కెసిఆర్ దృష్టిలో 1956కి "ముందున్న తెలంగాణా జిల్లాలే''వి?

 

- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]
 

 

ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చి, "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తానని మాటయిస్తే'' తాను ఏర్పాటు చేసుకున్న సొంతపార్టీ (టి.ఆర్.ఎస్.)ను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రహస్యమంతనాలు జరిపివచ్చిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, "తెలుగుదేశం'' పార్టీలో మాజీమంత్రి అయిన "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. మళ్ళీ క్షణానికొక మాట మారుస్తున్నారు. ఇలా అతని నాలుక పదేపదే తిరగబడుతూ కొత్త ప్రతిపాదనలతో కొత్త సమస్యలు లేవనెత్తుతూండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తల బద్ధలు కొట్టుకోవలసి వస్తోంది. ఈలోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రజలు ఆందోళన చెంది, భారీస్థాయిలో ఉద్యమాల బాట పట్టవలసి వస్తోంది. ప్రజలను ఎలా విరగదొక్కాలో తెలిసిన కె.సి.ఆర్. తాజాగా ఓ కొత్త నినాదం లేవనెత్తాడు. తన మాట విని, తన డిమాండ్ ను అంగీకరించి, ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే "తెలంగాణా పునర్నిర్మాణం'' పేరిట తనను ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రకటిస్తే సరి, లేదా అది నెరవేరే దాకా కాంగ్రెస్ తో సహకరించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన పేచీ పెట్టుకున్నాడు. ఈ "పేచీకోరు''తో తన అనాలోచిత నిర్ణయాల ద్వారా యిప్పటికే రెండు ప్రాంతాలలోనూ (సీమాంధ్ర, తెలంగాణా) పరువు ప్రతిష్ఠలు వేగంగా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కె.సి.ఆర్. మాటలు వింటే "కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే''నన్న సామెతలా అవుతుందని భావించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాలలోనూ తన మిగిలిన పరువును కాపాడుకోవడం కోసం "రెండు పడవలపై''న రెండు కాళ్ళు పెట్టి కె.సి.ఆర్.తో సంబంధం లేకుండా పార్టీని ఇటు తెలంగాణాలోనూ, అటు సీమాంధ్రలోనూ కొనవూపిరితోనైనా బతికించుకోవాలని నిర్ణయించుకుంది!

 

 

హైదరాబాద్ లో ఇటీవల భారీ ఎత్తున జరిగిన "సమైక్యాంధ్ర సభ'' జయప్రదం కావడంతో ఇటు తెలంగాణలో కెసిఆర్ (టి.ఆర్.ఎస్.) పార్టీతో నిమిత్తం లేకుండానే, సమైక్యాంధ్ర సభ తాకిడి ఫలితంగా వేరుగా ఒక సభ జరపాలని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది; అటు కె.సి.ఆర్. వర్గం కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా లోపాయకారీగా కాంగ్రెస్ సభకు పోటీగా వేరే సభను వేరే తేదీల్లో జరపాలని నిర్ణయించుకుంది! అంటే అటువైపు, సమైక్యాంధ్ర సభలు జరపడానికి రాజకీయ నాయకులను వెలివేసి ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.ల సంస్థ కేవలం ఉద్యోగవర్గాలతో భారీస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగుతూండగా, ఇటు కె.సి.ఆర్. వర్గానికి, అటు కాంగ్రెస్ (తెలంగాణాలో) నాయకవర్గానికి "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం'' అనే లక్ష్యం ఒకటే అయినా, ఒకే సభగా కాకుండా "ఎవరికీ వారే యమునా తీరే'' అన్నట్టుగా వేర్వేరుగా రెండు భిన్నమైన తేదీల్లో జరుపుకుంటున్నారు. అంటే, అక్కడ జరుగుతున్నది తెలుగుజాతి విడిపోకూడదు, "విడిపోతే చెడిపోతాం'' అన్న హెచ్చరికలతో ఉద్యోగ కార్మిక, కర్షక, విద్యార్థి, వర్తక, మహిళా, బడుగు బలహీనవర్గాల ప్రజాబాహుళ్యంతో, గ్రామ గ్రామం నుంచీ సాగుతున్న మహోద్యమం కాగా, ఇక్కడ మన తెలంగాణలో నడుస్తున్నది కేవలం రాజకీయ నిరుద్యోగుల నిర్వహణలో పదవీ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఉద్యమంగా మారింది! అందుకే, లక్ష్యంలోనూ, ఆచరణలోనూ కూడా ఇరుప్రాంతాల సభల మధ్య అంత తేడా వచ్చింది. ఈ ఇరువర్గాల ఉద్యమాల మధ్య నినాదాలలో కూడా నేలకూ నింగికీ మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కన్పిస్తోంది!


 

"సీమాంధ్రులది ఒక సభా, పనికిమాలినది'' అని ఇటు రాజకీయ నిరుద్యోగుల ఉద్యమనాయకులు వర్ణిస్తుండగా, అటు సీమాంధ్ర ఉద్యోగసంఘాల "సమైక్యాంధ్ర'' ఉద్యమం "తెలుగుజాతి ఒక్కటిగా కలిసి ఉంటే'' సభ్యప్రపంచంలో ఇనుమడించిన వ్యక్తిత్వంతో "ఎగిసిపడుతుంది'' అని నినదించింది; రాష్ట్ర సమస్యలకు "మూడుప్రాంతాల ప్రజల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య ప్రజాస్వామిక చర్చలే శరణ్య''మని చివరికి మావోయిస్టు పార్టీ సహితం ప్రకటిస్తుండగా అసలు "చర్చలే మాకొద్దు, లెక్కలూవద్దు, మా తెలంగాణా మాకివ్వండి'' అని వేర్పాటు ఉద్యమ నిరుద్యోగ నేతలు నినదిస్తున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే మూడు, నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కె.సి.ఆర్. కాంగ్రెస్ నూ, అతడితో పోటీగా ఎక్కడ వెనుకబడి పోతామోనని ఇన్ని రోజులూ "ప్రత్యేక రాష్ట్ర'' నినాదంతో కదంతొక్కినా చంద్రబాబు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల రాజకీయ నిరుద్యోగులూ ఆశ్చర్యపడేలా ఒక ప్రకటన చేశాడు.


 

అసలు అదీ, ఇదీ కాదు "1956 నాటికి ఉన్న తెలంగాణా'' అంతా కావాలని, అంతకు మినహా మరొకటి తనకు ఇష్టంలేదనీ పాత 'దొర'స్వామ్యం రాచరికపు స్థాయిలో కెసిఆర్ ప్రకటించారు! అంటే, నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలన్న  కోరికపై ప్రారంభించి కొనసాగిస్తున్న "ఉద్యమాన్ని'' 1956కి ముందు, నిజాం పాలనలోనూ, 1953 నాటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న 16 జిల్లాలతో కూడిన తెలంగాణా కావాలని ఆయన కోరుతున్నాడన్న మాట, అప్పటిదాకా చెబుతున్న 10 జిల్లాలకు తోడు ఏనాడో హైదరాబాద్ స్టేట్ లో నిజాం-బ్రిటిష్ పాలకుల జమానాలో యుద్ధాలద్వారా, దురాక్రమణ పూరిత ఒడంబడికల ద్వారా కలుపుకున్న మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు సహా అదే స్టేట్ లోని నిరంకుశ పాలన కింద విద్యకు, వికాసానికి దూరమై, అణచివేతలకు గురి అవుతూ వచ్చిన తెలుగు జిల్లాలని అర్థం!


 

అంటే, 1953లో కేంద్రప్రభుత్వం తెలుగుప్రాంతాలన్నింటిని [సీమాంధ్ర-నిజం ఆంధ్రుల జిల్లాలతో] విలీనంచేసి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పరచాలన్న సంకల్పంతో సమస్య పరిశీలనార్థం నియమించిన జస్టిస్ ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పాటు చేయగా, ఆ కమీషన్ 1955 చివరి మాసాల కల్లా సమర్పించిన నివేదిక ప్రకారమే "ఆంధ్రప్రదేశ్'' ఏర్పడింది; ఆ నివేదిక ప్రకారమే భాషాప్రయుక్త రాష్ట్రాలా ప్రాతిపదికపైన హైదరాబాద్ స్టేట్ లో అంతవరకూ భాగమై ఉండి, కునారిల్లిపోతూ వచ్చిన మరాఠీ ప్రాంతాలూ, కన్నడ ప్రాంతాలూ ఎలాంటి వివాదాలూ లేకుండా అటు బొంబాయి రాష్ట్రంలోనూ, ఇటు కర్నాటక రాష్ట్రంలోనూ చేరి పునరావాసం పొందాయి! అలానే ఈ కమీషన్ నివేదిక ఆధారంగానే ఆంధ్ర-తెలంగాణాల విలీనం సందర్భంగా తలెత్తే సమస్యలేవైనా ఉన్నా, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలలో విలీనమైన పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో నిరంకుశ పాలన క్రింద మగ్గిపోతూ వచ్చిన మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కూడా ఆ రెండు రాష్ట్రాలలో కొన్ని సమస్యలు రావచ్చుననీ, విశాల భాషాప్రయుక్త రాష్ట్రాలలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి అతీతం కావనీ కమీషన్ స్పష్టం చేసింది.



 

కాని ఒక్క ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణ సందర్భంగానే కాలం చెల్లిన పాత ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధులయిన కొందరు దొరలు, జాగిర్దార్లు, దేశ్ ముఖ్ లు పోతున్న పూర్వవైభవాన్ని మరచిపోలేక కాంగ్రెస్ లో దూరి ఆంధ్రప్రదేశ్ అవతరణకు అడ్డు కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు! దాని ఫలితమే, వేర్పాటు ఉద్యమానికి పడుతూ వచ్చిన స్వార్థపూరిత బీజాలు! కెసిఆర్ మనస్సులో ఉన్న 1956కి ముందున్న "తెలంగాణా జిల్లాలు'' అంటే మనకు చెందని మరాఠా ప్రాంతాలూ లేదా కన్నడ ప్రాంతాలతో కూడిన పాత "హైదరాబాద్ స్టేట్'' అనే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అంతవరకూ నిజాముల ఏలుబడిలో పడి ఉన్న మరాఠా ప్రాంతాలైన ఉస్మానాబాద్, ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ ప్రాంతాలు, కర్నాటకలో చేరిపోయిన బీదరు, రాయచోరు వగైరా ప్రాంతాలూ అన్నమాట!



 

ఇది యిలా ఉండగా అటు సీమాంధ్రలోని ఆంధ్రోద్యమానికి, ఇటు తెలంగాణలో మాడపాటి సురవరం, హయగ్రీవ చారి ప్రభృతులు, రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఎస్.వి. ప్రసాద్ లాంటి కమ్యూనిస్టు యోధుల నాయకత్వాన నడిచిన ఆంధ్రోద్యమాలకు ఒక దశ వరకూ నిజాముల నిర్బంధకాండ మధ్య విజయవాడ కార్యక్షేత్రంగా ఉందన్న సత్యాన్నీ మరచిపోరాదు. ఈ పూర్వరంగాన్నంతనూ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఫజల్ ఆలీ కమీషన్ హైదరాబాద్ ను సందర్శించి వివిధ సంస్థల, వ్యక్తుల అభిప్రాయాన్ని తెలుసుకుని వారినుండి భారీస్థాయిలో మహాబరులను స్వీకరించి, 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది; "విశాలాంధ్ర ఏర్పాటునకు ఏకాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ స్టేట్ ను విభజించడం సబబని కమీషన్ అభిప్రాయపడింది. అలాగే ఉభయ ప్రాంతాలకు చెందిన కొన్ని సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చుకో కూడా సిఫారసు చేస్తూ ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది :


 

"రెండువందల సంవత్సరాలనుండి దక్కను ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఏర్పడినందున, ఈ సంస్కృతే భారతదేశ ఐక్యతకు మిక్కిలి దోహదపడింద'ని చెబుతూ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కొలదిమంది వేర్పాటువాద నాయకుల వాదాలను అప్పుడే కమీషన్ తోసిపుచ్చింది! అంతేగాదు, రాష్ట్ర ఐక్యత మాదిరిగానే హైదరాబాద్ రాష్ట్ర సంస్కృతి కూడా ఆనాటి పాలకులు విధి రాసిందే గాని మరొకటి కాదు కదా అని కమీషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే కమీషన్ తొలి ప్రాధాన్యతగా ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణనే కమీషన్ అభిలషించి బలంగా నివేదికలో పేర్కొంది. 'విశాలాంధ్ర' రాష్ట్రం ఏర్పాటు వల్ల వొనగూడే ప్రయోజనాల్ని స్పష్టంగా కమీషన్ యిలా వివరించింది :



 

"ప్రస్తుతపు ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా విలీనమైతే కోట్లాది జనాభాతో పాటు విలువైన ముడిసరుకులు, కావలసినంత ఖనిజసంపద, ఎక్కువ జల, విద్యుత్ వనర్లు కల్గిన భూభాగంతో పెద్దరాష్ట్రం ఏర్పాటవుతుంది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య కూడా పరిష్కారమై పోతుంది. విశాలాంధ్ర రాజధానిగా జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదు చక్కగా సరిపోతాయి. విశాలాంధ్ర ఏర్పాటువల్ల కృష్ణా-గోదావరి నదీజలాల వినియోగం ఒకే అధికారం కిందికి వస్తుంది. వివిధ సాంకేతిక, పాలనాపరమైన కారణాల వల్ల జరిగిన సుదీర్ఖ కాలహరణం తర్వాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకోవలసి వచ్చింది. అయితే కృష్ణా-గోదావరి లోయల (బేసిన్స్) పూర్తీ ఏకీకరణ అసాధ్యం. ఈ నదీ ముఖద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాలను రూపొందించడానికి, అమలు పరచడానికి గొప్ప అవకాశాలుంటాయి. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణా ప్రాంతం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రయోజనాలు పొందుతుంది. కాబట్టి తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. కరువు కాటకాది ఉపద్రవాలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆహారకొరత ఉంటుంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ అధికాహారోత్పత్తికి వీలుంటుంది కాబట్టి మిగులు ఉత్పత్తిని తెలంగాణా ప్రాంతానికి వాడుకోవచ్చు. ఇదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో బొగ్గు వనరులు లేవు. వీటిని సింగరేణి నుండి ఆంధ్రరాష్ట్రానికి చేరవేయవచ్చు. పైగా ఆంధ్రరాష్ట్రంలో కలవడంవల్ల తెలంగాణాకు పరిపాలనా సంబంధమైన వ్యయం కూడా ఉండదు''


 

ఈ వాస్తవాలన్నింటిని 1969, 1970ల నాటి వేర్పాటువాద ఉద్యమాల సందర్భంగా తెలంగాణా రైతాంగ సాయుధపోరాట అగ్రనాయకులంతా గురించి, "విడిపోతే చెడిపోతాం'' అని ఆనాడే పదేపదే హెచ్చరించిన వాళ్ళని మరవరాదు, మరవరాదు! అందువల్ల "బొబ్బిలిదొర'' కెసిఆర్ 1956 నాటి హైదరాబాద్ స్టేట్ ను మొత్తంగా తెలంగాణా అని భావించుకుని మనవిగాని ఇతర నిజాం ఆక్రమిత జిల్లా ప్రాంతాలు కూడా కలిసిన తెలంగాణా ఏర్పడాలని కోరుకుంటున్నందున - ఆ ప్రతిపాదన కాంగ్రెస్ అధిష్ఠానం మెడకు తగిలిస్తున్న కొత్త 'ఉచ్చు' అవుతుంది! ఇది సమస్యలను పరిష్కరించడానికి కాదు, కొందరు భావిస్తున్నట్టు "తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని'' భావిస్తున్న వ్యక్తి అసలు కెసిఆర్ మాత్రమేనన్న అపవాదును అతను మీద మోసుకోక తప్పదు! చరిత్రలో తెలంగాణా రాష్ట్రమంటూ ఏనాడూ లేదు! ఉన్నదల్లా హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణా ఒక భాగమేగాని, తెలంగాణా రాష్ట్రమనేది లేదు. కనుకనే మూడుప్రాంటలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలూ, వాటిలోని బడుగు బలహీనవర్గాల ప్రయోజనాలకు పరిష్కారం ప్రభుత్వాల విధాన నిర్ణయాలే గాని ప్రాంతీయ వాదాలు కావు. ఆ వాదాలు ముందుకు రావడానికి అసలు కారణం - పెట్టుబడిదారీ, భూస్వామ్యవ్యవస్థలో దోపిడీ, అసమా ఆర్థికాభివృద్ధి దశలేనని మరవరాదు!

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

  పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.  ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు ఆరామస్తాన్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన  ఫోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తులో  భాగంగా సిట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ను   విచారించింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థా పకుడు ఆరా మస్తాన్‌ను  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ శుక్రవారం విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.    ఆరా మస్తాన్ గత కొన్నేళ్లుగా   రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?  లేదా? ఒక వేళ జరిగితే అందుకు ఎవరు ఆదేశించారు? అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.  సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు.  నూతన సిట్   ఆదేశాల మేరకే  తాను విచారణకు హాజరయ్యానన్న ఆరా మస్తాన్.. గతంలో పోలీసులు అడిగన ప్రశ్న లనే మళ్లీ అడిగారని చెప్పారు.  2020 నుంచే తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం ఉందనీ, ఇదే విషయాన్ని సిట్ అధికారుల చేప్పానన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ పోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తును వేగవంతం చేసిందన్న ఆరా మస్తాన్..  నూతన సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుదర్యాప్తు మరింత సమగ్రంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.   

29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఎన్ని రోజులో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు.  బయట అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ  సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.  అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక పోతే.. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతివిమర్శలు చేయడమే కాకుండా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా రేవంత్ సవాల్ ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత అయిన కేసీఆర్ సభకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు... ఆయన పేరు చెప్పుకుంటా : కేటీఆర్

  మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును మా అయ్య తెలంగాణ తెచ్చిన మగాడు. మొనగాడు..మా నాన్న పేరు కాకుంటే ఇంకెవరు పేరు చెప్పుకుంటారు. బరాబర్ చెబుతా నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు చెడు పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని కేటీఆర్ విమర్శించారు.  కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు ముఖ్యమంత్రిపై నాకు గొంతు వరకు కోపం ఉంది. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదటని ప్రశ్నించారు. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదామని విమర్శలు గుప్పించారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం ఇబ్బంది..నేను ప్రపంచమంతా చదువుకున్నాఅని కేటీఆర్ తెలిపారు.   జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా  కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, తిట్ల భాష తమకూ వచ్చినా తాము అలా చేయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన  హామీలన్నీ ఎగనామం పెట్టారని ఆరోపించారు. పింఛన్లు  ఎప్పటి నుంచి పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు

హస్తినకేగిన సీఎం రేవంత్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు బయలు దేరారు. శుక్రవారం (డిసెంబర్ 26) ఆయన ఢిల్లీకి బయలు దేరారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం హస్తినలో శనివారం (డిసెంబర్ 27) అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే అయినా, ఆ సమావేశం తరువాత రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఆయన ఈ భేటీలలో కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం (డిసెంబర్ 28)న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, జీహెచ్ఎంసీ విస్తరణ, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందని అంటున్నారు. వాటికి దీటుగా అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై గళమెత్తి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ సారి సమావేశాలకైనా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్న ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తమౌతోంది.