బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో వైకాపా, తెదేపా బిజీ బిజీ
posted on Dec 4, 2013 @ 10:53AM
కాదేది రాజకీయలకనర్హం అన్నట్లు, కృష్ణా మిగులు జలాల వినియోగంపై ఇటీవల వెలువడిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా రాజకీయ పార్టీలకు ఒక కొత్త అస్త్రంగా అందివచ్చింది. ప్రస్తుతం తెలంగాణావాదుల దృష్టి అంతా రాయల తెలంగాణా వ్యతిరేఖ పోరాటాల మీదనే ఉంది గనుక అక్కడి పార్టీలేవీ ఈ అంశాన్ని పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. కానీ, సీమాంధ్రపై పట్టుకోసం పోరాటాలు చేస్తున్న తెదేపా, వైకాపాలు మాత్రం ఈ అంశం ఆయుధంగా చేసుకొని ధర్నాలకు శ్రీకారం చుట్టాయి.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఈరోజు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వేలాది రైతులు పాల్గొంటున్నభారీ ధర్నాచేస్తుండగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన కారణంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద ధర్నా చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన లేఖ వలనే ఈ అనర్ధం జరిగిందని తెదేపా వాదిస్తుంటే, చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ పరిస్థితి ఏర్పడిందని వైకాపా వాదిస్తూ బోడి గుండుకి మోకాలుకీ ముడి పెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఏమయినప్పటికీ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెదేపా, వైకాపాలకు ఆయాచితంగా అస్త్రాలు అందించిందని చెప్పవచ్చును. అయితే అందరికంటే మొదట స్పందించవలసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలో రాష్ట్ర శాసనసభకు రానున్న తెలంగాణా బిల్లుని ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రికి, ఆయన అనుచరులకు తీరిక లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.