తెలంగాణ పురపాలక ఫలితాలు.. 9 గంటలకు

  పురపాలక ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలలో వివిధ పార్టీలు గెలుచుకున్న కౌన్సిలర్ల సీట్లను గమనిస్తే.. ఆదిలాబాద్: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (1), తెరాస (5), వామపక్షాలు (2), ఇతరులు (6). కరీంనగర్: కాంగ్రెస్ (10), తెరాస (6), ఇతరులు (3), వరంగల్: కాంగ్రెస్ (1), తెరాస (1), ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), వామపక్షాలు (1), ఇతరులు (1), నల్గొండ: కాంగ్రెస్ (9) తెలుగుదేశం: (2), తెరాస (1), నిజామాబాద్: (ఫలితాలు వెలువడలేదు), మెదక్: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (1), తెరాస (1), ఇతరులు (1), రంగారెడ్డి: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (1), తెరాస (2), మహబూబ్ నగర్: తెరాస (1), ఇతరులు (1). ఉదయం తొమ్మిది గంటల వరకు తెలంగాణలో 41 కౌన్సిలర్ ఫలితాలు వెలువడగా వాటిలో కాంగ్రెస్ 41, తెలుగుదేశం 12, తెరాస 17, వామపక్షాలు 3, ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు.

పురపాలక ఎన్నికలలో మొదటి విజయం టీడీపీదే!

  పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు విడుదలవటం ప్రారంభమైంది. తెలంగాణలో మొదటి ఫలితం విడుదలైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి మొదటి విజేతగా నిలిచాడు. టీఆర్ఎస్ బలంగా వుందని ఇప్పటి వరకూ ఆ పార్టీ నాయకులు అనుకుంటున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోణీ చేయడం ఆశ్చర్యకరం. అలాగే వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మొదటి విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జనగాంలో ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైన ఇరవై నిమిషాలలోనే నాలుగు ఫలితాలు వెల్లడయ్యాయి. సమయం గడిచేకొద్దీ కౌంటింగ్ వేగం పెరిగే అవకాశాలున్నాయి.

4రోజుల వ్యవధిలో ఎన్నికలు, ఫలితాలు

  ఈరోజు 10నగర పాలక సంస్థలు, 145 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజే చివరి దశ ఎన్నికలలో భాగంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 41 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్ది వారాల క్రితం మన రాష్ట్రంలో జరిగిన యం.పీ.టీ.సీ మరియు జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆ తరువాత శుక్రవారం అంటే మే16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకమయినవి. ఈ ఎన్నికలు, వెలువడనున్న ఫలితాలు ఆయా పార్టీల, దేశ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతున్నాయి. మన రాష్ట్రంలో మున్సిపల్ మరియు స్థానిక సంస్థలకు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది వారాల ముందుగా నిర్వహించినందున, ఈరోజు వెలువడబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజాతీర్పు ఏవిధంగా ఉండబోతోందో చూచాయగా తెలియజెప్పవచ్చును. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగు ఈవీయంల ద్వారా నిర్వహించినందున, పూర్తి ఫలితాలు మధ్యాహ్నం నాటికే తెలిసిపోవచ్చును. ముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ మరునాడే స్థానిక సంస్థల ఫలితాలు, రెండు రోజుల వ్యవధిలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉన్నందున ఓట్లు కౌటింగ్ మరియు ఫలితాలు వెల్లడికి ఎన్నికల కమీషన్ విస్తృతమయిన ఏర్పాట్లు, పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసింది.

టీఆర్ఎస్ నేత కోనపురి రాములు దారుణ హత్య

      మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు ఈ రోజు హత్యకు గురయ్యారు. నల్లొండ జిల్లా శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరుగుతున్న పెళ్ళికి హాజరయ్యి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయనను ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. రాములు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు. ఆయనపై గతంలో కూడా హత్యాయత్నం జరిగింది. కొట్టి సాంబశివుడు సోదరుడి హత్య తనకు ప్రాణహానీ ఉందని కోనపురి రాములు గతంలోనే మొరపెట్టుకున్నారు. అతనికి ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీఆర్ ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.

13న తెలంగాణ, సీమాంధ్రలో రీపోలింగ్‌

      ఈ నెల 13న రాష్ట్రంలో 29 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 13 లోక్‌ సభ, 21 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 29 కేంద్రాల్లో రీపోలిగ్‌ నిర్వహిచనున్నట్లు తెలిపారు. దీంతో 13న ఆయా కేంద్రాల్లో రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 12 కేంద్రాల్లో, సీమాంధ్రలో మొత్తం 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.   తెలంగాణలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు పార్లమెంటు: నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని బోధన్‌లో 64వ పోలింగ్ కేంద్రం, జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని జుక్కల్‌లో 134వ పోలింగ్ కేంద్రం, బాన్సువాడలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు. నిజామాబాద్ రూరల్‌లోని 9వ నెంబర్ పోలింగ్ కేంద్రం, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని హుస్నాబాద్‌లో 170వ పోలింగ్ కేంద్రం. అసెంబ్లీ: బాన్సువాడలో 146వ పోలింగ్ కేంద్రం, నిజామాబాద్ రూరల్‌లోని 48, 168 పోలింగ్ కేంద్రాలు, కూకట్‌పల్లిలోని 371/ఎ పోలింగ్ కేంద్రం, కొత్తగూడెంలో 161 పోలింగ్ కేంద్రం, భద్రాచలంలో 239 పోలింగ్ కేంద్రం. సీమాంధ్రలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు పార్లమెంటు: శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని శ్రీకాకుళంలో46వ పోలింగ్ కేంద్రం, మచిలీపట్నం లోక్‌సభ పరిధిలోని గుడివాడలో 123వ కేంద్రం, అవనిగడ్డలోని 29వ కేంద్రం, విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ తూర్పులో 212 వ పోలింగ్ కేంద్రం, మైలవరంలో 123 పోలింగ్ కేంద్రం, జగ్గయ్యపేటలోని 122వ పోలింగ్ కేంద్రం. అసెంబ్లీ: కుప్పంలోని 192 పోలింగ్ కేంద్రం, సాలూరులోని 134వ పోలింగ్ కేంద్రం, అవనిగడ్డలోని 91వ పోలింగ్ కేంద్రం, పెనమలూరులోని 59, 172 పోలింగ్ కేంద్రాలు, నందిగామలో 171, 174 పోలింగ్ కేంద్రాలు. పార్లమెంట్, అసెంబ్లీ: అరకు లోక్‌సభ పరిధిలోని పాడేరులో 68వ పోలింగ్ కేంద్రం, కడప లోక్‌సభ పరిధిలోని జమ్మలమడుగులో 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. (ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రెండిటికీ రీపోలింగ్ జరగనుంది)  

కాంగ్రెస్ పార్టీ.. ఓ అబద్ధాలపుట్ట.. ట్విట్టర్‌లో పాత ఫొటో!

  అబద్ధాలు చెప్పే సబ్జెక్టులో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవార్డు ఇవ్వొచ్చు. ప్రస్తుతం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా వున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీకి లేనిపోని బిల్డప్పు ఇవ్వడం కోసం కూడా తెగ అబద్ధాలు చెప్పేస్తోంది. వారణాసిలో శనివారం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ వారణాసి రోడ్ షో అంటూ బాగా జనాలున్న ఓ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టింది. ఆ ఫొటో చూసి నిజమేననుకుని దేశవ్యాప్తంగా అనేక నెట్ మ్యాగజైన్లు, నెట్ మేగజైన్లు తమ న్యూస్‌లో సదరు ఫొటోని పోస్ట్ చేశాయి. దాన్ని చూసిన జనం అబ్బో వారణాసిలో రాహుల్ ర్యాలీకి ఎంతమంది వచ్చారో అనుకున్నారు. అయితే బీజేపీ మాత్రం వారణాసిలో రాహుల్ ర్యాలీకి జనం ఏమంతగా రాకపోయినా ఫొటోలో మాత్రం ఇంతమంది జనం వున్నారేంటా అని పరిశోధన మొదలుపెట్టింది. తీరా చూస్తే వారణాసి పేరుతో ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో ఎప్పటిదో పాత ఫొటో అని తేల్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో అందరి దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో నాలుక్కరుచుకున్న కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌‌లో పెట్టిన పాత ఫొటో తీసేసింది. జనంలేని వారణాసి ర్యాలీ ఫొటో పెడితే బాగోదని అనుకుందేమోగానీ, ఏ ఫొటో పెట్టలేదు.

లగడపాటి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారా?

  రాష్ట్రం విడిపోతే ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి రాజగోపాల్ ఆడినమాట తప్పకుండా ఎన్నికలకు దూరంగా వున్నారు. అయితే సర్వేల స్పెషలిస్టుగా పేరున్న ఆయన సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రం విడిపోకుండా వుంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుశం, బీజేపీ కూటమి ప్రభుత్వం స్థాపించేదని చెప్పి సంచలనం సృష్టించారు. ఎలాంటి సర్వే అయినా ప్రకటించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధనలు వున్నప్పటికీ లగడపాటి సాహసంతో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం ఆయన మీద కేసు కూడా పెట్టింది. మొన్నామధ్య లగడపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాలలో కొనసాగే విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. లగడపాటి తీసుకునే ఆ కీలక నిర్ణయం ఏమిటబ్బా అని రాష్ట్ర రాజకీయ వర్గాలలో కలిగిన సందేహాలు శనివారం నాడు కొంతవరకు తీరాయి. లగడపాటి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈమధ్యే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో కలసిన గంటా శ్రీనివాసరావుని లగడపాటి విశాఖపట్నంలో కలిశారు. వీరిద్దరి మధ్య కొంతసేపు చర్చలు జరిగాయి. గంటా శ్రీనివాసరావు తనకు సన్నిహితుడు కాబట్టి కలవటానికి వచ్చానని లగడపాటి చెబుతున్నప్పటికీ, ఈ మీటింగ్ లగడపాటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి కర్టన్ రైజర్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అధిష్టానంతో దోస్తీ, టీ-కాంగ్రెస్ తో ఖతరా!

  నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టిపోసిన కేసీఆర్, ఇప్పుడు సోనియాగాంధీని మళ్ళీ దేవతని పొగుడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానిని చేసేందుకు యూపీఏకి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ అడగక ముందే ప్రకటించేశారు కూడా. అందుకు ప్రతిగా ఆయన రాష్ట్రంలో టీ-కాంగ్రెస్ మద్దతు అవలీలగా పొందవచ్చును. కానీ, ఆయన టీ-కాంగ్రెస్ మట్టికొట్టుకు పోతుందని శాపనార్ధాలు పెడుతున్నారు.   కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెపుతున్న కేసీఆర్, రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవులన్నీ తనకు, తన కుటుంబ సభ్యులకే దక్కించుకోవాలనే పదవీ కాంక్షే వలననే. టీ-కాంగ్రెస్ మద్దతు తీసుకొంటే వారికీ అధికారంలో భాగం పంచి, కీలక పదవులు ఈయవలసి ఉంటుంది. అదే వైకాపా, మజ్లిస్, సీపీయం, వంటి ఇతర పార్టీల నుండి మద్దతు తీసుకొంటే, వారికి ఏవో అప్రధాన్య పదవులు పడేసి, ముఖ్యమయిన పదవులన్నీ తామే స్వంతం చేసుకోవచ్చును.   కానీ, దేశముదురు టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కి అధికారం దక్కనిస్తారని నమ్మకం లేదు. చిరకాలంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నజానారెడ్డి, జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వంటి వారందరూ తమకు ఇప్పుడు ఆ అవకాశం దక్కకపోయినా, కనీసం అధికారం తమ పార్టీ చేజారకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలపై అవసరానికి మించి ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, టీ-కాంగ్రెస్ నేతలపై, ముఖ్యంగా పొన్నాలపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు.   కేసీఆర్ అధికారం దక్కించుకోకుండా అడ్డుకొనేందుకు టీ-కాంగ్రెస్-తెదేపాలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఆ భయంతోనే చంద్రబాబు, పొన్నాల, తదితరులపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. జగన్, అసదుద్దీన్, రాహుల్ గాంధీ వంటి వారివల్ల తనకు అవసరం ఉంది, పైగా వారి వల్ల తనకు ఎటువంటి సమస్య ఉండబోదు గనుకనే వారికి కేసీఆర్ బాకా ఊదుతున్నారు.

ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ సమాధి: అస్సాంలో దారుణం

  అస్సాంలో భారీగా కురుస్తున్న వర్షాలు ఒకే కుటుంబంలోని ఏడుగురిని సజీవ సమాధి చేశాయి. అస్సాంలోని గౌహతి సమీపంలోని సత్గరాకుల్ గ్రామంలో లుబెద్దీన్ అలీ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులతో ఒక పెద్ద పర్వతం పక్కనే చిన్న పాకలాంటిది కట్టుకుని నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భారీ వర్షాలకు కొండ మీద వున్న మట్టి కరిగి పెద్దపెద్ద రాళ్ళతో కలసి కిందకి జారి అలీ నివసిస్తున్న పాక మీద పడింది. దాంతో ఆ కుటుంబంలోని ఏడుగురూ అక్కడే సజీవ సమాధి అయిపోయారు.ఇలాంటి సంఘటనే వారం రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లోజరిగింది. కొండ చరియలు విరిగి పడటంతో ఒక గ్రామం గ్రామం సమాధి అయిపోయింది. 2100 మంది మరణించారు.

కేసీఆర్ ఆరాటమంతా జగన్ మద్దతు కోసమేనా?

  సాధారణంగా ఓటమి భయం ఉన్నవారే ‘తమ గెలుపు తధ్యం’ అని పదేపదే బిగ్గరగా చెప్పుకొంటారు. సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు ఆవిధంగా చెప్పుకోవడం లేదు. అంటే రెండు పార్టీలకు తమ గెలుపుపై పూర్తి భరోసా ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ, తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్, తెరాసలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని పోటీలు పడి మరీ చెప్పుకొంటున్నాయి. కేసీఆర్, పొన్నాల ఇరువురూ తామే అధికారంలోకి వస్తామని పైకి చెప్పుకొంటునప్పటికీ, ఇతర పార్టీల యం.యల్యే.లకు గాలం వేయడానికి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మురం చేసారు. తెరాసకు చెందిన 20మంది గెలుపు గుర్రాలు తనతో టచ్చులో ఉన్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రకటనే అందుకు ఒక ఉదాహరణ. ఆయన ఆవిధంగా ప్రయత్నించడాన్ని తప్పు పట్టిన కేసీఆర్ కూడా ఇతర పార్టీల యం.యల్యే.ల మద్దతు కూడ గట్టే పనిలో పడ్డారు.   బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ నిన్న జగన్మోహన్ రెడ్డికి కూడా బాకా ఊదినట్లున్నారు. జగన్ను ప్రసన్నం చేసుకోనేందుకే ఆయనకు బద్ద శత్రువయిన చంద్రబాబుకి శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తెలంగాణా నుండి బిచాణా ఎత్తివేసినప్పటికీ, తెలంగాణాలో సీమాంధ్ర ప్రజలు స్థిరపడిన ప్రాంతాలలో తెరాసకు గెలిచే అవకాశం ఉండబోదు గనుక అక్కడ తన పార్టీని పోటీలో దింపారు. కనుక తెలంగాణాలో కూడా వైకాపా కనీసం 4-6 యం.యల్యే. సీట్లు సాధించుకొనే అవకాశం ఉంది. బహుముఖ పోటీ కారణంగా తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ లకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అటువంటప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ప్రతీ ఒక్క యం.యల్యే. మద్దతు అమూల్యమే. అందుకే జగన్ కూడా అంటరాని వాడు కాదని కేసీఆర్ లౌక్యంగా మనసులో మాట బయట పెట్టారు. అంటే మిగిలిన తెలంగాణా పార్టీలతో బాటు తెలంగాణాను వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు చేసిన వైకాపా మద్దతు తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారని స్పష్టమవుతోంది. ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా కేసీఆర్ ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యేందుకు మళ్ళీ అదే సీమాంధ్ర నేత, పార్టీ మద్దతు ఆశించడం హాస్యాస్పదం.

పత్తిపాడు ఈవీఎంలు సేఫ్.. అభ్యర్థులు డోన్ట్ వర్రీ: కలెక్టర్

  తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిపోయాయని, కాకినాడ జేఎన్‌టీయులో స్ట్రాంగ్ రూమ్‌లో దాచిన ఈవీఎంలు లోపలకి నీరు ప్రవేశించడం వల్ల తడిచిపోయాయన్న వార్తలు రావడంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడిపోయారు. తమ జాతకాలన్నీ వున్న ఈవీఎంలు తడిచిపోతే తమ గతేంటి దేవుడా అని కంగారుపడిపోయి, ఈవీఎంల పరిస్థితి గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌ని సందర్శించిన తూ.గో. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వివరణ ఇచ్చారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని ఈవీఎంల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్, పత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంల కిందకి నీళ్ళు వచ్చాయని, అయితే ఈవీఎంలు ఎంతమాత్రం తడవలేదని స్పష్టం చేశారు. కాబట్టి కాకినాడ, పత్తిపాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులూ.. డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ..

కాంగ్రెస్ నాయకులది నీచబుద్ధి: వెంకయ్య నాయుడు

  కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నీచబుద్ధిని బయటపెట్టుకునే వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వారి రాజకీయాలు కూడా నీచంగా వున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ అమ్మ సోనియా గాంధీ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని, నరేంద్రమోడీ ప్రధాని అవుతున్నాడన్న బాధ వారి మాటల్లో కనిపిస్తోందని వెంకయ్య అన్నారు. భారతీయ జనతాపార్టీ నాయకుల మీద ముఖ్యంగా నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలు చేయడం మినహా కాంగ్రెస్ పార్టీకి మరో పని లేదని ఆయన దుయ్యబట్టారు. అమిత్ షా విషయంలో, స్నూప్ గేట్ వివాదంలో కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన విమర్శలు చేసి తమ చౌకబారు బుద్ధిని బయపెట్టు్కున్నారని, చివరికి నరేంద్రమోడీ కులం గురించి కూడా ప్రస్తావించిన కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పరాకాష్టకు చేరుకుందని వెంకయ్య నాయకుడు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని, భారతీయ జనతాపార్టీ మూడు వందలకు పైగా ఎంపీ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం తమకు వుందని ఆయన చెప్పారు.

శంషాబాద్‌లో మరో అరకిలో పట్టేసుకున్నారు

  శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిరోజూ కిలోలకు కిలోలు బంగారం ప్రయాణికుల నుంచి పట్టుకోవడం సాధారణమైపోయింది. ఇప్పుడు శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం దొరికితే న్యూస్ కాదు.. బంగారం దొరక్కపోతే న్యూస్‌లా పరిస్థితి తయారైంది ఈరకంగా కస్టమ్సోళ్ళు బంగారాన్ని లటుక్కుమని పట్టుసుకుంటున్నారని తెలిసినా బోలెడంత బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగేవాళ్ళని అమాయకులని అనుకోవాలా లేక తెగించినవాళ్ళని అనుకోవాలా? శనివారం నాడు ఎమిరిట్స్ నుంచి వచ్చిన ఒక విమానం నుంచి దిగిన ఒక మహిళ మీద కస్టమ్స్ వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆమెని ఆపి చెక్ చేయగా ఆమె దగ్గర అరకిలో బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

రహస్యంగా సీమాంధ్ర రాజధాని అన్వేషణలో శివరామకృష్ణన్ కమిటీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నగరాన్ని ఏ ప్రాంతంలో నిర్మించాలనే విషయం మీద పరిశీలన జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో వుంది. ఈ కమిటీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ, రాష్ట్ర అధికారులు సూచించిన ఇతర ప్రాంతాలలోనూ పర్యటించనుంది. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో తన పర్యటనను విశాఖపట్టణంతో ప్రారంభించింది. కమిటీకి తమ వాదనలు వినిపించడానికి అన్ని ప్రాంతాల నాయకులు విజ్ఞప్తులతో, వినతిపత్రాలతో సిద్ధంగా వున్నారు. కమిటీ మొదట వైజాగ్‌లో పర్యటిస్తుందన్న విషయం బయటకి తెలిసిపోయింది కాబట్టి తమను కలిసిన వారి విజ్ఞప్తులను కమిటీ స్వీకరిస్తుంది. అయితే ముందు ముందు ఇతర ప్రాంతాలలో కూడా ఇలాగే పలువురు తమను కలిసిన పక్షంలో తమ పర్యటన సక్రమంగా జరిగే అవకాశం లేదని శివరామక‌ృష్ణన్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ పర్యటనను పూర్తిగా రహస్యంగా నిర్వహించాలని భావిస్తున్నారు. తమ పర్యటన గురించి ఎంతమాత్రం పబ్లిసిటీ చేయకూడదని, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకూడదని కమిటీ పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.