చంద్రబాబుకు కోర్టు నుండి నోటీసులు?.. కేసీఆర్ కు కూడా నోటీసులు?

ఓటుకు నోటు కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందనే అనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏసీబీ, పోలీసు అధికారులు కలిసి చాలా పకడ్భందీగా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏసీబీ అధికారులు మంగళవారం అర్ధ్రరాత్రి ఇద్దరు టీడీపీ నేతలు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల ఇంటికి నోటీసులు జారీ చేసేందుకు వెళ్లారు. నోటుకు ఓటు కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని.. ముందు వీరికి నోటీసులు ఇచ్చి.. ఆతరువాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే మొదట ఏసీబీనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేద్దామనుకున్నా.. కేసీఆర్, పోలీసు అధికారులతో చర్చించిన అనంతరం కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకుంది. కాగా.. ఆడియో వీడియో రికార్డింగులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లగా అక్కడి నుండి వచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని చూసినా.. నివేదిక రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఇప్పటికివరకు తాము సేకరించిన ఆధారాలతో కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఈరోజు తీసుకోనున్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అందరిలో ఆసక్తి నెలకొంది.   ఇదిలా ఉండగా ఈకేసులో చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై అమితుమీ తేల్చుకోవడానికి రె'ఢీ' అయ్యారు. తెలంగాణ సర్కార్ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తరువాత స్టెప్ ఏంటని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్ననేపథ్యంలో ఆయన ఏదైతే అది అయింది వారు నోటీసులు పంపిస్తే.. మనం నోటీసులు పంపిద్దాం.. కేసు పెడితే.. మనం కేసు పెడదాం.. వాళ్లు కోర్టు ద్వారా నోటీసు పంపిస్తే.. మనం కూడా కోర్టు ద్వారా నోటీసు పంపిద్దాం అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమని.. మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆధారాలు పక్కగా ఉన్నాయని ట్యాపింగ్‌కు సంబంధించి ఇద్దరు ఐపీఎస్‌, ఒక ఐఏఎస్‌ అధికారితో పాటు ఇద్దరు ప్రధాన వ్యక్తులు పాత్ర ఉందని వారిని చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపుతామని టీడీపీ నేతలు అంటున్నారు.   ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రాప్రభుత్వానికి మధ్య ఓ పెద్ద రాజకీయ పోరే జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రా మధ్య వివాదాలు ఉన్నా ఈ ఓటుకు నోటు కేసు వల్ల అవి మరింత పెరిగాయనడంలో సందేహం లేదు. చూద్దాం.. ఈ పోరులో గెలుపు ఎవరిదవుతుందో.

నా వెనుక ఎవరూ లేరు: స్టీఫెన్ సన్

  ఓటుకు నోటు కేసు గురించి ఎసిబి అధికారులకు లికిత పూర్వకంగా పిర్యాదు చేసిన నామినేటడ్ ఎమ్యల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఈరోజు ఎసిబి అధికారులు మేజిస్ట్రేట్ ముందు సేకరించబోతున్నారు. ఆయనతో బాటు ఈకేసులో రెండవ నిందితుడిగా పేర్కొనబడిన సెబాస్టియన్ యొక్క కుమార్తె జెస్సీని , వారు నివాసముంటున్న ఫ్లాట్ యజమాని వాంగ్మూలాలను కూడా సేకరించనున్నారు. వారిచ్చిన వాంగ్మూలాలను బట్టి ఎసిబి అధికారులు ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలనే విషయంపై ఒక తుది నిర్ణయం తీసుకొంటారు.   ఈ వ్యవహారంలో ఎమ్యల్యే స్టీఫెన్ సన్ చాలా ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరించినందుకు ఆయన్ని నిన్న క్రీస్టియన్ సంఘాలు సికిందరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో ఘనంగా సన్మానించాయి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ వ్యవహారంలో నేను నా అంతరాత్మ ప్రభోదంతోనే నడుచుకొన్నాను తప్ప నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. అనేక దశాబ్దాలుగా నేను చేస్తున్న వ్యాపారం ద్వారా కనీసం కోటి రూపాయలు కూడా సంపాదించలేకపోయాను. నేను చాలా సామాన్యుడిని మధ్యతరగతికి చెందినవాడిని. అయినా డబ్బు కోసం ఆశపడకుండా నాకు ఏది మంచిది అనిపిస్తే అదే చేసాను. ఇందులో ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేదు. దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేయగలిగినప్పుడే నాయకుడనిపించుకొంటాడని నా అభిప్రాయం. ఇంతకాలం నన్ను మన క్రీస్టియన్ సోదరులు నన్ను కేవలం ఒక ఆంగ్లో ఇండియన్ గా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు మీరందరూ నన్ను మీ ప్రతినిధిగా గుర్తించి గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.

సండ్ర వీరయ్యకు ఎసిబి నోటీసులు జారీ

  ఓటుకు నోటు వ్యవహారంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెదేపా ఎమ్యల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఎసిబి నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేసింది. కానీ హైదర్ గూడాలో గల ఎమ్యల్యే క్వార్టర్స్ లో ఆయన నివసించే క్వార్టర్ నెంబర్:208కి తాళం వేసి ఉండటంతో ఇక చేసేదేమీ లేక గోడకి ఆ నోటీసు అంటించి వెనుతిరిగారు. తక్షణమే ఎసిబి విచారానాదికారుల ముందు విచారణకు హాజరు కావలసిందిగా నోటిసులో పేర్కొన్నారు. ఈ సంగతి తెలుసుకొన్న వీరయ్య మీడియాతో మాట్లాడుతూ, నాకు ఇంతవరకు ఎటువంటి నోటీసులు అందలేదు. ఒకవేళ అందినట్లయితే నిర్దేశిత సమయంలోగా వారికి జవాబు ఇస్తాను,” అని అన్నారు.

వేం నరేందర్ రెడ్డికి కూడా ఎసిబి నోటీసులు జారీ

  ఇటీవల జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికి ఎసిబి అధికారులు నిన్న రాత్రి నోటీసులు అందజేశారు. ఓటుకు నోటు వ్యవహారం ఆయనను గెలిపించుకోనేందుకే మొదలయింది కనుక ఈకేసులో ఆయనను కూడా ప్రశ్నించాలని ఎసిబి అధికారులు భావిస్తునందునే ఆయనకీ నోటీసులు జారీ చేసారు. ఆయనని తమతో పాటు విచారణకు రావలసిందిగా వారు కోరినప్పుడు, తాను గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాని, కనుక బుదవారం ఉదయం విచారణకు హాజరవుతానని ఆయన హామీ ఇవ్వడంతో వారు ఆయన చేతికి నోటిసు అందజేసి వెనుతిరిగారు. కానీ ఆ మరుక్షణమే ఆయన ఇంటి చుట్టూ పోలీసులను మొహరించారు. బహుశః ఆయన తప్పించుకొని పారిపోకుండా చూసేందుకే పోలీసులను ఆయన ఇంటి చుట్టూ మొహరించారేమో?

చంద్రబాబు ఇంటికి నో ఎంట్రీ

ఓటుకు నోటు కేసు వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరికి వారు సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును ఈ కేసులో ఎలా ఇరికించాలా అని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు వారిని ఎలా ఎదుర్కోవాలా అని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏసీబీ మాత్రం ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా వదలకుండా మరీ దర్యాప్తు చేస్తుంది. దీనిలో అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఆధారంగా ముఖ్యమంత్రితో పాటు పలువరికి నోటీసులు జారీ చేసేందుకు సన్నద్దమయ్యారు.   మరోవైపు చంద్రబాబు తన నివాసం వద్ద గట్టి భద్రతే ఏర్పాటు చేశారు. తమ సమాచారాన్ని లీక్ చేసే ప్రమాదం ఉందన్న అనుమానంతో కనీసం ఎవరిని తన ఇంటి వద్ద కలిసేందుకు కూడా ఒప్పకోవడం లేదు. ఎదైనా పనుంటే సెక్రటేరియట్‌కో లేదా క్యాంప్‌ ఆఫీసుకో కుదరకపోతే పార్టీ ఆఫీసులో వచ్చి కలవాలని కఠిన అదేశాలే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత ఐదురోజులనుండి వరుసగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్నా.. సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందనే అనుమానంతో కనీసం పార్టీ నేతలను సమావేశాలకు దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

సెక్షన్-8 ఎందుకు చెల్లదు... దేవినేని

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా నిప్పుల వర్షం చెరిగారు. కుట్రలు పన్ని ఏపీ తెదేపా నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ధైర్యం ఉంటే ఎదురుదాడికి తిరగాలికాని.. ఇలా దొంగదారిలో చేయడం చాలా నీచమని మండిపడ్డారు. హైదరాబాద్ ఏమి కేసీఆర్ సొత్తుకాదని కావాలనే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 8 ప్రకారం అమలుచేయాలని, దాని ప్రకారమే గవర్నర్కు తన బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు.

అందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకో?

  నేడు కాకపోతే రేపయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోక తప్పదన్నట్లుగా మాట్లాడుతున్న కాంగ్రెస్, వైకాపా, తెరాస పార్టీల నేతలందరూ, ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో కూడా వారే నిర్ణయించేయడం విశేషం. బాలకృష్ణకు ముఖ్యమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని తెరాస, కాంగ్రెస్ నేతలు సర్టిఫై చేస్తున్నారు కూడా. అయితే వారందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకు? ఆయనంటే వారికి అంత అభిమానమా? అని ఆలోచిస్తే కాదని అందరికీ తెలుసు.   పార్టీలో ఎవరికి ఎటువంటి స్థానం కల్పించాలి? అనే విషయం ఆయా పార్టీల అంతర్గత విషయమేనని అందరికీ తెలుసు. కనుక ఇతర పార్టీలు బాలకృష్ణ పేరును ప్రతిపాదించడం వెనుక వారికి ఏవో దురుదేశ్యాలున్నట్లు స్పష్టమవుతోంది. బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తే తెదేపాలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పే సాహసం చేయలేరని ఇతర పార్టీలకి తెలుసు. అలాగని ఎటువంటి రాజకీయ, పరిపాలనానుభవం లేని బాలకృష్ణను ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కూడా చేయలేదని వారికి తెలుసు. ఈ సంగతి తెలిసే వారు బాలకృష్ణ పేరును వారు ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించినా లేదా పార్టీలో ఆయన మద్దతుదారులు ఆ ప్రతిపాదనను బలపరిచినా తెదేపాలో మరో ముసలం పుట్టడం ఖాయం. అందుకే వారు ఆయన పేరును ముందుకు తీసుకువచ్చి తెదేపాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.   అయితే ఒకవేళ తెదేపా నిజంగానే బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చేసినట్లయితే, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేస్తున్న ప్రతిపక్షాలే రేపు ఆయన అనుభవరాహిత్యం కారణంగా సరిగ్గా ప్రభుత్వాన్ని నడిపించలేకపోయినా, తప్పటడుగులు వేసినా తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడి అదొక అసమర్ధ ప్రభుత్వమని విమర్శించడం ఖాయం. అయితే సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడి పరిపాలననే తప్పుపడుతూ నిత్యం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఎటువంటి పరిపాలనానుభవం లేని భోళాశంకరుడు వంటి బాలకృష్ణ ముఖ్యమంత్రి అయినట్లయితే ఆయనతో చెడుగుడు ఆడేసుకొంటాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇక సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన అంశాలను పట్టుకొని తెరాస మంత్రులు కూడా ఆయనతో ఒక ఆటాడేసుకొంటారని వేరేగా చేపనవసరం లేదు. అందుకే వారు ముక్త కంఠంతో బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తున్నారని భావించవచ్చును.   అయితే చిరకాలంగా రాజకీయాలలో ఉన్న బాలకృష్ణ ప్రతిపక్షాల ఈ ఆలోచనలను పసికట్టలేనంత అమాయకుడేమీకారు కనుకనే ఆయన వారి మాటలను పట్టించుకోలేదు, స్పందించడం లేదు. ఇక మరో కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయడం తప్పదనే భావన ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా తెదేపా శ్రేణుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ఈవిధంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలు ఆడుతున్న ఈ “మైండ్ గేమ్స్”ని తెదేపా నేతలు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.

సెక్షన్ 8 పై ఇద్దరు సీఎంల పోరు... కేంద్రాన్నైనా ఢీకొంటాం.. కేసీఆర్

ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయమని పట్టుబడుతుంటే.. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అనసరం లేదని చెపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఅర్, గవర్నర్ భేటీ అయి గంటన్నరపాటు చర్చించుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నట్టు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో చట్టం తన పని తాను చేసుకపోతుందని, దీనిని అడ్డంపెట్టుకొని సెక్షన్ 8 అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని దీనిని మేము ప్రతిఘటిస్తామని గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రంతో పోటీ పడటానికైనా సిధ్దమని కేసీఆర్ తెలిపారు. తెదేపా నేతలు తమ ఫోన్ ట్యాపింగ్ లకు గురయ్యాయని తెగ మొత్తుకుంటున్నారు కానీ అలా చేయలేదని దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీబీ కేంద్రానిక సమర్పించిందని కేసీఆర్ అన్నారు.   మరోవైపు ఏపీ చంద్రబాబు కూడా సెక్షన్ 8 అమలుపై చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతిలతో సమావేశమయ్యారు. సెక్షన్‌ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించారు. చూడాలి ఇద్దరి సీఎంలలో ఎవరి పట్టదల నెగ్గుతుందో.

గవర్నర్ రాజీనామా?

నోటుకు ఓటు కేసులో వ్యవహారంలో అందరి పరిస్థితి ఏమో కానీ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కి మాత్రం మొట్టికాయలు తప్పట్లేదు. అందరూ ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లే. ముఖ్యంగా తెదేపా శ్రేణులు గవర్నర్ వ్యవహారంపై గుర్రుమంటున్నారు. అటు ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఫోన్లు ట్యాపింగ్ విషయంలో, కేసు విషయంలో గవర్నర్ ఏం పట్టించుకోవడం లేదని.. వివక్ష చూపుతున్నారని.. తమకు భద్రత లేకుండా పోయిందని తిట్టి పోయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సెక్షన్ 8 అమలు పై గవర్నర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. దాని ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామాకు సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజీనామా చేస్తానన్న గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం బుజ్జగిస్తున్నట్టు, మరోవైపు గవర్నర్ మార్పు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాజధాని భూమ్.. పెరిగిన ట్యాక్స్..

ఆంధ్రరాష్ట్ర నూతన రాజధానికి నిర్మాణానికి శంకస్థాపన ఒక్కటే జరిగింది... ఇంకా నిర్మాణం ప్రారంభం కూడా కాలేదు. కానీ అప్పుడే నూతన రాజధాని ప్రభావం వల్ల విజయవాడ నగరంలో ట్యాక్స్ 19 లక్షలకు పెరిగింది. గడిచిన రెండు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 19 లక్షల ట్యాక్స్ ను పొందగా అందులో విజయవాడ మొదటి డివిజన్ నుండి 12.4 లక్షల ట్యాక్స్ రాగా విజయవాడ రెండవ డివిజన్ నుండి 6.69 లక్షల ట్యాక్స్ వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అది కూడా ఎక్కువ మంది వీఐపీ లు రాజధానికి చూడటానికి వచ్చి వెళుతున్న నేపథ్యంలో అంతేకాక కొద్ది మంది మంత్రులు మాత్రమే తమ నివాసాలను మార్చుకోవడం వల్ల ట్యాక్స్ ఇంత పెరిగిందని తెలుస్తోంది. కొద్ది మంత్రులు వస్తేనే ఇంత ట్యాక్య్ పెరిగిందంటే ఇంకా సీఎం కార్యలయ్యాన్ని విజయవాడకు మార్చుకొని అక్కడి నుండే విధులు నిర్వహిస్తే ఈ ట్యాక్స్ విలువ కోటి 19 లక్షలు పెరుగుతుందనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.   మరోవైపు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కనుక ప్రారంభమైతే అక్కడ ట్యాక్స్ 4.39 కోట్లు వచ్చే అవకాశం ఉందని.. భవిష్యత్ లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అలాకనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ కు ఉన్న లోటు బడ్జెట్ కు కొంత వరకు ఊరట కలిగించినట్టే.

ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలి..

ఓటుకు నోటు కేసులో తెదేపాను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు బాగానే ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారిందనే చెప్పాలి. అటు కాంగ్రెస్ నేతలు, వైకాపా నేతలు తెదేపాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రా ముఖ్యమంత్రులపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తమ హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని.. అసలు ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలని అన్నారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.

చంద్రబాబు.. కేసీఆర్.. ఢీ అంటే ఢీ

నోటుకు ఓటు కేసులో ఇరు రాష్ట్రాల నేతలు ఎవరి వ్యూహాలతో వాళ్లు ముందుకెళుతున్నారు. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకోవాలని, ఎలాగైనా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని చూస్తుంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం తమపై ఉన్న ఆరోపణలను ఎలాగైనా చేధించాలనే కసితో ఉంది. ఈ కేసు ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఒక సవాల్ గా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు తలమునకలై ఉన్నారు. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డింగులను, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా దానికి సంబంధించిన నివేదిక రానుంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఈ కేసులో అత్యంత కీలక సమాచారం స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యారు.   ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తమ పనిలో తాము ఉండగా చంద్రబాబు ఏలాగైనా వారిని ఎదుర్కోవాలనే పనిలో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిగ్గు తేల్చాలని స్పెషల్ ఇన్వేస్టిగేటింగ్ టీమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్‌ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనూరాధతో కలిసి సమావేశమయి సిట్ ను ఏర్పాటు చేయనున్నారు. అసలే ఈ వ్యవహారంపై లీగల్ యాక్షన్ తీసుకుందామని సమాలోచనలో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ఉన్న లొసుగులు దానికి సంబంధించి పలు అంశాలపై పోలీసు అధికారులను అడిగి తెలుకొని దానిని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.   మొత్తానికి ఓటుకు నోటు కేసులో తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కేసీఆర్ వేసే ఎత్తుగడలను ఎలా తిప్పి కొట్టాలో చంద్రబాబు ప్రయత్నాలలో చంద్రబాబు ఉన్నారు. ఆఖరికి ఈ పోరులో ఎవరు గెలుస్తారో!...

రేవంత్ కు రిమాండ్ పొడిగింపు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంకా కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదని ఇంకా సాక్షులను విచారించాల్సి ఉందని ఇందుకోసం సమయం కావాలని ఏసీబీ అధికారులు కోర్టులో మమో దాఖలు చేశారు. అంతేకాకుండా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా నివేదిక అందలేదని కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో రేవంత్‌తో పాటు మిగిలిన వారి రిమాండ్‌ను కూడా జూన్ 29వ తేది వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ పై జనాగ్రహం.. రాజకీయాల్లో తప్పటడుగులు

  'నరం లేని నాలుక ఎన్ని రకాలైనా మాట్లాడుతుంది' అంటారు.. ఈ సామెత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా సూటవుతుంది. అసలు జగన్ రాజకీయాలు చూస్తుంటే ఎవరైనా ముక్కునవేలేసుకోవాల్సిందే. ఏదో చేద్దామనుకొని ఇంకేదో చేసి తానే తప్పటడుగులు వేస్తున్నారు. మరీ ఎక్కువ రాజకీయాలు చేసి అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ఎటూకాకుండా పోతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎంకు జగన్ మద్దతివ్వడంతో ఇప్పటికే ఆంధ్రా వాళ్లు జగన్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద అక్కసుతో జగన్ మోహన్ రెడ్డి పలికిన ప్రతి మాట కేసీఆర్ కు మద్దతిచ్చేదిగా ఉండటంతో జగన్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఎలాగైనా చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్నారు కానీ.. మరో కోణంలో ఆంధ్రా వారినుండి వ్యతిరేకత వస్తుందని ఆలోచించలేక పోయారు.     ఇప్పుడు ఎలాగో మేలుకొని ఏపీ ప్రజల వ్యతిరేకతను గుర్తించారేమో జగన్ సడన్ గా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసినప్పుడు మౌనంగా ఉన్న జగన్ కు అప్పుడు గుర్తుకురాని అనుమతులు ఇప్పుడు అంత సడెన్ గా ఎందుకు గుర్తోచ్చాయో? ఎందుకంటే ఆ రకంగా ఏదో తెరాసకు వ్యతిరేకం అని చెప్పుకోవడానికే అన్నట్టు ఉంది. అప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ఆపాలంటూ కేంద్రమంత్రులందరినీ కాకా పట్టిన జగన్ ఇప్పుడు ఏదో నామమాత్రంగా పాలమూరు ప్రాజెక్టుపై ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే ఎలాగూ అటూ ఆంధ్రాలో జనాలు జగన్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. ఏదో ఇలా చేస్తే తాను కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నానని తెలపడానికి ఏదో చిన్న ప్రయత్నం చేశారు. ఏదీ ఏమైనా జగన్ మాత్రం ఓ కన్ప్యూజన్ స్టేట్ ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు మీద కోపంతో తెరాసకు మద్దతిస్తే ఇటు ఆంధ్రాలో పూర్తి వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. మరోవైపు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలే అక్కడ అంతంత మాత్రంగా ఉన్న పార్టీ తట్టాబుట్టా సర్దుకొని రావాల్సి ఉంటుంది. చివరికి ఏదో చేయబోయి జగన్ తన చేతులు తానే కాల్చుకుంటాడేమో.

కాంగ్రెస్ నేత షీలా కౌల్ మృతి

  కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్ శనివారం సాయంత్రం ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. వృద్దాప్యం చేత వచ్చే ఆరోగ్యసమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. గతంలో ఆమె హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేసారు. ఆమె ఐదు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మాజీ భారత ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూకి మరదలు. ఆదివారం సాయంత్రం డిల్లీలో 4.30 గంటలకు ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితర అనేకమంది కాంగ్రెస్ ప్రముఖులు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు.