పోలవరం బిల్లు ఆమోదం...చిరు హ్యాపీ
posted on Jul 14, 2014 @ 6:55PM
పోలవరం బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో బిల్లును పాస్ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉప సభపతికి సూచించగా ఆయన బిల్లును పాస్ చేస్తూ ప్రకటన చేశారు. అంతకముందు పోలవరం బిల్లు రాజ్యసభకు రావడం ఆనందంగా వుందని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 25.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నదుల అనుసంధానం అవుతున్న తొలి ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం వల్ల 7.2లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. మరో 5 టీఎంసీల నీరు ఒడిశా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. భద్రాచలం డివిజన్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో భాగమని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారమే 7 మండలాలు ఆంధ్రలో విలీనం అయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, 23.4 టిఎంసీల నీరు పరిశ్రమలకు అందుతుందని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సూచించారు.