Read more!

పోలీసుల అతి చూతము రారండీ!

 

 

 

అసలే కోతి... ఆపై కల్లు కూడా తాగితే ఎలా వుంటుంది? అలాగే అసలే పోలీసులు.. అందులోనూ రాష్ట్రపతి పాలన.. ఆపై ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక పోలీసులకు పట్టపగ్గాలుంటాయా? ఎన్నికల సందర్భంగా ఓటర్లకి పంచడానికి డబ్బు తరలింపు జరుగుతుందనే సాకు చూపించి రాష్ట్ర మంతటా పోలీసులు ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేసుకుని కూర్చుని దారిన పోయే వాహనాలను చెక్ చేసి జనాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. డబ్బు తరలించే రాజకీయ నాయకుల వాహనాలు పోలీసుల ముందు నుంచి జుమ్మని తూనీగల్లా వెళ్తున్నా పట్టించుకోకపోగా, సెల్యూట్ కొడుతూ రాచ మర్యాదలతో పంపించేస్తున్నారు.

 

సామాన్యులను మాత్రం టార్గెట్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వ్యాపార లావాదేవీల కోసం తీసుకువెళ్తున్న డబ్బుని పట్టుకుని లెక్కలున్నాయా? టాక్స్ కట్టావా? అంటూ టార్చర్ చేస్తున్నారు. సదరు డబ్బుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి అప్పగించి ప్రజల్ని హింసిస్తున్నారు. కోట్లకు కోట్లు డబ్బు దొరికితే సరే, లక్షల్లో , వేలల్లో డబ్బు దొరికినా పోలీసులు జనంతో ఆడుకుంటున్నారు. మొన్నీమధ్య ఒక వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు దొరికాయట. ఈ డబ్బు నీకు ఎక్కడిది? టాక్స్ కట్టావా? ఆదాయపు పన్ను కట్టావా అని ఆ డబ్బు స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకి అప్పగించారట. ఓటర్లకి డబ్బు పంచడానికి యాభై వేల రూపాయలు తీసుకెళ్ళేంత దరిద్రంలో మన రాజకీయ నాయకులు లేరన్న కామన్ సెన్స్ కూడా పోలీసులకు వుండటం లేదు.



పోలీసుల బారినపడి చాలామంది చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులు తమ డబ్బు పోగొట్టుకుని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీసుల సోదాల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బు కనిపిస్తే, మాక్కొంత ఇస్తావా.. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కి పట్టించేయమంటావా అని పోలీసులు జేబులు నింపుకుంటున్నట్టు తెలుస్తోంది.