విమానం సిగ్నల్ దొరికింది

      హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన మలేసియాకి చెందిన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ కోసం మలేసియా, అమెరికా, చైనాతోపాటు అనేక దేశాలకు చెందిన విమానాలు, షిప్పులు వెతుకుతున్న విషయం తెలిసిందే. సోమవారం లోపు ఈ విమానం ఆచూకీ తెలియని పక్షంలో ఇక విమానం ఆచూకీ తెలిసే అవకాశం లేదని మలేసియా అధికారులు ప్రకటించారు. అయితే శనివారం ఈ విమానం కోసం వెతుకుతున్న ఒక చైనీస్ షిప్‌కి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సిగ్నల్ దొరికినట్టుగా తెలుస్తోంది. హిందూ మహా సముద్రంలో విమానం ఎక్కడుందనే విషయాన్ని ఈ సిగ్నల్ ద్వారా తెలుసుకునే అవకాశం వుందని చైనీస్ అధికారులు చెబుతున్నారు.

వైకాపా దొంగల పార్టీ: మారెప్ప

  సంచలనాత్మక వ్యాఖ్యానాలు చేయడంలో సిద్ధహస్తుడైన  రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మారెప్ప జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని అభివర్ణించారు. జగన్ అధికారంలోకి వస్తే శ్మశానాలని కూడా అమ్మేస్తాడని విమర్శించాడు.  ఈ ఎన్నికలలో టిక్కెట్లు అమ్ముకుంటూ జగన్ వందల కోట్లు తన ఖజానాలో వేసుకుంటున్నాడని మారెప్ప అన్నారు. జగన్ గెలిచినా, ఓడినా జైలుకు వెళ్ళడం ఖాయమని మారెప్ప జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మారెప్ప వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పార్టీలో చేరారు. అయితే అక్కడి విధానాలతో విసిగిపోయిన మారెప్ప ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. పార్టీ నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి జగన్‌ని తిట్టిపోయడంలో మారెప్ప బిజీగా వున్నారు.

టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరింది

      టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చర్చలు ఫలప్రదమయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన జవదేకర్ బృందంతో చంద్రబాబు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తెలంగాణలో బీజేపీకి 45 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. అలాగే సీమాంధ్రలో 15 అసెంబ్లీ స్థానాల్లో, 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ అంగీకరించింది. దీనితో గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య జరిగిన పొత్తుల ప్రతిష్టంభన ముగిసి, కథ సుఖాంతమైంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకోరాదంటూ తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసినా, కొందరు స్థానిక నాయకులు రాజనామాలు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపింది.

సోనియా, రాహుల్ సీమాంధ్రకి రానట్టే?

  ఈ నెలలోనే తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పర్యటించే అవకాశం వుంది. తెలంగాణ ఇచ్చాం కాబట్టి మా పార్టీకే ఓటేయండి అని సోనియాగాంధీ పబ్లిక్ మీటింగ్‌లో చెబితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వరదలా పారతాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో పర్యటించాలని వీళ్ళు అమ్మగారిని, యువరాజుని కోరగా ఇద్దరూ ఓకే అన్నారని, ఈనెలలోనే వీరిద్దరూ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తోంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోనియా, రాహుల్‌లను సీమాంధ్రలో పర్యటించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి కూడా చేశారట. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం తొలగాలంటే మీరిద్దరూ జాయింట్‌గా ఇక్కడి వచ్చి, బహిరంగసభల్లో పాల్గొని ఇక్కడి ప్రజల్లో వున్న అపోహలు తొలగించాలని కోరారట. రఘువీరా చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తామని చెప్పిందట. అయితే ఆ తర్వాత జరిగిన సమాలోచనల్లో  మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రకు వెళ్ళకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. ఎలాగూ సీమాంధ్రలో కాంగ్రెస్ మునిగిపోయింది కాబట్టి అక్కడి వెళ్ళి సాధించేదేమీ లేదని తేల్చేశారట. అందువల్ల సోనియా, రాహుల్ తెలంగాణలో పర్యటన ముగించుకుని వెళ్ళిపోయే అవకాశం వుంది.

బిస్కెట్ వేస్తున్న రఘువీరా!

      సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆరిపోయిన దీపంతో సమానం. ఆ ఆరిపోయిన దీపంలో నీళ్ళు పోసి వెలిగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. పోటీ చేయడానికి అత్యుత్సాహంగా ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చినా వాళ్ళందరూ గెలిచే సత్తా లేనివాళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని రఘువీరారెడ్డి సత్తా వున్న అభ్యర్థులకు బిస్కెట్ వేస్తున్నారు.   ఆ బిస్కెట్ సారాంశమేంటంటే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్ర నుంచ పోటీ చేసి గెలిచిన వారికి 2019 ఎన్నికలలో కూడా సదరు టిక్కెట్ వాళ్ళకే కేటాయిస్తారట. రఘువీరా ఇచ్చిన ఈ ఆఫర్ చూసి సీమాంధ్రలో అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. పాపం ఫ్రస్టేషన్‌లో వున్న రఘువీరా ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇస్తున్నారని అనుకుంటున్నారు. రఘువీరా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సత్తా సీమాంధ్రలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే సాహసం ఎవరూ చేయరు. ఒకవేళ అలాంటి సాహసం చేసినవాళ్ళు పొరపాటున కూడా గెలవరు. ఒకవేళ గెలిచినా 2019లో మళ్ళీ టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు.. ఎందుకంటే 2019లో టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తున్న రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వుండకపోవచ్చు. ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీలోనే వుండకపోవచ్చు. అంచేత ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇవ్వడం రఘువీరా మానుకుంటే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రేవ్ పార్టీ : అమ్మాయిలు దొరికిపోయారు!

      పూణేలోని లోనావాలా ప్రాంతంలో ఓ పెద్ద బిల్డింగ్‌లో 20 మంది కాలేజీ అమ్మాయిలు రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. పీకలదాకా తాగి, తమతోపాటు వచ్చిన 26 మంది తమ కాలేజీ అబ్బాయితో కలసి డాన్స్ చేస్తున్నారు. ఆ కుర్రాళ్ళు కూడా బీభత్సంగా తాగి వున్నారు. ఇంతలో అనుకోకుండా పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేస్తూనే వున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు పూర్తిగా మత్తులో మునిగిపోయి వచ్చింది పోలీసులు అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో వున్నారు.   వాళ్ళ ఒంటిమీద వున్న బట్టల పరిస్థితిని మనం ప్రస్తావించుకోకపోవడమే మంచిది. వాళ్ళందరికీ మత్తు వదిలాక తామందరూ పోలీస్ స్టేషన్‌లో వున్నామని అర్థం చేసుకున్నారు. అమ్మాయిలతో డాన్స్ చేసిన మగ గాడిదల సంగతి అలా వుంచితే, సదరు అమ్మాయిలందరూ పూణేలో ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిలే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు. అయినా పోలీసులు భయపడకుండా ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించారు. ఈ అమ్మాయిలందరూ రేవ్ పార్టీ చేసుకోవడానికి ఆ బిల్డంగ్‌ని బోలెడంత అద్దె చెల్లించి అద్దెకి తీసుకున్నారట. కాలేజీ జరుగుతున్న సమయంలో కూడా అక్కడకి వచ్చి పార్టీ చేసుకుని వెళ్తారట. బిల్డింగ్ అద్దె, పార్టీకి అయ్యే ఖర్చు మొత్తం అమ్మాయిలే పెట్టుకుంటారట. పోలీసులు అమ్మాయిలందరికీ బెయిల్ ఇచ్చేసి వాళ్ళ ఇళ్లకి పంపేశారు. రేపో మాపో కోర్టులో కాస్తంత జరిమానా విధించి వాళ్ళకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తారు. మరి ముళ్ళదారిలో ప్రయాణిస్తున్న యువతరాన్ని ఎవరు కాపాడతారు?

పోలీసుల అతి చూతము రారండీ!

      అసలే కోతి... ఆపై కల్లు కూడా తాగితే ఎలా వుంటుంది? అలాగే అసలే పోలీసులు.. అందులోనూ రాష్ట్రపతి పాలన.. ఆపై ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక పోలీసులకు పట్టపగ్గాలుంటాయా? ఎన్నికల సందర్భంగా ఓటర్లకి పంచడానికి డబ్బు తరలింపు జరుగుతుందనే సాకు చూపించి రాష్ట్ర మంతటా పోలీసులు ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేసుకుని కూర్చుని దారిన పోయే వాహనాలను చెక్ చేసి జనాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. డబ్బు తరలించే రాజకీయ నాయకుల వాహనాలు పోలీసుల ముందు నుంచి జుమ్మని తూనీగల్లా వెళ్తున్నా పట్టించుకోకపోగా, సెల్యూట్ కొడుతూ రాచ మర్యాదలతో పంపించేస్తున్నారు.   సామాన్యులను మాత్రం టార్గెట్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వ్యాపార లావాదేవీల కోసం తీసుకువెళ్తున్న డబ్బుని పట్టుకుని లెక్కలున్నాయా? టాక్స్ కట్టావా? అంటూ టార్చర్ చేస్తున్నారు. సదరు డబ్బుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి అప్పగించి ప్రజల్ని హింసిస్తున్నారు. కోట్లకు కోట్లు డబ్బు దొరికితే సరే, లక్షల్లో , వేలల్లో డబ్బు దొరికినా పోలీసులు జనంతో ఆడుకుంటున్నారు. మొన్నీమధ్య ఒక వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు దొరికాయట. ఈ డబ్బు నీకు ఎక్కడిది? టాక్స్ కట్టావా? ఆదాయపు పన్ను కట్టావా అని ఆ డబ్బు స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకి అప్పగించారట. ఓటర్లకి డబ్బు పంచడానికి యాభై వేల రూపాయలు తీసుకెళ్ళేంత దరిద్రంలో మన రాజకీయ నాయకులు లేరన్న కామన్ సెన్స్ కూడా పోలీసులకు వుండటం లేదు. పోలీసుల బారినపడి చాలామంది చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులు తమ డబ్బు పోగొట్టుకుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీసుల సోదాల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బు కనిపిస్తే, మాక్కొంత ఇస్తావా.. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి పట్టించేయమంటావా అని పోలీసులు జేబులు నింపుకుంటున్నట్టు తెలుస్తోంది.

మోడీ ప్రధాని అవుతారు: అద్వానీ

      భారత రాజకీయాలలో పెద్దమనిషి, బీజేపీలో పెద్ద దిక్కు లాల్ కృష్ణ అద్వానీ తన మసులో వున్న మాటని బయటపెట్టారు. ఈ ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయమని అద్వానీ చెప్పారు. అద్వానీ ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం భారతీయ జనతాపార్టీ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తోంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని పార్టీ ప్రకటించినప్పుడు అద్వానీ హర్టయ్యారు. ఆయన్ని బుజ్జగించడానికి పార్టీ నాయకులు తంటాలు పడాల్సి వచ్చింది. అద్వానీ కూడా అయిష్టంగానే నరేంద్రమోడీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్వానీ క్రమంగా వాస్తవాన్ని అర్థం చేసుకుని మోడీతో కలసి పనిచేయడం ప్రారంభించారు. మోడీ కూడా ఏ పని చేసినా అద్వానీ సలహా తీసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌లోని ఒక వర్గం అద్వానీని మోడీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా అద్వానీ సంయమనం పాటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోంది. ఆ విషయన్ని అద్వానీ సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఈ సమయంలో మోడీకి తనలాంటి వ్యక్తి సపోర్ట్ అవసరమని భావించినట్టున్నారు. అందుకే పెద్దమనసు చేసుకుని మోడీకి అనుకూలంగా ప్రకటన చేశారు. ఏదిఏమైనా అద్వానీ ఒక మంచి పని చేశారు.. మంచ మాట చెప్పారు.

టీఆర్‌ఎస్ రెండో జాబితా విడుదల

      టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 7గురు లోక్ సభ, 4 అసెంబ్లీ అభ్యర్ధులను ఈ రోజు ప్రకటించారు.  లోక్‌సభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. మహబూబ్‌నగర్ - జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ - మందా జగన్నాథం, వరంగల్ - కడియం శ్రీహరి, భువనగిరి - బూర నర్సయ్యగౌడ్, నల్లగొండ - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ - బి.వినోద్‌కుమార్, చేవెళ్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి. శాసనసభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. షాద్‌నగర్(మహబూబ్‌నగర్) - వై. అంజయ్య యాదవ్, కోదాడ (నల్లగొండ) - కె. శశిధర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి - చింతల కనకారెడ్డి, నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్.  

సి.పి.ఐ. నారాయణకి అందని ద్రాక్ష!

      ద్రాక్ష అందితే చాలా తీయన.. అందకపోతే మాత్రం చాలా పుల్లన. ఇప్పుడు సీపీఐ అధ్యక్షుడు నారాయణ ఈ మైండ్ సెట్‌లోనే వున్నారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికి రాష్ట్రం ముక్కలు కావడానికి ఒక కారణంగా నిలిచిన సీపీఐ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంది. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తమకు ఏయే సీట్లు కావాలన్న లిస్టు కూడా నారాయణ చేతిలో పెట్టుకుని తిరిగారు. నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ, జుట్టూ జుట్టూ పట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కలిపితే తమ పార్టీకి రాజకీయంగా మరింత లాభం కలుగుతుందని ఆశించిన నారాయణ ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. పాపం నారాయణ ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. సరేలే టీఆర్ఎస్‌తోనే సరిపెట్టుకుందామని అనుకున్న నారాయణకి కేసీఆర్ భయంకరమైన షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించినప్పుడు సీపీఐ ఆశలు పెట్టుకున్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించేశారు. అంతేకాకుండా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని డిసైడ్ చేసుకున్నటు ప్రకటించారు. దాంతో సీపీఐ నారాయణ కంగుతిన్నారు. కేసీఆర్ తమకి ఇంత భారీ షాక్ ఇస్తాడని ఊహించలేకపోయినందుకు తమను తాను తిట్టుకుని, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేసాఆర్ని తిట్టారు. టీఆర్ఎస్‌తో తమకు పొత్తు కుదరలేదు కాబట్టి సదరు పొత్తు ఇప్పుడు పుల్లని ద్రాక్ష అయిపోయింది.

పాపం శంకర్రావు!

      కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకి తనకు మళ్ళీ టిక్కెట్ దక్కదేమోనన్న భయం పట్టుకుంది. సోనియాగాంధీకి గుడికట్టినప్పటికీ శంకర్రావుకి ఈసారి టిక్కెట్ రావడం అనుమానమేనన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శంకర్రావు దిగులు పెట్టేసుకున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం వెన్నతో పెట్టిన విద్య అయిన శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమైపోయారు. ఈమధ్యకాలంలో తాను చేసిన తప్పులు గుర్తొచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. తెలంగాణ తల్లి అంటే వేరే ఎవరో కాదు. సాక్షాత్ సోనియాగాంధీయే అని ప్రకటించేశారు. చివరికి సోనియాగాంధీకి గుడి కూడా కట్టేశారు. అలాంటి శంకర్రావు ఇప్పుడు తనకు టిక్కట్ రాదని బెంగపడిపోతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ, తన స్థానంలో తన కుమార్తెకి అయినా టిక్కెట్ ఇవ్వాల్సిందిగా  వినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పాపం శంకర్రావు.

బాబు అంటే కోపం లేదు: పురంద్రేశ్వరి

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటే తనకు వ్యక్తిగతంగా కోపమేమీ లేదని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంద్రేశ్వరి అన్నారు. దగ్గుబాటి కుటుంబం నారా కుటుంబానికి మొదటి నుంచీ దూరంగా వుంటూ వచ్చంది. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసిన సమయంలో తోడల్లుళ్ళు చంద్రబాబు, వెంకటేశ్వరరావు దగ్గరైనప్పటికీ ఆ తర్వాత వెంకటేశ్వరరావు చంద్రబాబుకి దూరమయ్యారు. ఆ తర్వాత రెండు కుటుంబాలూ దూరంగానే వుంటూ వచ్చాయి.   దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయంగా కూడా చంద్రబాబుతో వైరం వుండేది. అయితే ఇటీవలి కాలంలో  మారిన రాజకీయ సమీకరణాలతో ఈ రెండు కుటుంబాలు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార కార్యదర్శిగా వున్న పురంద్రేశ్వరి తెలుగుదేశం నాయకులతో, చంద్రబాబుతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పాత పగలను కడుపులో పెట్టుకుంటే అది రెండు పార్టీలకు మంచిది కాదు. ఇలాంటి సందేహాలు జనంలో వస్తాయనే ఊహించిన చిన్నమ్మ శనివారం నాడు వివరణ ఇచ్చంది. తనకు చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా వైరమేమీ లేదని స్పష్టం చేసింది. ఆనాటి సంక్షోభ సమయంలో తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం వాటిని తాను పట్టించుకోవడం లేదని ఆమె చెప్పింది. చిన్నమ్మ చెప్పిన చల్లటి మాట తెలుగుదేశం వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.

జగ్గారెడ్డి పోటీ చేయరా?

      తెలంగాణలో ప్రజా ప్రతినిధులందరూ మాస్ హిస్టీరియా వచ్చినట్టు రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని గందరగోళం చేస్తున్న సమయంలో రాష్ట్ర విభజన మంచిది కాదని నినదించిన ఏకైక తెలంగాణ బిడ్డ సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఇప్పటికీ ఆయన రాష్ట్రం విడిపోకూడదని చెబుతూనే వుంటారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి విజయం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.   సిద్దిపేట ఉపఎన్నిక సందర్భంగా జగ్గారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మీద నమోదైన కేసు విచారణకు వచ్చింది. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేయడం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు కూడా సంగారెడ్డి ప్రజలతో అనుబంధం వుంది. ఈసారి ఎన్నికలలో నిర్మలను సంగారెడ్డి నుంచి పోటీ చేయించాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.  

సిపిఐకి కేసిఆర్ మరో షాక్

      సిపిఐ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు. మొదట ఆ పార్టీతో ఎన్నికల పోత్తు పెట్టుకుంటానని మాటిచ్చిన కేసిఆర్, దానిని పట్టించుకోకుండా సిపిఐ సిటింగ్ స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టారు. తాజాగా సిపిఐ ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే చంద్రావతి కి టికెట్ ఇవ్వకుండా పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలనుకున్న సిపిఐకి కేసిఆర్ మరో షాకునిచ్చారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసిఆర్. శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చంద్రావతి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేల౦దరికీ టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో చంద్రావతికి కూడా టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

టీఆర్ఎస్ శ్రవణ్‌పై కేసు!

      తాను ఏ పార్టీలో వుంటే ఆ పార్టీకి అనుకూలంగా అడ్డంగా వాదించడంలో సిద్ధహస్తుడైన దాసోజ్ శ్రవణ్ పీఆర్పీ అనే అస్తమించిన పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చాడు. పీఆర్పీ పనికిరాని సిద్ధాంతాల గురించి గొంతు చించుకుని మరీ అరిచి ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నం చేసేవాడు. పీఆర్పీ అస్తమించిన తర్వాత ఆయనగారు టీఆర్ఎస్‌లో చేరిపోయి సీమాంధ్రుల మీద నిప్పులు చెరగడంలో, అక్కసు కక్కడంలో బిజీగా వున్నాడు.   ఆయనగారి టాలెంట్ చూసిన కేసీఆర్ ఆయనగారిని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించాడు. చేతిలో పదవి వుంది. అరవడానికి నోరుంది. దాంతో రెచ్చిపోయిన శ్రవణ్ విశ్వరూపం అందరూ చూస్తున్నదే. టీఆర్ఎస్‌లో బెదిరింపు సెక్షన్ ఎక్కువ. ఆ బెదిరింపు సెక్షన్‌ని శ్రవణ్ ఒక దర్శకుడి మీద ప్రయోగించడంతో ఆ దర్శకుడు శ్రవణ్ ఫోన్‌లో చేసిన బెదిరింపులన్నిటీని రికార్డు చేసి జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో శ్రవణ్ మీద కేసు నమోదైంది. అరెస్టు చేసి లోపల వేయడం మాత్రం మిగిలి వుంది.

హిందూపూర్ బరిలో బాలకృష్ణ?

      నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ విజయ యాత్ర ముగిసింది. పనిలోపనిగా జరిపిన ‘తీర్థయాత్ర’ కూడా ముగిసింది. పాత ఫీల్డులో విజయాన్ని ఇచ్చినందుకు, కొత్త ఫీల్డులోకి ఎంటర్ కాబోతున్నందున ఆశీర్వాదాలు కోరుకుంటూ బాలకృష్ణ పనిలోపనిగా ప్రసిద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు. అనంతపురం జిల్లాలో బాలకృష్ణ పర్యటన ముగిసింది.   ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమైన బాలకృష్ణ తాను హిందూపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటి నుంచే కార్యకర్తలు, అభిమానులు హిందూపూర్‌లో తన ప్రచారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ చేయాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. హిందూపురం అసెంబ్లీ నుంచి బాలకృష్ణ పోటీచేయాలనుకోవడం స్థానిక తెలుగుదేశం నాయకులలో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపూర్ అంటే ఉన్న అభిమానాన్ని తలచుకుని అక్కడివారందరూ మురిసిపోతున్నారు. ఎన్టీఆర్ కూడా గతంలో హిందూపూర్ నుంచే పోటీ చేసి ఘన విజయాలు సాధించారు. ఆయన సంప్రదాయాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ కొనసాగిస్తారని భావిస్తున్నారు.