టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలు

  తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కారు ప్రమాదానికి గురయ్యారు.  ఎమ్మెల్యే బుచ్చి బాబు ఆయతో పాటు మాజీ ఎమ్మెల్యే చైతన్యరాజు కొంత మంది ఎమ్మెల్యేలు కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లగా అక్కడ బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బుచ్చిబాబు తీవ్రంగా గాయపడ్డారు.. ఆయన తలకు దెబ్బ తలగడంతో అక్కడి ఆస్పత్రికి తరలించగా ఆయన తలకు 12 కుట్లు పడ్డాయి. అయితే బుచ్చిబాబుకు ప్రమాదం జరిగినట్టు ఆయన ఇక్కడికి వచ్చేంత వరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ఆయనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు వెంటనే ఆయనను పరామర్శించారు. ప్రస్తుతానికి బుచ్చిబాబు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

సింగపూర్ లో పీఏపీ విజయం, టీడీపీ హ్యాపీ

    సింగపూర్ సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్లీ ఘనవిజయం సాధించింది. 1965 నుంచి 50ఏళ్లుగా ఏకచత్రాధిపత్యంగా సింగపూర్ ను ఏలుతున్న పీఏపీ...మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.ప్రధాని లూంగ్ ఆధ్వర్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించిన పీపుల్స్ యాక్షన్ పార్టీ...89 సీట్లకు గానూ, 60 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారైనా పీఏపీను ఓడించాలనుకున్న ప్రతిపక్షం కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. అయితే సింగపూర్ లో అధికార పార్టీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ కి లింకేంటి అనుకుంటున్నారా?, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం...మళ్లీ అక్కడ లూంగ్ సర్కారే రావడంతో ఊపిరిపీల్చుకుంది. పాత ప్రభుత్వమే మళ్లీ పవర్ లోకి రావడం వల్ల...ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ రావని భావిస్తున్నారు, అందుకే సింగపూర్ లో అధికార పార్టీ ఘనవిజయం సాధించడంతో, ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తామంటూ సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని లూంగ్ లేఖ రాయడం...తెలుగుదేశం పార్టీకి సంతోషాన్నిచ్చింది.

ఏంటీ...జగన్ దీక్షలు ఫ్యాషన్ షోల్లాగా ఉన్నాయా?

    నిజమే ఇప్పుడు దీక్షలు చేయడం కూడా ఒక ట్రెండ్ లా, ప్యాషన్ లాగా మారిపోయాయి.గతంలో దీక్ష అంటే అదో పెద్ద సంచలన వార్త అయ్యేది,ఇప్పుడు చీటికీమాటికీ, ఎవరుపడితే వాళ్లు...దీక్షలు అంటుంటే...అటు ప్రజలు, ఇటు మీడియా ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే...దీక్షలను తనకు పేటెంట్ గా మార్చేసుకున్నారేమోనని అనిపిస్తుంది. జలదీక్ష, ఫీజు దీక్ష, రైతుదీక్ష...ఇలా అనేక రకాల దీక్షలు చేసిన జగన్...ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా మరో దీక్షకు పూనుకున్నారు. అయితే జగన్ దీక్షలు...ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయంటూ మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ విచిత్రమైన కామెంట్ చేశారు.జగన్ దీక్షల్లో కసి లేదని, ప్రజలను మభ్యపెట్టడానికే నాటకాలాడుతున్నారని కారెం ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటే...ఏ పార్టీకి పుట్టగతులుండవంటూ హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలకు కీలక పదవులు

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ, టీడీపీ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించే కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలని పరితపిస్తున్న చంద్రబాబునాయుడు...మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీ సంక్షేమ నిధి...ద్వారా కార్యకర్తలకు అండదండలందిస్తున్న పార్టీ...ఏపీలో సుమారు లక్షమంది కార్యకర్తలకు పదవీయోగం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్ద పదవులు కాకపోయినా, తమతమ గ్రామాల్లో గుర్తింపు లభించేలా పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరికి ఇలాంటి పదవులు కల్పించినా, మరికొందరికి ఇవ్వడం ద్వారా కిందిస్థాయి కార్యకర్తలను సంతృప్తి పర్చాలనుకుంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 16వేల కమిటీలు పనిచేస్తుండగా, వాటిలో దాదాపు 32వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించగా, తాజా నిర్ణయంతో మరో లక్షమందికి ఇలాంటి అవకాశం దక్కనుంది. ఈ కమిటీల ద్వారానే గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించనున్నారు. అన్ని కమిటీల్లోనూ టీడీపీ కార్యకర్తలు ఉంటేనే, ప్రభుత్వానికి తగిన సమాచారం అందుతుందని, తద్వారా గ్రామాల్లో రాజకీయంగా పట్టు సాధించడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, ప్రజలు సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3400 చిన్న దేవాలయాలకు కమిటీలను నియమించి, వాటిలో 30వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించనున్నట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. వీటితోపాటు పైస్థాయి పదవుల భర్తీపైనా దష్టిపెట్టిన హైకమాండ్ ...జిల్లా గ్రంథాలయాలకు ఛైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ సలహా మండళ్లు నియమించే పనిలో పడింది.

ఫ్యాన్స్ చేసిన నష్టం.. చెల్లిస్తానన్న పవన్

  పవన్ కళ్యాణ్ ను అతని అభిమానులు ఎంతలా ఆదరిస్తారో మాటల్లో చెప్పడం కొంచెం కష్టమైన పనే. అతనంటే అభిమానుల్లో ఎంత క్రేజో అందరికి తెలిసిందే. ఎందుకంటే అభిమానులు అతనంటే ఎంత ఇష్టపడతారో పవన్ కూడా వారిపట్ల అంతే ప్రేమతో ఉంటారు కాబట్టి. అభిమానులంటే తనకి ఎంత ఆదరాభిమానాలో మరోసారి రుజువు చేశారు పవన్. సెప్టెంబర్ 2 తన పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో అభిమానులు పవన్ కు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లేక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేసిన నేపథ్యంలో అక్కడ రెండు మూడు రోజుల పాటు పెద్ద గొడవలే జరిగాయి. అటుపోయి ఇటు పోయి ఆఖరికి ఆ గొడవ కాస్త కుల వివాదాల వరకూ వెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఎటువంటి గొడవలు చేయోద్దని.. భౌతిక దాడులు తనకు నచ్చవని సూచించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసిన గొడవలకి అక్కడ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు కొంచెం నష్టం కలిగింది. దీంతో తన అభిమానులు చేసిన నష్టానికి పరిహారాన్ని తనే చెల్లిస్తానని ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగానే ముందుగా ఓ మూడు లక్షల రూపాయలని భీమవరం ఎస్ఐకి పంపించారట. అభిమానులకు ఏదైనా నేనున్నా అంటూ ముందుంటారు కాబట్టే పవన్ అంటే వారికి అంత ప్రేమ.. ఓరకంగా చెప్పాలంటే పిచ్చి. Pawan Kalyan's SARDAR First Look Motion Poster  

ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు

  400మంది ఎంపీలు దేశాభివృద్ధి కోసం పరితపిస్తుంటే, ఓ 40మంది ఎంపీలు మాత్రం కుట్ర చేస్తున్నారంటూ నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలుచేశారు. బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ నిప్పులు చెరిగిన మోడీ...దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలను చర్చించకుండా తమ గొంతు నొక్కితే, జనసభకు (జనాల్లోకి) వెళ్తామని, ఇది రాజ్యసభ కంటే పెద్ద సభ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని మోడీ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన, ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్ లో కూడా కాంగ్రెస్ ను క్షమించరని హెచ్చరించారు.

రఘువీరాని ఇంటికెళ్లి మరీ కొడతా.. జేసీ

  టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ రఘువీరారెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరా రెడ్డిపై తిట్ల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ కేసులు పెడుతున్నారు.. పద్దతి మార్చుకోకపోతే రఘువీరా ఇంటికి వెళ్లి మరీ కొడతానని హెచ్చరించారు. అంతేకాదు కేవలం పార్టీ ప్రయోజనాలకే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోసం మేమున్నామంటూ దొంగనాటకాలాడుతుందని.. మొసలి కన్నీరు కార్చుతుందని విమర్శించారు.   కాగా రఘువీరా రెడ్డి పెట్టిన కేసుకు ప్రతీకారంగా బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసిందని కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్.. దిగ్విజయ్ సింగ్ పై కేసులు పెట్టారు.

కేసీఆర్ ను భయపెడుతున్న కరీంనగర్ మాజీ ఎంపీ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సెటైర్ల మీద సెటైర్లేస్తున్నారు. కేసీఆర్ చైనా వెళ్లిన వెంటనే, స్పీకర్ ను వెంట తీసుకెళ్లడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నం, ఈసారి వర్షాల సెంటిమెంట్ ను పండించి టీఆర్ఎస్ లో దడ పుట్టించారు. కేసీఆర్ ...తెలంగాణకు శనిగా దాపురించారని, అందుకే ఆయన చైనా వెళ్లిన వెంటనే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. మరి కొన్నాళ్లు కేసీఆర్ చైనాలోనే ఉంటే బాగుంటుందని...తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉంటారని ఎద్దేవా చేశారు. ట్యాంక్ బండ్ పై సూసైడ్ చేసుకున్న లింబయ్య... వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదన్న మంత్రుల వ్యాఖ్యలపై పొన్నం ఫైరయ్యారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా, అనుచితంగా మాట్లాడాతారా అంటూ నిప్పులు చెరిగారు. లింబయ్య ఆత్మహత్యపై బహిరంగ చర్చకు రావాలంటూ...గులాబీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 55మందికే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించిన పొన్నం... ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 5లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పాఠాలు చెబుతున్న నారా లోకేష్

  నారా లోకేష్ ...టీచర్ అవతారమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న చినబాబు...కార్యకర్తలకు పాఠాలు చెబుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న లోకేష్...పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో శిక్షణ ఇస్తున్నారు.ప్రభుత్వంపై దుష్ఫ్రచారాన్ని కార్యకర్తలే అడ్డుకోవాలన్న లోకేష్... జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్న ఆయన... రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

హైదరాబాద్ లో కలకలం... లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్

  హైదరాబాద్ లో ఓ మహిళా తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన ఖాకీలు...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ చెక్కేస్తున్న లేడీ టెర్రరిస్ట్ నిక్కీ జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ దేశస్తురాలైన నిక్కీ జోసెఫ్... గతేడాది అరెస్టయిన ఉగ్రవాది మొయినుద్దీన్ కి ప్రియురాలని, ఈమెకు ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కూడా ఉన్నాయని, పలువురు యువకులను ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నించిందని పోలీసులు వెల్లడించారు. ప్రియుడు మొయినుద్దీన్ తో కలిసి ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి...ఐసిస్ కోసం పనిచేసిందంటున్న పోలీసులు...పక్కా సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. నిక్కీ జోసెఫ్ ను దుబాయ్ నుంచి హైదరాబాద్ కి రప్పించడంలో తాము పన్నిన వ్యూహం వర్కవుట్ అయ్యిందంటున్న ఖాకీలు...నగరంలో ఆమెకున్న పరిచయాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఐసిస్ లో చేరేందుకు వెళ్తూ...ఇప్పటివరకూ 30మంది అరెస్ట్ అయ్యారని, వాళ్లకూ నిక్కీకి ఏమైనా సంబంధాలున్నాయా? వీళ్లలో ఎవరికైనా ఎర వేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఓ లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్ అవ్వడం మాత్రం కలకలం రేగుతోంది. ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో మాత్రమే కనిపించే లేడీ టెర్రరిస్టులు... మన భాగ్యనగరంలో ఉన్నారని తెలుసుకుని ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.

రేవంత్ పై టీఆర్ఎస్ మరో స్కెచ్ వేయనుందా?

  తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం.. వారికి ధీటుగా సమాధానం చెప్పగల సామర్థ్యం ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మిగిలిన పార్టీ నేతలు మాట్లాడలేరా అంటే మాట్లాడలేరని కాదు కాని రేవంత్ రెడ్డి అంత వాక్చాతుర్యం.. వారి మాటను తిప్పికొట్టి మాట్లాడగల సత్తా వారికంటే కొద్దిగ ఎక్కువగా రేవంత్ రెడ్డికే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు భయపడతారని రాజకీయ వర్గాలు చెప్పుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవ్వరి మీద ఫోకస్ చేయకుండా కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే ఫోకస్ పెట్టి చాలా పథకం ప్రకారం ఓటుకు నోటుకేసులో ఇరికించారు. అయితే టీఆర్ఎస్ కూడా కావాలనే రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తమ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డికి ఎలాగైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని చూస్తుంది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం సరిగా రాలేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చేప్తేకాని మాట్లాడే అవకాశం ఇచ్చేది లేదని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు కాని రేవంత్ రెడ్డి మాత్రం క్షమాపణలు చెప్పలేదు.. అలా రేవంత్ మాట్లాడకుండానే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముగిసిపోయాయి. ఆ తరువాత నోటుకు ఓటు కేసులో ఇరికించాయి.. దీనివల్ల రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం ఏంటంటే ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఎలా కట్టడి చేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాములుగానే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు అసలే పులి అందులోనూ దెబ్బతిని ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పై తన పంజా విసరడానికి సిద్దంగా ఉన్నాడు. అసలు కేసు తర్వాత షరతులతో కూడిన బెయిల్ మీద బయటకొచ్చినప్పుడే కేసీఆర్ పై ఒక రేంజ్ లో విమర్శల బాణాలు వదిలాడు. నాకు బెయిల్ వచ్చింది కేసీఆర్ కు జ్వరం వచ్చిందంటూ ఆయనపై మండిపడ్డాడు. ఇప్పుడు హైకోర్టు ఆ షరతులను కూడా సడలింపు చేస్తూ రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అని చెప్పిన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి అలా వచ్చాడో లేదో కేసీఆర్ ను ఏకిపారేశాడు. సింగం వచ్చింది కేసీఆర్ చైనా పారిపోయాడు అంటూ.. ఆట కాదు వేట మొదలైందంటూ.. తాడో పెడో తేల్చుకుంటానంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీ అంత తేలికగా తీసుకోనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే  ఈనెల 27 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తమ పార్టీని ఇరుకున పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోందని అనుకుంటున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే  రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేసేందుకు టీఆర్ఎస్ ఏం స్కెచ్ వేస్తుంది అని పలు అను మానాలు రేకెత్తున్నాయి. అయితే ముందు ఓటుకు నోటు కేసుపై సభ నుండి సస్పెండ్ చేద్దామని అనుకున్నా దాన్ని విరమించుకున్నారు. ఎందుకుంటే ఇప్పటికే ఓటు నోటు కేసు వల్ల రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు అదికూడా చేస్తే రేవంత్ రెడ్డి హీరో అయిపోతాడని ఆగిపోయారంట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి మాత్రం టీఅర్ఎస్ పార్టీ బానే భయపడుతుందని చెప్పొచ్చు.

చినబాబుకు పార్టీ పగ్గాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను... త్వరలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేస్తారని తెలుస్తోంది. పార్టీ పగ్గాలు చినబాబుకు అప్పగించాలని ఎప్నట్నుంచో కార్యకర్తలు కోరుతున్నా, సరైన సమయం కోసం బాబు వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ, సభ్యత్వ నమోదులోనూ సత్తా చాటిన లోకేష్...ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. పాలనా వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉంటుంటే...చినబాబు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారని, ఈ నేపథ్యంలోనే లోకేష్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఏపీ, తెలంగాణకు సెపరేట్ గా అధ్యక్షులను నియమించినా, రెండు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చినబాబే పర్యవేక్షిస్తారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు అంటున్నాయి.

క‌మ్మ క‌మ్యూనిటీపై జ‌గ‌న్ ఫోక‌స్

కోస్తాంధ్ర‌లో బ‌ల‌మైన‌ క‌మ్మ క‌మ్యూనిటీపై జ‌గ‌న్ దృష్టిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఆయువు ప‌ట్ట‌యిన‌ క‌మ్మ సామాజికవ‌ర్గం నుంచి త‌న‌కు కొంచెం అండ దొరికినా కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్లేన‌ని భావిస్తున్న వైసీపీ అధినేత‌... ఆయా జిల్లాల్లో ప‌ట్టున్న నేత‌ల కోసం ఆన్వేషిస్తున్నార‌ట‌. 2004లో ఈ వ‌ర్గం నుంచి కూడా వైఎస్ కు మ‌ద్ద‌తు దొర‌క‌బ‌ట్టే కాంగ్రెస్ అధికారంలోకి రాగ‌లిగింద‌ని, టీడీపీకి బ‌లంగా కొమ్ముకాసే ఈ వ‌ర్గంలోనూ వైఎస్ కు చెప్పుకోద‌గ్గ స్థాయిలో అభిమానులున్నార‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. కోస్తాంధ్ర‌తోపాటు, రాయ‌లసీమ‌లోని అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ఈ వ‌ర్గం అండ లేక‌పోతే, వ‌చ్చేసారైనా అధికారం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌న్న అంచ‌నాకి వ‌చ్చార‌ట‌. పైగా ఆ వ‌ర్గానికి చెందిన త‌న ఎమ్మెల్యేలు గొట్టిపాటి ర‌వికుమార్, పోతుల రామారావులు....తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అదే సామాజిక వ‌ర్గం నుంచి బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుని డామేజ్ కంట్రోల్ కు రెడీ అవుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురితో జ‌గ‌న్ స్వ‌యంగా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, కృష్ణాజిల్లా నుంచి దేవినేని నెహ్రూ చేర‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాల్లో పట్టున్న కరణం బ‌ల‌రాంతో కూడా సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని,  టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయ‌నా వైసీపీలో చేరే అవ‌కాశ‌ముందంటున్నారు జ‌గ‌న్ పార్టీ నేత‌లు.

తెలంగాణలో రిటైర్డ్.. ఏపీలో జాబ్

  తెలంగాణలో పదవి వీరమణ పొందిన 20 మంది ఉద్యోగులకు మళ్లీ ఏపీలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వహించే అవకాశం లభించింది. ఎందుకంటే రాష్ట్రాలకు ఉద్యోగులు కేటాయింపులకు ఏర్పాటు చేసిన కమల్ నాథన్ కమిటీ స్థానికత ఆధారంగా ఇరవై మంది ఉద్యోగులను ఏపీకే కేటాయించింది. అయితే తెలంగాణలో పదవీ విరమణ కాలం 58 సంవత్సరాలు.. ఏపీ లో 60 సంవత్సరాలు ఉండటంతో ఈ ఇరవై మందికి మరో రెండేళ్లపాటు ఉద్యోగ అవకాశం కలిగింది. దీనికి ఏపీ ప్రభుత్వ కూడా అంగీకరించడంతో వారికి ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగం కల్పించింది. ఇదిలా ఉండగా ఈ ఉద్యోగుల కేటాయింపులపై కమల్ నాథన్ కమిటీ కసరత్తులు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఈ కమిటీ రెండు ప్రభుత్వాల సీఎస్ లతో కూడా భేటీ అయింది. అయితే 40 శాఖల్లోని ఉద్యోగుల పేర్లతో ఈ తుది కేటాయింపులో వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీ ఇప్పటికే పరిష్కరించే పనిలో పడింది. త్వరలోనే తుది కేటాయింపులు జరగబోతాయని కమిటీ తెలిపింది.

నన్ను కలువు.. ప్రేమ గురించి చెపుతా.. మంత్రి

కారణమేదైతే కాని రోజు రోజుకు ఆత్మహత్యలు చేసుకునేవారు పెరిగిపోతునే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు అసలు లెక్కలేకుండా పోయింది. నిన్నటికి నిన్న తెలంగాణ లో లింబయ్య అనే రైతు రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకొని తన ప్రాణాలను బలిగొన్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుతం ఒక ఉపాయాన్ని కనుగొంది. ఏదో ఒక రకంగా ఈ ఆత్మహత్యలను నివారించాలని దీనికోసం ఒక ప్రత్యేకమైన సెల్ ను ఏర్పాటు చేశారు. దీనిని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సెల్ ను ప్రారంభించిన సందర్భంగా వచ్చిన మొదటి కాల్ ను స్వయంగా లక్ష్మారెడ్డే అందుకొని మాట్లాడారు. అయితే కిరణ్ అనే కుర్రాడు తన ప్రేమ విఫలమైందని అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మంత్రిగారికి చెప్పడంతో మంత్రిగారు తొందరపడి అలాంటి అగాయిత్యాలకి పాల్పడవద్దని.. తల్లి దండ్రుల కోసం ఆలోచించాలని హిత బోధ చేశారంట. అంతేకాదు తన ఫోన్ నెంబరు ఇచ్చి తనను వ్యక్తిగతంగా కలవాలని.. ప్రేమ గురించి తాను చెప్తానని కూడా చెప్పారంట. మొత్తానికి రాజకీయ నాయకులు సమాజం.. బాధ్యతలే కాదు ఇలా ప్రేమ పాఠాలు కూడా చెప్పాల్సి వస్తుంది.  

నేటి నుండి ఏపీ యన్.ఐ.టి. క్లాసులు ప్రారంభం

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా సంస్థలను కేంద్రప్రభుత్వం నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇంతవరకు రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యా సంస్థలకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖు స్థాపననలు చేసారు. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్నాలాజీ (యన్.ఐ.టి.) కూడా ఒకటి. కానీ ఈ ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ శావిత భవన సముదాయాలు నెలకొల్పడానికి చాలా సమయం పడుతుంది కనుక అంత వరకు తాత్కాలికంగా వేరే సంస్థల భవనాలలో ఈ విద్యా సంవత్సరం నుండే శిక్షణా తరగతులు మొదలుపెడుతున్నారు. ఏలూరులోని పెద్ద తాడేపల్లి గ్రామంలో గల వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో నేటి నుండి యన్.ఐ.టి. శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు నిన్న ఆ భవన సముదాయాన్ని, శిక్షణా తరగతులను లాంఛనంగా ఆరంభించారు. దీనికి వరంగల్ యన్.ఐ.టి. మార్గదర్శకత్వం చేస్తుంది. విశాఖ శివార్లలో గంభీరం అనే గ్రామంలో నెలకొల్పుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐ.ఐ.ఎం.) శిక్షణ తరగతులు ఆంద్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతున్నారు. దీనికి చెన్నై ఐ.ఐ.ఎం. మార్గదర్శకత్వం చేస్తుంది.