సొంతింటికి వచ్చేయమంటున్న వీహెచ్ పీ

వివిధ కారణాలతో ఇతర మతాలను స్వీకరించిన హిందువులు... మళ్లీ సొంతింటికి రావాలంటూ 'ఘర్ వాపసీ' చేపట్టిన విశ్వహిందూ పరిషత్... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు కూడా ఆహ్వానం పలికింది. ఇరాన్ సినిమా 'మహ్మద్-మెసెంజర్ ఆఫ్ గాడ్'కు సంగీతం అందించినందుకు సున్నీ ముస్లిం గ్రూప్ రజా అకాడమీ...ఫత్వా జారీ చేయడంపై మండిపడ్డ వీహెచ్ పీ, ఏఆర్ రెహ్మాన్ సొంతింటికి(ఘర్ వాపసీ) రావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. ఏఆర్ రెహ్మాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఫత్వాలో వాడిన భాష అత్యంత దారుణమన్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్.... రెహ్మాన్ కోసం హిందూ సమాజం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు.రెహ్మాన్ కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్న జైన్, ఆయనకు ఎలాంటి హాని కలుగకుండా కాపాడుకుంటామన్నారు. వివిధ కారణాలతో ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన ప్రతి ఒక్కరినీ, తిరిగి హిందూమతంలోకి (సొంతింటికి) రావాలని ఆహ్వానిస్తున్నామని జైన్ తెలిపారు.

బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు శరవేగంగా పట్టాలెక్కుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి ఢిల్లీ మెట్రో శ్రీధరన్ నివేదిక ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లొచ్చని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో నిర్మాణం కానున్న విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టును, మెట్రో గురు శ్రీధరన్ నేతృత్వంలో... ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ చేపట్టనుంది. విజయవాడలో మెట్రోరైలు పూర్తికాగానే, దాన్ని గుంటూరు వరకు విస్తరించనున్నారు.

కిడారికి గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి!

అరకు వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు...పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న కిడారి...పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కిడారి అంటీముట్టనట్లుగానే వ్యవహరించారని చెబుతున్నారు. కొణతాల మనిషిని కావడం వల్లే తనను పక్కనపెడుతున్నారని, నియోజకవర్గంలోనూ వేరొకరికి ప్రాధాన్యత ఇస్తూ తనను సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇక సర్దుకుపోవడం కష్టమని కిడారి అంటున్నారట. అయితే కిడారికి తెలుగుదేశం పార్టీ గాలం వేసిందని, గిరిజన కార్పొరేషన్ ఛైన్మన్ పదవి ఆఫర్ చేయడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఐసిస్ చెరలో మరో ఇద్దరు భారతీయులు

  ఇంతకు ముందు లిబియాలో సిర్తే పట్టణం నుంచి నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదులు మళ్ళీ మరో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ ద్రువీకరించింది. ఆంధ్రాకు చెందిన కొసనం రామ్మూర్తి, ఓడిశాకు చెందిన రంజాన్ సమాల్ అనే ఇద్దరినీ ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. జూలై 31న కిడ్నాప్ అయిన గోపీ కృష్ణ, బలరామ్ అనే ప్రొఫెసర్లు నేటికీ ఐసిస్ ఉగ్రవాదులు చెరలో బందీలుగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మరో ఇద్దరు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ నలుగురిని ఉగ్రవాదుల చెరలో నుండి విడిపించేందుకు అధికారులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు సఫలం అవుతాయో ఎవరికీ తెలియదు.

లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి చంపారు

తెలంగాణలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ పై విరసం, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే కేసీఆర్ పాలనా సాగుతోందని, స్వరాష్ట్రంలోనూ రాజ్యహింస జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమంటున్న ప్రజాసంఘాలు, విరసం నేతలు... మైనింగ్ మాఫియా కోసమే...వాళ్లిద్దరికీ పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించిన విప్లవ కవి వరవరరావు... ఎంటెక్ విద్యార్ధిని శృతిపై లైంగిక దాడికి పాల్పడి హింసించి,  యాసిడ్ పోసి కాల్చిచంపారని ఆరోపించారు.

ఇస్తావా? చస్తావా? కేబీఆర్ పార్క్ లో మరో దాడి

నిత్యం వేలాదిమంది సంచరించే కేబీఆర్ పార్క్ లో మరోసారి వాకర్స్ పై దాడి జరిగింది. వీఐపీలు, వీవీఐపీలు నివాసముండే ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య ఓ బడా పారిశ్రామికవేత్తపై ఏకే 47తోనే కాల్పులు తెగబడగా, ఈసారి ఓ మహిళా వాకర్ పై దాడి జరిగింది. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళపై హఠాత్తుగా దాడి చేసిన దుండగుడు... గోల్డ్ చైన్ ఇస్తావా? చస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు. మొదట సెల్ ఫోన్ ను లాక్కున్న దొంగ, మెడలోని చైన్ ను బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నించాడు, దాంతో బాధితురాలు ధైర్యంచేసి ఎదురుతిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాటను గమనించిన మిగతా వాకర్స్, దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి, కొద్దిరోజులు సెక్యూరిటీ పెట్టి, ఆ తర్వాత కనీసం అటువైపు కూడా తిరిగిచూడటం లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాకర్స్ ఆరోపిస్తున్నారు. నిత్యం వేలాది మంది సంచరించే కేబీఆర్ పార్క్ లో ఎప్పుడూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు

తాను మోడీ కూతుర్నే అంటున్న మోడల్

హాట్ మోడల్ అవని మోడీ...తాను ప్రధాని నరేంద్రమోడీ కూతుర్ని అంటోంది. తానే కాదు దేశంలోని ఆడపిల్లలందరూ మోడీకి కూతుళ్లేనంటోంది కేలండర్ గాల్స్ నటి. దేశానికి ఆయన తండ్రి లాంటివారంటున్న అవని, మోడీ నికార్సైన నాయకుడు, స్ఫూర్తి ప్రదాత అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. మీ పేరు వెనుక మోడీ ఉంది...మీరు ప్రధాని నరేంద్రమోడీకి బంధువా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా గడుసుగా సమాధానమిచ్చింది హాట్ మోడల్. పైగా అవని మోడీ సొంత రాష్ట్రం...గుజరాతే కావడంతో...మోడీకి ఏమైనా బంధువు అవుతారేమోనని మీడియా ప్రతినిధులు రెట్టించి అడగడంతో...కాదంటూ చివరికి క్లారిటీ ఇచ్చింది. అయితే తాను మోడీకి కూతుర్నే అంటూ గడుసుగా సమాధానమిచ్చి... అందరిచూపు తనవైపు తిప్పుకుంది. దాంతో అవని తెలివైన పిల్లేనంటున్నారు బాలీవుడ్ జనాలు.

ప్రతిపక్షాలకు మర్యాద ఇవ్వడం రాదా?

  ప్రపంచ బ్యాంకు ఏపీకి అరుదైన ఘనత దక్కించిన సంగతి తెలిసిందే. దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించాల్సి విషయం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పని చేసినా విమర్శించే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఏపీకి అరుదైన ఘనత రావడం విషయంలో మాత్రం నోరు మెదపడంలేదు. ఒకపక్క ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశాలు పర్యటనలు చేస్తూ పెట్టుబడులు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ర్యాంకు వల్ల దేశమంతా ఏపీ వైపే చూస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది.. మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద ఒకరి విమర్శులు చేసుకోమంటే రెడీగా ఉండే నేతలు మాత్రం ఇప్పటి వరకూ దీనిపై ఒక్కరు కూడా ప్రశంసించింది లేదు. అదే ర్యాంకు ఎక్కడో చివర్లో ఉంటే మాత్రం పనికట్టుకొని మరీ మీటింగ్ లు పెట్టి దీనిపై పెద్ద చర్చలు.. విమర్శలు చేసేవారు. నిజంగా ప్రజల కోసమే పాటుపడేవాళ్లు.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేవాళ్లయితే దీనిని  రాజకీయ కోణంలో చూడకుండా ఈ విషయంలో మెచ్చుకునేవాళ్లే. నిజంగా అలాగ చేసుంటే వారికి గౌరవం దక్కేది.

జగన్ రాసిన లెటర్ ను చించిపారేశారు

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దూకుడు పెంచారు. ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని, అక్కడ టీఆర్ఎస్ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. కొద్దిరోజులుగా జగన్ పై విరుచుకుపడుతున్న చినబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు జగన్ అడ్డంకిగా మారాడని, రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి సహకరించొద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారని, అయితే జగన్ లెటర్ ను చదివి నవ్వుకున్న సింగపూర్ పాలకులు దాన్ని చించిపారేశారని లోకేష్ కొత్త బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ చంద్రబాబుకు మంచి పేరొస్తుందనే బాధే  తప్ప... ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే విషయమే గుర్తుకురావడం లేదన్నారు.

బాహుబలి మరో రికార్డు

  దర్మకమౌళి రాజమౌళి జక్కన్న చెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి అనేకమంది ప్రశంసలు అందుకున్న బాహుబలి ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ బాహుబలి చిత్రాన్ని చైనాలోని 5000 థియేటర్లలో నవంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఇన్నీ థియేటర్లలో విడుదల కాలేదు. బాహుబలి సినిమాకే ఈ అవకాశం దక్కింది. ఈస్టార్స్ అనే సంస్థ బాహుబలి హక్కులు దక్కించుకొని ఏకంగా 5000 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయనుంది. ఈ రకంగా బాహుబలి మరో రికార్డు దక్కించుకుంది. అయితే బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ పీకే సినిమాను కూడా ఈ సంస్ధనే హక్కులు దక్కించుకొని చైనాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా అక్కడ 150 కోట్లు సాధించింది. ఇప్పుడు బాహుబలి కూడా అదే రీతిలో భారీగా వసూళ్లు చేస్తుందనే నమ్మకం ఉందని.. బాహుబ‌లి చైనా ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని సంస్థ ప్రతినిధి ఫ్రాంకోయిస్ డిసిల్వా తెలిపారు.

ఇస్లాంలోకి మారతామంటున్న బ్రాహ్మణులు

బ్రాహ్మణులేంటి? ఇస్లాం మతంలోకి మారతాననడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే? ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో 150మంది బ్రాహ్మణులు... తామంతా ఇస్లాంలోకి మారిపోతామంటున్నారు? అయితే ఇస్లాంపై ప్రేమతోనే, ఆ మత సంప్రదాయాలు నచ్చో...అందులో చేరతామనడం లేదు, పోలీసులపై కోపంతోనే ఆ పని చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు తమ బాలికను దళిత యువకుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదుచేసి, పదిరోజులు కావొస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న సింఘావలీ అహిర్ గ్రామ బ్రాహ్మణులు... ఖాకీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించకపోతే, తామంతా ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ పోలీసులకు విచిత్రమైన హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపట్టిన బ్రాహ్మణులు...తమ ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోతే, ఇస్లాంలోకి మారిపోతామంటూ కలెక్టర్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే బాలిక ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఏఎస్సీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

రెండు రాష్ట్రాల సమస్య.. ఉల్లిపాయ తీర్చిందా?

  రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రాంతీయ బేధాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండేవి. కాని రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఏదో గొడవ. ప్రతి చిన్నవిషయానికి గిల్లి కజ్జాలు చేసుకుంటున్నాయి. నీటి విషయంలో.. ఉద్యోగుల పంపిణీ విషయంలో ఇంకా అనేక విషయాల్లో రెండు రాష్ట్రాలు తరుచూ గొడవ పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న సమస్యలను తీర్చడానికి అటు గవర్నర్.. ఇటు కేంద్రం కూడా ప్రయత్నించింది కాని లాభం లేకుండా పోయేది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సమస్యను ఉల్లిపాయ తీర్చింది. ఉల్లిపాయ ఏంటీ సమస్యను తీర్చడమేంటి అనేగా డౌట్. అసలు విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ పై రవాణా పన్ను విధించిన సంగతి తెలిసిందే. దానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి పన్ను విధించవద్దని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పన్ను విధించింది. దాంతో ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వంపై రవాణా పన్ను వేసింది. దీంతో ప్రభుత్వాల సంగతేమో కాని దీనివల్ల రెండు రాష్ట్రాల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రంలో ఉల్లిపాయ ధరలు పెరుగడంతో తెలంగాణ ప్రభుత్వం రావాణా పన్నుతో ఇబ్బందులు పడుతోంది. అదెలా అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉల్లి విక్రయాలు దాదాపు కర్నూలు రైతుల నుండే జరుగుతాయి. ఈనేపథ్యంలో ఏపీకీ రవాణా పన్ను వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వచ్చిన సమస్యల్లా తెలంగాణా ప్రభుత్వానికే..  కిలో ఉల్లి పై రూ.6 వరకు రవాణా భారం పడుతోందట.. కానీ రైతు బజార్లలో రూ.20 కే ప్రభుత్వం కిలో ఉల్లిని ఇస్తుండడంతో ఈ రవాణా భారం కూడా నేరుగా ప్రభుత్వంపైనే పడుతోంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వానికి జ్ఞానోదయమై ఏపీ ప్రభుత్వంతో రవాణా పన్నుపై సంప్రదింపులు జరిపారు. ఏపీ అధికారులతో చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్ర వాహనం రెండో రాష్ట్రంలో ప్రవేశిస్తే రూ.5 వేలు చెల్లించాలి.. ఆఖరికి ఏడాదికి మొత్తం మీద ఎన్నివాహనాలు తిరిగాయో లెక్కించి దాని ప్రకారం ఆ సొమ్మును రెండు రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలి.. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం. అయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రల అధికారులు చర్చించుకున్నా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. అంతా ఒకే అయితే అక్టోబరు 1 నుంచి ఈ ప్రోసెస్ ను రెండు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను ఎవరూ తీర్చలేకపోయినా ఉల్లిపాయ తీర్చింది.

వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరింది

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫైలాన్ ను ఆవిష్కరించారు. దీనికి కృష్ణ-గోదావరి నదుల పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నదుల అనుసంధానం పై మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి చంద్రబాబును ప్రశంసించారు. ఈ సందర్భగా కేంద్రమంత్రి వెంకయ్య మట్లాడుతూ నదుల సంధానం అనేది వాజుపేయి కల చంద్రబాబు ద్వారా అది నెరవేరిందని.. నదుల అనుసంధానికి పట్టిసీమ తొలి అడుగు అని.. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి పట్టిసీమ స్ఫూర్తి అని అన్నారు.

పవన్ తో సినిమా తీస్తానంటున్న యంగ్ హీరో

యువ హీరో నితిన్...పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని, పిచ్చిని గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చాటుకున్న నితిన్...ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ అవకాశమిస్తే, ఆయనతో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. పవన్ తో సినిమా నిర్మించే అవకాశం వస్తే, అది తన కెరీర్ లోనే చాలా స్పెషల్ అవుతుందంటున్న నితిన్...ఇతర పనులేమీ పెట్టుకోకుండా దానిపైనే ఫోకస్ పెడతానంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్ హీరోగా లాంఛింగ్ ఫిల్మ్ ను నిర్మిస్తున్న నితిన్... ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. అంతేకాదు అఖిల్ ఆడియో ఫంక్షన్ కి తన అభిమాన హీరో పవన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. అయితే పవన్ కు నితిన్ వీరాభిమని అన్న మాట నిజమే అయినా, అఖిల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పవర్ స్టార్ కు  సోపేస్తున్నాడని అంటున్నారు. తన సినిమాల రిలీజ్ టైమ్ లోనూ ఏదోరకంగా పవన్ ను పొగుడుతూ, మెగా అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడని, ఇది కూడా అలాంటిదేనని గిట్టనివాళ్లుంటున్నారు.

పవన్ సాహసం.. తమిళనాడులో దీక్ష?

కారణమేదైనా కావచ్చు ప్రతిపక్షనేతలకు వ్యతిరేకంగానే.. తమ డిమాండ్లు తీర్చాలనో ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు.. ఎన్నో రకాల దీక్షలు చేసుంటారు. అయితే అవి మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య చేసుంటారేమో కాని పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మన ప్రజల కోసం చేసి ఉండరు. ఇప్పుడు ఎవరు పక్క రాష్ట్రంలో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారా. సినీ రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. పదవి కోసం నేతలను ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే తాను ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు నేతలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపైనా.. భూసేకరణ విషయంలో ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద కాస్తంత నమ్మకం కలిగిందనే చెప్పాలి. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ కి చేసే సన్నాహంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మూహూర్తం కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకేసి తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో అడుగు వేయనున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా నటుడు చేయని సాహసం చేయనున్నారు. తెలుగు కోసం.. తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. తమిళనాడు రాష్ట్రంలో నిరసన చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్భంధ తమిళం చట్టం కారణంగా తమ మాతృభాషను చదువుకునే అవకాశం కోల్పోతున్నామని అక్కడి తెలుగు సంఘాలు వాపోతున్న కారణంగా దీనిపై నిరసన చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తమిళనాడులోని హోసూరులో దీక్ష చేయాలని పూనుకున్నారట. అయితే ఈ దీక్ష తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. కేవలం తెలుగు ప్రజలకు సంఘీభావం తెలిపే విధంగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. మొత్తానికి ఏ నాయకుడు చేయని..  ఏ హీరో చేయని పెద్ద సాహసాన్నే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అర్దమవుతోంది. మరి ఈ దీక్ష సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఎంతో సంతోషంగా ఉందంటున్న లోకేష్

వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం దక్కడంపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక తమలో కొత్స ఉత్సాహాన్ని నింపిందని, ఇది కేవలం చంద్రబాబు పనితీరుకు లభించిన గౌరవమని అన్నారు. అలుపెరగకుండా చంద్రబాబు కష్టపడటం వల్లే...ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం దక్కిందన్న ఆయన, త్వరలో టాప్ ప్లేస్ చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. సొంత రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో పాలన ప్రారంభమైతే, ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, త్వరలో అదికూడా జరుగుతుందన్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ లు చేయించుకునే బాధ కూడా తప్పతుందంటూ లోకేష్ సెటైర్లు కూడా వేశారు. మొత్తానికి ప్రపంచ బ్యాంక్ నివేదిక బూస్టింగ్ లాగా పనిచేసి ఇటు చంద్రబాబులోనూ, అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపింది

కేసీఆర్ చైనా టూర్.. 9 రోజుల నుండి ఒకటే మాట

  మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ పదిరోజుల చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. పదిరోజుల చైనా పర్యటనలో కేసీఆర్ అనేక ప్రదేశాలు.. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆదరిస్తుంది తదితర అంశాలపై కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తొమ్మిది రోజులు చైనాలోనే పర్యటించిన కేసీఆర్.. అక్కడ ప్రసంగించిన అన్ని రోజులు దాదాపుగా ఒకే అంశం కావడం ఆశ్చర్యకరమైన విషయం. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ఎర్ర తివాచీతో స్వాగతిస్తామని.. చెప్పిన మాటలనే తొమ్మిది రోజుల నుండి చెప్పడం.. ఆమాటలు కూడా విసిగిపోకుండా వినేలా చేయడం ఆక్రెడిట్ ఒక్క కేసీఆర్ కే దక్కింది. మొత్తానికి చెప్పిన విషయాన్ని తొమ్మి రోజుల నుండి మార్చి మార్చి చెపుతున్నా కేసీఆర్ ఆ పర్యటనలో సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి కేసీఆర్ బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.

మరో కొత్త యాత్రకు రెడీ అవుతున్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హోదా ఉద్యమంలోకి యువతను లాగాలనుకుంటున్న జగన్... యూనివర్సిటీల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనెల  26న గుంటూరులో తలపెట్టిన దీక్షకు ముందే, అన్ని యూనివర్సిటీలను చుట్టేయాలని షెడ్యూల్ రెడీ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి...నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీతోపాటు అన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. విద్యార్ధుల మద్దతు ఉంటేనే, తాను చేపట్టే హోదా దీక్ష సక్సెస్ అవుతుందని భావిస్తున్న జగన్, స్వయంగా వెళ్లి మద్దతు కోరాలనుకుంటున్నారు. మరోవైపు  13 జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించడంతోపాటు, పెద్దఎత్తున యువతను దీక్షాస్థలికి తీసుకురావాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారట. మరి జగన్ ఆశిస్తున్నట్లుగా విద్యార్ధి లోకం...కదిలి వస్తుందో లేదో చూడాలి