రైల్వే చార్జీల పెంపు చాలా దైర్యమైన నిర్ణయం: కిరణ్ బేడి
posted on Jun 21, 2014 @ 9:51PM
అత్యంత ప్రజాధారణతో, భారీ మెజార్టీతో అధికారం చేప్పట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశాప్రజలలో చాలా భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చాలా చురుకుగా తీసుకొంటున్న నిర్ణయాల పట్ల దేశాప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మోడీ ప్రభుత్వం రైల్వే చార్జీలను 14.2శాతం పెంచి ప్రజలందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. దానితో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇక మోడీ దూకుడు చూసి ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తికమకపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఆయచితవరంగా దొరకడంతో ధర్నాలు, నిరసనలకి దిగింది.
ప్రజలు, ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తుంటే, మాజీ ఐ.పీ.యస్. అధికారిణి కిరణ్ బేడీ మాత్రం మోడీ ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకొని చాల దైర్యం ప్రదర్శించిందని ప్రశంసించారు. పిరికి ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు ఆగ్రహం కలిగే నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతూ కాలక్షేపం చేస్తుంటాయని కానీ మోడీ ప్రభుత్వం మాత్రం దైర్యంగా బుల్లెట్ ను ఎదుర్కొన్నట్లుగా తన నిర్ణయాన్ని అమలు చేసిందని ఆమె ప్రశంసించారు. ప్రజలు వ్యతిరేఖిస్తున్నఈ నిర్ణయాన్ని కిరణ్ బేడీ తనధైన శైలిలో బాగానే విశ్లేషించారు.
అయితే ప్రజలందరూ వ్యతిరేఖిస్తున్న నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరీ ఎందుకు సమర్ధిస్తున్నారు అంటే దానికి బలమయిన కారణం ఉంది. ఆమె కొన్ని వారాల క్రితం తాను బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు ట్వీట్ చేసారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో తాను పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసారు. ఇక బీజేపీ కూడా కిరణ్ బేడీని పార్టీలోకి ఆహ్వానించి, డిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి తమకు కంట్లో నలుసులా మారి తమను చాలా ఇబ్బంది పెడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కు చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బీజేపీ కూడా తమ పార్టీ శాసనసభ్యుల మీద ఆకర్ష మంత్రం ప్రయోగిస్తోందని ఆమాద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. బహుశః అందుకే కిరణ్ బేడీ కూడా నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అభినందించి ఉండవచ్చును. కానీ ఆమె అభినందనలో అంతే నిజాయితీ కూడా ఉంది. ఎందువలన అంటే కటిన నిర్ణయాలను తీసుకొంటే తప్ప దేశాన్ని గాడిలో పెట్టడం సాధ్యం కాదని అందరూ అంగీకరిస్తారు.