'ఆచార్య‌'ను ఆమ‌డ‌దూరం నెట్టేసిన 'అఖండ‌'!

  యూట్యూబ్‌లో అంద‌రు హీరోలు ఏదో వీడియోతో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంటే, త‌మ హీరో అలాంటి రికార్డులు క్రియేట్ చేయ‌డం లేదే అనుకుంటూ ఒకింత అసంతృప్తితో ఉన్న బాల‌కృష్ణ ఫ్యాన్స్ ఇప్పుడు ఆనందాతిరేకంగా కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు. కార‌ణం.. ఆయ‌న లేటెస్ట్ ఫిల్మ్ 'అఖండ' టీజ‌ర్ రికార్డులు క్రియేట్ చేస్తుండ‌ట‌మే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తోన్న సినిమా అంటే దానికి ఉండే క్రేజ్ ఎలాంటిదో మ‌రోసారి అఖండ నిరూపిస్తోంది. ఉగాది సంద‌ర్భంగా బీబీ3 మూవీకి 'అఖండ' టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ, దానితో పాటు రిలీజ్ చేసిన టీజ‌ర్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. బాల‌య్య అఖండ గెట‌ప్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఎంత‌గా అంటే మెగాస్టార్ 'ఆచార్య' టీజ‌ర్ వ్యూస్‌ను త‌క్కువ టైమ్‌లోనే అఖండ టీజ‌ర్ దాటేసి, దానికి అంద‌నంత దూరంలోకి దూసుకుపోయింది. సీనియ‌ర్ స్టార్స్‌లో ఇప్పుడు బాల‌య్య సినిమా టీజ‌ర్‌దే స‌రికొత్త రికార్డ్‌. ముఖ్యంగా "కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది కారుకూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్ది." అంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. జ‌న‌వ‌రి 29న రిలీజైన 'ఆచార్య' టీజ‌ర్ ఇప్ప‌టిదాకా 80 రోజుల్లో 19.77 మిలియ‌న్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే 'అఖండ' టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే, ఏప్రిల్ 13న రిలీజై, వారం రోజుల్లోనే 28.9 మిలియ‌న్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దీన్ని బ‌ట్టి 'అఖండ' టీజ‌ర్ ఎంత‌లా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోందో అర్థం చేసుకోవ‌చ్చు. దానికి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్లే సినిమాకు కూడా అనూహ్య‌మైన బ‌జ్ వ‌చ్చింది. ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటే మే 28న రిలీవ‌డానికి ఈ సినిమా రెడీ అవుతోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమాకు అఖండ విజ‌యం త‌థ్య‌మ‌ని బాల‌య్య అభిమానులు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

ప్ర‌తి రోజూ నీకు రుణ‌ప‌డి ఉంటాన‌మ్మా!

  నేడు (ఏప్రిల్ 20) సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు చాలా స్పెష‌ల్. ఎందుకంటే ఈరోజు వాళ్ల‌మ్మ ఇందిరాదేవి పుట్టిన‌రోజు. హైద‌రాబాద్‌లో ఉంటే క‌చ్చితంగా అమ్మ‌ను క‌లుసుకుంటాడు మ‌హేశ్‌. ఇందిరాదేవి త‌న చిన్న‌కూతురు ప్రియ‌ద‌ర్శిని ద‌గ్గ‌ర ఉంటున్నారు. అంటే హీరో సుధీర్‌బాబు ఇంట్లో అన్న‌మాట‌. త‌ల్లి జ‌న్మదినం సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు మ‌హేశ్‌. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అమ్మ‌తో క‌లిసున్న ఓ పిక్చ‌ర్‌ను అత‌ను షేర్ చేశాడు. ఆ పిక్చ‌ర్‌లో అమ్మ చేతిని ప‌ట్టుకొని న‌డిపించుకుంటూ వ‌స్తున్నాడు. అది కొన్నేళ్ల క్రితం జ‌రిగిన‌ ఫంక్ష‌న్‌కు సంబంధించిన ఫొటో అని తెలుస్తోంది. అందులో మ‌హేశ్ కొడుకు గౌత‌మ్ బాగా చిన్న‌వాడిగా క‌నిపిస్తున్నాడు. ఆ ఫొటోను షేర్ చేసిన మ‌హేశ్‌, "హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మా. ప్ర‌తిరోజూ నీకు రుణ‌ప‌డి ఉంటాను." అనే క్యాప్ష‌న్ పెట్టాడు. మూడు హార్ట్ ఎమోటికాన్స్‌ను కూడా జోడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్‌కు మ‌హేశ్ వ‌దిన శిల్పా శిరోద్క‌ర్ స్పందించింది. "హ్యాపీ బ‌ర్త్‌డే ఆంటీ" అనే కామెంట్ పెట్టింది. సీనియ‌ర్ సూప‌ర్‌స్టార్ కృష్ణకు ఇందిరాదేవి సొంత మ‌ర‌ద‌లు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేట‌ప్ప‌టికే కృష్ణ‌, ఇందిరా దేవిల‌కు వివాహ‌మైంది. వారికి ఇద్ద‌రు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు ర‌మేశ్ కూడా హీరోగా ప‌రిచ‌య‌మై, కొన్ని సినిమాలు చేశాక తెర‌మ‌రుగ‌య్యాడు. చిన్న‌కొడుకు మ‌హేశ్ మాత్రం తండ్రికి త‌గిన వార‌సుడిగా సూప‌ర్‌స్టార్ పేరును నిల‌బెట్టాడు. పెద్ద‌కుమార్తె ప‌ద్మావ‌తి పేరు మీద‌నే ప‌ద్మాల‌యా స్టూడియోస్‌ను కృష్ణ నెల‌కొల్పారు. రెండో కుమార్తె మంజుల న‌టిగా, నిర్మాత‌గా ఉన్నారు. మూడో అమ్మాయి ప్రియ‌ద‌ర్శినిని సుధీర్‌బాబు పెళ్లాడాడు. విజ‌య‌నిర్మ‌ల‌ను రెండో వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ ఇందిరాదేవిని కృష్ణ ఎప్పుడూ నిర్ల‌క్ష్యం చేయ‌లేద‌ని చెప్పుకుంటారు. మ‌హేశ్ కూడా త‌ల్లి అంటే అమిత‌మైన ప్రేమానురాగాలు ప్ర‌ద‌ర్శిస్తుంటాడు.

కాంట్ర‌వ‌ర్సీ కావ‌డంతో త‌నికెళ్ల భ‌ర‌ణి డిలీట్ చేసిన పోస్ట్ ఇదే!

  'శ‌బ్బాష్‌రా శంక‌రా' మ‌కుటంతో కొంత కాలంగా త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో రోజుకో క‌విత‌ను త‌నికెళ్ల భ‌ర‌ణి పోస్ట్ చేస్తూ వ‌స్తున్నారు. 'ఆట‌గ‌ద‌రా శివా' పేరుతో ఆయ‌న ప‌బ్లిష్ చేసిన శివ త‌త్వాల‌కు ఎంత పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చాయో ఈ 'శ‌బ్బాష్‌రా శంక‌రా' క‌విత‌ల‌కు అంత ప్రాచుర్యం ల‌భిస్తోంది. అయితే ఇటీవ‌ల ఆయ‌న పోస్ట్ చేసిన ఓ శివ క‌విత వివాదాస్ప‌ద‌మైంది. దానిపై హేతువాదులు భ‌గ్గుమ‌న్నారు.  వారి ఆగ్ర‌హానికి కార‌ణ‌మైన భ‌ర‌ణి క‌విత ఏదంటే.. "గ‌ప్పాల్ గొడ్త‌రు గాడ్తె కొడుకులు.. నువ్వుండ‌గ లేవంట‌రు!.. ఉన్న‌వో లేవో చెవుల జెప్పిపోరా.. శ‌బ్బాష్‌రా శంక‌రా." ఈ క‌విత‌పై ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని మండిప‌డ్డారు. "గాడిద కొడుకులు" అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే వ్రాస్తారూ.. అని త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో తీవ్రంగా విమ‌ర్శించారు. "మ‌త‌ర‌హితుల‌ను, నాస్తికుల‌ను, హేతువాదుల‌ను, మాన‌వ‌తావాదుల‌ను గాడిద కొడుకులు అంటున్న‌వా.. అని ఈ తిక్క-కవిత్వ శంకరోన్మాది గురించి అనుకుంటుంటే, డాక్టరమ్మ పావని గారు వచ్చి ఈ సినిమా వేషగాడిని పట్టుకుని పిర్ర మీద ఇంజెక్షన్ ఇచ్చేశారు. అయిపాయే. చూడబ్బాయి! చెవిలో కాదు, పబ్లిక్ గా చెప్తున్నా: లేడు. నీకు మత్తు దిగినాక పబ్లిక్ గా చెప్పించు " ఉన్నాను " అని." అని పోస్ట్ చేశారు. అలా "తిక్క క‌విత్వ శంక‌రోన్మాది" అని భ‌ర‌ణిని బాబు అభివ‌ర్ణించారు. అంతే కాదు, "తిక్క శంకర్ విద్వేషపూరిత, ఉన్మాదపు దూషణలపై మానవవాదీ, హేతువాదీ, నాస్తికుడూ బాబు గోగినేని స్పందన. FB Live. తెలుగులో. ఆదివారం 18 ఏప్రిల్ 2021 మ. 12.00 గంటలకు, IST." అంటూ ఇంకో పోస్ట్ పెట్టారు. ఈ ఈవెంట్‌కు "ఆవు దూడలూ - గాడిద కొడుకులూ" అనే పేరు పెట్టడం గ‌మ‌నించాల్సిన విష‌యం.  దీంతో త‌న క‌విత తీవ్ర దుమారం రేపుతోంద‌ని గ్ర‌హించిన త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆ క‌విత‌ను త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్ నుంచి తొల‌గించారు. హేతువాదుల‌కు, మాన‌వ‌తావాదుల‌కు బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తున్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో "కొన్ని రోజులుగా నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్న 'శ‌బ్బాష్‌రా శంక‌రా' క‌విత‌ల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ కొన్ని వాక్యాలు కొంత‌మంది మ‌న‌సుల్ని నొప్పించ‌డం, బాధ క‌లిగించ‌డం జ‌రిగింది. దానికి నేను ఏ వివ‌ర‌ణ ఇచ్చుకున్నా క‌వరింగ్ లాగా ఉంటుంది కాబ‌ట్టి, నేను చేతులు జోడించి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేశాను. నాకు హేతువాదుల‌న్నా, మాన‌వ‌తావాదుల‌న్నా గౌర‌వ‌మే త‌ప్ప వ్య‌తిరేక‌త ఏమీ లేదు. ఏ మ‌నిషికీ ఇంకొక‌ర్ని నొప్పించే హ‌క్కూ అధికారం లేదు. జ‌రిగిన పొర‌పాటుకి మ‌రోసారి మ‌న్నించ‌మ‌ని కోరుకుంటున్నా." అని చెప్పారు. భ‌ర‌ణి క్ష‌మాప‌ణ‌ల‌పై బాబు గోగినేని ఇంత‌దాకా స్పందించ‌లేదు. దాన్నిబ‌ట్టి రేపు ఆయ‌న ఫేస్‌బుక్ లైవ్ యాథాత‌థంగా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

శంక‌ర్‌.. హిందీ 'అప‌రిచితుడు' తీసే హ‌క్కు నీకు లేదు!

  దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు హిందీలో 'అప‌రిచితుడు' (అన్నియ‌న్‌) సినిమాని రీమేక్ చేసే హ‌క్కు కానీ, అధికారం కానీ లేద‌ని దాని ఒరిజిన‌ల్ ప్రొడ్యూస‌ర్ ఆస్కార్ ర‌విచంద్ర‌న్ తెలిపారు. 'అప‌రిచితుడు' క‌థ హ‌క్కుల‌న్నీ త‌న‌కు మాత్ర‌మే సొంత‌మ‌నీ, ఆ హ‌క్కుల్ని తాను దివంగ‌త ర‌చ‌యిత సుజాత (రంగ‌రాజ‌న్‌) నుంచి కొనుగోలు చేశాన‌నీ ఆయ‌న తేల్చి చెప్పారు. త‌న‌కు మాట మాత్రం కూడా చెప్ప‌కుండా ఎలా హిందీలో ఆ సినిమాని రీమేక్ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు, ఈ విష‌యంలో తాను చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ రూపొందించిన త‌మిళ చిత్రం 'అన్నియ‌న్' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. తెలుగులో ఒకేసారి 'అప‌రిచితుడు' పేరుతో విడుద‌లై ఇక్క‌డా కాసులు కురిపించింది. ఆ సినిమాని నిర్మించింది ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌. అయితే ఇప్పుడు ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా హిందీలో ఆ మూవీని రీమేక్ చేయ‌నున్న‌ట్లు, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతీలాల్ గ‌డా దాన్ని నిర్మించ‌నున్న‌ట్లు నిన్న శంక‌ర్ ప్ర‌క‌టించారు.  దీంతో ఈరోజు శంక‌ర్‌కు ఓ లెట‌ర్‌తో పాటు లీగ‌ల్ నోటీస్ కూడా పంపారు ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌. హిందీలో ఆ సినిమాని రీమేక్ చేయ‌నున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న చూసి తాను తీవ్రంగా షాక‌య్యాన‌ని ఆయ‌న అన్నారు. ర‌చ‌యిత సుజాత నుంచి ఆ క‌థ హ‌క్కులు మొత్తం తాను కొనుగోలు చేశాన‌నీ, ఈ విష‌యంలో ఆయ‌న‌కు పూర్తిగా డ‌బ్బు చెల్లించాన‌నీ, దీనికి సంబంధించిన రికార్డుల‌న్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌నీ ర‌విచంద్ర‌న్ వెల్ల‌డించారు. ఆ స్టోరీలైన్ హ‌క్కుల‌కు తానే సంపూర్ణ య‌జ‌మానినని తెలిపారు. "నా ప‌ర్మిష‌న్ లేకుండా దాన్ని అడాప్ట్ చేసినా, రీమేక్ చేసినా, కాపీ చేసినా అది పూర్తిగా చ‌ట్ట‌విరుద్ధం." అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ లెట‌ర్‌లో 'బాయ్స్' సినిమా విష‌యాన్ని ర‌విచంద్ర‌న్ ప్ర‌స్తావించారు. "మీరు 'బాయ్స్' అనే అంత‌గా స‌క్సెస్‌ఫుల్ కాని సినిమా తీసి ఇమేజ్ దెబ్బ‌తిని, ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు, మీకు 'అన్నియ‌న్' (అప‌రిచితుడు) అనే సినిమాని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని నేను క‌ల్పించాను. కేవ‌లం నా స‌పోర్ట్ వ‌ల్లే మీరు పోయిన ఇమేజ్‌ను తెచ్చుకోగ‌లిగారు. ఆ విష‌యాన్ని మీరు క‌న్వీనియంట్‌గా విస్మ‌రించి, నా స‌క్సెస్‌ఫుల్ మూవీ 'అన్నియ‌న్‌'కు సంబంధించిన కీర్తి అంతా కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించి, దాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి చూస్తుండ‌టం బాధాక‌రం. మీరెప్పుడూ కొన్ని నైతిక విలువ‌లు పాటించే వ్య‌క్తి అనుకొనేవాడ్ని. అలాంటిది ఇలాంటి అన్యాయ‌మైన ప‌నుల‌కు ఎందుకు పాల్ప‌డుతున్నార‌నేది నాకు ఆశ్చ‌ర్యంగా ఉంది." అని ఆ ఉత్త‌రంలో ఆయ‌న తెలిపారు. 'అన్నియ‌న్' క‌థ హ‌క్కుల‌న్నీ త‌న ద‌గ్గ‌రే ఉన్నందున వెంట‌నే హిందీ రీమేక్ ప‌నుల‌ను ఆపేయాల‌ని ఆయ‌న శంక‌ర్‌కు సూచించారు. లేదంటే తాను తీసుకొనే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డాల‌ని హెచ్చ‌రించారు. దీంతో 'అప‌రిచితుడు' హిందీ రీమేక్ వ్య‌వ‌హారం మ‌లుపు తీసుకుంది.

నిన్న‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ రంభ ఇప్పుడెక్క‌డ‌?

  ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. కానీ రంభ అనే స్క్రీన్ నేమ్‌తోటే ఆమె పాపుల‌ర్ అయ్యారు. తెలుగు, త‌మిళ తెర‌ల‌పై టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో కాలుపెట్టిన రంభ‌, ఆ త‌ర్వాత కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, రాజ‌శేఖ‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, సుమ‌న్‌, జె.డి. చ‌క్ర‌వ‌ర్తి లాంటి హీరోల స‌ర‌స‌న సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక పాత్ర‌లు పోషించారు. ఇక త‌మిళంలోనూ ర‌జ‌నీకాంత్‌తో మొద‌లుపెట్టి ఒకటిన్న‌ర ద‌శాబ్దం క్రితం అక్క‌డి పాపుల‌ర్ స్టార్స్ అంద‌రితోనూ ఆమె న‌టించారు. చివ‌రిసారిగా ఆమె క‌నిపించిన సినిమా 2008లో వ‌చ్చిన 'దొంగ స‌చ్చినోళ్లు'. రాజా వ‌న్నెంరెడ్డి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రంభ ఓ ప్ర‌త్యేక పాత్ర చేశారు. నిజం చెప్పాలంటే ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలం టాలీవుడ్‌, కోలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ల‌లో ఆమె ఒక‌రు. హిందీలోనూ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 2001 నుంచి ఆమె ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఆ టైమ్‌లో టీవీ షోల‌కు జ‌డ్జిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. వివాహానంత‌రం ఆమె న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. 2010 ఏప్రిల్‌ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను ఆమె పెళ్లాడారు. ఇటీవ‌లే తమ 11వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఆమె జ‌రుపుకున్నారు. దానికి సంబంధించిన ఓ పిక్చ‌ర్‌ను షేర్ చేసి, "11 years of togetherness Our daughters made this googly Cute card for us." అనే క్యాప్ష‌న్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గానే ఉంటూ వ‌స్తోన్న రంభ‌, త‌మ పిల్ల‌ల‌కు సంబంధించిన క్యూట్ ఫొటోల‌ను త‌ర‌చూ షేర్ చేసుకుంటూనే వ‌స్తున్నారు. అప్పుడ‌ప్పుడు త‌న సెల్ఫీ పిక్చ‌ర్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తున్నారు. భ‌ర్త ఇంద్ర‌కుమార్‌, ఇద్ద‌రు కూతుళ్లు, కొడుకుతో చాలా హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం రంభ ఫ్యామిలీ టోరంటోలో నివాసం ఉంటోంది.

బాల‌య్య 'అఖండ' రూపం!

  నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను రూపొందిస్తోన్న చిత్రానికి 'అఖండ' అనే టైటిల్ ప్ర‌క‌టించారు. శ్రీ ప్ల‌వ నామ సంవ‌త్స‌ర ఆరంభం రోజున ఓ టీజ‌ర్ ద్వారా ఈ సినిమా మేక‌ర్స్ అఖండ టైటిల్‌తో పాటు బాల‌కృష్ణ పోషిస్తోన్న అఘోర క్యారెక్ట‌ర్‌ను సైతం రివీల్ చేశారు. "BB3 టైటిల్ రోర్" పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజ‌ర్‌లో "హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ శంభోశంక‌ర" అంటూ అఖండ రూపంతో తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మైన బాల‌య్య‌, "కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది కారుకూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్ది." అంటూ చేతిలోని త్రిశూలాన్ని నేల‌కేసి బ‌లంగా కొట్టి, త‌న‌పైకి వ‌చ్చిన దుండ‌గుల్ని దునుమాడి, "ఆ.." అని నోరుతెర‌చి భీక‌రంగా గ‌ర్జించ‌డం ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించేలా ఉంది. న‌ల్ల‌టి దుస్తులు, భుజాల‌ పైన ఎర్ర‌టి వ‌స్త్రం, మెడ‌లో ప‌లు రుద్రాక్ష మాల‌లు, నుదుటిన శివ‌నామం, చేతిలో త్రిశూలంతో బాల‌కృష్ణ రూపం అత్యంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూడ‌గానే ఆక‌ట్టుకుంటోంది. 'అఖండ' టైటిల్ రోర్ టీజ‌ర్‌కు ఎప్ప‌ట్లా త‌మ‌న్ త‌న సూప‌ర్బ్ బీజియంతో ప్రాణం పోశాడు. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ రామ్‌ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఇదివ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు 'సింహా'గా, 'లెజెండ్'‌గా బాల‌య్య‌ను ప‌రిచ‌యం చేసి, అద్భుత విజ‌యాలు సాధించిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను.. ఇప్పుడు ఆయ‌న‌ను 'అఖండ‌'గా మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోతోంది. 'లెజెండ్' మూవీ త‌ర్వాత ఆ స్థాయి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న బాల‌కృష్ణ‌కు 'అఖండ' ఆ కోరిక తీరుస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లిగిస్తోంది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తోన్న 'అఖండ' మూవీలో ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్. కెరీర్ మొద‌ట్లో నెగ‌టివ్ రోల్స్ చేశాక ఇప్పుడు మెయిన్ విల‌న్‌గా ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు శ్రీ‌కాంత్‌. వాస్త‌వానికి ఎన్టీఆర్ జ‌యంతి అయిన మే 28న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇదివ‌ర‌కు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. టీజ‌ర్‌లో రిలీజ్ డేట్ క‌నిపించ‌లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని విడుదల తేదీని పెండింగ్‌లో పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

తెలుగు సినిమా గ‌ర్వించే రీతిలో 'మేజ‌ర్‌'.. ప్రామిస్ చేస్తున్న టీజ‌ర్‌!

  "నాన్నా.. బోర్డ‌ర్‌లో ఆర్మీ ఎలా ఫైట్ చెయ్యాలి.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెల‌వాలి? అంద‌రూ ఆలోచిస్తారు. అదీ దేశ‌భ‌క్తే. దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని. వాళ్ల‌ను కాపాడ్డం సోల్జ‌ర్ ప‌ని." అని తండ్రి పాత్ర‌ధారి ప్ర‌కాశ్ రాజ్‌కు చెప్పాడు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌ధారి అడివి శేష్‌. సోల్జ‌ర్ కావాల‌నుకున్న త‌న ఆశ‌యాన్ని సందీప్‌ నెర‌వేర్చుకున్నాడు. అంతేకాదు.. ఆ పౌరుల‌ను కాపాడ‌టం కోసం త‌న ప్రాణాల‌ను ఇవ్వ‌డానికి అత‌ను ఏమాత్రం వెనుకాడ‌లేదు.  అందుకే ఫేమ‌స్ అయిన 26/11 ముంబై టెర్ర‌రిస్ట్ ఎటాక్ దాడుల్లో ఉన్నికృష్ణ‌న్ వీరోచితంగా టెర్ర‌రిస్టుల‌పై పోరాడాడు. వాళ్ల చెర‌లో చిక్కుకున్న అనేక‌మంది పౌరుల‌ను ర‌క్షించాడు. ఆ క్ర‌మంలో త‌న ప్రాణాల మీద‌కు వ‌చ్చినా ఏమాత్రం వెనుక‌డుగు వెయ్య‌లేదు. టెర్ర‌రిస్టుల గ‌న్స్ నుంచి వ‌చ్చిన తూటాలు త‌న శ‌రీరాన్ని తూట్లు పొడుస్తున్నా క‌ర్త‌వ్యాన్ని విస్మ‌రించ‌లేదు. అలాంటి గొప్ప దేశ‌భ‌క్తుడి జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'మేజ‌ర్' టీజ‌ర్ రిలీజైంది. ఒక‌టిన్న‌ర నిడివి క‌లిగిన ఆ టీజ‌ర్ చూస్తుంటే ఒళ్లు ఉద్వేగంతో, ఉత్తేజంతో గ‌గుర్పొడుస్తుంద‌నేది నిజం.  తెలుగు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ టీజ‌ర్‌ను వ‌రుసగా మ‌హేశ్‌బాబు, స‌ల్మాన్ ఖాన్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ విజువ‌ల్స్‌తో, ఒళ్లు జ‌ల‌ద‌రిపంజేసే, రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేసే యాక్ష‌న్ మూమెంట్స్‌తో సూప‌ర్బ్ అనిపిస్తోంది టీజ‌ర్‌. త‌న క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో మేజ‌ర్ ఎంత‌టి రిస్క్ చేశాడో, ఎంత‌టి ధైర్య‌సాహ‌సాలు, ప‌రాక్ర‌మం ప్ర‌ద‌ర్శించాడో చూస్తుంటే నిజంగానే రోమాలు నిక్క‌బొడుచుకుంటున్నాయి.  మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌గా అడివి శేష్ ఈ సినిమాతో యాక్ట‌ర్‌గా ఇంకో లెవ‌ల్‌కు చేరుకుంటాడ‌నే న‌మ్మ‌కాన్ని టీజ‌ర్ క‌లిగిస్తోంది. టెర్ర‌రిస్ట్ దాడుల్లో హోట‌ల్‌లో త‌న కుటుంబంతో చిక్కుబ‌డిపోయిన ఓ స్త్రీగా శోభిత క‌నిపించింది. మేజ‌ర్‌ను ప్రేమించిన అమ్మాయిగా స‌యీ మంజ్రేక‌ర్‌, మేజ‌ర్ త‌ల్లిదండ్రులుగా రేవ‌తి, ప్ర‌కాశ్‌రాజ్‌, మేజ‌ర్ పై ఆఫీస‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ టీజ‌ర్‌లో క‌నిపించారు. ముర‌ళీశ‌ర్మ, "మేజ‌ర్ అక్క‌డ ఎంత‌మందున్నారు?  మేజ‌ర్ సందీప్‌.. నువ్వ‌క్క‌డ ఉన్నావా?" అని వైర్‌లెస్‌లో అడిగితే, సందీప్ పాత్ర‌ధారిగా అడివి శేష్, "పైకి రాకండి. వాళ్ల సంగ‌తి నేను చూసుకుంటాను." అని చెప్పాడు. అప్ప‌టికే అత‌ని ఒళ్లు తూట్లు పడి ఉంది. అయిన‌ప్ప‌టికీ అత‌ను నిబ్బ‌రాన్ని కోల్పోలేదు. ఇలాంటి గ‌గుర్పాటు క‌లిగించే స‌న్నివేశాల‌తో 'మేజ‌ర్‌'ను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్కా రూపొందించాడ‌ని ఆశించ‌వ‌చ్చు. శ్రీ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్‌, వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్ర‌ఫీ 'మేజ‌ర్‌'కు మెయిన్ ఎస్సెట్స్ అనిపిస్తున్నాయి టీజ‌ర్ చూస్తుంటే. క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను అడివి శేష్ స్వ‌యంగా స‌మ‌కూర్చిన ఈ సినిమాకు రైట‌ర్ అబ్బూరి ర‌వి స్క్రిప్ట్ స‌హ‌కారం అందించడంతో పాటు డైలాగ్స్ రాశారు. సునీల్ రోడ్రిగ్స్ డిజైన్ చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ ఉద్వేగ‌భ‌రితంగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా తెలుగు సినిమా గ‌ర్వించే రీతిలో 'మేజ‌ర్' రూపొందుతోంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది. సోనీ పిక్చ‌ర్స్ ఫిలిమ్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏ ప్ల‌స్ య‌స్ మూవీస్ క‌లిసి నిర్మిస్తున్న 'మేజ‌ర్' మూవీ జూలై 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

టాప్‌‌ ఫామ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వాట్ ఎ క‌మ్‌బ్యాక్!

  ప‌వ‌ర్‌స్టార్ ప‌‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఎంత వైరం ఉండుగాక‌, త‌మ హీరోను ఆకాశానికెత్తేస్తూ ఎదుటి హీరోను ఎంత కించ‌ప‌రుస్తూ ఉండుగాక‌.. ఆ ఇద్ద‌రు స్టార్స్ మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయి. ఒక‌రంటే ఒక‌రికి అభిమానం. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా 'జ‌ల్సా'కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి అత‌నిపై త‌న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాడు మ‌హేశ్‌. పైగా మెగా ఫ్యామిలీతో మ‌హేశ్ ఎంత స‌న్నిహితంగా ఉంటాడో మ‌న‌కు తెలిసిందే. అలాగే సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మ‌హేశ్‌ను ప్ర‌శంసిస్తూ వ‌స్తున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. లేటెస్ట్‌గా మ‌రోసారి ప‌వ‌ర్‌స్టార్‌పై త‌న‌కు ఎంత‌టి అభిమాన‌ముందో చాటాడు మ‌హేశ్‌. ప‌వ‌న్ లేటెస్ట్ ఫిల్మ్ 'వ‌కీల్ సాబ్‌'ను త‌న ఏఎంబీ మాల్‌లో వీక్షించాడు మ‌హేశ్‌. నిజానికి తొలిరోజే సినిమాని చూడాల‌నుకున్నాడు కానీ వీలుప‌డ‌లేదు. ఈరోజు చూసి, ఎక్స‌యిట్ అయ్యాడు. 'వ‌కీల్ సాబ్' క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ న‌ట‌న‌కు ముగ్ధుడ‌య్యాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడ‌నీ, వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌ర్‌-ప్యాక్డ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌నీ ప్ర‌శంసించాడు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, "టాప్ ఫామ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'వ‌కీల్ సాబ్'‌లో ప‌వ‌ర్‌-ప్యాక్డ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వాట్ ఎ క‌మ్‌బ్యాక్." అంటూ చ‌ప్ప‌ట్లు కొడుతున్న చేతుల ఎమోజీలీను జోడించాడు. అందులోనే ప్ర‌కాశ్‌రాజ్ బ్రిలియంట్‌గా యాక్ట్ చేశాడ‌ని మెచ్చుకున్నాడు. ఆ ట్వీట్‌కు కొన‌సాగింపుగా మ‌రో ట్వీట్ వేశాడు. "అమ్మాయిలు నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల హృద‌యాన్ని స్పృశించే ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. త‌మ‌న్ టాప్ నాచ్ మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తం టీమ్‌కు అభినంద‌న‌లు." అంటూ డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు, నిర్మాణ సంస్థ శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, శ్రుతి హాస‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్ పి.ఎస్‌. వినోద్‌, బోనీ క‌పూర్‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించాడు. ఇప్ప‌టికే 'వ‌కీల్ సాబ్'‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ అన్న‌య్య చిరంజీవి, అబ్బాయ్ రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్స్ చేసిన విష‌యం తెలిసిందే. వాళ్లంటే ఇంట్లో మ‌నుషులు. కానీ వారికంటే 'వ‌కీల్ సాబ్'‌పైనా, ప‌వ‌న్ కల్యాణ్ ప‌ర్ఫార్మెన్స్ పైనా మ‌హేశ్ చేసిన ట్వీట్ మొత్తం సినిమా ఇండ‌స్ట్రీని ఆనందంలో ముంచెత్తింది. టాప్ స్టార్స్ మ‌ధ్య ఎలాంటి ఇగోలు లేని ఇలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌ని వారంతా అంటున్నారు. ఇద్ద‌రు స్టార్ల ఫ్యాన్స్ కూడా మ‌హేశ్ ట్వీట్‌కు సానుకూలంగా స్పందిస్తున్నారు. మ‌హేశ్ ఇలా ట్వీట్ చేశాడో లేదో, కొద్ది నిమిషాల వ్య‌వ‌ధిలోనే వేలాది లైక్స్‌, రిట్వీట్స్ పొందడం విశేషం.

తొలి రోజు ఐదో స్థానంలో 'వ‌కీల్ సాబ్'‌

  ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వ‌కీల్ సాబ్' మూవీ తొలిరోజు ఊహించ‌న‌ట్లే భారీ వ‌సూళ్లు సాధించింది. అన్యాయానికి, అఘాయిత్యానికీ గురైన ముగ్గురు అతివ‌ల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో వారి త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకొనే లాయ‌ర్‌గా ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.25 కోట్ల షేర్ సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో ఈ మూవీ ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ డేకి సంబంధించి టాలీవుడ్ టాప్ 5 గ్రాస‌ర్‌గా నిలిచిన‌ట్ల‌యింది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టిక్కెట్ రేట్లు పెంచ‌డానికి అనుమ‌తి ల‌భించినా, ఎక్స్‌ట్రా షోస్‌కు అనుమ‌తించినా ఈజీగా టాప్ 4గా నిలిచి ఉండేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం టాప్ 4 ప్లేస్‌లో మ‌హేశ్ సినిమా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ఉంది. దానికి ఫ‌స్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే చాలా త‌క్కువ మార్జిన్‌లో 'వ‌కీల్ సాబ్' ఐదో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.  ఇక 'బాహుబ‌లి 2' మూవీ రూ. 43 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉండ‌గా, 'సైరా.. న‌ర‌సింహారెడ్డి' రూ. 38.75 కోట్ల‌తో రెండో స్థానంలో, 'సాహో' మూవీ రూ. 36.52 కోట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాయి. ఏదేమైనా ఫ‌స్ట్ డేకి సంబంధించి 'వ‌కీల్ సాబ్' ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేసింది. తెలంగాణ‌లో రూ. 8.75 కోట్లు, ఆంధ్ర‌లో రూ. 19 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 4.5 కోట్ల‌ను 'వ‌కీల్ సాబ్' వ‌సూలు చేసింది. మూడు ఏరియాల క‌లెక్ష‌న్ చూస్తే, ఒక్క ఆంధ్ర‌లోనే 58.9 శాతం వ‌సూలవ‌డం విశేషంగా భావించాలి.  ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రెండు రాష్ట్రాల్లో రూ. 80.5 కోట్ల‌ని అంచ‌నా. అంటే తొలి రోజే 40 శాతం రిక‌వ‌రీ అయ్యింద‌న్న మాట‌. వీకెండ్‌లోగా 80 శాతం పైనే రిక‌వ‌ర్ అవుతుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే జ‌రిగితే ఫ‌స్ట్ వీక్‌లోనే 'వ‌కీల్ సాబ్' బ్రేకీవెన్ అయ్యే అవ‌కాశం ఉంది.

రేపు సాయంత్రం థియేట‌ర్‌లో 'వ‌కీల్ సాబ్' చూస్తున్నా!

  ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' మూవీ కోసం ఫ్యాన్స్‌, సినీ ప్రియులు మాత్ర‌మే కాదు, అన్న‌య్య చిరంజీవి కూడా ఎంతో ఆత్రుత‌తో, ఉత్కంఠ‌త‌తో ఎదురుచూస్తున్నారు. త‌న ఆత్రుత‌ను బ‌య‌ట‌కు వ్య‌క్తీక‌రించ‌కుండా ఆయ‌న ఉండ‌లేక‌పోయారు. గురువారం సాయంత్రం త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసున్న ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. అది ఏదో మామూలు ఫొటో కాదు. క‌ల్యాణ్‌కు చిరు స్వ‌యంగా దువ్వెన‌తో జుట్టు స‌రిచేస్తున్న ఫొటో అది. ఆ అరుదైన ఫొటోను షేర్ చేసిన చిరంజీవి, "చాలా కాలం తరువాత ప‌వ‌న్ కల్యాణ్‌ని వెండితెర మీద చూడటానికి  మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను. Can't wait to share my response of the film with you all. Stay tuned." అని ఆయ‌న రాసుకొచ్చారు.  నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ పోస్ట్‌కు వేలాది లైక్స్‌, రిట్వీట్స్ వ‌చ్చాయి. చిరు షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అయ్యింది. వ్యక్తిత్వం, వ్య‌వ‌హార శైలి రీత్యా చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర‌స్ప‌రం చాలా భిన్న‌మ‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. చిరంజీవిది స్వ‌త‌హాగా మెత‌క స్వ‌భావ‌మైతే, క‌ల్యాణ్‌ది దుడుకు స్వ‌భావం. త‌న దుడుకు స్వ‌భావంతో క‌ల్యాణ్ ప‌లు వివాదాల్లో చిక్కుకోవ‌డం మ‌న‌కు తెలుసు. అయితే కొంత కాలంగా ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో మార్పు వ‌చ్చిందనేది నిజం.  2018 సంక్రాంతికి వ‌చ్చిన 'అజ్ఞాత‌వాసి' మూవీ త‌ర్వాత మూడేళ్ల విరామంతో 'వ‌కీల్ సాబ్' సినిమాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌టంతో చిరంజీవి సైతం క్యూరియాసిటీతో ఉన్నారు. ట్రైల‌ర్ త‌న‌కు బాగా న‌చ్చింద‌నీ, వ‌కీల్ సాబ్ గెట‌ప్‌లో క‌ల్యాణ్ ఆక‌ట్టుకున్నాడ‌నీ ఇప్ప‌టికే చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడు ఆ సినిమాని త‌న ఫ్యామిలీతో రేపు సాయంత్రం చూస్తాన‌ని సోష‌ల్ మీడియా సాక్షిగా వెల్ల‌డించ‌డంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి హ‌ద్దు లేకుండా పోయింది.

'పుష్ప' టీజ‌ర్‌.. బన్నీ కాదు బీస్ట్‌!

  మైండ్‌బ్లోయింగ్‌.. టెర్రిఫిక్‌.. ఫెంటాస్టిక్‌.. బీస్ట్‌.. 'పుష్ప' టీజ‌ర్ చూసి జ‌నాల నుంచి, ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట‌లు! వాటిలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేద‌ని ఆ టీజ‌ర్ చూసిన వాళ్ల‌కు ఎవ‌రికైనా అనిపిస్తుంది. టీజ‌ర్ టెర్రిఫిగ్గా ఉంటే, బ‌న్నీ బీస్ట్ లాగా క‌నిపించాడ‌న్న‌ది నిజం. డైరెక్ట‌ర్ సుకుమార్ విజ‌న్ ఫెంటాస్టిక్ అన‌డానికి పుష్ప‌రాజ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌రే నిద‌ర్శ‌నం. 'రంగ‌స్థ‌లం' త‌ర్వాత అలాంటి సినిమా మ‌ళ్లీ సుకుమార్ తీస్తాడా.. అని అనేక‌మంది సందేహాలు వ్య‌క్తం చేస్తున్న సంద‌ర్భంలో పుష్ప క్యారెక్ట‌రైజేష‌న్ చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పాటు క‌లుగుతోంది. పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ యాక్ష‌న్ చూస్తుంటే రోమాలు నిక్క‌బొడుచుకుంటున్నాయి. సినిమా మీద బ‌న్నీకి ఉన్న డెడికేష‌న్‌కు నిఖార్స‌యిన నిద‌ర్శ‌నం పుష్ప రోల్ అని చెప్ప‌డానికి వెనుకాడాల్సిన ప‌నిలేదు. 'రంగ‌స్థ‌లం'లో చెవిటివాడిగా లుంగీ క‌ట్టుకొని అతి సామాన్యంగా క‌నిపించిన రామ్‌చ‌ర‌ణ్‌ను చూసి స‌ర్‌ప్రైజ్ అయిన మ‌నం, దానికి రెట్టింపు ర‌గ్డ్ లుక్‌లో, బ‌విరి గ‌డ్డం, పాపిడి తీసి ప‌క్క‌కు దువ్విన క్రాఫుతో డీగ్లామ‌ర్డ్ లుక్‌లో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీని చూసి మ‌రింత ఆశ్చ‌ర్య చ‌కితుల‌మ‌య్యాం. సినిమా అంతా క‌నిపించ‌డానికి ఎంత ధైర్యం కావాలి! ఆ ధైర్యం చేశాడు బ‌న్నీ. నైట్ టైమ్ ప‌డ‌వ మీద నిల్చొని లాంత‌రు ప‌ట్టుకొని చూస్తున్న బ‌న్నీని బీస్ట్ అని కాకుండా ఎలా అభివ‌ర్ణించాలి! ఇక పాద‌ర‌సంలాగానో, మెరుపులాగానో అత్యంత వేగంగా క‌దులుతూ అత‌డు చేసిన ఫైట్స్‌కు ఫ్యాన్స్‌, మాస్ ఆడియెన్స్ పిచ్చెక్కిపోకుండా ఉంటారా? "త‌గ్గేది లే" అంటూ ఎర్ర‌చంద‌నం దుంగ‌ను లారీపైకి విసిరేస్తూ ఎగిరిన పుష్ప నాలుక మ‌డ‌త‌పెడితే బాక్సాఫీస్ షేక్ అవ‌కుండా ఎలా ఉంటుందో చూడాలి! 80 సెక‌న్ల ఈ టీజ‌ర్‌లో హీరోయిన్ ర‌ష్మిక మెరుపులా ఇలా క‌నిపించి అలా మాయ‌మైంది. 'రంగ‌స్థ‌లం'లో స‌మంత త‌ర‌హాలోనే ఆమె లుక్ క‌నిపిస్తోంది. పుష్పతో ఆమె కెమిస్ట్రీ ఇర‌గ‌దీసేయ‌కుండా ఉంటుందా! ఈ టీజ‌ర్‌లో బ‌న్నీ కాకుండా ఎట్రాక్ట్ చేసిన మ‌రో రెండు విష‌యాలు.. దేవి శ్రీ‌ప్ర‌సాద్ బీజియం, మిరోస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్ర‌ఫీ. ఆ విజువ‌ల్ బ్యూటీని చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వ‌న్న‌ట్లు ఉంది కెమెరా ప‌నిత‌నం. ప్ర‌తి ఫ్రేమూ ఒక క‌థ చెప్తున్న‌ట్లే ఉంది. దానికి త‌గ్గ‌ట్లు దేవి బ్యాగ్రౌండ్ స్కోర్‌! ఇలాంటి విజువ‌ల్ కావాల‌నే విజ‌న్ ఉంది చూశారూ.. అది సుకుమార్ విజ‌న్ కాకుండా మ‌రొక‌రిది ఎలా అవుతుంది. త‌న సామ్రాజ్య‌మైన జంగిల్‌లో పుష్ప ఎలా చెల‌రేగిపోతాడో ఊహించి తెర‌మీద గీశాడు సుక్కు. ఏప్రిల్ 8 బ‌న్నీ బ‌ర్త్‌డేకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు! బ‌న్నీ ఫ్యాన్స్ ఇంత‌కంటే ఎక్కువ అడుగుతారా! పండ‌గ చేసుకుంటున్నారు. ఆగ‌స్ట్ 13 ఎప్పుడు వ‌స్తుందా, మొత్తం 'పుష్ప' మెరుపుల్నీ, ఉరుముల్నీ ఎప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీ ఇప్పుడు మ‌రింత ఎక్కువైంది వాళ్ల‌కు. అంత‌దాకా ఎలా ఆగాలో వాళ్ల‌కు తెలీడం లేదు. అట్లా 'పుష్ప' టీజ‌ర్‌తో వాళ్ల‌కి వెర్రెత్తించారు బ‌న్నీ, సుక్కు జోడీ!!

శ్రీ‌దేవితో పెళ్లి ప్ర‌పోజ‌ల్‌ను క‌మ‌ల్ హాస‌న్ ఎందుకు తిర‌స్కరించాడు?

  క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌దేవి హిట్ పెయిర్‌గా వెండితెర‌ను ఏలారు. వారి జోడీ ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల పంట‌. 'వ‌సంత కోకిల'‌లో ఆ ఇద్ద‌రి న‌ట‌న చూసి ఉద్వేగం చెంద‌ని వారెవ‌రు? 'ఆక‌లి రాజ్యం', 'ఒక రాధ ఇద్ద‌రు కృష్ణులు' సినిమాల్లో వారి రొమాన్స్ చూసి ముచ్చ‌ట‌ప‌డ‌ని వాళ్లెవ‌రు? ఇక త‌మిళంలో అయితే మ‌రిన్ని సినిమాలు జంట‌గా చేసి, ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. హిందీలోనూ 'స‌ద్మా' లాంటి సినిమాలు చేశారు. దాంతో ఆ ఇద్ద‌రూ నిజ జీవితంలోనూ జంట అయితే ఎంత బాగుంటుందోన‌ని అప్ప‌టి వారి ఫ్యాన్స్ ఆశించారు. పైగా శ్రీ‌దేవి కుటుంబంతో క‌మ‌ల్ చాలా స‌న్నిహితంగా మెల‌గేవాడు. అందుకే ఆమెను పెళ్లిచేసుకొమ్మ‌ని స్వ‌యంగా శ్రీ‌దేవి త‌ల్లి క‌మ‌ల్‌ను అడిగార‌నే విష‌యం మీకు తెలుసా? చాలా మంది షాకింగ్‌గా అనిపించ‌వ‌చ్చు కానీ, ఇది నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌మ‌ల్ వెల్ల‌డించారు. శ్రీ‌దేవి క‌న్నుమూశాక‌, ఆమెకు నివాళి అర్పించేందుకు ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్‌లో 'శ్రీ‌దేవి 28 అవ‌తారాలు' అనే టైటిల్‌తో రాసిన ఓ నోట్‌ను ప్రెజెంట్ చేశారు క‌మ‌ల్‌. అందులో ఆ విష‌యం కూడా ఉంది. శ్రీ‌దేవి, క‌మ‌ల్ చాలా స‌న్నిహితంగా మెల‌గుతుండ‌టంతో శ్రీ‌దేవి త‌ల్లికి కూడా ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని అనిపించింది. అందుకే త‌న కూతుర్ని పెళ్లి చేసుకొమ్మ‌ని ఆమె అడిగారు. కానీ క‌మ‌ల్ ఆమె ప్ర‌పోజ‌ల్‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు. ఎందుకంటే శ్రీ‌దేవిని త‌న తోబుట్టువులా భావించేవాడిన‌నీ, అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేన‌ని చెప్పాన‌నీ క‌మ‌ల్ వెల్ల‌డించారు. తెర‌పై శ్రీ‌దేవితో తాను ప‌లు ల‌వ్ సీన్స్‌లో న‌టించినందువ‌ల్ల త‌మ అభిమానులు నిజ జీవితంలోనూ త‌మ మ‌ధ్య అలాంటి అనుబంధం ఉండేదని ఊహించుకొనేవార‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఇలాంటి రూమ‌ర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి తానెప్పుడూ ప్ర‌య‌త్నిస్తూ వ‌చ్చాన‌ని తెలిపారు. నిజానికి తానంటే శ్రీ‌దేవికి చాలా గౌర‌వ‌మ‌నీ, త‌ను మృతి చెందేదాకా కూడా త‌న‌ను సార్ అంటూ పిలిచేద‌నీ క‌మ‌ల్ గుర్తు చేసుకున్నారు. దీన్ని బ‌ట్టి క‌మ‌ల్‌, శ్రీ‌దేవి మ‌ధ్య బంధం ఎంత స్వ‌చ్ఛంగా ఉండేదో అర్థం చేసుకోవాల్సిందే. ఇప్ప‌టికీ తెర‌పై ఆ ఇద్ద‌రినీ చూడ్డం మ‌న‌కు క‌న్నుల పంటే!

పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చిన హ‌రితేజ‌!

  టీవీ యాంక‌ర్‌, సినీ న‌టి, బిగ్ బాస్ ద్వారా సూప‌ర్ పాపులారిటీ సంపాదించుకున్న హ‌రితేజ పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ శుభ‌వార్త‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించారు. భ‌ర్త‌తో క‌లిసున్న ఫొటోను షేర్ చేసి, దానిపై "Its a baby girl" అని రాశారు. ఇన్‌స్టా స్టోరీలో అదే ఫొటోను షేర్ చేసి "ఊ ల‌-లా" అనే క్యాప్ష‌న్ పెట్టారు. ఏప్రిల్ 5న త‌న‌కు పాప పుట్టిన‌ట్లు ఆమె తెలిపారు. హ‌రితేజ ఈ పోస్ట్ పెట్టిన వెంట‌నే ఇండ‌స్ట్రీలోని ఆమె స‌న్నిహిత స్నేహితులు శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, సింగ‌ర్ దిన‌క‌ర్‌, ఆర్జే చైతు, స‌మీరా భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు ఆమెకు విషెస్ తెలియ‌జేశారు. లాక్‌డౌన్ టైమ్‌లో తాను ప్రెగ్నెంట్ అయిన‌ట్లు హ‌రితేజ ప్ర‌క‌టించారు. అప్ప‌ట్నుంచీ త‌ర‌చూ త‌న ఎత్త‌యిన పొట్ట‌ను ప్ర‌ద‌ర్శిస్తూ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలు షేర్ చేస్తూ వ‌స్తున్నారు. ఇవి ఆమె ఫ్యాన్స్‌ను ఆనంద‌ప‌రుస్తూ వ‌చ్చాయి. మొద‌ట టెలివిజ‌న్ తెర‌పై త‌న ప్ర‌తిభ‌ను చూపించి, ఆ త‌ర్వాత వెండితెర‌పైనా రాణిస్తూ వ‌స్తోన్న హ‌రితేజ 2015లో దీప‌క్ రావును పెళ్లాడారు. ద‌మ్ము, 1.. నేనొక్క‌డినే, అ ఆ, దువ్వాడ జ‌గ‌న్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్‌, అర‌వింత స‌మేత‌, స‌మ్మోహ‌నం, ప్ర‌తి రోజూ పండ‌గే లాంటి సినిమాల్లో చేసిన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు స‌న్నిహిత‌మ‌య్యారు.

'వైల్డ్ డాగ్'‌ను త‌క్కువగా ఊహించాను.. చూశాక గూస్‌బ‌మ్స్ వ‌చ్చాయి!

  "నాగ్ అంటే సాంగ్స్‌, కామెడీ, రొమాంటిక్ సీన్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇవేవీ ఉండ‌వు కాబ‌ట్టి సినిమా డ్రైగా ఉంటుంద‌నే త‌క్కువ భావంతోనే నిన్న 'వైల్డ్ డాగ్'‌ చూసిన నాకు ఒక ఎడ్రిన‌ల్ ర‌ష్ లాగా ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగింది." అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలో ఏసీపీ విజ‌య్‌వ‌ర్మ‌గా నాగార్జున న‌టించిన 'వైల్డ్ డాగ్' మూవీ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ సినిమాని ఆదివారం ప్ర‌త్యేకంగా వీక్షించారు చిరంజీవి. ఆ సినిమా త‌న‌కిచ్చిన అనుభ‌వం, అనుభూతుల‌ను పంచుకోవ‌డానికి సోమ‌వారం నాగార్జున‌తో క‌లిసి మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. "వైల్డ్ డాగ్ చూసిన త‌ర్వాత మ‌నంద‌రం గొప్ప‌గా ఫీల‌య్యే గొప్ప సినిమాగా నేను ఫీల‌వుతున్నాను. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి దీని గురించి చెప్తున్న‌ప్ప‌టికీ పెద్ద క్యూరియాసిటీ ఈ సినిమా మీద నాకు లేదు. గోకుల్ చాట్‌లో జ‌రిగిన ఓ వాస్త‌వ క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు కాబ‌ట్టి బ్లాండ్‌గా, డ్రైగా ఉంటుంద‌ని అనుకున్నాను. అయితే సినిమా చూస్తుంటే ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా అనిపించింది. ఇంట‌ర్వెల్ ద‌గ్గ‌ర కూడా ఆప‌కుండా ఈ సినిమాని చూశాను. దాన్ని బ‌ట్టి ఈ సినిమా చూస్తుంటే నాలోని ఇంట్రెస్ట్ చివ‌రిదాకా ఎలా కొన‌సాగిందనేది నేను మాటల్లో చెప్ప‌లేను. వెంట‌నే నాగ్‌కు ఫోన్ చేసి, "ఏం సినిమా ఇది.. ఎందుకు దీన్ని లో ప్రొఫైల్‌లో ఉంచారో అర్థం కావ‌ట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా." అని చెప్పాను." అని ఆయ‌న‌న్నారు. ఎక్క‌డా ఇంట్రెస్ట్ డాప‌వ‌కుండా క్ర‌మేణా ఉత్కంఠ‌ను పెరుగుతూ పోయి కుర్చీలో మునివేళ్ల‌మీద కూర్చుని సినిమా చూశానంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు, వాస్త‌వమ‌నీ చిరంజీవి అన్నారు. "నిజం చెప్పాలంటే ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు లేరు. ఈ సినిమా చూస్తూ ఆనందిస్తూ, ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులు మాట్లాడారు. వాళ్ల‌తో పాటు నేను కూడా ఈ సినిమా టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. వాస్త‌వానికి చాలా ద‌గ్గ‌ర‌గా, స‌హ‌జంగా ఈ సినిమాని తీశారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్ మీద తీసిన 'యూరి' సినిమాకి దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భించాయి, అవార్డులు కూడా వ‌చ్చాయి. ఆ సినిమాని చూసిన‌ప్పుడు ఇలాంటి సినిమాలు మ‌నం ఎందుకు చెయ్య‌లేక‌పోతున్నాం, మ‌నం క‌మ‌ర్షియ‌ల్ ట్రాప్‌లోకి ప‌డిపోయామా, కొంచెం పక్క‌కువెళ్లి సినిమాలు ఎందుకు చెయ్య‌ట్లేదు అనే భావ‌న‌లో ఉన్న నాకు.. ఎప్పుడూ ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెరైటీ సినిమాలు చేసే అభిరుచి ఉన్న గొప్ప ఆర్టిస్ట్ అయిన నాగార్జున ఇలాంటి సినిమా చెయ్య‌డం అన్న‌ది నేను చాలా గ‌ర్వంగా ఫీల‌య్యాను." అని ఆయ‌న‌న్నారు. తెలుగువాళ్లం కూడా ఇలాంటి సినిమాలు అత్య‌ద్భుతంగా తియ్య‌గ‌లం అని నిరూపించిన సినిమా 'వైల్డ్ డాగ్' అని చిరంజీవి చెప్పారు. "ఈ సినిమాలోని కొన్ని వార్ సీక్వెన్స్‌లు, గ‌న్ ఫైట్లు, స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఎపిసోడ్ లాంటివి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా చూస్తూ ఓ భార‌తీయుడిగా ఎమోష‌న్‌ను ఫీల‌య్యాను. టెర్ర‌రిస్ట్ అయిన విల‌న్ చాలా చుల‌క‌న‌గా ఇండియ‌న్ సిస్ట‌మ్ గురించి మాట్లాడితే, విజ‌య్‌వ‌ర్మ క్యారెక్ట‌ర్‌లో నాగ్ చెప్పిన డైలాగ్స్ చూసి క్లాప్స్ కొట్టేశాను. ఈ మాట‌లు చెప్తుంటే కూడా నాకు గూస్‌బ‌మ్స్ వ‌స్తున్నాయి." అని తెలిపారు చిరంజీవి.

నెట్‌ఫ్లిక్స్‌.. ఉర్రూత‌లూగించే ఐదు చైనీస్ రొమాంటిక్ డ్రామాస్‌!

  ల‌వ్ ట్ర‌యాంగిల్స్ నుంచి హై స్కూల్ ప్రేమ‌లు, ఫేక్ రిలేష‌న్‌షిప్స్ దాకా చైనీస్ రొమాంటిక్ డ్రామాలు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చైనీస్ డ్రామాల‌కు పాపులారిటీ ఎక్కువ‌. అందువ‌ల్ల ఏ షోలు అన్నింటికంటే చూడ‌ద‌గ్గ‌వ‌ని ఎంచ‌డం అంత ఈజీ కాదు. అయితే రొమాంటిక్ కామెడీల‌ను ఇష్ట‌ప‌డే ఔత్సాహిక వీక్ష‌కుల కోసం ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఐదు ఎక్స‌లెంట్ రొమాంటిక్ చైనీస్ డ్రామా సిరీస్‌లేవో చూద్దాం... 1. మీటీయ‌ర్ గార్డెన్ (2018) ప్ర‌ధానాంశం: ఒక సాధార‌ణ అమ్మాయి ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క స్కూల్లో చ‌దువుకోవ‌డానికి వ‌స్తే, అక్క‌డ ఎఫ్‌-4 అని పిల‌వ‌బ‌డే న‌లుగురు అంద‌మైన‌, సంప‌న్న‌కుటుంబాల‌కు చెందిన కుర్రాళ్ల‌ను ఫేస్ చేస్తుంది. తారాగ‌ణం:  డైలాన్ వాంగ్‌, షెన్ యూ, కేస‌ర్ వు, డారెన్ చెన్‌, కాన‌ర్ లియాంగ్‌ డైరెక్ట‌ర్‌:  హెర్‌-లాంగ్ లిన్‌ ఐఎండీబీ రేటింగ్‌: 8.1 2. ఎ లిటిల్ థింగ్ కాల్డ్ ఫ‌స్ట్ ల‌వ్ (2019) ప్ర‌ధానాంశం:  మొహ‌మాటస్తురాలైన ఓ హైస్కూల్ అమ్మాయి పాపుల‌ర్ అయిన త‌న సీనియ‌ర్‌ను ప్రేమించి, ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది ఆస‌క్తిక‌రం. తారాగ‌ణం:  వీ చాయ్‌, జిన్ మ‌య్ జాహో, కువాన్‌-లిన్ లాయ్‌, బోవెన్ వాంగ్‌, రుంజే వాంగ్‌ డైరెక్ట‌ర్‌:  ఝియావోహుయ్ ఖీ ఐఎండీబీ రేటింగ్‌: 8.0 3. ఐ హియ‌ర్ యు (2019) ప్ర‌ధానాంశం: ఒక మృదు స్వ‌భావి అయిన యువ‌కుడు, ఒక ఉద్రేక స్వ‌భావురాలైన యువ‌తికి మ‌ధ్య ఫోర్స్‌డ్ రిలేష‌న్‌షిప్ ఎలా ఉంటుందో తెలియ‌జేసే క‌థ‌లో ఫ్రెండ్‌షిప్‌, మ్యూజిక్‌, కామెడీ, రొమాన్స్ ఆక‌ట్టుకుంటాయి. తారాగ‌ణం:  లూసీ ఝావో, రిలీ వాంగ్‌, గ్రాటిట్యూడ్ దాయ్‌, జియాంగ్ మిన్ ఝాంగ్‌ డైరెక్ట‌ర్‌: స‌న్నీ సు ఐఎండీబీ రేటింగ్‌: 7.3 4. యాక్సిడెంట‌ల్లీ ఇన్ ల‌వ్ (2018) ప్ర‌ధానాంశం: ఒక అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి త‌న గుర్తింపును మార్చుకున్న ఓ అమ్మాయి నెమ్మ‌దిగా ఒక పాప్ స్టార్ ప్రేమ‌లో ప‌డటం, డ‌బుల్ లైఫ్‌ను గ‌డ‌ప‌డం ఈ సిరీస్ ఇతివృత్తం. తారాగ‌ణం:  జున్‌చెన్ గువో, యి నింగ్ సున్‌, యిఖిన్ ఝావో ఐఎండీబీ రేటింగ్‌: 7.6 5. వెల్‌-ఇంటెండెడ్ ల‌వ్ (2019) ప్ర‌ధానాంశం:  మిగ‌తా నాలుగు రొమాంటిక్ డ్రామాల‌తో పోలిస్తే ఇది కొంచెం సెంటిమెంట‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా న‌డుస్తుంది. కార‌ణం ప్ర‌ధాన పాత్ర‌ధారి ఒక పేషెంట్ కావ‌డం. అయితే ఇది కేవ‌లం మెలోడ్రామా కాదు. బాగా ఎంట‌ర్‌టైన్ చేసే క‌థ‌. ల‌వ్ ట్ర‌యాంగిల్స్ మేళ‌వించిన కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ అల‌రిస్తుంది. తారాగ‌ణం:  క్జు కై చెంగ్‌, ల్యూ జియా క్జి, హువాంగ్ ఖియాన్ షువో, వాంగ్ షువాంగ్‌, ఇయాన్ యి డైరెక్ట‌ర్‌:  ఖియాంగ్ వూ ఐఎండీబీ రేటింగ్‌: 7.4

'వైల్డ్ డాగ్'‌ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌.. పూర్‌!

  అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ చేసిన 'వైల్డ్ డాగ్' మూవీ ఫ‌స్ట్ డే ఆశించిన రేంజ్‌లో వ‌సూళ్ల‌ను సాధించ‌డంలో విఫ‌ల‌మైంది. రైట‌ర్ అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా మార్చి 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 1.21 కోట్ల షేర్ వ‌చ్చింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణ‌లో రూ. 53 ల‌క్ష‌లు, ఆంధ్ర‌లో రూ. 49 ల‌క్ష‌లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 19 ల‌క్ష‌ల షేర్ సాధించింది 'వైల్డ్ డాగ్'‌ మూవీ.  అంటే ప్రి బిజినెస్‌తో పోలిస్తే ఫ‌స్ట్ డే ఈ సినిమాకు కేవ‌లం 13.6 శాతం రిక‌వ‌రీ అయ్యింది. 'వైల్డ్ డాగ్'‌ ప్రి బిజినెస్ వాల్యూ దాదాపు రూ. 8.9 కోట్లు ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పాయి. ఫ‌స్ట్ డే క‌నీసం రూ. 2 కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశాయి ఆ వ‌ర్గాలు. ఇవి పూర్ ఓపెనింగ్స్ అని ఆ వ‌ర్గాలు అంటున్నాయి. ఆంధ్ర ఏరియాలో దాదాపు రూ. 4 కోట్ల ప్రి బిజినెస్ జ‌ర‌గ‌గా, రూ. 49 ల‌క్ష‌ల షేర్ రావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. నైజాంలో బెట‌ర్‌గా క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇక్క‌డ బ‌య్య‌ర్లు రూ. 2.5 కోట్ల‌ను వెచ్చించ‌గా, రూ. 53 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండ‌టంతో క‌లెక్ష‌న్ల‌లో అది రిఫ్లెక్ట్ అవుతుంద‌ని ప్రొడ్యూస‌ర్స్‌, బ‌య్య‌ర్స్ ఆశించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఈ రోజు, రేపు క‌లెక్ష‌న్లు క‌చ్చితంగా పెరుగుతాయ‌ని వారు భావిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నాగ్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌, ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వీకెండ్ క‌లెక్ష‌న్ల‌ను ఇవి పెంచుతాయేమో చూడాలి.

సినిమా సెట్టింగా.. జెనీలియా ఇల్లా!

  ఇటీవ‌ల రోల‌ర్‌-బ్లేడింగ్ నేర్చుకుంటుండ‌గా జెనీలియా ఎడ‌మ చేతికి గాయ‌మైంది. దీంతో జుట్టు ముడేసుకోవాల‌న్నా, పోనీ టైల్ క‌ట్టుకోవాల‌న్నా జెనీలియాకు క‌ష్ట‌మైపోయింది. ఈ సంద‌ర్భంగా జెనీలియాను కుర్చీలో కూర్చోబెట్టి, ఆమె భ‌ర్త రితీష్ దేశ్‌ముఖ్ ఆమెకు పోనీ టైల్ వేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది అభిమానుల హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. ఇదే వీడియో ముంబైలోని జెనీలియా ఇల్లు ఎలా ఉంటుందో కూడా మ‌న‌కు చూపించింది. అతి పెద్ద ఆ భ‌వంతిని చూస్తే లార్జ‌ర్‌-దేన్‌-లైఫ్ హోమ్ అనిపించ‌క మాన‌దు. స‌ర్క్యుల‌ర్ బీమ్స్‌, వైడ్ డోర్స్‌, స్ప్లిట్ స్టైర్‌కేస్ లాంటి వాటిని చూస్తుంటే, సినిమాల్లో చూపించే భారీ ఇంటి సెట్టింగ్స్ గుర్తుకు వ‌స్తాయి. మెట్ల‌కు ఎదురుగా గోడ మీద మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఫొటో క‌నిపిస్తుంది. ఆయ‌న జెనీలియా మామ‌గారు. ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో మాదిరిగానే జెనీలియా-రితీశ్ ఇంట్లో ఫొటో షూట్ కోసం నిర్దేశించిన స్టూడియో కూడా ఉంది. ఫొటో స్పాట్‌లో బ్లాక్ వాల్ అందంగా క‌నిపిస్తుంది. అక్క‌డ్నుంచి తీయించుకున్న ప‌లు ఫొటోలు జెనీలియా ఇన్‌స్టా హ్యాండిల్‌లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆ ఇంటిని 18వ శ‌తాబ్దం నాటి లుక్‌తో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ క‌ట్టించారు. అయితే ఆయ‌న మృతి చెందాక‌, త‌మ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు ఇంటీరియ‌ర్‌ను మోడ‌ర‌న్ ఫ‌ర్నిచ‌ర్‌తో, డిజైన్స్‌తో తీర్చిదిద్దుకున్నారు జెనీలియా, రితీశ్ క‌పుల్‌. అయితే వైట్ బీమ్స్‌, వెడ‌ల్పాటి డోర్స్‌ను మాత్రం అలాగే ఉంచేశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, యాక్ట‌ర్ కావ‌డానికి ముందు రితీశ్ ఆర్కిటెక్చ‌ర్‌లో డిగ్రీ చేశాడు. అందువ‌ల్ల భార్య ఆస‌క్తుల‌కు అనుగుణంగా ఇంటీరియ‌ర్‌ను అత‌ను తీర్చిదిద్దాడు. ఒక్క‌సారి వాళ్ల అంద‌మైన భ‌వంతి లోప‌ల ఎలా ఉంటుందో లుక్కేద్దాం...

'వ‌కీల్ సాబ్' ప్రివ్యూ.. ఎనిమిదేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ ప్రభంజ‌నం?

  ప‌వ‌ర్‌స్టార్ ప‌‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా క్రేజ్ ఎలాంటిదో మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపిస్తోంది. 2018 సంక్రాంతికి 'అజ్ఞాత‌వాసి' సినిమా వ‌చ్చి వెళ్లాక పవ‌న్ క‌ల్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావ‌డంతో మూడేళ్ల పాటు ఆయ‌న ఫ్యాన్స్ చాలా వెలితి ఫీల‌వుతూ వ‌చ్చారు. ఇప్పుడు 'వ‌కీల్ సాబ్' సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో వారికి పెద్ద పండ‌గ వ‌స్తున్నంత సంబ‌రంగా ఉంది. ఏప్రిల్ 9న 'వ‌కీల్ సాబ్' ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు.  ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు ట్రైల‌ర్ రిలీజ్ అవుతుండ‌టంతో అంద‌రి దృష్టీ ఆ మూమెంట్ మీదే ఉంది. ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతోంది, శాంపుల్ సీన్స్‌లో ప‌వ‌న్ ఎలా చెల‌రేగుతాడు?.. అనే క్యూరియాసిటీ అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. ఫ్యాన్స్ అయితే సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ గురించి తెగ హంగామా సృష్టిస్తున్నారు. ట్రైల‌ర్‌ను ఎలా వైర‌ల్ చేయాల‌ని డిస్క‌స్ చేసుకుంటున్నారు. ట్రైల‌ర్ రాక‌ముందే #VakeelSaabTrailerDay అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చిందంటే ఫ్యాన్స్ ఎంత ఆక‌లిగా ఉన్నారో ఊహించ‌వ‌చ్చు. ఇక ట్రైల‌ర్ వ‌స్తే ఆ హంగామా ఏం రేంజ్‌లో ఉంటుందో మ‌రి! ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్'‌ లుక్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టి దాకా మూడు పాట‌లు రిలీజ్ చేస్తే, "మ‌గువా మ‌గువా" సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇన్‌ఫ్యాక్ట్.. విమెన్స్ డేకి ఎక్క‌డకు వెళ్లినా ఆ పాటే వినిపించింది. అంత‌గా లేడీస్ ఆ సాంగ్‌ను సొంతం చేసుకున్నారు. త‌మ‌న్ మ్యూజిక్‌, రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్‌, సిద్ శ్రీ‌రామ్ వాయిస్ ఆ సాంగ్‌కు సూప‌ర్బ్ క్రేజ్ తెచ్చాయి. అందుకే ఆ సాంగ్‌కు 45 మిలియ‌న్ వ్యూస్ వచ్చాయి.  ‌ అయితే ఆ త‌ర్వాత రిలీజ్ చేసిన "స‌త్య‌మేవ జ‌య‌తే" సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో హిట్ కాలేదు. అది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిట‌నేది వివ‌రించే సాంగ్‌. దాన్ని కూడా రామ‌జోగ‌య్య శాస్త్రి రాస్తే.. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ లాంటి గొప్ప సింగ‌ర్ ఆల‌పించాడు. ఆయ‌న‌తో పాటు పృథ్వీచంద్ర కూడా త‌న గ‌ళాన్ని జోడించాడు. అయినా ఏమంత‌గా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. దానికి ఇప్ప‌టివ‌ర‌కూ 6.5 మిలియ‌న్ వ్యూస్ ల‌భించాయి. మార్చి 17న రిలీజ్ చేసిన మ‌రో సాంగ్ "కంటి పాప" ఫ‌ర్వాలేద‌నే స్థాయిలో ఆద‌ర‌ణ పొందింది. అది ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రుతి హాస‌న్ జోడీపై పిక్చ‌రైజ్ చేసిన సాంగ్‌. రామ‌జోగ‌య్య శాస్త్రి రాస్తే, అర్మాన్ మాలిక్‌, దీపు, గీతామాధురి ఆల‌పించారు. ఆ పాట‌కు ఇంత‌దాకా 6.1 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. 'ఓ మై ఫ్రెండ్' ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై, 'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీతో హిట్ కొట్టిన శ్రీ‌రామ్ వేణు 'వ‌కీల్ సాబ్‌'ను తీర్చిదిద్దుతున్నాడు. బాలీవుడ్‌లో హిట్ట‌యిన 'పింక్‌'కు ఇది రీమేక్ అనే విష‌యం ఇప్ప‌టికే మ‌న‌కు తెలుసు. ఆ సినిమాలో వ‌కీల్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన క్యారెక్ట‌ర్‌ను ఈ సినిమాలో చాలావ‌ర‌కు మార్చేశారు. ఒరిజిన‌ల్‌లో తాప్సీ, కృతి కుల్హ‌రి, ఆండ్రియా త‌రియాంగ్ చేసిన మెయిన్ క్యారెక్ట‌ర్స్‌ను తెలుగు వెర్ష‌న్‌లో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల చేశారు. వాళ్ల ముగ్గురి త‌ర‌పున వాదించే లాయ‌ర్ రోల్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ పోషించాడు. ఆయ‌న భార్య పాత్ర‌లో శ్రుతి హాస‌న్ క‌నిపించ‌నున్న‌ది. ఆమె క్యారెక్ట‌ర్‌ను కూడా ఒరిజిన‌ల్‌కు భిన్నంగా మార్చారు.  మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత చేసిన 'వ‌కీల్ సాబ్' సినిమాతో ప‌వ‌ర్‌స్టార్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడోన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే కాకుండా ఆడియెన్స్ అంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈలోగా వ‌చ్చే ట్రైల‌ర్ ఆ క్యూరియాసిటీని మ‌రింత‌గా పెంచ‌డం ఖాయం.‌‌‌ ప‌వ‌న్ చివ‌రిసారిగా రికార్డులు సృష్టించింది 2013లో వ‌చ్చిన 'అత్తారిటికి దారేది' సినిమాతో. ఆ మూవీ ఇండ‌స్ట్రీ హిట్ట‌యింది. ఆ సినిమా త‌ర్వాత ఆ రేంజ్ హిట్‌ను ప‌వ‌ర్‌స్టార్ ఇవ్వ‌లేదు. మునుప‌టి సినిమా 'అజ్ఞాత‌వాసి' అయితే డిజాస్ట‌ర్ అయ్యింది. అందుకే ఎనిమిదేళ్ల త‌మ‌ ఆక‌లిని 'వ‌కీల్ సాబ్' తీరుస్తాడ‌ని అభిమానులు శిఖ‌ర‌మంత ఆశ‌తో ఎదురుచూస్తున్నారు.

హీరో అంటే వీడురా బుజ్జీ.. పాలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ వ‌ద్దేవ‌ద్ద‌ని తేల్చేసిన నాని!

  స్టార్ల మీద అభిమానుల ప్ర‌భావం ఒక‌ప్పుడు అంత‌గా ఉండేది కాదు కానీ, ఇప్పుడైతే చాలా మంది స్టార్లు అభిమానుల మీద ఆధార‌ప‌డుతున్నార‌నేది నిజం. ఇదంతా సోష‌ల్ మీడియా పుణ్యం. ఫ్యాన్స్ త‌మ హీరోల‌ను ఆకాశానికెత్తేయ‌డం, ఇత‌ర హీరోల‌ను కించ‌ప‌రుస్తూ నానా యాగీ చెయ్య‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సర్వ‌సాధార‌ణం. కొంత‌మందైతే స‌భ్య‌తా సంస్కారాల‌నేవి లేకుండా నీచంగా ట్రోల్ చేస్తుండ‌టం చూస్తున్నాం. ఇలాంటి వాటిని నేరుగా స్టార్లు ఎంక‌రేజ్ చేయ‌క‌పోయినా, వారి ముఖ్య అనుచ‌రులుగా, వారి ప్ర‌మోట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించేవారు ఎంక‌రేజ్ చేస్తుంటార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ‌వుతుందంటే ఫ్యాన్స్ చేసే హంగామాకు అదుపూ గిదుపూ ఉండ‌దు. భారీ క‌టౌట్లు, వినైల్ హోర్డింగ్స్‌, తోర‌ణాలు, బాణ‌సంచా కాల్పులు.. ఎంత హంగామా చెయ్యాలంటే అంతా చేస్తారు. క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు స‌రేస‌రి. కానీ ఓ స్టార్ మాత్రం ఇలాంటి పాలాభిషేకాల‌ను తాను ప్రోత్స‌హించ‌న‌ని తేల్చి చెప్పేస్తున్నాడు. అవును. ఆ స్టార్‌.. నాని! శ‌నివారం 'ట‌క్ జ‌గ‌దీష్' సినిమా ప‌రిచ‌య వేడుక కార్య‌క్ర‌మం రాజ‌మండ్రిలో జ‌రిగింది. ఈ వేడుక‌లో చిత్రంలోని త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌గా న‌టించిన వారి ఒక్కో ఫొటో స్క్రీన్ మీద ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటే, సినిమాలో వాళ్ల పాత్రేమిటో, త‌న‌కు వారేమ‌వుతారో నాని స్వ‌యంగా ప‌రిచ‌యం చేయ‌డం ఆక‌ట్టుకుంది. చివ‌ర‌గా ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు నాని. అభిమానుల గురించి అత‌ను మాట్లాడిన విధానం చూశాక‌, ఇంకే స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ గురించి అలా మాట్లాడే ద‌మ్ము, ధైర్యం ఉన్నాయా అనిపించింది. "ఈ రోజు చెప్తున్నాను.. నేను ఫ్యాన్స్‌ను ఎంక‌రేజ్ చెయ్య‌ను. ఇప్పుడే కాదు, ఎప్ప‌టికీ చెయ్య‌ను. ఎందుకు చెయ్య‌నో తెలుసా?  మిగ‌తా వాళ్లు కోరుకున్న‌ట్టు ఫ్యాన్స్ నుంచి నేను కోరుకునేది మీరు అల్ల‌రిచెయ్య‌డ‌మో, వేరే వాళ్ల‌తో గొడ‌వ‌ప‌డ్డ‌మో, మీరు క‌టౌట్లు పెట్ట‌డ‌మో, పాలాభిషేకాలు చెయ్య‌డ‌మో కాదు. మా అమ్మానాన్న‌ల్లాగా మీరంద‌రూ న‌న్ను చూసి గ‌ర్వ‌ప‌డాల‌ని కోరుకుంటున్నాను. మీరు గ‌ర్వ‌ప‌డేలా ప్ర‌తిరోజూ క‌ష్ట‌ప‌డుతూనే ఉంటాన‌ని మీకు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను." అని చెప్పాడు నాని. అదీ విష‌యం. త‌న‌కు క‌టౌట్లు పెట్ట‌డం, పాలాభిషేకాలు చెయ్య‌డం ఇష్టం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. అల్ల‌రి చెయ్య‌డాలు, వేరే ఫ్యాన్స్‌తో గొడ‌వ ప‌డ్డాలు త‌న‌కు గిట్ట‌వ‌ని తేల్చేశాడు. ఒక్క స్పీచ్‌తో ఇటు ఫ్యాన్స్‌కే కాదు, అటు స్టార్ల‌కూ వాత‌లు పెట్టేశాడు నాని. అల్ల‌ర్ల‌ను ప్రోత్స‌హించే, ఎదుటి హీరోల‌ను ట్రోల్ చేసేలా ఫ్యాన్స్‌ను ఎగ‌దోసే హీరోల‌కు చెంప‌పెట్టు లాంటి స్పీచ్ ఇచ్చాడు నాని. అలాగే ఫ్యాన్స్ ఎలా ఉండ‌కూడ‌దో స్ప‌ష్టం చేశాడు నాని. త‌న ఎలాంటి ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాడో కూడా తెలిపాడు. స్టార్ హీరోలు, వారి అభిమానులు నాని మాట‌ల‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.