లక్నో పర్యటనకు జగన్
posted on Dec 3, 2013 @ 12:31PM
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణను సీబీఐ కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఈ కేసుకు సంబంధించి ఏ-1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. అలాగే మొట్టమొదటి సారిగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో నిందితురాలుగా ఉన్న మంత్రి గీతారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి ధర్మాన కారులో గీతారెడ్డి కోర్టు వచ్చారు. ఈకేసుకు సంబంధించి మొత్తం 10 చార్జిషీట్లపైన కోర్టు విచారణ జరిగింది.
లక్నో కు జగన్: సమైక్యరాష్ట్రానికి మద్దతు ఇస్తూ తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ వై.ఎస్.జగన్ లక్నో వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలుస్తున్నారు. ఈ మేరకు ఆయన లక్నో వెళ్లడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఓడిషా,పశ్చిమబెంగాల్, ముంబై లలో పర్యటించి, ఆయా నేతలను కలిసి వచ్చిన జగన్ ఇప్పుడు లక్నో వెళుతున్నారు.