జగన్ ప్రాదాన్యత దేనికో?

  జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవగానే ఐదు సంతకాలు చేస్తానని జనాలను ఒకటే ఊదరగొట్టారు. అంతేకాక ప్రజలకు చెప్పినవి, చెప్పనివి కూడా చాలా పనులు చేస్తానని ప్రకటించారు. బహుశః ప్రజలకు చెప్పని వాటిలో తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం కూడా ఒకటేమో! ఈ ఎన్నికలలో వైకాపా, గెలిచినా ఓడినా ఆయన తన తలపై కత్తిలా వ్రేలాడుతున్న సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేయించుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకే ఆయన మొదటి నుండి కూడా తనకు 30 యంపీ సీట్లు కావాలని ప్రజలను గట్టిగా కోరుతున్నారు. ఒకప్పుడు సమైక్య ఉద్యమాలు జోరుగా నడుస్తున్నవేళ తనకు 30 యంపీ సీట్లు ఇచ్చినట్లయితే, రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత జరిగే ఎన్నికలలో 30 సీట్లు వచ్చినా అదెలా సాధ్యమో ఆయన ఏనాడు వివరించలేదు. ఎవరూ ఆయనని అడగలేదు కూడా. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక, జగన్ తన 30 యంపీ సీట్ల పాట పల్లవి, స్వరం కూడా మార్చి, ఇప్పడు వాటిని కేంద్రానికి ఎరగా వేసి దాని మెడలు వంచి నిధులు తీసుకువస్తానని గర్జించారు. తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా పెట్టి, రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి పదవి, 30యంపీ సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ప్రజలు తనకి 30 యంపీ సీట్లు గనుక ఇచ్చినట్లయితే మళ్ళీ వాటిని పెట్టుబడిగా పెట్టి తన కేసుల నుండి విముక్తి పొందాలని ప్రయత్నిచడం తధ్యం. ఒకవేళ బీజేపీ/ఎన్డీయే కూటమి 272 యంపీ సీట్లు గెలుచుకోగలిగి, బయట పార్టీల మద్దతు ఆవసరం పడకపోయినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కోర్టు గడపలు ఎక్కక తప్పదు.

రాష్ట్రంలో రెండోదశ.. కేంద్రంలో 8వ దశ పోలింగ్ రేపే..

  సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు సహా దేశవ్యాప్తంగా 64 లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సీమాంధ్ర (25), ఉత్తరప్రదేశ్ (15), బీహార్ (7), హిమాచల్ ప్రదేశ్ (4), జమ్ము కాశ్మీర్ (2), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బెంగాల్ (6)లలో బుధవారం 8వ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్థానాల్లో సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇప్పటి వరకు 7 దశల్లో 438 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సుమారు 66.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొమ్మిదవ, చివరిదశ పోలింగ్ ఈనెల 12న జరుగుతుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది.మే 16వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.

టీఆర్ఎస్ చీలికవర్గం నాయకుడెవరు?

  ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్‌ని నిట్టనిలువుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చాలామంది టీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వస్తుందని, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో హంగ్ రాబోతోందని , కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం వుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంపాదించడానికి టీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రజా ప్రతినిధుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం వుంది. ఇప్పుడీ మంత్రాన్ని ఈ ఎన్నికలలో ఎన్నికవబోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రయోగించడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. టీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు వుండాలి. ఆ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయాలి. అప్పుడే టీఆర్ఎస్‌ని చీల్చడానికి వీలవుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీని చీల్చడానికి ఉపయోగపడే నాయకుడిగా కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో పెరుగుతున్నాయి. టీఆర్ఎస్‌లో ఎప్పటికైనా కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దేనని హరీష్ రావుకి స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్‌లో వుండగా తాను తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది ఊహల్లో తప్ప వాస్తవంలో అసాధ్యమని కూడా తెలుసు. గతంలో ఓసారి పార్టీలో కేటీఆర్‌తో వున్న విభేదాలకు చిరాకెత్తిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి, ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం

  థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ నగరంలో ఈ భూకంప కేంద్రం వుంది. నగరంలో విమానాశ్రయం ఎక్కడ వుందో అక్కడే భూకంప కేంద్రం వుండటం విశేషం. భూకంపం సంభవించగానే విమానాశ్రయంలో వున్నవారిని వెంటనే అక్కడి నుంచి బయటకి పంపేశారు. ఎయిర్పోర్టులో భూకంపం వల్ల చాలా విధ్వంసం జరిగింది. రన్వేకు మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లలేదు. విమాన సర్వీసులకు ఆటంకం కలగలేదు. అలాగే పాన్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు నిలువునా చీలిపోయాయి. కిటికీలు బద్దలయ్యాయి. గోడలు కూలిపోయాయి. బౌద్ధారామాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

సబ్బం హరి నిష్క్రమణతో మారనున్న బలాబలాలు

  జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న సబ్బం హరి, ఎన్నికలకి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నఈ తరుణంలో పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా ఎన్నికలబరి నుండి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వైజాగ్ నగరానికి మేయర్ గా కూడా పనిచేసారు. కానీ కొన్ని కారణాల వలన ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరింపబడ్డారు. సాధారణంగా అంతకాలం పార్టీకి దూరమయిన వారు మళ్ళీ పార్టీలోకి వచ్చే ఆలోచన చేయరు. వచ్చినా వారికి ఎటువంటి ప్రాధాన్యము ఉండదు. కానీ, సబ్బం హరి మాత్రం గత ఎన్నికలలో అనకాపల్లి యంపీ టికెట్ సాధించుకోవడమే కాకుండా అక్కడి నుండి గెలిచి మళ్ళీ తన రాజకీయ జీవితాన్ని గాడిన పెట్టుకోగలిగారు. జగన్ పార్టీ పెట్టిననాటి నుండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలలో తాను వైకాపా టికెట్ పైనే పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ లో ఉండగానే ప్రకటించారు.   జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత , ఇక వైకాపా తీర్ధం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్దమయిన తరువాత తనింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సంగతి మరిచిపోయి, తను అప్పుడే వైకాపాసభ్యుడు అయిపోయినట్లు భావిస్తూ ‘మా పార్టీ (వైకాపా) ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీయే కూటమికే మద్దతు ఇస్తుంది” అని ఆయన ప్రకటించేశారు.   ఆ సమయంలో, “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో ఆవిధంగా రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నందునే బెయిలు మీద బయటకు రాగలిగారని” తెదేపా నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ యంపీగా ఉన్న సబ్బం హరి ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ప్రకటన చేయడంతో తీవ్ర ఆగ్రహం చెందిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీలో ప్రవేశించక మునుపే ఆయన మొహం మీదనే తలుపులు మూసి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసారు.   అ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని వైజాగ్ నుండి విజయమ్మపై పోటీకి దిగిన సబ్బం హరి, ఇప్పుడు తాను గెలిచే అవకాశాలు కనిపించకపోవడంతో, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి విరమించుకొన్నారు. స్థానికుడయిన సబ్బం హరికి వైజాగ్ లో మంచి బలం, పలుకుబడి, అన్ని పార్టీల నేతలతో, కార్యకర్తలతో సత్సంబందాలు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీ, తెదేపా అభ్యర్ధులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి, తన అభిమానులను కూడా వారికే ఓటు వేయమని అభ్యర్ధిస్తున్నారు. తత్ఫలితంగా విజయమ్మ విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ ప్రభావం అసెంబ్లీ అభ్యర్దులపైనా పడవచ్చును. ఏమయినప్పటికీ ఇది కిరణ్, జగన్ రెడ్డిలు ఇద్దరికీ ఇబ్బందికరమేనని చెప్పవచ్చును.

అపాయింటెడ్ డేపై కేంద్రానికి చెప్పుకోండి: హైకోర్టు

  ఎన్నికల ప్రక్రియ ముగియడానికి, అపాయింటెడ్ డేకి మధ్య 17 రోజుల వ్యవధి వుండటం టీఆర్ఎస్‌కి చెమటలు పట్టిస్తోంది. ఈ పదహేడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు ప్రయోగించి టీఆర్ఎస్‌లో చీలిక తెచ్చే ప్రమాదం వుందని భయపడుతోంది. తద్వారా తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం వుందని భావిస్తోంది. అందుకోసమే అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 16వ తేదీకి మార్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు పరిశీలించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ హైకోర్టు ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే వుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాశం వుందని వాపోయింది. అయితే హైకోర్టు మాత్రంఈ అంశాన్ని కేంద్రం దృష్టికే తీసుకెళ్ళాలని, అభ్యంతరాలుంటే కేంద్రానికే చెప్పుకోవాలని పిటిషన్ వేసిన టీఆర్ఎస్‌కి సూచించింది. దాంతో ఇప్పుడీ అంశం కేంద్రం మీద ఆధారపడింది. కేంద్రంలో వున్న కాంగ్రెస్ ఆపాయింటెడ్ డేని పొరపాటుగా కూడా మార్చదని అందరికీ తెలిసిన విషయమే.

ప్రచారం కోసం అతి తెలివి ప్రదర్శన

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అతి తెలివితేటల్ని చాలా తెలివిగా ప్రదర్శిస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసినా ఇంకా కక్కూర్తితో ప్రచారం చేయాలని ప్రయత్నిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీతో సరిపోదన్నట్టు ఏకంగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలోనే ప్రచారం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచీ వైకాపా గుర్తు అయిన ఫ్యాన్ ముద్రించి వున్న కప్పులతో టీ పంపిణీ జరుగుతోంది. పోలింగ్ కేంద్రం సమీపంలోనే వున్న ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటిన్ నుంచి ఈ టీ కప్పులు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కప్పుల మీద ఫ్యాన్ గుర్తు వుంటే, మరికొన్ని కప్పుల మీద వైకాపా తరఫున ఎస్.కోట, బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలు ముద్రించి వున్నాయి. వైకాపా చేస్తున్న ఈ చీప్ ట్రిక్స్ ని చూసి పోలింగ్ సిబ్బంది నోరు తెరిచారు.

విశాఖ బరి నుంచి తప్పుకున్న సబ్బం హరి

  విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలో వున్న సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను పోటీలో వుంటే ఓట్లు చీలుతాయని, తద్వారా జగన్ పార్టీ అభ్యర్థి విజయమ్మ గెలిచే అవకాశం వుంది కాబట్టి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇక రాష్ట్ర విభజన తప్పదని స్పష్టమైపోయిందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాల్సిన అవసరం, పార్లమెంటుకు జగన్ పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా చేయాల్సిన అవసరం వుందని సబ్బం హరి అన్నారు. అందుకే విశాఖలో విజయమ్మ గెలవకుండా వుండటం కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన చెప్పారు. విజయమ్మకు విశాఖ పార్లమెంటు సీటు ఇవ్వడం వెనుక వున్న అసలు రహస్యం తనకు తెలుసని సబ్బం హరి అన్నారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వస్తే అరాచకం ప్రబలుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ నుంచి విశాఖని, రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీదా వుందని చెప్పారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని సబ్బం హరి చెప్పారు.

సబ్బం హరి కూడా జంప్

  జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి మొన్నటి నుండి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ ఆయనతో సహా మరో 24మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మొన్న తిరస్కరించింది. ఆ తరువాత నిన్న గుంటూరు జిల్లాలో జైసపా అభ్యర్ధులు నలుగురు పోటీ నుండి తప్పుకోవడమే కాకుండా రాయపాటి సమక్షంలో తెదేపాలో చేరిపోయారు. ఈరోజు ఆ పార్టీ టికెట్ పై వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న సబ్బం హరి కూడా పార్టీకి రాజీనామా చేసి,బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.   ఈసందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే అన్నివిధాల అభివృద్ధి చెందిన విశాఖ నేటికీ ఒక ప్రశాంత నగరంగా ఉంది. కానీ, వైకాపా అభ్యర్ధి విజయమ్మ గనుక ఇక్కడి నుండి గెలిచినట్లయితే, ఇక విశాఖలో కూడా అరాచక శక్తులు తిష్టవేసి నగరాన్ని అల్లకల్లోలం చేసే ప్రమాదం ఉంది. అందుకే నేను వైజాగ్ నుండి పోటీలోకి దిగాను. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నా మూలంగా ఓట్లు చీలి వైకాపా అభ్యర్ధి విజయమ్మకు లబ్ది కలగకూడదనే ఆలోచనతోనే నేను పోటీ నుండి తప్పుకొంటున్నాను. నా నిర్ణయం కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి ఆగ్రహం తెప్పించవచ్చును. కానీ, నా జిల్లా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

సహారా అధిపతీ.. నీకు చిప్పే గతీ..

  లక్షలాది కోట్ల జనం సొమ్ము గుటకాయస్వాహా చేసిన సహారా అధిపతి సుబ్రతోరాయ్ జైల్లోంచి బయటకి రావడానికి నానా తంటాలు పడుతున్నా వర్కవుట్ కావడం లేదు. పాపం సుబ్రతోరాయ్‌కి జగన్ తరహాలో కాంగ్రెస్ పార్టీ అండ లేదేమో! లేటెస్ట్ గాసుబ్రతో రాయ్ తనకు బెయిల్ ఇస్తే 10 వేల కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. అయినా సరే సుప్రీం కోర్టు నీకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని సుబ్రతోరాయ్‌కి స్పష్టం చేసింది. అంతేకాకుండా సుబ్రతోరాయ్ ‘కాలిక్యులేటెడ్‌గా మైండ్ గేమ్ ఆడటం మానుకుంటే మంచిదని హెచ్చరించింది. అంతేకాకుండా సుబ్రతో రాయ్ నిజంగా బెయిల్ కావాలని కోరుకుంటే సహేతుకమైన కారణాలతో కోర్టు ముందుకు రావాలని తేల్చి చెప్పింది. సహారా సంస్థ ముసుగులో ఎన్నో స్కీములు పెట్టి జనం దగ్గరి నుంచి లక్షలాది కోట్లు వసూలు చేసిన సుబ్రతోరాయ్ ఆ స్కీములను తర్వాతి కాలంలో స్కాములుగా మార్చి, జనం చెవుల్లో పూలు పెట్టిన సంగతి తెలిసిందే.

ముందే కూస్తానంటున్న టీఆర్ఎస్ కోయిల

  రాష్ట్ర విభజన మీద స్టే ఇవ్వాలని సీమాంధ్రులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం నాడు విచారణకు వచ్చాయి. సుప్రీం కోర్టు ఈ కేసులను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈలోగా జూన్ 2న వున్న రాష్ట్రాల విభజన అపాయింటెడ్ డేట్‌ని మార్చాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇదిలా వుంటే, మరోవైపు టీఆర్ఎస్ నాయకులు అపాయింటెడ్ డేట్‌ని జూన్ 2 నాడు కాకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసే మర్నాటికి అంటే, మే 16వ తేదీకే మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు సోమవారం నాడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం నాడు రమ్మని కోర్టు ఆదేశించింది. మంగళవారం నాడు టీఆర్ఎస్ నేతలు హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ మంగళవారమే జరుగనుంది. అపాయింటెడ్ డేట్‌ను హై కోర్టు జూన్ 2వ తేదీగానే వుంచుతుందా లేక మే 16వ తేదీకి మారుస్తుందా అనేది చూడాలి.

సీమాంధ్ర రాజధానిగా నెల్లూరు: సింహపురి సింహం చిరంజీవి

  సీమాంధ్రకు నెల్లూరును రాజధానిగా చేస్తానని మాజీ మెగాస్టార్, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ప్రకటించారు. రాష్ట్ర విభజనని ఆపడం ఆయన చేతుల్లో లేకుండా పోయిందగానీ, రాజధానిని నిర్ణయించడం మాత్రం తన చేతుల్లో వున్నట్టు ఆయన మాట్లాడారు. గతంలో ‘సింహపురి సింహం’ అనే ఫ్లాప్ సినిమాలో నటించిన ఆయన ఇప్పుడు సింహపురిని రాజధానిని చేస్తానని ఫ్లాప్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డికి ఎన్నికల ప్రచారం చేయడం కోసం నెల్లూరు జిల్లాకి వచ్చిన చిరంజీవి సోమవారం నాడు తన మనసుకు తోచిన వాగ్దానాలు చేసేశారు. అందులో నెల్లూరును సీమాంధ్ర రాజధానిగా చేస్తాననే ప్రకటన ఒకటి. నెల్లూరును సీమాంధ్ర రాజధానిగా చేస్తానని చిరంజీవి ప్రకటించడం పట్ల ఆ ప్రాంతంలోనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నెల్లూరును ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేయాలన్న డిమాండ్ నెల్లూరు జిల్లాలోనే వినిపించడం లేదు. అలాంటిది చిరంజీవికి నెల్లూరు మీద ఎందుకు ఇంత అతి ప్రేమ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రమంత్రి పళ్ళంరాజుపై ఇ.సి. నిషేధం?

  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పళ్ళంరాజు మీద ఎన్నికల సంఘం నిషేధం విధించాలని కాంగ్రెసేతర పార్టీలు కోరుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన పళ్లంరాజును ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అయితే మంగళవారం నాడు పళ్ళంరాజు కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారని, తనకు ఓటేయాలని రోగులు, వైద్యులు, సిబ్బందిని అడిగారని కాంగ్రెసేతర రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలలో పళ్ళంరాజు ఓటమి ఖాయమైందని, అందుకే దింపుడుకళ్ళం ఆశతో ప్రచారం గడువు ముగిసినా ప్రచారం చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. ఇ.సి. ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి, పళ్ళంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారని నిర్ధారణ అయినట్టయితే ఆయన ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం చేతిలో రాష్ట్ర భవిష్యత్

  ఇంతకు ముందు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాని చేతిలోనే రాష్ట్ర భవిష్యత్ ఉండేది. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కంటే కేంద్రం చేతిలోనే ఎక్కువగా ఉండబోతోంది. వివిధ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం వంటి భారీ వ్యయమయ్యే పనులకు నిధుల కోసం కేంద్రం మీద ఎలాగూ ఆధారపడక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన్నని ఆదాయవనరులు లేకపోవడంతో రాష్ట్ర కనీసావసరాలయిన ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు, సంక్షేమ కార్యక్రమాలు అమలు, ఇత్యాది అవసరాలకు కేంద్రప్రభుత్వం విదిలించే నిధులపైనే ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ఆర్ధిక స్థితిని గాడిన పెట్టేవరకు, పరిస్థితి క్లిష్టంగానే ఉండవచ్చును. ఒకవేళ ఏ కారణం చేతయినా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినట్లయితే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఒకవేళ తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే నదీజలాలతో సహా అనేక విషయాలలో వారితో సమస్యలు ఉత్పన్నం కావచ్చును. వాటి పరిష్కారానికి కేంద్రప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందువల్ల ఈ సారి ఎన్నికలలో సీమాంద్రాకు పూర్తి సహకారం అందించే పార్టీనే కేంద్రంలో కూడా ఎన్నుకోవలసి ఉంటుంది.

ఎన్నికలకు సీమాంద్ర సర్వం సిద్దం

  సీమాంద్రాలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి లోక్ సభకు 333మంది, అసెంబ్లీకి 2241 అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో 3,67,62,975 మంది ఓటర్లు ఈ అభ్యర్ధుల భవితవ్యం తేల్చనున్నారు. రేపు జరుగబోయే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ చాలా విస్త్రుత ఏర్పాట్లే చేసింది. 13 జిల్లాల్లో మొత్తం 40,708 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 13వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దాదాపు లక్షా ఇరవవేల మంది పోలీసులతో కనీ వినీ ఎరుగని రీతిలో చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా 84 హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 2 హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను నక్సల్ ప్రభావిత ప్రాంతమయిన పాడేరు ప్రాంతానికి కేటాయించారు. అదేవిధంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా దాదాపు 60 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలయిన తెదేపా, వైకాపాలకు చాలా కీలకమయినవి గనుక ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల నడుమ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండవచ్చనే ఆలోచనతోనే ఇంత భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వస్తోంది.   ఇక రాష్ట్ర విభజన తరువాత ఒక సంధికాలంలో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరికి విజయం దక్కుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇంత మంది పోటీ చేయాలనుకోవడం విశేషమే. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రానట్లయితే, అప్పుడు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన గెలిచినవారే కింగ్ మేకర్స్ అవుతారు. బహుశః అందుకే ఈ సారి ఇంతమంది బరిలో దిగి ఉండవచ్చును. అయితే ఈసారి ఇంతగా పోరాటం చేసిన తరువాత ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన దానికి పెనుసవాళ్లు ఎదుర్కోక తప్పదు. ఆరు నూరయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదు.

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది

      సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కి రెండు రోజుల ముందు ప్రచారాన్ని ఆపే సంప్రదాయం ప్రకారం సోమవారం నాలుగు గంటలకు పది అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగిసింది. సాయంత్రం ఆరుగంటలకు మిగతా 165 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్రలో ఈనెల ఏడో తేదీన 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 274 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది పోలీసులు కూడా శాంతిభద్రతలను కాపాడతారని ఆయన చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ఆదుకోవడానికి మూడు వేల అదనపు ఈవీఎంలను కూడా సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కి పిచ్చి ముదిరిందట!

      పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లాడు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు.. జగన్ పార్టీలో వున్న మహిళా తిట్ల స్పెషలిస్టు వాసిరెడ్డి పద్మ. పాపం ఈమె చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. ఏ పార్టీలో వున్నా ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టడంలో బోలెడంత అంకితభావం చూపిస్తూ వుంటారు.   తాజాగా పవన్ కళ్యాన్ జగన్‌ని విమర్శలతో తూట్లు పొడుస్తున్నారు. అయితే జగన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఏమీ అనడం లేదు. పవన్ కళ్యాణ్‌ది తన స్థాయి కాదని అనుకున్నాడేమోనని, తన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే బాధ్యతలు అప్పగించారు. దాంతో పద్మగారు పవన్ కళ్యాణ్‌ని తిట్టడం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ లైమ్ లైట్‌లోకి వచ్చిన పద్మ మేడమ్ ఇప్పుడు జగన్ పార్టీలోకి మారడం వల్ల పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు.  రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటి లాగానే చంద్రబాబుని తిట్టడంతోపాటు పనిలోపనిగా పవన్ కళ్యాణ్‌ని కూడా తిట్టిపోశారు. పవన్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లవాడని ధ్వజమెత్తారు. పవన్ తన తప్పుడు మాటలకు అర్జెంటుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.