అందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకో?
posted on Jun 16, 2015 @ 12:23PM
నేడు కాకపోతే రేపయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోక తప్పదన్నట్లుగా మాట్లాడుతున్న కాంగ్రెస్, వైకాపా, తెరాస పార్టీల నేతలందరూ, ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో కూడా వారే నిర్ణయించేయడం విశేషం. బాలకృష్ణకు ముఖ్యమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని తెరాస, కాంగ్రెస్ నేతలు సర్టిఫై చేస్తున్నారు కూడా. అయితే వారందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకు? ఆయనంటే వారికి అంత అభిమానమా? అని ఆలోచిస్తే కాదని అందరికీ తెలుసు.
పార్టీలో ఎవరికి ఎటువంటి స్థానం కల్పించాలి? అనే విషయం ఆయా పార్టీల అంతర్గత విషయమేనని అందరికీ తెలుసు. కనుక ఇతర పార్టీలు బాలకృష్ణ పేరును ప్రతిపాదించడం వెనుక వారికి ఏవో దురుదేశ్యాలున్నట్లు స్పష్టమవుతోంది. బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తే తెదేపాలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పే సాహసం చేయలేరని ఇతర పార్టీలకి తెలుసు. అలాగని ఎటువంటి రాజకీయ, పరిపాలనానుభవం లేని బాలకృష్ణను ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కూడా చేయలేదని వారికి తెలుసు. ఈ సంగతి తెలిసే వారు బాలకృష్ణ పేరును వారు ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించినా లేదా పార్టీలో ఆయన మద్దతుదారులు ఆ ప్రతిపాదనను బలపరిచినా తెదేపాలో మరో ముసలం పుట్టడం ఖాయం. అందుకే వారు ఆయన పేరును ముందుకు తీసుకువచ్చి తెదేపాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఒకవేళ తెదేపా నిజంగానే బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చేసినట్లయితే, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేస్తున్న ప్రతిపక్షాలే రేపు ఆయన అనుభవరాహిత్యం కారణంగా సరిగ్గా ప్రభుత్వాన్ని నడిపించలేకపోయినా, తప్పటడుగులు వేసినా తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడి అదొక అసమర్ధ ప్రభుత్వమని విమర్శించడం ఖాయం. అయితే సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడి పరిపాలననే తప్పుపడుతూ నిత్యం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఎటువంటి పరిపాలనానుభవం లేని భోళాశంకరుడు వంటి బాలకృష్ణ ముఖ్యమంత్రి అయినట్లయితే ఆయనతో చెడుగుడు ఆడేసుకొంటాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇక సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన అంశాలను పట్టుకొని తెరాస మంత్రులు కూడా ఆయనతో ఒక ఆటాడేసుకొంటారని వేరేగా చేపనవసరం లేదు. అందుకే వారు ముక్త కంఠంతో బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తున్నారని భావించవచ్చును.
అయితే చిరకాలంగా రాజకీయాలలో ఉన్న బాలకృష్ణ ప్రతిపక్షాల ఈ ఆలోచనలను పసికట్టలేనంత అమాయకుడేమీకారు కనుకనే ఆయన వారి మాటలను పట్టించుకోలేదు, స్పందించడం లేదు. ఇక మరో కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయడం తప్పదనే భావన ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా తెదేపా శ్రేణుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ఈవిధంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలు ఆడుతున్న ఈ “మైండ్ గేమ్స్”ని తెదేపా నేతలు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.