ఓటర్లని రాళ్ళతో కొట్టారు

      మే, 7, 2014వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వీరబాదుడు దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటికి కనిపించినవాళ్ళందర్నీ బాదిపారేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా అనేకమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసిన వైపీసీ కార్యకర్తలు వాళ్ళని తలలు పగిలి రక్తం పారేట్టుగా కొట్టారు. అలాగే కొన్నిచోట్ల పోలీసులను కొట్టారు. మరికొన్ని చోట్ల మీడియా ప్రతినిధులను కొట్టారు. ఇంకొన్నిచోట్ల పోలింగ్ సిబ్బందిని బాదారు. ఇంతమందిని బాదాం.. ఇక ఓటర్లని మాత్రం వదలటం ఎందుకని అనుకన్నారేమోగానీ, ప్రకాశం జిల్లాలో బొల్లాపల్లిలో ఓటర్లను కూడా రాళ్ళతో కొట్టారు. వైసీపీ కార్యకర్తలు విసిరిన రాళ్ళు తగిలి అనేకమంది ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి కళ్ళ దగ్గర రాళ్ళు తగిలాయి.

తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని భార్యనే కాల్చేశాడు

      ఎన్నికల వేళ ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ వుంటాయి. అలాంటి విచిత్రం బీహార్‌లో జరిగింది. ఒక ప్రబుద్ధుడు తాను ఇష్టపడే పార్టీకి తన భార్య ఓటు వేయకపోయేసరికి ఆగ్రహం ఆపుకోలేకపోయాడు. నాటు తుపాకితో ఆమెని కాల్చిపారేశాడు. బీహార్‌లోని ఉజియార్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని మొయినుద్దీన్ నగర్‌లో వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి ఒక పార్టీని ఎంతో ఇష్టపడతాడు. ఆ పార్టీకి కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. బుధవారం నాడు వినోద్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్‌కి వెళ్ళి వచ్చిన అతని భార్య తాను కార్యకర్తగా వున్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేసినట్టు చెప్పింది. అంతే ఉదయ్ పాశ్వాన్‌కి బీపీ పెరిగిపోయింది. తన దగ్గరే వున్న నాటు తుపాకితో భార్యని కాల్చేశాడు. ఆ తర్వాత బీపీ డౌన్ అయ్యాక తాను చేసిన తప్పు తెలుసుకుని పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కథలో సుఖాంతం ఏమిటంటే, తుపాకీ కాల్పుకు గురైన వినోద్ పాశ్వాన్ భార్య ప్రాణాలతో బయటపడింది.

సీమాంధ్రలో 3గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

      ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. మరోవైపు విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం, పలకజీడిలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది మావోయిస్టులు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.   జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు : 1. శ్రీకాకుళం : 63శాతం 2. విజయనగరం : 65 శాతం 3. విశాఖపట్నం : 55 శాతం 4.తూగో : 63 శాతం 5. పగో : 67 శాతం 6. కృష్ణా : 62 శాతం 7. గుంటూరు : 67శాతం 8.ప్రకాశం : 62 శాతం 9. నెల్లూరు :63 శాతం 10. కడప : 65 శాతం 11. కర్నూలు : 63 శాతం 12. అనంతపురం : 66 శాతం 13.  చిత్తూరు : 61 శాతం

పులివెందులలో రీ పోలింగ్ తప్పదా?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్‌ల దగ్గర వైసీపీ కార్యకర్తలు సృష్టించిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అనేక పోలింగ్ కేంద్రాల్లో వున్న ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను తన్ని బయటకి తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు.   పులివెందులలో వైసీపీ భారీగా ఎన్నికల అక్రమాలకు పాల్పడే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానిక నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది. అయితే పోలింగ్ రోజున పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ చేసిన ఎన్నికల అక్రమాలను నిరోధించడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఎన్నిరకాలుగా నిబంధనలను అతిక్రమించవచ్చో అన్ని రకాలుగా తమ ప్రతిభ చూపించారు. అయితే పులివెందులలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. వైపీసీ నాయకుల అక్రమాలకు తగిన శాస్తిని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. పులివెందుల నియోజకవర్గంలోని సగానికి పైగా కేంద్రాలలలో రీ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీచేసే విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, పాపం వైసీపీ కార్యకర్తలు కష్టపడి చేసిన రిగ్గింగ్ వృధా అయిపోయే అవకాశం వుంది.  

రాయపాటిపై జగన్ పార్టీ కార్యకర్తల దాడి

      ఓటమి భయం పట్టుకున్న వైసీపీ నాయకులు సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడులు ముమ్మరం చేశారు. అవకాశం దొరికితేచాలు తెలుగుదేశం వారిమీద దాడి చేశారు. ఈ దాడుల మీద సీమాంధ్రలో దాదాపు రెండు వందలకు పైగా కేసులు వైసీపీ నాయకుల మీద నమోదయ్యాయి. వైసీపీ నాయకులు ఎన్నికల సిబ్బంది మీద కూడా దాడిచేసిన ఘనతను తమ ఖాతాలో జమచేసుకున్నారు. ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో వున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు మీద నరసరావుపేటలో దాడి చేశారు. దాదాపు పదిమంది వైకాపా కార్యకర్తలు రాయపాటి కారు మీద రాళ్ళతో దాడి చేశారు. వీళ్ళు రాయపాటి కారును ధ్వంసం చేశారు. సమయానికి తెలుగుదేశం కార్యకర్తలు రాయపాటిని కాపాడారు. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన సమయంలో అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే రాయపాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక అమేథిని వదిలి వెళ్ళాలి: ఎన్నికల అధికారి

      ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ జరుగుతోంది. నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ స్థానికురాలు కాదు కాబట్టి పోలింగ్ రోజున అమేథీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే రూల్స్ ని అతిక్రమించడం కాంగ్రెస్ పద్ధతి కాబట్టి ప్రియాంక అమేథీని విడిచిపెట్టకుండా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు స్పందించారు. రాహుల్ గాంధీ తరపున ప్రచారం నిర్వహించిన ఆయన సోదరి ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతి సహాయ్ను అమేథీ వదిలి వెళ్లాలని జిల్లా రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. దాంతో వీరిద్దరూ అమేథీని వదిలి వెళ్ళక తప్పలేదు. ఇదిలా వుంటే కాంగ్రెస్ అభ్యర్థి కాగా, రాహుల్ గాంధీ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

లగడపాటి కొత్త కోరిక

      విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న లగడపాటి రాజగోపాల్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి ఆ మాట ప్రకారం ఎన్నికలలో నిలబడలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి శాయశక్తులా కృషి చేసిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ చేతిలో తాను మోసపోవడంతోపాటు, ఆయన్ని నమ్మిన తెలుగు ప్రజలు కూడా మోసపోయేలా చేశారు. మొన్నీమధ్యే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం హవా ఖాయమని చెప్పారు. అంతా బాగుందిగానీ, ఓటు వేసిన తర్వాత లగడపాటి వ్యక్తం చేసిన కోరిక మాత్రం విచిత్రంగా వుంది. ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగునాడు’ అని మార్చాలట. అలా మారిస్తే తాను చాలా హ్యాపీగా ఫీలవుతాడట. యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడంతో తీరిగ్గా వున్న లగడపాటికి ఇలాంటి కొత్తకొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయన్నమాట. అయ్యా లగడపాటీ, ఇప్పుడు సీమాంధ్రులకు కావలసింది రాష్ట్రం పేరు మార్పు కాదు.. మీ కాంగ్రెస్ పార్టీ కారణంగా దారుణంగా మోసపోయిన వారికి ఊరట. అలా ఊరట రావాలంటే రాష్ట్రం పేరు మార్చితే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని సమర్థంగా చేయాల్సి వుంటుంది.

పోలింగ్‌లో అడ్రస్ లేని కాంగ్రెస్

      సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. వైకాపా ఓటర్లను ప్రలోభపరచడానికి ఎన్ని తంత్రాలు, కుతంత్రాలు ప్రయోగించినా ఓటర్ల నాడి తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా వున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండటం చూసి తట్టుకోలేని వైకాపా శ్రేణులు సీమాంధ్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నాయి. చివరకి ఎన్నిక సిబ్బంది మీద కూడా దాటి చేయడానికి వైకాపా వర్గాలు సాహసించాయి. ఇదిలా వుంటే ఒకవైపు తెలుగుదేశం హవా వీస్తుంటే, మరోవైపు వైకాపా అరాచకత్వం పోలింగ్ సందర్భంగా కనిపిస్తోంది. ఈ రెండిటి మధ్య కాంగ్రెస్ ఊసు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్న ఓటర్లు కనిపించడం లేదు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

నరేంద్రమోడీ ర్యాలీలో ప్రమాదం

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు యువతులు కూడా వున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్‌లోని సలీంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మోడీ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ర్యాలీని ఉద్దేశించి అనౌన్స్ మెంట్లు చేసేందుకు నిర్మించిన ఒక వేదిక మీదకి జనం భారీగా ఎక్కడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.

సీమాంధ్రలో 1గంట వరకు పోలింగ్ శాతం వివరాలు

      ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 1-30 గంటలకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. రొంపిచర్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ పరస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు : 1. శ్రీకాకుళం : 57 శాతం 2. విజయనగరం : 54 శాతం 3. విశాఖపట్నం : 56 శాతం 4.తూగో : 59 శాతం 5. పగో : 56 శాతం 6. కృష్ణా : 58 శాతం 7. గుంటూరు : 56 శాతం 8.ప్రకాశం : 59 శాతం 9. నెల్లూరు : 57 శాతం 10. కడప : 59 శాతం 11. కర్నూలు : 58 శాతం 12. అనంతపురం : 60 శాతం 13.  చిత్తూరు : 56 శాతం

కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఎలక్షన్ సందేశం

      కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన తన మాతృమూర్తి, కొడుకు విష్ణుతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సినీ నటుడు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.   వైఎస్సార్ కుటుంబంతో వియ్యం అందుకున్న ఆయనకి చంద్రబాబుతో కూడా వ్యక్తిగత విభేదాలున్నాయి. అందుకే జగన్, చంద్రబాబు పేర్లు చెప్పకుండా ‘యువత’ అనే మాట వాడి జగన్‌కే ఓటు వేయండని చెప్పకనే చెప్పారు.  యువత చేతిలోనే  భవిష్యత్తు ఉందని... అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అంతులేకుండా పోయిందన్నారు. ఇదంతా ప్రజల సొమ్మే అని చెప్పారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి ప్రజలకే పంచుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు చేసే వాగ్ధానాలు హద్దు మీరాయని, అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మోహన్‌బాబు చెబుతున్నప్పుడు ఆయన జగన్‌కి అనుకూలంగా, జగన్ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నట్టు అర్థమైపోయింది. కొత్త రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటర్లంతా ఆత్మవంచన చేసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు.  

మరో ప్రాణాన్ని తీసిన జగన్ పార్టీ మద్యం

      జగన్ పార్టీ పంచుతున్న మద్యం ఓటర్ల ప్రాణాలు తీస్తోంది. సీమాంధ్రలో నిన్నటి వరకు వైకాపా పంచిన మద్యం కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ రోజున కూడా ఒక ఓటరు మీద వైకాపా మద్యం కాటు పడింది. అనంతపురం జిల్లా నల్లచెరువు గ్రామంలో వైకాపా కార్యకర్తలు పంచిన మద్యం తాగి ఒక ఓటరు మరణించాడు. మరో నలుగుర్ల తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. ఓటర్లకి మద్యం తాగించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నించిన వైకాపా కార్యకర్తలు ఒకరు మరణించడం, నలుగురు అస్వస్థతకి గురి కావడంతో అదిరిపోయి అక్కడి నుంచి పారిపోయారు. పోలింగ్ రోజున వైకాపా మద్యం భారీ స్థాయిలో పంచడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. అయితే వైకాపా మద్యాన్ని అడ్డుకోవడంతో ఎన్నికల కమిషన్ విఫలం కావడంతో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది.

వైకాపా గురునాథరెడ్డి భార్య ఓటు గల్లంతు.. ఎట్టకేలకు ఓటు!

      ఎన్నికలలో ఓట్లు గల్లంతు కావడం మామూలే. సాధారణ ఓటర్ల ఓట్లు గల్లంతు అయితే పెద్దగా పట్టించుకునేవారు వుండరు. ప్రముఖుల ఓట్లు గల్లంతు అయితేనే అవి వార్తల్లోకి వస్తూ వుంటాయి. గతవారం హైదరాబాద్‌లో బ్రహ్మానందం ఓటు గల్లంతయితే అందరూ అయ్యోపాపం అనకపోగా, బ్రహ్మానందం కమెడియన్ కదా.. అందుకే నవ్వేశారు. ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఓట్ల గల్లంతు వార్తలు బోలెడన్ని వెలుగులోకి వస్తున్నాయి.   అనంతపురం అర్బన్ నియోజకవర్గం జగన్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి భార్య  కేఎస్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేయడానికి వెళ్లారు. అందరితోపాటు వరుసలో నిలబడి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు ఎవరో వేసేసినట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారు.  దాంతో గురునాథరెడ్డి అధికారులతో  వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. తరువాత అధికారులు వచ్చి ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము వెళ్లేసరికే తన భార్య  ఓటును ఎవరో వేసేశారని చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి తన భార్యకు  ఓటు వేసే అవకాశం కల్పించినట్టు  తెలిపారు.

సీమాంధ్రలో గెలుపుపై జగన్ ధీమా

      పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో భాకరాపురం ప్రాంతంలో వున్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో వున్న పోలింగ్ సిబ్బందికి వంగి వంగి దణ్ణాలు పెట్టారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో తమ పార్టీ గెలుస్తుందన్న ధీమాని వ్యక్తం చేవారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... ఈ వ్యవహారంపై తొందరపడబోమన్నారు. తనకు అన్నింటికన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.

సీమాంధ్రలో పోలింగ్: వైకాపా దౌర్జన్యకాండ

      సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. పలువురు నేతలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడి, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.   1. జమ్మలమడుగు మండలం గొడెగనూరులో టీడీపీ అభ్యర్థి రామాసుబ్బారెడ్డిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల పరిశీలకులు,మీడియా సిబ్బంది పైనా వైసీపీ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2. చాపాడు మండలం నక్కలదిన్కెలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్‌పై దాడి చేసి, వాహనం ధ్వంసం చేశారు. 3. చాపాడు మండలం విదునూరులో స్వతంత్ర అభ్యర్థి పుత్తా సుధాకర్‌యాదవ్ వాహనంపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. 4. మైదుకూరు మండలం ఎన్..ఎర్రపల్లెలో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి కారుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. 5. బి.మఠం మండలం కొత్తపల్లెలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో సుధాకర్‌యాదవ్ కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. 6. బి.మఠం మండలం చెంచయ్యగారిపల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.  

రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు

      వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకి భవిష్యత్తులో రెచ్చిపోయే అవకాశాలు కనిపిచండం లేదు కాబట్టి ఈ ఎన్నికలలో రెచ్చిపోతున్నారు. సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. శాంపిల్‌గా కడప జిల్లాని తీసుకుంటే వైకాపా కార్యకర్తలు వీరంగం ‌సృష్టిస్తునారు. చాలా పోలింగ్ బూత్‌‌ల్ని ఆక్రమించి రిగ్గింగ్ చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లను చాలాచోట్ల బయటకి తరిమికొట్టారు. కొన్నిచోట్ల క్యూలలో నిల్చున్న ఓటర్లని, ఓటు వేయబోతున్న ఓటర్లని కూడా ప్రభావితం చేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరగడానికి కారణమయ్యారు. వైకాపా కార్యకర్తలు కొన్నిచోట్ల మీడియావాళ్ళని చావబాదారు. ఒకచోట అయితే ఎన్నికల అధికారినే కొట్టారు. పోలింగ్ రోజున కూడా డబ్బు, మద్యం పంపిణీని యథేచ్ఛగా చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులు ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసుకుని వారిమీద దాడులు చేస్తు్న్నారు. ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ మొదలైన రెండు మూడు గంటల్లోనే వైకాపా శ్రేణులు ఇన్ని లీలలు ప్రదర్శించాయి. పోలింగ్ ముగిసే వరకూ ఇంకెన్ని లీలలు చూసి తరిస్తామో ఏంటో..

అధికారాంతంలో సోనియా, మన్మోహన్!

      సోనియాగాంధీ అధికారం ముగుస్తోంది. దీనితోపాటు యుపిఏ ప్రభుత్వం అధికారం కూడా ముగిసిపోనుంది. పదేళ్ళపాటు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోవడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి వుంది. ఇప్పుడు అధికారాంతంలో వున్న సోనియా, మన్మోహన్ మంగళవారం నాడు చిట్టచివరి అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. ఏర్పాటైన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సోనియా, మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వీరిద్దరికీ ఇది చివరి అధికారిక సమావేశం. ఈ సందర్భంగా సోనియా, మన్మోహన్ మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం సహకారం కారణంగానే జాతీయ సలహామండలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగిందని తమని తాను పొగుడుకున్నారు.