మీరు భేటీ అయ్యారా? లేదా?.. యనమల

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఎప్పుడు ఏ వార్త వినిపిస్తుందో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి యనమల రామకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పదిరోజుల ముందే వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ముగ్గురూ భేటీ అయ్యారని బాంబు పేల్చారు.   ఆంధ్ర రాష్ట్రంలో తెదేపా ఎదుగుదల చూసి..తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెదేపా అధికారంలోకి వస్తుందనే భయంతో ఇలాంటి కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి పోయింది.. అలాగే వైకాపా ఉనికి కూడా పోతుందనే భయంతో జగన్ కేసీఆర్ తో కలిసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే జగన్, హరీశ్, స్టీఫెన్ సన్ ముగ్గురు భేటీ అయి చంద్రబాబుపై కుట్ర పన్నారని.. మీరు ముగ్గురు కలిసి భేటీ అయ్యారా? లేదా? అని.. దమ్ముంటే నేనడిగే 24 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యనమల ప్రశ్నించారు.

టెయిల్‌పాండ్‌పై తెలంగాణ, ఆంధ్రా వాదనలు.. మాది.. కాదు మాది

కలిసి విడిపోదాం.. విడిపోయినా అన్నదమ్ముల ఉందాం అని తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర్రాలు.. రాష్ట్రం విడిపోయేముందు ఎన్నో ప్రగల్భాలు పలికాయి. కానీ అవి మాటల వరకే అని చాలా తక్కువ సమయంలోనే నిరూపించి చూపాయి. ఇప్పటికే ఎన్నో వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరిగిపోతుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఒకటి.. ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య సమరానికే తెరలేపింది.. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మాటలయుద్ధాలు రోజురోజుకు పెరతున్నాయే తప్ప తగ్గడంలేదు.   మళ్లీ ఇప్పుడు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ మాదంటే మాదని రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. నిర్మాణ ఖర్చుమొత్తం తెలంగాణ ప్రభుత్వంపై వేశారని అది మాకే చెందుతుందని ఒకవైపు తెరాస సర్కార్ అంటుంది. టెయిల్ పాండ్ నిర్మాణానికి మొత్తం రూ.400కోట్లు ఖర్చయిందని.. ఆ రుణం మొత్తాన్ని విద్యుత్ శాఖ విభజన అప్పుడు తెలంగాణ జెన్‌కో ఖాతాలో వేశారని.. ఇప్పుడు డ్యాం నిర్వహణను ఇవ్వనంటే ఎలా కుదురుతుందని తెలంగాణ సర్కార్ వాదిస్తుంది.   మరోవైపు టెయిల్ పాండ్ ఆంధ్రా అంతర్భాగంలో ఉందని ముమ్మాటికీ మాకే చెందుతుందని ఏపీ సర్కార్ మొత్తుకుంటుంది. టెయిల్ పాండ్ డ్యాం ఆధారంగా 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. దీనికి అయ్యే వ్యయభారమంతా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని.. డ్యాం నిర్మాణానికి కోట్లు ఖర్చు చేశామంటున్న తెలంగాణ ప్రభుత్వం వాదన సరికాదని.. ఎలాంటి వివాదాలు లేని ప్రాజెక్టుపైనా పేచీ పెట్టడం సరికాదని ఏపీ జెన్ కో అధికారులు అంటున్నారు. మొత్తానికి ఏ చిన్న విషయంమైనా తెలంగాణ, ఆంధ్రా అనే మాట మాత్రం ముందు బయటకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హైకోర్టులో మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వాదనలు మాని సమస్యను సవ్యంగా పరిష్కరించుకుంటే మంచిది.

టీ-న్యూస్ ఛానల్ కి ఏపీ పోలీస్ నోటీసు జారీ

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు-స్టీఫెన్ సన్ మాట్లాడినవి చెప్పబడుతున్న టేపులను టీ-న్యూస్ ఛానల్ జూన్ 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు ప్రసారం చేసి, టెలిగ్రాఫిక్ చట్టంలో సెక్షన్: 19ని ఉల్లంఘించినందుకు విశాఖనగర ఎసిపి రమణ నిన్న అర్ధరాత్రి ఆ చానల్ సిఈఓ నారాయణ రెడ్డికి నోటీసు అందజేశారు. మూడు రోజులలోగా ఆ నోటీసుకి సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. టీ-న్యూస్ ఛానల్, సాక్షి న్యూస్ ఛానల్ మరియు ఆంధ్రా, తెలంగాణాకి చెందిన కొందరు రాజకీయ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నందున వారిపై తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా విశాఖపట్నంలో ప్రముఖ న్యాయవాది యన్.వి.వి. ప్రసాద్ తన పిర్యాదులో కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగానే టీ-న్యూస్ ఛానల్ కి నిన్న నోటీసు జారీ చేయబడ్డాయి. బహుశః సాక్షి ఛానల్ కి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తారేమో?

టేపుల డీకోడింగ్ ప్రారంభించిన ఫోరెన్సిక్ ల్యాబ్

నోటుకు ఓటు కేసులో ఎన్నో పరిణామాలు చోటుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ఆధారాలు సేకరించారు తెలంగాణ ఏసీబీ అధికారులు. మరోవైపు ఆంధ్రాప్రభుత్వం కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయన్న వ్యవహారంపై ఆధారాల కోసం ప్రయత్నిస్త్తోంది. ఇదిలా ఉండగా ఈకేసులో ఎంతో కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలం కూడా ఏసీబీ కోర్టులో నమోదుచేసుకున్నారు. ఆ వాంగ్మూలం శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు కూడా వచ్చింది. ఈ కేసులో భాగంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్పుడు తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇప్పుడు ఆడియో, వీడియో టేపులను విడిగా కాపీచేసి వాటిలోని నిజనిజాలు తెలుసుకునేందుకు సిద్ధమయింది. దీనికోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేయగా.. ఈ బృందాలు ఇప్పటికే వాటిని డీకోడింగ్ చేసే పనిని మొదలుపెట్టేశాయి.

అన్ని పాఠశాలలకు వైఫై సౌకర్యం అందిస్తాం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు. దీనిలో భాగంగా ఆయన అక్కడ నిర్వహించిన 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్నిపాఠశాలలకు వైఫై సౌకర్యం అందిస్తామని.. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలని అన్నారు. ఇకనుండి విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని.. రాష్ట్రాన్ని ఓ నాలెడ్జ్ హబ్ గా మారుస్తానని తెలిపారు. అన్ని శాఖలకంటే విద్యాశాఖకే ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు, విద్యాసంస్థలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చేకూరుస్తామని స్పష్టం చేశారు.

స్టీఫెన్ సన్ వాంగ్మూలం నాకు కావాలి.. రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకమైన తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్నీ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు చేరింది. అయితే ఈ నేపథ్యంలో స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం గురించి తనకు తెలియాలంటూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్ సన్ ఏం వాంగ్మూలం ఇచ్చాడో తెలుసుకోవాలని.. తెలుసుకునే అవసరం తనకు ఉందని.. దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్ సన్ చెప్పిన వాంగ్మూలం పరిశీలించిన తరువాతే ఈకేసులో ఎలా ముందుకెళ్లాలన్న నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డికి ఈనెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే.

అయ్యో! ఆయన వేములవాడ వెళ్ళారా?

  కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గురించి ఎరుగని వారుండరు. సుదూర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా వేములవాడ స్వామి వారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. కానీ అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు మాత్రం స్వామివారి పేరు చెపితే హడలిపోతుంటారు. ఎందుకంటే ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినవారి పదవులు ఊడిపోతుంటాయి! అది కాకతాళీయమో లేకపోతే రాజకీయనాయకులకి నిజంగానే అటువంటి శాపమేమయినా ఉందేమో తెలియదు కానీ ఇంతకు ముందు రాజన్న దర్శనం చేసుకొన్న ముఖ్యమంత్రులు టీ అంజయ్య, కే విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావులు పదవులు కోల్పోయారు. అందుకే మంత్రులెవరూ ఆ గుడి ఛాయలకి కూడా వెళ్ళే సాహసం చేయరు.   కానీ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవిత, పార్టీకి చెందిన మరికొందరు నేతలని వెంటబెట్టుకొని ఆ గుడికి వెళ్లి అక్కడ హోమాలు అవీ నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రులందరూ కేసీఆర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించినందుకు ఆయన త్వరలోనే తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోక తప్పదని బల్లగుద్ది గట్టిగా వాదిస్తున్నారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ ఆ సెంటిమెంటును పక్కనబెట్టి వేములవాడ స్వామి వారిని దర్శనం చేసుకొని వచ్చేరు. ఇంతకుముందు మాజీ ప్రధాని స్వర్గీయ నరసింహరావు కూడా ఆ గుడికి వెళ్ళేరు కానీ, ఆయన కుర్చీకేమీ కాలేదు. కనుకనే కేసీఆర్ కూడా దైర్యం చేసారేమో? మరి ఆ సెంటిమెంటు ఎఫెక్ట్ ఉందో లేదో త్వరలోనే తేలిపోతుంది. కేసీఆర్ పదవికి ఏమీ కాకపోయినట్లయితే ఇక మిగిలిన మంత్రులందరూ కూడా నిర్భయంగా రాజన్న దర్శనానికి వెళ్లి రావచ్చును.

అయ్యో!బొత్స అప్పుడే రాజకీయ సన్యాసమా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి ఏడాదిపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతికే సూచనలు కనబడటం లేదంటూ భారంగా ఒక నిట్టూర్పు విడిచి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈమధ్యనే వైకాపాలోకి జంపేసారు. కానీ ఇంకా పార్టీలో పూర్తిగా కుదురుకోకముందే మళ్ళీ ఆయన రాజకీయ సన్యాసానికి సిద్దపడుతున్నారని తెలిస్తే రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులందరూ చాలా ఆందోళన చెందడం సహజమే. కానీ వారందరూ సుగర్లు, బీపీలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకొంటే వారి కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేయలేరు. కనుక ఆయనే తన రాజకీయ సన్యాసానికి “కండిషన్స్ అప్ప్లై” అని ఓ స్టార్ మార్క్ పెట్టేసారు.   ఆ కండిషన్ ఏమిటంటే ఎల్విస్ స్టీవెన్సన్ కు ఆ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ వ్రాసారని, అందుకే ఆయన ఇప్పుడు ఈ ఓటుకి నోటు వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానికి కో-ఆపరేట్ చేసారని, ఈ స్కెచ్చ్ వేసేందుకు జగన్మోహన్ రెడ్డి, హరీష్ రావుతో కలిసి సదరు ఎం.యల్యేలతో సరిగ్గా పదిరోజుల క్రితమే సమావేశమయ్యారని ఆంద్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ఒక ఆరోపణ చేసారు. దానిని ఆయన నిరూపిస్తే తను రాజకీయాల నుండి తప్పుకొంటానని బొత్స వారి కండిషన్. కనుక ఆయన వీరాభిమానులెవ్వరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, గుండెలు పగిలిపోకుండా బిగుతయిన దుస్తులు ధరించాలని విజ్ఞప్తి.

సీపీఐ నారాయణ కోర్టుకెక్కుతారుట!

  ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అవిచ్చినంగా సాగుతున్న యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు. కానీ ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు పొరుగింటి పుల్ల కూరే బాగుందని తెగ మెచ్చేసుకొంటుంటే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మీ కూరబాలేదు...మాకూర బాలేదు అంటూ తెరాస మీద కూడా చిందులు వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు కూడా ఇంచుమించు అలాగే డిసైడ్ అయిపోయాయి. కానీ ఎవరి వాదనలు వారు ఎడాపెడా వినిపించేస్తుంటే సీపీఐ నారాయణ ఇక సహించలేక, హైకోర్టులో పిటిషన్లు పడేసేందుకు ఫిక్స్ అయిపోయారుట! ఓటుకి నోటు వ్యవహారం, దానితో బాటు గత ఆర్నెల్లుగా తెలంగాణాలో జరుగుతున్న రాజకీయ కుప్పిగంతుల పోటీల గురించి హైకోర్టులో ఒకటో రెండో పిటిషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారుట!

పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు ప్రశ్నిస్తాడో? రామ్ గోపాల్ వర్మ

  ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాలని, ఆయన ముందుకు వస్తే యావత్ రాష్ట్ర ప్రజలు ఆయన వెనుక సంద్రంలో కదిలివస్తారని రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ లో తెగ మెసేజులు పెట్టేవారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని తను కోరుకొంటున్నట్లు చెప్పేవారు. కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవహర శైలి చూసి రామ్ గోపాల్ వర్మ కంగు తిన్నట్లుంది.   పవన్ కళ్యాణ్ మాటలను అర్ధం చేసుకోవాలంటే రాజకీయ నాయకులు కనీసం ఓ రెండు వారాలు రాజకీయాలకు శలవు పెట్టి ఆలోచించాల్సి ఉంటుందని అయినా అర్ధం చేసుకోవడం సాధ్యం కాదేమోనని ఎద్దేవా చేసారు. ఎన్నో సినిమాలు తీసే తనకు కూడా పవన్ కళ్యాణ్ వ్రాసిన ‘ఇజం’ పుస్తకం లో ఒక్కముక్క కూడా అర్ధం కాలేదని ఎద్దేవా చేసారు. ఆ తరువాత నుండి అప్పుడప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక బాణం వదులుతూనే ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ తీరే అంత అని అందరూ లైట్ గా తీసుకొనేవారు.   మళ్ళీ నిన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద మరో అస్త్రం ప్రయోగించారు. ఆదేమిటంటే “ ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రొహమ్..ఇది కళ్యాణ ద్రోహం. పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు?” అని ట్వీట్ చేసారు.   అయితే ఇప్పటికే చాలా మంది ఈ ప్రశ్నవేసి పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి జవాబు రాబట్టలేక ఊరుకొన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడయినా ప్రజల ముందుకు వచ్చినప్పుడు తాను మీడియాలో వస్తున్న వార్తలను చాలా జాగ్రత్తగా గమనిస్తానని, కానీ ప్రతీ అంశం మీద స్పందించలేనని ఆయనే స్వయంగా చెప్పుకొంటారు. అలాగే తన వింత వింత నిర్ణయాలకు కారణాలు, సంజాయిషీలు ఇచ్చుకోవడం కూడా ఆయనకు షరా మామూలే. కనుక మళ్ళీ ఏదో ఒకనాడు ఆయనకీ ఆవేశం కలిగితే మళ్ళీ జనాల ముందుకు వచ్చి ఇంత కాలం తను ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చిందో...తను ఎందుకు ప్రశ్నించలేకపోయాడో ప్రజలకు సంజాయిషీలు ఇచ్చుకోవచ్చును.   కానీ పవన్ కళ్యాణ్ తన ఈ విచిత్ర వ్యవహార శైలి రాజకీయాలకు ఏమాత్రం పనికిరాదనే విషయం గ్రహిస్తే మంచిది. అన్నయ్య చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి చెయ్యి కాల్చుకొని మళ్ళీ సినిమాలలోకి వెళ్లిపోతుంటే, తమ్ముడు సినిమాలను వదిలి రాజకీయాలలోకి వచ్చి చెయ్యి కాల్చుకోవడం ఎందుకు? అన్నీ స్వంత అనుభవం మీదనే తెలుసుకోనవసరం లేదు కదా?   ఈ విధంగా వ్యవహరించి నిత్యం విమర్శలు ఎదుర్కోవడం కంటే తనకు రాజకీయాలు అబ్బలేదు కనుక మళ్ళీ అందులోకి రానని, ఇకపై సినిమాల మీదే దృష్టి పెడతానని ఒక చిన్న మెసేజ్ పెట్టి చేతులు దులుపుకొంటే మంచిదేమో? మహా అయితే జనాలు కొన్ని రోజులు దీని గురించి చెప్పుకొంటారు, నవ్వుకొంటారు...ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విమర్శలు గుప్పిస్తారు. కానీ ఆ తరువాత క్రమంగా అందరూ మరిచిపోతారు. కానీ అలా చేస్తే ఆయన వీరాభిమానులు మాత్రం చాలా సంతోషిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ వాళ్ళనయినా సంతోషపరిస్తే ఆయన సినిమాలు మూడు హిట్లు ఆరు సూపర్ హిట్లుగా సాగిపోతాయి కదా?

తెలంగాణ డాక్టరే కావాలి.. పరాకాష్ట ఇది

  పిచ్చి పరాకాష్టకు చేరడమంటే ఇదేనేమో.. ఒకవైపు నోటుకు ఓటు కేసుతోనే రెండు రాష్ట్రాల మధ్య, ఇద్దరు సీఎంల మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితి ఏర్పడితే దానికి ఆజ్యం పోసినట్టుగా ఉంది తెలంగాణ కౌన్సిల్ ఛైర్మన్ కె స్వామిగౌడ్ వ్యవహారం. డాక్టర్ ఎవరికైనా డాక్టరే.. వైద్యం కోసం వచ్చిన వాళ్లకి తెలంగాణ పేషెంటో.. ఆంధ్రా పెషంటో తెలుసుకొని వైద్యం చేయరు కదా. కానీ ఆయన మాత్రం తెలంగాణకు సంబంధించిన డాక్టర్లు మాత్రం కావాలని చేసే వ్యాఖ్యలు మాత్రం ఎంతమాత్రం సబబుకాదని తెలుస్తోంది.   దీనికి సంబంధించి స్టేట్ హెల్త్ మినిస్టర్ సీ. లక్ష్మారెడ్డికి కూడా లేఖ రాశారు ఆయన. మెహ్దీ నవాజ్ జంగ్ యూనివర్శిటీ ఆఫ్ ఆంకాలజీ డైరెక్టర్ గా డాక్టర్ ఎన్. జయ లతను నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డా. జయలత  తెలంగాణకు సంబంధించినది.. కాదని ఆమె స్థానంలో మరో డాక్టర్ ని అదికూడా తెలంగాణకు సంబంధించిన డా. చింతమడక సాయిరామ్.. (ఆంకాలజిస్ట్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్) ను నియమించాలని సూచించారు. ఇదే విషయం పై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోసియేషన్ ఎగ్జిక్వ్యూటివ్ మెంబర్ అయిన నరహరి స్పందించి తెలంగాణ డాక్టరో.. ఆంధ్రా డాక్టరో చూసి డైరెక్టర్ చేయలేదని.. మెరిట్ ప్రకారం డా. జయ లతను డైరెక్టర్ గా నియమించామని వివరణ ఇచ్చారు.   ఏదీ ఏమైనా రాష్ట్రం విడిపోయినా ప్రజలలో ఉన్న తారతమ్యాలు మాత్రం ఇంకా వీడలేదు అనడానికి ఇదే ఒక నిదర్శనం. తెలంగాణ రాజకీయ నేతలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది తెలంగాణ రాష్ట్రానికే సమస్యలు తెచ్చిపెట్టక తప్పదు. అయినా రాజకీయ నేతలు వైద్యం చేయించుకోవాలంటే ఏ రాష్ట్రానికి చెందిన డాక్టరో చూడకుండా మంచి డాక్టర్ అయితే చాలు అని ఆలోచిస్తారు.. కానీ పేదల విషయానికి వస్తే మాత్రం వారికి ఎక్కడలేని రూల్స్ అన్నీ గుర్తొస్తాయి.

ఆగస్ట్ లో పట్టిసీమ ఎత్తిపోతల ట్రయల్ రన్

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆది నుండి ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా రాయలసీమ ప్రజలకు నీళ్ళను అందించేందుకు తెదేపా ప్రభుత్వం దైర్యంగా ముందుకే సాగింది. మొదట ఏడాదిలోగా పూర్తి చేయాలని భావించినప్పటికీ ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు రేయింబవళ్ళు చురుకుగా పనులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అవసరమయితే సిసి కెమెరాలు పెట్టి పనుల పురోగతిని తనే స్వయంగా పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడుతానని ఆయన తెలిపారు.   పట్టిసీమ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొని మరీ ముందుకు సాగుతోంది కనుక, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా బాధ్యతగా ప్రాజెక్టును అనుకొన్న గడువు కంటే ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగని ప్రాజెక్టు నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేది లేదని, ఏ మాత్రం నాణ్యత లోపించినా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు అందించడం ద్వారా తమను విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్తామని అన్నారు.   పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పనులు వేగవంతం చేసి వచ్చే నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమయిన భూసేకరణ కార్యక్రమాన్ని వీలయినంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

విమర్శించిన వారికి పట్టిసీమ ఓ సమాధానం.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆగష్టులో ట్రయల్ రన్ నిర్వహిస్తామని.. అంతేకాక పట్టిసీమ పనులు వేగవంతం కావడానికి కెమెరాలు కూడా ఏర్పటు చేస్తామని తెలిపారు. మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు పట్టిసీమ ఒక సమాధానంగా నిలుస్తుందని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించారని.. కానీ అడ్డుకోవడం ఎవరివల్ల కాలేదని అన్నారు. పట్టిసీమ వల్ల ముంపు తప్పుతుందని.. పట్టిసీమను చేపట్టిన ఉత్సాహంతోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిచేసి చూపిస్తామని తెలిపారు.

నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి..చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి తన కపట బుద్ధిని బయటపెట్టింది. ఏపీ ప్రభుత్వంపైనా చంద్రబాబు పైనా తమ అక్కసును ఎన్ని రకాలుగా బయట పెట్టాలో అన్ని రకాలుగా బయటపెడుతోంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపైన ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో.. ఎలా ఆయన్ని ఈ ఉచ్చులోకి లాగాలో తెగ ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తన కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కపెడుతోంది. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న నెలరోజుల లోపు జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వాలి.. ఈ ప్రకారం చంద్రబాబు ఎప్పుడో నెలన్నర ముందు దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది. ఇదేంటి అని అడిగితే సచివాలయంలో ఏపీ సర్కార్ ఉపయోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని జీహెచ్ ఎంసీ కుంటి సాకులు చెపుతోంది. అసలు భవనాల ఆస్తి పన్నుకు, ఇంటి పన్నుకు సంబంధం ఏంటో తెలంగాణ సర్కార్ కు ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదనిపిస్తుంది.   దీనిపై చంద్రబాబు స్పందించి ఒక రాష్ట్రానికి సీఎం అయిన నా పరిస్థితే ఇలా ఉంటే ఇంక ఒక సామాన్యుడి పరిస్థితి ఎంటని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం తమ పెత్తనాన్ని సాగిస్తుందని ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి ఒక సీఎం పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్ ను యుటీ చేయండి... గాలి

తెలుగుదేశం సీనియర్ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెరాస, వైకాపాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కోలేక వైకాపా, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. తెదేపాను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. లేకపోతే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుండి తరిమి కొట్టడానికి హైదరాబాద్ ఏమీ కేసీఆర్ సొత్తు కాదని.. కేసీఆర్ నోరు అదుపులో పట్టుకొని మాట్లాడాలని విమర్శించారు. కేసీఆర్ అలా మాట్లాడుతున్నా గవర్నర్ ఏం పట్టనట్టు ఉండటం మంచిది కాదని.. ఆయన వివక్షతను చూపడం ఆపాలని ఎద్దేవ చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి అమెరికా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుంది

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్న తెరాస ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. నిన్నటి వరకూ పోన్ ట్యాపింగ్ జరగలేదు.. జరగలేదు అని మొత్తుకున్న తెరాస ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలన్నీ మావద్ద ఉన్నాయని చంద్రబాబు, మంత్రులు హెచ్చరించేసరికి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. "ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం.. ఇది ఒట్టి ఆరోపణ కాదు.. తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేశారన్న దానికి మావద్ద ఆధారాలు ఉన్నాయి దీంతో తెరాస ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని" చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెరాస నేతలలో వణుకుపుట్టించినట్టుంది. లేకపోతే అలా చంద్రబాబు హెచ్చరించేసరికి ఇలా కేసీఆర్ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారమేదీ ఇవ్వడానికి వీలులేదంటూ అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేయడం అశ్చర్యకరం. అసలు వాళ్లు ఫోన్లు ట్యాపింగే చేయనప్పుడు సమాచారం ఇవ్వడానికి వీలులేదని ఎందుకు చెపుతారు. దానితో పాటు ఏపీ సర్కారుకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారంట.   మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య వాంగ్మూలం కూడా కీలకం కానుంది. చంద్రబాబును ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని, చంద్రబాబు పేరు చెప్పాలని తనను బెదిరిస్తున్నారని.. రూ కోటి రూపాయలు తీసుకొని స్టీఫెన్ సన్ కు కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారని చెప్పాడు. దీంతో ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనిని బట్టి కేసీఆర్ ఏదో చేయబోయి. ఏదో చేసి చంద్రబాబును ఇరికించబోయి తాను ఇరుక్కునేలా ఉన్నాడు.

నోటుకు ఓటు కేసు రంగంలోకి హోంశాఖ కార్యదర్శి?

ఇరు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం చాలా వేడెక్కి ఉన్నాయి. దీనంతటికి కారణం రేవంత్ రెడ్డి కేసు అని ప్రత్యేకించి ఎవరూ చెప్పనవసరం లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుండి ఈ కేసుకు సంబంధించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వరకూ ఎక్కువ చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ.. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్రం మాత్రం ఈ కేసులో అంత చొరవ తీసుకోలేదు. మరోవైపు జీజేపీకి, టీడీపీకి పొత్తు ఉండటంతో ఈ కేసు వ్యవహారంలో తల దూర్చలేని పరిస్థితి ఏర్పడింది.   ఇప్పుడు ఈ కేసును ఈ సమస్యను తీర్చడానికి ప్రతినిధులను రంగంలోకి దించనుంది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ త్వరలో హైదరాబాద్‌కు రానున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో.. గవర్నర్ తో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి ఇరు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.. ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో అని.. శాంతి భద్రతల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని గవర్నర్ కు సూచించారు.   మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కేసు గురించి ఇన్ని రోజులూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వల్లే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందే రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించినట్టయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో అంటున్నాయి రాజకీయవర్గాలు. కానీ ఇది ఏదో మామూలు కేసు అయితే కేంద్ర ఎప్పుడో చర్యలు తీసుకునేది.. కానీ ఈ కేసు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉండటంతో.. పైగా రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన విషయం కావడంతో తగిన సమయం కోసం చూసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.