ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు అస్వస్థత

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే ముంబైలో  ఆపరేషన్ చేయించుకున్నారు.  నిన్న రాత్రి నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.   ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకుని గత నెల 12నే స్వరాష్ట్రానికి వచ్చారు.  ముంబై నుంచి వచ్చిన నెల రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యానికి గురి అయ్యారు. కాగా ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. బీజేడీ వర్గాల సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. 

అయోమయంలో బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై మల్లగుల్లాలు

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపికచేయడంలో  బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఏర్పడిన ఖాళీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఉప ఎన్నిక కోసం అప్పుడే కాంగ్రెస్ ప్రచారం ఆరంభించేసింది.  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ, అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.   గతంలో  ఈ నియోజకవర్గంలో ని ఒక వర్గం ఓటర్లతో పరిచయాలు ఉన్న మంత్రి తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మంత్రి పొన్నంతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావే శాలు నిర్వహిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం నోటిఫికేషన్ వచ్చాక, అభ్యర్థుల ఎంపిక తరువాత అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నాయి.  అయితే సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం బీఆర్ఎస్ లో అయోమయం నెలకొంది.  దివంగత ఎమ్మెల్యే మాగంటి కుటుంబంలో ఒకరిని బరిలో దింపాలని చూస్తున్నారు. దీనికి కొంత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పి. జనార్దన్ రెడ్డి తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులలో అన్నీ హంగులు ఉన్న వ్యక్తిని ఎంపికచేయాలనే ఆలోచనా చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక బీజేపీ పార్టీలో స్థానికంగా ఉన్న వారిలో ఒకరిని ఎంపికచేసే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తే వారిని గెలిపించుకుని సత్తా చాటాలన్న  పట్టుదలతో ఉంది.

తాడిపత్రిలో హైటెన్షన్ ఇరకాటంలో పోలీసులు

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 14 నెలల తరువాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనుండటమే ఇందుకు కారణం. నియోజకర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానంటూ పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. ఆయన తాడిపత్రి ప్రవేశానికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. తాము విధించిన షరతులకు లోబడే తాడిపత్రి పర్యటన ఉండాలన్న షరతు విధించింది. దీంతో సోమవారం (ఆగస్టు18) తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న భావనతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.   మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి గత కాలంగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి లోకి ప్రవేశించేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కోర్టు కూడా పెద్దారెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం (ఆగస్టు 18) తాడిపత్రి బయలుదేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో   టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఘర్షణకు దారి తీసు ప్రమాదం ఉందన్న భావనతో  తాడిపత్రికి బయలుదేరిన పెద్దిరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో నే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాడిపత్రికి రావద్దంటూ పెద్దిరెడ్డికి చెబుతు న్నారు. కోర్టు అనుమతితో వస్తున్న తననెలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి పోలీసులను నిలదీస్తున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం పోలీసులను ఇరకాటంలో పడేసింది. 

తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వాగులూ వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి బాన్సువాడ మండలంలో సర్వపూర్ వాగ ఉధృతంగా ప్రవహిస్తోంది. మొండి సడర్.. సర్వాపూర్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో కామారెడ్డి, బాన్సువాడల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.  ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఇక బిచ్కుంద మండలం శెట్లూరు వాగులో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపర్లు, వందల గొర్రెలను రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే నల్గొండలో బోరు బావి నుంచి  నీరు పైకి ఉబికి వస్తోంది.  మొత్తంగా రాష్ట్రంలో గడిచిన 12 గంటలలో భారీ వర్షపాతం నమోదైంది.  సిద్దిపేట గౌరారంలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ములుగులో 18.6,  ఇస్లాంపూర్ లో 17.85, కౌడిపల్లిలో 17.2,  కంగ్జిలో 16.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొం ది. అలాగే  శంకరంపేటలో 16.4, యాదాద్రిజిల్లా అడ్డగూడురులో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది. భారీ వర్షాలకు ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో భారీగా వరద వస్తోంది. ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.   

హమ్మయ్య.. ఎట్టకేలకు చిరుత చిక్కింది!

గత మూడు నెలలుగా ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.తిరుపతిలో గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద చిరుత కుక్కలు, దుప్పులు, జింకలను వేటాడి ఆరగించి అక్కడే విడిచి పెడుతూ వస్తుంది. ఈ తరుణంలో జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. చిరుత దాడి దృశ్యం వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డు అయ్యింది.  ఇది వైరల్ కావడంతో తిరుపతి వాసులు కూడా తీవ్ర భయాందోళనలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ వస్తున్నారు. చిరుతను బంధించేందుకు  ఫారెస్ట్ అధికారులు పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసినపేపటీ నుంచి ఫలితం లేకుండా పోయింది. చిరుత ఆచూకీ చిక్కలేదు. జనం భయం తొలగలేదు. కాగా రెండు రోజుల క్రితం ఒక దుప్పిని నోటా కరచి ఎస్వీ వర్సిటీలోని ఓ ప్రధాన డిపార్ట్మెంట్ వద్ద ఆరగించి సగం దుప్పిని అక్కడే విడిచి వెళ్లిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అటు వైపు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత ఫారెస్ట్ అధికారులకు ఏర్పాటు చేసిన  ఆ బోనులో చిక్కింది. చిక్కిన చిరుతను తిరుపతి జూ పార్క్ కు తరలించారు. గతంలో వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో పట్టుబడిన చిరుతను బంధించిన ఫారెస్టు అధికారులు నలమల అడవులకు తరలించారు. అయితే ఈ ప్రాంతంలో మరికొన్ని చిరుతలు కూడా సంచరిస్తున్నట్లు  అనుమా నిస్తున్నారు.  

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ( ఆగస్టు 18) నాటికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ వాయుగుండం మంగళవారం (ఆగస్టు 19) తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం (ఆగస్టు 18) ఉదయం నుంచీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.  విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్  జారీ చేశారు. విశాఖను భారీ వర్షం అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  జ్ఞానాపురం, ఇసుక తోట, కేఆర్ఎమ్ కాలనీ, వన్ టౌన్  ప్రాంతాలలో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇలా ఉండగా  వాయుగుండం ప్రభావంతో మరో 72 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.   భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు ,కృష్ణ, బాపట్ల, పల్నాడ,  ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  కాగా వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం పోటెత్తుతోంది. కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంపై చేపలవేటకు వళ్లవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.  ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పోర్టులలోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

శ్రీకృష్ణ శోభాయాత్రలో విషాదం.. విద్యుదాఘాతంలో ఐదుగురు మృతి

ఉత్సాహంగా సాగుతున్న శ్రీకృష్ణ శోభాయాత్రలో ఘోర విషాదం సంభవించింది. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ గోకులే నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్ర జరుగుతుండగా విద్యత్ షాక్ కు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా  ఆదివారం (ఆగస్టు 17) శ్రీకృష్ణ శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వాహనం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో  పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో   విద్యుత్ తీగలు రథానికి తాకడంతో ఈ ఘోరం జరిగింది.  విద్యుదాఘాతంలో మరణించిన వారిని  కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలుగా గుర్తించారు.

ఏపీలో మహిళా శక్తి పథకం.. ఉచిత బస్సు ప్రయాణానికి నో కండీషన్స్!

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ఉచిత‌ బ‌స్సు హామీ మేర‌కు తోలుగుదేశం ప్రభుత్వం  స్త్రీ శ‌క్తి  పేరుతో రాష్ట్రంలో ఉచిత బ‌స్సును ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం (ఆగస్టు15) సాయంత్రం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు  ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అయితే. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఈ ప‌థ‌కానికి సంబంధించి కొన్ని ష‌ర‌తులు విధించారు. వీటి ప్ర‌కారం  ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత స‌ర్వీసులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. ఇక‌, బ‌స్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో మ‌హిళ‌లు ఆధార్ స‌హా.. ఇత‌ర గుర్తింపు కార్డుల‌ను ఒరిజిన‌ల్‌వే చూపించాల‌ని కూడా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నిబంధనలతోనే స్త్రీ శక్తి పథకం శుక్రవారం (ఆగస్టు15) సాయంత్రం ప్రారంభమైంది. అ యితే శనివారం  శ‌నివారం ఉద‌యం నుంచి ఈ పథకాన్ని వినియోగించుకుని పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానకి ఉత్సాహం చూపారు. కానీ ఆ స‌మ‌యంలో చాలా మంది ఒరిజిన‌ల్ గుర్తింపు కార్డులు లేకుండానే బ‌స్సులు ఎక్కారు. కేవ‌లం జిరాక్సులు, లేదా ఫోన్ల‌లో ఉన్న డిజిట‌ల్ గుర్తింపు కార్డుల‌ను చూపించారు. నిబంధనల అనుమతించవంటూ.. వీటిని కండెక్ట‌ర్లు అంగీకరించలేదు. దీనితో  ఒరిజినల్ గుర్తింపు కార్డు నిబంధనను తొలగించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు.   అలాగే ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే బ‌స్సుల్లో ఉచితం లేద‌న్న విష‌యం తెలియ‌క‌.. మ‌న్యం,   పార్వ‌తీపురం, లోతుగ‌డ్డ, లంబ‌సింగి త‌దిత‌ర ప్రాంతాల్లో గిరిజ‌న మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి విధించిన నిబంధనలన్నీ దాదాపుగా తొలగించేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆదివారం ఉదయానికి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక నుంచీ ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుంది. అయితే తిరుమల, అన్నవరం ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆయా ఆల యాల బోర్డులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇక  గుర్తింపు కార్డులు ఒరిజిన‌ల్‌ కండీషన్ ను కూడా ఎత్తివేశారు.  జిరాక్స్ కాపీల‌ను అనుమ‌తించాలని ఆదేశించారు.   దీంతో మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను దాదాపు తీసేసిన‌ట్లైంది.

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇన్ని రోజులుగా మోడీ, షా ల ఛాయిస్ ఎవరు అన్న విషయంలో నెలకొన్న ఆసక్తి, సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆదివారం (ఆగస్టు 17) జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం రాధాకృష్ణన్ ను ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న   రాధాకృష్ణన్  గతంలో జార్ఖండ్, పాండిచ్చేరి గవర్నర్ గా కూడా పని చేశారు. కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కోయంబత్తూర్ నుంచి రెండు సార్లు లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వెంకయ్యనాయుడు తరువాత దక్షిణాదికి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున ఎంపికైన రెండో వ్యక్తి రాధాకృష్ణన్.

ఎడారి దేశంలో ఏడేళ్ల నరకం.. సీఎం ప్రవాసి ప్రజావాణి చొరవతో స్వదేశానికి

ఏడేళ్ల ఎడారి జీవితం... నరకయాతన నుంచి ఎట్టకేలకు విముక్తి చెందిన తెలంగాణ వ్యక్తి ఉదంతమింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఏడేళ్ళుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు.  నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ... అంటూ మాతృభూమిని తలుచుకుంటూ  సొంతగడ్డకు రావాలని తహతహలాడాడు.     మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో... ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల నరకయాతనకు తెర పడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన ఆ తెలంగాణ వలస జీవి, మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం (ఆగస్టు 17) చేరుకున్నారు.  గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నివశించే, కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకుడు మహ్మద్ జబ్బార్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ సౌదీ నుంచి సొంతగడ్డకు రావడానికి  మార్గం సుగమం చేశారు. సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో,  భావొద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేశారు.   ఏడున్నవే నా పల్లే... నువ్వు ఏడున్నవే నా తల్లీ!  బతుకు దెరువు కోసం బాట పట్టినా...  పొట్ట తిప్పల కోసం సౌదీ కొచ్చినా!  నెలలు గడిచిపాయే, ఏండ్లు గడిచిపాయే, ఏడేండ్ల పొద్దాయే...  ఎండిపోయిన రొట్టె నేను తినుకుంటా...  నాచుగట్టిన నీళ్లు నేను తాగుకుంటా...  కారండ అడవిలో గొర్ల కాసుకుంటా...  నేను కాలమెల్లదీత్తి తల్లీ..  నేను కడుపు గట్టుకుంటి తల్లీ!   నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ!  అంటూ సౌదీలోని తన ఏడేళ్ల కష్టాన్నీ, కన్నీళ్లనూ అక్షరాలుగా మార్చి రాసి, పాడిన పాటను తనను సొంతగడ్డకు తీసుకురావడానికి సహకరించిన అధికారిణికి అంకితం ఇచ్చాడు.  అసలు ఈశ్వర్ సౌదీ యానం.. అక్కడి కష్టాలు.. ఏడేళ్ల నరకయాతన ఎలా మొదలైందంటే..  2017 ప్రారంభంలో హౌస్ డ్రైవర్‌గా పని చేసిన ఈశ్వర్, కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఏడేళ్లు గడిపాడు.  ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణి  కౌంటర్ లో  ముఖ్యమంత్రి  వంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల పేరిట 2025 జూన్ 27న వినతిపత్రం అందజేశారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి మార్గనిర్దేశనం చేశారు. సీఎం ప్రజావాణి  నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్, ఈశ్వర్ ను స్వదేశానికి రప్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు.   ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం ద్వారా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వీరందరి కృషీ ఫలించింది. ఈశ్వర్ కు సౌదీలో కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. సొంత గడ్డకు చేరే అవకాశం లభించింది.

ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా?

మోడీ రిటైర్మెంట్ పై సాగుతున్న చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి చేపట్టిన ఓటు చోరీ ఆందోళన నేపథ్యంలో మరో సారి మరింత బలంగా మోడీ రిటైర్మెంట్ చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ రిటైర్మెంట్  అంశాన్ని వార్తలో నిలిచేలా పదే పదే ప్రస్తావిస్తూ సవాళ్లు విసురుతోంది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీల విషయంలో  మోడీ, షా వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ.. 75 ఏళ్ల నిబంధన నుంచి మోడీకి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ ఎద్దేవా చేస్తోంది.  వచ్చే నెలతో అంటే సెప్టెంబర్ తో సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. దీంతో బీజేపీ తనంతట తానుగా విధించుకున్ననిబంధన ప్రకారం మోడీ రిటైర్ కావలసి ఉంటుంది.  బీజేపీ పొలిటికల్ మెంటార్ లాంటి ఆర్ఎస్ఎస్ కూడా అదే చెబుతోంది. అయితే పార్టీలోనే మోడీ రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను తెరపైకి తెస్తున్నవారిలో  మోడీ ప్రధానిగా కొనసాగాలనుకుంటున్న వారితో పాటు ఆయన వైదొలగాలని కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ కూడా మోడీ ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత  జైరాం రమేశ్‌   మోదీ పదవీకాలం సెప్టెంబర్‌ తర్వాత కొనసాగడం అన్నది ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.     బీజేపీ విధాన నిర్ణయాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమన్నది బహిరంగ రహస్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు లేకుండా మోదీ 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు పొందే అవకాశం ఇసుమంతైనా లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఈ నేపథ్యంలోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుడ్ లుక్స్ లో పడేందుకు మోడీ శతధా ప్రయత్నిస్తున్నారనడానికి ఆయన ఇటీవలి ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్న విధానమే తార్కనంగా పరిశీలకులు చెబుతున్నారు.    గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించడంలో  ఆ ఎన్నికల ప్రచారాన్నంతా భుజాలపై వేసుకుని మోసిన మోడీ వైఫల్యం ఆయనను బీజేపీలో బలహీన నేతగా మార్చిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని పదవిలో 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా కొనసాగాలంటే ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడం వినా మరో మార్గం లేదనీ, అందుకే మోడీ ఆ ప్రయత్నాలలో మునిగిపోయారని చెబుతున్నారు.  గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు బలాన్ని కోల్పోయారనీ, గత ఎన్నికలలో పార్టీకి మెజారిటీ సీట్లు సాదించడంలో ఆయన వైఫల్యం ఇప్పుడు ఆయన ముందరి కాళ్లకు బంధంగా మారిందనీ చెబుతున్నారు. ఇక ఆయన సెప్టెంబర్ తరువాత ప్రధానిగా కొనసాగడమన్నది ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో? 

ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు?

భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, ఆరోపణలకు బలం చేకూరుతోంది.  బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు  భారత ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలను లేవనెత్తుతోంది. బీహార్ ఓటర్ల జాబితా లో 65 లక్షల మందిని తొలగించారని,ఎన్నికల సంఘంతో ప్రభుత్వం కుమ్మక్కైందని పార్లమెంటులో 15 రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించినట్లు ఆరోపిస్తున్న 65 లక్షల ఓటర్ల పేర్లు, వివరాలను 48 గంటల్లో అధికారిక వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది. తొలగించడానికి కారణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు  ఆదేశాలు ఎన్నికల కమిషన్ ను షాక్  అనే చెప్పాలి. ఓటర్ల సవరణ పేరుతో తొలగించడం అక్రమమని కాంగ్రెస్ సహా  ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.   సుప్రీంకోర్టు జోక్యం తో ఓట్ల చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయా, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు తేలతాయా అంటే ఇతమిథ్ధంగా చెప్పలేమన్నది విశ్లేషకుల మాట.  త్వరలో బీహార్ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఇలాంటి అక్రమానికి పాల్పడిందన్నది కాంగ్రెస్, ఇండియా కూటమి ఆరోపణ.  ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న విడుదల చేసింది. దాని ప్రకారం 65.6 లక్షల ఓటర్ల పేరు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లలో తొలగించింది 9 శాతం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అలాగే గత (2020 ఎన్నికలు), 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. 1977 తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. సగటున ఇదే 9 శాతం దేశవ్యాప్తంగా పరిగణలో తీసుకుంటే 9 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి.   ఈ సంఖ్య బ్రిటన్ లోని ఓటర్ల సంఖ్యకు ఒకటిన్నరెట్లు అధికం.  బీహార్లో 30 లక్షల ఓటర్లు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్రించుకోలేకపోయారన్నది వాస్తవం.   ఓటర్ల జాబితా లో మృతిచెందారని పేర్కొన్న వారితో ఫోటోలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.   మృతులతో ఫోటోలు దిగే భాగ్యం కల్పించినందుకు కృతజ్ణతలు అంటూ ఆయన వ్యంగ్యంగా చేసిన పోస్టు హాట్ ను మరింత పెంచేసింది.  మరణించారంటూ ఓటరు జాబితా నుంచి తొలగించిన వారితో ఆయన చాయ్ తాగుతూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమలో పోస్టు చేశారు.  ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు 300 మంది పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ ఓట్ల చోరీ నినాదంతో భారీ ప్రదర్శన చేసారు. ఈ ప్రదర్శనలో ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,  రాహూల్, ప్రియాంకగాంధీ సహా   పలువురి అరెస్టు చేశారు.  తమది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని, ఓటర్ల చోరీ ఉద్యమం మహోద్యమం గా మారుతుందనడంలో సందేహంలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల చోరీ జరిగిందని ప్రామాణిక పత్రంపై సంతకం చేసి ఇస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలా చేయకపోతే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాహుల్ ఆరోపణలపై కర్ణాటక,హర్యానా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసారు. రాహుల్ లేవనెత్తిన అంశానికి  ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకుండా ప్రమాణాలు చేయ్యాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మోడీ హయాంలో సందేహాలకు తావిచ్చేదిలా ఉందనడంలోసందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు  మోదీ హయాంలో ఎన్నికల కమిష న్ ను  నిర్వీర్యం చేసారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎలా ఉండవచ్చో చూపించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్  వెన్నెముక లేని సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సామాన్యులు సైతం సమర్ధిస్తున్నారు.  బీహార్ లో ఓటర్ల తొలగింపు అంశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటంతో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలోని మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా తొలగించిన ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్షాల వాదన సరైనదేన్న భావన సర్వత్రా కలిగేలా చేశాయి.   

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విషాద దృశ్యాలు ఇంకా మరపునకు రాలేదు. అంతలోనే మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ ల్యాండింగులతో విమానయానమంటేనే ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్న వేళ ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెడితే ముంబై విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానం ల్యాండ్ అడుతుండగా విమానం వెనుక భాగం రన్ వేను బలంగా ఢీ కొంది. అయితే పైలట్ల చాకచక్యం వల్ల ఘోర ప్రమాదం తృటిలో తప్పి విమాన ప్రయాణీకులు సురక్షింగా ఉన్నారు.  ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.  బ్యాంకాక్ నుంచి 6ఇ 1060 నంబర్ గల ఇండిగో ఎయిర్‌బస్ ఏ321 నియో విమానం శనివారం  ముంబై చేరుకుంది. ఆ సమయంలో  భారీ వర్షం కురుస్తున్నది.  ఉదయం 3:06 గంటలకు రన్‌వే 27పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కు అవకాశం లేదని భావించిన పైలట్లు విమానాన్ని  తిరిగి పైకి లేపే ప్రయత్నంలో విమానం తోక భాగం  రన్‌వేకు తగిలింది. దీంతో పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.  కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.  ప్రతికూల వాతావరణం కారణంగా గో-అరౌండ్ చేస్తున్నప్పుడు విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం, విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు నిర్వహించి, రెగ్యులేటరీ అనుమతులు పొందాకే తిరిగి సేవలు ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది.  

రేపటి నుంచి రాహుల్‌ గాంధీ ఓటు అధికార్‌ యాత్ర

  లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ  ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు.  ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ  బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు ప్రతిపక్ష నాయకుడు  రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు.  దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో  ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ తెలిపారు  

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి

  తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి  వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  

ఆధార్ కార్డు చూపించినా..కండక్టర్‌ల అత్యుత్సాహం

  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు  అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్  కార్డునే చూపించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు అంటున్నారు. దీంతో కండక్టర్‌ల తీరు మహిళల అసహనం వ్యక్తం చేస్తున్నారు .మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చుని ప్రభుత్వం చెబుతుంటే కండక్టర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఉచితం లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్‌ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి  వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.  

ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు నమోదు.. జైషే మహ్మద్‌తో లింకులు

  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై  పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరోవైపు ధర్మవరం టెన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ఎర్రగుంట్లు వాసి రియాజ్ నో ఇండియా ఐ లవ్ పాకిస్థాన్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నాది.నూర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో నూర్‌ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే..  నూర్‌ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్‌ పోలీసులే మొదట అరెస్ట్‌ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన.  ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్‌లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.