Read more!

సోనియా, రాహుల్ సీమాంధ్రకి రానట్టే?

 

ఈ నెలలోనే తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పర్యటించే అవకాశం వుంది. తెలంగాణ ఇచ్చాం కాబట్టి మా పార్టీకే ఓటేయండి అని సోనియాగాంధీ పబ్లిక్ మీటింగ్‌లో చెబితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వరదలా పారతాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో పర్యటించాలని వీళ్ళు అమ్మగారిని, యువరాజుని కోరగా ఇద్దరూ ఓకే అన్నారని, ఈనెలలోనే వీరిద్దరూ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తోంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోనియా, రాహుల్‌లను సీమాంధ్రలో పర్యటించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి కూడా చేశారట. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం తొలగాలంటే మీరిద్దరూ జాయింట్‌గా ఇక్కడి వచ్చి, బహిరంగసభల్లో పాల్గొని ఇక్కడి ప్రజల్లో వున్న అపోహలు తొలగించాలని కోరారట. రఘువీరా చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తామని చెప్పిందట. అయితే ఆ తర్వాత జరిగిన సమాలోచనల్లో  మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రకు వెళ్ళకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. ఎలాగూ సీమాంధ్రలో కాంగ్రెస్ మునిగిపోయింది కాబట్టి అక్కడి వెళ్ళి సాధించేదేమీ లేదని తేల్చేశారట. అందువల్ల సోనియా, రాహుల్ తెలంగాణలో పర్యటన ముగించుకుని వెళ్ళిపోయే అవకాశం వుంది.