టిడిపి కార్యకర్తలకు చంద్రబాబు వరాలు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ చర్యలు ప్రకటించారు. కార్యకర్తల జీవితాలు బాగుచేసే బాధ్యత పార్టీదేనని స్పష్టం చేశారు. ఏడాదికి 5 వేల మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కుటుంబ పెద్దగా కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌవరం ఉండాలని నేతలకు సూచించారు. మహానాడులో పార్టీకి రూ. 12 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటిని కార్యకర్తల బాగుకోసం వినియోగిస్తామని చెప్పారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం కావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు.

బొత్సతో జగన్ నేతల మంతనాలు

పీసీసీ మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు చర్చలు జరపడం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. వైకాపా పార్టీకి చెందిన ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, పార్టీ ప్రముఖ నాయకులు విజయసాయి రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు బొత్స ఇంటికి ఆయనతో చర్చలు జరపడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా బొత్స కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరుతారనే జరుగుతున్న ప్రచారానికి ఈ చర్చలు బలాన్ని చేకురుస్తున్నాయి. ఉత్తరాంద్ర జిల్లాలలో మంచి పట్టున్న నేతైన బొత్స ను పార్టీలోచేర్చుకుంటే తనకి ఎంతో లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నారట. దీని కోసం విశాఖ జిల్లా బాద్యతలు మొత్తం ఆయనకే అప్పగిస్తానని చెబుతున్నాడట. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కని సమయంలో ఆ పార్టీ తరపున విజయనగరంలో పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఘనత బొత్స ఫ్యామిలిదే.

ఏపీ ప్రత్యేక హోదా పై త్వరలోనే నిర్ణయం.. రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విధానంలో రోజుకో నేత రోజుకో విధంగా ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా జరుగుతున్న తంతు ఇదే. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ, ఏపీ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలతో మాట్లాడుతున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి సంబంధించిన కొన్ని సమస్యలు గుర్తించామని, మరికొన్ని గుర్తించాల్సి ఉంటుందని అనంతరం కేంద్రహోంశాఖ కార్యదర్శితో మాట్లాడి అప్పుడు ఏపీ హోదాపై నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

పేదల కోసం కొత్త పథకాలు.. వెంకయ్యనాయుడు

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన కార్యక్రమాలు వాటి విధి విధానాల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, చెప్పే బాధ్యత మాకుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడాది అవుతుందని, మోడీ నేతృత్వంలో ఏడాది పాలన చాలా సంతృప్తికరంగా ఉందని, దేశానికి మంచి నాయకత్వం లభించిందని అన్నారు. 2020 నాటికి ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. గండిపేటలో నిర్వహించిన తెదేపా మహానాడు కార్యక్రమం చివరిరోజు భాగంగా ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఇందుకుగాను చంద్రబాబు తరుపున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు శుక్రవారం నుండి జాతీయఅధ్యక్షునిగా కొనసాగనున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు అనివార్యమైంది.

ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నఈయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. శివరామకృష్ణన్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలువురు రాజకీయనేతలు సంతాపం తెలిపారు.

తల్లిదండ్రులను చంపిన మోడల్.. జీవితఖైదు

తల్లి దండ్రులను హత్య చేసిన కేసులో మోడల్ ప్రియాంకా సింగ్ కు , ఆమెకు సహకరించిన తన స్నేహితురాలు అంజూకు జీవిత ఖైదు శిక్ష పడింది. వివరాల ప్రకారం.. ప్రియాంక సింగ్ ఆమె తల్లిదండ్రులు సంతోష్ సింగ్, ప్రేమ్ వీర్ సింగ్ లు మీరట్ లోని ప్రేమ్ ప్రయోగ్ కాలనీలో ఉండేవారు. అయితే ప్రియాంక సింగ్ కు వారికి ఆస్తి గురించి, కుటుంబ సమస్యలతో తరుచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 2008 సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రియాంకసింగ్ కన్నతల్లిదండ్రులని కూడా చూడకుండా వారిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. అయితే ఈ హత్య కేసులో బరిలో దిగిన పోలీసులకు ప్రియాంకా సింగ్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమ శైలిలో విచారణ చేపట్టేసరికి అసలు నిజం చెప్పింది. తానే తన తల్లి దండ్రులను హత్యచేశాని, తాను సంపాదించిన సొమ్ము తీసుకొని తనను నిర్లక్ష్యంగా చూసేవారని అందుకే హత్య చేశానని అంగీకరించింది. దీంతో ప్రియాంక సింగ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు మీరట్ జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

అప్పుడు అడ్డుకున్నాం.. ఇప్పుడూ అడ్డుకుంటాం.. చంద్రబాబు

ఓయూ యూనివర్సిటీ భూములు విద్యార్ధులకే చెందాలని వాటి జోలికి వస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెదేపా మహానాడు లో చంద్రబాబు మాట్లాడుతూ ఓయూ భూమి విషయం మీద ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులు చేసిన త్యాగం మరువలేనిదని, వారే లేకపోతే అంత తేలికగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు. అలాంటి వారికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చాలా శోచనీయమైనవని అన్నారు. గతంలో కూడా ఓయూ భూములను కబ్జా చేయాలని చూశారు కాని దానిని మేము అడ్డుకున్నాం.. ఇప్పుడు కూడా అడ్డుకుంటామని స్ఫష్టం చేశారు. తెలంగాణలో భూములను కాపాడిన ఘనత మాదే అని అన్నారు. ప్రజలు నమ్మి తెలంగాణను పాలించమని మీ చేతిలో పెడితే మీరు మాత్రం బంగారు తెలంగాణ పేరుతో మీ కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. చంద్రబాబు

  తెదేపా 34వ మహానాడు మూడవరోజు ఘనంగా ప్రారంభమైంది. మూడవ రోజు కూడా ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్ముతో రాజకీయ హత్యలకు పాల్పడిందని, పరిటాల రవిని నిరాయుధుడిని చేసి దారుణంగా హత్య చేశారని దుమ్మెత్తి పోశారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి కాని, రాష్ట్రానికి కాని ఒరిగిందేమి లేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. శాంతి భద్రతలు అనేవి నాగరికతకు చిహ్నం అని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండాలని అన్నారు. వాళ్లకు హాని చేసే ఎలాంటి అరాచక శక్తులనైనా ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. అంతేకాక ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని అన్నారు.

రాందేవ్ బాబా ఫుడ్ పార్కులో తుపాకులు

రాందేవ్ బాబా ఫుడ్ పార్క్ వద్ద ఏడు తుపాకులు, లాఠీలు కనపడటంతో కలకలం రేగింది. హరిద్వార్ లోని పతంజలి పేరుతో రాందేవ్ అమ్మే హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఈ ఫుడ్ పార్క్ లోనే తయారవుతాయి. అయితే ఈ మందులను సరఫరా చేసే విషయంలో ట్రాలీ యూనియన్ నాయకులకు, పార్క్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక వ్యక్తి చనిపోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పార్క్ ను తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు జరిపారు. ఈ సోదాలో పార్క్ లో 7 తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు దొరికాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. అనంతరం రాందేవ్ సోదరుడు రాంభరత్ను ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు ప్రైవేటు గార్డులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

వేరుపడనున్న ప్రగతి రధ చక్రాలు

  వచ్చే నెల 2వ తేదీకి అధికారికంగా రాష్ట్రం విడిపోయి ఒక సంవత్సరం పూర్తవుతుంది. కానీ ఇంకా ఏపియస్ ఆర్టీసీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఇంతవరకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు పూర్తికాకపోవడంతో ఆర్టీసీ విభజన ఆలశ్యమవుతోంది. కానీ జూన్ 3వ తేదీ నుండి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేరువేరుగా పనిచేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో గల బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ నుండి తెలంగాణ ఆర్టీసీ తమతమ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. కానీ వీలయినంత త్వరగా ఆంద్రప్రదేశ్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.   ఇక రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తున్నందున, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్రప్రదేశ్ కి చెందిన ఉద్యోగుల పరిస్థితే కొంచెం అయోమయంలో పడింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులయితే తమకు బస్ భవన్ లో కేటాయించిన ఏ బ్లాక్ లో పనిచేసుకోవచ్చును. కానీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్కులు, డిపో సిబ్బంది వంటి వారిని సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతుంది. వారందరూ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్రాకి తరలిపోవడం సాధ్యం కాదు. అలాగని అక్కడే కొనసాగలేని పరిస్థితి. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో ఆర్టీసీ ఉద్యోగులను విభజిస్తామని ఆర్టీసీ యండీ సాంబశివరావు తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించడం కొంచెం కష్టమేనని చెప్పవచ్చును. ఇక ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన లెక్కలు చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. కానీ ఇంకా దాని పని పూర్తి కాకపోవడంతో మరో రెండు మూడు నెలలయినా గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ పవర్ వాళ్లకు తెలుసు.. అందుకే కలిశారు.. అమిత్ షా

నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ పొత్తు కలుపుకున్నా బీహార్ లో తమ పార్టీకి ఎటువంటి బాధ లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీహార్ లో జీజేపీ కి చాలా సపోర్ట్ ఉందని, పార్టీకి అనుకూల వాతావరణమే ఉందని, ఎన్నికల్లో గెలవడం ఖాయమేనని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటూ, నీకా నాకా అంటూ ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు ఇప్పుడు ఒకే వేదికపై ఉండటం, పైగా తమ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దీనికి కారణం కూడా బీజేపీనేనని.. ఎందుకుంటే బీజేపీ చాలా శక్తివంతమైన పార్టీగా ముందే గుర్తించి చేతులు కలిపారని అమిత్ షా అన్నారు.

అప్పట్లో పెత్తనం సోనియాదే.. మోడీ

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆయన మరోమారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అధికారాలన్నీ పీఎంవో చేతిలో కేంద్రీకృతమయ్యాయన్న ఆరోపణలపై మోడీ స్పందించి, ప్రధాని, అతని కార్యలయం రాజ్యాంగంలోని భాగం... కానీ గతంలో యూపీఏ హయాంలో పీఎంవో పై పెత్తనమంతా సోనియాదేనని, ఆమె అధికారం చలాయించేవారని మండిపడ్డారు. కానీ ఎన్డీఏ హయాంలో రాజ్యాంగబద్ధ పాలన మాత్రమే జరుగతుందని స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల్లో మట్టికరుచుకు పోయిన కాంగ్రెస్ పార్టీ సూటు-బూటు సర్కార్ అంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.

అందగాడు తప్పు చేస్తే ఆడవాళ్లకు ఓకె

తప్పులు ఎవరైనా చేస్తారు అది సహజం. కాని తప్పు చేసినవాళ్లను క్షమించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ క్షమించడంలో కూడా మనిషి అందాన్ని బట్టి తేడా చూపిస్తారట మహిళలు. అదేంటీ అనుకుంటున్నారా... అవునండీ దీనిపై అమెరికాలో అధ్యయనం కూడా జరిగిందట. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని ఈస్టన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్బన్, జొనాథన్ గోర్ అనే పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన జరిపారు. దాదాపు 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలను, అబ్బాయిలను పరిశోధించారట. అమ్మాయిలకు అందంగా ఉన్న అబ్బాయిలను, లేని అబ్బాయిలను చూపించి సందర్బాన్ని సృష్టించి వాళ్లలోని రియాక్షన్స్ బట్టి ఓ నివేదిక తయారుచేశారు. పరిశోధనలో తేలిందేంటంటే కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఈజీగా క్షమించేస్తారట.. కానీ అందంగా లేని వారిని కొంత సమయం వరకు క్షమించినా ఆఖరికి వారికి చెప్పుదెబ్బలు తప్పవంటున్నారు పరిశోధకులు.

కాంగ్రెస్ వాళ్లు చవటలు.. టీఆర్ఎస్ వాళ్లు సన్నాసులు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెదేపా మహానాడులో ఎప్పటిలాగే తన వాక్చాతుర్యాన్ని చూపించారు. మహానాడులో ప్రసంగిస్తూ ఆయన కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు సర్వే పేరిట 12 గంటల్లో ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్నిపందలు ఉన్నాయి అని లెక్కలు చూశారు కానీ 12 నెలలైనా అమర వీరుల లెక్కలు మాత్రం తేల్చలేకపోయారని ఎద్దేవ చేశారు. తెలంగాణ తొలి ఉద్యమంలో అసువులు బాసిన 369 మందికి, మలి ఉద్యమంలో పాల్గొన్న 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వ వహించాడన్న ఒక్క కారణంతో కేసీఆర్‌ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు. ఓ వైపు చవటలు కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఇచ్చామంటారు... మరోవైపు సన్నాసులు టీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ తెచ్చినం. అంటారు. వీళ్లు ఇచ్చినప్పుడు, వాళ్లు తెచ్చుకున్నప్పుడు ఉద్యమంలో అంతమంది చావులకు కారకులెవరని ప్రశ్నించారు. ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయమే మర్చిపోయిందని, తాము కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. వెయ్యికోట్లు పెట్టి అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. బాలకృష్ణ

తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారని అన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ చలవేనని, వాళ్లను అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే నని వెల్లడించారు. చాలా దారుణంగా ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారని, విభజన తరువాత రాష్ట్రాన్నికాపాడగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.