రేవంత్ రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
posted on Jun 5, 2015 6:57AM
తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రశ్నించేందుకు ఆయనను తమకు 5రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కూడా నిన్న కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు ఈరోజే కోర్టు విచారణకు చేపడుతుంది. రేవంత్ రెడ్డి తరపున జంద్యాల రవిశంకర్, ప్రమోద్ రెడ్డి అనే ఇరువురు లాయర్లు వాదించనున్నారు. ఈనెల 11వ తేదీన ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఉన్నందున బెయిలు మంజూరు అవుతుందో లేదోననే చాలా ఆందోళనతో ఉన్నారు. కానీ ఏసీబి అధికారులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని ఈకేసు విషయంలో మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్నందున వారు ఆయనకు బెయిలు మంజూరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఒకవేళ బెయిలు మంజూరు కానట్లయితే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమానికి కోర్టు అనుమతి తీసుకొని హాజరవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేస్తుందా లేదా అనే విషయం మరి కొన్ని గంటలలోనే తేలిపోతుంది. ఒకవేళ మంజూరు కాకపోయినట్లయితే లాయర్లు హైకోర్టులో మరో బెయిలు పిటిషన్ దాఖలు చేయవచ్చునని సమాచారం.