పొన్నాల, సబితలకు రిలీఫ్
posted on Sep 11, 2013 @ 11:11AM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సబిత కు ఊరట లభించింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో సబితపై అభియోగాలు నమోదైనప్పటికీ.. పెన్నా కేసులో మాత్రం ఆమెకు ఊరట లభించింది. వైఎస్ హయాంలో ఇండియా సిమెంట్స్‌కు అడ్డగోలుగా జలదానం చేసిన అంశానికి సంబంధించి... పొన్నాలను సీబీఐ ప్రశ్నించినప్పటికీ, నిందితుడిగా చేర్చకుండా పక్కన పెట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.
ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, భారతీ సిమెంట్స్‌లకు సంబంధించి జరిగిన అవకతవకలపై మూడు వేర్వేరు చార్జిషీట్లను సీల్డు కవర్లలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు అందించారు. ఎప్పట్లాగానే మూడు కేసుల్లోనూ మొదటి నిందితుడిగా జగన్ పేరును, రెండో నిందితుడిగా విజయ సాయిరెడ్డి పేరును చేర్చారు. ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. జగన్‌ను మినహాయిస్తే.. మూడు చార్జిషీట్లలో ఆయనొక్కడే బిగ్‌షాట్ కావడం గమనార్హం. ఇండియా సిమెంట్స్ కేసులో ఐఏఎస్‌లు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్‌లను సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరిపై ఇదే కేసులో గతంలోనూ అభియోగాలు నమోదయ్యాయి.