కోదండరాం మాట ఎందుకు మారింది?
posted on Sep 18, 2015 9:21AM
ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడటం రాజకీయ పార్టీలకు అలవాటే అయినా, ప్రజల తరపున పోరాడే ప్రజాసంఘాల నేతలు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన వాళ్లే ఇవాళ అధికారంలో ఉన్నా, దాన్ని అమలు చేయకపోగా, ఆనాడు టీఆర్ఎస్ తో కలిసి ఆందోళనలు, ధర్నాలు, డిమాండ్లు చేసిన కోదండరాం లాంటి నేతలు కూడా ఇప్పుడు నోరు మెదడం లేదు. అయితే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం...టీఆర్ఎస్ కి నొప్పి కలుగకుండా మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏకాభిప్రాయం కావాలన్న ఆయన, ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దాంతో కోదండరాం తీరును జేఏసీ నేతలే ఆక్షేంపించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్వహించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట... ఇది పార్టీలకూ అలవాటేనని, అందుకే కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తుందని గుర్తుచేస్తున్నారు.