ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి?
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మరో నాలుగైదు రోజుల్లో అంటే ఆగష్టు 21తో నామినేషన్ల గడువు, ముగుస్తుంది. అయినా.. అధికార విపక్ష కూటమి అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా తేలలేదు. అధికార ఎన్డీయే కూటమిలో అభ్యర్ధి ఎవరన్నది మాత్రమే తేలవలసి వుంది. కానీ.. విపక్ష ఇండియా కూటమి అయితే.. అసలు పోటీ చేస్తుందా? లేక ఎటూ ఓటమి తప్పదు కాబట్టి పోటీకి దూరంగా ఉంటుందా? అన్న విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. అయితే.. కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇడియా కూటమి అభ్యర్ధిని బరిలో దించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇటీవల రాహుల్ గాంధీ నూతన అధికార నివాసం బంగ్లా నెంబర్ 5 , సునేహ్రీ బాగ్ లో ఇండియా కూటమీ నాయకులకు విందు ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, కూటమి కీలక నేతలు శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాకరే, కనిమొళి సహా ఇంచుమించుగా 40 మంది వివిధ పార్టీల ముఖ్యనాయకులు హజరైన ఈ విందు సమావేశంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమి పోటీ చేసే విషయంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి ఐక్యతను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంలో సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. కూటమి అభ్యర్ధి విషయంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదనీ.. అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎవరన్నది తేలిన తర్వాత, మరోమారు అభ్యర్ధి విషయం చర్చిద్దామని ఇండియా కూటమి నేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదలా ఉండగా.. అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన నేపధ్యంలో ఆదివారం (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
కాగా.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేయగా, కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగష్టు 8 న ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే.. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్తులో పోలింగ్ జరుగుతుంది.
కాగా.. ఇండియా కూటమి సీరియస్ గా ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ఇంచుమించుగా ఖారారు అయిన నేపధ్యంలో ఉపరాష్ట్రతి ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే ఎలా చూసిన కూడా ఎన్డీఎదే పైచేయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో(నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. వాటిలో 5 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒక లోక్ సభ సీటు ఖాళీగా ఉంది. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427 (293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87 మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి. అలాగే.. ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య సుమారు 30 వరకు ఉంటుంది. సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైనా.. ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.