పక్షపాత వైఖరి ప్రదర్శించిన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్

  ఈ రోజు కృస్ణా జలాల వివాదంపై ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. రాష్ట్రానికి మొత్తం 1001 నుంచి 1005 టీఎంసీలను కేటాయించగా, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా పెంచిన ఆల్మట్టి డ్యాం ఎత్తుకి ట్రిబ్యునల్ ఆమోదముద్ర కూడా వేసింది. నీటి లభ్యత ప్రమాణికతను 75 శాతం నుండి 60శాతానికి కుదించడం ద్వారా ఆల్మట్టి డ్యాంలో 548 టీ.యంసి.లు నీళ్ళు కర్నాటకకు అదనంగా దక్కేలా చేసింది. ప్రభుత్వం అసమర్ధత, అశ్రద్ద వెరసి రాష్ట్రానికి కృష్ణా నది మిగుల జలాలో న్యాయబద్దంగా దక్కవలసిన వాటా కోల్పోయేలా చేసింది.   సాధారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకానికి 75 శాతం నీటి లభ్యతని ప్రామాణికంగా తీసుకొని వాటాలు పంచుతారు. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానిని మరో 15 శాతం తగ్గించి 60శాతంగా నిర్ణయించడంతో గతంలో 2030 టీ.యంసి.గా ఉండే ఈ పరిమితి ఇప్పుడు 2578 టీ.యంసి.గా మార్చబడింది. ఇంతవరకు 2030 టీ.యంసి.గా అదనంగా ఉన్న నీటిని మనం రాష్ట్రం వాడుకొనేవీలు ఉండేది. కానీ కర్ణాటక ప్రభుత్వం గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వలన దానిని నీటి నిలువ సామర్ధ్యం కూడా పెరిగింది. ఇప్పుడు ట్రిబ్యునల్ కనీస నీటి లభ్యతని 60శాతంగా మార్చడంతో ఇప్పుడు కర్నాటకకు మరో 548 టీ.యంసి.లు నీళ్ళు ఆయాచితంగా దక్కాయి.   అందువల్ల ఇప్పుడు 2578 టీ.యంసి.లకు అదనంగా డ్యాం లో నీళ్ళు ఉన్నపుడే అవి మిగులు జలాలుగా పరిగణింపబడుతాయన్నమాట. ఆ పైన ఉండే నీటిని మాత్రమే మన రాష్ట్రం వాడుకొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగులు జలాలపై హక్కుల కోసం మన ప్రభుత్వాలు గట్టిగా కోరకపోవడంతో, వాటిపై కూడా కర్నాటక హక్కులు కోరే అవకాశం చేజేతులా కల్పించారు.   ఇక మరో చేదు నిజం ఏమిటంటే ఈ మిగుల జలాల లెక్కల మీదనే ఆధారపడి జలయజ్ఞం కింద కృష్ణా బేసిన్‌లో రూ.32 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టుల భవితవ్యం నేటి ట్రిబ్యునల్ తీర్పుతో ప్రశ్నార్థకంగా మారబోతోంది. అటు నీళ్ళు పోగొట్టుకొన్నాము, ఇటు వేల కోట్ల ప్రజాధనం వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టులు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.   గతంలో ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే, ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన తరువాత మళ్ళీ రమ్మని పంపించేసింది. గనుక మళ్ళీ ఇప్పుడు న్యాయం కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించ వలసి ఉంటుంది. అయితే రాష్ట్రం విడిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఆ పనిచేస్తుందని ఆశించలేము. ఇప్పుడు మన రాష్ట్రం కూడా రెండుగా విడిపోతున్నందున మున్ముందు తెలంగాణాలో మరి కొన్ని ప్రాజెక్టులు లేస్తే ఇక దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఊహించుకోవచ్చును.

పాములు @ అసెంబ్లీ!

      అసెంబ్లీ ఆవరణలో తిరుగుతున్న పాము దంపతుల మధ్య సంభాషణ ఎలా వుంటుందో ఊహిద్దాం. ‘‘ఏవండీ.. ఏవండీ.. నిద్ర లేవండీ..’’ ‘‘అబ్బా.. ఏవైందే?’’ ‘‘మన చిన్నోడిని పాములు పట్టుకునేవాళ్ళు తీసుకెళ్ళిపోయారండీ’’ ‘‘అదేంటే.. వాడసలు బయటికెందుకు వచ్చాడు? వాణ్ణి సీఎల్పీ ఆఫీసులో సెటిలవ్వమని చెప్పాగా?’’ ‘‘సీఎల్పీ ఆఫీసులో కంపు అతి దారుణంగా పెరిగిపోయిందంటండీ. ఆ కంపుని భరించలేక బయటికొచ్చాడండీ. ఆ తెలుగుదేశం లెజస్లేచర్ ఆఫీసు నీట్‌గా వుందంటే అటువైపు వెళ్ళబోయాడు. ఇంతలోనే వాణ్ణి పట్టేసుకున్నారు. ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తారో ఏంటో’’ ‘‘వాడికేం కాదు ఏడవ్వాకే!  ఆ పట్టుకున్నోళ్ళెవరో మనోణ్ణి తీసుకెళ్ళి ఏ అడవిలోనో వదిలేస్తార్లే. ఇక్కడికంటే ఆడు అడవిలోనే సేఫ్‌గా వుంటాడు’’ ‘‘అవునాండీ? పోనీలే.. వాడు ఎక్కడున్నా సంతోషంగా వుంటే అదే చాలు’’ ‘‘అవునుగానీ ఒసే.. ఆ టీఆర్ఎస్ లెజిస్లేచర్ ఆఫీసులో మన పిల్లలు ఇద్దరు సెటిలయ్యారు కదా.. వాళ్ళింకా అక్కడే వున్నారా?’’ ‘‘ఆ.. అక్కడే వున్నారండీ. కానీ ఆ ఆఫీసులోకి చాలా పెద్దపెద్ద పాములు వచ్చిపోతున్నాయంట. వాటిని చూసి మన పిల్లలు బెదిరిపోతున్నారంట. అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేస్తాం మమ్మీ అని ఒకటే బతిమలాడుతున్నారు’’ ‘‘ఆ వైఎస్సార్సీపీ ఆఫీసులో వున్న ఇద్దరు పిల్లల పరిస్థితేంటి?’’ ‘‘ఆ ఆఫీసులో పెద్దపెద్ద కప్పలు వున్నాయంటండీ. అవెక్కడ తమమీద దాడిచేస్తాయోనని పిల్లలు భయపడిపోతున్నారంటండీ’’ ‘‘సర్లే, త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయ్. తెలంగాణ బిల్లు చర్చకి వచ్చే అవకాశం కూడా వుంది. అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందో ఏంటో.. అంచేత ఓ పన్జేద్దాం. ఈరోజు రాత్రికి మన ఫ్యామిలీ మొత్తం పక్కనే వున్న పబ్లిక్ గార్డెన్స్ లోకి షిష్టయిపోదాం’’ ‘‘అలాగేనండీ’’

జేసీ బ్రదర్స్ చేరిక వార్తలతో పరిటాల వర్గంలో ఆందోళన

  జేసీ బ్రదర్స్ గా పేరుగాంచిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ తోడు దొంగలని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. బొత్స కూడా వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసారు. అయితే సహజంగా కొంచెం ఆవేశపరులయిన వారిరువురు వైకాపాలో చేరి జగన్మోహన్ రెడ్డితో తాము సర్దుకు పోలేమని భావించడంతో, తెదేపావైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తెదేపాలోకి ఎంట్రీ దొరకకపోయినట్లయితే వారిరువురు స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.   తేదేపాకు అనంతపురం జిల్లాలో మొదటి నుండి పరిటాల కుటుంబము కొండంత అండగా ఉంటూ వచ్చింది. పరిటాల రవి హత్యకు గురయిన తరువాత కూడా ఆయన అర్ధాంగి పరిటాల సునీత, వారి కుమారుడు పరిటాల శ్రీరామ్ మరియు అనుచరులు అందరూ కూడా తేదేపాను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా తెదేపా కూడా వారికి అన్నివిధాల అండదండగా నిలుస్తోంది.   అయితే ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వస్తున్న వార్తలతో సహజంగానే పరిటాల వర్గంలో ఆందోళన మొదలయింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి అనుమతించే ప్రసక్తే లేదని పరిటాల సునీత ఇటీవల మీడియాతో అన్నట్లు తెలుస్తోంది. తెదేపా అధిష్టానం మాత్రం ఇంకా ఈ వార్తలపై స్పందించలేదు.

పోలీసులకు తరుణ్ తేజ్‌పాల్ టోకరా!

      మహిళా జర్నలిస్టుపై వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులను బురిడి కొట్టించారు. ఈ రోజు ఉదయం పోలీసులు తేజ్‌పాల్ ఇంటికి వెళ్ళారు. అయితే అప్పటికే తేజ్‌పాల్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా అతడి ఆచూకి తెలిపేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నేడు పోలీసులు ఎదుట తేజ్‌పాల్ హాజరయ్యే అవకాశం ఉంది. తన నివాసంలో తేజ్‌పాల్ లేకపోవడంతో అతడి బంధువల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయనున్నారు.   గురువారం సాయంత్రం 3 గంటల్లోగా అతను పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. దాంతో పోలీసులు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పొందారు. తాను మర్నాడు గోవా వస్తానని, తాను విచారణకు సహకరిస్తానని తరుణ్ తేజ్‌పాల్ గురువారంనాడు సమాచారం అందించాడు. తనకు శనివారం వరకు గడువు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ అంతకు ముందు గోవా పోలీసులను కోరాడు. అయితే, వారు అందుకు నిరాకరించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కృష్ణా జలాలపై రాష్ట్రానికి షాక్

      కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణా జలాలపై కర్నాటక ప్రభుత్వానికి అనుకూలంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం తీర్పును వెలువడించింది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతారలను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపును బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌కు 1001 నుంచి 1005 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. జస్టిస్ బ్రిజేస్ కుమార్ నేతృత్వంలోని దిలీప్‌కుమార్ సేథ్, డీపీ దాస్‌లతో కూడిన ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై తీర్పును వెలువడించింది. గెజిట్‌లో నమోదైనప్పటి నుంచి 2050 మే 31వ తేదీ వరకు ఈ తీర్పు అమలులో ఉంటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలు

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇటీవల ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిలో మార్పును సూచిస్తున్నట్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా బాధ కలిగించే విధంగా రాష్ట్ర విభజన చేస్తోందని, అది చూస్తే ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేస్తున్నట్లు కాక, కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ‘విభజించు,పాలించు’ విధానాన్ని అమలు చేస్తునట్లు ఉందని మోడీ అన్నారు. ఇదివరకు తమ ఎన్డీయే హయంలో కూడా మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, కానీ అప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలకు పూర్తి ఆమోదయోగ్యంగా విభజన జరిగిందని అందుకు రెండు ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషించారని ఆయన అన్నారు.   ఆ మధ్య ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిన మాటలకీ ఇప్పడు మాట్లాడుతున్న మాటలకీ చాలా తేడా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్దిలో ఒకదానితో మరొకటి పోటీ పడగలవని ఆనాడు అంటే, ఇప్పుడు విభజన ప్రజలకు బాధ కలిగించే రీతిలో జరుగుతోందని అన్నారు.   ఆయన పర్యటన తరువాత మెహబూబ్ నగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన సీనియర్ బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ‘తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తుందని’ ప్రకటించారు. కానీ, ఇప్పుడు మోడీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ ఏవిధంగా వ్యవహరించబోతోందో చూచాయగా తెలుపుతోంది.   కాంగ్రెస్ పార్టీ కూడ బహుశః ఇది పసిగట్టే ఉండవచ్చును. అయినా ఏమి తెలియనట్లుగా వ్యవహరిస్తూ పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతోంది. అంటే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టి, దానికి బీజేపీ మద్దతు ఈయకపోతే ఆపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. కానీ తను ప్రవేశపెట్టిన బిల్లుని గెలిపించుకోవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ మీదే ఉంది. గనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనే ఉందనుకోవాల్సి ఉంటుంది.

కృష్ణా జలాల పంపిణీపై తుది తీర్పు

  కృష్ణా జలాల పంపిణీకి సంభందించిన కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. పదేళ్లుగా మూడు రాష్ట్రాల వాదనలు వింటున్న బ్రజేశ్‌కుమార్‌ కమిటీ ఈ రోజు తుది తీర్పును వెలువడించనుంది. మన రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి.శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు డిల్లీ చేరుకున్నారు.

సచిన్‌ను పొగడటం ఆపండి ; తాలీబన్‌

  ఇండియన్‌ లెజండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌పై ప్రశంసలను ఇక ఆపేయాలని పాకిస్థాన్‌ నిషేదిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌ ఇ తాలీబన్‌ పాక్‌ మీడియాను హెచ్చరించింది. ఏకె 47 ఆయుధాలతో ముఖానికి ముసుగువేసుకున్న కొందరు వ్యక్తులతో కలిసి తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ మాట్లాడిన ఓ వీడియోను తాలిబన్లు మీడియాకు విడుదల చేశారు. ఒక భారతీయున్ని గురించి పాక్‌ మీడియా ఇంత గొప్పగా పొగడటం దురదృష్టకరం అని షాహిద్‌ వీడియోలో పేర్కొన్నాడు. సచిన్‌ ఎంత గొప్ప ఆటగాడు అయినా అతను భారతీయుడే అని, పాక్‌ ఆటగాళ్లు ఎలా ఆడారన్నది ముఖ్యంగా కాదు వాళ్లు పాకీస్థానీయులు కాబట్టి వాళ్లను పొగడండి అంటూ పాక్‌ మీడియాను హెచ్చరించారు.

యూటి అంటే ఊరుకోం

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో హైదరాబాద్‌ను యూటి చేయాలన్న ప్రతిపాదనపై ఇక్కడి నాయకులు గుర్రుగా ఉన్నారు. అలా భాగ్యనగరాన్ని యూటి గనక చేస్తే వారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుందని వారు భయపడుతున్నారు. ఈ విషయం పై మంత్రి దానం నాగేందర్‌ కూడా తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు.గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ను యూటి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్న నాయకులపై మండి పడ్డారు.తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళితే ఏం చేయాలో తమకు బాగా తెలుసన్నారు. హైదరాబాద్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. యూటీ అయితే అధాకారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయని, అప్పుడు ప్రజా ప్రతినిధులుగా తాము ఏం చేయాలని నిలదీశారు. అధికారాలు కేంద్రం చేతిలో ఉండటం తమకు సమ్మతం కాదని దానం నాగేందర్ తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల చిత్రం

  కాంగ్రెస్ అధిష్టానం పట్టుదల చూస్తే ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరగడం ఖాయంలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు తమను దండించబోతున్నారని ఇప్పటికే గ్రహించిన కాంగ్రెస్ నేతలు వైకాపా, తెదేపాల వైపు చూస్తున్నారు. ఇక కిరణ్ కాంగ్రెస్ కూడా ఆవిర్భవిస్తే కొందరు అందులోకి దూకి తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. స్వశక్తి మీద గెలవగలమని బాగా నమ్మకం ఉన్న బొత్స, పురందేశ్వరి, పనబాక, సుబ్బిరామి రెడ్డి వంటి కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్స్ పైనే పోటీ చేయవచ్చును.   అందువల్ల ఈసారి పోటీ తెదేపా మరియు వేర్వేరు జెండాలతో వస్తున్న ఈ మూడు కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహంలో గెలిచేందుకు తెదేపా తన సర్వ శక్తులూ ఒడ్డి పోరాడవలసి ఉంటుంది. అందుకు తెదేపా తన పటిష్టమయినపార్టీ శ్రేణులని, బలమయిన నాయకులని నూటికి నూరు శాతం వినియోగించుకోవలసి ఉంటుంది. అంటే పార్టీ అధిష్టానం మరియు పార్టీ శ్రేణుల మధ్య సరయిన అవగాహన చాలా అవసరమన్నమాట!   ఇక ఈ మూడు కాంగ్రెస్ పార్టీలు ఓట్లు చీల్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాయి గనుక, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్నవ్యతిరేఖతనే కవచంగా చేసుకొని ఈ మూడు పార్టీలతో తెదేపా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో లెఫ్ట్ మరియు బీజేపీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనగలిగితే మరి కొంత బలం చేకూరుతుంది. సమర్ధపాలన అందించిన చంద్రబాబు, నరేంద్ర మోడీలు చేతులు కలిపితే వారి కాంబినేషన్ కి గలగలా ఓట్లు రాలవచ్చును.   ఇక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్ని సర్వే రిపోర్టులు వచ్చినప్పటికీ, అతని సీబీఐ రికార్డులు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నరహస్య సంబంధాలు, అతని అనుభవరాహిత్యం, దుందుడుకు శైలి, అతను చెప్పుకొనే విశ్వసనీయతే కరువవడం, పార్టీలో నేతలమధ్య అంతర్గత పోరు, పార్టీపై పూర్తి పట్టు లేకపోవడం వంటి అనేక లోపాలు ఆపార్టీకి శాపంగా మారవచ్చును. ముఖ్యంగా చంద్రబాబుతో పోలిస్తే జగన్ అనుభవ రాహిత్యం, ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో చేతులు కలపాలనే అతని ఆలోచనలు ఆ పార్టీ ఓటమికి కారణం కావచ్చును. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో అరాచక, అస్తవ్యస్త కాంగ్రెస్ పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ ఎటువంటి పరిపాలనానుభవం లేని జగన్ కు అధికారం కట్టబెట్టే సాహసం చేయకపోవచ్చును. అందువల్ల తెదేపా నేర్పుగా ఈ మూడు కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోగలిగితే విజయం సాధించవచ్చును.

తెలంగాణా ఎన్నికల చిత్రం

  రానున్న ఎన్నికలు ఒక అనూహ్యమయిన వాతావరణంలో జరగనున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ, తెరాస కాంగ్రెస్ తో విలీనం లేదా పొత్తులకి అయిష్టత చూపుతున్న కారణంగా తెరాస, కాంగ్రెస్, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంది. ఈ పోటీలో తెరాసదే పై చేయిగా ఉండవచ్చు. ఈ ఎన్నికల తరువాత మొట్ట మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న కారణంగా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. అది సహజంగానే తెరాసకు లబ్ది చేకూరిస్తే, మిగిలిన అన్ని పార్టీలకు అడ్డుగోడగా నిలుస్తుంది.     కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తున్నపటికీ, కేసీఆర్ ని డ్డీకొని ఎదురు నిలువగల నాయకుడు, ఆయనంత ప్రజాకర్షక నేతలెవరూ ఆ పార్టీలో లేకపోవడమే ఆపార్టీకి ప్రధాన బలహీనత అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం జైపాల్ రెడ్డిని ముందుకు తీసుకు వచ్చినప్పటికీ, కేసీఆర్ నోటిజోరు ముందు ఆయన కూడా తీసికట్టే!   ఇక తెదేపాకు తెలంగాణాలో బలమయిన క్యాడర్, బలమయిన నాయకులు ఉన్నపటికీ, ఆపార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి కారణంగా రెండు లేదా మూడు స్థానాలకే పరిమితమవవచ్చును. ఒకవేళ మజ్లిస్ పార్టీతో లేదా బీజేపీతో చేతులు కలిపితే పరిస్థితి మరికొంత మెరుగుపడవచ్చును.   ఇక ఈసారి మోడీ ప్రభావం ఈ ఎన్నికలపై చాలానే ఉండవచ్చును. అయితే అది ఆపార్టీ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మాత్రం కాదని చెప్పవచ్చును. ఒకవేళ బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకొంటే మరికొన్ని సీట్లు అదనంగా గెలవగలదు.

ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం

    ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం: ఫలిస్తున్న లోకేష్ ప్రయత్నాలు   తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్న నారా లోకేష్ ఇప్పుడు అన్న నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల మధ్య వున్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. స్వల్ప భేదాభిప్రాయాల కారణంగా ఎడమొహం పెడమొహంగా వున్న అన్నగారి కుటుంబాన్ని ఒక్కతాటి మీద నడిపే కృషికి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.   ఈ ప్రయత్నాలను గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఇప్పుడు చంద్రబాబు అనుమతితో లోకేష్ అన్నగారి కుటుంబాన్ని కలిపే బాధ్యతను తన భుజస్కందాల మీదకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వున్నట్టు బయటకి తెలియడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని లోకేష్ భావిస్తున్నారు. అందుకే అన్నగారి కుటుంబం మొత్తం కలిసే వుందని, తెలుగుదేశం పార్టీకి అండగా వుందని సంకేతాలు పంపడం ద్వారా అన్న నందమూరి అభిమానులను, తెలుగుదేశం కార్యకర్తలను మరింత ఉత్సాహపరచవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విభజన గందరగోళం నుంచి రాష్ట్రం బయటపడేలోపు అన్నగారి కుటుంబాన్ని ఒక్కటి చేసే ప్రాజెక్టును లోకేష్ చేపట్టినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  లోకేష్ తన ప్రయత్నాల్లో భాగంగా తన పెదమామ నందమూరి హరికృష్ణను కలసి చర్చించారని, వారిద్దరి మధ్య కుటుంబానికి, పార్టీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని తెలుగుదేశాన్ని వదిలివెళ్ళడం, ఆ తర్వాత తన ఫ్లెక్సీల్లో అన్న నందమూరి ఫొటో ఉపయోగించిన సందర్భంగా తలెత్తిన వివాదం గురించి లోకేష్ దగ్గర హరికృష్ణ ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడలేదని అన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీకి దూరంగా పెడుతున్నారని హరికృష్ణ బాధపడ్డట్టు తెలిసింది. ఈ సందర్భంగా హరికృష్ణ ఆవేశంగా మాట్లాడితే, హరికృష్ణని లోకేష్ సముదాయించి, ఇలాంటి చిన్నచిన్న విషయాలను మరచిపోదాం మామయ్యా అని అన్నట్టు, దానికి హరికృష్ణ సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హరికృష్ణతో లోకేష్ మరోమారు సమావేశమయ్యే అవకాశాలున్నాయట. ఆ తర్వాత తన మామ బాలకృష్ణ-పెద మేనమామ హరికృష్ణలతో మీటింగ్ ఏర్పాటు చేసి, ఇద్దరి చేయీ చేయీ కలిపే అవకాశం వుందంటున్నారు. ఇదే జరిగితే హరికృష్ణ, ఆయన కుమారులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి మనసువిప్పి మాట్లాడే ఉద్దేశంలో లోకేష్ వున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి, తనకు మధ్య విభేదాలు వున్నాయని గిట్టనివారు సృష్టిస్తున్న వార్తలు నిజంకాదని నిరూపించే ప్రయత్నంలో లోకేష్ వున్నట్టు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు ఆయనకు పార్టీలో సముచిత గౌరవాన్ని కూడా కల్పించాలని పార్టీ అధ్యక్షుడిని కోరనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సరికొత్త సర్వే ఫలితాలు: అగ్రస్థానంలో తెలుగుదేశం

      రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే ఎంతో కీలకమైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయోనన్న ఉత్కంఠ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశమంతటా వుంది. ఎన్నికల ఫలితాల మీద సర్వేలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలను నిర్వహించడంలో విశ్వసనీయత వున్న ఒక సంస్థ, మరో ప్రముఖ సంస్థతో కలసి రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించినట్టు తెలిసింది.   ఆ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఒక తెలుగు ఛానల్‌లో రేపో ఎల్లుండో ప్రసారం కానున్నాయి. ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ‘తెలుగువన్’ చేతికి చిక్కాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని ఏయే పార్టీ ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం వున్నదో ఆ సర్వే చెబుతోంది. ఆ సర్వే ప్రకారం... రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సీట్లలో 117 సీట్లలో గెలిచి తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుంది. రాష్ట్రంలోని మిగతా పార్టీల విషయానికి వస్తే,  వైఎస్సార్సీపీ-87, టీఆర్ఎస్-51, కాంగ్రెస్ పార్టీ-25, బీజేపీ-02, ఎం.ఐ.ఎం.-07, ఇతరులు-05 సీట్లలో గెలిచే అవకాశం వుందని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

డిసెంబర్ 4న కేంద్రానికి జీవోఎం నివేదిక

      రాష్ట్ర విభజనపై కేంద్రం వేగం పెంచించింది. డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదికను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గురువారం నార్తబ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కార్యాలయంలో షిండే, జైరాం రమేష్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ భేటీ అయి జీవోఎం నివేదికకు తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సమాచారం.   మరోవైపు వచ్చె మంగళవారానికి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బిల్లు రూపకల్పన పై కసరత్తు మొదలైంది. సిపారసులతో కూడిన నివేదికను జీవోఎం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం లోపు బిల్లు రూపకల్పన పూర్తవనుంది. అదే సాయంత్రం ఐదు గంటలను ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలపనుంది.    

ప్రజారాజ్యం వైకాపా దొందుకు దొందే: లోకేష్

  ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే ట్వీటర్ లోనే ఎక్కువ కనిపించే నారా లోకేష్ మళ్ళీ తమ ప్రత్యర్ద వైకాపా పైకి మరో ట్వీట్ బాణం సందించాడు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, తరువాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మధ్య అట్టే తేడా లేదని, కేవలం విలీనం, పొత్తులనే అంశాలలోనే కొద్దిపాటి తేడాలుంటే ఉండవచ్చని, మిగిలిన విషయాలలో రెండూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రజారాజ్యం ఏవిధంగా సీట్లను నోట్లకి అమ్ముకొందో ఇప్పుడు వైకాపా కూడా అదే చేస్తోందని ట్వీట్ చేసారు. దీనిపై వైకాపా ఎలా స్పందింస్తుందో ఊహించడం కష్టమేమి కాదు. అయితే లోకేష్ కూడా తన ట్వీట్ లోకం నుండి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాగ ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చి చురుకుగా పాల్గొంటూ ఉంటే, అతని మాటలకు విలువ ఏర్పడేది.

జీఓయం తుది నివేదిక 4న

  కొద్ది సేపటి క్రితమే కేంద్రమంత్రుల బృందం(జీఓయం) సమావేశం ముగిసింది. ఆర్ధికమంత్రి చిదంబరం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో షిండే, జైరామ్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల 4న జీఓయం తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో ప్రవేశపెడుతుందని తెలిపారు. హైదరాబాద్, భద్రాచలం పై ఎటువంటి సమస్యలు లేవని, ఎవరికీ బాధ కలిగించని విధంగానే తమ నివేదిక తయారుచేస్తున్నామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.   అందువల్ల ఈ రోజు జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో జీఓయం నివేదిక ఉండబోదని స్పష్టమయింది. అయితే నాలుగవ తేదీలోగా రాష్ట్ర నేతలతో షిండే మరికొన్ని సార్లు చర్చించి నివేదికకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. నాలుగవ తేదీన జరిగే మంత్రి మండలి సమావేశంలో బిల్లుని ఆమోదించిన వెంటనే అదే రోజు రాష్ట్రపతికి పంపబడవచ్చును. ఆయన దానిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, వెంటనే రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అంటే వచ్చేనెల 9లోగా ఎప్పుడయినా తెలంగాణా బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించవచ్చును.   శీతాకాల సమావేశాలలోనే బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నందున, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు అట్టే సమయం ఈయకపోవచ్చును. బహుశః రెండు మూడు రోజులలో, మహా అయితే ఒక వారంలోనే బిల్లుపై సభ చేత ‘మమ’ అనిపించేసి డిల్లీ తిప్పి పంపేయవచ్చును. ఇంత క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తున్న తీరు చాలా అసంబద్దంగా అనిపిస్తున్నప్పటికీ, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో తనకు నచ్చిన విధంగా కధ నడిపిస్తోంది.

రాష్ట్రానికి సీఎం కిరణా?అశోక్ బాబా?

      సమైక్య రాష్ట్రం కోసం అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ వీ.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం కిరణా?...అశోక్ బాబా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్టాడితే తాము ఖండిస్తామని...మీరు అశోక్ బాబు నోరు మూయిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని జీవోఎంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ యూటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయలసీమ నేతల ధాటికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములే మిగల్లేదని, మళ్లీ రాయల తెలంగాణ ఎందుకని వీహెచ్ వ్యాఖ్యానించారు.

కావూరి కంపెనీ బ్లాక్ లిస్టులో

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర, తెలంగాణా ప్రజలకి ఏమి ఒరుగుతుందో తెలియదు కానీ రాజకీయ నేతలకు, ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొనే నేతలకు మాత్రం నాలుగు కాదు..కాదు పద్నాలుగు రాళ్ళు వెనకేసుకొనే అవకాశం కలుగబోతోంది. తెలంగాణా రాష్ట్రంలో అందరి కంటే మొట్ట మొదటగా ప్రయోజనం పొందేది రాజకీయ నేతలే. కొందరికి మంత్రి పదవులు, మరి కొందరికి భారీ కాంట్రాక్టులు తధ్యం.   ఇంతవరకు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకొని కేకలు పెట్టిన సీమాంధ్ర రాజకీయ నేతలకయితే తంతే బూర్లె గంపలో పడినట్లే అనుకోవచ్చును. రాజధానితో సహా భారీ ఎత్తున జరుగబోయే నిర్మాణ కార్యక్రమాల ద్వారా వారు ఊహించని విధంగా లబ్ది పొందబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతలు మై కాస్త ఎక్కువ లబ్ది పొందగలరు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి రానప్పుడే అనేక ప్రాజెక్టులు దక్కించుకొని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్న రాజకీయ నేతలు ఇప్పడు ఏకంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేసే అవకాశం వస్తే ఎంత వెనకేసుకొంటారో ఊహించవచ్చును.   అయితే లక్షల కోట్లతో భారీ ఎత్తున జరిగే ఈ నిర్మాణ పనుల కోసం భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయం కూడా తీసుకోవచ్చును. అయితే పాపం ఇటువంటి కీలక సమయంలోనే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు అనుకోని విధంగా పెద్ద కష్టమోచ్చిపడింది పాపం!   ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ అనే సంస్థపై అవినీతి, దగా వంటి అభియోగాలు నమోదు అవడంతో ప్రపంచబ్యాంకు పదకుండేళ్లపాటు ఆ సంస్థని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించింది. అందువల్ల ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో జరిగే ఎటువంటి ప్రాజెక్టులలో కావూరి గారి సంస్థ వేలుపెట్టలేదు. అయితే రాష్ట్రంలో అన్ని ప ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంక్ సహకారంతోనే జరగవు గనుక కావురివారు ఏదో ఒక ప్రాజెక్టు పట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చును.   కానీ ముందు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి కదా! గెలవకపోతే దానికి కావూరి మాత్రం ఏమి చేయగలరు? ప్రపంచ బ్యాంకు మాత్రం ఏమి చేయగలదు?

డిసెంబరు 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!

      డిసెంబరు మొదటివారంలో అసెంబ్లీ సమావేశపరచడానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్న నేపధ్యంలో... డిసెంబరు 20లోపు అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. డిసెంబరు 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు కూడా 20వ తేదీనే ముగియనున్నాయి. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రావాలంటే డిసెంబరు 20 లోపు అసెంబ్లీలో చర్చించి, అభిప్రాయాలను పార్లమెంటుకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌కు, సిఎంకు ఉన్నతస్థాయిలో సూచనలు అందినట్లు తెలిసింది.   అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.