జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌..42 మంది భక్తులు మృతి

  జమ్మూ కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలో 42 మంది భక్తులు కొట్టుకుపోయి మరణించారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాడుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఇక్కడ ఉండటంతో.. సహాయక బృందాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి తరలి వెళ్లాయి. కిశ్త్‌వాడ్‌ మాచైల్‌ మాతా (చండీ)మందిరానికి వెళ్లే యాత్ర బేస్‌ పాయింట్‌ ఇదే.   గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర  ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మచైల్‌ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్త్వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

జగన్ గడ్డపై టిడిపి జెండా!

పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు  ఒంటిమిట్టలో తెలుగుదేశానికి భారీ మెజారిటీ జగన్ అడ్డాపై టిడిపి జెండా ఎగిరింది. అదీ  మామూలుగా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో. కడప ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్పీటీసీ  ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిం చారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతయింది.  ఇంతవరకు కడప జగన్ అడ్డా అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయని  ఊహించిన టీడీపీ నాయకులు ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం  ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దింపి వైసీపీని అయోమయంలో పడేశారు. దీనికితోడు వైసీపీ ఆనుపానులు తెలిసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 1995 నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో 2016 మినహా ఎప్పుడూ కూడా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం రాలేదు. ఈ సారి ఇరు పార్టీలు ఇచ్చే తాయిలాలు పుచ్చుకుని ఈ అవకాశం టీడీపీ వల్లనే వచ్చిందనే భావన ప్రజల్లో ఉంది. దానికి కృతజ్ఞతగా ఆ పార్టీకి ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా నిలిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జెడ్పటీసి ఎన్నికల  విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందులలో ఏ ఎన్నికలోనూ టిడిపి గెలవలేదు. 2 001లో జరిగిన ఎన్నికల్లో అయితే పోటీనే లేకుండా ప్రస్తుత వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి  ఏకగ్రీవంగా గెలుపొందారు . అంటే జెడ్పీటీసీ  ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పులివెందల జడ్పిటీసీ స్థానం వైసిపి సొంతం అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ చరిత్ర తిరగరాసి వైసీపీకి చేదు అనుభవాన్ని చవిచూపించడంలో టిడిపి వ్యూహం పలించిందనే చెప్పాలి. పులివెందుల ఉపఎన్నిక మొదటి నుంచి వైసీపీ, టిడిపిల మధ్య రభస  జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది.  దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రీపోలింగ్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో  పులివెందులలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. పులివెందుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలవడమే కాదు ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఒక చరిత్రే. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లతా రెడ్డికి 6716 ఓట్లు వస్తే,  వైసీపీ నుండి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.  అంటే 6033 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం విజయం సాధించింది. ఇంత పెద్ద మెజార్టీ రావడం చూస్తే  టిడిపిని సాధారణ ఓటర్లు బాగా ఆదరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ కి ఇంత తక్కువ ఓట్లు రావడం, టిడిపికి ఊహించని స్థాయిలో ఓట్లు రావడం చూస్తే కడపలో జగన్ కు చెక్ పెట్టే పరిస్థితి త్వరలోనే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జెండా  రెపరెపలాడడం లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులలో మంచి రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు కలిగిన ఆయన ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో  చూపించారని చెప్పవచ్చు. గతంలో దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత జడ్పిటిసిగా  గెలిచిన అభ్యర్థి లతా రెడ్డి భర్త బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి తానేంటో  రుచి చూపించారు. ఇప్పుడు  జెడ్పీటీసి ఉప ఎన్నికలను అంతా తానై పదిరోజుల పాటు  పులివెందులలో తిష్ట వేసి ఊరు ,వాడ వీధి ,సందు అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే కాకుండా, ఓట్లు టిడిపి అభ్యర్థికి పోలయ్యే  విధంగా వ్యూహం రూపొందించారు. పులివెందుల ఉప ఎన్నికపై  జిల్లా, స్థానిక నాయకులు సమష్టిగా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశానుసారం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించలేదు. సర్వ శక్తులు కూడగట్టుకొని విజయం సాధించడంలో ఎవరి మేరకు వారు సత్తా చాటారు. టిడిపి అభ్యర్థి భర్త పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి   నిరంతరం ఎన్నికల నిర్వహణలో పోలింగ్ వరకు వారి వ్యూహాలను అనుసరిస్తూ వారికున్న సంబంధాలను అభ్యర్థి గెలుపుకోసం కోసం సానుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. వీరితోపాటు  జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా  చైతన్య రెడ్డి లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చైతన్య రెడ్డి తో పాటు టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లు పులివెందులలో ప్రచారం చేసి టిడిపి అభ్యర్ధి విజయం కోసం కష్టపడ్డారు . ప్రచారంలో బిజెపి నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు  బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.  వీరితోపాటు కూటమిలో ఉన్న మరి కొందరు నాయకులు , కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేశారు. ఒంటిమిట్ట లోనూ టిడిపి విజయం కేతనంతో  ఉమ్మడి కడప జిల్లాలో తన సత్తా ఏంటో తెలుగుదేశం నిరూపించుకుంది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ని 10 స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి విజయం సాధించింది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ టిడిపి, వైసిపిల మధ్య రసవత్తర పోరు జరిగినట్టు అనిపించినా, వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకొని గట్టిగా ప్రయత్నించినా గెలుపు వారికి దరిదాపుల్లో లేకుండా పోయింది .టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ మెజార్టీ లభించింది. వైసిపి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి 6,513 ఓట్లు మాత్రమే రాగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780ఓట్లు వచ్చాయి. దీంతో టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒంటిమిట్టలో టిడిపి నాయకులు పడ్డ కష్టాలు, కసరత్తు ఫలించింది . ఒంటిమిట్ట గెలుపు పట్ల  టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పులివెందుల, ఒంటిమిట్ట గెలుపు జిల్లా టిడిపి లో కొత్త ఉత్తేజం నింపింది.

పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు : సీఎం చంద్రబాబు

  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు.  పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు  లతారెడ్డిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అభినందించారు. చాలా అద్బుత విజయం సాధించారు. సంతోషంగా ఉంది. మీ విజయంతో పార్టీలో చాలా జోష్ ఇంకా ఎక్కువ కదా. అందరం తెలుగు దేశం పార్టీ ఫ్యామిలీ అని భువనేశ్వరి లతారెడ్డితో ఫోన్‌లో అన్నారు. స్వయంగా సీఎం భార్య ఫోన్ చేసి అభినందించడంతో లతారెడ్డి సంతోషంలో మునిగిపోయారు.  

చరిత్రను తిరగరాసిన పులివెందుల ఎన్నిక.. లతారెడ్డికి చంద్రబాబు అభినందన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబునాయుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయాన్ని మూడు దశాబ్దాల తరువాత చరిత్రను తిరగరాయడంగా అభివర్ణించారు. పులివెందులలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని అభినందించిన ఆయన ఈ విజయాన్ని  మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా   హైలైట్ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్న చంద్రబాబు.. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి 11 మంది ఔను సరిగ్గా 11 మంది నామినేషన్లు వేయడమే ఇందుకు తార్కానమని చెప్పారు. పదకొండు సంఖ్యను నొక్కి చెప్పడం ద్వారా పరోక్షంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి వచ్చిన స్థానాలను వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా బ్యాలెట్ బాక్సులో ఓ ఓటరు తన ఓటుతో పాటు.. 30 ఏళ్లలో తొలి సారి ఓటు వేస్తున్నా.. అందరికీ దండాలు అంటూ ఒక స్లిప్ కూడా వేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పులివెందుల రాజకీయాలలో ఈ జడ్పీటీసీ ఎన్నిక ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు.  

అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రజాస్వామ్యం గురించి కబుర్లేంటి.. జగన్ పై అయ్యన్న ఫైర్

ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే మీరు అసలు అసెంబ్లీకి వస్తారో రారో క్లారిటీ ఇవ్వండంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? రారా క్లారిటీ ఇవ్వాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండి పడ్డారు.   ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని  సూటిగా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ సభ్యులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.  జగన్ హయాంలో అసెంబ్లీలోని ప్రింటర్లలాగత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. జగన్ ఐదేళ్ల హయాంలో అసెంబ్లీ కేవలం 75 పనిదినాలు మాత్రమే నడిచిందన్న ఆయన తెలుగుదేశం కూటమి హయాంలో ఇప్పటికే  31 రోజులు సమావేశాలు జరిగాయన్నారు. ఈ నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న కనీస స్ఫృహ లేని వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 

మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె  నారా బ్రాహ్మ‌ణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా  మహిళల కోసం స్త్రీ శక్తి  కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు.  వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు.  అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించారు.  ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు. అలాగే మంగళగిరిలోని ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని  నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు.  నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు.  నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.  

రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు

పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు.  జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు.  జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి.  ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు.   ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.  డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది.  మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి  6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 

పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.   ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.  

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  గేట్ల ఎత్తి లక్షా 87 వేల 208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 70 వేల 802 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 42 వేల 669,  హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ అనుమానమే అంటున్న పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు.  అది వాస్తవ రూపం దాల్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు దీని బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు పై మాట్లాడిన జగన్మోహనరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేశవ్ వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీకి అర్హత ఉంటుందా అనే బాంబు పేల్చారు.  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను అరెస్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ వేసినట్లుగా సమాచారం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విలేకరులతో మాట్లాడిన జగన్, చంద్రబాబుకు జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయనీ,  చనిపోయాక నరకానికి పోతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేశవ్ చంద్రబాబు మరో పదేళ్లు రాజకీయాల్లో కీలకంగా, క్రియాశీలంగా  ఉంటారని చెప్పారు. ఇదే సమయంలో జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు. అంటే త్వరలోనే జగన్ ను అరెస్టు  చేసి శిక్ష పడేవిధంగా చర్యలు ఉంటాయని నర్మగర్భంగా చెప్పారు. దీంతో జగన్ పట్ల కూటమి ప్రభుత్వం పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల  విషయంలో ప్రభుత్వం కేసుల నమోదుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు అరెస్ట్ ల భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమను ఎప్పడు అరెస్టు చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు.

మూసీ వరద ముప్పు.. అధికారులు అప్రమత్తం

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తుతోంది.  అలాగే హిమాయత్ సాగర్ కు అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో మూసీ నది ప్రవాహం ఉధృతంగా ఉంది.  అధికారులు అప్రమత్తమై మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.   మూసీనదికి ఆనుకొని ఉన్న కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.  వరద పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 24 గంటల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.  

దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలలో రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో   గొడుగనిపల్లి పెద్దవాగు ,బడెంపల్లి పెద్దవాగులు  , దోమ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పగిరి, మహబూబ్ నగర్ గడి సింగాపూర్ రామిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు వాగులూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారులపై పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.  

రీపోలింగే కాదు.. కౌంటింగూ బహిష్కరణే.. పాపం వైసీపీ

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైంది. గురువారం (ఆగస్టు 14) ఉదయం ఎనిమిది గంటలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ  పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,  జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, వెంకటపతి, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య లు పర్యవేక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులకు  సంబంధించి 10 టేబుళ్లలో  ఒక రౌండ్,  ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుళ్లలో మూడు  రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు . ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ ,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు.మొత్తం వంద మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా ఇందులో 30 మంది,సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు స్టాటస్టికల్ అధికారులు ఉన్నారు  ఇలా ఉండగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బహిష్కరించింది. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ను బహిష్కరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. కాగా పులివెందుల జడ్పీటీసీ లోని రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం ( ఆగస్టు 13) జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బహిష్కరణలపై తెలుగుదేశం వైసీపీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నది. ఓటమిని ముందే అంగీకరించేసి తప్పుకుంది పాపం అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రర్దీ అధికాంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 14) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 28 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుండగా,  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక బుధవారం (ఆగస్టు 13) శ్రీవారిని మొత్తం 75 వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది. 

కృష్ణా నదికి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా  కురుస్తున్నవర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది.   విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. దీంతో  ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 3,63,438 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.     వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ   హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తున్న కారణంగా  ఏడు గేట్లు   ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.  

కొత్త పేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

కొత్తపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో బుధవారం (ఆగస్టు 13) ఆలమూరులో జరిగిన రైతు సంబరాలకు విచ్చేసిన ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.   వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఆయన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. సరిగ్గా అదే  సమయంలో ఎడ్లబండికి బండికి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా బెదిరి కదిలాయి. దీంతో ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే సహా  రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ,  కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు తదితరులు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిలువూరి సతీష్ కు కాలు ఫ్యాక్చర్ అయ్యింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం తరువాత కూడా ఆయన  రైతు సంబరాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.  రాగా ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు  ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.

మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఆగస్టు 14) వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు మించిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా పిలివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ సందర్భంగా యుద్ధవాతావరణం కనిపించింది. అయితే పోలింగ్ రోజునే వైసీపీ చేతులెత్తేసి ఓటమిని అంగీకరించేశామంటూ పరోక్షంగా అంగీకరించేసిందని పరిశీలకులు ఆ పార్టీ నేతల ప్రకటనలు, ఆరోపణలను ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నారు. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేయడంతోనే.. ఆ పార్టీ మానసికంగా ఓటమికి సిద్ధమైపోయిందని అవగతమైపోయందని అంటున్నారు. ఏది ఏమైనా గురువారం (ఆగస్టు 14) ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడుతుంది. ఈ నేపథ్యంలో  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీస్థానాలలో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రమైన కడపలో అన్ని ఏర్పాట్లూ చేశారు.   కడపలోని  పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. పులివెందులలో మొత్తం పది వేల 601 ఓట్లకు గాను 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి.  ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే.. ఈ జడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు కూడా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా, పోలైనవి 20 వేల 681. 

తిరుమల గెస్ట్‌హౌస్‌ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు

  తిరుమలలో  శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతులు కల్పిస్తామంటూ ఇంటర్నెట్‌లో 30కిపైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. భక్తులు ఎవరైనా తిరుమలలో వసతుల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినప్పుడు.. సప్తగిరి గెస్ట్‌హౌస్‌, నందకం గెస్ట్‌హౌస్‌, పద్మావతి గెస్ట్‌హౌస్‌.. ఇలా కొన్ని గెస్ట్‌హౌస్‌ల పేరుతో వెబ్‌సైట్లు కనిపిస్తే అవి నకిలీవిగా గుర్తించాలని పోలీసులు తెలిపారు.  తిరుమల శ్రీవారి దర్శనం, వసతులు, సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.orgను మాత్రమే సందర్శించాలని చెప్పారు. వాట్సప్‌ కాల్‌, క్యూఆర్‌ కోడ్‌ పంపించి పేమెంట్‌ చేయాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దన్నారు. ఇలాంటివి అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌/100/టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004254141ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.