పంద్రాగస్టున జెండా ఆవిష్కరణకు దూరంగా జగన్?

అధికారంలో ఉన్నామా? లేదా? ఈ  పార్టీయా? ఆ పార్టీయా? అన్న విషయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులంతా పంద్రాగస్టు రోజున జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దేశ  స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొని దేశ భక్తిని చాటుకుంటారు. పార్టీలు, అధికారం వంటి విషయాలను స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలతో ముడి  పెట్టరు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రూటే సెపరేటు. ఆయన ఈ సారి  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. కనీసం తన నివాసంలో జెండా ఆవిష్కరించడానికి కూడా ఆయన ముందుకు రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన లేరు సరే.. కనీసం బెంగళూరులోని తన నివాసంలో కూడా ఆయన జెండా ఎగురవేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన జెండా ఆవిష్కరిస్తున్న ఫొటో మీడియాలో కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక వైపు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు, నాయకులు, సామాన్య ప్రజలూ కూడా ఘనంగా పంద్రాగస్టు వేడుకలలో పాల్గొన్నారు. అయితే విచిత్రంగా జగన్ మాత్రం పంద్రాగస్టునాడు కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2019- 2024 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం పంద్రాగస్టు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నడూ పార్టీ కార్యాలయంలో, తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆనవాయితీని భగ్నం చేయలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం జెండా ఆవిష్కరణ చేయలేదు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఓటమి బాధనుంచి తేరుకోలేదా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉంటే మాత్రమే పంద్రాగస్టుకు జెండా ఆవిష్కరిస్తారా? అధికారం కోల్పోతే దేశంపై భక్తి ఉండదా? అంటూ నిలదీస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ బాటలో హస్తిన.. ఏపీలో అన్న క్యాంటిన్లు.. ఢిల్లీలో అటల్ క్యాంటిన్లు

ఢిల్లీ సీఎం రేఖాగుస్తా పేదలను అదుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ఫాలో అవుతున్నారు.   పేదల ఆకలి తీర్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. ఢిల్లీ సీఎం హస్తినలోనూ అదే ఒరవడిని ఫాలో అవ్వాలని  నిర్ణయించుకున్నారు.  పేదలకు మూడు పూట్లా నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా అదే బాటలో హస్తినలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె పంద్రాగస్టు వేడుకలలో ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా తొలి విడతలో వంద చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  అటల్ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపారు.  నిరుపేదలు, విద్యార్థులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులందరికీ అటల్ క్యాంటిన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రేఖా గుప్తా తెలిపారు.  

రజనీకాంత్ కు చంద్రబాబు అభినందనలు ఎందుకంటే..?

సూపర్ స్టార్  రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో అర్ధ శతాబ్దం పాటు సినీ పరిశ్రమలో అద్భుత కెరీర్  పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అని  పేర్కొన్నారు. మీ ఐకానిక్ నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించారు. అసంఖ్యాకంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, మీ సినిమాల ద్వారా సమాజంలో సామాజిక అవగాహనను పెంచారని చంద్రబబాబు  ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.    ఇలా ఉండగా 50 ఏళ్ల పాటు సూపర్ స్టార్ గా వెలుగొందుతూ అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు  చేశారు. 

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలూ చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడం లేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వార్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలలో వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఉండగా శనివారం (ఆగస్టు 16) కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో  కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని  పేర్కొంది. ఈ  నేపథ్యంలోనే శనివారం  (ఆగస్టు 16) రాష్ట్రంలోని పలు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచీ ముసురు పట్టి ఉంది. కొన్ని  ప్రాంతాలలో వర్షం పడుతోంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న  వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాలలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ముఖ్యంగా  శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో వర్షం ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది.  

ట్రంప్, పుతిన్ భేటీ.. తుస్సు!

యూరప్‌ మొత్తాన్నిసంక్షోభంలో ముంచెత్తుతూ గత మూడేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధానికి ముంగిపు పలికే దిశగా ఒక కీలక ముందడుగుగా అంతా భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ ఎలాంటి ముగింపూ లేకుండానే ముగిసింది.  అలస్కా వేదికగా జరిగిన ఈ భేటీ   ప్రపంచవ్యాప్తంగా అసక్తి రేపింది. అయితే మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది.  అయితే భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, పుతిన్ లు భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రియిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు  సాగాయని అన్నారు. అయితే  ఆ దిశగా ఎటువంటి ఒప్పందం కుదరలేదని చెప్పిన ఇరువురూ.. ఒప్పందం కుదిరే వరకూ ఏ విషయాన్నీ కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే చర్చలు మాత్రం చాలా నిర్మాణాత్మకంగా  సాగాయని పేర్కొన్నారు. ఇక ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని రష్యా మనస్ఫూర్తిగా కోరుకుంటోందని చెప్పారు.  ఇక రష్యాతో వ్యాపారం గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో వ్యాపారం సాగాలంటే.. ముందుగా రష్యా తమ  కండీషన్లకు అంగీకరించాలన్నారు. మొత్తం మీద ఎంతో ఆసక్తి రేకెత్తించిన పుతిన్, ట్రంప్ భేటీ  ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిందని చెప్పాలి. 

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, వారాంతం కావడంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. శనివారం (ఆగస్టు 16) ఉదయం శ్రీవారిద దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (ఆగస్టు 15) స్వామివారిని మొత్తం 77,043 మంది  దర్శించుకున్నారు. వారిలో  41,859 మంది   తలనీలాలు సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది. ఇక పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ జల, అన్న ప్రసాదాలను అందిస్తున్నది. 

తుపాకీ రాముడు, పిట్టల దొర అంటూ ట్రంప్ పై సెటైర్లు

తెలుగులో తుమాకీ రాముడు, పిట్టల దొర అంటే వెంటనే గుర్తొచ్చేది... కబుర్లతో గారడీ చేసే కామెడీ కారెక్టర్లే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ కోవలోకే చేరిపోయినట్టు కనిపిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో  భేటీకి సిద్దమైన ట్రంప్ కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో తానే కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు.  భారత్ - పాక్ మధ్య ఘర్షణలకు సంబంధించి మాట్లాడిన ఆయన ఆ రెండు దేశాలు అణు యుద్ధం వరకు వెళ్లాయన్నారు. ఆ సమయంలో 6. 7 యుద్ద విమానాలు కుప్పకూలాయన్న ట్రంప్.. ఆ రెండు దేశాల ఘర్షణను తానే పరిష్కరించానంటూ గప్పాలు కొట్టుకున్నారు. అంతే కాదు ఆరునెలల్లో ఏకంగా   ఆరు యుద్దాలను ఆపానని వైట్ హౌస్‌లో వెల్లడించారు.  ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తమ నిర్ణయంలో ఎటువంటి విదేశీ జోక్యం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడుతూ పాకిస్థాన్‌పై దాడులు ఆపాలని తమకు ఏ దేశం చెప్పలేదని స్పషం చేశారు. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాతే ఆపరేషన్‌కు విరామం ఇచ్చారని ప్రకటించారు. అయినా ట్రంప్ తానే అన్నీ ఆపానని ప్రకటనల మీద ప్రకటనలు చేసుకోవడంపై నెటిజన్ల  రకరకాలుగా ట్రోల్ అవుతున్నారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో కేసీఆర్‌ను కలిసిన కవిత

  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన కుమారుడికి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు సమాచారం. కవిత అమెరికా పర్యటనకు  డిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికాకు వెళుతున్నారు. తన కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించనున్నారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండనున్నారు.  కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి.. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.మరోవైపు అధినేత కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు టాక్.

కుర్చీ వేయలేదని అలిగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  కడప పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ప్రొటోకాల్‌ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. తనకు వేదిక సమీపంలో తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. అయితే, ముందు వరుసలో కుర్చీలన్నీ అధికారులతో నిండిపోయాయి. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎమ్మెల్యే కోసం మరో కుర్చీని ఏర్పాటు చేశారు.  అయితే, జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేంత వరకూ నిలుచునే ఉన్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఎమ్మెల్యే మాధవి రెడ్డి అలగడంతో కలెక్టర్‌ కలుగజేసుకుని ఆమెను స్టేజిపైకి రావాలని ఆహ్వానించారు. కానీ అప్పటికే కోపంతో ఊగిపోయిన మాధవి రెడ్డి స్టేజిపైకి వెళ్లడానికి తిరస్కరించింది. దీంతో అక్కడకు వెళ్లి కూర్చోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగేంత వరకు దాదాపు అరగంటపాటు అక్కడే నిల్చుండి కార్యక్రమాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేశ్

  ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి  డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ‘థాంక్యూ సీఎం సర్‌’ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.మహిళలు 5 రకాల బస్సుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం.  పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్‌ జారీ చేసే జీరో ఫేర్‌ టికెట్‌తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.స్త్రీ శక్తి' పథకం ద్వారా ఏకంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం పడనుంది. .   

ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారు : సీఎం రేవంత్ రెడ్డి

  సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు. వాళ్ళు సృష్టించే అపోహలు మీరు వేగంగా వ్యాపింపజేస్తే మన రాష్ట్రానికి, దేశానికి నష్టం కలిగిస్తాయిని తెలిపారు. క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఆయన స్టాల్స్ ను పరిశీలించారు.  ఈ సందర్భంగా సీఎం  మాట్లాడుతూ.భూమి అనేది సెంటిమెంట్, దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిది. అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని క్రెడాయ్ ద్వారా వాటన్నింటిని పటాపంచలు చేస్తామని రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అని... ఈ బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళతామని అన్నారు. ప్రపంచ సుందరీమణుల పోటీలను హైదరాబాద్ లో నిర్వహించామని... ఈ సందర్భంగా పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ప్రత్యేకతలు చూపించామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించారని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఈరోజు తెలంగాణ సాగునీటి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు అందరికీ నచ్చకపోవచ్చు కానీ హైటెక్ సిటీ కట్టింది ఆయనే అన్నారు.అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ముఖ్యమంత్రి అన్నారు

తొర్రూరులో జాతీయ జెండాకు ఘోర అవమానం

  మహబూబాబాద్ జిల్లాలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినో త్సవం రోజే జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈరోజు ఆగస్టు 15వ తేదీ సంద ర్భంగా 100 అడుగుల జెండాను వైస్ ప్రెసిడెంట్ అనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఈరోజు ఉదయం ఆవిష్కరించారు. అందరూ ఆకాశంలో ఎగురుతున్న జెండాను చూస్తూ సెల్యూట్ చేస్తున్న సమయంలో జెండా చినిగిపోయి ఉండడం చూసి ఒక్క సారిగా అవాక్క య్యారు. చినిగిన జాతీయ జెండా ఎగరవే యడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు... ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వ పాఠశాల లో జెండా ఆవిష్క రణకు రిటైర్ ఆర్మీ అధికారులు మరియు దేశ సేవ చేసిన ప్రముఖు లను ఆహ్వానించి వారి చేత జెండా ఆవిష్కరణ చేసేవారు... కానీ ఈసారి ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ తో జెండా ఎగర వేయించారు.అయితే చినిగిన జాతీయ జెండా ఎగరవే యడం, దేశ గౌరవా నికి అవమానకర మంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  

వెలుగులోకి వచ్చిన మరో అక్రమ సరోగసి

  తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు మరువక ముందే మరో ఘటన కుత్బు ల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పరిధిలో ఓ అక్రమ సరోగసి సెంటర్ ఉన్నట్లుగా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అయితే ఒక క్లినిక్ సెంటర్ అనుమతి లేకుండా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నది. ఈ సెంటర్ పై పోలీ సులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు... ఈ సందర్భంగా మేడ్చల్  డిసిపి కోటిరెడ్డి మాట్లాడుతూ... పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్న ఒక క్లినిక్ సెంటర్లో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్ గతంలో అనుమతి కోసం అప్లై చేసు కుంది. కానీ అనుమతులు రాకపోవడంతో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తూ భారీ ఎత్తున డబ్బులు సంపాది స్తున్నారు. పక్కా సమాచారం రావడంతో అక్రమ సరోగసికి పాల్ప డుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్టు చేశామని డిసిపి కోటిరెడ్డి అన్నారు.  హైదరాబాదులో ఏడుగురు మహిళలు, ఒక పురుషున్ని మొత్తం ఎనిమిది మందిని కమర్షియల్ సరోగసి, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మీ రెడ్డి లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్ గా పనిచేసిన అనుభవం ఉంది. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపా దించాలని నిర్ణయిం చుకున్న లక్ష్మీ అక్రమ సరోగసి విధానానికి తెరలేపింది. లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీర్గా చదువుతున్నాడు. ఇతను కూడా అమ్మకు తోడుగా ఈ అక్రమ దందా లోకి దిగాడు.  వీరు పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకొని సరో గసి ద్వారా పిల్లల్ని నీకు అప్ప జెప్పు తామని నమ్మించి వారి వద్ద నుండి 15 నుండి 20 లక్షల రూపాయలు వసూలు చేస్తు న్నారు. ఆ తర్వాత డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి... ఎగ్ డొనేట్ చేయించడం తో పాటు సరోగసికి బలవంతంగా ఒప్పిస్తున్నారు.. పక్క సమాచారం రావడంతో లక్ష్మీ రెడ్డి, ఆమె కుమా రుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసామని డిసిపి తెలిపారు. లక్ష్మిరెడ్డి 2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉంది... వీరిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.అరెస్టు చేసిన వారి వద్ద నుండి 6.47 లక్షల నగదు, లెనోవో లాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు తోపాటు సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, 5 స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సరోగసి రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టవ్ టెక్నాలజీ యాక్ట్, బి ఎన్ ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని నిందితులిద్దరిని అరెస్టు చేశామని... మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని మేడ్చల్ జిల్లా డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు.

ఢిల్లీలోనే డీల్..రాములమ్మ రూట్‌లో అజారుద్దీన్ ?

  ఇటు నుంచి కాకపోతే, అటునుంచి నరుక్కురమ్మని అంటారు, పెద్దలు. మాజీ క్రికెటర్, ప్రస్తుత  పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు, మహమ్మద్ అజారుద్దీన్, అక్షరాలా అదే చేస్తున్నారు. అవును, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే, తమ చిరకాల స్వప్నం నెరవేరాలంటే, జూబ్లీ’’ ఉప ఎన్నిక చక్కటి అవకాశంగా భావిస్తున్న,అజారుద్దీన్,ఈ అవకాశాన్నిఎట్టి పరిస్థితిలో వదులు కోరాదని భావిస్తున్నారు. అసలు ఈ ఉప ఎన్నిక వచ్చిందే తన కోసమని అజార్’ గట్టిగా నమ్ముతున్నట్లు చేపుతున్నారు. అందుకే, అయన కాంగ్రెస్ ‘టికెట్’ కోసం  ఎందాకా అయినా వెళ్లేందుకు రెడీ’ అటున్నారు. నిజానికి,జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే’ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణ వార్త చెవిన పడగానే, అజారుద్దీన్’ నిముషం లేటు’ చేయకుండా, ఖాళీ కుర్చీలో కర్చీఫ్’ వేశారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిన, ఆయన  ఈసారి టికెట్’ తనకే వస్తుందనే ధీమాను బహిరంగంగానే వ్యక్తపరిచారు.  అదేదో సినిమాలో మహేష్ బాబు, తుపాకీ నాదే .. బులెట్’ నాదే’ అంటాడు చూడండి, అలాగే , అదే  స్టైల్లో’ ‘టికెట్ నాదే, గెలుపు నాదే’ అని స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన ధీమా పై కోల్డ్ వాటర్’ కుమ్మరించారు.జూబ్లీ’అభ్యర్ధిని అధిష్టానం నిర్ణయిస్తుంది, అంతవరకూ ఎవరూ, స్వీయ’ప్రకటనలు చేయవద్దని సీరియస్’గా వార్నింగ్ ఇచ్చారు. మరో వంక, జూబ్లీ’లో గెలిస్తే మంత్రి పదవి’ ఖాయమనే ప్రచారం ఉపందుకోవడంతో  జూబ్లీ టిక్కెట్’కు  ‘డబుల్ ధమాకా’ స్థాయిలో గిరాకీ పెరిగింది. టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. దీంతో మొదట్లో అజారుద్దీన్’ వైపు మొగ్గుచూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అందుకు పోటీ ఎక్కువకావడం ఒక కారణం అయితే, ముస్లిం యేతరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, అప్పుడే కాంగ్రస్’కు  తమ మద్దతు ఉంటుదని ఎంఐఎం షరతు విధించడం మరో కారణంగా చెపుతున్నారు.మరో వంక, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్’ స్థానికులకే జూబ్లీ టికెట్’ అని ప్రకటించి, అజార్ ఆశలపై మరో బకెట్ కూల్ వాటర్ కుమ్మరించారు. నిజానికి,ఉప ఎన్నికలో తానే అభ్యర్థినంటూ అజార్‌ ప్రకటించుకోవడంతో ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారని, వెంటనే తమ వ్యూహానికి పదును పెట్టినట్లు చెపుతున్నారు. అజార్‌కు’ చెక్  పెట్టేందుకు, క్రికెట్ అసోసియేషన్ రాజకీయాల్లోఅజార్’ పొడ అయినా గిట్ట్టని మంత్రి వివేక్’ రంగంలోకి దించి నట్లు చెపుతున్నారు.మంత్రి వివేక్‌ ఒకడుగు ముందుకేసి ఆ బాధ్యతను భుజాన వేసుకున్నట్టు పార్టీవర్గాలలో వినవస్తోంది.ఇక్కడే అజార్’ ఇటునుంచి కాకపోతే, అటు నుంచి నరుక్కు రమ్మన్న పెద్దలమాటను గుర్తుకు తెచ్చుకుని, ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ప్రారంభించారు. డైరెక్ట్’గా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్’ అగ్రనేతలు  సోనియా గాంధీ. రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. జూబ్లీ టికెట్’ ఇవ్వాలని, అభ్యర్ధించి నట్లు సన్నిహితులు చెపుతున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.  పీసీసీ నుంచి తన పేరును పంపినా పంపకున్నా, అధిష్టానం జాబితాలో మాత్రం చోటు చిక్కెలా’ ఏర్పాట్లు చేసుకునట్లు చెపుతున్నారు.అయితే, అధిష్టానం అప్పాయింట్మెంట్ ఇచ్చినంత తేలిగ్గా టికెట్ ఇస్తుందా, ముఖ్యంగా, లక్షా 20 వేల ముస్లిం ఒట్లున్న నియోజక వర్గంలో, ఒవైసీలను కాదని, కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్’ కు టికెట్’ ఇచ్చే సాహసం చేస్తుందా? అనేది ఇప్పడు పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు. అయితే,గతంలో, రాష్ట్ర నాయకులకు మాట మాత్రంగా అయినా  చెప్పకుండానే, విజయశాంతి ఏ రూటులో అయితే ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారో, అదే రూట్’ లో తనకు  ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, అజార్ విశ్వాసంతో ఉన్నట్లు  చెపుతున్నారు. నిజమో కాదో కాన,, అజార్ అనుచరులు మాత్రం, అగ్రనేతలు ఇద్దరు  గ్రీన్ సిగ్నల్’ ఇచ్చారని అంటున్నారు.

వైసీపీపై బీజేపీ ముప్పేటదాడి... కుమ్మక్కు ముద్ర చెరిపేసుకోవడానికా?

  ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లపాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని సిట్ అధికారులు తమ అనుబంధ చార్జ్‌షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు . మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మార్చుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకున్నారో అందులో వెల్లడించారు. ఉన్నతాధికారుల సిఫార్సులను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టారని స్పష్టం చేసింది.  సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల ప్రమేయానికి సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేశారు. గతంలో వేసిన చార్జ్‌షీట్లో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా ... అదనంగా ముగ్గురు నిందితులపై అభియోగాలు మోపింది.  తాజా ఛార్జ్ షీట్లో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు పొందుపరించింది. మొత్తానికి లిక్కర్ స్కాంలో జగన్ నిర్ణయాలే కీలకమని స్పష్టం చేసింది. అయినా టీడీపీ, జనసేన నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారే కాని.. వైసీపీ మందిమగాదుల్ని కాని, జగన్‌ని కాని టార్గెట్ చేయడం లేదు. అయితే మిత్రపక్షమైన బీజేపీ మాత్రం అదే పనిగా పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.బిజెపి..వైసిపి ఒక్కటే.. అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎలాగైనా పోగొట్టాలని బిజెపి అష్టకష్టాలు పడుతోందట.  తాజాగా లిక్కర్ స్కాంపై పదే పదే విమర్శలకు దిగుతోంది బిజెపి. ఒకవైపు టిడిపి మంత్రులకు చంద్రబాబు లిక్కర్ స్కాం పై మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినా బిజెపి మాత్రం బిగ్ బాస్ జగనే అంటూ ముప్పేట దాడి చేస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఎపిలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసిపి మద్ధతిచ్చింది. ప్రస్తుతం కూడా బీజేపీ అధిష్టానం తో మంచి రేపో నడుపుతుందన్న ప్రచారం జరుగుతోంది.  ఆ క్రమంలో ఈ ప్రచారమే కూటమి ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. బిజెపి ఏపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ కు కూడా అది తలనొప్పిగా మారిందంట. దీంతో కూటమి శ్రేణులకు ఎలాగైనా దగ్గరవ్వాలనే యోచనలో వైసిపి అధినేత జగన్ పై మాటల దాడి పెంచాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత వైసిపి పాలనలో జరిగిన అవినీతి ని ఎండగడుతూనే లిక్కర్ స్కాం ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.  గతంలో పురంధేశ్వరి ఏపి బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మద్యం తాగి చనిపోయి, మంచాన పడ్డవారి లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా మాధవ్ కూడా ఆమె లైన్ లోనే వెళ్తూ లిక్కర్ స్కాం లో త్వరలో బిగ్ బాస్ జగన్ జైలుకు వెళతారంటూ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బిజెపి మంత్రి సత్యకుమార్ తో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు వైపీపీ లిక్కర్ స్కాం పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న ఏ ఒక్కరు తప్పించుకోలేరంటూ మీడియా ముందు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.  కాని లిక్కర్ స్కాం పై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ పార్టీ మంత్రులను మాట్లాడవద్దని క్యాబినెట్‌లో చెప్పడం కొసమెరుపు. మరోవైపు లిక్కర్ స్కాం పై బిజెపి పదే పదే ఆరోపణలు చేస్తున్నా వైసిపి మాత్రం స్పందించడం లేదు. వరుస ఆరెస్టులు జరుగుతుంటే టిడిపి ని మాత్రం విమర్శిస్తున్నా బిజెపి జోలికి  మాత్రం వెళ్లడం లేదు. దీంతో కమలనాధుల ఆరోపణలకు ప్రతిస్పందన లేకపోవడంతో బిజెపి, వైసిపి ఒక్కటే నంటూ గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి లిక్కర్ స్కాం తో పాటు ఇతర స్కాంలు, గతంలో జరిగిన పాలనపై వరుస పోరాటాలు చేయాలని, మాధవ్ తో సహా బిజెపి శ్రేణులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బిగ్ బాస్ ను టార్గెట్ చేస్తూ అక్కడి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారిపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించారట. ఈ నేపధ్యంలోనే వైసిపిపై బీజేపీ వర్గాలు ముప్పేట దాడి చేస్తున్నాయంట.  చూడాలి మరి వైసిపి ని విమర్శించి ఏపీలో బలపడాలన్న బిజెపి ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో?

ఫామ్ హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్ పార్టీ... 51 మంది అరెస్ట్

  రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బాకారం గ్రామ పరిధిలోని SKM ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి హుటాహుటిన ఫామ్‌‌హౌస్‌‌పై దాడి చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదపులోకి తీసుకున్నారు. అయితే, అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.  అనంతరం స్పాట్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై  డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.అందరూ ఆఫ్రికన్ కంట్రీస్ కి చెందిన వాళ్లే..65 బీర్లు, 20 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు.వీరి వీసా స్టేటస్ గురించి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు పూర్తైన తరువాత డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు.ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు

ఓడితేనే ఓటు చోరీనా...గెలిస్తే ఉండదా? : పవన్​

  ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమనంగా ముందుకు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ అన్నారు. సూపర్ సిక్స్​పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ తెలిపారు.  కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతు ఆంధ్ర ప్రదేశ్‌లో ఓట్ చోరీ జరిగిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో కొందరు నాయకులు ఓడితే ఓట్ చోరీ అంటున్నారు. వాళ్లు గెలిచినప్పుడు ఇవన్నీ కనిపించవా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.  2019లో వైసీపీ విజయం సాధించినప్పుడు మేం ఎక్కడా ఆ మాట అనలేదు ప్రజలు తీర్పును గౌరవించామన్నారు. 2024లో 164 అసెంబ్లీ సీట్లు మేం గెలిస్తే ఇది ఈవీఎంల మిషన్లలో తప్పు అన్నాట్లు మాట్లాడారు. ఇదేం న్యాయం అని పవన్ విమర్శించారు.రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృమూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం ప్రారంభిస్తున్నాం అన్నారు.   

తాడేపల్లి ప్యాలెస్‌లో మీ అధినేతను ఓదార్చు...రోజాకు భాను ప్రకాష్ కౌంటర్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల పరిధిలో వైసీపీకీ 64% ఓట్లు సాధించిందని ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన టీడీపీకీ ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0,1,2,3, 4 ఓట్లు రావడం ఏమిటో పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా అంటూ  ఆమె సందేహం వ్యక్తం చేశారు.  రోజా కామెంట్స్‌పై చిత్తురు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పేర్కొన్నారు.పిచ్చి ప్రేలాపనలు పక్కన పెట్టి..నేటి నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం‌..నగరి నుండి ఉచితంగా విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వరకు బస్సులో ప్రయాణించి మీ అధినేత జగన్‌ను ఓదార్చు అని రోజాకు  ఎమ్మెల్యే  భాను ప్రకాష్ సలహా ఇచ్చారు.