డిగ్గీకి పెళ్లి తెచ్చిన కష్టాలు

  ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్న పంథాలో.. ఒక్క పెళ్లి డిగ్గీ రాజా (దిగ్విజయ్ సింగ్) జీవితాన్నే మార్చేసింది అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పెళ్లే ఆయన పదవికి ముప్పుతెచ్చిపెట్టిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీలో యాంకర్ గా పనిచేసిన అమృతారాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే. ఇంతకాలం పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా పెద్ద పార్టీకి అత్యంత సన్నిహితుడిగా భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు డిగ్గీని పదవి నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత ఆయన పార్టీ కర్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. ఆయనను ఇంఛార్జ్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిస్థితి కూడా ఏమంత బాగా లేదని.. దీంతో ఆయనను పక్కన పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఈయన పార్టీ కార్యకలాపాలకు అంతగా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు నేరుగా రాహుల్ కే ఫిర్యాదు చేశారంట. అంతేకాదు పార్టీలోకి యువతను తీసుకోవాలనే నేపథ్యంలో కూడా డిగ్గీని పక్కన పెట్టాలని చూస్తున్నారంట.

తనపై కుట్ర జరుగుతోందంటున్న కేఈ

ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మినిస్టర్ గా ఉన్న తనను అసలు పట్టించుకోవడం లేదని, ఇటు ప్రభుత్వం, అటు పార్టీ నిర్ణయాల్లోనూ కనీసం తనను లెక్కలోకి తీసుకోవడం లేదని కేఈ వాపోతున్నారట. పైగా రెవెన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు తనను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేబినెట్ మీటింగ్స్ లోనూ, కలెక్టర్ల సమావేశాల్లోనూ...పదేపదే అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమంటూ బాధపడుతున్నారట. సీనియర్ ను అయన తన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై తాను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ నాలుగుసార్లు రద్దుచేశారని, రాజధాని భూసమీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ, మచిలీపట్నం పోర్ట్ వంటి కీలక నిర్ణయాల్లోనూ తనను పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకున్నా అదేరీతిలో అవమానిస్తున్నారని, ఇవన్నీ దేనికి సంకేతమో తెలియడం లేదని, కానీ ఆలోచించాల్సిన అవసరమైతే ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారట.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు

  ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతిపక్షనేతలు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షనేతలకి కేసీఆర్ ను ఏకేయడానికి రోజుకో పాయింట్ తో ముందుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్శిటీ విషయంలో కేసీఆర్ పై నిప్పుల చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అక్కడ వాటిని పరిశీలించిన తరువాత కేసీఆర్ పై మండిపడ్డారు. యూనివర్శిటీలోని హాస్టళ్ల మెస్ ల పరిస్థితి బాగాలేదని.. ప్రభుత్వం వాటి గురించి అస్సలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర్లంలో ఉన్నప్పుడు డైమండ్ లా ఉన్న యూనివర్సిటీల్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని.. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అన్న సందేహం వస్తుందని అన్నారు. ‘కేసీఆర్ ఒక్క 5 నిముషాలు ఓయూ హాస్టల్ గదిలో ఉండు పరిస్థితేమిటో తెలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈవిషయంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఉస్మానియా విద్యార్ధులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదే కాదని.. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ వాళ్లనే పట్టించుకోవడం లేదని.. కనీసం నీళ్లు తిండి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవ చేశారు. గత నాలుగేళ్ల నుండి కేసీఆర్ దొంగ అని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు అని అన్నారు.

కేఈ కి శాఖ మార్పు తప్పదా?

  ఏపీ ఉప ముఖ్యమంత్రి.. రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పదవికి పోటు పడేలా ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందన్న ఆరోపణలే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఈ పదవి నుండి కృష్ణమూర్తిని తొలగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏపీలో జరిగిన కలెక్టర్లు, ఉప కలెక్టర్ల బదిలీల కారణమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో 22 మంది కలెక్టర్లు, ఉప కలెక్టర్లను  కేఈ ఆదేశాలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బదలీ చేశారు. అయితే ఈ బదిలీల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన చంద్రబాబు కేఈ పై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. అంతేకాదు గతంలో కృష్ణా జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి విషయంలో కూడా కేఈ సరిగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఆయన సచివాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో చంద్రబాబు ఆయనను రెవెన్యూ శాఖ నుండి తప్పించి వేరే ఏదో చిన్న శాఖను ఆయనకు అప్పగించాలని.. అవసరమైతే ఆ శాఖను తన వద్దే ఉంచుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 17.. కేసీఆర్ కు మోడీ ఝలక్

  సెప్టెంబర్ 17 ఈ తేదీ అందరికీ అంత ముఖ్యమైన రోజు కాదు కాని తెలంగాణకు చాలా ప్రాముఖ్యం ఉన్నరోజు. హైదరాబద్ ను నిజాంలు పరిపాలిస్తున్న నేపథ్యంలో అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభ బాయ్ పటేల్ వారితో పోరాడి హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేశారు. దీనికి గాను తెలంగాణ విమోచన దినంగా పేరు పెట్టలని నాటి నేటి వరకూ అనుకుంటూనే ఉన్నారు కాని ఇంత వరకూ జరిగింది లేదు. ఈ విషయంపై కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా మార్చాలని చెప్పారు. కానీ అధికారం చేపట్టిన తరువాత ఆసంగతే పూర్తిగా మర్చిపోయారు. పైగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్2 చేస్తున్నాం కదా ఇంకా ఈ విమోచన దినం అవసరమా అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అయితే ఆరోజు కూడా మర్చిపోయినట్టున్నారు కేసీఆర్.  దాని గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే సెప్టెంబర్ 17 వ తేదీని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుంచుకొని మరీ దాని గురించి ప్రస్తావించి కేసీఆర్ కు ఝలక్ ఇచ్చారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్ ప్రస్తావించకపోయినా మోడీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్ లో విలీనం చేసే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన వారికి వందనాలు’’ అని మోడీ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇక కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్న సంబంధాలు కూడా అంతంతమాత్రమే. ఈనేపథ్యంలో మోడీ చేసిన ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఇంకో ఝలక్ తగిలినట్టయింది.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలో వైకాపాలోకి జంప్?

    మాజీ స్పీకర్  నాదెండ్ల మనోహర్ త్వరలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తాజా సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు అందరూ విభజనకు అనుకూలంగానో, వ్యతిరేఖంగానో వ్యవహరించారు. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం ఆ సమస్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడయినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా మసులుతున్నారు. ఏడాదిన్నర కాలం గడిచినా ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఆయన కూడా వైకాపాలో చేరాలని నిశ్చయించుకొన్నట్లు తాజా సమాచారం. వచ్చే నెలలో దసరా పండుగ రోజున లేదా తరువాత కానీ ఆయన వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు సింగపూరు బయలుదేరనున్న చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రేపు సింగపూర్ బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు మంత్రులు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, మునిసిపల్ శాఖా మంత్రి పి. నారాయణ, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, దాని డైరెక్టర్లు, అధికారులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు కూడా సింగపూర్ వెళుతున్నారు. వారు మూడు రోజులపాటు సింగపూరులో పర్యటించి రాజధాని అమరావతి మాష్టర్ ప్లానులో చేయవలసిన కొన్ని మార్పులు, చేర్పుల గురించి సింగపూర్ నిపుణుల బృందంతో చర్చిస్తారు. అనంతరం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ ప్రధాని లీ హ్సేయిన్ లూంగ్ ని కలిసి వచ్చేనెల 22న జరుగబోయే రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. చంద్రబాబు నాయుడు బృందం మళ్ళీ బుదవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోవచ్చును.

బీహార్ లో ఎన్డీయేకే విజయం: జీ న్యూస్ సర్వే

  అక్టోబర్ 12వ తేదీ నుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలోగా ఎలాగయినా గెలిచి బీహార్ లో కూడా అధికారం దక్కించుకొని తన సత్తా చాటాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. బీజేపీని ఒంటరిగా డ్డీ కొనలేమని గ్రహించిన ఆరు పార్టీలు కలిసి జనతాపరివార్ కూటమిగా ఏర్పడ్డాయి. దాని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఎన్నుకొన్నారు. కనుక మళ్ళీ అధికారం నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది. కనుక ఈ ఎన్నికలు ఆయన జీవన్మరణ సమస్య వంటివని చెప్పవచ్చును. సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధులు ఇంకా చాలా మంది బరిలో ఉన్నారు. కనుక ఏ పార్టీకి లేదా కూటమికి ప్రజలు పట్టం గడతారనే విషయం ఎవరూ ఊహించలేకపొతున్నారు.   జీ న్యూస్ ఛానల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనతా పరివార్, కాంగ్రెస్ పార్టీల కూటమికి కేవలం 70 స్థానాలు మాత్రమే రావచ్చని తెలియజేసింది. ఎన్డీయే కూటమికి 50.8 శాతం, జనతా పరివార్ కూటమికి 42.5 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.

బీజేపీ-ఎంఐఎం మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందా?

మజ్లిస్(ఎంఐఎం) ఎంట్రీతో ఓట్లు చీలిపోయి చివరికి బీజేపీ కూటమికి లబ్ది జరుగుతుందని గుర్తించిన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ అలయన్స్...ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. ముస్లిం ఓట్లు జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి పడకుండా, చీలిపోవాలనే కుట్రతోనే అసదుద్దీన్ ను ప్రధాని మోడీ రంగంలోకి దింపారంటూ జేడీయూ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసింది. మోడీతో అసదుద్దీన్ రహస్య భేటీ జరిగిందని ఆరోపిస్తున్న జేడీయూ... ప్రధాని సూచనతోనే ఎంఐఎం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని వ్యాఖ్యానించింది. అయితే జేడీయూ ఆరోపణలను ఎంఐఎం కొట్టిపారేయగా, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామంటూ బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాము ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయలేదని, మోడీ-అసదుద్దీన్ భేటీపై మీడియాలో కూడా వార్తలొచ్చాయని, అయినా దీనిపై ప్రధాని కార్యాలయం ఎందుకు ఖండించలేదంటూ జేడీయూ ఎదురుప్రశ్నిస్తోంది.

అసెంబ్లీలో మమ అనిపిద్దామంటున్న కేసీఆర్

రైతు ఆత్మహత్యలు, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో వరస్ట్ ప్లేస్, చైనా టూర్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్రభుత్వం...అసెంబ్లీ సమావేశాలను ఏదో తూతూమంత్రంగా మమ అనిపించాలని డిసైడయ్యిందట. ఎక్కువ రోజులు నిర్వహిస్తే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న కేసీఆర్...కేవలం ఐదురోజులు మాత్రమే జరపాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఈనెల 23నుంచి 30వరకు అంటే మధ్యలో మూడ్రోజుల సెలవులను తీసేసి... 23, 24, 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీని నిర్వహించనున్నారు. సమావేశాలు ఐదురోజులే అయినప్పటికీ, ప్రతిపక్షాలు...తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశమున్నందున... ఎదురుదాడికి దిగాలని మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ మెట్రో రైల్లో ఘోరం, విద్యార్ధి హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది, మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు, సీటు కోసం జరిగిన గొడవలో విచక్షణ కోల్పోయిన విద్యార్ధులు... పదహారేళ్ల ఇషును కత్తితో పొడిచి చంపేశారు. ఢిల్లీ కింగ్స్ వే క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో మెట్రోరైల్ ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందురోజు కూడా సీటు విషయంలో విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ గొడవను మనసులో పెట్టుకున్న కొందరు... ప్లాన్ ప్రకారం ఇషుఫై దాడికి తెగబడ్డారని, వీరంతా పదహారు, పదిహేడేళ్ల లోపు వారేనని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఐదుగురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన ఢిల్లీ ఖాకీలు...కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్ధులు...రెండు గ్రూపులుగా ఏర్పడి కొద్దిరోజులుగా దాడులు చేసుకుంటున్నారని, అదే క్రమంలో ప్లాన్ ప్రకారం ఇషుపై అటాక్ చేసి కత్తితో పొడిచి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

గవర్నర్ నరసింహన్ కు అలానే బావుందంట

  ప్రసుత్తం తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యంమంత్రులు వారి వారి పనులతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒక గవర్నర్ ఉన్నారనే సంగతి మర్చిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నా గవర్నర్ దగ్గరకు వచ్చి పరిష్కార మార్గం చూపమని కోరేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య వాదాలు ఒక రేంజ్ లో ఉండేవి. అప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అడపాదడపా గవర్నర్ దగ్గరకు రావడం వారి సమస్యలు వివరించడం జరిగేది. అయితే ఎప్పుడైతే ఓటుకు నోటు వ్యవహారం బయటపడిందో అప్పుటి నుండి గవర్నర్ కు అసలు చిక్కులు వచ్చిపడ్డాయి. ఈవిషయంపై ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు పోటాపోటీగా గవర్నర్ కు ఫిర్యాదులు చేశారు. అయితే గవర్నర్ మాత్రం ఈ విషయంలో రెండు రాష్టాలకు సరైన పరిష్కార మార్గం చూపలేకపోయారు. ఎవరిని సపోర్టు చేస్తే ఏం సమస్య వచ్చిపడుతుందో అన్న భయంతో  వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చారే తప్ప సరైన చర్యలు తీసకోలేకపోయారు. ఇక అప్పటినుండి ఇద్దురు సీఎం లు కూడా గవర్నర్ తో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య వచ్చిన కోర్టునో.. కేంద్రాన్నో ఆశ్రయిస్తున్నారే తప్ప గవర్నర్ వరకూ వెళ్లడం లేదు. దీంతో ఇద్దరు సీఎంలే కాదు.. మంత్రులు.. అధికారులు కూడా రాజభవన్ ఎక్కడుందో మరిచిపోయారంటూ.. అసలు గవర్నర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారంటూ మర్చిపోయారని కొంతమంది విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. అసలు సంగతేంటంటే గవర్నర్ కూడా ఎలాంటి తలనొప్పులు లేకుండా.. ఈజీవితమే హాయిగా ఉందని.. హాయిగా కాలం గడిపేస్తున్నారట.

ఎస్సైని కొట్టి చంపి, ఆ తర్వాత ఉరి తీశారు

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ అనుమానాస్పద మృతి... తెలంగాణలో సంచలనం సష్టిస్తోంది. ఎస్సై మృతి వెనుక మంత్రి మహేందర్ రెడ్డి, ఇసుక మాఫియా, ఇద్దరు సీఐల హస్తముందంటూ ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలోనూ ఎస్సై రమేష్ మృతదేహంపై అనేకచోట్ల గాయాలున్నాయని తేలడంతో, కొట్టిచంపి ఆ తర్వాత ఉరి వేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్సై భార్య గీత, అతని కుటుంబ సభ్యులు మొదట్నుంచీ అవే అనుమానాలు వ్యక్తంచేస్తుండగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా అలాంటి సందేహాలే వ్యక్తంచేశారు. ఎస్సై రమేష్ ను కొట్టిచంపి ఉరేశారని, ఈ కేసును కేసీఆర్ సీరియస్ గా తీసుకుని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్సై రమేష్ అంత్యక్రియల సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని పట్టుబట్టిన బంధువులు... ఎస్పీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

వరుణ్ తేజ్ ను తనకోసమే కన్నారంట..

  అందరి కంటే కాస్త భిన్నంగా సినిమాలు తీయడంలో తనదైన ప్రత్యేకతను చాటి చూపాడు విలక్షణ డైరెక్టర్ క్రిష్. ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా విభిన్న కథాంశంతో కంచె సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుక రానున్నారు. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఉండే ఈ సినిమా ఫస్ట్ లుక్ కే చాలా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈసినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా డైరెక్ట్రర్ క్రిష్  మాట్లాడుతూ వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాసుకున్న పాత్రకు వరుణ్ 100 శాతం న్యాయం చేశాడని.. వరుణ్ తోపాటు యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 70 ఏళ్ల తర్వాత జరిగిన నేపథ్యం ఆధారంగా తీసిన సినిమా కాబట్టి అప్పడు వాడిన తుపాకులు.. టీకప్పులు.. ట్యాంకర్లు వాడామని.. దీనికి జార్జియా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. వరుణ్ తేజ్ లాంటి అందమైన అబ్బాయిని నాగబాబు నాకోసమే కన్నారని.. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

కొత్త ఐడియాలు కావాలంటున్న చంద్రబాబు

రైతు రుణమాఫీపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో రుణమాఫీ సక్రమంగా అమలు జరుగుతున్నా, కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని బాబు మండిపడ్డారు. కలెక్టర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రుణమాఫీపై సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు, రుణమాఫీపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్లకు ఆదేశించారు. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు... ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చినా, ఇంకా కొన్నిచోట్ల పవర్ కట్స్ జరుగుతున్నాయని మండిపడ్డారు. బోగస్ కార్డులు ఏరివేసి, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయాలని కలెక్టర్లకు బాబు దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు నిత్యం ప్రజల్లో ఉండాలన్న సీఎం, స్టేట్ డెవలప్ మెంట్ కు కొత్త ఐడియాలు ఇవ్వాలంటూ కోరారు.

ఎయిర్ బేస్ పై అటాక్ తో కంగుతిన్న పాక్ ఆర్మీ

పాకిస్తాన్ లో తరుచూ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దాయాది దేశం అదే ఉగ్రవాదానికి బలైపోతోంది. ఇప్పుడు ఏకంగా పాక్ ఎయిర్ బేస్ మీదే దాడి చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. పెషావర్ లోని వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు...17మందిని కాల్చిచంపారు. రాకెట్ లాంచర్లు, ఏకే 47 రైఫిళ్లు, భారీ పేలుడు పదార్ధాలతో విరుచుకుపడ్డ దుండగులు... మసీదులో ప్రార్థనలు జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 17మంది అక్కడికక్కడే చనిపోగా, మరో 30మంది పరిస్థితి క్రిటికల్ ఉంది.ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో 13మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రకటించింది. అయితే ఏకంగా వైమానిక స్థావరంపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో సైన్యం కంగుతింది. ఈ దాడులకు పాల్పడింది తామేనని తెహ్రీక్ ఎ తాలిబన్ సంస్థ ప్రకటించుకుంది.

కేసీఆర్ కు కొత్త గవర్నర్ గుబులు పట్టుకుందా?

  ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహాన్ స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సమస్యలు తట్టుకోలేకనో.. లేక ఇద్దరు సీఎంలు తనపై చూపిస్తున్న ప్రవర్తనకు గానో గవర్నర్ స్వచ్చందంగా తను పదవి నుండి తొలగిపోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు గాను మొదట్లో చిటీకీమాటికీ గవర్నర్ దగ్గరకి వెళ్లి ఫిర్యాదు చేసే ముఖ్యమంత్రులు ఇప్పుడు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లడం లేదు. చంద్రబాబు సంగతేమో కని ప్రతి చిన్న విషయానికి గవర్నర్ దగ్గరకు వెళ్లే కేసీఆర్ ఇప్పుడు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదట. దీనికి కారణం ఏంటంటే గవర్నర్ స్థానంలో కొత్తగా వచ్చే గవర్నర్ విషయంలో కేసీఆర్ టెన్షన్ గా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఏ క్షణంలోనైనా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకం జరగవచ్చు అనే కబురు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందట. దీంతో కేసీఆర్ అటెన్షన్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ తో అయితే కేసీఆర్ కు మంచి రిలేషన్ ఉంది. దాని కారణంగా ఆయనకు కావలసిన పనులు చేయించుకునేవారు. కాని ఇప్పుడు రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జీ సదా శివం.. ఈయనకు చట్టాలు వాటిలో ఉండే లొసుగులు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన ముందు తోక జాడించడానికి కుదరదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొత్తగా వచ్చే గవర్నర్ విషయంపై కాస్తంత టెన్షన్ గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి గవర్నర్ డీల్ చేసినట్టు కేసీఆర్ కొత్త గవర్నర్ ను డీల్ చేస్తారో లేదో చూడాలి.

టీఆర్ఎస్ vs బీజేపీ.. ఫైట్ జస్ట్ మిస్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు.. టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొట్లాట జస్ట్ మిస్ అయింది.  తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద రోడ్డు విస్తారణ పనులకు గానూ శంకుస్థాపన చేశారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ నేతలు అక్కడికి చేరుకొని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ప్రోటోకాల్ పాటించలేదని.. శిలాఫలకంపై ఆయన పేరు రాయలేదని ఆయనను నిలదీశారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై వాదనకు దిగారు. బీజేపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు. దీనికి ధీటుగా కేసీఆర్ జిందాబాద్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా ఇరువురు వాదులాడుకుంటా ఆఖరికి రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే వెంటనే  అక్కడున్న ఎంపీ జితేందర్ రెడ్డి కలుగుజేసుకొని అక్కడున్న వారికి సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.