త్వరలో డిగ్గీ, అమృత పీపీపీ డుండుండుం!

  టీవీ యాంకర్ అమృతారాయ్‌తో కొనసాగుతున్న సంబంధం బయటపడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాను ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దిగ్వింజయ్ సింగ్‌తో అమృతారాయ్ అత్యంత సన్నిహితంగా వున్న ఫొటోలు కూడా బయటపడి సంచలనం రేగింది. తాజాగా ఈ జంటకు సంబంధించిన పెళ్ళి వార్త బయటకి వచ్చింది. త్వరలో ఈ జంట పెళ్ళి పీటల మీద కూర్చోబోతోందట. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ తమ్ముడి భార్య రుబినా శర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే తమ ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయని దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ భార్య రుబినా శర్మ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ భార్య క్యాన్సర్ కారణంగా గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దిగ్విజయ్‌కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఈయన మరో పెళ్ళికి రెడీ అవుతున్నాడు.

సాయిపై స్వరూపానంద కామెంట్: షిర్డీలో కేసు

  సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయనపై షిర్డీలో కేసు నమోదైంది. షిర్డీ సాయిబాబా దేవుడు కానేకాదని, ఆయనను ఎవరూ పూజించరాదని స్వరూపానంద వ్యాఖ్యలు చేయడంతో సాయి భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కొంతమంది భక్తులు హరిద్వార్‌లో స్వరూపానంద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వారణాసిలో శంకరాచార్య దిష్టిబొమ్మను భక్తులు దగ్ధం చేశారు. దీనిపై ఆ వెంటనే స్పందించిన స్వరూపానంద, తానెలాంటి ప్రకటనలు కానీ, ఉద్రిక్తత రేపే వ్యాఖ్యలు గానీ చేయలేదన్నారు. అయినా సరే ఆయన మీద సాయి భక్తులకు ఆగ్రహం తగ్గలేదు.

ఒబామా మొత్తుకున్నా నో యూజ్: మళ్ళీ కాల్పులు

  అమెరికాలో చీటికి మాటికి కాల్పుల సంఘటనలు జరుగుతూ వుండటం, కొంతమంది అకారణంగా తమ తోటివారిని కాల్చి చంపేస్తూ వుండటం, అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ మీద మొన్నీమధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా బోలెడంత బాధపడిపోయాడు. ఇలాంటి కాల్పులు, గన్ కల్చర్ విషయంలో అమెరికా లాంటి నీచ నికృష్ట కంట్రీ ప్రపంచంలో మరెక్కడా లేదని వాపోయాడు. ఆయన బాధపడినందుకైనా కాల్పులు ఆగుతాయేమోనని చాలామంది ఆశించారు. అయితే అమెరికా తాను మాత్రం మారనని మరోసారి నిరూపించింది. సోమవారం రాత్రి మియామీలోని లిబర్టీ సిటీలో జరిగిన కాల్పుల దుర్గటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పదిమందికి పైగా గాయపడ్డారు.

ఘాటు విమర్శల రోజా!

  వైసీపీలో ఘాటుగా విమర్శలు చేయడంలో మంచి టాలెంట్ వున్న నాయకురాలు రోజా. ఇలా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయో లేదో రోజా అలా చంద్రబాబు మీద ఘాటు విమర్శలు మొదలెట్టేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలన్నీ ఆత్మస్తుతి, పరనిందలా సాగాయని రోజా కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాల్లో చెప్పే మాటలే ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో వల్లె వేశారని తాను తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తాజాగా రైతుల సంక్షేమానికి ఉపయోగ పడే ‘రుణమాఫీ’ పథకం అమలుపై కమిటీ వేయడమేమిటని రోజా లా పాయింట్ లాగారు.

నైజీరియాలో మళ్ళీ భారీ కిడ్నాప్

  నైజీరియాలో మళ్ళీ భారీ కిడ్నాప్ జరిగింది. 60 మంది అమ్మాయిలని, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆమధ్య.. అంటే ఏప్రిల్ 15వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులు రెండు వందల మంది పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఈ అమ్మాయిలను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించే విషయంలో నైజీరియా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ విషయం మీద ప్రపంచ వ్యాప్తంగా నైజీరియా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదు. తాజాగా ఉగ్రవాదులు మరోసారి కిడ్నాప్‌కి పాల్పడ్డారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలపి మొత్తం 91 మందిని కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని ఈశాన్య ప్రాంతంలో వుంటే పల్లెటూళ్ళ నుంచి వీరిని ఉగ్రవాదులు అపహరించారు. నలుగురు గ్రామస్థులను చంపి మరీ 91 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి.

వరంగల్ ‘నిట్’ ముందు విద్యార్థి న్యాయపోరాటం

  వరంగల్ ‘నిట్’లో మెకానికల్ విభాగంలో పిహెచ్‌డీ స్కాలర్ ఎన్.విష్ణుమూర్తి ‘నిట్’ ప్రధాన ద్వారం ఎదుట నిరాహారదీక్ష చేపట్టి న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు రెండు నెలలుగా స్కాలర్‌షిప్ మంజూరు చేయకుండా ‘నిట్’ డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విష్ణుమూర్తి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యాన్ని విష్ణుమూర్తి వివరిస్తూ, ‘‘క్యాంపస్‌లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ‘నిట్’లోని కొంతమంది పరిపాలనా సిబ్బంది నామీద కక్షగట్టారు. నామీద క్రమశిక్షణా రాహిత్యం అనే నెపం పెట్టి డైరెక్టర్ నా స్టైఫండ్ నిలిపివేసేలా చేశారు. నేను చాలా పేదవాడిని. స్టైఫండ్ మీదే ఆధారపడి చదువుకుంటున్నవాడిని. నాకు స్టైఫండ్ వెంటనే మంజూరు చేయాలని ‘నిట్’ డైరెక్టర్ని ఎంతగా కోరినా ఆయన ఎంతమాత్రం స్పందించలేదు. అందుకే ‘నిట్’ ప్రధాన ద్వారం ముందు నిరాహారదీక్ష చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. న్యాయమైన డిమాండ్‌తో నిరాహారదీక్ష చేస్తున్న విష్ణుమూర్తికి ‘నిట్’ విద్యార్థుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే విష్ణుమూర్తి దీక్షకు స్పందించాల్సిన ‘నిట్’ అధికార గణం ఆయన మీద క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెన్షన్ వేటు వేసింది. దీనిని బాధితుడు విష్ణుమూర్తితోపాటు వరంగల్ ‘నిట్’లో చదువుతున్న విద్యార్థిలోకం మొత్తం ఖండిస్తోంది. విష్ణుమూర్తి మీద విధించిన సస్పెన్షన్‌ని ఎత్తివేయడంతోపాటు ఆయన స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో విష్ణుమూర్తికి మద్దతుగా విద్యార్థులందరూ ఉద్యమించాల్సి వస్తుందని వారు ‘నిట్’ అధికారగణాన్ని హెచ్చరిస్తున్నారు.

అభివృద్ధి చేస్తా..దొంగలను పరిగెత్తిస్తా: బాబు

      నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా తనకు వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తొమ్మిదేళ్ళు అధికారంలో వున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనకుందని ఆయన గుర్తు చేశారు. తాను విజన్ 2020 అంటే కొంతమంది 420అని ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు వారే 420లుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. తాను అభివృద్దిలో ప్రపంచానికే పాఠాలు చెప్పానని..వైకాపా నేతల నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితి ఇంకా తనకు రాలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని శ్రీకృష్ణ కమిటీ గణాంకాలతో తెలిపిందనే విషయాలు సభలో గుర్తుచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేయడానికి తన వద్ద మంత్రదండం ఏమిలేదని..కానీ రాబోయే ఐదేళ్లలో మెరుగైన పాలన అందిస్తామని బాబు ఉద్ఘాటించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని బాబు అన్నారు. దొంగలపై కేసులు పెడతామని చెప్పారు. తన పాలన దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తాను ఎవరపై విమర్శలు చేయడం లేదని పేర్కొన్నారు.

థాంక్యూ గవర్నర్ గారూ: అసెంబ్లీ వాయిదా

  అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తొలి సమాశవేశాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయిదు రోజులపాటు సమావేశమైంది. మొత్తమ్మీద అసెంబ్లీ 19 గంటల 20 నిమిషాలపాటు జరిగింది. 52 మంది సభ్యులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడంతోపాటు మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు సమయం వృధా కాకుండానే జరిగాయి.

గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు

      ఊహించినట్లే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్ సమస్యలపై కీచులాటలు మొదలయ్యాయి. ఉభయ రాష్ట్రాలు కూడా నీరు, విద్యుత్ కొరతతో సతమతమవుతున్నందున, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్దపడటం లేదు. రెండు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన లేకపోవడంతో గోటితో పోయే వ్యవహారాలు కూడా గొడ్డలి వరకు వెళ్ళిపోతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో జరిగిన విద్యుత్ అమ్మకాల ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసుకోవాలని నిశ్చయించుకోవడంతో, ఆ విద్యుత్ పైనే ప్రధానంగా ఆధారపడిన తెలంగాణా ప్రభుత్వం వెంటనే ఆంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా బెదిరింపులకి దిగింది. రెండు రాష్ట్రాల నడుమ నెలకొన్న ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవలసి వచ్చింది.   అయితే ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకమునుపే రెండు రాష్ట్రాల మధ్య నీటి కోసం పేచీలు మొదలయ్యాయి. ఈ నెల 20న నాగార్జున్ సాగర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల కావలసిన 10 టీయంసీల నీటిని విడుదల చేయకుండా తెలంగాణా ప్రభుత్వం నిలిపివేయడంతో ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, రవి కిషోర్ తదితరులు ఉభారాష్ట్రాలకు గవర్నర్ అయిన నరసింహన్ను ఈరోజు కలిసి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తక్షణమే రాష్ట్రానికి నీటిని విడుదల చేయమని తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖా ఇంజనీర్లతో కూడిన ఒక నిపుణుల కమిటీ నీటి విడుదలకు ఆమోదం తెలిపినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిలిపివేయడాన్ని వారు తప్పు పట్టారు. అదేవిధంగా ఈ కమిటీలో తెలంగాణకు చెందిన ఇంజనీర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని సంప్రదించకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా నీటి విడుదలకు అంగీకరించడాన్ని టీ-మంత్రి హరీష్ రావు కూడా తప్పు పట్టారు. త్రాగు నీటికోసం విడుదల చేస్తున్న నీటిని దిగువన రైతులు తమ నర్సరీలకు వినియోగించుకొంటున్నారని అందుకే నీటిని నిలిపివేశామని హరీష్ రావు తెలిపారు.   ఈ వ్యవహారంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంబన ఏర్పడంతో మళ్ళీ కేంద్రమే జోక్యం చేసుకోవలసి వచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఏబీ.పాండ్యే ఈరోజు సాయంత్రం హైదరాబాదులో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో చర్చలు జరుపనున్నారు. ఆ చర్చలు సఫలమయితే రేపు రాష్ట్రానికి నీళ్ళు విడుదల అయ్యే అవకాశం ఉంది. లేకుంటే రెండు రాష్ట్రాల మధ్య ఈ యుద్ధం మరింత తీవ్రతరంయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రా స్థాయిలో ప్రభుత్వాలు, సంబందిత మంత్రిత్వ శాఖలు, ఉన్నతాధికారులు కలిసి కూర్చొని చర్చించుకోవలసిన ఈ అంశాన్ని తీసుకు వెళ్లి కేంద్రం చేతిలో పెట్టడం వలన, కేంద్రానికి తెలుగు ప్రజలంటే మరింత చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. అందువలన ఇప్పటికయినా రెండు ప్రభుత్వాలు విజ్ఞత ప్రదర్శిస్తూ, సమస్యలను సామరస్యంగా చర్చించు కోవడం మేలు.

అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది చాలా వుంది: బాలక‌ృష్ణ

  ప్రముఖ కథానాయకుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ హిందూపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ శ్రద్ధగా పాల్గొంటున్నారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆయన్ని అభినందిస్తూ బాలకృష్ణ ప్రశంసనీయంగా ప్రసంగించారు. కూడా. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను, అధికార - ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలను శ్రద్ధగా గమనిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చారు కదా.. మీ అనుభూతులు, అనుభవాలేంటో చెప్పండని బాలక‌ృష్ణని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర జర్నలిస్టులు ప్రశ్నిస్తే, ‘అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది చాలా వుంది’ అని సమాధానం చెప్పారు.

ధోనీకి ఏపీ కోర్టు అరెస్టు వారెంట్

  ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అరెస్టు వారెంటు జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కోర్టు ధోనీ అరెస్టుకు మంగళవారం వారెంట్ జారీ చేసింది. బిజినెస్ టుడే పత్రిక గతంలో తన కవర్ పేజీ మీద విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి, చేతిలో బూటు ఉంచడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లాకి చెందిన విశ్వహిందూ పరిషత్‌కి చెందిన వారు ఆమధ్య ఈ విషయం మీద అనంతపురం కోర్టును ఆశ్రయించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఫొటో ముద్రించినందున ధోనీ, చైతన్య కల్బగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ అప్పుడు కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎస్‌సి అండ్ యస్‌టి కోర్టు విచారణకు హాజరు కావాలని మూడుసార్లు ధోనీకి సమన్లు పంపినా హాజరు కాకపోవటంతో మంగళవారం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

పీవీ జయంతి.. తెలంగాణ రాష్ట్ర పండుగ

  మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పురస్కరించుకుని ఈనెల 28వ తేదీన పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. పీవీ జయంతి ఏర్పాట్లపై తెలంగాణ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సమీక్ష నిర్వహించారు. పీవీ జయంతి రోజున పీవీ నరసింహారావు అంత్యక్రియలు జరిపిన పి.వి. జ్ఞానభూమి దగ్గర జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు పంపనుంది.

రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఏకగ్రీవ ఎన్నిక

  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి నిర్మలా సీతారామన్‌ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ అటు లోక్ సభలోగానీ, ఇటు రాజ్యసభలో గానీ సభ్యురాలు కాదు. మంత్ర పదవి స్వీకరించిన ఆరు నెలలలో లోగా ఆమె పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానికి ఎన్నిక కావలసి వుంటుంది. దీంతో నేదురుమల్లి మరణంతో ఖాళీ అయిన స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానానికి మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మాణాల కూల్చివేత

  హైదరాబాద్‌ నగరంలోని  గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సోమవారం నుంచి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టిన ఇళ్ళను కూల్చివేస్తు్న్నారు. మంగళవారం నాడు కూల్చివేతలు జరుగుతూ వుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న ఇళ్ళ యజమానులతోపాటు స్థానిక శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరికెపూడి గాంధీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల విషయంలో టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, అధికారులు టీఆర్ఎస్ నేతల ఇళ్లను మాత్రం వదిలి మిగతా వారి ఇళ్ళను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. గురుకుల్ ట్రస్ట్ భూములను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు.

పోలవరంపై తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పోలవరంపై తీర్మాన౦ సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ రోజు శాసనసభ సమావేశాల్లో ఆయన పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరం వల్ల గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు. ఐదున్నర జిల్లాలకు నీరు అందుతుందని చెప్పారు. ముంపునకు గురైన గ్రామాలను మాత్రమే ఆంద్రలో విలీనం చేశారని, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పారు. అనాటి యూపిఏ ప్రభుత్వం పలు ముంపు గ్రామాలను ఏపికి ఇచ్చిందని తెలిపారు. ఆ ఆర్డినెన్స్ నే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. పార్లమెంటు సెషన్స్‌లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని మూడేళ్లలో పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే అక్కడి ప్రభుత్వం పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పోలవరం తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆంధ్ర, తెలంగాణాలలో తెదేపాకు సైకిల్ గుర్తు కేటాయింపు

  తెలుగుదేశం పార్టీని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమీషన్ ఆ పార్టీకి రెండు రాష్ట్రాలలో కూడా సైకిల్ గుర్తునే కేటాయించచింది. అందువల్ల ఇకపై రెండు రాష్ట్రాలలో జరిగే ఏ ఎన్నికలలోనయినా తెదేపా ప్రాంతీయ పార్టీ హోదాలో సైకిల్ గుర్తుతో పోటీ చేయవచ్చును. తెదేపా అధ్యక్షుడు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత యల్.రమణను నియమించారు. కనుక ఇకపై చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగానికి మాత్రమే అధ్యక్షుడుగా వ్యవహరించవలసి ఉంటుంది, కానీ ఆయన రెండు రాష్ట్రాలలో పార్టీకి అధ్యక్షుడుగా కొనసాగుతారు. ఈ సాంకేతిక సమస్యను అధిగమించాలంటే పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. అప్పుడు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించి తాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగావచ్చును. ఇటీవల గండిపేట వద్ద జరిగిన మహానాడు సమావేశాలలో పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ, ఆ గుర్తింపు పొందాలంటే పార్టీ కనీసం మూడు ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి కనీసం 10 శాతం ఓట్లు సంపాదించవలసి ఉంటుంది. తెలుగువారు స్థిరపడిన కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ ద్వీపాలలో వచ్చే ఎన్నికలలో తెదేపా పోటీచేయాలని భావిస్తోంది. అందువల్ల జాతీయపార్టీ హోదా పొందేందుకు మరో ఐదేళ్ళు ఆగక తప్పదు. అంతవరకు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపా ప్రాంతీయ పార్టీగా కొనసాగవలసి ఉంటుంది.

హిమాచల్‌లో విద్యార్థుల మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం

    మంగళవారం ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే హిమాచల్‌లో విద్యార్థుల మృతికి, ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటిస్తూ సబ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో విజ్ఞాన్ కళాశాల ఇజంనీరింగ్ విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు బాబు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలిలో పర్యవేక్షణకు మంత్రులు, అధికారులను పంపామని ఆయన చెప్పారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో తెలుగు విద్యార్థుల మృతికి కేవలం అధికారుల తప్పిదమే కారణమని విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా లార్జీ డ్యాం గేట్లు ఎత్తివేశారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలుపుతున్నట్లు జగన్ తెలిపారు.

అంతః కలహాలతో టీ-కాంగ్రెస్ బిజీబిజీ

  చింత చచ్చినా పులుపు చావదన్నట్లుంది టీ-కాంగ్రెస్ పార్టీ నేతల పద్ధతి. తమ అధిష్టానం సీమాంద్రాలో పార్టీని బలిపెట్టుకొని మరీ తెలంగాణా ఇచ్చినా కూడా ఎన్నికలలో గెలవలేకపోయారు. వారికి టికెట్లు, పదవులపై ఉన్న శ్రద్ధ పార్టీని గెలిపించుకోవడంపై లేకపోవడంతో ఓటమిపాలయ్యారు. పోనీ ఓడిపోయిన తరువాతయినా జరిగిన దానికి పశ్చాతాపపడ్డారా? అంటే అదీ లేదు. మళ్ళీ యధాప్రకారం పార్టీ పదవుల కోసం నిసిగ్గుగా కుమ్ములాడుకొంటున్నారు. పీసీసీ అధ్యక్షపదవి చేజిక్కించుకొన్న పొన్నాల లక్ష్మయ్యను ఎలాగయినా ఆ కుర్చీలో నుండి దింపి అందులో తాము కూర్చోవాలని చాలా మంది టీ-కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం టీ-పీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్.కే. అమోస్ తన పదవికి రాజీనామా చేసి పొన్నాలను కూడా దిగిపొమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఇక మరో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో యుద్ధం చేస్తూ క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమయిన పొన్నాలతో బాటు అతను కూడా స్వచ్చందంగా పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా టీ-కాంగ్రెస్ నేతలు తమ సహచరులతో పోరాటం చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటే, మరి కొందరు డిల్లీ వెళ్లి టీ-పీసీసీని సమూలంగా ప్రక్షాళన చేయాలని, ముఖ్యంగా పొన్నాలను ఆ పదవి నుండి వెంటనే తప్పించాలని కోరగా, కాంగ్రెస్ అధిష్టానం వారి అభ్యర్ధనను తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ, ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా పార్టీ పదవుల కోసం పోరాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి తాము సరయిన నిర్ణయమే తీసుకొన్నామని తెలంగాణా ప్రజలు భావిస్తే తప్పులేదు. అదేవిధంగాటీ-కాంగ్రెస్ నేతలు తమ జోలికి రాకుండా వారిలో వారే ఈవిధంగా పదవుల కోసం కలహించుకొంటూ కాలక్షేపం చేస్తుండటంతో, అధికార తెరాస పార్టీ కూడా రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి నిమగ్నం చేయగలుగుతోంది.