కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేయాలంటున్న రేవంత్

పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమేనంటారు రాజకీయాల్లో తలపండిన మేధావులు, అది ఎన్నోసార్లు రుజువైంది కూడా, ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కోవడానికి ఒక్కోసారి రాజకీయ వైరాన్ని కూడా పక్కనబెట్టేస్తుంటారు.ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అలానే ఉంది. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఆపసోపాలు పడుతున్నాయ్. ప్రతిపక్షాలన్నీ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నా, పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు, ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి...విచిత్రమైన ప్రతిపాదన చేశారట. తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారట. అయితే రేవంత్ ఆలోచన బాగానే ఉన్నా, ఇప్పటికే బీజేపీతో కలిసి చేస్తూ, ఇటు టీడీపీకి, అటు భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ తో కలిసి పోరాడటం సాధ్యమయ్యే పని కాదేమో

నేతాజీ సీక్రెట్ ఫైళ్లు బయటపెట్టిన మమత

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నంత పనీ చేశారు. ఇండియన్ హిస్టరీలోనే టాప్ మిస్టరీగా, అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ వివరాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 64 ఫైళ్లను బయటపెట్టారు. ముందుగా నేతాజీ కుటుంబ సభ్యులకు ఆ పత్రాలను అందించిన బెంగాల్ సర్కార్... అనంతరం ప్రజల సందర్శనార్థం కోల్ కోతాలోని పోలీస్ మ్యూజియంలో ఉంచింది. సోమవారం నుంచి ఈ డాక్యుమెంట్లు ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 12,744 పేజీలున్న 64 ఫైళ్లను డిజిటలైజ్ చేసిన బెంగాల్ ప్రభుత్వం... వాటిని డీవీడీ రూపంలో నేతాజీ ఫ్యామిలీకి అందజేసింది. 1937 నుంచి 47వరకు నేతాజీ జీవితానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేతాజీకి సంబంధించి… కేంద్రం దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా బయటపెట్టాలని, అప్పుడే పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలుస్తాయని కుటుంబ సభ్యులు అంటున్నారు

ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఎస్సై రమేష్ మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నాయని ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. తుది నివేదికను సీల్డ్‌ కవర్‌లో పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామన్న వైద్యులు... రమేష్ తొడలు, అరికాళ్లపై రక్తం కమిలిన గుర్తులతోపాటు,కర్రలతో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. ఎస్సై మృతిపై అనుమానాలు వ్యక్తమవడంతో...తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే తన భర్తను హింసించి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని, దీని వెనుక మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఇద్దరు సీఐల పాత్ర ఉందని, సీబీఐ విచారణ జరిపించాలని రమేష్‌ భార్య గీత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది

టీ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి? ‘ఐవీఆర్ఎస్' ప్రకారం

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు టీ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ పై చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విధానం నేపథ్యంలో ‘ఐవీఆర్ఎస్'  (ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం)ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని గతంలో చంద్రబాబు తెలిపారు. దీనిలో భాగంగానే వారి ద్వారా సేకరించిన అభిప్రాయాన్ని కూడా నేతల ముందుఉంచినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల మంది కార్యకర్తలుండగా వారిలో మెజారిటీ పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం జరిగిందట. మరి కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు వారి మాట ప్రకారం రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో లేదో చూడాలి. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుత పార్టీ కార్యకలాపాలు చూస్తూ అధ్యక్షపదవి కొనసాగిస్తున్న  ఎల్.రమణనే చంద్రాబాబు మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తెలిసినా కాంగ్రెస్ ఆపదు

ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పాయింట్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శ చేద్దామా అన్నట్టు ఉంది. ఇప్పటికే అనేక విషయాల్లో నానా రకాలుగా రాద్దాంతం చేసిన కాంగ్రెస్ వాటివల్ల తమ పార్టీకి ఒరిగేదేం లేదని తెలిసినా కూడా ఏదో తమ వివాదం సృష్టించాలని కదా అని తమ పంతాలో తాము పోతున్నారు. ప్రగతి పధంలో దూసుకుపోతున్న ప్రధానిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగానే అప్పట్లో పార్లమెంట్ సమావేశాలుకూడా సరిగా జరగనివ్వకుండా రచ్చ రచ్చ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపధ్యంలో మరో కొత్త రాజకీయం చేయబోయింది. అదెలాగంటే ప్రధాని మోడీ రేడియో ద్వారా సాగించే మన్కీ బాత్ కార్యక్రమాన్ని నిషేధించాలని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నెల 20న ఈ కార్యక్రమం ఉన్నందున బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచారానికి ఉపయాగించుకున్నట్టు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈసీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతేకాదు  నియమావళి పేరు చెప్పి... ఇలాంటి కార్యక్రమాల్ని నిషేధించలేం అని.. ఆ ప్రసంగంలో.. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే దానిపై చర్య తీసుకోగలంఅని చెప్పింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దానిని వదిలిపెట్టడం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఆశ్చర్యం ఏంటంటే వాటివల్ల ఆపార్టీకి లాభం లేకపోయినా  ఏదో చేయాలి కదా అని  ఒక రాయి విసురుతోంది తప్ప.. నిజానికి ఈ ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు.

చంద్రబాబు, కేసీఆర్ కి అన్నాహాజారే ఝలక్

రైతుల రుణమాఫీపై ప్రముఖ సామాజికవేత్త అన్నాహాజారే కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీతో రైతులకు మేలు జరగదని అభిప్రాయపడ్డ ఆయన, దానివల్ల సమస్యలు పరిష్కారం కానేకావన్నారు. రుణమాఫీ కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్న అన్నాహాజారే...ఇది రాజకీయ నేతలు ఆడుతున్న ఆటంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు రుణమాఫీ చేయాలంటూ శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ రాజకీయ జిమ్మిక్కన్న ఆయన, ఈ పథకం వల్ల, ప్రజాధనం వేస్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీ పథకం వల్ల రైతులు... ఇతరులపై ఆధారపడేలా చేస్తుందని, ప్రభుత్వాలు కరువు పరిస్థితులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నా సూచించారు. అయితే అన్నా వ్యాఖ్యలు... చంద్రబాబు, కేసీఆర్ లకు కూడా ఇరుకున పెట్టేలా ఉన్నాయని, రుణమాఫీ అమలు చేస్తున్నా, ఏపీ, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు పొలిటికల్ లీడర్స్.

హైదరాబాద్ లో మళ్లీ కాల్పుల కలకలం

హైదరాబాద్ లో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ...చివరికి కాల్పుల వరకూ వెళ్లింది. హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ ఘటన పాతబస్తీ ప్రాంతంలో జరిగింది. భూవివాదం నేపథ్యంలో టోలీచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జూబేర్ పటేల్, గోల్కొండకు చెందిన ఫరీద్ లు కొద్దిరోజుల క్రితం గొడవ పడగా, పోలీసులు పిలిచి సర్దుబాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువురూ భేటీకాగా, ఇద్దరి మధ్యా మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన జూబేర్ పటేల్... తన దగ్గరున్న తుపాకితో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హైదరాబాద్ లో గన్ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతుండటంపై అటు పోలీసులు, ఇటు ప్రజలూ ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమైవుతుందో, ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదని జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

పుట్టిన ప్రతి బిడ్డపై 20 వేల అప్పు.. కేసీఆర్ అప్పుల వల్లే

  తెలంగాణ ప్రభుత్వంపై దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం లభించగా.. తెలంగాణకు మాత్రం పదమూడో స్థానం దక్కింది. ఇది ఏపీకి శుభ పరిణామం అయితే ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం చేదు వార్తనే. అయితే ఇప్పుడు మరో తెలంగాణ ప్రభుత్వం తీరు మరోసారి భయటపడింది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ రాష్ట్రానికి లోటు భారం ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మిగులు బడ్జెతో గుజరాత్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఆసంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆతరువాత తెలంగాణ ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ఎడా పెడా ఖర్చుచేసి ఆఖరికి మిగులు బడ్టెట్ ఉన్న రాష్ట్రం కాస్త నిధులు లేక అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తెలంగాణ పనితీరుపై చాలామంది విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసిన అప్పులకు గానూ ఆరాష్ట్రంలో పుడుతున్న ప్రతీ బిడ్డపై పుట్టుకతోనే  రూ. 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. తీసుకున్న అప్పులను అధిక వడ్డీతో తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని.. దీనివల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి తెలిపారు. మొత్తానికి దీనిని బట్టి కేసీఆర్ పాలనా విధానం ఎలా ఉందో ఈఫోరం బట్టే తెలుస్తోంది.  ఇప్పటికే తన ఒంటెద్దు పోకడను మాని మేల్కోకపోతే రాష్ట్రం పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధిక ఖర్చులు మాని.. పక్క రాష్ట్రంతో పోల్చుకోకుండా తమ రాష్ట్ర పరిస్థితిని..తన ప్రజల అవసరాలను తెలుసుకొని ఆదిశగా పాలనా సాగిస్తే బావుంటుందని సదరు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

నువ్వా.. నేనా.. లోకేశ్ vS జగన్

  టీడీపీ యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు యువనేతలు ఇప్పుడు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఒకరిమీద ఒకరు మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. జగన్ తో పోల్చుకుంటే లోకేశ్ కు కాస్తంత రాజకీయానుభవం తక్కువగా ఉన్నా ఈమధ్య లోకేశ్ కూడా తనదైన పంచ్ డైలగ్స్ తో జగన్ మీద బాగానే కామెంట్లు విసిరారు. ప్రస్తుతానికి మీడియాలో తమ తమ వ్యాఖ్యలతో రాజకీయ యుద్ధానికి దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హాయాంలో జగన్ ఆయన పదవిని అడ్డుపెట్టుకొని ఎన్నో కోట్లు సంపాదించారని.. ఏపీ నూతన రాజధాని అభిృద్ధి విషయంలో అడుగడుగునా అడ్డుపడుతున్నారని అన్నారు. భూసేకరణ విషయంలో కూడా ధర్నాలంటూ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యాలే చేశారు అని ఎద్దేవ చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్‌పై జగన్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. మొత్తానికి యువనేతల మధ్య రాజకీయ వేడి బాగానే రాజుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ యువనేతల మధ్య గట్టి పోటీనే ఉంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ నేతలు.

విజయవాడ మెట్రోకి కూడా కేంద్రం ఆమోదం?

  విజయవాడలో 20లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్నందున అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు లాభసాటిగా ఉండదనే కారణంతో ఆ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయలేమని తెలియజేస్తూ కేంద్రప్రభుత్వం ఒకలేఖ వ్రాసింది. కానీ నిన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాజెక్టుకి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైజాగ్, విజయవాడల మెట్రో ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రెండు ప్రాజెక్టులని కూడా 2018 డిశంబరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ప్రాజెక్టులను పర్యవేక్షించబోతున్న డిల్లీ మెట్రో ప్రాజెక్టు చీఫ్ ఈ శ్రీధరన్ కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీధరన్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నందున ఈ రెండు ప్రాజెక్టులు సకాలంలోనే పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. మిగిలిన మూడేళ్ళలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే శ్రీధరన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే ఆఖ్యాతి మొత్తం దక్కుతుంది.

కోదండరాం మాట ఎందుకు మారింది?

ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడటం రాజకీయ పార్టీలకు అలవాటే అయినా, ప్రజల తరపున పోరాడే ప్రజాసంఘాల నేతలు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన వాళ్లే ఇవాళ అధికారంలో ఉన్నా, దాన్ని అమలు చేయకపోగా, ఆనాడు టీఆర్ఎస్ తో కలిసి ఆందోళనలు, ధర్నాలు, డిమాండ్లు చేసిన కోదండరాం లాంటి నేతలు కూడా ఇప్పుడు నోరు మెదడం లేదు. అయితే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం...టీఆర్ఎస్ కి నొప్పి కలుగకుండా మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏకాభిప్రాయం కావాలన్న ఆయన, ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దాంతో కోదండరాం తీరును జేఏసీ నేతలే ఆక్షేంపించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్వహించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట... ఇది పార్టీలకూ అలవాటేనని, అందుకే కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తుందని గుర్తుచేస్తున్నారు.

డెంగ్యూకి మొగుడు దొరికాడు

దేశాన్ని వణికిస్తున్న డెంగ్యూ వైరస్‌కు విరుగుడు కనుగొన్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ప్రకటించారు. దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు చేసి, డెంగ్యూ వైరస్‌ ను నియంత్రించగల ఔషధాన్ని కనిపెట్టినట్లు తెలిపారు, కలబంద, దానిమ్మపళ్లు, బొప్పాయి ఆకులు, గిలోయ్‌ తీగెల నుంచి తీసిన రసంతో డెంగ్యూ వైరస్‌ను పూర్తిగా అరికట్టవచ్చునని, ఆ నాలుగూ దేశంతటా విస్తారంగా దొరుకుతాయని బాబా చెప్పారు. ఢిల్లీలో కొందరు రోగులకు ఈ మందు వాడటం వల్ల వారంలోపలే డెంగ్యూ పూర్తిగా తగ్గిపోయిందని రాందేవ్‌ వివరించారు. నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయన్న ఆయన, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవని స్పష్టంచేశారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే ప్రతీ రెండు గంటలకోసారి మందు తాగించాలని.. లేదంటే రోజుకు మూడు, నాలుగు సార్లు తాగితే చాలున్నారు. డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులపై పదేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించామని, అందులో భాగంగానే ఈ మందును కనిపెట్టినట్లు రాందేవ్ బాబు ప్రకటించారు

వైసీపీ ఎమ్మెల్యేలకు నరకం చూపిస్తున్నారట

తెలంగాణలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళంలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేసిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీఎమ్మెల్యేలు మదనలాల్, తాటికొండ వెంకటేశ్వర్లు తెగ బాధపడిపోతున్నారు. తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒకరకంగా, తర్వాత మరోరకంగా టీఆర్ఎస్ లీడర్స్ ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారట. ఇప్పుడు కనీసం పలకరించేవారే కరువయ్యారని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో చేరేముందు స్వర్గాన్ని చూపిస్తామని చెప్పి, ఇప్పుడు నరకం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు కనీసం నియోజకవర్గ నిధులు కూడా ఇవ్వకుండా, ప్రజల్లో అవమానిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు, వైసీపీలో ఉండగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేదోడువాదోడుగా ఉండేవారని, కానీ పార్టీ మారడంతో ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, తాము వైసీపీలో ఉన్నా బాగుండేదని వాపోతున్నారట. మరికొద్దిరోజులు వేచిచూస్తామని, అయినా టీఆర్ఎస్ నేతల్లో మార్పు రాకపోతే, మళ్లీ పార్టీ మారే అంశాన్ని ఆలోచిస్తామంటున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు

ఆ హీరో తెగ నచ్చేశాడంటున్న రకుల్

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అందంగా ఉన్నాడని, తారక్ కెరీర్ లో ఇప్పటివరకూ ఇదే మోస్ట్ స్టైలిష్ లుక్ అంటూ పొగేస్తున్నారు. నాన్నకు ప్రేమతో ఫస్ట్ లుక్... అటు ఫ్యాన్స్ నే కాకుండా, ఇటు హీరోయిన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అయితే... తారక్ మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ స్టైలిష్ గా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ న్యూలుక్ కి...ఫ్యాన్సే కాదు, హీరోయిన్లూ ఫిదా అయిపోతున్నారన్న మాట.

అది అధికారిక యాత్రా? విహార యాత్రా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ తిరిగొచ్చేసినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. అది అసలు ప్రభుత్వ అధికారిక యాత్రా? లేక విహార యాత్రకు వెళ్లారా అంటూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. కేసీఆర్ విహార యాత్రకు వెళ్లినట్లుందని, అది పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్లినట్లు లేదని ఎద్దేవా చేశారు. చైనా టూర్ కి వెళ్లిన వారిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్న ఆయన, అంతమందిని అసలు ఎందుకు తీసుకెళ్లారో, వాళ్లకున్న అర్హతలేంటో? తెలియడం లేదన్నారు. కేసీఆర్ చైనా టూర్ కోసం ఖర్చు పెట్టిన డబ్బును, రైతుల కోసం ఉపయోగించి ఉంటే, కనీసం ఆత్మహత్యలైనా ఆగేవని అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ చైనా టూర్ ఖర్చు, పర్యటన వివరాలు, వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, చైనా పర్యటన ఏంటంటూ విమర్శించారు. ఏడాది కాలంలోనే 50వేలకోట్ల అప్పులు చేసి, తెలంగాణను దివాళా తీయించారని, అందుకే ప్రపంచ బ్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందని ఆరోపించారు.

కదులుతున్న బస్సులో మళ్లీ గ్యాంగ్ రేప్

మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే, మృగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశమంతా అట్టడుకినా, అలాంటి ఘోరాలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి. ఆగస్ట్ 5న భోపాల్ లో...కదులుతున్న కారులో మహిళపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనను మరువక ముందే, అలాంటి దారుణమే మరొకటి జరిగింది. ఈసారి కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన భోపాల్ లోని ఎంపీనగర్ లో జరిగింది. నెలరోజుల వ్యవధిలో ఇలా వరుసగా రెండు సంఘటనలు జరగడంతో భోపాల్ వాసులు భయంతో వణికిపోతున్నారు.

బాలయ్య ‘డిక్టేటర్’ ఫస్ట్‌లుక్‌ లో ఏం మిస్సైంది

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్’ ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్...పోస్టర్ పై బాలయ్యను అదిరిపోయే రేంజ్ లో చూపించారు. ఓ అద్భుతమైన భవనంలో, విద్యుత్ దీపాల మధ్య ధగధగ మెరిసిపోతున్న రూమ్ లో సోఫాలాంటి సింహాసనంపై కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీదు కాలేసుకుని కూర్చున్న బాలయ్య... డిఫరెంట్ స్టైల్లో తలపైకెత్తి సిగార్ తాగుతున్న బాలయ్య ఫోజు అదిరిపోయింది. శ్రీవాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న డిక్టేటర్...శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.