చంద్రబాబును లేడీ సెంటిమెంట్ తో కొట్టిన రోజా

ఫైర్ బ్రాండ్ రోజా...మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడింది, ఈసారి లేడీ సెంటిమెంట్ ను ప్రయోగించి సీఎంను కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. మహిళలపై తరుచుగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆమె... చంద్రబాబుకు ఆడపిల్లలు లేనందునే పట్టించుకోవడం లేదని విమర్శించారు, ఆడవాళ్ల విలువ ఏంటో ఆయనకు తెలుసుంటే...నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిపై సరైన చర్యలు తీసుకునేవారని, రిషితేశ్వరి విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే, ఇప్పుడు విజయవాలో విద్యార్ధిని భానుప్రీతి ఆత్మహత్య చేసుకునేది కాదని రోజా ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి విషయంలోనూ చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారన్న రోజా... చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా విద్యార్ధినుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

టికెట్ రాలేదని ఏడ్చేసిన నాయకుడు

ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు హామీలివ్వడం కామన్.. ఒకవేళ గెలిచారో అంతే తరువాత ఆ హామీల గురించి మళ్లీ ప్రజలు గుర్తు చేసేవరకూ గుర్తుండవు. అధికారం రావడానికి ఎన్ని మాటలైనా మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చాల్సిన నాయకుడే తనకు పదవి రాలేదంటూ బోరున విలపించాడు. బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో ఈ ఆర్ ఎస్ ఎల్ పి లీడర్ అశోక్ గుప్తా ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున ఏడ్చేశాడు. దీనిలో భాగంగానే తమ అధినేత కుష్వాహా ఎదుట దయచేసి నాకు ఒక టికెట్ ఇవ్వండంటూ.. కాళ్లావేళ్లపడి బతిమాలాడు. టికెట్ కోసం డబ్బులిచ్చానని.. ఆ డబ్బంతా గంగపాలైందని శోకాలు పెట్టారు. అయితే అశోక్ గుప్తా ఒక్కడికే కాదు ఈ ఎన్నికలలో చాలామంది నేతలకు కూడా పార్టీ టికెట్లు దక్కలేదు. కానీ వారెవరూ ఇంత సీన్ క్రీయేట్ చేయలేదు. మొత్తానిక టికెట్ రాలేదని ఏడుస్తున్న రాజకీయ నాయకులు ప్రజలు ఏడ్పును ఏలా తీరుస్తున్నారో..

అసెంబ్లీ, బడ్జెట్‌ అంటే ఎంటో తెలుసా? జగన్ కు పత్తిపాటి ప్రశ్న

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు అని విమర్శించారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను పత్తిపాటి ఖండించారు. ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు, మంత్రులకు తెలియదని జగన్‌ అంటున్నారని, జగన్‌కు అసెంబ్లీ, బడ్జెట్‌ అంటే ఎంటో తెలుసా? అని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు జగన్ మాత్రం రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు.. కానీ రాష్ట్రం విడిపోయి ఆర్ధిక లోటు ఉన్నా గాని చంద్రబాబు రుణమాఫీలు చేశారు.. అలాంటిది జగన్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అనేక అవినీతి పనులు చేశారని అన్నారు. అంతేకాదు తెలుగుదేశం, బిజెపి విడిపోవాలని జగన్‌ కోరుకుంటున్నారని, దాంతో కేసుల నుంచి బయటపడాలని ఆయన ఆరాటపడుతున్నారని విమర్శించారు.

గద్దర్ మతలబు ఏంటి?

  నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ కు పోటీగా వరంగల్ ఉపఎన్నికల్లో ఉద్యమపాటకారుడు గద్దర్ పోటీచేస్తారు అనుకున్నారు. కాని తాను ఏ ఎన్నికల్లో పోటీచేయట్లేదని తేల్చిచెప్పారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు గద్దర్ గులాబీ బాస్ ను పొగడంపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఏమైందో ఏమో తెలియదు కాని సడన్ గా గద్దర్ గాలి కేసీఆర్ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చక్కని ప్రణాళికను సిద్దం చేసిందని ప్రశంసించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్య చేసుకోవద్దని.. రాష్ట్రం ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 6 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. వరంగల్ ఎన్ కౌంటర్ లో విషయంలో కూడా కేసీఆర్ ను సమర్ధిస్తూ మాట్లాడారు. దీంతో ఇప్పుడు అందరికి గద్దరు గులాబీ గూటికీ చేరే ఆలోచనలో ఉన్నారేమో అని చర్చించుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఈవిధంగా కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారని అనుకుంటున్నారు.

జాతీయపార్టీగా టీడీపీ తొలి గెలుపు

  తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో జాతీయపార్టీగా టీడీపీకి తొలి విజయం సాధించినట్టు తెలుస్తోంది. అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటుతోంది. ఈ రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 వార్డుల్లో తెలుగుదేశంపార్టీ 5,6 వార్డుల్లో విజయం సాధించింది. మిగిలిన వార్డుల్లో బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి.  ఇంకా 12 వార్డుల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అయితే టీడీపీ జీజేపీ మిత్రపక్షాలే కాబట్టి ఈ రెండు పార్టీల కూటమికి మెజారిటీ దక్కాలంటే ఇంకా 5 స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉంది.

విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మధ్య అనేక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల సమస్య. తెలంగాణ ప్రభుత్వం స్థానికత ఆధారంగా సుమారు 1200 మంది ఉద్యోగులను రివీల్ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా అక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో వారి పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. ఆఖరికి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు అనేక విచారణల అనంతరం ఎట్టకేలకు విద్యుత్ ఉద్యోగులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని.. నాలుగు వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 58 శాతం, తెలంగాణ రాష్ట్రం 42 శాతం జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు తమ తుది తీర్పు వరకు ఉద్యోగులు తెలంగాణకే చెందుతారని హైకోర్టు చెప్పడంతో  ఉద్యోగులకు ఊరట లభించింది.

బ్రహ్మానందాన్ని టార్గెట్ చేసింది ఎవ‌రు?

ఎంత నెల్లూరి పెద్దారెడ్డిగారి మేనల్లుడైనప్పటికీ...ఆయనికీ కష్టాలు తప్పట్లేదు. ఎవరికి వారు ఇంతకాలం ఆయన్ని కూరలో కరివేపాకులా వాడుకున్నా, ఇప్పుడతడ్ని పూర్తిగా వాడటం మానేశారు. మెగా కాంపౌండ్ నుంచి నంద‌మూరి ఫ్యామిలీ వ‌ర‌కూ ఎవరికీ బ్రహ్మీ అవ‌స‌రం లేదిపుడు. ఒకవేళ అవ‌స‌ర‌మైతే ప్రేక్షకులకు తమ అవ‌స‌రం పోతుందోన‌నే భ‌యం హీరోలకు పట్టుకుందట. ఎందుకంటే బ్రహ్మీ  ఏ సినిమాలో చేస్తే ఆ సినిమాలో హీరో హైలేట్ అవడం లేదట. అందుకే రీసెంట్ హిట్ ఫిల్మ్ శ్రీమంతుడులో ముందుగా బ్రహ్మీని అనుకుని ఆ త‌రువాత తీసేశారు.లేటెస్ట్ గా ‘సినిమా చూపిస్త మావ‌‘ ట్రైల‌ర్లో సార్ ఉన్నారు..కానీ ఆ మూవీ రైట్స్ దిల్ రాజు చేతిలో పడ్డాక సినిమాలో సార్ కనిపించలేదు. అంతేకాదు బాలయ్య బాబు డిక్టేటర్ నుంచి బ్రహ్మీని ఉన్నపళంగా తీసేశారు, ఇద‌నే కాదు రానున్న చాలా చిత్రాల్లో బ్రహ్మానందం కనబడే ఛాన్సే కనిపించడం లేదు, తన ప్రతీ సినిమాలో బ్రహ్మానందాన్ని కచ్చితంగా తీసుకునే శ్రీనువైట్ల కూడా ఇప్పుడు బ్రహ్మీకి పాత్ర ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందట, ఇలా చెపుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే బ్రహ్మీ కారణంగా తమ ఇమేజ్ డామేజ్ అవుతోందని హీరోలు ఫీలవడం, నిర్మాతలు ఖర్చు తగ్గించుకోవడమే దీనంతటికి కారణమట.

ఈసారి అడిగితే మూల్యమే.. టీసర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

  అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుద్ది.. ఏం నిర్ణయాలు తీసుకున్నా సరిపోద్ది అన్న పథాంలో  తెలంగాణ ప్రభుత్వం అంశం ఏదైనా కానీ వారికి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇప్పుడు వాటివల్ల వచ్చే పరిణామాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాల్లో హైకోర్టు చేత మొట్టికాయలు తింటూనే ఉంది. హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ స్పీడుకు బ్రేకులు వేస్తునే ఉంది. ఇప్పుడు మరో  వివాదంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులు..  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు.. కార్పొరేషన్ ఛైర్మన్ లకు ఇచ్చిన క్యాబినెట్ హోదా విషయంపై.. ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఇచ్చేస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్య దాఖలైంది. దీనిపై గతంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. వాదనలు వినిపించాలని కోరింది. అయితే గతంలో దీనిపై మూడుసార్లు విచారణ జరిపినా తెలంగాణ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక మరో వాయిదా కావాలని కోరడం జరిగింది. ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం మరో వాయిదాని అడుగగా హైకోర్టు సీరియస్ అయింది. నాలుగు దఫాలుగా వాయిదాలు అడుగుతూనే ఉన్నారు.. కానీ వాదనలు వినిపించేది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఈసారి కనుక వాయిదా అడిగితే ప్రతి వాయిదాకు 3 వేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది అని ఆదేశించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా సమాధానం చెపుతుందో లేక మూల్యం చెల్లిస్తుందో చూడాలి.

ఒక్కసారి.. ఒకే ఒక్కసారి అంటున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి గాను పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రదేశమని.. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంకు కూడా ఏపీకి రెండో ర్యాంకు ఇచ్చిందని తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలంటూనే అంతకు ముందు ఒక్కసారి ఏపీకి రావాలని.. అక్కడి పరిస్థితులను చూసి.. పరిశీలించి ఆతర్వాత నిర్ణంయ తీసుకోండంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి.. ఏపీలో పెట్టుబడులను ప్రవాహంలా పారించడానికి బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఒక్కసారి ఏపీని విజిట్ చేయండి అని కోరినందుకైనా ఎంతమంది పారిశ్రామిక వేత్తలు ఏపీని విజిట్ చేస్తారో.. పెట్టుబడులు పెడతారో చూడాలి.

ఏపీ క్యాబినేట్ ప్రక్షాళన.. దసరా తరువాత

త్వరలో ఏపీ క్యాబినేట్ లో పలు కీలకమార్పులు జరగబోతానే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్టు తెలస్తోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన తరువాత క్యాబినేట్ ప్రక్షాళన చేయనున్నట్టు రాజకీయ వర్గాల వినికిడి. ముఖ్యంగా కొన్ని శాఖలు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రులు కేఈ, శ్రీనివాస్ కామినేనికి మాత్రం పదవీ గండం తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఈ శాఖా మంత్రుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈరెండు శాఖలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. అయితే గత మూడు నెలల క్రితమే మంత్రుల తొలగింపు విషయం బయటకు వచ్చినా చంద్రబాబు సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చి మంత్రుల మార్పిడిపై దృష్టిసారించి.. అమరావతి శంకుస్థాపన తరువాత సరిగా పనిచేయని మంత్రులను ఇంటికి సాగనంపనున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు.. కేసీఆర్.. ఇంతలోనే ఎంత మార్పు

  రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని మన తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తేనే పరిస్థితి అర్ధమవుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత కేసీఆర్ కు తెలంగాణ మిగులు బడ్టేట్ లో గుజరాత్ తరువాత రెండో స్ఠానంలో ఉన్న రాగా.. చంద్రబాబుకేమో ఏపీ ఆర్ఠిక లోటు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు తెలంగాణలో  కేసీఆర్ తన దూకుడుని ప్రదర్శిస్తూ ఎలాగూ మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి హామీల మీద హామీలు.. వేతానాల్లో ఏపీ పెంచిన దాని కంటే ఒక శాతం ఎక్కువే పెంటడం లాంటి పనులు చేసి తన ఒంటెద్దు పోకడని అనుసరించారు. మరోవైపు చంద్రబాబు.. ఒక రకంగా చెప్పాలంటే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టతరమైన పనే. అలాంటి పనికి తాను పూనుకొని రాజధాని నిర్మాణానికి.. ఏపీ అభివృద్దికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో వారుంటే అప్పుడే ఓటుకు నోటు కేసు బయటకొచ్చింది. ఇంకేముంది.. దీంతో చంద్రబాబు పని అయిపోయింది.. చంద్రబాబు ఈ కేసులోంచి బయటకు రావడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ మాటలు కొన్ని రోజుల వరకే పరిమితమయ్యాయి. పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు చంద్రబాబు ఏపీ అభివృద్ధికోసం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే.. కేసీఆర్ పరిస్థితే అయోమయంలో ఉంది. ప్రపంచ బ్యాంకు ఏపీకి రెండో స్ఠానం ఇవ్వడం.. విద్యుత్ పంపిణీ సరఫరాల నష్టాల తగ్గింపులో ఏపీ ముందుండటం.. వెరసి చంద్రబాబు రాష్ట్రంకోసం పని చేస్తున్న దిశకు నిదర్శనం. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే మిగులు బడ్జెట్ అయిపోయి అప్పుల పాలైంది.. మరోవైపు రైతుల ఆత్మహత్యలు.. అదీకాక ఏదో విషయంలో హైకోర్టు చేతనో.. సుప్రీంకోర్టు చేతనో మొట్టికాయలు వేయించుకోవడమో.. అందులోనూ ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడంతో కేసీఆర్ కు ఎం చేయాలో తెలియని పరిస్థితో ఉన్నారు. అంతేకాక ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలోనూ టీఆర్ఎస్ నేతలకు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్నట్లు ఇద్దరు సీఎంల విషయంలో ఇంతలోనే ఎంత జరిగింది అన్నట్టు ఉంది వ్యవహారం.

పోల'వరం'తో ప్రజల ముందుకు

ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతాం...ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్, సేమ్ టు సేమ్ అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాడాలనుకుంటున్నారు, పట్టిసీమ సక్సెస్ తో దూకుడు మీదున్న చంద్రబాబు, అదే ఊపులో పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట,పోలవరం పూర్తయితే, ఆ పేరుతో 2019లో ఓట్లు అడగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట, పోలవరం పూర్తయితే ఇటు కృష్ణాడెల్టాకు, అటు ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చని, రాయలసీమకు శ్రీశైలం నీటిని పూర్తిగా కేటాయించి ఆ ప్రాంతాన్ని కూడా సంతృప్తి పర్చాలని ఆలోచన చేస్తున్నారట, చంద్రబాబు అనుకున్నట్లుగా పోలవరం పూర్తయితే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగుండదేమో!

ఆ నిర్ణయమే తీసుకుంటే వాట్సప్ తో నో పర్సనల్ చాటింగ్

  స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వాళ్లకి వాట్సప్ గురించి తెలిసే ఉంటుంది. ఒక్క ఛాటింగ్ మాత్రమే కాకుండా ఫోటోలు.. చిన్న చిన్న వీడియోలు సైతం ఈ వాట్సప్ ద్వారా పంపించుకునే సౌకర్యం ఉంది కాబట్టే ఈ యాప్ అంత పాపులర్ అయింది. ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ ఆఖరికి రాజకీయ వేత్తలు కూడా ఈ వాట్సప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం వాట్సప్ విషయంలో చట్టపరంగా తీసుకోబేయే ఒక నిర్ణయం ద్వారా వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే వాట్సప్ ఉపయోగించేవారు తాము ఛాటింగ్ చేసిన మెసేజ్ లను మూడు నెలల వరకూ డిలీట్ చేయకూడదని.. వాటిని మూడు నెలల పాటు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ చట్టపరమైన నిర్ణయమే తీసుకొన్నట్లయితే వాట్సప్ వినియోగదారులు ఖచ్చితంగా మెసేజ్ లను మూడు నెలల పాటు డిలీట్ చేయకుండా ఉంచాల్సిందే. అప్పుడు వినియోగదారులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ఆచితూచి చాటింగ్ చేయాల్సిన పరిస్థితి వుంటుంది... దీనివల్ల అవసరమైతే వినియోగదారులు వాట్సప్ వినియోగించడం మానేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

టీ టీడీపీ పీఠం.. రేసులోకి దిగిన మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అసలు ఇప్పటివరకూ పార్టీ పరిపాలనా కలాపాలు చూసిన ఎల్. రమణకే చంద్రబాబు మళ్లీ ఆబాధ్యతలు అప్పగించాలని చూశారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిర్ణయాన్నివిరమించుకోవాల్సి వచ్చింది. తరువాత  టీ టీడీపీలో యాక్టివ్ గా ఉండే రేవంత్ రెడ్డికి అధికార పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఈ విషయంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఏమాత్రం తమ మద్దతు ఇవ్వలేదు. అందునా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఎర్రబెల్లికి.. రేవంత్ రెడ్డికి అంతర్గతంగా మాత్రం వారి మధ్య వివాదాలు ఉన్నాయి.. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిపై ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి అందరి నాయకులను ఏకగ్రీవంగా ఒప్పింటి రేవంత్ రెడ్డిని పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనుకున్నారు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. అదిగాక ఐవీఆర్ఎస్ పద్దతి ద్వారా కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాల గురించి తెలిపారు. అయితే కేవలం 200 మంది నుండే అభిప్రాయాన్ని సేకరించడంతో తెలంగాణలో 2 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని.. కేవలం 200 మంది అభిప్రాయాలనే ఎలా సేకరిస్తారని అభ్యంతరం వ్యక్త పరిచారు. దీంతో సమస్య కాస్త ఇంకా జఠిలమైంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి.. ఎర్రబెల్లి రేసులో ఉండగా ఇద్దరిలో  ఎవరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలో తెలియక చస్తుంటే ఇప్పుడు మోత్కుపల్లి రూపంలో చంద్రబాబుకు మరో సమస్య వచ్చిపడింది. ఇప్పుడు ఈ రేసులో నేను కూడా ఉన్నాను అంటూ ముందుకొచ్చారు మోత్కుపల్లి. దళితకార్డును ముందుపెట్టి పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీ టీడీపీలో వేడి వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి తోనే సమస్య వచ్చిపడితే ఇప్పుడు మోత్కపల్లి కూడా యాడ్ అయ్యాడు. ఒకవేళ రేవంత్ రెడ్డికే అధ్యక్ష పదవి కట్టబెడదామా అనుకుంటే పార్టీలో నేతలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడేట్లు కనిపించడంలేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. మరి చంద్రబాబు ఈసమస్య ఎలా పరిష్కరిస్తారో.. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెడతారో చూడాలి.

అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారు

 కార్మికుల నిర్లక్ష్యంతో బతికున్న మనిషిపై రోడ్డు వేసి అతని ప్రాణాలను బలిగొన్నారు. ఈదారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లోని కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో జరిగింది. వివరాల ప్రకారం లటోరి బర్మాన్ అనే వక్తి తన భార్యతో పండుగ సందర్భంగా తన అత్తగారింటికి వెళ్లాడు. అయితే పండుగ అయిపోయిన తరువాత తన భార్యను అక్కడే వదిలి పెట్టి తన ఊరికి బయలుదేరాడు. అయితే బర్మాన్ కు మద్యం అలవాటు ఉండటంతో మధ్యలో ఆగి తాగి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికే ఎక్కవ తాగడంతో నడుస్తూనే మధ్యలో పడిపోయాడు. అయితే... ఆయన పడిన చోట పెద్ద గొయ్యి ఉంది. ఆ మరుసటి రోజు రోడ్డు పనులు చేసే కూలీలు ఆ గుంతలో అతనిని చూడకుండానే కంకర,మట్టి వేసి పూడ్చిపెట్టారు. అయితే వారు కంకర వేస్తున్న సమయంలో మెలకువ వచ్చిన బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించిన క్రమంలో ఒక చేయి మాత్రమే బయటకు వచ్చింది కాని ఫలితం లేదు. ఊపిరిఆడక బర్మాన్ గుంతలోనే మరణించాడు. తరువాత రోడ్డుపై బర్మాన్ చేయి చూసిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించడంతో అసలు విషయం తెలిసింది. అయితే కూలీల నిర్లక్ష్యం వల్లే బర్మాన్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

వాళ్లూ సూట్లు ధరించారు.. రాహుల్ పై వెంకయ్య ఫైర్

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీది సూటు బూటు పాలన అని ఎప్పటినుండో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. నరేంద్ర మోడీది సూటు-బూట్ పాలన అంటున్నారు.. మరి నెహ్రూ, రాజీవ్ గాంధీలు సూటు-బూటు వేసుకోలేదా అని ప్రశ్నించారు. వాళ్లూ అప్పుడు అవే ధరించారు.. ఆ సంగతి రాహుల్ మర్చిపోయినట్టున్నాడు..ఇప్పుడు సూటు-బూటు అంటూ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు మోడీ ధరించిన సూటును వేలం పెట్టిన సంగతిని రాహుల్ గుర్తుంచుకోవాలని వెంకయ్య తెలిపారు. రాహుల్ మాటలు చిన్నపిల్లాడు మాట్లాడినట్టుగా, మెచ్యూరిటీ లేనట్టుగా ఉన్నాయని.. అసలు రాహుల్ కు ఉపన్యాసాలు ఎవరు రాస్తున్నారో తెలియదుగానీ వారే సరిగా లేరని..పాపం రాహుల్ వారు రాసినవి తెచ్చుకొని చదువుతున్నారని ఎద్దేవ చేశారు.

అఖిల్ ఆడియో లాంచ్.. వేలు చూపిస్తూ హిరోయిన్ కు అఖిల్ వార్నింగ్

వి.వి వినాయక్ దర్శకుడిగా.. హీరో నితిన్ హీరోగా అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా "అఖిల్" ఆడియో ఫంక్షన్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రిన్స్ మహేశ్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియో ఆవిష్కరణ చేశారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ అంతా బాగానే ఉన్నా ఒక గమత్తైన అంశం ఒకటి చోటుచేసుకుంది. అందేంటంటే "అఖిల్" సినిమాలో అఖిల్ సరసన నటిస్తున్న హీరోయిన్ సాయేషాని మన హీరో కనుసైగతోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లో యాంకర్ సుమా హీరోయిన్ సాయేషాను డ్యాన్య్ చేయమని అడుగగా.. అందుకు హీరోయిన్ అఖిల్ ను కూడా స్టేజ్ పైకి రమ్మని పిలిచింది. అంతే అఖిల్ ఒక్కసారిగా వేలు చూపిస్తూ.. కనుసైగతోనే హీరోయిన్ ను వార్న్ చేసి ఆతరువాత స్మైల్ చేసి కవర్ చేసేశాడు. దీంతో పాపం అమ్మడు ఏం చేస్తుంది ఒక్కతే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అఖిల్ హీరోయిన్ ను బాగానే కంట్రోల్ లో పెట్టాడని అనుకుంటున్నారు.