చంద్రబాబుకు కోర్టు నుండి నోటీసులు?.. కేసీఆర్ కు కూడా నోటీసులు?
posted on Jun 17, 2015 @ 11:07AM
ఓటుకు నోటు కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందనే అనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏసీబీ, పోలీసు అధికారులు కలిసి చాలా పకడ్భందీగా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏసీబీ అధికారులు మంగళవారం అర్ధ్రరాత్రి ఇద్దరు టీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల ఇంటికి నోటీసులు జారీ చేసేందుకు వెళ్లారు. నోటుకు ఓటు కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని.. ముందు వీరికి నోటీసులు ఇచ్చి.. ఆతరువాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే మొదట ఏసీబీనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేద్దామనుకున్నా.. కేసీఆర్, పోలీసు అధికారులతో చర్చించిన అనంతరం కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకుంది. కాగా.. ఆడియో వీడియో రికార్డింగులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లగా అక్కడి నుండి వచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని చూసినా.. నివేదిక రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఇప్పటికివరకు తాము సేకరించిన ఆధారాలతో కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఈరోజు తీసుకోనున్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా ఈకేసులో చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై అమితుమీ తేల్చుకోవడానికి రె'ఢీ' అయ్యారు. తెలంగాణ సర్కార్ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తరువాత స్టెప్ ఏంటని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్ననేపథ్యంలో ఆయన ఏదైతే అది అయింది వారు నోటీసులు పంపిస్తే.. మనం నోటీసులు పంపిద్దాం.. కేసు పెడితే.. మనం కేసు పెడదాం.. వాళ్లు కోర్టు ద్వారా నోటీసు పంపిస్తే.. మనం కూడా కోర్టు ద్వారా నోటీసు పంపిద్దాం అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమని.. మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆధారాలు పక్కగా ఉన్నాయని ట్యాపింగ్‌కు సంబంధించి ఇద్దరు ఐపీఎస్, ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఇద్దరు ప్రధాన వ్యక్తులు పాత్ర ఉందని వారిని చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపుతామని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రాప్రభుత్వానికి మధ్య ఓ పెద్ద రాజకీయ పోరే జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రా మధ్య వివాదాలు ఉన్నా ఈ ఓటుకు నోటు కేసు వల్ల అవి మరింత పెరిగాయనడంలో సందేహం లేదు. చూద్దాం.. ఈ పోరులో గెలుపు ఎవరిదవుతుందో.