నా వెనుక ఎవరూ లేరు: స్టీఫెన్ సన్
posted on Jun 17, 2015 @ 10:03AM
ఓటుకు నోటు కేసు గురించి ఎసిబి అధికారులకు లికిత పూర్వకంగా పిర్యాదు చేసిన నామినేటడ్ ఎమ్యల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఈరోజు ఎసిబి అధికారులు మేజిస్ట్రేట్ ముందు సేకరించబోతున్నారు. ఆయనతో బాటు ఈకేసులో రెండవ నిందితుడిగా పేర్కొనబడిన సెబాస్టియన్ యొక్క కుమార్తె జెస్సీని , వారు నివాసముంటున్న ఫ్లాట్ యజమాని వాంగ్మూలాలను కూడా సేకరించనున్నారు. వారిచ్చిన వాంగ్మూలాలను బట్టి ఎసిబి అధికారులు ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలనే విషయంపై ఒక తుది నిర్ణయం తీసుకొంటారు.
ఈ వ్యవహారంలో ఎమ్యల్యే స్టీఫెన్ సన్ చాలా ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరించినందుకు ఆయన్ని నిన్న క్రీస్టియన్ సంఘాలు సికిందరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో ఘనంగా సన్మానించాయి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ వ్యవహారంలో నేను నా అంతరాత్మ ప్రభోదంతోనే నడుచుకొన్నాను తప్ప నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. అనేక దశాబ్దాలుగా నేను చేస్తున్న వ్యాపారం ద్వారా కనీసం కోటి రూపాయలు కూడా సంపాదించలేకపోయాను. నేను చాలా సామాన్యుడిని మధ్యతరగతికి చెందినవాడిని. అయినా డబ్బు కోసం ఆశపడకుండా నాకు ఏది మంచిది అనిపిస్తే అదే చేసాను. ఇందులో ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేదు. దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేయగలిగినప్పుడే నాయకుడనిపించుకొంటాడని నా అభిప్రాయం. ఇంతకాలం నన్ను మన క్రీస్టియన్ సోదరులు నన్ను కేవలం ఒక ఆంగ్లో ఇండియన్ గా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు మీరందరూ నన్ను మీ ప్రతినిధిగా గుర్తించి గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.