రెండు రోజులు అతి భారీ వర్షాలు..తెలంగాణకు రెడ్ అలర్ట్

  తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ‌, రేపు రెడ్ అల‌ర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, భ‌ద్రాద్రి, మెద‌క్‌, వికారాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల‌కు రెడ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే కామారెడ్డి, జ‌న‌గామ‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి, సిద్ధిపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల‌కు ఆరెంజ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిపారు.  రాష్ట్ర‌ వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని నాగ‌ర‌త్న తెలిపారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 20 సెంమీటర్ల వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు

వైసీపీది బహిష్కరణ కాదు పలాయనమన్న బీటెక్ రవి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కావాలని డిమాండ్ చేసి మరీ సాధించుకున్న వైసీపీ.. ఆ రీపోలింగ్ ను బహిష్కరించింది. కోరి సాధించుకున్న రీపోలింగ్ ను బహిష్కరించడానికి కారణం జనం వారి వైపు లేరని తెలిసిపోవడం వల్లనే అంటున్నారు పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పుణ్యాన వైసీపీయులకు  పులివెందులలో వారి పరిస్థితి ఏమిటో? వారి బలం ఏమిటో తెలిసివచ్చిందనీ, దీంతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందని బీటెక్ రవి అన్నారు. బుధవారం (ఆగస్టు 13) పులివెందులలో మీడియాతో మాట్లాడారు.  పులివెందుల చరిత్రలో దాదాపుగా ఎన్నడూ లేని విధంగా జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిందన్నారు. ఆ ఎన్నిక కూడా చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిందన్న బీటెక్ రవి.. వైసీపీ మాత్రం కొందరి చేత ఓట్లు వేయలేకపో యామంటూ చెప్పించి, వాటిని వీడియోలు తీసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రీపోలింగ్ కోరిందన్న బీటెక్ రవి.. వారు కోరినట్లు ఎన్నికల కమిషన్ రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశించిందనీ, అయినా కూడా రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించడం పలాయనం కాక మరేమౌతుందని ప్రశ్నించారు.   ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాము 15 కేంద్రాలలో రీపోలింగ్ కావాలని అడిగితే.. ఎన్నికల కమిషన్ రెండు చోట్లే రీపోలింగ్ కు ఆదేశించిందంటూ కొత్త వాదనకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకముంటే.. రీపోలంగ్ లో పాల్గొనాలని సవాల్ చేశారు.   ప్రజలు తమ వెంట లేరని తెలియడం వల్లనే వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించి పలాయనం చిత్తగించిందని బీటెక్ రవి అన్నారు. 

ఆర్జీవీ అరెస్టు విడుదల.. విషయమేంటంటే..?

వివాదాలతో నిత్యం సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) అరెస్టు చేశారు. ఆ వెంటనే ఇద్దరు వ్యక్తుల సూరిటీతో స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో  రామ్ గోపాలవర్మ ఇష్టారీతిగా, అడ్డగోలుగా తెలుగుదేశం, జనసేన నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలాగే  ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుచి అక్రమంగా  రెండు కోట్ల రూపాయలు  పొందడం సహా మరికొన్ని కేసులు కూడా రామగోపాల్ వర్మపై నమోదయ్యాయి. వాటిపై ఒంగోలు పోలీసులు రామగోపాల్ వర్మను మంగళవారం (ఆగస్టు 12) దాదాపు 11 గంటల పాటు విచారించారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు సహకరించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన తెలియదు, గుర్తులేదు అన్న సమాధానాలే ఇచ్చారు. అంతే కాకుండా..  తన ట్విట్టర్ అకౌంట్ ను తాను మాత్రమే కాకుండా మరికొందరు కూడా వాడారనీ, పోలిటికల్ పోస్టులన్నీ వారు పెట్టినవేననీ రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన ట్విట్టర్ అక్కౌంట్ ను వాడిన మరి కొందరి పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదని తెలిసింది. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అక్కౌంట్ ను వైసీపీకి కిరాయికి ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదలా ఉంచితే.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో పోలిటికల్ పోస్టు అన్నదే కనిపించలేదు. అలాగే మీడియా, సోషల్ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. అరెస్టు భయంతోనే ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక ఒంగోలు పోలీసులు విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన ఫోన్ ను సీజ్ చేశారు.   

అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి బాలయ్య శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావలితో  బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్   నిర్మాణానికి హందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం (ఆగస్టు 13) శంకుస్థాపన చేశారు.  ఆ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తదితరులు హాజరయ్యారు.  ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం  సీఆర్డీయే  21 ఎకరాల భూమిని కేటాయించింది.  ఈ ఆస్పత్రిని రెండు దశలలో నిర్మించనున్నారు. తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించి మలి దశలో వెయ్యిపడకలకు విస్తరించనున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అప్పట్లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఆస్పత్రి నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.   బసవరామతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ హైదరాబాద్ లో సేవలందిస్తున్నది. క్యాన్సర్ చికిత్సలో విశ్వసనీయతకు పేరుగాంచింది. ఇప్పుడు అమరావతిలో  బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సిద్ధమైంది. అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని తుళ్లూరులో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ అభివృద్ధి చేయనుంది.  క్యాన్సర్ చికిత్సను ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా అవసరమైన చోట ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సంకల్పించింది. అమరావతిలో  21 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ హాస్లిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  సమగ్రమైన క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటూ క్యాన్సర్ పేషెంట్  కేంద్రీకృత సంరక్షణ కోసం ఒక ఎక్స్ లెన్సి సెంటర్ గా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతోంది.     750 కోట్ల రూపాయల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు,  క్లినికల్ ఎక్స లెన్స్‌పై దృష్టి పెట్టింది. అలాగే , అధునాతన రేడియేషన్, ఆపరేషన్,  టెక్నాలజీతో  ఖచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్సా వ్యవస్థల ఏర్పాటు చేయనుంది.  క్యాన్సర్ నివారణ,   ముందస్తు గుర్తింపు, చికిత్స, పునరావాసం ఇలా  ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ ను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో 2028 నాటికి ఆపరేషన్లు ప్రారంభమౌతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

పులివెందులలో ఎన్నిక జరిగితే.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటారేంటి?

గత ఏడాది ఎన్నికలలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక జరిగినా రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేక ఓడిపోతున్నాం అంటున్నారు వైసీపీ నేతలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పించి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసిన వైసీపీ.. ఇప్పుడు ఆ పార్టీ అడ్డాగా చెప్పుకునే పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరిగినా చేతులెత్తేసింది.  ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలోనే జరిగిందిగా అన్న ప్రశ్నకు   సమాధానం చెప్పలేక గుటకలు మింగుతోంది. వాస్తవానికి పులివెందులలో ఎన్నిక.. అదీ బ్యాటెల్ పద్ధతిలో అంటే.. వైపీపీ నేతలు విజయంపై ధీమాగా ఉండాలి. అయితే అలా లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగితే ఎలా గెలుస్తాం అనుకున్నారో ఏమో పోలింగ్ రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తమ అనుచరులతో రెచ్చిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడాన్ని అడ్డుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించారు.  పోలీసులు ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని గృహనిర్బంధం చేసినా తప్పించుకుని మరీ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసి, పోలింగ్ బూత్ లలోకి చొచ్చుకుపోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగి నానా హడావుడీ చేశారు.  జగన్ అడ్డా ఇక్కడ తిరుగేలేదు అంటూ ఇంత కాలం విర్రవీగిన వైసీపీయులు అదే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి భయంతో వణికిపోయారు. మా అడ్డాలో మమ్మల్ని రిగ్గింగ్ చేసుకోనివ్వరా, పోలింగ్ బూత్ లను కబ్జా చేయనియ్యరా? ఇదెక్కడి చోద్యం అన్నట్లుగా వారు గలాటా చేసైనా సరే బూత్ లను కబ్జా చేయాలని ప్రయత్నించారు.  ఓటమి భయంతో వణికిపోయారు. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కోల్పోతే అది తెలుగుదేశం విజయం అనికానీ, వైసీపీ ఓటమి అని కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ భావించరు. దానికి వైఎస్ జగన్ ఓటమి అనే అంటారు. అంతే కాదు.. ఈ ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై పడుతుంది. దింపుడు కళ్లెం ఆశతో ఇంకా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన క్యాడర్ చెల్లాచెదురైపోతుంది. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో జగన్ పలచన అయిపోతారు. అందుకే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో వైపీపీ గాభరాపడుతోంది.   సొంత అడ్డాలో ఇంత చిన్న ఎన్నికలను ఎదుర్కోలేకపోతే రేపు సార్వత్రిక ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటామని క్యాడర్ నీరుగారిపోతుందనీ, పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని బెంబేలెత్తి పోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. కానీ జనం మాత్రం 11 మంది బరిలో నిలిచి ఎన్నిక  జరిగితే.. ఆ ఎన్నికలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైతే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లినట్లౌతుంది కానీ ఖూనీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 

పులివెందులలో వైపీపీది బలం కాదు వాపేనా?

కంచుకోట అనుకున్న పులివెందుల పేకమేడ అని తేలిపోయిందా? వైసీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫలితాల వెల్లడికి ముందు.. కాదు కాదు పోలింగ్ కు ముందే కాడి వదిలేసిందా? అడలేక మద్దెలు ఓడు అన్న చందంగా పులివెందులలో తమ పరిస్థితికి పోలీసులే కారణం అంటోందా? అంటే వైసీపీ నేతల వ్యాఖ్యలు, హెచ్చరికలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది.   పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో  పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. మూడు దశాబ్బాలకు పైగా జడ్పీటీ స్థానానికి ఎన్నిక అంటే ఏమిటో తెలియని పులివెందుల జనాలకు ఇప్పుడు తోలిసారిగా ఓటు వేస్తున్నామన్న ఆనందం కలిగింది. అదే సమయంలో పటిష్ట బందోబస్తుమధ్య ఎన్నికల నిర్వహణతో వైసీపీయులకు రిగ్గింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. మా అడ్డాలో ప్రజాస్వామ్యం ఏమిటి? అంటూ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాకీ మీ ఉద్యోగాలు తీసేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.  మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడపీకుతాం..అంటూ  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అయితే వాస్తవంలో పోలీసులు తెలుగుదేశం, వైసీపీ నేతల పట్ల సమంగానే వ్యవహరించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయినా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మందితో ప్రదర్శనలు నిర్వహించారు. పోలింగ్ బూతులలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగా లుండవు జాగ్రత్త అంటూ హెచ్చరికలకు దిగుతున్నారు. మొత్తం మీద పులివెందులలో వైసీపీది బలం కాదు, వాపు మాత్రమేనని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రుజువు చేసిందని పరిశీలకులు అంటున్నారు.  

రీపోలింగ్ ను బహిష్కరించిన వైసీపీ

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గగ్గొలు పెట్టారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన ఆరోపించిన రెండు పోలింగ్ కేంద్రాలలోనూ ఈ బుధవారం ( ఆగస్టు 13) రీపోలింగ్ కు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రారంభమైంది. అయితే వైసీపీ మాత్రం ఈ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మూడు దశాబ్దాలపై పైగా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిన చరిత్రలేదు. ఎప్పుడూ ఇక్కడ ఏకగ్రీవమే. తొలి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతోంది. బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే వైసీపీ మాత్రం పోలింగ్ ప్రారంభానికి ముందే చేతులెత్తేసి నియోజకవర్గంలో గలాభా సృష్టించి, పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరే అదలా ఉంచితే.. వైసీపీ ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు రెండు కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే.. ఆ రీపోలింగ్ ను కూడా బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుని ఓటమిని ముందే అంగీకరించేసింది. ఇలా ఉండగా రీపోలింగ్ జరుగుతున్న కేంద్రాలలో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాది.  

పులివెందులలో నేడు రీ-పోలింగ్

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మంగళవారం (ఆగస్టు 12)న జరిగిన ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం (ఆగస్టు 13) రీపోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం (ఆగస్టు 14) కడపలో జరగనుంది. 

కన్నకొడుకుతో పాటే అతడికి ఇష్టమైన బైక్ సమాధి

ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు.. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకూ సాధ్యం కాదు. వారి బాధకు అంతే ఉండదు.ఆ కడుపుకోత భరించడం ఎంతటి వారికైనా కష్టమే.  తాజాగా కన్నకొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తండ్రి.. తన కుమారుడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేయడం కంటనీరు తెప్పించింది. వివరాల్లోకి వెడితే.. గుజరాత్ జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల క్రిష్ పర్మార్ మరణించాడు. ఇటీవలే 12 స్టాండర్డ్ పాస్ అయిన ఆ యువకుడు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) ప్రోగ్రామ్‌లో చేరాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తను జాయిన్ కావాలనుకున్న కాలేజీకి వెళ్లాడు. వెళ్లి తన సర్టిఫికేట్స్ చూపించాడు. చేరాలనుకున్న కోర్సు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అన్ని ఓకే అనుకున్నాక ఆడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యాడు.  హ్యాపీగా తన బైక్ మీద ఇంటికి బయల్దేరాడు. కాలేజీ నుంచి కొద్ది దూరంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. 12 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశాడు.  కన్నకొడుకు మరణించడంతో అతని తల్లిదండ్రుల దుఖానికి అంతే లేకుండా పోయింది.   చివరకు తమ కొడుకు మృతదేహాకి అంత్యక్రియలు చేసే సమయంలో అతడికి ఎంతో ఇష్టమైన అతడి బైక్ ను కూడా అతడితోనే సమాధి చేశారు.  క్రిష్ కు మోటార్ సైకిల్ అంటే ఎంతో ఇష్టం.   కారు ఉన్నప్పటికీ, అతడు బైక్ మీదే ప్రయాణించే వాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేశారు.   ఈ దృశ్యం   వారందరినీ ఎంతో కదలించివేసింది. 

పాఠశాలలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం (ఆగస్టు 13)  నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో  సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యోగుల సెలవులను రద్దు చేశారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  కుండపోత వర్షాల సూచనతో ముందు జాగ్రత్తగా స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు. హనుమకొండ, వరంగల్, జనగామ, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఇక హైదరాబాద్ నగరంలో రేవు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని పేర్కొంది. 

చికాగోలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి

చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని మరణించింది.  మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం  దుందిగల్  బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనురావు పెద్ద కుమార్తె 23 ఏళ్ల శ్రీజ వర్మ  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది. చికాగోలో ఉంటూ పీజీ చేస్తున్నది.  సోమవారం (ఆగస్టు 11)  రాత్రి సమయంలో డిన్నర్ చేయడం కోసం అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెడుతున్న శ్రీజవర్మను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీజ అక్కడికక్కడే మరణించింది. అయితే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ట్రక్ ను ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె  మరణవార్తతో శ్రీజ తల్లిదండ్రులు దుఖసాగరంలో మునిగిపోయారు.  

గట్టు వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి.. సుప్రీం ఆదేశం

తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం (ఆగస్టు 12) ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తనకే అందజేయాలని కూడా సుప్రీం కోర్టు విస్పష్టంగా ఆదేశించింది ఈ హత్య కేసులో దోషులు ఎవరినీ వదిలిపెట్టరాదని, రాజకీయ ఒత్తిళ్లు,  పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు సీబీఐకి విస్పష్ట ఆదేశాలిచ్చింది.  ఇక గట్టువామనరావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరిలో జరిగింది. దంపతులిద్దరూ హైకోర్టు న్యాయవాదులు. పెద్దపల్లికి చెందిన వీరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.  భూములకు సంబంధించిన వివాదంపై ఓ కేసులో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు తమపై పగబట్టారని వామనరావు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు.   పుట్ట మధు సోదరులు తమపై కత్తి కట్టారని, వారే తమ హత్యకు కారకులనీ వామనరావు ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.  2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాకు వెళ్లి వస్తున్న సమయంలో కల్వచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డుకుని, నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదులు వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణను పూర్తి చేసింది. అయితే, అసలు నిందితులను తప్పించారని ఆరోపిస్తూ వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటి షన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు,  తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం కోరింది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ సర్కార్ సుప్రీంకు తెలిపింది.  అలాగే వామనరావు మరణవాంగ్మూలం సరైనదేనని  ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక స్పష్టం చేయడంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  

మూసీ ప్రక్షాళనకు శ్రీకారం.. రియాల్టీలోకి రానున్న రేవంత్ అభీష్టం

వీకెండ్ లో మూసీ క్లీన్ వాటర్ లో బోటింగ్ కు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. చుట్టూ గ్రీనరీ.. ఐకానిక్ టవర్లు.. సరికొత్తగా బ్రిడ్జిలు.. మధ్యలో బోటింగ్.. మన హైదరాబాద్ లో ఈ సీన్ ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. మరి ఇది నిజమైతే ఎలా ఉంటుంది? మూసీ మురుగు, దుర్గంధం, ఇంకో వైపు పొల్యూషన్ ఇలా రకరకాల సమస్యల్లో ఉండే సగటు హైదరాబాదీకి ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వడం పక్కా. అయితే అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇన్నాళ్లూ పేపర్ వర్క్ గా జరిగింది.. ఇప్పుడు రియాల్టీ కాబోతోంది.  హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఓ సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున నిధులూ అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అదే ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోంది. ఇన్నాళ్లూ జరిగిన పేపర్ వర్క్ ముగిసింది. ఇప్పుడు అసలు వర్క్ మొదలు కాబోతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 4,100 కోట్ల రూపాయల రుణాన్ని అందించబోతోంది. ఈ రుణంతో హైదరాబాద్ సిటీలో 55 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగపడబోతోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం సిటీని వరదలు లేని నగరంగా మార్చడం, మూసీ ఒడ్డున పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,050 కోట్లను ఏడీబీ ఇవ్వబోతోంది. ఇక రెండో విడతలో మిగిలిన 2,050 కోట్లు ఇస్తారు. వీటితో నది శుద్ధి, కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, రివర్‌ఫ్రంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  చేపడతారు.  లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ కు మాత్రమే పరిమితం అయ్యాయి.  నదిలో నీళ్లు బాగుండాలి. అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవకూడదు. అప్పుడే మూసీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది.  సో రేవంత్ రెడ్డి  అక్కడి నుంచే పనులు షురూ చేయబోతున్నారు.  మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్‌లు, నైట్ మార్కెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలు, రిలాక్సేషన్ జోన్లు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు బాపూ ఘాట్ నుంచి  21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తారు. సింగపూర్‌కు చెందిన మీన్‌హార్డ్ గ్రూప్‌ను డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది.  మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే  రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏమేం చేస్తే వర్కవుట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. మొదటి దశలో 13ఎస్టీపీలను నిర్మించడం ద్వారా రోజుకు 970 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. రెండో దశలో మిగిలిన 34 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఇందులో పర్యాటక సౌకర్యాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.  సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీ అధికారులతో చేసిన రివ్యూలో ఇటీవలే కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. మూసీ అభివృద్ధికి ఐకానిక్ డిజైన్‌ను ఎంచుకోనున్నారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్‌ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి.. మొత్తం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రలక్ష్యంగా పెట్టుకున్నారు. నిజంగా అది సాకారమైతే హైదరాబాద్ వాసులకు పండుగే.

దర్శకుడు ఆర్జీవీ సెల్ ఫోన్ స్వాధీనం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు సంచలనం. అద్భుత టేకింగ్ తో తనదైన మేకింగ్ స్టైల్ తో అలనాడు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే సినిమాల ద్వారా కాదు.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టుల ద్వారా. అటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యూహం' సినిమా విడుదల సమయంలో  చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో  రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో అరెస్టు కాకుండా రామ్ గోపాల్ వర్మకు బెయిలు అయితే మంజూరైంది కానీ, పోలీసు విచా రణకు వారు పిలిచినప్పుడల్లా వెళ్లాలన్న షరతు విధిస్తూ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఒక సారి పోలీసు విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ.. పోలీసుల నోటీసుల మేరకు మంగళవారం (ఆగస్టు 12) మరోసారి ప్రకాశం జిల్లా ఓ:గోలు తాలూకా పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు.  ఈ సందర్భంగా పోలీసులు రామ్ గోపాల్ వర్మ పోన్ ను సీజ్ చేశారు. వాస్తవానికి గతంలో ఆయన విచారణకు హాజరైన సందర్భంలోనే ఆయన పోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవలసింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు ఫోన్ తీసుకురాకపోవడం వల్ల పోలీసులు ఆయన ఫోన్ ను సీజ్ చేయలేకపోయారు. అయితే ఈ సారి ఫోన్ తీసుకురావాలని నోటీసులలోనే పేర్కొన్న పోలీసులు ఆయన నుంి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఉండగా జగన్  హయాంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ సహా తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ పొటోలతో నిత్యం వార్తలలో నిలిచారు. ఇప్పుడు ఆ పోస్టింగులకు సంబంధించిన కేసులలోనే పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.   

చంద్రబాబు సర్కారు మరో రికార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు మరో రికార్డు సృష్టించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగంతో జస్టిస్ ఇండియా ర్యాంకింగ్‌లో ఆయన హయాంలో రాష్ట్రం దిగువకు పడిపోయింది .  2019 నుంచి 2024 వరకు ఏపీ ర్యాంకింగ్ దిగజారుతూనే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చిందని ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడించింది . పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో సైతం ఏపీ పనితీరు బాగా మెరుగైనట్లుగా స్పష్టం చేసింది. ఏపీలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ కేటాయించింది. ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో మొదటిస్థానంలో కర్ణాటక నిలిస్తే.. 6.32 స్కోర్‌తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నది.

ప్ర‌కాష్ రాజ్ కి ఏపీలో ఏం ప‌ని?

నటుడు ప్ర‌కాష్ రాజ్ కి ఏపీ.. సామాజిక- ఆర్ధిక- రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న అంతంత మాత్రం. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్లుగా   రాజ‌ధాని లేని రాష్ట్రంగా అవ‌స్థ‌లు ప‌డుతోంది. స‌రే ఎట్ట‌కేల‌కు ఈ రాష్ట్రానికంటూ ఒక అవ‌కాశ‌మొచ్చింద‌ని.. అమ‌రావ‌తే ఆ రాష్ట్ర రాజ‌ధాని అని సంబ‌ర ప‌డేలోపు.. ఏ దుష్ట‌క‌న్ను ప‌డిందో.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో కథ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. జ‌నం సొమ్ము ప‌ప్పుబెల్లాల్లా ఖ‌ర్చు చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అదే జ‌నం చేత దారుణ‌మైన ప‌రాభ‌వానికి లోనై ఘోర‌మైన ఓట‌మి పాల‌య్యారు. ఒక‌ప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్ల‌లో కొంద‌ర్ని లాక్కుంటే ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా  పోతుంద‌ని బాబును భ‌య‌పెట్టిన జ‌గ‌న్ చివ‌రికి ప్ర‌తిప‌క్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. క‌ర్మ రిట‌ర్న్స్ థియ‌రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మిగిలిపోయారు.  ఇదంతా అలా ఉంచితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధానిని  పున‌ర్నించుకోవ‌డంలో భాగంగా.. పెద్ద ఎత్తున నిధులు స‌మ‌కూర్చుకుంటూ.. వ‌చ్చే రోజుల్లో ఎవ‌రెన్ని చేసినా స‌రే.. ఇక్క‌డి నుంచి రాజ‌ధాని మార్చ‌డానికి వీల్లేని విధంగా ఒక చ‌ట్టం తేవాల‌ని నిర్ణయించింది. ఐదేళ్ల పాటు ప‌నులు ప‌డ‌కేసిన పోల‌వ‌రంతో పాటు, బ‌న‌క‌ర‌చ‌ర్ల‌ను సైతం నిర్మించే ఆలోచ‌న చేస్తోంది  చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం. ఆపై విశాఖ ఉక్కును కాపాడుకోడానికి మొన్న‌టికి మొన్న 11500 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం నుంచి పొందింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. మ‌రెన్నో కంపెనీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాట‌ప‌డ్డానికి ముమ్మ‌ర‌ య‌త్నాలు కొన‌సాగిస్తోంది బాబు నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం. ఒక ప‌క్క రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చ‌డానికి.. మ‌రో ప‌క్క‌ సుద‌ర్ఘ తీర ప్రాంత‌మైన ఏపీని అందుకు అనువుగా మార్చుకోడానికి.. చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తున్నది. ఒక వేళ జ‌గ‌న్ తిరిగి వ‌స్తే ప‌రిస్తితేంట‌ని స్వ‌యంగా  పెట్టుబడి దారులు అడ‌గ‌టంతో ఆ భ‌యాన్ని తొల‌గించ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్క‌డిన్ని స‌మ‌స్య‌లుంటే ఎలాంటి మంత్రిత్వం చేసిన అనుభ‌వం లేకుండా ఏకంగా ముఖ్య‌మంత్రి అయ్యి.. ఆపై త‌న ఓట్ల కోసం.. స్వార్ధంతో కొంద‌రికి ఎడా పెడా డ‌బ్బులు పంచేసి.. ఆపై వారి ద్వారా కూడా స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోక ఘోరంగా ఓడారు జ‌గ‌న్. ఇదంతా ప‌క్క‌న పెట్టి రాహుల్ గాంధీ ఏదో ప్రెజంటేష‌న‌న్ ఇచ్చారని చెప్పి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ప్ర‌కాష్ రాజ్ అవాకులు చ‌వాకులు పేలుతున్నారు. నిజానికి ఆయ‌న‌కున్న అభ్యంత‌రం స‌నాత‌న ధ‌ర్మం. బేసిగ్గానే ప్ర‌కాష్ రాజ్ ఒక సెక్యుల‌రిస్ట్. ఆయ‌న బ్యాగ్రౌండ్ అలాంటిది. నేడు మోడీ అన్నా, బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా గిట్ట‌క జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తూ కాల‌యాప‌న చేస్తుంటారు ప్ర‌కాష్ రాజ్. ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా అన్ ఫిట్ అంటోన్న ప్ర‌కాష్ రాజ్ తాను పుట్టిన బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగ‌ని త‌న రాజ‌కీయాల‌ను ఆప‌క తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనూ టాలెంట్ చూపించాల‌ని ట్రై చేశారు. మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసి అక్క‌డా దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ టార్గెట్ చేసిన ప‌వ‌న్ అన్న నాగ‌బాబు ప్రకాశ్ రాజ్ కోసం ఎంత పోరాడినా  ప్రకాశ్ రాజ్ మాత్రం మా ఎలెక్ష‌న్లో నెగ్గ‌లేక పోయారు. ఇప్పుడ‌దే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ల‌క్ష్యంగా చేస్కుని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ  క‌న్న‌డ న‌టుడు. ఇలాంటి వారిని ఎంక‌రేజ్ చేయొద్ద‌ని మొన్న దివంగ‌తులైన కోట శ్రీనివాస్ ప‌దే ప‌దే చెప్పిన సంగతి ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.  ప‌వ‌న్ ఇటీవ‌ల స‌నాత‌న ధ‌ర్మ‌సార‌ధిగా ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డంతో.. ప్ర‌కాష్ రాజ్ ఇంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలాగుంటే.. రాహుల్ గాంధీ ప్రెజంటేష‌న్ అడ్డు పెట్టుకున్న ప్ర‌కాష్ రాజ్ ఏపీలో కూట‌మి గెలిచిందంటే అందుకు కార‌ణం ఈవీఎంగా చెప్పుకొస్తున్నారు. ఒక వేళ అదే నిజ‌మైతే.. రాహుల్ గాంధీ డైరెక్ట్ గా ఏపీనే ఉద‌హ‌రించేవారు క‌దా? మ‌ర‌లా ఎందుకు చేయ‌లేదు? ఆయ‌న మాట‌ల్లో చేత‌ల్లో ఎక్క‌డా ఏపీ ప్ర‌స్తావ‌న ఎందుకు లేదు? ఇదొక ప్ర‌శ్న కాగా.. రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లోని మ‌హ‌దేవ్ పుర అనే నియోజ‌క‌వ‌ర్గం గురించి, ఆపై మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించారు. త‌ప్పితే ఎక్క‌డా ఏపీ వివ‌ర‌ణ‌ చేయ‌లేదు. అంటే దీన‌ర్ధ‌మేంటి? ఇంత రీసెర్చ్ చేశాన‌ని చెబుతున్న  రాహుల్ కి ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూట‌మి గెలిచిన‌ట్టు ఆధారాలు ఎక్క‌డా క‌నిపించ‌లేద‌నేగా? క‌నీసం ఆయ‌న ఏపీ విష‌యంలో  ఫీల‌ర్ కూడా ఇవ్వ‌డం లేదు. దీన‌ర్ధ‌మేంటి? ఇక్క‌డ ఈవీఎంలు ట్యాంప‌రింగ్ జ‌రిగిన‌ట్టు ఆయ‌న‌కు కూడా ఆధారాలు ల‌భించ‌డం లేద‌నేగా? ఇదిలా ఉంటే.. ప్ర‌కాష్ రాజ్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అస‌లు క‌డుపు మంట. ఇందాకే అనుకున్న‌ట్టు.. ఆయ‌న భుజానికెత్తుకున్న స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌. ఈ విష‌యంలో నేరుగా టార్గెట్ చేయ‌వ‌చ్చు ప్ర‌కాష్ రాజ్.. కానీ ఆయ‌న‌లా చేయ‌డం లేదు. ఇదే క‌మ‌ల్ హాస‌న్ సనాత‌న ధ‌ర్మానికి విరుగుడు విద్య అంటూ తాను క‌నీసం టెన్త్ కూడా పాస్ కాకుండానే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు త‌మిళ సీరియ‌ల్ నటుడు ర‌విచంద్ర‌న్ వైల్డ్ గా రియాక్ట‌య్యాడు. క‌మ‌ల్ త‌ల న‌రికేస్తామంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నేరుగా స‌నాత‌న ధ‌ర్మాన్ని అటాక్ చేయ‌లేని ప్ర‌కాష్ రాజ్.. ప‌వ‌న్ కళ్యాణ్ గెలుపుపై ప‌దే ప‌దే కామెంట్ చేస్తూ రెచ్చ‌గొడుతున్నారు.

ఉపరాష్టపతి రేసులో ఓబీసీ మహిళా నేత?

జగదీప్ ధన్‌కఢ్ ఆకస్మిక రాజీనామాతో అనివార్యమైన భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం  (ఆగష్టు 8) విడుదల చేసింది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంరంభ మైంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఆగష్టు 21తో ముగుస్తుంది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరుగుతుంది. అదే రోజున వోట్ల లెక్కింపు జరుగుతంది  కాగా..  ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలెక్టోరల్ కాలేజీని  కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్దం చేసింది.  ఈ నేపథ్యంలో కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను  కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు.  నేడో రేపో ఎన్డీఎ కూటమి అభ్యర్ధి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.  ఈ రెండు రోజుల్లో పేరు ప్రకటించినా ప్రకటించక పోయినా.. అంతర్గతంగా ఏకాభిప్రాయమ ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని  విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే..  ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రుల స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగులు వేస్తోందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి  రాజ్యసభ చైర్మన్ బాధ్యతలను కూడా నిర్వరించవలసి ఉంటుంది కనుక.. పార్లమెంట్ వ్యవహారాల్లో తగిన అనుభవం, విధివిధానాల పట్ల సంపూర్ణ అవగాహన అవసరం కనుక, ఇటు పార్లమెంట్ అనుభవంతో పాటుగా రాజకీయ చతురతతో పెద్దల సభను సమర్ధవంతగా నడపగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని అంటున్నారు. సమర్ధత, సామర్ధ్యంతో పాటుగా రాజకీయ జీవితంలో వివాదరహితునిగా పేరున్న   పెద్ద  మనిషిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు.. ఇంతవరకు ఎక్కడా వినిపించని, ఎవరూ ఉహించని, అదృశ్య వ్యక్తి ఒక్కసారిగా తెరపైకొచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం  నలుగురు ప్రస్తుత గవర్నర్లతో పాటుగా, ఒకరిద్దరు మాజీ గవర్నర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉపరాష్ట్రపతి రేసులో గుజరాత్ గవర్నర్. ఆచార్య దేవవ్రత్  అందరికంటే ముందున్నారు. అలాగే  కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గహ్లోత్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథూర్  కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ సిన్హా పేర్లు ప్రముఖగా వినిపిస్తునాయి.  అలాగే..  ఓబీసి వర్గానికి చెందిన  మహిళ అయిన మాజీ  ఎంపీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి..  నూతన ఉపరాష్రపతి పదవికి ప్రస్తుత లేదా మాజీ గవర్నర్ల లో ఒకరని ఎంపిక చేసే అవకా శాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. మహిళా సాధికరితకు ఎత్తు పీట వేస్తూ గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన విధంగా.. అదే ఒరవడిలో ఉపరాష్ట్రపతి పదవిని  కూడా మహిళకు ఇవ్వలని భావిస్తే ఏమో కానీ..  లేదంటే గవర్నర్లలో ఒకరిని   ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. కొస మెరుపుగా  చివరకు మోదీ,షా మ్యామాజిక్ బాక్స్ లోంచి ఏ పేరు బయటకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

అమెరికాను తలదన్నేలా హైదరాబాద్ లో గన్ కల్చర్.. తాజాగా చందానగర్ లో కాల్పుల కలకలం

ఖజానా జువెల్లరీస్ లో దోపిడీ  భాగ్యనగరంలో గన్ కల్చర్ పెరిగిపోతున్నది. అమెరికాను తలదన్నేలా ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దుండగులు కాల్పులతో చెలరేగిపోయారు. గ్రేటర్ పరిధిలోనే అత్యంత రద్దీగా ఉండే చందానగర్ లో దుండగులు తుపాకులతో ఖజానా జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులకు తెగబడి మరీ భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లొ ఖజానా జువల్లర్స్ సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ( ఆగస్టు 12) ఉదయం జరిగింది. షాపు తెరిచిన  షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే భారీ దోపిడీకి పాల్పడి అక్కడ్నుంచి ఉడాయించారు.  షాపు సిబ్బంది, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపి దోపిడీ జరిపిన తరువాత దుండగులు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు జిల్లా సరిహద్దులలో పోలీసులను అప్రమత్తం చేశారు. దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ముఖానికి  మాస్కులు,   చేతులకు గ్లౌజు  వేసుకొని వచ్చిన ఆరుగురు దుండగులు, ముందుగా తుపాకులతో బెదరించి లాకర్ కీస్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు ఖజానా జువెల్లరీస్ మేనేజర్ నిరాకరించి, వారిని ప్రతిఘటించాడు. దీంతో  మేనేజర్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.  ఆ దశలో ఖజానా జువెల్లర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం  దుండగులపై తిరగబడ్డారు..దీంతో దుండగులు పారిపోయారు.