ఇ.సి. నన్ను మాత్రమే టార్గెట్ చేసింది: లగడపాటి

      ఎన్నికల కమిషన్ తనను మాత్రమే టార్గెట్ చేసి నోటీసులు జారీ చేసిందని, తనలాంటి కామెంట్లు చేసిన ఇతరుల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని లగడపాటి రాజగోపాల్ వాపోతున్నారు. సీమాంధ్ర ఎన్నికల ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశం వుందని చెప్పారు.   ఆయన అవకాశం వుందని చెప్పారే తప్ప సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వంటి వివరాలేవీ వెల్లడించలేదు. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లగడపాటి మీద కేసు నమోదు చేసింది. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇలాంటి తరహా వ్యాఖ్యానాలు చేసిన వైసీపీ నాయకుల మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేయలేదని ఆయన అంటున్నారు. కేసులు నమోదు చేస్తే అందరిమీదా నమోదు చేయాలని లేకపోతే తనమీద నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ తనమీద కేసు నమోదు చేసినప్పటికీ లగడపాటి రాజీపడలేదు. సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని స్పష్టంగా చెప్పారు. మరి ఎన్నికల కమిషన్ దీన్ని కూడా సీరియస్‌గా తీసుకుని ఆయన మీద మరో కేసు నమోదు చేస్తుందేమో చూడాలి.

సీమాంధ్రలో 120 నుంచి 140 సీట్లు ఖాయం: చంద్రబాబు

      సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెరిగిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పోలింగ్ పూర్తవగానే టీడీపీ విజయం ఖాయమని సగర్వంగా ప్రకటించిన ఆయన, గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో తమ పార్టీ 120 నుంచి 140 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. అలాగే 20నుంచి 22 పార్లమెంటు సీట్లు తెలుగుదేశం ఖాతాలో పడబోతున్నాయని చెప్పారు.   ఈ పోలింగ్‌లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని, వైకాపా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. బీజేపీకి ఓటు వేశానని బయటకి చెప్పినందుకే తన ఓటు చెల్లదని చెప్పిన ఎన్నికల కమిషన్‌కి జగన్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు వినిపించలేదా అని  ప్రశ్నించారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు.

సింగపూర్‌కు బాబు, డెహ్రాడున్‌కి జగన్ ల ఫ్యామిలీ

      ఎన్నికల సందర్భంగా వాళ్ళనీ వీళ్ళని తిట్టి, వాళ్ళచేత వీళ్ళచేత తిట్టించుకున్న రాజకీయ నాయకులు ఎన్నికలు ముగిశాక మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం విహార యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ముగియగానే కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారు. హరీష్‌రావు, కేటీఆర్, కవిత తమతమ కుటుంబ సభ్యులతో ఎవరికి నచ్చిన దేశానికి వాళ్ళు సైట్ సీయింగ్‌కి వెళ్ళిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో చాలామంది ఇప్పుడు పలు దేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయారు. సీమాంధ్రలో ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్రకు వెళ్ళబోతున్నారు. చంద్రబాబు నాయుడు సింగపూర్‌కి వెళ్ళే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.   సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానని చెబుతున్న చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా సింగపూర్‌‌లో ఏవైనా అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలుసుకుని వస్తారేమో చూడాలి. అలాగే వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటుంబ సభ్యులతో డెహ్రాడూన్ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బోలెడన్ని కేసులున్న జగన్ సారు డెహ్రాడూన్ వెళ్ళడానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. విహారయాత్రలకు వెళ్ళిన అందరూ కౌంటింగ్ నాటికి తిరిగి వచ్చే అవకాశం వుంది. అప్పటి వరకు ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా వుండొచ్చు.  

వారణాసిలో వేడివేడి నమో రోటీ

      మొన్నటి వరకూ నరేంద్రమోడీ స్పెషల్ చాయ్‌ అమ్మకాలు దేశవ్యప్తంగా జరిగాయి. ఆ తర్వాత నమో జ్యూస్ షాపులు దేశమంతటా వెలిశాయి. వీటికి ప్రజల నుంచి విశేష ఆదరణ అభిస్తోంది. ఇప్పుడు వారణాసిలో నమో రోటీ దుకాణాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి పార్లమెంట్‌‌కి పోటీ చేస్తుండటంతో ఆయనకు అక్కడి ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకోవాలని కొందరు దాభా యజమానులు భావించారు. అంతే వారణాసి ఏరియాలోని దాభాల్లో ‘నమో’ బ్రాండ్ రోటీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రోటీలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా అభిస్తోందట. ఈ నమో రోటీల మీద ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ (ఈసారి ప్రభుత్వం నరేంద్రమోడీదే) అనే మాటను ముద్రించి విక్రయిస్తున్నారు. నమో రోటీల ఆవిర్భావంతో గతంలో కంటే రోటీల వ్యాపారం బాగా పెరిగిందని, రోటీలతోపాటు కర్రీల వ్యాపారం కూడా బాగా పుంజుకుందని వారణాసి ప్రాంతంలోని దాభాల యజమానులు మురిసిపోతూ చెబుతున్నారు. అయితే ఈ రోటీల అమ్మకాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు.

సీమాంధ్రలో పోలింగ్ శాతం.. గతంతో పోలిస్తే ఎక్కువే

        బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్‌లో దాదాపు 80 శాతం ఓట్ల పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రకటించారు. బుధవారం ఎనిమిది గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ జరిగిందని, అప్పటికి కూడా పోలింగ్ జరుగుతూ వున్నందున కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. మొత్తమ్మీద 2009 సంవత్సరం ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలవారిగా 2009, 2014 సంవత్సరాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా వున్నాయి.   శ్రీకాకుళం - 76% (2014) - 75% (2009) విజయనగరం - 78% (2014) - 76% (2009) విశాఖపట్నం - 73% (2014) - 73% (2009) తూర్పు గోదావరి - 78% (2014) - 78% (2009) పశ్చిమ గోదావరి - 78%  (2014) - 84% (2009) కృష్ణ - 81% (2014) - 80% (2009) గుంటూరు - 84% (2014) - 79% (2009) ప్రకాశం - 80% (2014) - 77% (2009) నెల్లూరు - 73% (2014) - 71% (2009) కడప - 75 %(2014) - 75% (2009) కర్నూలు - 76% (2014) - 70% (2009) అనంతపురం - 80% (2014) - 73% (2009) చిత్తూరు -  80% (2014) - 77% (2009)

కొనసాగుతున్న జగన్ పార్టీ దౌర్జన్యకాండ

      సీమాంధ్రలో ఎన్నికలు ముగిసినా వైకాపా దౌర్జన్యకాండ కొనసాగుతూనే వుంది. ఈ ఎన్నికలలో ఓడిపోతానని భయం పట్టుకున్న జగన్ .. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. కానీ అవన్ని అంతగా ఫలించకపోవడంతో టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసినా వైకాపా పార్టీ వారు టీడీపీ వర్గీయులపై దాడులను మాత్రం ఆపలేదు. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం ఏరుకోలులో టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వీరిని చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఎస్సై సహా పలువురు గ్రామస్థులకు గాయాలయ్యాయి.      ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం సూరావారిపల్లెలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ వర్గాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నాయి. వెంటనే వారిని చిలకలూరుపేట ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు.

చంద్రబాబు, జగన్ ఇంటర్వ్యూలు

  పోలింగు ముగిసిన తరువాత చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడారు. ఇరువురూ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఇరువురూ కూడా ప్రజల తీర్పు ఏకపక్షంగా తమ పార్టీకే అనుకూలంగా రాబోతోందని అన్నారు. ఈ ఎన్నికలలో ఓటింగు శాతం పెరిగినట్లయితే, తమ ఓడిపోయే ప్రమాదం ఉందనే భయంతో తమ ప్రత్యర్ద పార్టీ ప్రజలు ఓట్లు వేయకుండా చేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే పోలింగు స్టేషన్ల వద్ద భయానక వాతావరణం కల్పించాయని ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకొన్నారు.   జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధికి పూర్తిగా సహకరించే కూటమికే మా పార్టీ మద్దతు ఇస్తుంది. చంద్రబాబు కేంద్రం ముందు సాగిలపడి సహాయ, సహకారాలు అర్దిస్థానని చెపుతున్నారు. కానీ నేను మాత్రం కేంద్రం మెడలు వంచి మనకి రావలసిన నిధులు సాధిస్తానని చెపుతున్నాను. ప్రజా తీర్పు ఏకపక్షంగా రాబోతోంది గనుక, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొనే ఏ కూటమి అయినా మన మద్దతు కోసం దిగిరావలసిందే. అందువల్ల మనం కోరుకొన్నవిధంగా పనులు చేసిపెట్టే పార్టీకే మద్దతు ఇస్తాము. ఈవిషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.   చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ “ఈసారి జరిగిన ఎన్నికలు కొన్ని ప్రధాన అంశాలపైనే జరిగాయి. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం అనే మూడు ప్రధాన అంశాలపైనే ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చును. కనుక ప్రజాతీర్పు కూడా ఏకపక్షంగా తేదేపాకు అనుకూలంగా రాబోతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిలలో ఒక బయానక వాతావరణం సృష్టించి, ఓటింగు శాతం తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 80శాతం పోలింగు జరిగింది. దీనివలన తెదేపా గెలుపు ఖాయమయింది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా వివిధ సమయాలలో, వివిధ రకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేపని చేసారు. ఇటువంటి విపరీత పోకడలకు పోయినవారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. వారందరూ చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం తధ్యం. అది త్వరలోనే తెలుస్తుంది,” అని అన్నారు.

ప్రజాసేవ చేయడానికి ఇంత దౌర్జన్యం అవసరమా?

  ఈసారి ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల నకిలీ మద్యం, నకిలీ కరెన్సీ పంపకాలు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాలలో ఇతర జిల్లాల నుండి వచ్చిన రౌడీ మూకలు ప్రజలను, ప్రత్యర్ధులను, చివరికి పోలీసులను, మీడియాను, పోలింగు అధికారులను కూడా భయబ్రాంతులను చేసారు. పోలింగు మొదలయ్యే వరకు ప్రలోభాల పర్వం సాగించిన సదరు పార్టీ, పోలింగు మొదలయినప్పటి నుండి పూర్తయిన తరువాత కూడా చాలా దౌర్జన్యంగా వ్యవహరించింది. కొన్ని చోట్ల ప్రత్యర్ధ అభ్యర్ధులను నిర్బంధించడం, కొట్టడంతో ప్రత్యర్ధులు కూడా జరిగిన సంఘటనలు ప్రజలే చూసారు. అనేక చోట్ల రెండు ప్రధాన పార్టీల అనుచరుల మధ్య ఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు, లాటీ చార్జీ చేయవలసి వచ్చింది. ఇంతకు ముందు ఎన్నికలలో ఇటువంటి చెదురు ముదురు సంఘటనలు జరిగినప్పటికీ, ఇంతగా దౌర్జన్యకాండ ప్రజలెన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేసేందుకే అయితే ఇంత దౌర్జన్యం, గొడవలు అవసరం లేదు. కానీ, వివిధ ప్రాంతాలలో నిన్న జరిగిన సంఘటనలు చూసినపుడు, అది ప్రజాసేవ కోసమేనని ఎవరూ భావించలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి ఎన్నికలలో పోరాడటం చూసాము. కానీ వ్యక్తులు తమను కమ్ముకొన్న సమస్యల నుండి బయటపడేందుకు ఎన్నికలలో పోటీ చేయడం ఇదే ప్రధమం. ఏమయినప్పటికీ ప్రజలు తమ తీర్పు చెప్పేశారు. ఇక ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అధికారంలోకి రాబోయే పార్టీని బట్టే రాష్ట్ర ప్రజల భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది.

సీమాంధ్రలో పోలింగ్ పూర్తి

    సీమాంధ్ర ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. సీమాంధ్రలోని 2 నియోజకవర్గాలలో 4 గంటలకు పోలింగ్ ముగియగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు 5 గంటలకు ముగిసింది. మిగిలిన 165 నియోజకవర్గాలకు సాయత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన ఆరుగంటల తర్వాత కూడా సీమాంధ్రలోని దాదాపు అన్ని పోలింగ్ బూత్‌లలో వందలాది మంది ఓటర్లు క్యూలో వున్నారు. క్యూలో నిల్చున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకూ పోలింగ్ కొనసాగుతుంది.   సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అన్ని అవాంఛనీయ సంఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణం కావడం విశేషం. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు విధ్వంసకాండ సృష్టించారు. జగన్ పోటీ చేసిన పులివెందులలో అయితే మరీ రెచ్చిపోయారు. పోలింగ్ రోజున కూడా ప్రలోభాల పరంపరని కొనసాగించారు. తెలుగుదేశం నాయకుల మీద దాడులు జరిపారు. అనేక చోట్ల రాళ్ళ వర్షం కురిపించారు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బంది మీద, మరికొన్ని చోట్ల ఓటర్లమీద కూడా దాడులు జరిపారు. చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టారు.   విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ఒక పోలింగ్ కేంద్రం మీద దాడి చేసి రెండు ఈవీఎంలను ఎత్తుకెళ్ళారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎండ బాగా వున్నప్పటికీ క్యూలలో వున్న ఓటర్ల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు. గుంటూరు, కృష్ణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసినప్పటికీ ఓటర్ల సంఖ్య తగ్గలేదు. సాయంత్రం చల్లబడిన తర్వాత క్యూలలో నిల్చున్న ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది.   ఈ ఎన్నికలలో 80 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వుందన్న అభిప్రాయాలను పోలింగ్ ప్రారంభ సమయంలోనే అధికారులు వ్యక్తం చేశారు. వారు ఊహించినట్టుగానే దాదాపు 80 శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నదనేదానికి సూచిక అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి ఘాతుకం

      తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి క్షమించరాని నేరం చేశారు. తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. తిరుపతిలో ఒకరికొకరు ఎదురుపడిన కరుణాకర్ రెడ్డి, వెంకట రమణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వుండగానే కరుణాకర్ రెడ్డి వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. దాంతో ఇద్దరికి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సర్దుమణిగేలా చేశారు. కరుణాకర్ రెడ్డి, వెంకట రమణను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తమ పార్టీ అభ్యర్థి వెంకట రమణ మీద వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డి చెయ్యి చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. కరుణాకర్ రెడ్డి ఓడిపోతున్నారన్న బాధతోనే ఇలా ప్రవర్తించారని అన్నారు. కరుణాకర్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బస్సు లోయలో పడి 17 మంది మృతి

      హిమాచల్ప్రదేశ్ సిమౌర్ జిల్లాలోని మైలా గ్రామంలో బస్సు లోయలో పడటంతో 17 మంది ప్రయాణికులు మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది.

భార్యతో కలసి ఓటేసిన భారతీయ తొలి ఓటర్

      భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పోలింగ్‌లో తొలిసారి ఓటు వేసిన వ్యక్తిగా తన పేరు నమోదు చేసుకున్న శ్యామ్ శరణ్ నేత తాజా ఎన్నికల సందర్భంగా కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. శ్యామ్ శరణ్ నేగి హిమాచల్ ప్రదేశంలో ఒక మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1952లో ఓటింగ్ జరిగే సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో మంచు బాగా పేరుకుని వుంటుంది. కాబట్టి అక్కడ మాత్రం 1951 అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు తొలి ఓటరుగా నేగి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేగి ఎంతో ఉత్సాహంతా ఓటు వేస్తూనే వస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆయన తన భార్య హీరాతో కలసి ఓటు వేశారు. 97 ఏళ్ళ వయసున్న తాను ఇప్పటికీ ఉత్సాహంగా ఓటు హక్కుని వినియోగించుకుంటూ వుంటానని, మరి మన దేశంలో కొంతమంది యువత ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎందుకు బద్ధకంగా వ్యవహిస్తారో తనకు అర్థం కాని విషయమని ఆయన వాపోతూ వుంటారు.

మునిగిన ఓడలో 30 కిలోల బంగారం దొరికింది

      ఒక ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడ నుంచి 300 కిలోల బంగారం బయటకి తీసుకొచ్చారు. అయితే ఇందులో వెరైటీ ఏమిటంటే, సదరు ఓడ మునిగిపోయి ఇప్పటికి 157 సంవత్సరాలు. 1857 సంవత్సరంలో దక్షిణ కెరోలినా ప్రాంతంలోని సముద్రంలో అమెరికాకి చెందిన ఎస్.ఎస్. సెంట్రల్ అనే పేరున్న ఒక పెద్ద స్టీమర్ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 425 మంది చనిపోయారు. ఈ ఓడలోనే అమెరికాలోని కేలిఫోర్నియా నుంచి తెప్పిస్తున్న 300 కిలోల బంగారం వుండిపోయింది. ఇంతకాలం ఆ ఓడను చేరుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ బంగారం బయటకి రాలేదు. ఈమధ్యకాలంలోనే సదరు ఓడలోని బంగారాన్ని బయటకి తీసుకువచ్చారట.

ఓటర్లని రాళ్ళతో కొట్టారు

      మే, 7, 2014వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వీరబాదుడు దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటికి కనిపించినవాళ్ళందర్నీ బాదిపారేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా అనేకమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసిన వైపీసీ కార్యకర్తలు వాళ్ళని తలలు పగిలి రక్తం పారేట్టుగా కొట్టారు. అలాగే కొన్నిచోట్ల పోలీసులను కొట్టారు. మరికొన్ని చోట్ల మీడియా ప్రతినిధులను కొట్టారు. ఇంకొన్నిచోట్ల పోలింగ్ సిబ్బందిని బాదారు. ఇంతమందిని బాదాం.. ఇక ఓటర్లని మాత్రం వదలటం ఎందుకని అనుకన్నారేమోగానీ, ప్రకాశం జిల్లాలో బొల్లాపల్లిలో ఓటర్లను కూడా రాళ్ళతో కొట్టారు. వైసీపీ కార్యకర్తలు విసిరిన రాళ్ళు తగిలి అనేకమంది ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి కళ్ళ దగ్గర రాళ్ళు తగిలాయి.

తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని భార్యనే కాల్చేశాడు

      ఎన్నికల వేళ ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ వుంటాయి. అలాంటి విచిత్రం బీహార్‌లో జరిగింది. ఒక ప్రబుద్ధుడు తాను ఇష్టపడే పార్టీకి తన భార్య ఓటు వేయకపోయేసరికి ఆగ్రహం ఆపుకోలేకపోయాడు. నాటు తుపాకితో ఆమెని కాల్చిపారేశాడు. బీహార్‌లోని ఉజియార్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని మొయినుద్దీన్ నగర్‌లో వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి ఒక పార్టీని ఎంతో ఇష్టపడతాడు. ఆ పార్టీకి కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. బుధవారం నాడు వినోద్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్‌కి వెళ్ళి వచ్చిన అతని భార్య తాను కార్యకర్తగా వున్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేసినట్టు చెప్పింది. అంతే ఉదయ్ పాశ్వాన్‌కి బీపీ పెరిగిపోయింది. తన దగ్గరే వున్న నాటు తుపాకితో భార్యని కాల్చేశాడు. ఆ తర్వాత బీపీ డౌన్ అయ్యాక తాను చేసిన తప్పు తెలుసుకుని పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కథలో సుఖాంతం ఏమిటంటే, తుపాకీ కాల్పుకు గురైన వినోద్ పాశ్వాన్ భార్య ప్రాణాలతో బయటపడింది.

సీమాంధ్రలో 3గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

      ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. మరోవైపు విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం, పలకజీడిలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది మావోయిస్టులు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.   జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు : 1. శ్రీకాకుళం : 63శాతం 2. విజయనగరం : 65 శాతం 3. విశాఖపట్నం : 55 శాతం 4.తూగో : 63 శాతం 5. పగో : 67 శాతం 6. కృష్ణా : 62 శాతం 7. గుంటూరు : 67శాతం 8.ప్రకాశం : 62 శాతం 9. నెల్లూరు :63 శాతం 10. కడప : 65 శాతం 11. కర్నూలు : 63 శాతం 12. అనంతపురం : 66 శాతం 13.  చిత్తూరు : 61 శాతం

పులివెందులలో రీ పోలింగ్ తప్పదా?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్‌ల దగ్గర వైసీపీ కార్యకర్తలు సృష్టించిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అనేక పోలింగ్ కేంద్రాల్లో వున్న ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను తన్ని బయటకి తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు.   పులివెందులలో వైసీపీ భారీగా ఎన్నికల అక్రమాలకు పాల్పడే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానిక నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది. అయితే పోలింగ్ రోజున పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ చేసిన ఎన్నికల అక్రమాలను నిరోధించడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఎన్నిరకాలుగా నిబంధనలను అతిక్రమించవచ్చో అన్ని రకాలుగా తమ ప్రతిభ చూపించారు. అయితే పులివెందులలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. వైపీసీ నాయకుల అక్రమాలకు తగిన శాస్తిని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. పులివెందుల నియోజకవర్గంలోని సగానికి పైగా కేంద్రాలలలో రీ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీచేసే విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, పాపం వైసీపీ కార్యకర్తలు కష్టపడి చేసిన రిగ్గింగ్ వృధా అయిపోయే అవకాశం వుంది.