భూగర్భంలో మెట్రో చాలా డేంజర్! హైదరాబాద్ పరిస్థితేంటి?
posted on Jul 15, 2014 @ 2:42PM
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నిర్మాణం చకచకా జరుగుతోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలును భూగర్భ మార్గంగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి కంపెనీకి షరతు విధించారు. అయితే ఆ సంస్థ కేసీఆర్ షరతులను అంగీకరించే పరిస్థితిలో లేదు. భూ గర్భంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఆ సంస్థ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో మార్గం నిర్మాణం విషయంలో స్తబ్ధత ఏర్పడింది. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే, మెట్రో రైలు మార్గాన్ని భూగర్భంలో నిర్మించడం అంత శ్రేయస్కరం కాదని తెలుస్తోంది. ఎందుకంటే, రష్యాలో తాజాగా జరిగిన మెట్రో రైలు ప్రమాదం భూగర్భ మార్గంలోనే జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు. దాదాపు యాభై మంది భూ గర్భంలో ఇరుక్కుపోయి వున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు భూగర్భ రైలు మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయని అంటున్నారు. రష్యాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో మార్గాన్ని భూగర్భంలో నిర్మించాలన్న పట్టుదలను సడలించాలని పలువురు కోరుతున్నారు.