే చైత‌న్య దంతులూరి ఇప్పుడు స్క్రిప్టుకు స‌రిగ్గా స‌రిపోయే, విన‌గానే కుతూహ‌లం రేకెత్తే టైటిల్ పెట్టారు. మంగ‌ళ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో 'భ‌ళా తంద‌నాన' చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్రముఖ‌ ర‌చ‌యిత‌, శ్రీ‌శైల దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన స‌ల‌హాదారు పురాణ‌పండ శ్రీ‌నివాస్ క్లాక్ నివ్వ‌గా, య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్టును శ్రీ‌వ‌ల్లి (కీర‌వాణి స‌తీమ‌ణి), ర‌మ (రాజ‌మౌళి స‌తీమ‌ణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో హీరో నారా రోహిత్‌, నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు. శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా తొలిసారి కేథ‌రిన్ ట్రెసా న‌టించే ఈ చిత్రంలో 'కేజీఎఫ్‌'లో విల‌న్ గ‌రుడ‌గా న‌టించి, అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్న రామ‌చంద్ర‌రాజు విల‌న్ రోల్ చేస్తున్నారు. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పిస్తుండ‌గా, ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీ‌కాంత్ విస్సా సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిట‌ర్‌గా, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

రూ. 100 కోట్ల మ‌నీ లాండ‌రింగ్‌‌ కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్‌!

  టాలీవుడ్ హీరో, ముంబైకి చెందిన స‌చిన్ జోషి రూ. 100 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో అరెస్ట‌య్యారు. ఆదివారం ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అరెస్ట్ చేసింది. అనంత‌రం స‌చిన్ నివాసం, ఆఫీస్ ప‌రిస‌రాల్లో ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. మ‌నీ లాండ‌రింగ్ కేసులో దాదాపు రూ. 100 కోట్ల అనుమానిత ట్రాన్‌సాక్ష‌న్ల‌తో క‌నెక్ష‌న్ ఉంద‌నే ఆరోప‌ణ‌ల‌తో స‌చిన్ అరెస్ట‌య్యారు. శ‌నివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ద‌ర్యాప్తులో భాగంగా ప్ర‌శ్నించే నిమిత్తం స‌చిన్ జోషిని తీసుకువెళ్లారు. ఆ రోజు రాత్రి వ‌ర‌కు ఏకంగా 18 గంట‌ల‌పాటు ఇంట‌రాగేష‌న్ జ‌రిపారు. జోషి, ఓంకార్ గ్రూప్‌కు మ‌ధ్య ప‌లు త‌ప్పుడు డీల్స్ జ‌రిగిన‌ట్లు ఈడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఓ స్థిరాస్తి డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో జేఎంజే గ్రూప్‌కు కూడా ప్ర‌మేయం ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. జేఎంజే గ్రూప్ ప్ర‌మోట‌ర్ల‌లో స‌చిన ఒక‌రు.‌  స‌చిన్‌ను ఈ రోజు ముంబైలోని ఓ కోర్టులో ‌హాజ‌రుప‌రిచారు. స‌చిన్ జోషి 2002లో 'మౌన‌మేల‌నోయి' చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత ఒరేయ్ పండు, నిను చూడ‌క నేనుండ‌లేను, జాక్‌పాట్‌, నీ జ‌త‌గా నేనుండాలి చిత్రాల్లో హీరోగా న‌టించారు. వీటిలో 'జాక్‌పాట్‌'లో ఆయ‌న స‌న్నీ లియోన్ జోడీగా క‌నిపించారు.

సునీత‌పై పిల్ల‌ల‌కు ఎందుకు కోపం వ‌చ్చింది?

  ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఒకవైపు గాయ‌నిగా, మ‌రోవైపు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆమె ప‌దేళ్ల క్రితం మొద‌టి భ‌ర్త కిర‌ణ్‌తో విడిపోయి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో జీవనం సాగిస్తూ వ‌చ్చారు. నెల రోజుల క్రిత‌మే మ్యాంగో మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌ముఖ యాంక‌ర్ వీరిని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ప్ర‌త్యేక చిట్‌చాట్ సంద‌ర్భంగా సింగ‌ర్ సునీత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు. "గ‌త కొంత కాలంగా రామ్ నాకు తెలుసు. అయితే త‌ను ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేసేదాన్ని కాదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వృత్తిప‌ర‌మైన విష‌యాల ప‌రంగా రామ్ ఓ సారి నాకు ఫోన్ చేశారు. 'ఇంకేంటీ.. ఇలాగే వుండిపోతావా?.. పెళ్లి గురించి ఎమైనా ప్లాన్స్ వున్నాయా?' అని రామ్‌ని అడిగాను. దానికి ఆయ‌న 'నిన్ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. ప‌రోక్షంగా ఈ విష‌యాన్ని ఏడేళ్లుగా చెబుతున్నా' అని స‌మాధాన‌మిచ్చారు. ఇదే విష‌యంపై మా అమ్మానాన్న‌లు, పిల్ల‌ల‌తో చ‌ర్చించాను. వాళ్లంతా ఎంతో సంతోషించారు.  అదే స‌మ‌యంలో రామ్ నా గురించి వాళ్లింట్లో చెప్ప‌డం వారు కూడా ఓకే అన‌డం జ‌రిగిపోయింది. రామ్ వాళ్ల అమ్మానాన్న‌ల‌తో క‌లిసి మాట్లాడ‌టానికి తొలిసారి మా ఇంటికి వ‌చ్చారు. అదే స‌మ‌యంలో నాకు తాంబూలం అందించారు. ఆ ఫొటోతో పాటు నిశ్చితార్థం జ‌రిగిందంటూ నెట్టింట్లో న్యూస్ వైర‌ల్ అయింది. అది తెలిసి మా పిల్ల‌లకు నాపై బాగా కోపం వ‌చ్చింది. 'నీకు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందంట క‌దా.. ఇంత ముఖ్య‌మైన విష‌యం మాకు చెప్ప‌వా?' అంటూ సీరియ‌స్ అయ్యారు. ఆ త‌రువాత అర్థం చేసుకుని కూల్ అయ్యారు" అని చెప్పారు సింగ‌ర్ సునీత‌.  ఆమెకు మొద‌టి భ‌ర్త ద్వారా ఆకాశ్ అనే కుమారుడు, శ్రేయ అనే కుమార్తె ఉన్నారు. ఆ ఇద్ద‌రూ టీనేజ్ దాటిన‌వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం.

సుమంత్ అశ్విన్ పెళ్ల‌యిపోయింది!

  ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎమ్మెస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడ‌య్యాడు. కొద్ది సేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్ శివార్ల‌లోని ఎం.ఎస్‌. రాజు ఫామ్‌హౌస్‌లో సంద‌డిగా జ‌రిగిన పెళ్లి వేడుక‌లో దీపిక మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. దీపిక డ‌ల్లాస్‌లో రీసెర్చి సైంటిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె స్వ‌స్థ‌లం హైద‌రాబాదే. ఈ వేడుక‌కు కొద్దిమంది స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ క‌న్నుల పండువ‌గా త‌న కుమారుడి వివాహ వేడుక‌ను జ‌రిపించారు ఎమ్మెస్ రాజు. సుమంత్ సంప్ర‌దాయ ధ‌వ‌ళ వ‌ర్ణం ధోతీ, చొక్కా ధ‌రించ‌గా, దీపిక ఎరుపు రంగు ప‌ట్టుచీర‌, న‌డుముకు వ‌డ్డాణం ధ‌రించారు. ఈ రోజు గోరింటాకు వేడుక‌తో పెళ్లి సంద‌డి మొద‌లైంది. సుమంత్ అశ్విన్‌, దీపిక‌ జంట‌గా కూర్చొని, గోరింటాకు పెట్టుకున్న త‌మ చేతుల‌ను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చారు. దీపిక అయితే మెహందీ వేసుకున్న త‌న కాళ్ల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. అలాగే తండ్రితో క‌లిసి మ‌రో ఫొటోకు ఆనందంగా న‌వ్వుతూ పోజు ఇచ్చాడు సుమంత్‌.  ప్ర‌స్తుతం సుమంత్ అశ్విన్ 'ఇదే మా క‌థ' అనే బైక్ జ‌ర్నీ మూవీలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. మ‌రోవైపు 'డ‌ర్టీ హ‌రి' సినిమా స‌క్సెస్‌తో డైరెక్ట‌ర్‌గా ఎం.ఎస్‌. రాము హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. కుమారుడి పేరుమీదే సుమంత్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ను నెల‌కొల్పిన ఎమ్మెస్ రాజు, దానిపై ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను నిర్మించారు.

మ‌రో మెస్మ‌రైజింగ్‌ మెలోడీ "ఇంకోసారి ఇంకోసారి" వ‌చ్చేసింది!

  'నిన్నుకోరి' త‌ర్వాత హీరో నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్'‌. 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లే చిత్ర బృందం శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు "ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎద‌లో చేరి" అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేసింది.  మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ విన్న‌కొద్దీ వినాల‌నిపించే మ‌ధుర‌మైన బాణీలు అందించిన ఈ పాట‌కు చ‌క్క‌ని ప‌ద‌బంధాల‌తో సాహిత్యం అందించారు చైత‌న్య ప్ర‌సాద్‌. శ్రేయా ఘోష‌ల్‌, కాల‌భైర‌వ గానం ఈ సాంగ్‌కు మ‌రింత రిచ్‌నెస్ తీసుకొచ్చింది. "నా రాదారిలో గోదారిలా వ‌చ్చావేమో.. నీరెండ‌ల్లో నా గుండెల్లో పున్నాగ‌లా పూచావేమో", "క‌వ్విస్తావు నీవు నీకంటి బాణాల‌తో గుండె అల్లాడేలా.. న‌వ్విస్తావు నీవు నీ కొంటె కోణాల‌తో చంటిపిల్లాడిలా".. లాంటి చ‌ర‌ణాల‌తో చైత‌న్య‌ప్ర‌సాద్ క‌లం ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. చిత్రంలో ఈ పాట‌ను నాని, రీతూ వ‌ర్మ‌పై చిత్రీక‌రించారు. వారిద్ద‌రి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న 'ట‌క్ జ‌గ‌దీష్'ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి వారు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

'జాతిర‌త్నాలు' టీజ‌ర్ ఏం చెబుతోందంటే...

  న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా న‌వ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఆ న‌డ‌వ‌డంలో స్టైల్ ఉండ‌టం న‌వ్వు తెప్పించే విష‌యం. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌.  వినోదం మాత్ర‌మే కాకుండా ఈ మూవీలో సీరియ‌స్ విష‌యం కూడా ఒక‌టి ఉంద‌ని ముర‌ళీ శ‌ర్మ ఎపిసోడ్ తెలుపుతోంది. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగీతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు. ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మార్చి 11న 'జాతిర‌త్నాలు' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

చేతిలో 9 క్రేజీ-భారీ ప్రాజెక్టులు.. వార్త‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్‌!

  మైత్రీ మూవీ మేక‌ర్స్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన సంస్థ‌. ఆరేళ్ల క్రితం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు 'శ్రీ‌మంతుడు' లాంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇవ్వ‌డం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్ అచిర కాలంలోనే అగ్ర‌శ్రేణి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా పేరు తెచ్చుకుంది. 'శ్రీ‌మంతుడు' త‌ర్వాత‌, జ‌న‌తా గ్యారేజ్‌, రంగ‌స్థ‌లం, చిత్ర‌ల‌హ‌రి, డియ‌ర్ కామ్రేడ్‌, నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌, మ‌త్తు వ‌ద‌ల‌రా, ఉప్పెన లాంటి చిత్రాలు నిర్మించింది. 'ఉప్పెన' శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌గా, దాని త‌ర్వాత నిర్మాణంలో ఉన్న‌, త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లుకానున్న‌, క‌న్‌ఫామ్ అయిన సినిమాలు తొమ్మిది ఉండ‌టం విశేషం. వీటిలో నేటి క్రేజీ, బిగ్ స్టార్స్ సినిమాలు ఉన్నాయి. మ‌హేశ్‌తో రెండోసారి కాంబినేష‌న్ క‌ట్టి 'స‌ర్కారు వారి పాట‌'ను ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో తీస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ దుబాయ్‌లో జ‌రుగుతోంది. అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేష‌న్‌తో నిర్మిస్తున్న 'పుష్ప' కూడా సెట్స్ మీదుంది. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్నారు మైత్రి అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌. అలాగే నాని హీరోగా 'అంటే సుంద‌రానికీ!' సినిమా కూడా త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. దీనికి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. వీటి త‌ర్వాత మ‌రో సినిమాల‌ను క‌న్ఫామ్ చేసింది ఈ సంస్థ‌. అవి.. చిరంజీవి-బాబీ కాంబినేష‌న్ మూవీ, బాల‌కృష్ణ‌-గోపీచంద్ మ‌లినేని కాంబో ఫిల్మ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ ఫిల్మ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌-శివ నిర్వాణ కాంబినేష‌న్ సినిమా, ప్ర‌భాస్‌తో తీయ‌నున్న ప్యాన్ ఇండియా మూవీ.

ప్ర‌భాస్ రానున్న 6 సినిమాలు ఓ రేంజ్‌లో లేవుగా!

  'బాహుబ‌లి' సిరీస్‌తో ప్యాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌గా అవ‌త‌రించిన ప్ర‌భాస్ రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే.. అత‌ని ఇమేజ్ ఏ రేంజ్‌కు వెళ్తుందో ఊహించ‌లేమ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అత‌ని లేటెస్ట్ ఫిల్మ్ 'రాధేశ్యామ్' ఏప్రిల్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ ప్ర‌భాస్ 20వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, రాధాకృష్ణ కుమార్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌భాస్ 21వ చిత్రంగా 'స‌లార్' రిలీజ్ కానున్న‌ది. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఇప్ప‌టికే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో ప్ర‌భాస్ జోడీగా తొలిసారి శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. ఈ ఏడాదే ఈ మూవీని తీసుకు రావాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  ప్ర‌భాస్ 22వ మూవీ 'ఆదిపురుష్‌'ను బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తుంటే, రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. సీత పాత్ర‌ధారి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. 2022 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ప్ర‌భాస్ 23వ ఫిల్మ్ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ నిర్మించ‌నున్న సైన్స్ ఫిక్ష‌న్ ల‌వ్ స్టోరీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో దీపికా ప‌డుకోనే హీరోయిన్ కాగా, అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క రోల్ చేయ‌నున్నారు. 2023లో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ది. ప్ర‌భాస్ 24వ సినిమాని యాక్ష‌న్ మూవీల స్పెష‌లిస్ట్ (వార్, ప‌ఠాన్ ఫేమ్‌) సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించ‌నున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందే ఈ మూవీ 2023లో మొద‌ల‌నున్న‌ది. గ‌త ఏడాది ప్యాండ‌మిక్ టైమ్‌లో ప్ర‌భాస్‌తో ప‌లుమార్లు ఈ సినిమాపై సిద్ధార్థ్ చ‌ర్చ‌లు జ‌రిపాడు. ప్ర‌భాస్‌కు మైల్‌స్టోన్ లాంటి 25వ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న‌ది. దీనికి డైరెక్ట‌ర్ ఎవ‌రు, ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యాలు త‌ర్వాత వెల్ల‌డ‌వుతాయి.  మొత్తానికి 2023 వ‌ర‌కు ప్ర‌భాస్ డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్ప‌టికే ప్యాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌గా పేరుపొందిన ప్ర‌భాస్ ఇమేజ్‌, క్రేజ్ ఈ సినిమాల‌తో ఏ రేంజ్‌కు వెళ్తుందో వెయిట్ అండ్ సీ...

బిగ్గెస్ట్ స్కూప్‌: శ్రీ‌రామునిగా మ‌హేశ్‌.. రావ‌ణునిగా హృతిక్‌!

  ఇంత‌కంటే బిగ్గెస్ట్ స్కూప్ ఇంకోటి ఉండ‌దు. ఇప్పుడు బాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఆ స్కూప్ ఏమిటంటే.. శ్రీ‌రాముని పాత్ర‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ చేయ‌నున్నాడు. అదేమిటీ ఆల్రెడీ ప్ర‌భాస్ చేస్తున్నాడు క‌దా? అని సందేహం రావ‌చ్చు. కానీ ఇది వేరే ప్రాజెక్ట్‌. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌ధు మంతెన రూ. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో 'రామాయ‌ణ 3డి' సినిమాని నిర్మించాల‌ని చాలా కాలంగా క‌ల‌లు కంటున్నాడు. ఇప్ప‌టికే హృతిక్ రోష‌న్‌, దీపికా ప‌డుకోనేల‌ను ఆ సినిమా చేయ‌డానికి ఒప్పించాడు కూడా. అయితే హృతిక్ చేయ‌డానికి ఒప్పుకుంది రాముని పాత్ర కాదు, ప్ర‌తినాయ‌కుడైన రావ‌ణాసురుని పాత్ర‌ను! సీత పాత్ర‌కు దీపిక స‌రేనంది. నిజానికి మొద‌ట శ్రీ‌రాముని పాత్ర‌కు ప్ర‌భాస్‌ను సంప్ర‌దించాడు మ‌ధు మంతెన‌. అయితే ఆ ప్రాజెక్ట్ బాలా ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో, ఈలోగా ఓమ్ రౌత్ డైరెక్ష‌న్‌లో 'ఆదిపురుష్' చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ప్ర‌భాస్‌. 'ఆదిపురుష్‌'లో రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తున్న‌ట్లు ఓమ్ రౌత్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ధు మంతెన షాక్ అయ్యాడు. వెంట‌నే త‌న ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప‌నుల్లో వేగం పెంచాడు. రాముని పాత్ర‌కోసం ముఖంలో స్వ‌చ్ఛ‌త, చూడ‌గానే ఆక‌ట్టుకొనే రూపం ఉన్న మ‌రో సౌత్ స్టార్‌ కోసం చేసిన అన్వేష‌ణ మ‌హేశ్ ద‌గ్గ‌ర ఆగింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌హేశ్‌ను అప్రోచ్ అవ‌డం, స్క్రిప్ట్ వినిపించ‌డం కూడా జ‌రిగిపోయాయంట‌. మ‌హేశ్ కూడా ఆ ప్రాజెక్ట్ విష‌యంలో ఎగ్జ‌యిట్ అయ్యాడ‌ని అంటున్నారు. అయితే ఇంకా ఒప్పందం మాత్రం కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది. ఈ రూమ‌ర్స్ గ‌నుక నిజ‌మే అయితే ఆడియెన్స్‌కు ఇంత‌కంటే క‌న్నుల పండుగ ఉండ‌దు. ఎవ‌రికివారే అయిన ముగ్గురు సూప‌ర్ స్టార్లు.. హృతిక్‌, మ‌హేశ్‌, దీపిక‌.. ఒకే సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌డం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది. ఇది ఎంత‌వ‌ర‌కు వాస్త‌వ రూపం దాలుస్తుందో చూడాలి.

'బ‌జార్ రౌడీ'గా మారిన బ‌ర్నింగ్ స్టార్‌!

  బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రేక్ష‌కుల్ని మ‌రోసారి న‌వ్వించేందుకు రెడీ అవుతున్నాడు. అత‌ను హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు 'బ‌జార్ రౌడీ' అనే టైటిల్ అనౌన్స్ చేశారు. బుధ‌వారం టైటిల్ డిజైన్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కె.ఎస్‌. క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సందిరెడ్డి శ్రీ‌నివాస‌రావు నిర్మిస్తున్నారు. మోష‌న్ పోస్ట‌ర్‌లో మొద‌ట చార్మినార్‌ను, న‌‌డుస్తున్న మెట్రో ట్రైన్‌ను చూపించి, త‌ర్వాత ర‌సూల్‌పుర ప్లేస్‌ను చూపించారు. అక్క‌డ‌కు కొంత‌మంది రౌడీలు క‌త్తులు క‌టార్ల‌తో వ‌చ్చారు. వాళ్ల‌కు కొద్ది గ‌జాల దూరంలో రోడ్డుమీద వేసిన న‌వారు మంచంపై కులాసాగా కాలుచాపు ప‌డుకొని, లైట‌ర్‌తో తాపీగా సిగ‌రెట్ వెలిగించుకుంటున్న సంపూర్ణేష్ బాబు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నాడు. ఆ రౌడీల‌ను బ‌జార్ రౌడీ ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలో చూసి న‌వ్వుకోవాల్సిందే. 'హృద‌య కాలేయం', 'కొబ్బ‌రిమ‌ట్ట' లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు 'బ‌జార్ రౌడీ'గా అల‌రించేందుకు రెడీ అవుతున్నాడ‌న్న మాట‌. మ‌హేశ్వరి వద్ది హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో నాగినీడు, సాయాజి షిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, క‌రాటే క‌ల్యాణి ఇత‌ర పాత్ర‌ధారులు. మ‌రుధూరి రాజా సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ మూవీకి సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అడుసుమిల్లి విజ‌య్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గౌతంరాజు ఎడిట‌ర్‌గా, జాషువా ఫైట్ మాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.