జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్: సీమాంధ్రలో టీడీపీ ముందంజ
posted on May 13, 2014 @ 10:50AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరగడం వల్ల కౌంటింగ్ సాధారణ వేగంతో జరుగుతోంది. చాలాచోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరడం, బ్యాలెట్లకు చెదలు పట్టడం లాంటి సంఘటనలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం 11 గంటల వరకు జరిగిన కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ తన హవాని కొనసాగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికలలో తన సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ల మద్దతు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ స్థానాన్ని, 108 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 74 జడ్పీటీసీ స్థానాలను పొందింది. కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. వామపక్షాలు నాలుగు ఎంపీటీసీలు, ఇతరులు 74 ఎంపీటీసీలు పొందారు. పరిషత్ ఎన్నికలలో కూడా మునిసిపల్ తరహా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.