రష్యా సరిహద్దు వద్ద కూలిన మలేషియా విమానం
posted on Jul 17, 2014 @ 10:09PM
ఈరోజు సాయంత్రం మలేషియా విమానమొకటి ఉక్రెయిన్-రష్యా సరిహద్దు వద్ద కూలిపోయింది. అందులో 280 మంది ప్రయాణికులు, 15మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. నెదర్ల్యాండ్స్ లో అమెస్టర్ డాంనుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరిన ఈ విమానం, రేపు ఉదయం ఆరు గంటలకు మలేషియాలో కౌలాలంపూరు విమానాశ్రయంలో దిగవలసి ఉంది. కానీ రష్యా సరిహద్దులో గల దొంతెస్క్ అనే ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు ఉక్రేన్ దేశ హోంశాఖ అధికారి అంటన్ గెరషేంకో తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు విమానాన్ని 10కిలోమీటర్ల ఎత్తులో ఉండగా బంకర్ నుండి మిసైల్ తో పేల్చివేసినట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు. విమానం కూలిన చోటుకు చేరుకొన్న రాయిటర్స్ విలేఖరి మండుతున్న విమాన శకలాలు, మృత దేహాలు అంతటా చెల్లా చెదురుగా పడిఉన్నాయని తెలియజేసారు. ఈ ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం కనబడటం లేదని ప్రాధమిక సమాచారం.