సచిన్ గౌరవార్థం బ్రిటన్‌లో బంగారు నాణెం!

      క్రికెట్ దిగ్గజం సచిన్ ఆ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ, గౌరవిస్తూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన, అమూల్యమైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. ఈ నాణెం విలువ 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ వుంటుంది. ఈ నాణానికి పూర్తి చట్టబద్ధత వుంటుందని ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిపింది. క్రికెటర్‌గా 24 ఏళ్ళపాటు అత్యత్తమ సేవలు అందించినందుకు, ఆయన్ని గౌరవిస్తూ అరుదైన నాణాన్ని విడుదల చేశామని ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిపింది. 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామని ఆ సంస్థ తెలిపింది. ఈ నాణాన్ని అందమైన బాక్సులో అమర్చి విక్రయిస్తారు. ఈ నాణాన్ని కొనుగోలు చేసిన వారికి అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ని కూడా అందిస్తున్నారు. తన పేరిట ఈస్ట్ ఇండియా కంపెనీ నాణాన్ని విడుదల చేయడం క్రికెట్‌కి తాను చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సచిన్ టెండూల్కర్ అన్నారు.

తెలుగు ఇంజనీర్ అసోంలో సేఫ్!

  అసోంలో బోడో తీవ్రవాదుల చేత కిడ్నాప్‌కి గురైన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇంజనీర్ నాగ మల్లేశ్వరరావును అధికారులు రక్షించారు. ఈనెల 17న నాగ మల్లేశ్వరరావును బోడో తీవ్రవాదులు అపహరించారు. నాగ మల్లేశ్వరరావును విడుదల చేయాలంటే 6 కోట్లు ఇవ్వాలని తీవ్రవాదులు డిమాండ్ చేశారు. నాగ మల్లేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి. నాగ మల్లేశ్వరావును తీవ్రవాదుల నుంచి రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. తెలుగు ఇంజనీర్‌ని కాపాడాల్సిందిగా అసోం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఎట్టకేలకు తీవ్రవాదులు నాగ మల్లేశ్వరరావును విడుదల చేసినట్టు తెలుస్తోంది.

జగన్ మాట్లాడుతుండగానే సభ వాయిదా!

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ వుండగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను రేపటికి వాయిదా వేయడం అన్యాయమని వైసీపీ సభ్యులు విమర్శిస్తున్నారు. మామూలుగా సాధారణంగా సభను వాయిదా వేయదలచినప్పుడు ఆ విషయం ముందుగా ప్రసంగం చేస్తున్న సభ్యుడికి చెబుతారు. ప్రసంగాని త్వరగా ముగించాలని కోరతారు. కానీ, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని, కోడెల కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని, సభా సంప్రదాయలకు విరుద్దంగా వ్యవహరించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్‌రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి విమర్శించారు. సభలో జగన్ మాట్లాడుతూ వుంటే అధికార పార్టీ సభ్యులు పదేపదే అడ్డు తగిలారని, కనీసం మంగళవారం నాడు అయినా జగన్‌ని వివరంగా మాట్లాడనివ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబుపై జగన్ సరికొత్త ఆరోపణ

      వైఎస్ఆర్.కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన సరికొత్త ఆరోపణ చేశారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ..ప్రస్తుత చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఓఎంసీ అధినేత జనార్దన్‌రెడ్డితో చంద్రబాబుకు సింగపూర్ లో మీటింగ్ ఏర్పాటు చేశారని ఆపించారు. ఈ విషయంపై ఆధారాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాస్‌పోర్టు పరిశీలిస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణపై కాల్వ శ్రీనివాసులు సమాధానం ఇస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సలహాపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎప్పుడూ సింగపూర్ వెళ్లలేదని.. తనపై చేసిన ఆరోపణను జగన్ నిరూపించాలని సవాల్ చేశారు.

జగన్ కి దూళిపాళ్ళ సవాల్

      దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారంటూ వైకాపా అధినేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేసిన దానిపై టిడిపి నేత దూళిపాళ్ళ స్పందిస్తూ... గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అక్రమ భూకేటాయింపులపై విచారణ జరపాల్సిందే అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. అవసరానికి మించి వైఎస్ ప్రభుత్వం భూములు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వ అక్రమాల వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. తన ఆరోపణలు తప్పని నిరూపణ అయితే రాజీనామాకు సిద్ధమని ధూళ్లిపాళ్ల సవాల్ విసిరారు. అక్రమ భూకేటాయింపుల వల్ల ఎవరు లబ్ది పొందారో ఏ మీడియా సంస్థలోకి నిధులు మళ్లాయో విచారణ జరగాలన్నారు. బయ్యారం గనుల కేటాయింపులో అక్రమాలు, రక్షణ స్టీల్స్ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాని ఆయన పేర్కొన్నారు. చట్టాలు సవరించైనా దోపిడీ సొమ్మును రికవరీ చేయాలని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

రిటైర్మెంట్ వయసు 60కి పెంపు బిల్లు ఆమోదం

  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కానుక ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచింది. ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద తెలిపింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు-2014కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఈ నెల నుంచే పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం రోజున సంతకాలు చేసిన ఐదు ఫైళ్ళలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఫైలు కూడా వుంది. పదవీ విరమణ వయసును రెండేళ్ళపాటు పెంచడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎపీ అసెంబ్లీ: ధూళిపాళ్ల vs జగన్

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేటాయించిన భూములపై ఆయన ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. బ్రాహ్మణి భూ కేటాయింపుల, ఓబులాపురం గనుల అక్రమాలపై ఆయన పలుమార్లు ప్రశ్నించడంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సభలో లేని వ్యక్తులపై ఆరోపణలు చేయరాదని నిబంధన ఉన్నప్పట్టి టిడిపి నేతలు ఎలా ఆరోపణలు చేస్తారని జగన్ ప్రశ్నించారు. దీనికి టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర బదులిస్తూ.. తాను ఎవరి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయలేదని..గత ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను మాత్రమే ప్రస్తావిస్తూనని తెలిపారు.

స్విస్ బ్యాంక్ అకౌంట్ల లిస్టు రెడీ అవుతోంది

      భారత ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు మొదట ఇచ్చిన హామీ, స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఇండియాకి తెప్పించి ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. దానికి అనుగుణంగా కార్యాచరణ మొదలైంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో వున్న అకౌంట్లలో ఇండియన్ల అకౌంట్లకి సంబంధించిన లిస్టును అక్కడి బ్యాంకులు రెడీ చేస్తున్నాయి. ఇండియాలో పన్నులు ఎగవేయడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును స్విస్ బ్యాంకులో దాచారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో స్విస్ బ్యాంకులు తమ దగ్గర వున్న ఇండియన్స్ అకౌంట్ల జాబితాని తయారు చేస్తున్నాయి. తమ దగ్గర వున్న అకౌంట్లలో ఏ అకౌంట్‌ని ఎవరు ఓపెన్ చేశారు, ఏ అకౌంట్లో ఎంత డబ్బుంది లాంటి వివరాలన్నీ త్వరలో భారత ప్రభుత్వానికి అందనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను స్విస్ అధికారులు ఈ అంశం మీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో కలిసి పనిచేస్తామని, సిట్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్విస్ బ్యాంకుల్లో వున్న విదేశీ నిధుల్లో భారత్ 58వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం 1.6 ట్రిలియన్ డాలర్ల మేర పేరుకున్న విదేశీ నిధులు వున్నాయి. ఇందులో భారత్ వాటా 0.15 శాతం (రూ. 14 వేల కోట్లు) మాత్రమేనని చెబుతున్నారు.

రుణమాఫీపై రంగంలోకి చంద్రబాబు

      ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పథకం అమలును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకులు వ్యతరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి. రుణమాఫీ పథకం అమలుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐదు మార్గాలను ఆలోచించినట్లు తెలుస్తోంది. 1. రీషెడ్యూలు, మారటోరియానికి ఆర్టీఐని ఒప్పించడం. 2.బాండ్ల జారీకి ఆర్టీఐ, కేంద్రం అనుమతి తీసుకోవడం. 3. ఎఫ్ఆర్‌బీఎం చట్టం నుంచి మినహాయింపు కోరడం తద్వార కొత్త అప్పులు తెచ్చి పథకాన్ని అమలు చేయడం. 4. సగం రుణం తక్షణ చెల్లింపు..మిగిలిన సగానికి బాండ్లు. 5. రైతులకే బాండ్లు జారీ..ఐదేళ్లలో తిరిగి చెల్లింపు. ఈ మేరకు ఆర్బీఐ అనుమతి తీసుకునేందుకు ఈనెల 25న కోటయ్య కమిటీ ముంబై వెళ్లబోతోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 26న ఢిల్లీ వెళుతున్న బాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతోనూ రుణ మాఫీపై చర్చించనున్నారు.

రైల్వే చార్జీల పెంపు సమర్ధనీయమేనా?

      కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైల్వే చార్జీల పెంపు తప్పదని అందరికీ తెలుసు. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవక మునుపే ఒకేసారి సామాన్య ప్రజలపై ఇంత భారం మోపడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ ఈవిధంగా ప్రజాగ్రహానికి గురికావాలని కోరుకోదు. అందువల్ల ఇటువంటి కటినమయిన నిర్ణయాలను కొన్ని నెలల తరువాత అమలు చేయడం మొదలుపెడుతుంది. కానీ, దేశాన్ని వీలయినంత త్వరగా అభివృద్ధి బాట పట్టించాలని తహతహలాడుతున్న నరేంద్ర మోడీ, సమయం వృధా చేయకుండా అధికారం చేప్పట్టిన కొద్ది రోజులకే చాలా దైర్యంగా రైల్వే చార్జీల పెంపు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ భారం సామాన్య ప్రజల మీదనే ఎక్కువగా పడింది గనుక ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేఖిస్తున్నారు. ప్రజలు రైల్వే చార్జీల పెంపుని తప్పుపట్టడం లేదు. సమాజంలో సంపన్నులకు, సామాన్యులకు ఒకటే బెత్తం ఉపయోగించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అందువల్ల మోడీ ప్రభుత్వం ఇకపై సమాజంలో ధనిక, పేద, మధ్యతరగతి వర్గాలను ఒకేగాట కట్టకుండా తదనుగుణంగా వడ్డిస్తే ఇంత వ్యతిరేఖత ఎదురవక పోవచ్చును. మోడీ ప్రధానిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలని తహతహలాడుతున్నారు. ఆయన చాలా వేగంగా దృడమయిన నిర్ణయాలు తీసుకొంటున్న సంగతి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.ఈ  రైల్వేల చార్జీల పెంపు కూడా అభివృద్ధి కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టిన తరువాత ఎవరూ అడగక మునుపే మన రాష్ట్రంలో వైజాగ్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సమాచారం సేకరించేందుకు అధికారులను పంపిచారు. అదేవిధంగా దేశంలో రైల్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, దేశంలో బుల్లెట్ రైళ్ళు లేదా సూపర్ ఫాస్ట్ రైళ్ళను ప్రవేశపెట్టాలని, దేశంలో రైల్వే లైన్లను మరింత విస్తరించాలని మోడీ భావిస్తున్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం 24X7గంటలు నిరంతర విద్యుత్ సరఫరా పధకానికి శ్రీకారం చుట్టి దానికి పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఎంపిక చేసింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కావాలి. ప్రస్తుతం రైల్వేలు నష్టాలలో లేకపోయినప్పటికీ, వచ్చిన లాభాలు వ్యవస్థను యధాతధంగా నడిపిందుకు మాత్రమే సరిపోతోందని నిపుణుల మాట. రైల్వే చార్జీలను పెంచకుండా యధాతధంగా ఉంచినట్లయితే ఈ అభివృద్ధి కార్యక్రామాలకు నిధులు వేరే మార్గాల ద్వారా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అంటే ప్రజలనుండి వేరే రూపంలో ఆ డబ్బులు వసూలు చేయవలసి ఉంటుందన్న మాట. కానీ నరేంద్ర మోడీ ఆ డొంక తిరుగుడు వ్యవహారం చేయకుండా నేరుగా రైల్వే చార్జీలను పెంచి రైల్వేశాఖకు ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేసారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియకుండా వారినుండి ఏదో రూపంలో నొప్పి తెలియకుండా పన్నులు పిండుకొంటూనే ఉంది. గానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం రానున్న ఐదేళ్ళ కాలంలో దేశం రూపురేఖలను పూర్తిగా మార్చివేసి, భారత్ ను అభివృద్ధికి చిరునామాగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఒకవేళ మోడీ మాటలకు, చేతలకు పొంతన కనబడకపోతే, వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి కూడా ప్రజల చేతిలో పరాభవం తప్పదు. కానీ మోడీ అటువంటి పరిస్థితి చేజేతులా కల్పించుకొంటారని భావించలేము. కనుకనే మోడీ అధికారం చేప్పట్టిన నెలరోజులయినా గడవక మునుపే కటినమయిన నిర్ణయాలు తీసుకొంటున్నారని భావించవచ్చును. కానీ దేశాభివృద్ధి కోసం సంపన్నులను వదిలిపెట్టి సామాన్యులపైనే భారం మోపకుండా అడుగులు ముందుకు వేస్తే దేశాప్రజలందరూ ఆయన వెంట నడుస్తారు. 

రైల్వే చార్జీల పెంపు చాలా దైర్యమైన నిర్ణయం: కిరణ్ బేడి

  అత్యంత ప్రజాధారణతో, భారీ మెజార్టీతో అధికారం చేప్పట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశాప్రజలలో చాలా భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చాలా చురుకుగా తీసుకొంటున్న నిర్ణయాల పట్ల దేశాప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మోడీ ప్రభుత్వం రైల్వే చార్జీలను 14.2శాతం పెంచి ప్రజలందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. దానితో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇక మోడీ దూకుడు చూసి ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తికమకపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఆయచితవరంగా దొరకడంతో ధర్నాలు, నిరసనలకి దిగింది.   ప్రజలు, ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తుంటే, మాజీ ఐ.పీ.యస్. అధికారిణి కిరణ్ బేడీ మాత్రం మోడీ ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకొని చాల దైర్యం ప్రదర్శించిందని ప్రశంసించారు. పిరికి ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు ఆగ్రహం కలిగే నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతూ కాలక్షేపం చేస్తుంటాయని కానీ మోడీ ప్రభుత్వం మాత్రం దైర్యంగా బుల్లెట్ ను ఎదుర్కొన్నట్లుగా తన నిర్ణయాన్ని అమలు చేసిందని ఆమె ప్రశంసించారు. ప్రజలు వ్యతిరేఖిస్తున్నఈ నిర్ణయాన్ని కిరణ్ బేడీ తనధైన శైలిలో బాగానే విశ్లేషించారు.   అయితే ప్రజలందరూ వ్యతిరేఖిస్తున్న నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరీ ఎందుకు సమర్ధిస్తున్నారు అంటే దానికి బలమయిన కారణం ఉంది. ఆమె కొన్ని వారాల క్రితం తాను బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు ట్వీట్ చేసారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో తాను పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసారు. ఇక బీజేపీ కూడా కిరణ్ బేడీని పార్టీలోకి ఆహ్వానించి, డిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి తమకు కంట్లో నలుసులా మారి తమను చాలా ఇబ్బంది పెడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కు చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బీజేపీ కూడా తమ పార్టీ శాసనసభ్యుల మీద ఆకర్ష మంత్రం ప్రయోగిస్తోందని ఆమాద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. బహుశః అందుకే కిరణ్ బేడీ కూడా నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అభినందించి ఉండవచ్చును. కానీ ఆమె అభినందనలో అంతే నిజాయితీ కూడా ఉంది. ఎందువలన అంటే కటిన నిర్ణయాలను తీసుకొంటే తప్ప దేశాన్ని గాడిలో పెట్టడం సాధ్యం కాదని అందరూ అంగీకరిస్తారు.

ఫేస్‌బుక్‌తో ప్రాబ్లమ్స్ చూతము రారండీ

  సోషల్ నెట్ వర్క్ ఫేస్‌బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలూ వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కి సంబంధించిన వివాదాలు, కేసులు, మోసాలు గట్రా ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. లేటెస్ట్.గా వెలుగులోకి వచ్చిన రెండు ఇష్యూలని చూద్దాం. అస్సాంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు తమ తోటి అమ్మాయిల ఫొటోలు, అడ్రసులు, ఫోన్ నంబర్లు ఫేస్‌బుక్‌లో పెట్టి వాళ్ళకి అసభ్య ఫోన్ కాల్స్ వచ్చేలా చేశారు. అసభ్యకరమైన ఫోన్ కాల్స్ అందుకున్న అమ్మాయిలు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో ఇద్దరు ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు చేసిన నిర్వాకం బయటపడింది. దాంతో ఆ ఇద్దరమ్మాయిలు షేమ్‌గా ఫీలయి ఇద్దరూ జాయింట్‌గా ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. సమయానికి కాపాడటంతో ఇద్దరికీ చావు తప్పింది. ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అలాగే విజయవాడకి చెందిన ఒక వ్యక్తి ఒక సినిమా నటి పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్లో ఆమె ఫొటోలు పెట్టాడు. ఆమె పేరుతో తానే అందరికీ టచ్‌లోకి వెళ్ళాడు. కొంతమంది మగాళ్ళను టార్గెట్ చేశాడు. అనాథాశ్రమమని, అన్నదానమని ఆమాట ఈమాట చెప్పి వాళ్ళ దగ్గర కొంత డబ్బు వసూలు చేశారు. అయితే సదరు నటి ఈ విషయాన్ని కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేసి లోపలేశారు.

ఈజిప్టులో 183 మందికి ఉరి?

  ఈజిప్టులో 183 మందికి ఒకేసారి ఉరిశిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈజిప్టు కోర్డు దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఈజిప్టులో ముస్లిం బ్రదర్‌హుడ్ అనే ఛాందసవాద సంస్థ వుంది. ఈ సంస్థకి నాయకుడు మహ్మద్ బడీ. ఈయన ఒక మాట చెబితేచాలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా వుండేవారు వందలమంది వున్నారు. కొంతకాలం క్రితం వీరు ఈజిప్టులో భారీగా అల్లర్లు జరగడానికి కారణమయ్యారని, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని చంపారన్న ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల మీద కోర్టు విచారణ జరిపింది. ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ అల్లర్లకు, పోలీస్ ఆఫీసర్ మరణానికి కారణమని నిర్ధారించింది. దాంతో ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ అధ్యక్షుడు మహ్మద్ బడీతోపాటు, ఆయన మద్దతుదారులైన 182 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష ఎలాంటి అడ్డంకులూ లేకుండా అమలైతే ఈజిప్టులో త్వరలో 183 మందికి ఉరిశిక్ష అమలు చేస్తారు. అయితే మహ్మద్ బడీ నియమించుకున్న లాయర్లు మాత్రం అంత సీన్ లేదని అంటున్నారు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమీ ఫైనల్ కాదని, ఈ కోర్టు పైన చాలా కోర్టులు వున్నాయని వాటిలో ఈ తీర్పును సవాల్ చేస్తామని అంటున్నారు.

పాపాగ్ని డ్యామ్ వద్దప్పా: కరుణానిధి

  పెన్నానదికి ఉపనదిగా వున్న పాపాగ్ని నదిపై డ్యామ్ కట్టాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వుంది. ఈ విషయంపై చిత్తూరు జిల్లా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అక్కడ డ్యామ్ ఏర్పాటుకు సంబంధించిన పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే పాపాగ్ని నదిపై డ్యామ్ ప్రతిపాదనను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాపాగ్ని డ్యాం నిర్మాణం జరిగితే తమిళనాడులోని మూడు జిల్లాలకు తాగునీటికి సమస్య ఏర్పడుతుందని ఆయన అంటున్నారు. తమిళనాడులోని వేలూరు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల ప్రజలు తాగునీటి అవసరాలన్నీ పాపాగ్ని నీటిపై ఆధారపడి ఉన్నాయని, అందువల్ల డ్యామ్ నిర్మాణం ఆలోచన మానుకోవాలని ఆయన అంటున్నారు.

సచివాలయంలో సీమాంధ్రులు గెస్ట్ ఆర్టిస్టులే!

  సచివాలయంలో బారికేడ్లు ఏర్పటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్నాయి. అలాంటి పరిస్థితులు మరోసారి నెలకొనకుండా ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలా బారికేడ్లు ఏర్పాటు చేయడం మీద తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనవసరపు కామెంట్లు చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని, సీమాంధ్రులు హైదరాబాద్‌ని, సచివాలయాన్ని వదిలి వెళ్లిపోగానే సచివాలయంలో బారికేడ్లు తొలగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు

  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంద్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మరణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ ఖాళీ నిర్మలా సీతారామన్‌లో భర్తీ అవుతుతుంది. టిడిపి, బిజెపిల మధ్య పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి నిర్మలా సీతారామన్ రాజ్యసభకుఎన్నిక కావడానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన నిర్మలా సీతారామన్ అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో సభ్యురాలు కాకపోవడంతో ఇక్కడ నుంచి ఎన్నిక అవ్వవలసిన అవసరం ఏర్పడింది. నిర్మలా సీతారామన్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు హరిబాబు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.

తెలుగుదేశంలోకి వైసీపీ ఎమ్మెల్సీ జూపూడి?

  జగన్ నాయకత్వంలో వున్న వైసీపీకి త్వరలో పెద్ద షాక్ తగలబోతోంది. అది ఎప్పటి నుంచో పార్టీలో వుండి, పార్టీని తన భుజాల మీద మోసిన ఎమ్మెల్సీ, దళిత నాయకుడు జూపూడి ప్రభాకరరావు వైసీపీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశంలోకి చేరబోతున్నారు. ఇప్పటికే దాదాపు పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. శనివారం సాయంత్రం వీరందరూ టీడీపీలో చేరే అవకాశం వుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకరరావు కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారన్న వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. వైసీపీలో ఎన్ని అవమానకర పరిస్థితులు వున్నప్పటికీ వైఎస్సార్ మీద అభిమానంతో ఇంతకాలం వైసీపీలో కొనసాగిన జూపూడి ఇక ఆ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జూపూడి పార్టీ మారబోతున్నాడని తెలుసుకున్న వైసీపీ వర్గాలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాల్లో వున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్: ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులు

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీమాంధ్రుల మీద కామెంట్లు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులే అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శనివారం ప్రొ.జయశంకర్ మూడో వర్థంతి. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లోని ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌ని తెలంగాణ కోసం చేసిన కృషిని కొనియాడారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో లేకపోవడం మన దురదృష్టం అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మీద పైన పేర్కొన్న వెటకారం కామెంట్లు చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన్పటికీ తన ప్రవర్తన ఎంతమాత్రం మారాలేదని ఆయన ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.