కాంగ్రెస్ ద్రోహి కిరణ్‌కుమార్ ‌రెడ్డి

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆ నేరమంతా మోపడానికి ఒక బకరాని వెతికారు. ఆ బకరా పేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరికివారు కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని చెబుతూ పార్టీ హైకమాండ్ దృష్టిలో తమను తాము ఉత్తములుగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో వున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కూడా చేరారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలైన ద్రోహి మాజీ కిరణ్ కుమార్ రెడ్డి. పార్టీలో ఉంటూ కీలక పదవులు అనుభవించిన తర్వాత ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు’’ అని రామచంద్రయ్య విరుచుకుపడుతున్నారు.

ఉన్మాది దాడిలో దంపతులకు గాయాలు

  తిరుమలలో శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్తున్న భక్తుల మీద అక్కగార్ల గుడి సమీపంలో ఓ ఉన్మాది దాడి చేశారు. భక్తులను గాయపరచడానికి ఉన్మాది ప్రయత్నించడంతో భక్తులందరూ చెల్లాచెదురైపోయారు. అయితే తమిళనాడులోని తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లత అనే భార్యాభర్తలను పట్టుకున్న ఆ ఉన్మాది తన దగ్గర వున్న కత్తితో వారిద్దరి గొంతులు కోశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న అశ్విన్ ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఉన్మాది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి హఠాన్మరణం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్ (57) గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు. ఆయన ఒక వారం రోజుల క్రితమే కేసీఆర్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని నాగోలు ప్రాంతంలో గల అలకాపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటు కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఆయన మరణించారు. సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన ఆయన అనేక ప్రభుత్వ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా వుండే మంచి అవకాశాన్ని పొందిన ఆనందం వారం రోజులు కూడా మిగల్లేదు. సంతోష్ కుమార్ భౌతిక కాయాన్ని పలువురు టీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంతాపం, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

యువరాజుకి పెళ్ళే కాలేదు..కానీ ముసలోళ్ళు రెండేసి పెళ్ళిళ్ళా..అవ్వ!

  నిన్న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పార్టీ ఓటమికి కారణాలు కనుగొనడం సంగతి ఎలా ఉన్నప్పటికీ మంచి పసందయిన కబుర్లు సాగాయి. వాటిలో కొన్ని:   ఆనం వివేకానంద రెడ్డి: వయసులో ఉన్న కుర్రోడు (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోకుండా పార్టీ కష్టపడుతుంటే ముసలోళ్ళకి (దిగ్విజయ్ సింగ్) రెండేసి మూడేసి పెళ్ళిళ్ళా..అవ్వ!   రాష్ట్ర విభజన చేస్తే చేయనీయమని సీమాంధ్ర ప్రజలు అనుకొన్నారు. కానీ మన పార్టీ విభజన చేసిన తీరే చాలా అన్యాయంగా ఉంది. అందుకే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని చాలా కసితో పగబట్టినట్లుగా ఓడించారు.   డిల్లీ నుండి డక్కీ రాజాలు డక్కా రాజాలు ఇక్కడకు వచ్చి వాలిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వారికి మన బాష తెలియదు. మన సంస్క్ర్తుతి గురించి తెలియదు. మన భావోద్వేగాల గురించి తెలియదు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడేయడంతో ఇక్కడ ప్రజలలో టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారి కారణంగానే మనకి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది.

బ్లూమింగ్‌టన్‌లో తెలుగుదేశం-పసుపుదళం సంబరాలు

      నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని సెంట్రల్ ఇల్లినాయిస్‌లోని బ్లూమింగ్‌టన్ పట్టణంలో బ్లూమింగ్‌టన్ తెలుగుదేశం శాఖ - పసుపుదళం ఆధ్వర్యంలో తెలుగుదేశం విజయోత్సవాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా సుమారు నలభై కార్లతో 15 మైళ్ళ దూరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ కుటుబం సభ్యులతో కలసి విజయోత్సవ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకున్నారు. ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. మహిళలు పసుపు పచ్చని సంప్రదాయ వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది కళాహృదయులు ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెద్దలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎలా అభివృద్ధిలోకి తెచ్చారనే అంశం మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్ యార్లగడ్డ, శ్రీనివాస్ కొసరాజు, కన్నెగంటి కృష్ణ, వెంకట్ లెల్ల, చంద్ర చిట్టిబొమ్మ, వేణు దండ, రాజా వెలగపూడి, శ్రీ గోగినేని, క్రిష్ కిలారు, శివ బూసా, నరసింహారావు అబ్బిన, శ్రీనివాస్ మానం, వెంకట్ లెక్కల, వెంకట్ గోగినేని, సుధీర్ చౌదరి, వంశీకృష్ణ పేపల్ల, రాకేష్ కిలారు, కిరణ్ గుడిపూడి, చైతన్య సోమినేని, నాగరాజు కూరపాటి, శరత్‌బాబు గోడి, రవి వట్టికూటి, హేమంత్ మువ్వ, ఇమ్రాన్ ఖాన్, శ్వేత శింగరి, చక్రవర్తి కొటారు, రామ్ తాళ్ళూరి తదితరులు పాల్గొన్నారు.

హిమాచల్‌ నుంచి తిరిగొచ్చిన నాయిని

      హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతైన మర్నాటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే వుండి విద్యార్థుల గాలింపు కార్యక్రమాలను పర్యవేక్షించిన తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌‌కి తిరిగి వచ్చేశారు. తాము ఎంత ప్రయత్నించినా విద్యార్థుల జాడ కనుక్కోలేకపోయినందుకు ఆయన తన బాధను వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా విద్యార్థుల జాడ తెలియకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. దాదాపు వారం పాటు నాయిని అక్కడే వుండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నాయినితోపాటు గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు.

తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు

      త్వరలో తెలంగాణకు ముచ్చటగా మూడు పండుగలు రాబోతున్నాయి. త్వరలో రాబోతున్న మహంకాళి అమ్మవారి బోనాలు, రంజాన్, బతుకమ్మ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నామని మంత్రి పద్మారావు తెలిపారు. ముందుగా రాబోతున్న రంజాన్, మహంకాళీ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ పండుగలను ఘనంగా జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ఈ మూడు పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ... రంజాన్ పండుగను ప్రభుత్వం తరఫున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పండుగల సందర్భంగా జంటనగరాల్లో సీఎం పర్యటిస్తారని ఆయన చెప్పారు.

ఇరాక్‌లో భారతీయ నర్సులు భద్రం

      ఇరాక్‌లోని టిక్రిట్ నగరంలోని ఓ ఆస్పత్రిలో 44 మంది భారతీయ నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ నగరాన్ని తీవ్రవాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నర్సులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఆ నర్సులందరూ అక్కడ క్షేమంగా వున్నారని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే టిక్రిట్‌లో నర్సులు చిక్కుకుపోయారని, వారిని కాపాడాలని తమకు సందేశం వచ్చిందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి విషయాలు చెప్పారు. నర్సులు కావాలంటే భారత్ వెళ్లిపోవచ్చు గానీ, వారి భద్రతకు మాత్రం తాము ఎలాంటి హామీ ఇవ్వబోమని ఆస్పత్రి వర్గాలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం టిక్రిట్‌లో వున్న నర్సులు భద్రంగా వున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఖాయమా?

      ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలన వైపు వెళ్తోందా అనే సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను ఆపకపోగా ఈ అంశం మీద కడుపు మండే కామెంట్లు చేస్తోంది. అత్యాచారాల పరిస్థితి ఇలా వుంటే, ఉత్తర ప్రదేశ్ అంతటా పెరిగిపోయిన దొంగతనాలు, అల్లర్లు అసలు యు.పి.లో ప్రభుత్వం అనేది వుందా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పరిస్థితులన్నీ చేయి దాటిపోతూ వుండటంతో యుపిలో రాష్ట్రపతి పాలన ఖాయమన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామాలు చేస్తే మంచిదన్న అనధికార ఆదేశాలు అందడంతో చాలామంది గవర్నర్లు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందరికంటే ముందుగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేయడం త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనేదానికి సంకేతమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత యుపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫిరోజాబాద్‌లో టెర్రర్ టెర్రర్!

      ఉత్తర ప్రదేశ్ చివరికి ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు నిరాఘాటంగా జరిగిపోతూ వున్నాయి. మరోవైపు దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ అన్యాయాలన్నిటినీ చూసి తట్టుకోలేని జనం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు హిసాత్మకంగా కూడా మారుతున్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలోని రామ్‌ఘర్‌లో గత రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక దొంగల ముఠా చేతిలో హతమయ్యారు. దీనికి నిరసనగా జిల్లా ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. జనం పోలీసు అధికారులపై రాళ్లదాడికి దిగడంతో డిజిఐ విజయ్ సింగ్ మీనాతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. రెచ్చిపోయిన జనం అక్కడి వాహనాలను, షాపులను ధ్వంసం చేశారు. ఒక పోలీసు వ్యానును తగులబెట్టారు. మొత్తమ్మీద ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి చెయ్యిదాటినట్టు కనిపిస్తోంది.

రాజీనామా బాటలో యూపీఏ గవర్నర్లు

      నరేంద్రమోదీ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్‌లను మార్చాలని యోచిస్తోన్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బీఎల్‌ జోషి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. ఆయన బాటలోనే మరో ఐదుగురు గవర్నర్లు కేళర గవర్నర్ షీలా దీక్షిత్, శివరాజ్ పాటిల్, ఎంకే నారాయణ్ కూడా తమ పదవులకు రాజీనామ చేసే అవకాశాలు ఉన్నాయి.కాగా ఆంద్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత రోశయ్య తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తారా?లేక కొనసాగుతారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో సోనియా విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజకీయ లబ్ది కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇరాక్‌లో ఇరుక్కున్న తెలంగాణ బిడ్డలు

      ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇరాక్‌లో తుపాకులు, బాబులు విచ్చలవిడిగా పేలుతున్నాయి. ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బాంబులు, తుపాకులు అక్కడ పేలుతున్నప్పటికీ వాటి ప్రతిధ్వని మాత్రం ఉత్తర తెలంగాణలోని అనేకమంది గుండెల్లో వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేక మంది వివిధ పనుల నిమిత్తం వెళ్ళారు. ప్రస్తుతం ఇరాక్‌లో స్థానిక ప్రజలకే భద్రత కరువైపోయింది. ఇక వలస వెళ్ళినవారి పరిస్థితి ఊహించడానికే వీల్లేకుండా వుంది. పైగా ఇరాక్‌లో తిరుగుబాటు చేసిన వర్గాలు ఇతర దేశాలకు చెందిన వారు ఇరాక్‌ వదిలిపోవాలని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాక్‌లో వున్న తెలంగాణ వారి బంధువులు ఇక్కడ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాక్ పరిణామాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆరా తీశారు. ఇరాక్ పరిణామాలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాక్లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు.

రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ

      తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. సోమవారం జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో బతుకమ్మ పండుగతోపాటు బోనాల పండుగను కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమీక్షానంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ మీడియాకు ఈ విషయం చెప్పారు. జూలై 13 లేదా 14 తేదీల్లో సికింద్రాబాద్‌లో ప్రారంభం కానున్న బోనాల పండుగ వేడుకలు ఏడువారాలపాటు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని మంత్రి పద్మారావు తెలిపారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రానున్న బోనాలు, రంజాన్ పండుగలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రంజాన్ పండుగకు సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారన్నారు. విద్యుత్ కోతల వల్ల అంతరాయం కలగకుండా మందిరాలు, మసీదుల వద్ద మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ జనరేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు. 

డీఎంకేకు నటి ఖుష్బూ గుడ్‌బై

      ప్రముఖ సినీనటి ఖుష్బూ డీఎంకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కరుణానిధికి లేఖ పంపారు. డీఎంకేలో కొంత కాలంనుంచీ పరిస్థితులు మారిపోవడంతో నిజాయతీగల కార్యకర్తగా సహించలేక వైదొలిగానని, మరే పార్టీలోనూ చేరబోవడం లేదని తెలిపారు. పార్టీకోసం ఎంతో పాటుపడినా తనను పక్కనపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి తాను ఎంతో శ్రమించానని, ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. కలైజ్ఞర్ తనకు నాయకుడు కారని, తండ్రివంటివారని, అయినప్పటికీ పార్టీలో ఇమడగలిగే పరిస్థితులు లేనందువల్ల బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయనకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ పని సులువు చేసిన యనమల

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో విద్యాభ్యాసం చేస్తున్న ఆంధ్రా విద్యార్ధులకు పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించేందుకు విముఖత చూపిస్తుండటంతో, దానిపైనే ఆధారపడి చదువులు కొనసాగిస్తున్న అనేకమంది ఆంద్ర విద్యార్ధులు వారి తల్లితండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ కేసీఆర్ కానీ ఆయన మంత్రులెవరూ కానీ దీనిపై ఎటువంటి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది గమనించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించకపోయినట్లయితే, ఆంధ్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, అందువలన విద్యార్ధులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆయన ఆవిధంగా చొరవ తీసుకొని ప్రకటించడం చాలా హర్షణీయం. అయితే కాగల కార్యం గందర్వులే నెరవేర్చారన్నట్లు, ఆంధ్రా విద్యార్ధులకు తమ ప్రభుత్వమే పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని మంత్రి యనమల స్వయంగా ప్రకటించడంతో ఇక కేసీఆర్ కు ఎటువంటి నిందలు, అపవాదులు ఎదుర్కొనే బాధ తప్పింది. కనుక నేడో రేపో కేవలం తెలంగాణా విధ్యార్థులకు మాత్రమే తమ ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని ఆయన నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చును.

జైలులో ఎర్రచందనం స్మగ్లర్ ను కలిసిన వైకాపా యం.యల్యే

  ఎర్రచంద్రనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డి అనే వ్యక్తిని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అనేకమందిపై అనేక రకాల ఆరోపణలున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరెయ్యారు. ఇటువంటి తరుణంలో పోలీసులు అరెస్టు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుకి చెందిన వ్యక్తిని వైకాపా నేత జైలుకి వెళ్లికలవడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. అయితే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధము లేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పడం విశేషం. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగినా, దానిని అందరూ కల్లే అనుకొంటారు తప్ప పాలని ఎవరూ నమ్మరు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఆ వ్యక్తి తనకు మిత్రుడని స్వయంగా భాస్కరరెడ్డే చెపుతున్నపుడు ప్రజలకు అనుమానాలు కలగడం సహజమే. పైగా విజయానందరెడ్డి గంగాధర నెల్లూరుకు చెందిన వైకాపా కార్యకర్త అని చెవిరెడ్డి చెప్పడం వైకాపా ప్రతిష్టను మసకబారేలా చేస్తుంది. అన్ని విషయాలు స్వయంగా మీడియాకు చెప్పి, ఇప్పుడు మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని చెవిరెడ్డి బాధపడటం చాలా హాస్యాస్పదం.

బియాస్‌ దుర్ఘటన: మిస్సింగ్‌, డెత్‌ సర్టిఫికెట్లు

      బియాస్‌ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం గాలింపు కొనసాగుతుంది. లభించిన విద్యార్థుల మృతదేహాలపై డెత్‌సర్టిఫికెట్లు, మృతదేహాలు లభ్యం కాని వారిపై మిస్సింగ్‌ సర్టిఫికెట్లను బాధిత కుటుంబాలకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ సర్టిఫికెట్లపై హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర రాజముద్రలు లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సరి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు చెప్పాయి. మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు తరలిస్తామని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

టిడిపి వైపు చూస్తున్న ఆనం బ్రదర్స్

      కాంగ్రెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో తనకు వ్యక్తిగతంగా ముప్పై ఐదేళ్ల అనుబంధం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను పాలించే సత్తా బాబుకే ఉందని ఆయన చెప్పడం విశేషం. తాము టిడిపిలో చేరుతారనే ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇక్కడ తాను టిడిపిలో పనిచేశానని ఆయన గుర్తు చేయడం విశేషం. అలాగే పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలు కూడా ఆయన కొట్టిపారేయలేదు. ఎలాగో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీప భవిష్యత్తులో కూడా బాగుపడే సూచనలు లేకపోవడంతో టిడిపిలో చేరడానికి ఆనం బ్రదర్స్ బాబుకు సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.