కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు
posted on Sep 19, 2015 @ 12:45PM
ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతిపక్షనేతలు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షనేతలకి కేసీఆర్ ను ఏకేయడానికి రోజుకో పాయింట్ తో ముందుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్శిటీ విషయంలో కేసీఆర్ పై నిప్పుల చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అక్కడ వాటిని పరిశీలించిన తరువాత కేసీఆర్ పై మండిపడ్డారు. యూనివర్శిటీలోని హాస్టళ్ల మెస్ ల పరిస్థితి బాగాలేదని.. ప్రభుత్వం వాటి గురించి అస్సలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర్లంలో ఉన్నప్పుడు డైమండ్ లా ఉన్న యూనివర్సిటీల్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని.. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అన్న సందేహం వస్తుందని అన్నారు. ‘కేసీఆర్ ఒక్క 5 నిముషాలు ఓయూ హాస్టల్ గదిలో ఉండు పరిస్థితేమిటో తెలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈవిషయంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఉస్మానియా విద్యార్ధులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదే కాదని.. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ వాళ్లనే పట్టించుకోవడం లేదని.. కనీసం నీళ్లు తిండి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవ చేశారు. గత నాలుగేళ్ల నుండి కేసీఆర్ దొంగ అని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు అని అన్నారు.