టీ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి? ‘ఐవీఆర్ఎస్' ప్రకారం
posted on Sep 18, 2015 @ 1:17PM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు టీ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ పై చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విధానం నేపథ్యంలో ‘ఐవీఆర్ఎస్' (ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం)ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని గతంలో చంద్రబాబు తెలిపారు. దీనిలో భాగంగానే వారి ద్వారా సేకరించిన అభిప్రాయాన్ని కూడా నేతల ముందుఉంచినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల మంది కార్యకర్తలుండగా వారిలో మెజారిటీ పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం జరిగిందట. మరి కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు వారి మాట ప్రకారం రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో లేదో చూడాలి.
అయితే ఇదిలా ఉండగా ప్రస్తుత పార్టీ కార్యకలాపాలు చూస్తూ అధ్యక్షపదవి కొనసాగిస్తున్న ఎల్.రమణనే చంద్రాబాబు మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.