చంద్రబాబుకి ఏపీ ఎన్జీవోలు సన్మానం
posted on Jul 9, 2014 @ 9:15PM
మళ్ళీ పదేళ్ళ తరువాత ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 58సం.ల నుండి 60సం.లకు పెంచడం ద్వారా వారి ఆధరణ పొందగలిగారు. అందుకు ఉద్యోగులు కూడా చాలా సంతోషిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఏపీఎన్జీవోలు అందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈనెల 12న విజయవాడ లయోలా కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా సన్మానం చేయాలనుకొంటున్నారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించడంతో ఏపీఎన్జీవోలు ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టి, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తూనే మరో పక్క రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం చేయవలసిన ఈ కీలక తరుణంలో ప్రభుత్వోద్యోగుల పాత్ర చాలా కీలకం కానుంది. వారి సమర్ధత, అనుభవం ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం ఉంది.ఇటువంటి తరుణంలో ప్రభుత్వం, ఉద్యోగులమధ్య చక్కటి సమన్వయము, సహకారం చాలా అవసరం. అది పుష్కలంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది.