పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం : సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు పేదరిక నిర్మూలన అనేది సీనియర్ ఎన్టీఆర్ సిద్దాంతమని ఆయన పాలన సమయంలో వెలుగు కార్యక్రమం తీసుకొచ్చినట్టు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన అని ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైనట్టు తెలిపారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. పీ4 ద్వారా హెచ్‌సీఎల్‌ కంపెనీలో ఉద్యోగం కల్పించడంతో భావోద్వేగానికి గురైన కృష్ణా జిల్లా వాసి పావని కంటతడిపెట్టుకున్నారు. డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధి. అన్నదాతగా ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది.  సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశాను. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగువాళ్లు ముందుకొచ్చారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దత్తతకు సంకేతంగా అడాప్ట్‌ ట్రీని బంగారు కుటుంబాలకు ఆయన అందజేశారు.మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని సీఎం తెలిపారు. 

తిరుమల కొండపైకి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని  తిరుమలకు  పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. అయితే.. తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో బస్సులలో సీట్లు భర్తీ అయ్యేంత వరకూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తామని ఆయన తెలిపారు.  అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండును పరిశీలించిన ఆయన..  బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.  బస్టాండులో మహిళల, పురుషుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో పెరిగే మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.  ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కొనకళ్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి - పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లబ్దిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ పది లక్షల మంది, 17వ తేదీ 15 లక్షల మంది, 18వ తేదీ 18లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.ఆరు కోట్ల 30 లక్షలు లబ్ది కలుగుతుందని వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహిళలు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  

యథావిథిగా మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ 25న

మద్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు  షాక్ ఇచ్చింది. దీంతో ఆయనను జగన్ ఈ నెల 25న పరామర్శ యథావిధిగా జరుగుతుంది. వాస్తవానికి జగన్ ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ పరామర్శించలేదు. దీంతో జగన్ మద్యం కుంభకోణం నిందుతులకు ముఖం ఎందుకు చాటేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలోనే బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక తప్పదన్నట్లుగా జగన్ ఈ నెల 25న మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే తాను జైలుకు వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేకుండా ఆయనకు బెయిలు వచ్చేస్తుందని ఆశించినట్లుగా కనిపిస్తోంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ నుఏసీబీ కోర్టు  కొట్టివేసింది. దీంతో అనివార్యంగా, ఇష్టం ఉన్నా లేకున్నా జగన్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.   ఇదే కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నభారతీ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు బృందం అధికారులు వీరికి బెయిలు మంజూరు చేయవద్దంటూ కోర్టును కోరడమే కాకుండా, మద్యం కుంభకోణంలో వారి పాత్రను నిర్ధారించే పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  అలాగే మ‌ద్యం కుంభకోణంలో  మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. కుంభకోణానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డికి చెందిన కంపెనీకి మద్యం స్కాం సొమ్ము 5 కోట్ల రూపాయలు చేరిందనీ, అయితే ఆయన తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశారనీ సిట్ అధికారులు కోర్టులు ఆధారాలతో అందజేశారు. అలాగే..  మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణమోహన్ లు కూడా ఈ స్కాంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.  అదే విధంగా  భారతీ సిమెంట్స్ ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌ మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు.   పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు  అస‌లు త‌మ వారికి మద్యం కుంభకోణంలో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తెలిపారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏసీబీ కోర్టు వీరందరి బెయిలు పిటిషన్లనూ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.  

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం

  హైదరాబాదు నగరంలో మరోసారి ఐటీ సోదాలు కొన సాగుతుడడంతో తీవ్ర కలకలం రేపుతుంది. DSR గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపనీ లో ఐటీ సోదాలు నిర్వహిం చారు. DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ ప్రయివేటు లిమిటెడ్ , DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ కంపెనీల్లో మరియు .DSR గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు జరుగు తున్నాయి. సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.  హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకత వకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు కొనసా గిస్తున్నారు.గడిచిన 5ఏళ్ల పన్నుల చెల్లింపు లపై ఐటీ ఆరా తీస్తున్నారు.  హైదరాబాద్ తోపాటు నెల్లూరు, చెన్నై, బెంగళూరులో మొత్తం 15చోట్ల సోదాలు కొనసాగించారు. హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ,SR నగర్ , సురారంలో ఐటీ సోదాలు నిర్వహించారు.హైదరాబాద్ నగరంలోని డిఎస్ఆర్ గ్రూపులో ఈరోజు ఉదయం నుండి ఐటి అధికా రులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇండ్లలో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.డి ఎస్ ఆర్ గ్రూపు లో రంజిత్ రెడ్డికి భాగస్వామ్య ఉంది. DSR ఎండీ సుధాకర్ రెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే సీఈఓ సత్య నారాయ ణరెడ్డి ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. CRPF బలగాల మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఫిలింనగర్ లో  డి ఎస్ ఆర్ భాగస్వామ్యంతో రంజిత్  రెడ్డి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.  

డాక్టర్ సునీత, సీబీఐ అధికారి రాంసింగ్ లపై కేసులు క్వాష్ చేస్తాం.. సుప్రీం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్ నుసుప్రీంకోర్టు మంగళవారం(ఆగస్టు 19)) విచారణ జరిపింది. జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌  సింగ్‌ లతో కూడిన ధర్మాసనం  వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందన్న లూథ్రా వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య సూత్రధారులు తెలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  వివేకా హత్య కేసు నిందితులు  సాక్ష్యులను బెదిరించడమే కాకుండా.. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న లూథ్రా, వివేకా కుమార్తె డాక్టర్  సునీత దంపతులతోపాటు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పైనా కేసు పెట్టారని సుప్రీంకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు వారిపై కేసులను క్వాష్ చేస్తామని పేర్కొంది.  లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ కడప ఎంపీ అవినాష్ రెడ్డే అని చెప్పారు.  

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖారరు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేశారు.  తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి  1971లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  ప్రాక్టీస్ చేశారు. 1988-90 మధ్యకాలంలో హైకోర్టులో ప్రభుత్వ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు.  1990లో కొంత కాలం పాటు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సె ల్‌గా కూడా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పని చేశారు. పనిచేశారు.1995 మేలో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమి తులయ్యారు. అంతే కాదు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేసిన బి. సుదర్శన్ రెడ్డి 2011లో పదవీ విరమణ చేశారు.  

జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ నిజమేనా?

గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు కానీ, ఆయన పార్టీ వైసీపీ తీరు కానీ ఇసుమంతైనా మారలేదు. మారడం అటుంచి ఓటమి తరువాత అన్నీ తామే, అన్నిటా తామే అన్నట్లుగా సొంత భజన చేసుకోవడంలో ఆ పార్టీ అధినేత, నాయకులు, శ్రేణులు మరింత ఆరితేరిపోయారు. అందుకు తాజాగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ తాజా సొంత భజన ఏమిటంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ సభ్యుల మద్దతు కోరుతూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారట. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి గట్టెక్కాలంటూ మీ మద్దతు అవసరం అంటూ ప్రాధేయపడ్డారట. అందుకు జగన్ పార్టీలో చర్చించి మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెబుతాననన్నారట. ఏ విధంగా చూసినా వైసీపీ చేసుకుంటున్న ప్రచారం నమ్మశక్యంగా లేదంటున్నారు. వాస్తవానికి ఉప రాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం కంటే ఎన్డీయేకిఎక్కువే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ మద్దతు కోసం జగన్ కు ఫోన్ చేసి మరీ అన్యధా శరణం నాస్తి అంటూ ప్రాథేయపడాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఆ విషయం తెలియని వారెవరూ ఉండరు. అయినా.. అంటే ఎవరూ నమ్మరని తెలిసినా సొంత బాజా వాయించుకునే విషయంలో వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి అడిగినా, అడగకపోయానా   ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వినా మరో గత్యంతరం లేని దుస్థితిలో  వైసీపీ ఉంది.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల భయంతో.. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేసే పరిస్థితి లేదు. అంతే కాదు.. బీజేపీ ప్రాపకం కోసం వారు అడగడానికి ముందే అన్ని విషయాలలోనూ కమలం పార్టీకీ, ఆ పార్టీ అగ్రనేతలకూ జై అనక తప్పని పరిస్థితి. వాస్తవం ఇలా ఉంటే.. వైసీపీ మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా  ఫోన్ చేసి ప్రాథేయపడ్డారంటూ ప్రచారం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.  

విద్యుదాఘాతాలు.. భాగ్యనగరంలో భద్రత గాలిలో దీపమేనా?

హైదరాబాద్లో  విద్యుత్ తీగలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. నగరంలో నిత్యం యాత్రలు, ప్రదర్శనలు, ఊరేగింపులూ జరుగుతూనే ఉంటాయి. అటువంటి సందర్భాలలో విద్యుత్ తీగలు జనాలకు మరణశాసనం లిఖిస్తున్న సందర్భాలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక రోజు వ్యవధిలో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మరణించిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.  తాజాగా  పాతబస్తీ బండ్లగూడలో గణేశ్‌ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే  అంబర్‌పేట్‌లో ఒక యువకుడు విద్యుత్‌ తీగలను తొలగించే క్రమంలో షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు శ్రీకృష్ణాష్ఠమి శోభాయాత్ర సందర్భంగా రామంతాపూర్ లో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలన్నీ కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగినవే.     కృష్ణాష్ఠమి శోభాయాత్ర సందర్భంగా  రథాన్ని లాగుతున్న జీపు ఆగిపోవడంతో భక్తులు చేతులతో తోస్తూ ముందుకు తీసుకెళ్లారు. కానీ  వేలాడుతున్న విద్యుత్‌ తీగ రథానికి తగిలి షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో  షాక్‌ తగిలి తొమ్మిది మంది కుప్పకూలారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇక సోమవారం నాడు నగరంలో జరగిన రెండు సంఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  పాతబస్తీలో గణేశ్‌ విగ్రహం తరలింపు సమయంలో విద్యుత్‌ తీగలను కర్రతో పైకెత్తే ప్రయత్నంలో షాక్‌ తగిలి  ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి సంభవించింది.  అంబర్ పేటలో విద్యుత్ తీగలను తొలగిస్తూ ఓ యువకుడు మరణించాడు.  విగ్రహాల తరలింపు, ఉరేగింపు, శోభాయాత్రల సమయంలో విద్యుత్ శాఖ, పోలీసులు, మునిసిపల్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. అవి విమర్శలు కాదు వాస్తవాలే అని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ప్రదర్శనలు, ఊరేగింపులు, శోభాయాత్రల మార్గంలో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఎక్కడ ఉన్నాయో గుర్తించి, ఆ మార్గంలో సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఈ మూడు శాఖలూ సమన్వయంతో పని చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగే అవకాశాలుండవని అంటున్నారు. ఇప్పటికైనా.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.  

నందమూరి పద్మజ కన్నుమూత

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు పెద్ద కోడలు నందమూరి పద్మజ కన్నుమూశారు. ఆమె వయస్సు 73ఏళ్లు.  శ్వాస సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ.  నందమూరి పద్మజ మరణంతో ఎన్టీఆర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అలాగే ఢిల్లీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కూడా హైదరాబాద్ కు బయలు దేరారు.  మిగతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 

పెద్దిరెడ్డి కుటుంబం పై ఫిర్యాదు.. దర్యాప్తు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అరాచకాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి.  కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ధైర్యం కలిగింది. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాతో ముందుకు వచ్చి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ కోవలోనే పెద్దిరెడ్డి కుటుంబంపై పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు అందింది.  అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి కుటుంబం పై ఓ వ్యక్తి  ఫిర్యాదు చేశారు.  2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన అంకయ్య చౌదరి ఈ ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల సమయంలో తాను పోలింగ్  బూత్ లను పరిశీలిస్తుండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారక నాథ రెడ్డి ప్రోత్సాహంతో తనపై దాడి చేసి తన కారు ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.   విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో  జిల్లా ఎస్పికి ఫోన్  చేసిన తర్వాతనే  తనకు రక్షణ కల్పించారని అంకయ్య చౌదరి  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు ప్రోత్సాహించిన పెద్దిరెడ్డికుటుంబం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఏపీలో ఒక్క రోజే 18 లక్షల మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణం

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన క్షణం నుంచీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఉత్సాహం చూపుతున్నారు. దీంతో  ఈ పథకం ప్రారంభంతోనూ అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకానికి ఆదరణ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 18) ఒక్క రోజులోనే  18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణించారు. అంటే దాదాపు 7 కోట్ల రూపాయల వరకూ మహిళలు ఈ ప్రయాణాల ద్వారా ఆదా చేసుకున్నారన్న మాట.  ఈ పథకంప్రారంభమైన  నాలుగు రోజుల్లోనే  47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు  19 కోట్ల రూపాయల మేర వారికి ఆదా అయ్యింది.   అంతే కాకుండా..  రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అయ్యిందన్న విషయాన్ని మహిళలు అధికారులకు తెలియజేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఇలా ఉండగా   స్త్రీశక్తి పథకం వర్తించే బస్సు సర్వీసులను మహిళలు సులభంగా గుర్తిం చేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

తిరుపతిలో మరో చిరుత సంచారం.. మళ్లీ భయం గుప్పిట్లోకి జనం

మూడు నెలలు  ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కిందని ఊపిరి పీల్చుకున్నంత సేపు పట్టలేదు తిరుపతి జనాలకు. మరో చిరుత కూడా తిరుపతి నగరంలో సంచరిస్తోందన్న వార్తతో వారు మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు. సోమవారం (ఆగస్టు 18) అటవీ అధికారులు ఎస్వీ యూనివర్సిటీ వద్ద అమర్చిన బోనులో చిరుత చిక్కడంతో గత మూడు నెలలుగా భయం భయంగా గడిపిన తిరుమల జనం ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద సంచరిస్తూ  కుక్కలు, దుప్పులు, జింకలను చంపేస్తూ వచ్చింది.  అంతే కాకుండా జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. దీంతో చిరుత దాడికి ఎప్పుడు ఎక్కడ గురి అవ్వాల్సి వస్తుందో అన్న భయంతో విలవిలలడిన తిరుపతి వాసులు చిరుత బోనులో చిక్కడంతో హమ్మయ్య అనుకున్నారు. అయితే  అంతలోనే మరో చిరుత కూడా తిరపతి నగరంలో సంచరిస్తోందన్న వార్త వారిని బెంబేలెత్తిస్తోంది. సోమవారం (ఆగస్టు 18) సాయంత్రమే మరో చిరుత  కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  మంగళం రోడ్డులోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో  చిరుత కదలికలు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో ఆ చరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరిగా ఎవరూ ఆ ప్రాంతంలో సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష  దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ( ఆగస్టు 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టెకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయప ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్ల భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 18) శ్రీవారిని మొత్తం స్వామివారిని మొత్తం 80,502 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది. 

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థితో మంత్రి లోకేష్ భేటీ

  ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి  సీపీ రాధాకృష్ణన్‌ను  రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన్ను భేటీ అయ్యారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన పరిచయాన్ని లోకేశ్‌తో సీపీ రాధాకృష్ణన్ పంచుకున్నారు. ఈనెల 20వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.  

శ్రీశైలం డ్యాంకు భారీగా పెరుగుతున్న వరద

  నంద్యాల జిల్లా  శ్రీశైలం డ్యామ్‌కు  భారీవరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో  శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్కులు నీరు, అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీ నది నుండి  3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.  మొత్తంగా ఇన్ ఫ్లో 3,29,145 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను  12 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.8070 టి.ఎం.సి. లు కాగా, ప్రస్తుతం 197.0114 టి.ఎం.సి లుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు .  

సినిమాల్లో హీరో.. రియల్ లైఫ్ విలన్

  ఓ హీరో సినిమాలో  బాగా నటించాడు.. కానీ నిజజీవితంలో మాత్రం జీవించాడు. అతని పర్ఫామెన్స్ తట్టుకోలేక అతని భార్య పోలీసులను ఆశ్రయించింది...ఆ హీరో మరి ఎవరో కాదండోయ్...ధర్మా మహేషే... అవును ఇతనిపై కేసు నమోదు అయింది. ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్... సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటిం చాడు. సినిమాలో ఎదుగుతున్న సమయంలోనే ఇతనికి పెళ్లి జరిగింది.  అయితే ఈ హీరో సినిమాల్లో హీరో గా నటిస్తు..అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం విలన్ పాత్ర పోషించి... భార్య కు నరకం చూపిస్తు న్నారు.. హీరో మహేష్ మూవీ అవకాశాలు రాక పోవడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడి... ప్రతినిత్యం అదనపు కట్నం కోసం  తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ హీరో ధర్మ మహేష్ భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాధితురాలు ఇచ్చిన తరువాత మేరకు హీరో పై గచ్చిబౌలి మహిళ పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల పై కేసు నమోదు చేశారు

క్వాంటమ్ వ్యాలీకీ ఆర్థిక సాయం అందించండి..అశ్వనీ వైష్ణవ్‌తో లోకేష్ భేటీ

  అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు  సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.  మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఐటి పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటి పరిశ్రమ విస్తరించేలా ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మినెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ రూల్స్ లో  సవరణలు చేపట్టండి. విదేశీ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్ లో ఐపిని కాపాడుతూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఎఐ శిక్షణ,  టెక్స్ట్ అండ్ డాటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ – 52కి కాపీరైట్ చట్టసవరణ చేపట్టాలి.  భారతదేశంలో మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కును, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా  అధికారికంగా కేంద్రస్థాయి ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు. క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 300 కోట్లు సాయం అందించండి. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి. అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్, ఇండియా ఇన్నోవేషన్ వీక్ – 2026ను నిర్వహణకు అవకాశం కల్పించండి.  అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రిసెర్చి ఇనిస్టిట్యూట్, ఐఐటి/ఐఐఎస్ సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి. జాతీయ విద్యావిధానం – 2020 (NEP) కింద ఫెలో షిప్ ప్రోగ్రామ్ లు, ఎఐ యూనివర్సిటీ, పాఠశాల స్థాయిలో స్టెమ్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్లోబల్ డాటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఫ్యాబ్ లు, గ్లోబల్ ఐటి సామర్థ్యాల కోసం ఎపి ప్రభుత్వం 2024-25లో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహకాలను అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.  ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్, డేటా ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, AI & డీప్ టెక్, విజువల్ ఇంటెలిజెన్స్, పీపుల్ పర్సెప్షన్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల్లో డేటా లేక్, RTGS లెన్స్, PGRS, CPGRAMS, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్ట్, KPI డాష్‌బోర్డ్‌లు, AWARE ప్లాట్‌ఫామ్, ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు.  డేటా సెంటర్ పార్కు, క్వాంటమ్ వ్యాలీ, ఆర్ టిఐహెచ్ లను వికసిత్ భారత్ -2047లో అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ను జాతీయస్థాయి ఆవిష్కరణల్లో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు. సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల, ఇ-గవర్నెన్స్, డీప్ టెక్ పరిశోధన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఇల ప్రోత్సాహానికి ఎపిలో సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్టవ్ అంగీకారం తెలిపారు.

ఎన్నికల కమిషన్ బీజేపీ ప్లేయర్‌గా కాదు.. అంపైర్‌గా ఉండాలి : తులసి రెడ్డి

  ఓటర్ల జాబితాలో అవకతవకలకుగానూ ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని  రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. సోమవారం కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అంపైర్ లా కాకుండా బీజేపీ టీమ్ ప్లేయర్ గా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. ప్రజా స్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువని, అటువంటి ఎన్నికలకు సక్రమమైన ఓటర్ల జాబితా ప్రామాణికమని,కానీ అటువంటి ఓటర్ల జాబితాలో కొందరు అర్హులకు చోటు లేకపోవడం,కొందరు అనర్హులు ఉండడం సర్వ సాధారణం అయిందన్నారు.  ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు గానూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అవక తవకలు ఉన్నందుకు ఎన్నికల కమిషనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా  ఓటర్ల జాబితాలో అవక తవకలు ఉన్నాయని అన్నారు. మరి ఆయనను కూడా క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ అడగాలి కదా అని ప్రశ్నించారు. నిస్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ నియామకమే పక్షపాతంతో కూడుకొని ఉందని, నియామక కమిటీలో ప్రధాన మంత్రి,లోక్ సభలో ప్రతి పక్ష నాయకుడు తో పాటు న్యాయ మూర్తి బదులు కేంద్ర మంత్రి ఉండడమే  ఇందుకు కారణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్  నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని తులసి రెడ్డి కోరారు.

ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా

  భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిని కలిశారు. ఈ నేపథ్యంలో మోదీని కలిసి తన అంతరిక్ష యాత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రధాని ఆయనను ఆప్యాయంగా హత్తకుని సరదాగా ముచ్చటించారు. కాగా శుభాంశు చరిత్రాత్మక మిషన్‌ను ప్రశంసిస్తూ ఇవాళ పార్లమెంట్‌ల్లో ప్రత్యేక చర్చ జరిగింది. మోడీకి శుక్లా యాక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను బహుకరించారు. అలాగే, అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను చూపించారు. అనంతరం, ఇద్దరూ భారత్‌లో అంతరిక్ష రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. కాగా, అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించారు. 18 రోజుల ఈ మిషన్‌లో శుక్లా మిగతా వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్‌లో 60 కంటే ఎక్కువ ప్రయోగాలు, 20 అవుట్‌రీచ్ సెషన్‌లను నిర్వహించారు.